'Samaikyatha' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 01/08/2024
'సమైక్యత' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
"భాస్కర్ బాబూ!...."
వరండాలోనుండి ఇంట్లోకి వెళుతున్న భాస్కర్ వెనుతిరిగి చూచాడు. ఎదురుగా వరండా ముందు తన గురువుగారు పెద్దయ్య సార్ నిలబడి ప్రీతిగా భాస్కర్ బాబును చూస్తున్నారు.
"మాస్టారు గారూ మీరా! నమస్కారం, రండి" వరండా మెట్లు దిగుతూ అన్నాడు భాస్కర్.
"నీతో కొంచెం మాట్లాడాలి బాబూ!" అభ్యర్థనగా చెప్పాడు పెద్దయ్య మాస్టారు.
వారు రిటైర్ట్ స్కూలు మాస్టారు.... భాస్కర్ బాబు వారి వద్ద ఐదవ తరగతి వరకూ చదువుకొన్నాడు.
"రండి మాష్టారూ! కూర్చొని మాట్లాడుకొందాం!" చిరునవ్వుతో చెప్పాడు భాస్కర్ బాబు.
ఇరువురూ వరండాలో ప్రవేశించారు.
"కూర్చోండి సార్!" వినయంగా పలికాడు భాస్కర్.
వరండాలో వున్న కుర్చీలో పెద్దయ్య మాస్టర్ కూర్చున్నాడు. ప్రక్కన వున్న కుర్చీని చూచి పెద్దయ్య....
"బాబూ!.... మీరూ కూర్చోండి...."
కుర్చీలో కూర్చుంటూ "విషయం ఏమిటో చెప్పండి"
"పంచాయితీ సర్పంచ్ ఎలక్షన్ రాబోతూ వుంది కదా!"
"అవును..."
"ముఫ్ఫై సంవత్సరాలుగా మీ నాన్నగారు కోదండరామయ్య రాజు ఈ మన గ్రామానికి సర్పంచ్‍గా వ్యవహరించారు. నాకంటే వారు రెండు సంవత్సరాలు పెద్ద. మానవతావాది, గ్రామ సమైక్యతకు ఎంతగానో పాటు పడ్డారు. కుగ్రామంగా వున్న మన ఊరికి వారు హైస్కూలును, మెడికల్ సెంటర్‍ను (హాస్పిటల్), సిమెంటు రోడ్లను, రోడ్డుకు రెండు వైపులా నీడను ఇచ్చే చెట్లను ఏర్పరిచారు. మన జిల్లాల్లోనే ఉత్తమ పంచాయితీ అన్న పేరును మన ఈ రామాపురానికి కలిగేలా చేశారు. వారి రోజుల్లో వూరిలోని అన్ని వర్గాల మధ్యన ఎంతో ఐకమత్యం, స్నేహం, సౌభ్రాతృత్వం వుండేది. వారు గతించిన ఈ నాలుగు మాసాల్లో జనం.... వూరి జనంలో మార్పు ఏర్పడింది. అందరూ కులపెద్దలు ఎవరికి వారు తామే పెద్ద, గొప్ప అనే స్థితికి మారారు. సాటివారిని గౌరవించడం సన్నగిల్లింది. ఏదో పాతకాలపు మనిషిని, మీకు తెలుగు అక్షరాలు నేర్పినవాడిని. మీ నాన్నగారికి ప్రాణమిత్రుడిని, నా వూరు ఈ మన వూరు రెండు వర్గాలుగా పార్టీల పేరుతో చీలిపోవడం నాకు ఇష్టం లేదు" ఆవేశంగా చెప్పుకొచ్చిన పెద్దయ్య మాస్టారు విచార వదనంతో తలదించుకొన్నారు.
భాస్కర్ బాబు మాస్టారు గారిని పరిశీలనగా చూచారు. అతను ఇంజనీర్. జిల్లా నగరంలో పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటులో అసిస్టెంట్ ఇంజనీర్‍గా పనిచేస్తున్నాడు. కాలేజీ రోజుల్లో అన్యకుల యువతి భారతిని ప్రేమించాడు. విషయాన్ని తల్లితండ్రులకు చెప్పాడు. తండ్రి కోదండరామయ్య రాజు, తల్లి శాంతమ్మలు భాస్కర్ వివాహం భారతితో జరగడానికి అంగీకరించలేదు.
వారు భాస్కర్‍కు వారి కులం అమ్మాయిలను చూచారు. తమ నిర్ణయాన్ని భాస్కర్‍కు తెలియజేశారు. భాస్కర్ తన నిర్ణయాన్ని మార్చుకొనలేదు. తండ్రి కొడుకు మధ్యన ఘర్షణ జరిగింది. ఆ విషయం వూరంతా పాకింది. ఆ తండ్రి కొడుకులను గురించి ఊరి జనం ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యానాలు చేశారు. ఆ విమర్శలు కోదండరామయ్య రాజు గారి చెవికి సోకాయి. ఒక రాత్రి వారి గుండె ఆగిపోయింది. భారతి వేరొకరిని వివాహం చేసుకోను నిరాకరించింది. ఆమె కాలేజీ లెక్చరర్. మౌనంగా విచారంగా తలదించుకొన్న పెద్దయ్య మాస్టారు గారి ముఖంలోకి భాస్కర్ పరీక్షగా చూచాడు.
"మాస్టారూ! మీరు నన్ను ఏం చేయాలని ఆదేశించాలను కొంటున్నారు. నిర్భయంగా చెప్పండి" వినయంగా అడిగాడు భాస్కర్ బాబు.
భాస్కర్ తల్లి శాంతమ్మ వరండాలోకి వచ్చింది. ఆమెను చూచిన పెద్దయ్య మాస్టారు చేతులు జోడించి.... "అమ్మా నమస్కారాలు"
"అన్నా! బాగున్నారా!" అది శాంతమ్మ గారి ప్రీతి పలకరింపు.
"అమ్మా! ఆ సర్వేశ్వరుల కరుణా కటాక్షంతో అంతా క్షేమమే తల్లీ!" చిరునవ్వుతో చెప్పాడు పెద్దయ్య మాస్టారు.
"అమ్మ కూడా వచ్చిందిగా మాస్టారు తమరి మనోఅభీష్టాన్ని తెలుపండి" నవ్వుతూ అడిగాడు భాస్కర్ బాబు.
"బాబూ! అమ్మా!....! నిన్న నా వద్దకు భారతమ్మ తండ్రి రాఘవయ్య నాయుడు గారు వచ్చారు. వారు చాలా విచారంగా వున్నారు. కారణం వారి అమ్మాయి భారతి. వారు తెచ్చిన సంబంధాలను నిరాకరించిందట. మన భాస్కర్ బాబును తప్ప వేరొకరిని వివాహం చేసుకోనని ఖచ్చితంగా చెప్పిందట. వారు నన్ను అతి దీనంగా మీరు ఒకసారి శాంతమ్మ గారితో విషయాన్ని ముచ్చటించి భారతి, భాస్కరుల వివాహం జరిగేలా చూడమని దీనంగా కన్నీటితో నా చేతులు పట్టుకొన్నారు.
మీకు తెలిసిన విషయమే తల్లి శాంతమ్మ గారు, వారి వర్గీయులు నాయుళ్ళు మన గ్రామంలో అరవై శాతం వున్నారు. మీరు లోగడ భారతి విషయంలో వెల్లడించిన నిరసన వాక్యాలు వారందరికీ తెలిశాయి. అయ్యగారి హయంలో అన్న తమ్ములుగా వ్యవహరించి వారిని ఆరుసార్లు ఏకగ్రీవంగా సర్పంచ్‍గా ఎన్నుకొన్న ఆ వర్గం, ఈనాడు తమరికి వ్యతిరేకులైనారు. కారణం యదార్థంగా భారతమ్మ తండ్రిగారు రాఘవయ్య నాయుడుగారు, మన అయ్యగారు కోదండరామయ్య రాజు గారి లాగే చాలా ఉత్తములు. వారికి మీ సంబంధం ఎంతో ఇష్టం.
కనుక అమ్మా! శాంతమ్మ గారూ, తమరు మంచి మనస్సుతో భారతి, భాస్కర్ బాబుల వివాహాన్ని అంగీకరించాలి తల్లీ. మన గ్రామంలో ఎంతోకాలంగా కలిసి వున్నవారు.... రెండూ వర్గాలుగా, పార్టీలుగా చీలిపోవడం నాకు అసమ్మతం. గ్రామంలో వ్యక్తుల మధ్య విభేదాలు రాకుండా సమైక్యతను అమ్మా శాంతమ్మ గారు, తమరు తలచుకొంటే సృష్టించగలరు! మీరు ఎం.ఎ లిటరేచర్ చదివినవారు. మీకు తెలియనిదంటూ ఏమీ లేదు.
దేశానికి వెన్నెముక గ్రామమే. గ్రామ ప్రజలందరి సఖ్యత ఆ రాష్ట్రానికి, దేశ సఖ్యతకు మూలం, ఆధారం. కనుక తమరు మంచి మనస్సుతో భారతి, భాస్కర్ బాబుల వివాహానికి అంగీకరించండి. అది ఉభయ గ్రామాలకు ముఖ్యంగా మన గ్రామానికి ఎంతో మంచిది. ఎదో పెద్దవాణ్ణి. మీ శ్రేయోభిలాషిని. నా మాటలను మన్నించి తమరు గ్రామ శ్రేయస్సు కోసం.... గ్రామవాసుల మధ్య పరస్పరం ప్రేమ సౌభ్రాతృత్వాలు పూర్వంలా వుండేటందుకుగాను భారతి, భాస్కరుల వివాహానికి అంగీకరించండి. ఇది మొదటిది.
రెండవది బై ఎలక్షన్లో (గ్రామ సర్పంచ్) శాంతమ్మగారూ!.... తమరు పోటీ చేయాలి. మీరు తప్పక ఏకగ్రీవంగా పోటీ లేకుండా గెలుస్తారు. అలా జరగడం, మీ కుటుంబానికి మన ఈ గ్రామానికి ఎంతో మేలవుతుంది" ఎంతో అనునయంగా చెప్పిన పెద్దయ్యగారు తన భాషణను ఆపేసి, శాంతమ్మ గారి ముఖంలోకి దీనంగా ప్రశ్నార్థకంగా చూచారు పెద్దయ్య మాస్టారు గారు.
శాంతమ్మ కుమారుని ముఖంలోనికి చూచింది.
"అమ్మా!.... మీ నిర్ణయం ఏదైనా సరే నాకు సమ్మతమే!.. నేను భారతిని మనసారా ప్రేమించాను. ఆమెకు బాధ కలిగిస్తూ నేను మరొకరిని వివాహం చేసుకోను. జీవితాంతం బ్రహ్మచారిగా వుండిపోతాను" లేచి భాస్కర్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
శాంతమ్మ వెళుతున్న కుమారుని పరీక్షగా చూచింది. కొన్ని నిముషాలు పెద్దయ్య మాస్టారు శాంతమ్మల మధ్య మౌనంగా గడిచిపోయాయి. పెద్దయ్య శాంతమ్మ ఏం చెప్పబోతుందో అని ఆత్రంగా చూస్తుండిపోయాడు.
"పెద్దయ్య అన్నయ్యా!"
"అమ్మా!"
"నేను మీ మాట ప్రకారం సర్పంచ్ పదవికి పోటీ చేస్తాను. తమరు రాఘవయ్య నాయుడి గారికి మేము అమ్మాయికి చూచేదానికి వస్తున్నామని తెలియజేయండి. మన హైందవ జాతి సమైక్యత, మన యావత్ భారతజాతి సఖ్యత నాకు ముఖ్యం" చిరునవ్వుతో చెప్పింది శాంతమ్మ గారు. పెద్దయ్య మాస్టారు ఆనందంగా, నవ్వుతూ ఆమెకు నమస్కరించారు.
*
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments