top of page

సమతుల్యం


'Samathulyam' New Telugu Story


Written By: Ch. C. S. Sarma

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


అత్త ఆడవారే... అమ్మా ఆడవారే... హోదాలలోని వ్యత్యాసం.... చిత్రమైన స్వభావాలకు కారణం అవుతుంది. క్రొత్తగా కాపురానికి వచ్చిన కోడలిని ఆ అత్తగారు కూతురిలా చూస్తుందా!... అత్తగా చెలరేగిపోతుందా!... ఆ అమ్మాయి ఆ సమస్యను ఎలా ఎదుర్కొంది?


త్రాసులోని రెండు గిన్నెలు ఒకే సరళరేఖలో ఎలాంటి ఎగుడు దిగుడూ లేకుండా వుండాలి. అప్పడు తూచిన వస్తువు ఖచ్చితంగా ఎలాంటి మోసం లేకుండా వుంటుంది. అటు విక్రేతకు యిటు కొన్నవారికి తృప్తిగా వుంటుంది. యీ పద్ధతిలో వ్యాపారం చేసే వ్యాపారికి పబ్లిక్ లో మంచి పేరు వుంటుంది. గిన్నె క్రింది చింత పండు దట్టించి తెలివి తనకే సొంతం అని మోసపు వ్యాపారం చేసే వ్యక్తి... ఒక నాడు ఎవరో ఒకరి కంట పడతాడు. వాడు మోసగాడనే కీర్తిని సంపాదించుకొంటాడు. జనం వాడిని నమ్ముకోరు. వెలి వేస్తారు. అలాగే... క్రొత్తగా యింటికి కాపురానికి వచ్చిన కోడలికి ఒక న్యాయం. తన కన్న కూతుళ్ళకు ఒక న్యాయంగా, సంభాషణ సాగిస్తూ, ఆంక్షలను విధిస్తూ కోడళ్ళను తక్కువ చూపు చూచే అత్తగార్లు రెండవ కోవ వ్యాపారిగా... ఓయమ్మో!... ఆ అత్త గయ్యాళి,... అనే సార్థక నామధేయాన్ని పొందుతారు. అక్కడ వ్యాపారికి సంక్రమించింది అపకీర్తి. యిక్కడ యీ అత్తగారికి సంక్రమించింది పక్షపాతి అనే బిరుదు.


యిలాంటి సమస్య ఎదురైయ్యింది తన అత్త గారింట గౌతమికి. గౌతమి తండ్రి వీరభద్రయ్య హైస్కూలు హెడ్ మాస్టర్, తల్లి జానకమ్మ. గౌతమికి ఒక తమ్ముడు వినోద్.. ఇంజనీరింగ్ చదువుతున్నాడు.


వున్నంతలో ఓకే ఆడబిడ్డ కావడం చేత వీరభద్రయ్య దంపతులు గౌతమీ... పాండు రంగారావు వివాహాన్ని ఘనంగానే చేశారు. బిడ్డను సారె సాంప్రదాయాలతో అత్తగారి యింట్లోకి విడిచి పెట్టారు.

గౌతమి అత్తగారు సూర్య కాంతమ్మ... మామగారు రామారావుగారు... మరదలు గిరిజ.


రామారావు కాంట్రాక్టర్. గిరిజ పుట్టిన తర్వాత వీరికి వ్యాపారం బాగా కలిసి వచ్చింది. ఎన్నో కాంట్రాక్ట్సు తీసుకుని, సమయానికి పనులు పూర్తిచేసి మంచి పేరునూ... డబ్బునూ సంపాదించాడు. పెద్ద ఆఫీస్, నలభై మంది యింజనీర్లు, తదితర కార్య నిర్వాహకులు. నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, లారీలు... యితర సామాగ్రి కొనుగోలు చేసి ఏ-క్లాస్ కాంట్రాక్టర్ గా రాణిస్తున్నారు.

మనిషి వ్యక్తిగతంగా చాలా వుత్తముడు, ధర్మాధర్మాలు... నీతి న్యాయాలు అంటే పట్టింపు.. దైవభక్తి... పదిమందికి మంచి చేయాలనే సంకల్పం కలవాడు. ఎంతో సౌమ్యుడు.


యిల్లాలు సూర్యకాంతమ్మగారి చరిత్ర... ఆమె తండ్రి ఆ కాలంలో సారాయి కాచి అమ్మి ... క్రమేణా బ్రాందీ షాపు ఓపన్ చేసి... కొంత కాలానికి... డిస్ట్రిక్ట్ మొత్తం లిక్కర్ సప్లై చేసే లెవెల్ కు ఎదిగిన... ఏకాంబరం గారి ముద్దుల కూతురు. టెన్త్ వరకూ చదివింది.

సూర్యకాంతమ్మగారు ప్రస్తుతంలో గతాన్ని మర్చిపోయింది. జన్మతః జమీందారీ పరంపరలో పుట్టినట్లు భావించి... తన హావభావాలతో పలికేదే ధర్మం. తను చెప్పిందే న్యాయం.

జీవితంలో... యిలాంటి యిల్లాలు సంప్రాప్తించిన వ్యక్తి... ఒక వయస్సు వచ్చిన తరువాత యింటి గుట్టు వీధిన పడకూడదనే భావనతో సహనాన్ని పెంచుకొని... శాంతాన్ని పాటించకపోతే బ్రతుకు బజారు పాలౌతుంది. ఇంటిగుట్టు రచ్చకు ఎక్కుతుంది.

అ దుస్థితి రామారావుగారికి నచ్చని కారణంగా తన యిల్లాలు తనకు చూపించే నరకాన్ని... స్వర్గంగా భావించి... నవ్వుతూ మూగవానిలా అర్ధాంగి ముందు వర్తిస్తూ... తన పనిని తాను చేసికొని పోతూ వుంటారు.


నోరు తెరచి సూర్యకాంతమ్మతో వాదిస్తే... ఆమె నోరు వుప్పెనలా పొంగి ప్రవహిస్తుంది. అలాంటి సన్నివేశంలో రామారావు నటించలేడు. ఆ హోరు భరించలేడు. అందుకే మౌన ముద్రను ఆశ్రయిస్తాడు.

గౌతమి భర్త పాండురంగారావు... మరదలు గింజలకు తల్లిమాట వేదవాక్యం. ఆమె అనుమతి లేకుండా వారు ఏమీ చేయలేరు. పాండురంగ సివిల్ యింజనీరింగ్ పూర్తి చేసి తండ్రిగారి ఆఫీస్ లోనే పని చేస్తున్నారు. గిరిజ టెన్త్ చదువుతూ వుంది. అన్నా చెల్లెళ్ళు అమాయకులు. కాబట్టే తల్లి చేతిలో కీలుబొమ్మలైపోయారు.


రామారావు తనయుడు ఆఫీసుకు వచ్చిన మొదటిరోజున... 'పాండూ!... ఆఫీసుకు సంబంధించిన విషయాలు నీవు మీ అమ్మతో చర్చించకూడదు’ అని ఒకటికి రెండు మార్లు యీ విషయాన్ని పాండురంగారావుకు వివరించాడు రామారావు.


కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే... ఆ ఇంటి వ్యక్తులను.. వ్యక్తిత్వాలను గురించి బాగా అర్థం చేసికొంది గౌతమి. వీరి మధ్యన తాను ప్రశాంతంగా బ్రతకాలంటే... అత్త పాటకు వంత పాడక తప్పదని నిర్ణయించుకొంది. పతిసేవ కన్నా అత్తగారి సేవ చాలా ముఖ్యమని గ్రహించింది.


యిక పతిదేవుడు... శివుని ఆజ్ఞలేందే చీమైనా కుట్టదన్న సామెతలా... అమ్మగారి ఆనతి లేనిదే కాఫీ కూడా తాగడు, మరదలు... నోటిదే కానీ అమాయకురాలు. తల్లిలా తనకు ప్రత్యేక గుర్తింపు కావాలని తలచేది. నవ్వుతూ లాలనగా గిరిజను బుట్టలో వేసేసింది గౌతమి. యీమె తెలివి తేటలను చూచి... చదవులో సాయం కోరడమే కాక.. 'వదిన దగ్గిరనుండి చాలా నేర్చుకోవాలి' అనే నిర్ణయానికి గిరిజ వచ్చేలా నడుచుకొంది.

ఆరోజు అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. వంటమనిషి వడ్డిస్తూ వుంది.


"అమ్మా!.. మా స్కూల్లో వక్తృత్వ పోటీ జరగబోతూ వుంది. నేను నా పేరు యిచ్చాను. శీర్షిక... సమతుల్యం... ఏం మాట్లాడాలో తెలియదు. నువ్వే చెప్పాలమ్మా!!..." బుంగమూతి పెట్టి బ్రతిమాలింది గిరిజ.

"ఏమిటి.. నీవు మీటింగులో మాట్లాడుతావా!..." ఆశ్చర్యంతో కూతురు ముఖంలోకి చూచింది.


"అవునమ్మా!... మాట్లాడాలి." "దేన్ని గురించి?..." "సమతుల్యం" "అంటే!..." "రెండూ సమానం అని అర్థం." రామారావు నవ్వుతూ చెప్పాడు.

"ఏం రెండూ?..." ముఖం చిట్లించి అడిగింది సూర్యకాంతమ్మ.

"ఏ రెండైనా!... వుదాహరణకు... అల్లుడు... కొడుకు, రాజు.. పేద, కూతురు... కోడలు. వారివారి స్థానాల్లో వారివారి గౌరవం వారికి వుంటుంది."

"ఏమిటీ!.. అదెలా అవుతుంది?... ఆర్చర్యంతో భర్త ముఖం లోకి చూచింది.

"నీకు అంతటి ఆలోచనే వుంటే... నీకు నేను కనకభాషేకం చేయించి వుండేవాణ్ణి. మరి మన దగ్గిర అంత పసలేదే!..’’ విరక్తిగా నవ్వుతూ లేచి బేసిన్ వైపుకు వెళ్ళిపోయాడు రామారావు.

భర్తను చూచి మూతిని ముఫై ఆరు వంకలు త్రిప్పింది సూర్యకాంతమ్మ.

తండ్రి వెనకాలే తనయుడు పాండురంగ కూడా వెళ్ళిపోయాడు..

"ఏమ్!... కోడలు పిల్లా!.. నీవు ఎంతవరకూ చదివావ్?...’’ గౌతమి ముఖం లోకి సూటిగా చూస్తూ అడిగింది.

"యమ్.యస్.సీ..."

"అది చాలా పెద్ద చదువు కదూ!..."

అవునన్నట్లు తల ఆడించింది గౌతమి.


"యిలా చూడు!... మన గిరిజ స్కూల్లో మాట్లాడాలి... అది గెలవాలి. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నీవు దానికి నేర్పించు. సరేనా!..." శాశించినట్లు దర్పంతో పలికింది సూర్యకాంతమ్మ.

"అలాగే అత్తయ్యారు!.... ..మన గిరిజ ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా చేస్తాను." చిరునగవుతో పలికింది గౌతమి. "గిరిజా! విన్నావుగా మీ వదిన ఏం చెప్పిందో... చేతులు కడుక్కొని మీ యిద్దరూ మేడ మీది నీ గదికి వెళ్ళిపొండి. వదిన చెప్పింది శ్రద్ధగా విని, ఆమె ఎలా మాట్లాడుతుందో నీవూ అలాగే... మాట్లాడాలి. ఫస్ట్ ప్రైజ్ నీకే రావాలి. సరేనా!...." అనునయంగా పలికింది సూర్యకాంతమ్మ.

"అలాగే అమ్మా!..." ఆనందంగా తల పంకించింది గిరిజ.

"గౌతమి, గిరిజ చేతులు కడుక్కొని గిరిజ గదికి వెళ్ళిపోయారు.


సూర్యకాంతమ్మ చేతులు కడుక్కొని భవంతి ముందున్న వరండాలోకి వచ్చింది. అప్పుడే కార్లో కూర్చో బోతున్న పాండు రంగను చూచి…

"పాండూ!... యిలారా!..."

"ఏం అమ్మా!..." దగ్గిరికి వచ్చాడు.

"రేపు మన గిరిజ స్కూల్లో మీటింగ్ లో మాట్లాడ బోతూవుంది. దాన్ని రికార్డు చేసి నీవు నాకు చూపించాలి.’’

"అలాగే అమ్మా!... నే వెళ్ళొస్తాను..." పాండురంగ కార్లో ఆఫీస్ కు వెళ్ళిపోయాడు. సూర్యకాంతమ్మ యింట్లోకి నడిచింది. ****

ఆ మరుదినం సాయంత్రం భోజనానంతరం అందరూ హాల్లో కూర్చొని వున్నారు. పాండు టేప్ ను డి.వి.డి లో వుంచి టీవీకి కనెక్ట్ చేశాడు. వచ్చి తల్లి పక్కన సోఫాలో కూర్చున్నాడు.


గిరిజకు ముందు ఆమె క్లాస్మేట్ వనజ మాట్లాడి తన ప్రసంగాన్ని ముగించి వెళ్ళి కూర్చుంది. మేడమ్ దివ్యా చంద్రశేఖర్... "యిప్పుడు చివరగా గిరిజ మాట్లాడుతుంది." చెప్పి గిరిజను స్టేజ్ పైకి వచ్చేలా చేసింది. తన స్థానంలో కూర్చుంది. గిరిజ మైక్ ముందుకెళ్ళి నిలబడింది. నవ్వుతూ చేతులు జోడించి..

"గురువులకు, పెద్దలకు నమస్కారాలు. పిన్నలకు శుభాశిస్సులు. మనం... మన ప్రస్తుత జీవితంలో విద్యార్థిని దశలో వున్నాము. పుణ్యము, మన స్కూల్లో బాలికలు మాత్రమే చదువుతున్నారు. బాలురు లేరు. మన గురువులంతా స్త్రీలే. మనమంతా యీ స్కూలు అవరణంలో పది సంవత్సరాలుగా చదువుతున్నాము. ఈ సంవత్సరంతో టెన్త్ పూర్తవుతుంది. ఇంకా మిగిలింది ప్లస్ టు రెండు సంవత్సరాలు.

మన గురువులు మనకు ఎన్నో మంచి అలవాట్లను, పద్ధతులను నేర్పారు. మన అభివృద్ధి కోసం మన తల్లితండ్రుల వలె... వీరూ ఎంతగానో మన కోసం శ్రమిస్తున్నారు. వారి ఋణాన్ని మనం యీ జన్మలో తీర్చుకోలేము. మనం మన గురువులను ఎప్పుడూ ఎంతగానో గౌరవించాలి. అభిమానించాలి.

మనమంతా యింత వరకూ కలిసి మెలిసి వున్నట్లే యిక ముందూ వుంటూ, స్నేహభావంతో, సఖ్యతతో పొడుగు, పొట్టి... నలుపు, తెలుపు... హిందూ, ముస్లిం, క్రిస్టియన్... అనే భేద భావాలు లేకుండా ఐక్యత, సంఘీభావంతో కలసి వుండాలి. అందరం సమతుల్యతా భావాన్ని కలిగి ఉండాలి. ఆచరించాలి.


ఈ వాతావరణాన్ని, పరిసరాలను వదలి కాలేజీలకు వెళతాం... నాలుగేళ్లలో ఆ చదువునూ ముగించి వివాహం చేసికొంటాం. కానీ... యీనాటి యీ మన స్నేహాన్ని... మనం మన గురువులతో కలిసి... గడిపిన యీ రోజులను ఏనాటికి మరువలేము.


స్త్రీలకు వివాహం... మరో దశ. యింటి పేరు మారుతుంది. పుట్టి పెరిగిన యిల్లు, వూరు మారిపోతాయి. భర్త యిటి పేరుతో వారి యింట్లో ఆ యింటి యిల్లాలిగా ప్రవేశిస్తాము. అది మనకు మెట్టిన యిల్లు అవుతుంది.

నిన్నటి వరకూ పుట్టింట... తల్లిదండ్రి, అన్నతమ్ములు, చెల్లెళ్లు, నానమ్మ, తాతయ్య మధ్యన వుండి వారి... అవ్యాజ ప్రేమానురాగాలతో పెరిగి పెద్ద వారమైన మనకు మెట్టిన యింట... కొత్త వ్యక్తులతో ఆ ఇంటి పద్ధతులను గ్రహించి వారిని అనుసరిస్తూ వర్తించి వారితో కలసి పోవాల్సివుంటుంది. పుట్టిన యింట్లో వుండే అమ్మకు .... మెట్టిన యింట్లో వుండే అత్తగారికి మాటల్లో చేతల్లో కొన్ని తేడాలు వుండవచ్చు... అవి మనకు నచ్చకపోవచ్చు. కానీ సర్దుకుపోవడాన్ని అలవాటు చేసికోవాలి.


ఆ అత్తగారిలో మన అమ్మను చూచుకొనేదానికి, ఆమెను అనుసరిస్తూ వారితో కలసి పోవాలి. యీ లక్ష్య సిద్ధికి శాంతి... సహనం ఎంతో అవసరం. వాదానికి తావు యివ్వకూడదు. మితభాషణ ఎంతో ముఖ్యం.

మన భర్తకు మన మీద పరిపూర్ణ విశ్వాసం... నమ్మకం కలిగే రీతిలో... వారి పట్ల వర్తించి వారికి ఆ యిల్లు... యింట్లో ఉండేవారు మనది మన వారిగా భావించాలి. వారిని అభిమానించాలి, ప్రేమించాలి.

యీ విధానాన్ని పాంటించి ఆచరిస్తే ... మనం మెట్టినింట ఆనందంగా జీవన యాత్ర సాగించ గలము.

నాకో అన్నయ్య వున్నాడు. వాడికి పెళ్ళి అయింది. మా వదిన మా యింటికి వచ్చింది. ఆమెను చూస్తే నాకు ఎందుకో చిరాకు... కోపం అసహ్యం కానీ మా వదిన ఎప్పుడూ నవ్వుతూ నాకు సహాయం చేసేది. 'యింకా నేను నీకు ఏదైనా సాయం చేయాలా' అని అడిగేది. మా అన్నయ్య తనకు తెచ్చిన మల్లెపూలల్లో సగానికి పైగా నా తల్లో పెట్టేది. ఆ సగంలో సగం మా అమ్మ తల్లో వుంచేది. మిగిలినవి తను పెట్టుకొనేది. అమెలోని శాంతం.... సహనం... ఆత్మీయతా భావం నన్ను మార్చాయి. మా వదిన చాలా మంచిది.

నేను మీ ముందు నిలచి యింత నిర్భయంగా మాట్లాడేదానిని కారణం మా వదిన. సమతుల్యత అర్ధాన్ని... మాట్లాడవలసి విషయాన్ని తను నాకు నేర్పింది.

జీవితంలో ప్రతిఒక్కరు ఎదుటి వారి పట్ల సమతుల్యత భావాన్ని కలిగి వుండాలి. అప్పుడు.... వారు ఆనందంగా వుండడమే కాక ఎదుటి వారిలో ఆనందాన్ని చూడగలరు. సభ్యసమాజంలో వున్న మనమంతా కేవలం స్వార్థపూరిత మన ఆనందాన్ని మాత్రమే కోరుకోకుండా... మన చుట్టూ వున్న వారితో కలిగి తగురీతిగా ప్రసంగించడం... నడుచుకోవడం మన అందరి కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. నాకు యీ అవకాశాన్ని కల్పించిన గురువులకు నా పాదాభివందనాలు."

గిరిజ చేతులు జోడించింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆ ధియేటర్ మారుమ్రోగింది. గిరిజ స్టేజీ దిగి వచ్చి పిల్లల మధ్య కూర్చుంది. హెడ్ మిసెస్ మైకును సమీపించింది.

"డియర్ స్టూడెంట్స్... సమతుల్యం సబ్జెక్టు గురించి అందరూ చక్కగా మాట్లాడారు. వారి వారి భావాలను తెలియజేశారు.

"యీ పోటీలో న్యాయ నిర్ణేతలు ప్రధమ బహుమతి గ్రహీతగా కుమారి గిరిజను ఎంపిక చేశారు. గివ్ హర్ బిగ్ హ్యాండ్!...’’ కుమారి గిరిజను వేదిక మీదికి రావలసినదిగా కోరుతున్నాను... గిరిజ ఆనందంగా స్టేజ్ పైకి వెళ్ళింది. సిల్వర్ మెడల్‌ను నందినీ ఆమెకు అందించింది. పిల్లలందరూ జేజేలతో చప్పట్లలో గిరిజను అభినందించారు.

టేప్ ఆగిపోయింది. టీవీ ప్రోగ్రామ్ ముగిసిపోయింది. అందరూ... సూర్యకాంతమ్మ ముఖంలోకి చూచారు. ఆమె నయనాలు అశ్రుధారలను వర్షిస్తున్నాయి. భర్త రామారావుగారు ఆత్రంగా ఆమె ప్రక్కకు చేరాడు.


"ఏమిటే!... సంతోషించాల్సిన సమయంలో ఏడుస్తున్నావ్..." ఆశ్చర్యంతో అడిగాడు.

సూర్యకాంతమ్మ భర్త ముఖంలోకి క్షణం సేపు దీనంగా చూచి, లేచి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఒకరికొకరు ఆశ్చర్యంగా చూచుకున్నారు. వారికి విషయం అర్థం కాలేదు.


అందరూ సూర్యకాంతమ్మ గారి గది వైపుకు నడిచారు అమృతో. *** "అమ్మా!!... ఏమైయిందమ్మా నీకు! నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు సంతోషించకుండా ఏడుస్తున్నావ్ ఎందుకు?...’’ గద్గద స్వరంతో తల్లి ప్రక్కన కూర్చుని అడిగింది గిరిజ.

భర్త.... కుమారుడు... సూర్యకాంతమ్మను పరీక్షగా చూస్తూ ఏమి సెలవియ్యబోతూ వుందోనని అతృతతో ఆమె ముఖంలోకి చూస్తున్నారు. వీరి వెనకాల దూరంగా గౌతమి అయోమయ స్థితిలో నిలబడి వుంది.


"నాకు చాలా సంతోషం తల్లీ!... నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు..." పవిటితో కారే కన్నీటిని తుడుచుకొని కుమార్తెను గుండెలకు హత్తుకుంది సూర్యకాంతం గారు.

"అయితే ఎందుకమ్మ ఏడ్చావ్?..." గిరిజ ప్రశ్న.


గిరిజను ప్రక్కకు నెట్టి ... "అమ్మా !...

గౌతమీ!.. యిలారా!.." ఎంతో ప్రశాంత స్వరంతో పిలిచింది.


గౌతమి అత్తగారిని సమీపించింది. ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూచింది.

"రా!... కూర్చో!... గౌతమి చేతిని పట్టుకొని మంచంపై తన ప్రక్కన కూర్చుండ చేసింది.

"అమ్మా!... నన్ను క్షమించు తల్లీ!... నేను నీ పట్ల చేసింది తప్పు. గిరిజకు నీవు నేర్పిన మాటల్లో ఎంతో గొప్ప సందేశం వుంది. అది నాకు అర్థం అయింది. నాతప్పులు నాకు తెలిశాయి. నన్ను క్షమంచమ్మా!..." దీనంగా గౌతమీ ముఖంలోకి చూస్తూ ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుంది.


భర్త రామారావుగారు... కుమారుడు పాండురంగారావు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. సూర్యకాంతమ్మగారి చర్య... మాటలు వారికి ఎంతో ఆనందాన్ని కలిగించాయి.


తాళాలగుత్తిని గౌతమి చేతిలో వుంచి... "అమ్మా గౌతమీ!... యీక మీదట మన కుటుంబానికి సంబంధించి కార్యాలన్నీ నీ యిష్ట ప్రకారమే జరగాలి. ఈ తాళాలను నీ దగ్గిర వుంచు..." ఎంతో వాత్సల్యంతో పలికింది సూర్యకాంతమ్మ.

ఆమెలో కలిగిన యీ మార్పుకు మిగతా నలుగురూ ఆశ్చర్యానందాలతో చిత్తరువుల వలే ఆమెను చూస్తూ వుండి పోయారు.

ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ.... "రేయ్!... పాండూ!... గిరిజ వుపన్యాసాన్ని నేను మరో సారి వినాలిరా.. రా టేప్‌ను మరొకసారి ఆన్ చెయ్యి... "నవ్వుతూ చెప్పాడు రామారావు.

పాండురంగ... గౌతమి... గిరిజ... రామారావు హాలు వైపునకు నడిచారు. మంచం నుండి దిగి సూర్యకాంతమ్మ వారిని అనుసరించింది ఎంతో ఆనందంగా. -సమాప్తం-

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.57 views0 comments

Comments


bottom of page