సమయ పాలన
ప్రేరణాత్మక కథ, ఉద్యోగ జీవితం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, విజయ రహస్యం, బాధ్యత, స్వీయ నియంత్రణ, సమయ విలువ, తెలుగు సాహిత్యం, Motivational Story, Time Management, Discipline, Success, Telugu Literature, Mana Telugu Kathalu

Samaya Palana - Telugu Inspirational Story | Chilakamarri Badarinath
సమయ పాలన - తెలుగు ప్రేరణాత్మక కథ | చిలకమర్రి బదరినాథ్
Published in manatelugukathalu.com on 30/06/2026
విజయం సాధించడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలు కూడా అంతే కీలకం. "సమయ పాలన" అనే ఈ ప్రేరణాత్మక తెలుగు కథ, ఉద్యోగ జీవితంలో చిన్న అలవాట్లు ఎలా గొప్ప విజయాలకు పునాదిగా మారతాయో, నిజమైన క్రమశిక్షణ అనేది ఇతరులు చూడకపోయినా మనం మనకు ఇచ్చుకునే మాటను నిలబెట్టుకోవడమేనని అద్భుతంగా తెలియజేస్తుంది.
రాంబాబు కొత్తగా వచ్చిన ఉద్యోగంలో రిపోర్ట్ చేయటానికి తయారవుతున్నాడు. తన కాబోయే బాస్ చెప్పిన మాటలు పదేపదే చెవిలో వినబడుతున్నాయి.
“నేను నీ నుంచి క్రమశిక్షణను ఆశిస్తున్నాను. నువ్వు ఆఫీస్కి ఖచ్చితంగా 9 గంటలకు వచ్చి తీరాలి. ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవడానికి వీలు లేదు. నీకు ఆఫీస్ పని విషయంలో సంపూర్ణ స్వేచ్ఛనిస్తున్నాను. నీ ‘పని చేయగల సామర్థ్యం’ పై నాకు పూర్తి నమ్మకం ఉంది.
ఒక సంవత్సర కాలం నిన్ను పరీక్షిస్తాను. నువ్వు కనుక ఈ సంవత్సర కాలం ఖచ్చితంగా 9 గంటలకి ఆఫీస్కి వస్తే నిన్ను అభినందిస్తూ జీతం పెంచుతాను. నువ్వు సమయపాలన చేయటంలో విఫలమైతే పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది.
నాకు తోటి మనుషులను నిందించటం, కోపం తెచ్చుకోవటం, గట్టిగా వారి మీద అరవటం అసలు ఇష్టం ఉండదు. ఒకటి మాత్రం గుర్తుంచుకో. నిర్ణయాల విషయంలో నేను చాలా కఠినంగా వ్యవహరిస్తాను.
ముందుగానే హెచ్చరిస్తున్నాను. నా దగ్గర ఇదివరకు పని చేసిన ఇద్దరు సమయపాలన చేయక ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. సమయపాలన చేయని వాళ్ళంటే నాకు గిట్టదు.”
రాంబాబుకి అర్థం అయింది. సంవత్సరంలో ఒక్క రోజు ఆఫీస్కి లేటు అయినా ఉద్యోగం పోవటం ఖాయం. ఎంతో కష్టపడ్డాక అదృష్టవశాత్తూ ఇంత మంచి ఉద్యోగం వచ్చింది. ఇది కనుక పోగొట్టుకుంటే ఇక తాను జీవితంలో పైకి వచ్చే అవకాశం లేదు. ఏది ఏమైనా సరే ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తాను అని రాంబాబు నిశ్చయించుకున్నాడు. ఈ ఆఫీసులో బాస్, తాను తప్ప వేరెవరు లేరు. మంచిగా పని చేయటానికి చక్కని వాతావరణం.
కొత్త ఉద్యోగంలో చేరాలనే ఉత్సాహంతో 8:30 కే ఇంటినుంచి బయలుదేరాడు. స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఇంటినుంచి ఆఫీస్కి 15 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు పడుతుంది.
అయితే బయలుదేరబోయే ముందు పక్కింటి పరమేశంగారు పరుగున వచ్చి "నాయనా! నన్ను కొంచెం హెల్త్ కేర్ హాస్పిటల్ దగ్గర దింపుతావా? డాక్టర్గారితో నాకు 9:30కి అపాయింట్మెంట్ ఉంది. ఇప్పుడు మిస్ అయ్యాను అంటే తిరిగి నెల రోజుల వరకు ఆయన ఉండడు. ఉబర్ బుక్ అవ్వటం లేదు. సమయానికి అందుకోకపోతే మళ్ళీ నెల రోజుల వరకు ఆయన దొరకడు. ఏమీ అనుకోకు బాబు, నాకీ సహాయం చేసి పెట్టు" అని అడిగారు.
పరమేశంగారంటే రాంబాబుకి చాలా గౌరవం. ఆయన ఎన్నో సార్లు తనకి ఆర్థిక సహాయం చేశాడు. డబ్బు ఎప్పుడు తిరిగి ఇస్తావు అని ఎప్పుడూ అడగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రాంబాబుని తన కొడుకులా చూసుకుంటున్నాడు. ఆయన రాంబాబుని ఎప్పుడూ ఏ సహాయం అడగలేదు. అలాంటి పరిస్థితుల్లో రాంబాబు ఆయన మాట కాదనలేక పోయాడు.
హాస్పిటల్లో ఆయనను దింపి ఆఫీస్కి చేరటానికి కనీసం 45 నిమిషాలు పడుతుంది. అంటే ఆఫీస్కి తాను చేరే సమయం సుమారు 9:15 లేకపోతే 9:20 మధ్య అవుతుంది. సరే కానీ ఏం చేస్తాం అని ఆయనను హాస్పిటల్లో దింపి ఆఫీస్కి వెళ్ళాడు.
మొదటి రోజే ఆఫీస్కి 9:20కి చేరాడు. చెమట తుడుచుకుంటూ బాస్ రూమ్లోకి వెళ్ళాడు.
ఆయన మొహంలో ఏ భావాలూ లేవు. మామూలుగా అటెండెన్స్ రిజిస్టర్ ఇచ్చి టైం వేసి సంతకం పెట్టమన్నాడు. ఆయన నన్ను "నీకు బుద్ధి లేదా, మొదటి రోజే ఆఫీస్కి లేటుగా వచ్చావు. నువ్వెందుకు పనికిరావు, నీలాంటి పనికిమాలిన వాళ్ళకి చెప్పటం చెవిటివాడి ముందు శంఖం ఊదటం లాంటిది" అని తిట్టి ఉంటే బాగుండేది అని అనుకున్నాడు రాంబాబు.
చాలా అసంతృప్తిగా పని ప్రారంభించాడు. తాను చేయవలసిన పని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తనకిచ్చిన పనులు వెంటనే తప్పులు చేయకుండా చేసేసి బాస్కి ఇచ్చాడు. ఆయన సంతోషంగా అభినందించాడు. ఆయన మళ్ళీ వేరే పని ఇచ్చాడు. అది కూడా ఉత్సాహంగా చేసేసాడు రాంబాబు.
రెండవ రోజు ఆఫీస్కి బయలుదేరుతుంటే రాంబాబు భార్య "ఒక్క నిమిషం ఉండండి, ఈ రోజు మీ పుట్టిన రోజు. ప్రత్యేకం గా ఒక కొత్త స్వీట్ చేస్తున్నాను. మీ బాస్కి ఇవ్వండి. బయటనుంచి స్వీట్స్ కొని తీసుకెళ్ళే కంటే ఇంటినుంచి స్వీట్స్ ప్రత్యేకంగా చేసి తీసుకుని వెళితే మీ బాస్ సంతోషిస్తాడు" అంది.
ఆవిడ మనసు నొప్పించడం ఇష్టం లేక సరే అన్నాడు. తిరిగి రెండో రోజు కూడా ఆఫీస్ చేరేటప్పటికి 9:20 అయింది. బాస్ రాంబాబు ఇచ్చిన స్వీట్ తీసుకొని మనస్పూర్తిగా శుభాకాంక్షలు చెప్పాడు. రాంబాబు మాత్రం చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు.
ఇలా మొత్తం ఏడాదంతా 9 గంటలకు ఆఫీస్కి చేరుకోవటంలో కొన్ని రోజులు మిస్ అయ్యాడు. స్కూటర్ స్టార్ట్ కావటం లేదని, ట్రాఫిక్ జామ్ అనో, భార్య అనారోగ్యం అనో, ఆఫీస్కి బయలుదేరేముందు అనుకోని అతిథులు రావటం, ఇలా ఎన్నో కారణాలతో ఆఫీస్కి 9:30 లోపు చేరుకోలేకపోయాడు.
బాస్ చెప్పిన పూర్తి సంవత్సరం పూర్తయింది. చివరి రోజు కూడా ఆఫీస్కి 9:20కి చేరాడు. తాను చేస్తున్న ఉద్యోగానికి ఇది చివరి రోజు అని అనుకున్నాడు. మరి ఈ ఉద్యోగం పోతే రేపటి నుంచి ఏమి చేయాలి? వెంటనే మంచి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? బాస్ చెప్పిన మాటలు సీరియస్గా తీసుకోకపోవటం వల్ల శిక్ష అనుభవించక తప్పదు అనుకున్నాడు రాంబాబు.
భయపడుతూ బాస్ రూమ్లోకి వెళ్ళాడు. వణికే చేతులతో రిజిస్టర్లో సంతకం పెట్టి వెనుతిరిగాడు.
"రాంబాబు" అని బాస్ వెనకకి పిలిచాడు.
రాంబాబుకి తెలుసు ఆయన ఏమి చెప్పబోతాడో అని. ఇది నీకు చివరి రోజు అని చెబుతాడు అని అనుకున్నాడు. ఆయన ముందే చెప్పాడు, తన నిర్ణయాలు కఠినంగా ఉంటాయని. మొత్తం తప్పంతా నాదే. ఆయన చెప్పిన మాటలు నేను లక్ష్యపెట్టక పోవటంతో నాకు ఈ శిక్ష తప్పదు అని రాంబాబు మనసులో వాపోయాడు.
"రాంబాబు, నువ్వు ఈ సంవత్సరం అంతా చాలా బాగా కష్టపడి పని చేశావు. నీ వల్ల నా బిజినెస్ చాలా పైకి వచ్చింది. ఈ రోజు నుంచి నీ జీతం 10% పెంచుతున్నాను. నువ్వు ఇలాగే కష్టపడి నా బిజినెస్ని వృద్ధి చేస్తావని ఆశిస్తున్నాను."
ఈ రకమైన ప్రశంసా వాక్యాలు, వేతనంలో వృద్ధి లాంటి విషయాలు బాస్ నోటి నుంచి విన్న రాంబాబు, తాను సమయపాలన చేయలేకపోయిన విషయం మాట్లాడకపోవటం గురించి చాలా ఆశ్చర్యపోయాడు. తన ఉద్యోగం పోకుండా 10% జీతం పెరిగినందుకు ఏమాత్రం సంతోషం కలగలేదు. ఏదో చెప్పలేని అసంతృప్తి మనసును కలచి వేస్తోంది.
బాస్ కోరినట్టు సమయపాలన చేసి ఈ జీతం పెరుగుదల పొంది ఉంటే ఎంతో గర్వంగా, ఆనందంగా ఉండేది. ఇది దయా ధర్మ భిక్షంలా అనుభూతిని ఇస్తోంది. గత సంవత్సరంలో ఏదో రెండు మూడురోజులు తప్పితే మిగతా రోజులు ఆలస్యంగా ఆఫీస్కి రావటం తన అశ్రద్ధతోనే జరిగింది.
ఇలా ఆలోచించి రాంబాబు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఏది ఏమైనా ఇకముందు ఆఫీస్కి ఖచ్చితంగా బాస్ కోరినట్టు 9 గంటలకు వచ్చి తీరుతానని అనుకున్నాడు. మనసులో దృఢంగా ఏదైనా నిర్ణయం చేసుకుంటే దానికి తగ్గ ప్రయత్నంతో అది నెరవేరుతుంది.
రాంబాబు రూమ్ నుంచి వెళ్ళాక బాస్ తనలో తాను ముసిముసిగా నవ్వుకున్నాడు. అసలు రాంబాబు ఆఫీస్కి రావలసిన టైం 9:30కి బదులు 9 అని చెప్పటం మంచిది అయింది అనుకున్నాడు. ఈ రహస్యం రాంబాబుకి బాస్ ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా.
రాంబాబుకి తెలిసిన ఆఫీస్ టైమింగ్ 9 గంటలు.
************************************************************
ఈ కథ మీకు ప్రేరణనిచ్చితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగ సహచరులతో తప్పకుండా పంచుకోండి. వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగ జీవితం, విజయ రహస్యాలు, జీవన విలువలను తెలియజేసే మరిన్ని తెలుగు కథల కోసం manatelugukathalu.com ను అనుసరించండి.
చిలకమర్రి బదరినాథ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: చిలకమర్రి బదరినాథ్
నేను చిలకమర్రి బదరీనాథ్. సీఎస్‌ఐఆర్–ఇండియన్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తార్నాకా, హైదరాబాద్‌లో
స్టోర్స్ అండ్ పర్చేజ్ కంట్రోలర్‌గా పనిచేసి పదవీ విరమణ
పొందాను. ప్రస్తుతం అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సంస్థ
అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్,
గువాహటిలో స్టోర్స్ అండ్ పర్చేజ్ విభాగానికి సలహాదారుగా
ఆన్‌లైన్‌లో సేవలందిస్తున్నాను. 1969 సంవత్సరంలో
నేను “నవీన బాలానంద సంఘం, హైదరాబాద్” అనే
పేరుతో ఒక బాలానంద సంఘాన్ని స్థాపించాను. ప్రతిరోజూ
సాయంత్రం పిల్లలను సమీకరించి, ఆటలు, పాటలు,
నాటికలు, కథల చెప్పడం వంటి వినోదాత్మక
కార్యక్రమాలను నిర్వహించేవాడిని. మా బాలానంద
సంఘం పిల్లలు ఆంధ్ర బాలానంద సంఘం ప్రతి
సంవత్సరం పిల్లల కోసం నిర్వహించే అనేక నాటక
పోటీలలో పాల్గొన్నారు. ఆ కాలంలో నేను పిల్లల కోసం
“బాలల న్యాయస్థానం”, “కాంతి కిరణం”, “ఒక దీపం
వెలిగింది”, “మంచి రోజులు వచ్చాయి” వంటి కొన్ని
నాటకాలను రచించి, దర్శకత్వం వహించాను. ఈ
నాటకాలు ఉత్తమ రచన, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ
ప్రదర్శన వంటి పురస్కారాలను గెలుచుకున్నాయి.
అంతేకాకుండా, మా పిల్లలు పోటీలలో ప్రదర్శించిన
నాటకాల ద్వారా అక్కినేని నాగేశ్వరరావు రోలింగ్ షీల్డ్,
భానుమతి రోలింగ్ షీల్డ్, రాజబాబు రోలింగ్ షీల్డ్ వంటి
ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా సాధించారు. బాలానంద
సంఘంలో పిల్లలకు కథలు చెప్పేవాడినైనా, నేను
ఎప్పుడూ కథలు రాయడానికి ప్రయత్నించలేదు. నిజానికి
కథలు రాయాలనే ప్రేరణ నాకు నా సోదరుడు శ్రీ గోపాల
కృష్ణమాచార్యులుగారి ద్వారా వచ్చింది. ఆయన
ఆకర్షణీయమైన కథలు, నవలలు రాయడమే కాకుండా
అనేక బహుమతులు, ప్రశంసలు కూడా అందుకున్నారు.
నేను రాసిన మొదటి కథ “పెళ్లిచూపుల వెనుక అసలు
చూపు”, ఇది TeluguStories.comలో ప్రచురించబడింది. నా
రెండవ కథ “అమ్మాయికి ఇచ్చిన మాట” (కొసమెరుపు కథ)
ఆ నెలలో ప్రచురించబడిన కథలలో బహుమతిని
గెలుచుకుంది. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని
సికింద్రాబాద్, రామకృష్ణాపురం ప్రాంతంలో స్థిరపడ్డాను.





Comments