top of page
Original.png

సాంబుడు 

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #Sambudu, #సాంబుడు , #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Sambudu - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 31/10/2025

సాంబుడు  - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

కామరాజు తనకు దగ్గరితనం గల ఇద్దరు మిత్రులనూ తోడుతీసుకుని వికారాబాదులో ట్రైనెక్కి భీమడోలులో దిగి తిన్నగా అమ్మతల్లి వారి గుడి చేరుకున్నాడు. భార్యామణి కొన్ని అనివార్య కారణాల వల్ల అతడితో రాలేకపోయింది. అంచేత పక డ్బందీగా ముందస్తు యేర్పాట్లు చేసుకుని గుడి దేవస్తాన నిర్వాహకులతో చరవాణి సహకారంతో సమాలోచనలు జరిపి గుళ్ళో చాముండేశ్వరీ యాగం పూర్తిచేసి ఆ తరవాత నవగ్రహ నక్షత్ర రుద్రహోమం కూడా జరిపించి పుణ్యభస్మాన్ని చిన్నటి తెల్లగుడ్డలో భద్రపరు చుకుని మరునాడు ఆఫీసులో ముఖ్యమైన సమీక్షా సమావేశం ఉండటాన అదే రోజు తన ఇద్దరు మిత్రులు- సాంబశివరావూ కామేశ్వరరావుతో కలసి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు కామరాజు. 


అతడొనరించిన యాగాదులకు అసలు కారణం- అందవలసిన ప్రమోషన్ కొరమీనులా చేతికందకుండా దాగుడు మూతలాడుతూంది చాలారోజులుగా— అలా అవటానికి ఎవరిదో దిష్టి తగిలుంటుందని, నరుడి చూపుకి నల్లరాయి సహితం బ్రద్దలవుతుందని కామరాజు భార్య అతణ్ణి భీమడోలుకి పంపించింది. అదేం విచిత్రమో మరి- ముగ్గురూ తిరుగు ప్రయాణంలో భీమడోలు స్టేషన్ లో అడుగు పెట్టారో లేదో వర్షం విత్ వెంజెన్స్ అన్నట్టు కుండపోతగా కురవ నారంభించింది. 


ఆకాశం యేనుగుల సమూహం వంటి మబ్బుల్ని చెల్లా చెదురు చేస్తూ భూమండలాన్ని ఉరుములు మెరుపులతో అదరగొడ్తూంది. అదే సమయమనుకుని కామేశ్వరరావు ఊదరగొట్టనారంబించాడు- “దీపాల వేళ యెలాగూ దాటిపోతుంది. వేళకాని వేళ ప్రయాణం యెందుకని పూజార్లు చెప్తే విన్నావూ!” 


కామరాజు అదేమీ పట్టించుకో కుండా “పీతకష్టాలు పీతవి!” అనుకుంటూ ఒక బెంచీ మూలన దొరికిన స్థలాన్ని ఆక్రమించుకుంటూ తడిసిన జుత్తుని జేబు రుమాలుతో తుడుచుకుంటూ దూరాన ఉన్న మరో బెంచీవేపు వెళ్లమని ఇద్దరికీ సూచించాడు. అప్పుడు సాంశివుడు అన్నాడు- “మంగళకరమైన ఈ రోజున ఇలా వర్షం కురవడం కూడా మంచికేనేమో!”


అలా అంటూ అతడు దూరాన ఉన్న బెంచీవేపు కదలి వెళ్లిపోయాడు. అదీ పోజిటివ్ ఔట్ లుక్ అంటే.. అంతలో దెబ్బపైన దెబ్బ తగుతున్నట్టు రైల్వేస్ ప్రకటన వినిపించింది- అదెక్కడో డిరైలింగ్ యేర్పడిందట- మరొక రెండు గంటల పాటు ట్రైను రావడం ఆలస్యమవుతుందట. దానికి యెవరేమి చేయగలరని.. 


కాసేపటికి ఎవరికి వారు సర్దుకుని కూర్చున్న తరవాత కామరాజు మనసులో అనుకున్నాడు- “అయ్యో పాపం సాంబశివుడు! కబుర్ల ప్రోగయిన వీడు ఇన్ని గంటల పాటు ఇటువంటి తడివాతావరణంలో నోరు మెదపకుండా ఇన్ని గంటలు యెలా గడపగలడో!”


గాలిలా నిత్య చాంచల్యంతో హడావిడితనంతో కూడుకున్న జీవనయానం వాడిది. కామేశ్వ రరావు మనస్తత్వం అటువంటిది కాదు. తన మానాన తనుంటాడు. మాట్లాడితే మాటలు కలుపుతాడు, లేకపోతే ఊరుకుంటాడు. అవసరమైతే ఒంటరితనాన్ని వాటేసుకుంటాడు. 


అతడలా అనుకుని పట్టుమని పావు గంటకూడా కాలేదు. స్టేషన్ హాలు ప్రక్క వాటానుండి కేరింతలు మంచుగడ్డల్లా ఫెళా ఫెళా పైన పడ్డట్టు వినిపించాయి. ”ఇంతటి మందకొడి వాతావరణంలో ఇంత హుషారుగా కేరింతలు కొడ్తున్నది యెవరు చెప్మా!” అనుకుంటూ కామరాజు లేచి నిల్చుని అటు చూపులు సారించాడు. 


ఇంకెవరు? కబుర్ల సుల్తాన్ సాంబశివుడే! ఇంతకీ యేమి చేస్తున్నాడని.. హితోపదేశం చేసే గురుస్వాములవారిలా కార్గోపెట్టెల పైన ఎత్తుగా కూర్చుని కథల పైన కథలల్లుతూ చెప్తున్నా డు. సహ ప్రయాణీకులు సంగీత కచేరీకి వచ్చిన రసికుల్లా మారి “హాహా! ఓహో!” అంటూ ఉత్తేజ పరుస్తున్నారు- బేషుల పైన బేషులు పలుకున్నారు.. అంతటి తడి వాతావరణంలో జీవం లేని పరిసరాలలో వీళ్లందరికీ ఇంతటి ఉత్తేజం ఎలా తాకుతుందో!

కామరాజుకి చప్పున పోయినేడేది జరిగిన ఉదంతం గుర్తుకొచ్చింది.


సాంబుడికి పొరుగూరులో ఉన్న ఇన్స్ పెక్టరేట్ లో సీనియర్ గ్రేడ్ స్టాఫ్ గా ప్రమోషన్ ఇచ్చారు. కాని దానిని స్వీకరించకుండా అతగాడు తిరస్కరించాడు. అంతటి దూరప్రాంతాన పొలోమని కేవలం ఒకే ఒక అటెండర్ తోడుతో మరొక జూనియర్ క్లర్కుతో అక్కడ జీవితం గడపడం కష్టమని బాహాటంగా చెప్తూ యెదురొచ్చిన సిరికి మోకాలొడ్డాడు. 

అదే కార్యాలయంలో సూపరింటెండెంటుగా ఉంటూన్న కామరాజు ఆ వార్త విని సాంబశివుణ్ణి వెతుక్కుంటూ వెళ్లాడు- “అదేంవిట్రా సాంబూ! ఏమిటీ క్రేజీ వ్యవహారం? రాక రాక వచ్చిన ప్రమోషన్ ని కాలదన్నుకుంటావా! వెళ్లినవాడివి వెళ్లినట్టుగా మూడు సంవత్సరాల లోపున మళ్లీ యిటు వచ్చేయవూ ఇక్కడకి?”


దానికి కించిత్ కూడా చెదరకుండా బదులిచ్చాడు సాంబశివుడు- “జీవితం అంటే ప్రమోషన్ కాదు. సంపాదన అంతకంటె కాదు. జీవితమంటే ఆనందం. హాయి. దూది పింజె మల్లే తేలుతూ నలుగురితో గిరీశంలా మెసలుతూ చెట్టాపట్టాలేసుకుని కలివిడిగా తిరగడం. ఈసురోమని ఓ మూలనున్న ఒక చిన్న ఆఫీసులో ఓ కుర్ర క్లర్కుతో ఒక కుర్ర అటెండర్ తో జీవితాన్ని హరించుకోమంటావా! అది నా వల్లకాదు” అంటూ వచ్చిన ప్రమోషన్ ఆర్డర్ ని ప్రక్కన పెట్టేసాడు. 


హోరున గుర్తుకి వస్తూన్న అప్పటి ఆలోచనల్ని కట్టిపెట్టి స్పీడుగా వెళ్లి- “ఊరుగాని ఊళ్ళో ఈ హాస్య ప్రసంగాల ఝరి యేమిట్రా సాంబుడూ! ఊరు కాలిపోతుందిరోయ్ మొర్రో అని మొరపెట్టుకుంటే నీవంటి వాడెవడో ఒకడు వచ్చి చుట్టకు నిప్పు కావాలని అడిగాడట, మర్యాదగా ఇలా వచ్చి కూర్చో” అని గద్దించాలనిపించింది కామరాజుకి. కాని మాటలు పైకిరాక ఆపుకున్నాడు. 


అతగాడి జీవనసారమే హాస్య ప్రధానం. నిత్యమూ నవరస భరిత ప్రయోగం. వెళ్లి చెప్పినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే అవుతుంది. ఇప్పుడే కాదు- ఎప్పుడూ కొంతమంది ఇలానే తారసిల్లుతుంటారు. ఇవన్నీ పుర్రెతో పుట్టిన బుధ్ధులు. అంత త్వరగా పోవు. అలా అనుకుంటూ తల విదిలిస్తూ వెనక్కి తిరగబోయి నివ్వెరపాటుతో చూస్తూ నిల్చుండి పోయాడు కామరాజు. 


ఆ రసిక సభా సదుల మధ్య తను కలలో కూడా ఊహించలేని వ్యక్తి కనిపించాడు. ఇంతకూ అతడెవరని? ప్రమోషన్ లిస్టులో తన పేరు ఉండాలో ఉండకూడదో తేల్చుకునే అధికారం గల తన పై అధికారి మధురై బ్రహ్మనాయకం! స్టాఫ్ కీ సూపర్ వైజర్లకీ ఆయనంటే అలర్జీ.. రీజనల్ హెడ్ క్వార్టర్స్ లో ఉండవలసిన వ్యక్తికి ఇక్కడేమి పని? 

సాంబశివుడి ప్రతి మాటకూ రసాత్మకంగా తలాడిస్తూ చిత్తడి నేలపైన రుమాలు పర్చుకుని కూర్చున్నాడు. ఆయన్ని ఆ స్థితిలో చూసిన కామరాజు తట్టుకోలేక పోయాడు. రివ్వున వెళ్లి- “ఎక్స్యూజ్ మీ సార్!” అని పలకరించాడు. 


కామరాజుని చూసి- “ఓ మీరా మిస్టర్ కామరాజ్! హౌడుయూడూ?” అని స్పందిస్తూనే సాంబశివుడి ప్రసంగాన్ని వినడంలో మునిగిపోయాడు బ్రహ్మనాయకం. 


అకటా! నవరసాలలో రెండవ స్థానం ఆక్రమించిన హాస్యానికి యెంతటి ప్రాధాన్యత ఉంది కదూ! కామరాజు ఊరుకోలేదు. మళ్లీ కదిపాడు. “మేటర్ అది కాదు సార్! మీరిలా చిత్తడి నేలపైన కూర్చోవడం యేమి బాగుంటుందో చెప్పండి.. నాతో రండి. బెంచీపైన కూర్చుందాం” 


బ్రహ్మనాయకం లేవలేదు. “ఇటీజ్ ఓకే! డాంట్ వర్రీ అబౌట్ మీ! అతడిది మన ఆఫీసే కదూ! ఒకటి రెండు సార్లు చూసినట్టున్నాను. చాలా సరదాగా మాట్లాడుతున్నాడు. ఎందుకు దాచడం గాని.. ఈ మధ్య ఆఫీసు గొడవల్లో పడి కుటుంబ వ్యవహారాలలో పొర్లి నవ్వడం పూర్తిగా మర్చేపోయాననుకున్నాను. ఈ రోజు మళ్లీ నవ్వుతున్నాను. అన్నట్టు మీరు మీ ప్రమోషన్ గురించి దిగులు పడ్తున్నట్టున్నారు. మరొక వారం రోజుల్లోపల మీ చేతికి ప్రమోషన్ ఆర్డర్ అందుతుంది. ఇక మీరు నిశ్చింతగా వెళ్ళి కూర్చోండి” అంటూ సాంబుడి వేపు తల తిప్పుకున్నాడు. 


స్ట్రెయిట్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ది హార్స్ అన్నట్టు తన ప్రమోషన్ విషయం బ్రహ్మనాయకం నోటినుండి విన్న తరవాత కామరాజు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. మరి కాసేపటికి దూరాన రైలు కూత వినిపించి సాంబశివుడికీ కామేశానికీ చేతులూపాడు వెంటనే కార్గో పెట్టెల పైనుండి క్రిందకు దిగి రమ్మని— నవ్వుల కచేరీ చాలించమని.. 

***

నాలుగు రోజులుగా సాగుతూన్న విజిలెన్స్ ఇన్ స్పెక్షన్ వాళ్లు లేవనెత్తుతూన్న క్వరీల తాకిడి వల్ల కామరాజు ఆ రోజు ఇంటికి చాలా ఆలస్యంగా చేరాడు. అప్పుడప్పుడు శారీరక శ్రమ కంటే మానసిక పరమైన అలసట యెక్కువ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. తంబూరా తీగెల్ని చెవుల వరకూ లాగి వదలినట్టు సొలసిపోయిన నవనాడులూ గింగురుమంటూ హోరెత్తిస్తాయి.


భోజనం కాగానే అతడికి అలా ఆరుబైటకు వెళ్ళి కాసేపు నడచి రావడం అలవాటు. కాని ఆ పని చేయలేకపోయాడు. తన కోసం బల్లపై నుంచిన పాల కప్పుని కూడా ముట్టుకోకుండా పడకపైన వాలిపోయాడతను. అప్పుడు మంజుల వచ్చి చెప్పింది కామరాజు మిత్రుడెవరో ఫోనులో పిలుస్తున్నాడని. అరమోడ్ప్ కళ్లతో చూస్తూ అడిగాడతను ఫోను చేస్తున్నదెవరని.


“ఇంకెవరు? వెతుక్కుంటూ వస్తూన్న ప్రమోషన్లను ఎడా పెడా తోసిపుచ్చేస్తుంటాడే అత్తారి సారెను వద్దన్నట్టు—మీరు ప్రియంగా పిలిచే సాంబుడు. ఏం చెప్పమంటారు?“ అడిగిందామె. అతడు బలవంతంగా కళ్లు విప్పేందుకు ప్రయత్నిస్తూ- “సారీ అన్నాడని చెప్పు. రేపు నేనే స్వయంగా వచ్చి మాట్లాడతానని చెప్పు”అంటూ అటు ఒత్తిగిల్లాడు కామరాజు. 


అలా మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు యెవరో తట్టి లేపుతున్నట్లనిపించి భళ్లున కళ్ళు తెరిచాడు కామరాజు. ఎదుట భార్యామణి- “మా వదినకు పురుటి నొప్పులు ఆరంభమైనట్లున్నాయి. చేతిలో రెడీ క్యాష్ లేదట. ఏ టీ ఎమ్ స్టాల్ ఎక్కడో దూరాన ఉందట. మనల్ని క్యాష్ అడిగి తీసుకెళ్లడానికి వచ్చినట్టున్నాడు మా అన్నయ్య”


ఆ మాట విన్నంతనే కామరాజు ఉన్నపాటున ఉలిక్కి పడుతూ లేచి హాలులోకి వచ్చాడు. “నువ్వా బావా!ఇప్పుడు నా వద్ద కూడా రెడీ క్యాష్ లేదు. అప్లయ్ చేసిన క్రిడెట్ కార్డు ఇంకా రాలేదు కాసేపు ఆగావంటే అరగంటలో తెచ్చిస్తాను”అంటూ అతడు దుస్తులు మార్చుకుని ఇంటి ముంగిట ఉన్న బైకుని సర్రున స్టార్టు చేసి సాంబశివరావు ఇంటి వేపు పోనిచ్చాడు. ఊళ్ళో సాంబుడికి భూమీ పుట్రా ఉండటాన కౌలు డబ్బులు అడ్డులేకుండా వస్తుంటాయని అతడికి తెలుసు. తిన్నగా సాంబశివుడి ఇల్లు చేరుకుని బైకుని ముంగిట ఉంచి వసారాలోకి దూసుకు వెళ్ళాడు.


కాని— వెళ్ళినవాడు వెళ్ళినట్టుగా ఆగిపోయాడు. తలుపు తట్టకుండా బిర్ర బిగుసుకుని నిల్చుండిపో యాడు. లోపలనుంచి అతడికి యేవేవో శబ్దాలు వినిపించాయి. గాజుల గలగలలు గొలుసుల రాపిడ్లూ చెవులకు సోకాయి. ఉన్నపళంగా తల విదిలిస్తూ డోర్ బెల్ గట్టిగా నొక్కాడు. సాంబశివుడు తల వెనుక వెలిగే చక్రమేదో ఉన్నట్టు నవ్వు ముఖంతో తలుపు తీసాడు. వాడెప్పుడూ నవ్వు ముఖంతో అలాగే ఉంటాడు. ప్రమోషన్లు కాల దన్నుకున్నవాడు అలా నవ్వు ముఖంతో యెలా ఉండగలడో కామరాజుకి అంతు పట్టడం లేదు. వచ్చిన విషయం తెలుసుకున్న వెంటనే సాంబశివుడు ఇసుమంత జాప్యానికి కూడా అవకాశం ఇవ్వకుండా లోపలనుంచి క్యాష్ తెచ్చిచ్చాడు. సొమ్ము అందుకున్నాడు గాని కామరాజు థేంక్స్ చెప్పలేదు.


సాంబశివుడి ముఖంలోకి సూటిగా షార్పుగా చూస్తూ అన్నాడు- “నేనిప్పుడు అర్జంటు పని పైన వచ్చాను. లేకపోతే ఈపాటికి నీ వ్యవహారం అగ్గి గుగ్గిలమై పోయున్ను—పెళ్ళాం యింట్లో లేకపోతే నువ్వు వెలగబెట్టే మన్మథ లీలలు ఇవా!”


అదే వికారమైన నవ్వు ముఖంతో సంగతేమిటన్నట్టు- తల ఊపుతూ చూసాడు సాంబుడు. ఈసారి కామరాజు కటువుగా ముఖ భావం చూపిస్తూ అన్నాడు- “ఇన్నాళ్ళు నీపైన నేను- నేనేమిటి- అందరూ పెట్టుకున్న సదభిప్రాయాన్ని తృటితో బుగ్గిపాలు చేసుకున్నావు. పెళ్ళాం పిల్లల్ని తీసుకుని ఊరుకెళితే నువ్వు చేసే ఘనకార్యం ఇదేనా!పగలేమో నుదుట అమాంబాపతు పట్టనామాలు—ఊరంతా శ్రీరంగ నీతులు- రాత్రి వాలేటప్పటికి దూరేవేమో చీకటి గుడిసెలూను. అంతేకదూ!”


 ”ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు! చెప్పదలచుకున్నదేమిటి?“


ఆ మాటతో కామరాజుకి చిర్రెత్తుకొచ్చింది. ”మొదట ఆ నవ్వు ముఖాన్ని మామూలు ముఖంగా మార్చుకో! నన్ను మోకింగ్ చేస్తున్నట్లుంది“


సాంబుడు మళ్లీ నవ్వాడు. 

“ఇంతకీ జరిగిందేమి టంట?” 


కామరాజుకి మొదటి సారి మిత్రుడిపైన అసహ్యం పుట్టుకొచ్చింది. “నాకేమీ తెలియదనుకుని విర్రవీగుతున్నావు. ఒకెతె కాదు— ఇద్దరు ముగ్గురు ఆడాళ్ళ గొంతులు కేరింతలు కొడ్తూ మాట్లాడుతుండటం విన్నాను. నా అలికిడి విని ఆ రాత్ కా రాణీలు లోపలకు పారిపోయి దాకున్నట్టున్నారు. చివరకు ఇంద్రలోకంపైకి దాడి చేసినప్పుడల్లా ముగ్గురు నలుగురు అప్సరసల్ని పడక గదిలోకి పంపాలని కింకపెట్టే రాక్షస రసికుడు వజ్రనాభుడిలా తయారయావన్నమాట!” 


“అదా సంగతి! నీ కోపానికి కారణం.. నాకిప్పుడు అర్థమైంది. నువ్వనుకుంటున్నట్టు వాళ్ళు మనవాళ్ళు కారు”


”వెలయాళ్ళను మన వాళ్ళనకు. నీకున్న చౌకబారు ఆడాళ్ళను నాతో జమకడ్తావా!” 


“అయ్యో రామ! చెప్తే వినిపించుకోవేం! మనలా వాళ్ళు మనుషులే కారు. ఆ ఆడాళ్ళు ముగ్గురూ ప్రేతాత్మలు. నేనొక రోజు శ్మశానవాటిక ప్రక్కనుంచి వస్తుంటే నాకు పరిచయం అయారు. మనలా చాలా జాలీ టైపులే—“ 


“నన్ను చూస్తుంటే యెగతాళిగా ఉందా! లేక ప్రేతాత్మల ఊసెత్తి నన్ను హడలు కొట్టాలని చూస్తున్నావా?” 


“సరే— నేనెంత చెప్పినా వినే మూడ్ లో లేనట్టున్నావు. నలుగురుతో కబుర్లాడటమంటే నాకు ప్రితికరమని నీకు తెలుసు కదా! ఆ విషయంలో నేను తారతమ్యాలు చూడనని కూడా నీకు తెలుసుగా! ఇంట్లో మా ఆవిడ గాని ఉంటే నేనెందుకు వాళ్ళతో కబుర్లు పెట్టుకుంటాను? 


ఇక విషయానికి వస్తాను. వాళ్లతోనే వాళ్ళ ఉనకి గురించి చెప్పిస్తాను. ఐతే ఒకటి— ప్రేతాత్మలన్నీ చెడ్డవి కావు. మన మధ్య యెలాగైతే మంచి వాళ్లూ చెడ్డవాళ్లూ ఉంటారో వాళ్లముధ్య కూడా అలాగే! ఇంకా చెప్పాలంటే— వాళ్లకు స్వర్గ ద్వారాలు తెరుచుకోవడానికి సమయం పట్తుంది కావున, చిత్రగుప్తుడికేమో చూపు మందగించి పాప పుణ్యాల లెక్కలు చూడ టంలో స్లో అయిపోతున్నాడు, ఈ కారణాన ప్రేతాత్మలు మన చుట్టూ తిరుగాడుతుంటాయి వాటి వాటి లెక్కలు తేలేంత వరకూ.. ఎవరికీ హాని చేయవు. 


మొత్తం ముగ్గురున్నారు. ముగ్గురికి ముగ్గురూ నృత్య శిఖామణులే! ఇప్పుడు చూస్తుండు- “ అంటూ చూపులు మళ్లించి పలికాడు- “మేడమ్ రమ్యప్రభా! ఏదీ మీ మయూరి నాట్యాన్ని గజ్జెలు కట్టి గాంధర్వగానంతో వినిపించనీ!” 


ఆశ్చర్యం! గజ్జెలు ఘళ్ళు ఘళ్లున కామరాజు చుట్టూ వినిపించసాగాయి. కామరాజు అదరిపోయి వెనక్కి జరిగాడు. 


సాంబశివుడు మళ్లీ అందుకున్నాడు. “ఇక రెండవది కూచిపూడి. భామా కలాపం బహుముచ్చటంగా నాట్యమాడి వినిపిస్తుంది. వసుంధరా! ఇలా రామ్మా!” 


ఆ పిలుపుతో కామరాజు చుట్టూ జంటపదాల వంటి పాదాల సవ్వడితో అదే రీతిన ఘళ్ళు ఘళ్ళున వినిపించ సాగింది. ఈసారి కామరాజుకి నిలువెళ్లా ముచ్చెమటలు పోసాయి. విసుగు నిప్పురవ్వయి నషాలానికి అంటుకుంది. 


“ఏంవిటి ఇదంతా సాంబూ! నీ పోచికోలు కబుర్లు వినడానికి యెవ్వరూ దొరకలేదని దెయ్యాలతో భూతాలతో స్నేహాలు చేస్తావా! ఇంతటి తో ఇదంతా ఆపు.. మీ ఆవిడముందూ పిల్లలముందూ ఇవన్నీ చూపించకు. ఢమాలుమని గుండాగి క్రింద పడతారు. ఇక వస్తాను” 


కాని సాంబశివుడు కామరాజుని వెళ్ళనివ్వలేదు. “ఆగాగు! మరి మూడో నృత్యకారిణేమో కథకళి డ్యాన్సర్. పేరు శోభనాదేవి. ఈమెకు నృత్యకళ గురించే కాదు, మంత్రశక్తుల గురించి కూదా తెలుసు. చూడటానికి వృధ్ధ కళాకారిణే గాని— యువ కళాకారిణులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది ” అంటూ మరొక పిలుపు ఇచ్చాడు సాంబుడు. 


ఉన్నపళాన కళ్ళు మూసుకున్నాడు కామరాజు. ఈసారి సర్వమూ భయానకం!ఆ వృధ్ధ స్త్రీ నాట్యం యెటువంటి నాట్యమో యెటువంటి విన్యాసమో తెలియదు గాని— తెల్లటి మంచుపొగ ఉన్నపాటున కమ్మేసింది. నలువేపులా ధూళి రేగిపోయింది. ఫ్యానులన్నీ అవధికి మించిన వేగంతో గిర్రున తిరుగుతూ విరిగి ఒరిగి క్రింద పడసాగాయి. గోడనున్న పటాలన్నీ పట పటా ఊడి గాలిలో ఊగిస లాడసాగాయి. మరి కాసేపటికి ఆకాశం నుండి రాలుతున్నట్టు నిప్పు కణికలు నడినెత్తిన పడ సాగాయి. 


“ఒరేయ్ సాంబూ! ఈ భూతాల నుండి నన్ను కాపాడరా!” అంటూ పెద్ద పెట్టున అరుస్తూ క్రింద పడ్డాడు కామరాజు. తుళ్ళి పడుతూ కళ్లు తెరిచాడు.


ఆశ్చర్యం! ఎట్టేదుట సాంబుడు లేడు. వాడి శ్మశాన నేస్తాలు ముగ్గురు నృత్య కళాకారిణులూ లేరు. అసలు శబ్దమే లేదు. ఏమయారు? ఎక్కడికె ళ్లారు? 

అంటే— ఇదంతా కలన్నమాట! ఏమో ఎవరు చెప్పొచ్చారు! రేపు ఉద్యోగ విరమణ చేసి ఒంటరి తనం ఆవహించి పంచన కబుర్లాడటానికి యెవరూ దొరక్కపోతే సాంబుడు నిజంగానేల శ్మశానాల బాటపట్టి ప్రేతాత్మలతో జతకట్టి స్నేహాలు చేసినా చేస్తాడేమో! కబుర్ల సుల్తాన్ కదూ!

 

శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

ree





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page