సంసారంలో చిటపటల తాళం
- Ayyala Somayajula Subramanyam

- 10 hours ago
- 7 min read
ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

Samsaramlo Chitapatala Thalam - Telugu Comedy Story | Ayyala Somayajula Subrahmanyam
సంసారంలో చిటపటల తాళం - తెలుగు హాస్య కథ | అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 19/04/2026
సంసారం అంటే గొడవలేనా?లేదా ప్రేమేనా?
“సంసారంలో చిటపటల తాళం” కథలో భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న మాటల యుద్ధాలు, వాటి వెనుక దాగి ఉన్న ప్రేమ—మన జీవితాన్ని ప్రతిబింబిస్తాయి.
‘కదలకుండా కూర్చోలేవూ? బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడెలా వేస్తాను?’ గట్టిగా కసిరింది మాధవి తన ఏడేళ్ల కూతురు భవ్యను.
‘నీకింత విసుగేమిటోయ్? పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా...’ అక్కడే పేపర్ చదువుతున్న సూర్యం అన్నాడు.
‘ఓ యబ్బో! చెప్పేలా చెప్తే వినే పిల్లలా వీళ్లు? పోనీ మీకంత ఓపిక ఉంటే మీరు చెప్పొచ్చు కదా! అక్కడికి మీరేమో వాళ్ల కంటికి పరమశాంతి స్వరూపులు... నేనేమో దయ్యం అన్నట్లా మీ ఉద్దేశ్యం? హోంవర్క్ చేయించడం, చదివించడమూ అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్ ఎక్కువగా ఉంటోంది. మధ్య మధ్యలో పరీక్షలొకటి. అవి వాళ్లకో నాకో అర్థం అయి చావడం లేదు. ప్రాజెక్టులు, డ్రాయింగ్లు అంటూ నన్నూ వేయించేస్తున్నారు. వాటికోసం బజార్లమ్మట తిరిగి తిరిగి నా తలప్రాణం తోకకి వస్తోంది’ కోపంగా విసురులాడుతూ అంది మాధవి.
‘అందుకేనోయ్, నిన్ను ఉద్యోగం చేయొద్దని చెప్పాను. రెండు చోట్లా కష్టపడలేవని.’
‘ఆ, ఈ చాకిరీ పది ఉద్యోగాలకు సమానం. ఓ మెప్పూ, ఓ మెచ్చుకోలూ ఏమన్నా ఉన్నాయా? బతుకంతా గానుగెద్దులా తిరిగి తిరిగి వెగటు పుడుతోంది.’ మళ్లీ మూతి మూడు వంకర్లు తిప్పింది.
‘కదలొద్దన్నానా? చెబితే వినవు. మొండితనంలో మేనత్తను మించిపోయావు.’ పిల్లబుగ్గ మాధవి చేతిలో రెండంగుళాలు సాగింది. దాంతో పిల్ల గొల్లుమనడం... సూర్యం అరవడం… ఒక్కసారే జరిగాయి.
‘మధ్యలో మా అక్కను అంటావెందుకు? తిట్టుకుంటే నీ పిల్లను తిట్టుకో.’ మళ్లీ కోపంతో అరిచాడు సూర్యం.
‘అవును, నా పిల్లే. కానీ బుద్ధులన్నీ మీ అక్కవే. అత్తయ్యగారు చెప్పిన మాట ఏనాడైనా విందా? ఆవిడను ఏడిపించుకుని తినేది కాదు. నిజం చెప్పండి.’ నిగ్గదీసినట్లు అడిగింది.
‘అబ్బో! అత్తయ్యగారు... ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది. పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా?’ పాయింట్ లాగాడు.
‘అనండనండి. ఎంత బాగా చూసినా నేను పరాయి ఇంటి నుంచి వచ్చిన దాన్నేగా; మీరూ మీరూ ఒకటే’ ముక్కు ఎగబీలుస్తూ అంది.
‘చాల్లే, నెత్తిమీద నీళ్ల కుండ ఉంటుంది ఎప్పుడూ. ఆ రామూ గాడూ ఇంకా బాత్‌రూమ్ నుంచి వచ్చినట్లు లేదు. స్కూల్‌కి టైమ్ అవుతోంది. ఏమైనా ఇంగితజ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నిల్చుంటాడు. మబ్బు వెధవ! చురుకుతనం లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం... ఎవరి పోలిక వచ్చిందే?’ వ్యంగ్యంగా అన్నాడు.
‘మీరు తిన్నగా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు. ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి. ఇలా వంకర మాటలు మా ఇంటా వంటా లేవు’ దులిపేసింది మాధవి.
‘అవును పాపం! మిమ్మల్ని చెబితే ఎవరినైనా చెప్పాలి. ఎదుటివాళ్లను చెడామడా తిట్టేయడం గొప్పనో, నిజాయితీ అనో అనుకుంటారు. ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి...’
‘అవును, పుడకలతో గానీ పోదు. పచ్చని ఇంట్లో ఇలాంటి అశుభం మాటలనడం మీకే చెల్లింది.’ విసురుగా జడను వేయడం ముగించి పిల్లను ముందుకు తోసింది.
అద్దంలో చూసుకుంటున్న భవ్య: “ఇవాళ బుధవారం ఆటల రోజు కదా... వైట్ రిబ్బన్ వేయలేదేమిటీ?” అంటూ ఏడుపు లంకించుకుంది.
“కావాల్సిన రిబ్బన్లు ముందే తెచ్చి పెట్టుకోలేవూ? అంతా అయ్యాక ఏడుపు మొదలెడతావు. నేనేదో ఖాళీగా ఉన్నట్లు. పొద్దుట నుంచీ ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను. ఇంకా కారియర్లు సర్దాలి. ఓ చుక్క కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవడమే కష్టం అయిపోతోంది.” జీరగా ధ్వనించింది మాధవి గొంతు.
‘ఏదో బండలు ఎత్తినట్లు ఆపసోపాలు పడతావు ఎప్పుడూ చూసినా. ఎవరి ఇంట్లో పని వారు చేసుకోవడం కూడా ఎవరినో ఉద్ధరించినట్లు!’
భర్త మాటల్లోని వెటకారానికి మాధవికి ఒళ్లంతా కారం రాసినట్లయింది.
‘అదే మరి. నేను మొత్తుకునేదీను. మీరు ఆఫీసుకు వెళ్లేలోగా ఒక చేయి వేస్తే నాకూ పని తేలుతుంది. మా అన్నయ్య చక్కగా మా వదినకు సాయం చేస్తాడు. మా వదిన అదృష్టవంతురాలు లెండి!’ నిట్టూర్చింది.
‘అలా ఆడంగి పనులు చేయడం మా ఇంటా వంటా లేదు.’ విసురుగా అన్నాడు సూర్యం.
‘మా ఆఫీసులో పనిచేసే పద్మ గారు ఇంటా బయటా ఎంత బాగా సమర్థించుకుంటుందో... ఎప్పుడు చూసినా నవ్వుముఖంతోనే ఉంటుంది.’
‘పనుల్లో ఆడా మగా తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతోంది. మీరు తెగ పొగిడేస్తున్నారు ఆ పద్మ గారిని. దానికి కారణం ఆవిడ మొగుడు రామ్మూర్తి గారు. ఆడపనీ, మగపనీ అని తేడా లేకుండా ఇద్దరం అన్ని పనులూ కలిసి చేసుకుంటాం అని ఆవిడే చెప్పారు. ఆ విషయం మాత్రం తమరికి ఎక్కదు లెండి. సర్లెండి, మనిద్దరికీ ఇది ఎప్పుడూ ఉండేదే కానీ, నేనివాళ బజారుకి పోలేను. మీరే ఏవో రెండు కూరలు తెచ్చి పడెయ్యండి.’
అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది మాధవి.
‘ఏమిటలా అయిపోతున్నావ్? జ్వరం గానీ వచ్చిందా ఏమిటి?’ మాధవి మెడ మీద చేయి వేసి ఆదుర్దాగా అడిగాడు సూర్యం.
‘డాక్టర్ దగ్గరకు వెళ్దామా?’ అని భర్త ఆదుర్దాగా అడుగుతుంటే ఆమె కళ్లలోకి నీరు చేరింది.
“ఛా! ఏమిటిది మరీ చిన్నపిల్లలా?” అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని కళ్లను ఒత్తాడు సూర్యం.
‘మరేం లేదు. నేను బానే ఉన్నాను’ అని మాధవి చెబుతున్నా వినకుండా ఫోన్ చేసి ఆఫీసుకు సెలవు పెట్టేశాడు. కూరగాయలు తెచ్చాడు. వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికి ఒకరు అన్నట్టుగా గడిపారు. చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు.
‘మా అమ్మమ్మ చెప్పేదండీ... భార్యాభర్తల తగాదాలు అద్దం మీద ఆవగింజల్లాంటివి. ఎంతో సేపు నిలవవు అని’ అంది మాధవి.
‘అలాగా, నేను ఇంకోటేదో విన్నాను’ అన్నాడు చిలిపిగా సూర్యం.
‘ఏం విన్నారేమిటీ?’ అంది మాధవి వచ్చే నవ్వును ఆపుకుంటూ.
‘మొగుడూ పెళ్లాల గొడవలన్నీ పడకగదిలో పరిష్కారం అయిపోతాయట.’
గొప్ప రహస్యం చెబుతున్నట్టుగా చెప్పుతున్న భర్తను చూసి కిలకిలా నవ్వింది. అరమరికలు లేని ఆనందంలో ఆ ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజు.
ఆ మరునాడు.
సూర్యం బాత్‌రూమ్ నుంచి అరుస్తున్నాడు: ‘ఎన్నిసార్లు చెప్పాలి! సబ్బు అయిపోతే కొత్తది పెట్టమని! ఇంత బద్ధకం ఏమిటసలు నీకు?’
‘సబ్బు ఉందో లేదో చూసుకోకుండా బాత్‌రూమ్‌లో దూరి కూర్చుంటారు. వంటపనీ, పిల్లల పనీ చూడనా... మీకన్నీ అందిస్తూ కూర్చోనా? పైగా బద్ధకం అనడం ఒకటి! మిమ్మల్ని ఇలా పెంచి నాకు కట్టబెట్టిన ఆ మహాతల్లిని అనాలి అసలు!’
‘మాటలు జాగ్రత్తగా రానియ్. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటావు. ఇప్పుడసలు ఆవిడ ఊసెందుకు?’
‘ఆవిడ ఊసెందుకు అంటావేమిటి? మా వాడంత మంచివాడు, బుద్ధిమంతుడూ ఇంకొకరు ఉండరని మా వాళ్లని బుట్టలో వేసింది ఆవిడే కనక!’
‘మా అమ్మకి నోట్లో నాలుక లేదు, అమాయకురాలు అని మీ నాన్న చెప్పాడుగా?’
‘అంటే ఏమిటిప్పుడు? నేను గయ్యాళిగా?’ నడుం మీద చేతులు వేసుకుంటూ కళ్లను పెద్దవి చేసింది.
‘నేననడం దేనికి? స్పష్టంగా కనబడుతుంటే... ఇంతకీ సబ్బు తెచ్చావా, లేదా?’
‘తేక చస్తానా? ఇదిగో, జలకాలాడి తొందరగా తేలి రండి. మళ్లీ టిఫిన్ చల్లారిపోయిందంటూ అదో గొడవ!’
‘అవును పాపం. నా వల్ల నీకెన్ని ఇబ్బందులో మరి!’
‘ఉన్న మాటంటే ఉలుకెక్కువని ఊరికే అన్నారా? మన పెళ్లిలో మీవాళ్లు టిఫిన్ చల్లారిందని ఎంత గొడవ పెట్టారు! మరిచిపోయే సంగతే.’
‘అబ్బో! అక్కడికి మీవాళ్లు మా అడుగులకు మడుగులు ఒత్తినట్టు మాట్లాడుతున్నారు. మీకసలు మర్యాదా మన్ననా తెలిసి ఏడుస్తేగా?’
‘ఆగండక్కడ! మా వాళ్ల మర్యాదలకు వంకలు పెడుతున్నారు. కాశీ ప్రయాణమప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంట్, షర్ట్ పెట్టడానికే మొహం చూసుకున్నారు మీవాళ్లు.’
‘మీరు మావాళ్లకి పెట్టిన బట్టల మాటేమిటి? మంచివాళ్లం కాబట్టి గొడవ పెట్టలేదు.’
‘ఆ… మీవాళ్ల మంచితనాలు…’ మాధవి మూతి ముప్పై వంకర్లు తిప్పింది.
‘చాల్లే, ఎక్కువగా తిప్పకు. చూడలేకపోతున్నా.’
‘అవును! ఎందుకు చూడగలుగుతారు? పెళ్లైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది. అంతే లెండి. మగవాళ్ల ప్రేమలు శ్రావణ మేఘాల్లాంటివి అని ఊరికే అనలేదు.’ ముక్కు ఎగబీలుస్తూ అంది మాధవి.
‘శ్రావణమేఘంలా నువ్వు వర్షిస్తూ నన్ను అంటావేం?’ వెక్కిరిస్తూ అన్నాడు సూర్యం.
‘శ్రావణమేఘాలు ఎప్పుడు కురుస్తాయో, మానతాయో చెప్పలేనట్లే మగాళ్ల ప్రేమలు కూడా మారిపోతాయట. ఎటొచ్చి మా ఆడాళ్లమే ఎర్రిబాగుల వాళ్లం.’ ముక్కు చీదేసింది.
‘అయ్యబాబోయ్! ఇప్పుడు జడివాన కురిపించకు. నాకు ఆఫీసు టైమ్ అయిపోతోంది.’ అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవడం మొదలెట్టాడు.
‘నెమ్మదిగా తినండి. పొలమారగలదు.’ కంగారుగా అంటూ మంచినీళ్ల గ్లాసు తెచ్చి టపీమని ప్లేట్ పక్కన పెట్టింది.
గబగబా మంచినీళ్లు తాగి లేచాడు.
‘హెల్మెట్ సోఫాలో పెట్టాను. మరిచిపోకండి. జాగ్రత్తగా వెళ్లిరండి.’
‘నువ్వు కదులు మరి. త్వరగా ఎదురు రా… నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ ఝామ్మని అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల పరీక్షలు అయిపోయాయన్నావు కదా? పార్కుకు వెళ్దాం. ఓకేనా?’ హుషారుగా గడప దాటాడు సూర్యం.
‘నేను ఎదురురాకపోతే ఈయనకు మనసు మనసులో ఉండదు.’ మురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది.
సాయంత్రం పిల్లలు, మాధవి రెడీ అయి ఎదురుచూపులు చూడటం మొదలుపెట్టారు. త్వరగా వస్తానన్నాడు, మామూలు టైమ్‌కి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు.
“ఏదో అర్జంట్ పని తగిలి ఉంటుంది. ఇంకోసారి తప్పకుండా వెళ్దాం” అని వాళ్లను బుజ్జగించి, సముదాయించి సమాధాన పరిచింది. ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది. వంట చేసి పిల్లలకు పెట్టేసింది. తాను పెందరాళే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాస లేకుండా ఉన్నాడు. పోనీ అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక మాట చెప్పొచ్చుగా. పెళ్లాం కదా, అందుకే లోకువ.
ముందంతా గజిబిజిగా ఆలోచించిన ఆమెకు ఎంత సేపటికీ భర్త ఫోన్ చేయకపోవడంతో కంగారు మొదలైంది. పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. “అసలే రోజూ ఎన్నో ఆక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈయనకు ఏమీ కాలేదు కదా?” అనే ఆలోచనలకు ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడింది.
పది దాటాక ఇల్లు చేరాడు సూర్యం. విసురుగా ఏదో అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూలబడి తల పక్కకి వాల్చి, కాళ్ల మీద చేయి పెట్టుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది. పరుగున వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, ‘ఏమయిందండీ?’ అంది భుజం మీద చేయి వేస్తూ.
“మా ఆఫీసులో అటెండర్ సునీత చాలా మంచిదని, భర్త పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తోందని చెప్పాను కదా;”
‘అవును! ఇద్దరూ ఆడపిల్లలు తల్లికి సాయం చేస్తూ కష్టపడి చదువుకుంటున్నారు అని కూడా చెప్పారు కదా!’ అంది. ‘అయితే?’ అన్నట్లు చూస్తూ.
‘సునీత ఇవాళ ఉన్నట్టుండి పడిపోయింది. ఆసుపత్రికి తీసుకువెళ్లాము. ఆమెకి లంగ్ క్యాన్సర్ అని తేలింది. బాగా ముదిరిపోయిందట. చాలా రోజులుగా బాగా దగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లుంది. పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసింది. పిల్లలు పదో తరగతి, ఇంటర్ చదువుతున్నారట. ఆమెకేమైనా అయితే ఆ పిల్లల గతేం కానూ! వాళ్లు ఏమైపోతారో పాపం!’ బాధపడ్డాడు.
భర్త సున్నితమైన మనస్తత్వం తెలిసిన మాధవికి పరిస్థితి అంతా అర్థమైంది.
‘కష్టం, సుఖం తెలిసిన వాళ్లు. మరీ చిన్నపిల్లలు కాదు కదా. తెలిసిన వాళ్లు ఆఫీసులో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్లు తమ కాళ్ల మీద నిలబడతారు. బాధపడి, దిగులు పడితే లాభం లేదు. ముందు జరగాల్సిన పనులు చూడాలి. మా రామం బాబయ్య పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇప్పిస్తుంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలు ఉంటే చెప్పమని చాలాసార్లు చెప్పాడు. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించు కుంటున్నారు. తన పెన్షన్‌తో మంచి పనులు చేయాలని ఆయన తపన. వీళ్ల గురించి ఆయనకు చెబుదాం. “పెట్టలేకపోయినా... పెట్టే చేయి చూపించాలి” అంటారు… ఇక ఆలోచనలు వదిలి లేవండి. కాళ్లు చేతులు కడుక్కుని వస్తే అన్నం వడ్డిస్తాను.’ చెయ్యి పట్టి లేవదీసింది.
“నువ్వు చాలా తెలివి, మీదుమిక్కిలి మంచి సమర్థత ఉన్నదానివి. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చి పారేస్తావు. నీ మాటలతో నా మనసు తేలికపడింది.” మనఃస్ఫూర్తిగా అన్నాడు సూర్యం.
“నన్ను తర్వాత పొగడవచ్చు కానీ, ఇలా డీలా పడిపోతుండటం మానుకోవాలి. కష్టాలు, సమస్యలు మానవులకి వస్తాయి…” చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమ నిండిన కళ్లతో చూశాడు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది మాధవి.
“బావగారు స్పాట్ వాల్యుయేషన్‌కి వెళుతున్నారట. చెల్లాయి పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్ చేసింది. పది రోజులు ఉంటుందిట” నెమ్మదిగా చెప్పాడు సూర్యం.
‘ఆహా! అన్నగారికి చెల్లాయిగారి నుంచి ఫోన్ వచ్చిందన్న మాట. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను. నీకు మీ వాళ్లింటికి ఏమైనా వెళుతున్నావా?” అని మాట వరసకైనా అడగదు.’ కాస్త కోపం మేళవించి అంది మాధవి.
“ఎవరికి చేస్తే ఏమిటి?” తేలిగ్గా తీసెయ్యబోయాడు సూర్యం.
‘అవును మరి. ఇలాంటి వాటికి మీకేమీ పట్టింపులు ఉండవు. ఎవరైనా ఏ ఊరో వెళుతూ దారేకాదని ఒక్కపూట దిగినా ముందే చెప్పి రాలేదని తెగ గింజుకుంటారు.’
‘సరేలే. దానికి మాత్రం ఎవరున్నారు? ఎక్కడికి వెళుతుంది? కావాలంటే అది వచ్చి వెళ్లాక నువ్వు మీ వాళ్లింటికి వెళ్లి నాలుగైదు రోజులు ఉండిరా’ సముదాయిస్తూ అన్నాడు.
‘మీరంతగా వెన్న పూయక్కర్లేదు. ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు. కాకపోతే గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం లేదనే నా బాధ.’
“ఏదో లేదూ. చిన్నపిల్ల. దానికి ఇలాంటివి తెలియవు.”
‘ఏమిటీ మరీ చిన్నపిల్లలా? నాకంటే ఆవిడగారు మూడు నెలలు చిన్న. నేను మీకు అమ్మమ్మలా కనబడటం, ఆవిడ అమ్మాయిలా కనబడటం మామూలైపోయింది!’ ఒక్కసారి గయ్యిమంది.
“ఇంతకీ ఏమంటావ్?” విసుగు, కోపం కలిసి ధ్వనించింది అతని కంఠంలో.
‘ఏమంటాను? ఏమీ అనను! ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లుబాటైంది? వదినా, మరదళ్ళన్నాక బయట ఎలా తిరుగుతామో ఇంట్లో కూడా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. మా అమ్మ వాళ్లింటికి వెళితే, మా వదినా నేను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పనులన్నీ కలిసి చేసుకుంటాం. మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు వస్తువు అటు, అటు వస్తువు ఇటూ పెట్టదు. ఎప్పుడూ ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది. ఇక పనిమనిషి బంధువులు వచ్చారంటే ముందే ఎగ్గొడుతుంది. అన్ని పనులూ చేయలేక నా నడుం ముసలి వాళ్లలా వంగిపోతోంది.’ మాధవి మాటల్లో యథార్థం కూడిన నిస్సహాయత కనిపించింది.
ఆమె మాటల్లోని నిజం సూర్యం మనసుకు బాణంలా తగిలింది. “ఈసారి నేను కూడా నీకు సాయం చేస్తాను, సరేనా?” ఓదార్పుగా అన్నాడు.
“సర్లెండి. ఏదో నా బాధ చెప్పాను అంతే. రానివ్వండి. ఆడపడుచు అర్థమొగుడు కదా. ఈ మొగుడు గారితో పాటు, ఆ అర్థమొగుడు గారికి సేవలు చేసి తరిస్తాను.” వ్యంగ్యంతో కూడిన విసురు విసిరింది.
“అలా అంటావుగానీ నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుసు, మదూ.” నవ్వించడానికి ప్రయత్నం చేశాడు.
“గిల్లీ జోల పాడటం మీకు తెలిసినంతగా మాకు అసలు తెలీదు.”
“ఏంటోయ్, నన్ను మరీ అలా జమకట్టేశావ్?”
“మరే, ఎందుకంటే మీరందరూ లెక్కల మనుషులు కదా?”
“బాబోయ్! ఇక్కడ నుంచి పారిపోవడం ఉత్తమం. అవునూ మన జాతకాలు కలిశాయని చెప్పిన వాళ్ళెవరూ? ఎప్పుడూ ఏదో ఒక తగాదా.” ప్రశ్నార్థకంగా మొహం పెట్టిన సూర్యం తో…
“అదే అంటారు సూర్యంగారూ... సంసారంలో సరిగమలు, సంసారంలో చిటపటల తాళం లేకపోతే…” సూక్తి ముక్తావళి బోధిస్తున్నట్లుగా చేయి పైకెత్తి నవ్వేసింది మాధవి.
——————————————శుభంభూయాత్————————————————
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments