బామ్మ వారసులు - 24: నిశ్శబ్ద సహాయం - ఆత్మగౌరవానికి నిలువుటద్దం
- Munipalle Vasundhara Rani

- Jun 10
- 3 min read
Updated: Jun 28
బామ్మ వారసులు నిశ్శబ్ద సహాయం, ఆత్మగౌరవం కథ, తెలుగు నీతి కథ, పిల్లల కథలు, మానవత్వం కథ, సహాయం విలువ, విద్య ప్రాముఖ్యత, పేద విద్యార్థి కథ, బామ్మ కథలు, తెలుగు కుటుంబ కథలు, moral stories in telugu, inspirational telugu stories, children moral stories, anonymous help, dignity and self respect, school stories telugu, manatelugukathalu

Bamma Varasulu - 24 - Nissabdha sahayam - Atmagouravaniki Niluvutaddam | Telugu Emotional Story | Vasundhara Rani Munipalle
బామ్మ వారసులు - 24: నిశ్శబ్ద సహాయం - ఆత్మగౌరవానికి నిలువుటద్దం - తెలుగు భావోద్వేగ కథ | వసుంధర రాణి మునిపల్లె
Published in manatelugukathalu.com on 10/06/2026
జూన్ నెల రావడంతో బడి గంటలు మళ్లీ మోగాయి. కొత్త పుస్తకాల వాసన, కొత్త తరగతుల ఉత్సాహంతో నీలిమ, చింటూ బడికి వెళ్లడం ప్రారంభించారు. అర్జున్ కూడా తన కొత్త సెమిస్టర్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఒకరోజు సాయంత్రం బడి నుంచి రాగానే నీలిమ ముఖం కాస్త చిన్నబోయి ఉంది. పెరట్లో జామచెట్టు కింద కూర్చుని ఉన్న బామ్మ, ఇంటికి అప్పుడే వచ్చిన అర్జున్ ఇద్దరూ నీలిమను గమనించారు.
"ఏంటమ్మా నీలిమ.. ఈరోజు బడి నుంచి రాగానే ముఖం అలా పెట్టావు? ఏమైంది?" అని అడిగింది బామ్మ లాలనగా.
నీలిమ బామ్మ పక్కన కూర్చుని, "బామ్మా, మా క్లాసులో రవి అని ఒక అబ్బాయి ఉన్నాడు. చాలా బాగా చదువుతాడు. కానీ వాళ్ల నాన్నగారికి ఒంట్లో బాలేకపోవడంతో ఈసారి బడి ఫీజు కట్టడం, కొత్త పుస్తకాలు కొనడం వాళ్ల అమ్మ వల్ల కాలేదు. రేపటిలోగా ఫీజు కట్టకపోతే పేరు తీసేస్తామని హెడ్మాస్టర్ గారు చెప్పారు" అంది బాధగా.
అక్కడే ఉన్న అర్జున్ అందుకొని, "అవునా! అయితే ఒక పనిచేద్దాం. నేను నా పాకెట్ మనీ, అలాగే నా ఫ్రెండ్స్ దగ్గర కొంత డబ్బు చందా వసూలు చేసి రేపు నీలిమతో ఆ రవికి పంపిస్తాను. వాడు ఫీజు కట్టేసుకుంటాడు" అన్నాడు బాధ్యతగా.
కానీ నీలిమ తల ఊపుతూ, "వద్దు అన్నయ్యా.. వాడు అస్సలు తీసుకోడు. రవి క్లాసులో ఎవరినీ ఎప్పుడూ ఏదీ అడగడు. వాడి దగ్గర లేకపోయినా సరే.. చివరికి ఒక చిన్న పెన్సిల్ అవసరమైనా సరే ఎవరినీ సాయం అడగడు, వేరేవాళ్ల దగ్గర తీసుకోడు. మనమిచ్చే డబ్బులు ఎలా తీసుకుంటాడు అన్నయ్యా? అందుకే వాడికి ఎలా సాయం చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు" అంది కంగారుగా.
బామ్మ ముగ్గురు పిల్లలనూ దగ్గర కూర్చోబెట్టుకుని
"పిల్లలూ, నీలిమ చెప్పింది నిజమేరా. పేదరికంలో ఉన్నా కొందరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లకు అందరి ముందు నేరుగా డబ్బులు ఇస్తే, అది సాయం లాగా అనిపించదు, వాళ్ల ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూపించినట్లు ఉంటుంది. ఆ బాధతోనే వాళ్లు వద్దంటారు" అంది బామ్మ.
"మరి ఇప్పుడు వాడికి ఎలా సాయం చేయాలి బామ్మా? రేపే కదా ఆఖరి రోజు" అని చింటూ అడిగాడు అమాయకంగా.
బామ్మ నవ్వి, "సహాయం ఎప్పుడు ఎదుటివారి మనసుని గాయపరచకూడదురా. 'కుడిచేత్తో చేసే సాయం ఎడమచేతికి తెలియకూడదు' అంటారు పెద్దలు. దాన్నే నిశ్శబ్ద సహాయం అంటారు. అర్జున్, నువ్వు రేపు వెళ్లేటప్పుడు నీలిమతో కలిసి ఒకసారి బడికి వెళ్లు. మీ దగ్గర ఉన్న డబ్బులు రవికి ఇవ్వకుండా నేరుగా హెడ్మాస్టర్ గారిని కలవండి" అంటూ ఒక ఉపాయం చెప్పింది.
బామ్మ మాటల్లోని అంతరార్థాన్ని వారసులు వెంటనే అర్థం చేసుకున్నారు. తాము దాచుకున్న పాకెట్ మనీ డబ్బులను, బామ్మ ఇచ్చిన కొంత మొత్తాన్ని కలిపి మరుసటి రోజు ఉదయమే బడికి బయలుదేరారు.
రవి బడికి రాకముందే అర్జున్, నీలిమలు నేరుగా హెడ్మాస్టర్ గారి గదిలోకి వెళ్లారు. వసూలు చేసిన డబ్బును ఆయన చేతిలో పెట్టి, "సార్, ఈ డబ్బుతో నీలిమ క్లాస్‌మేట్ అయిన రవి ఫీజు కట్టేయండి, అలాగే వాడికి కావలసిన కొత్త పుస్తకాలు కూడా ఇవ్వండి. కానీ ఈ సాయం మేము చేశామని రవికి అస్సలు చెప్పకండి సార్. తెలిస్తే వాడు బాధపడి చదువు మానేస్తాడు. ఎవరో అజ్ఞాత దాత చదువుకోసం సాయం చేశారని చెప్పండి" అని అభ్యర్థించారు.
హెడ్మాస్టర్ గారు ఆ పిల్లల పరిణతిని, ఆలోచనా విధానాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. "ఇంత చిన్న వయసులోనే ఎదుటివారి ఆత్మగౌరవాన్ని ఇంతలా కాపాడుతున్నారంటే.. మీ బామ్మగారి పెంపకం చాలా గొప్పది పిల్లలూ! ఖచ్చితంగా మీరు చెప్పినట్లే చేస్తాను" అని నవ్వుతూ ఒప్పుకున్నారు.
అర్జున్ ఆయనకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
కాసేపటికి రవి చాలా భయపడుతూ, తలదించుకుని బడికి వచ్చాడు. తను బడిలో కూర్చునే చివరి రోజు ఇదేనేమోనని వాడు ఎంతో బాధపడ్డాడు. అంతలోనే అటెండర్ వచ్చి రవిని హెడ్మాస్టర్ గదికి రమ్మన్నాడు. రవి గుండె ఆగిపోయినంత పనైంది, ఫీజు కట్టలేదని బడిలోంచి పంపించేస్తారేమోనని భయపడుతూ లోపలికి వెళ్లాడు.
కానీ హెడ్మాస్టర్ గారు నవ్వుతూ, రవి చేతిలో కొత్త పుస్తకాలు, ఫీజు రశీదు పెట్టారు. "రవీ! నీ చదువు ఆగిపోకూడదని ఊళ్లో ఉండే ఒక అజ్ఞాత దాత నీ ఫీజు కట్టేశారు. నువ్వు చక్కగా చదువుకుని పెద్ద ఆఫీసర్ కావడమే ఆయనకు కావాలట. ఇక ఎలాంటి బెంగ లేకుండా చదువుకో" అన్నారు.
రవి ఆశ్చర్యంతో, కళ్లల్లో ఆనందబాష్పాలతో ఆ పుస్తకాలను చూశాడు. ఆ సాయం ఎవరు చేశారో వాడికి తెలియదు, కానీ తన ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా, తన చదువు కొనసాగుతుందనే సంతోషం వాడి ముఖంలో స్పష్టంగా కనిపించింది.
ఆనందంతో హెడ్మాస్టర్ గారికి నమస్కారం చేసి క్లాస్ రూమ్‌లోకి వెళ్లాడు.
దూరం కిటికీ గుండా రవి ముఖంలోని ఆనందాన్ని చూసిన నీలిమ మనసు తృప్తితో నిండిపోయింది.
సాయంత్రం ఇంటికి వచ్చాక అర్జున్, నీలిమలు జరిగిందంతా బామ్మకు చెప్పారు. బామ్మ ముగ్గురినీ దగ్గరకు తీసుకుని, "ఈరోజు రవి కళ్లల్లో కనిపించిన ఆనందమే మీరు చేసిన నిశ్శబ్ద సహాయానికి దక్కిన నిజమైన ప్రతిఫలంరా సాయం చేయడంలో ఉండే అసలైన మానవత్వం ఇదే" అని మెచ్చుకుంది.
బామ్మ చెప్పిన ఆత్మగౌరవ పాఠాన్ని తమ గుండెల్లో నింపుకుంటూ, ముగ్గురు వారసులు సంతోషంగా నవ్వారు.
***
సమాప్తం.
బామ్మ వారసులు - గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.





























Comments