top of page
Original.png

సంస్కారానికి చెదలు

11 hours ago
4 min read

సంస్కారానికి చెదలు తెలుగు కథలో మూర్తి, శేఖర్‌ మరియు హనుమంతు మధ్య జరిగిన సంఘటనను చూపించే హైదరాబాద్‌ పుట్టినరోజు వేడుక దృశ్యం.

Samskaraniki Chedhalu - Telugu Social Story | B. N. Satyanarayana

సంస్కారానికి చెదలు - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 13/09/2026


సంస్కారం అనేది మనిషి విద్యతోనో, ఉద్యోగంతోనో, సంపదతోనో సంపాదించేది కాదు; అది మన ప్రవర్తనలో కనిపించే విలువ. “సంస్కారానికి చెదలు” కథలో మూర్తి, శేఖర్‌, హనుమంతుల మధ్య జరిగిన సంఘటన ద్వారా మర్యాద, మానవత్వం, కృతజ్ఞతల ప్రాధాన్యతను రచయిత చక్కగా వివరించారు. ఇతరులను గౌరవించడం, గత అనుబంధాలను గుర్తుంచుకోవడం ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. బి. ఎన్‌. సత్యనారాయణ రచించిన ఈ తెలుగు సామాజిక విలువల కథ మనసును ఆలోచింపజేస్తుంది.


“ఏవండీ! శేఖర్‌ వచ్చాడు” అంటూ అనసూయ వచ్చి చెప్పడంతో మూర్తి గదిలో నుండి బయటకు వచ్చాడు.


హాలులో సోఫాలో కూర్చుని ఉన్న శేఖర్‌ను చూసి నవ్వుతూ పలకరిస్తూ “ఏం శేఖర్, ఎలా ఉన్నావ్‌? అంతా కులాసాయేనా? నీ ఉద్యోగం ఎలా ఉంది? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా?” అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ వచ్చి సోఫాలో శేఖర్‌ ప్రక్కనే కూర్చున్నాడు.


ఇంతలో అనసూయ రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చి తానూ ప్రక్కనే కూర్చుంది. శేఖర్‌ కాఫీ తాగుతూ “మావయ్యా నాకు ఇక్కడికే, హైద్రాబాదుకే ట్రాన్స్ఫర్‌ అయింది. క్రిందటి నెలలోనే జాయిన్‌ అయ్యాను.


ప్రమోషన్ అయితే ప్రస్తుతానికి రాలేదు, కానీ లిస్ట్‌లో నా పేరు ఉన్నట్లుగా తెలిసింది. బహుశా కొద్ది నెలల్లోనే అది రావచ్చు అని అనుకుంటున్నాను” అంటూ చెబుతూ, “మావయ్యా! రేపు మా అబ్బాయి ‘మధు’కి మొదటి పుట్టినరోజు వేడుకను ఇక్కడే దగ్గర్లోనే ఉన్న హ్యాపీ కన్వెన్షన్ హాల్లో జరిపిస్తున్నాం. మీరు, అత్తయ్య ఈ ఫంక్షన్‌కు తప్పకుండా రావాలి. వచ్చి వాడిని ఆశీర్వదించాలి. రాత్రికి విందు కూడా ఏర్పాటు చేశాం” అంటూ చెప్పి లేచి, “మావయ్యా, అత్తయ్య మరి నేను వెళ్లి వస్తాను” అని చెప్పి బయటకు వెళ్లి తన మోటారు సైకిల్ స్టార్టు చేసి ఇంటి వైపునకు బయలుదేరాడు.


ట్రాన్స్ఫర్‌లు అవుతూ అవుతూ చివరిగా హైదరాబాద్‌లో ఉండగా రిటైర్ కావడంతో మూర్తి అక్కడే ఒక ఫ్లాట్‌ కొనుక్కుని స్థిరపడిపోయాడు. అప్పుడప్పుడు మాత్రం ఆస్తి వ్యవహారాలు చూసుకునేందుకు యలమంచిలి వెళ్లి వస్తూ ఉంటాడు. “శేఖర్ కు ఎనిమిది సంవత్సరాలు వయసులో వాడి తల్లి శ్యామల కాలం చేసింది.”


దానితో వాడి తండ్రి హనుమంతు రెండవ వివాహం చేసుకుని విశాఖపట్నంలో ఉండిపోయాడు. కొడుకు శేఖర్‌ను వాడి అమ్మమ్మ దగ్గరే విడిచిపెట్టేసి అప్పుడప్పుడు మాత్రం వాడిని చూసేందుకు యలమంచిలికి వెళ్లివస్తుంటాడు. శేఖర్ బాగోగులు అన్నీ వాడి అమ్మమ్మే చూస్తూ ఉండేది. అమ్మమ్మ దగ్గరే ఉంటూ శేఖర్ బుద్ధిగా చదువుకుని డిగ్రీ పూర్తి చేశాడు. ఎన్నో ఇంటర్వ్యూలు అటెండై కడకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించ గలిగాడు.


శేఖర్‌కు ఉద్యోగం రావడంతో పార్వతమ్మ ఆలస్యం చేయకుండా వాడికి వివాహం జరిపించేసింది. ఆహ్వానం అందినా మూర్తి అత్యవసర పనుల కారణంగా ఆ వివాహానికి వెళ్ళలేక పోయాడు. దురదృష్టం వాడికి పెళ్లి అయిన కొద్ది నెలలకే పార్వతమ్మ చనిపోయింది. శేఖర్‌కు ఇప్పుడొక కొడుకు పుట్టాడని తెలిసి మూర్తి దంపతులు చాలా సంతోషపడ్డారు. వాడి కొడుకును చూసేందుకు తప్పకుండా ఆ ఫంక్షన్‌కు వెళ్ళాలనే అనుకున్నారు.


అయితే అనసూయకు పొరుగింటి వారి ఇంట్లో జరిగే శుభకార్యానికి తప్పకుండా వెళ్లవలసి రావడంతో మూర్తి ఒక్కడే శేఖర్ కొడుకు పుట్టినరోజు వేడుకకు బయలుదేరాడు. వెళుతూ త్రోవలో ఒక బొమ్మల దుకాణంలో ‘మధు’ కొరకు ఒక చక్కటి ఆటబొమ్మను కొని గిఫ్ట్ ప్యాక్‌ చేయించి తీసుకు వెళ్ళాడు. ఫంక్షన్ హాల్ విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించబడి ఉంది.


మైక్ లో పిచ్చిపిచ్చి పాటలు కాకుండా శ్రావ్యమైన కర్ణాటక సంగీతం వీనులు విందుగా వినిపిస్తోంది. మూర్తి హాలులోకి ప్రవేశించాడు. అప్పుడే ఏదో పనిపై బయటకు వస్తున్న శేఖర్ మూర్తిని చూసి పరుగుపరుగున దగ్గరగా వచ్చి “రండి మావయ్య! అత్తయ్య రాలేదా?” అంటూ ఆత్మీయంగా పలకరించి స్వయంగా తానే మూర్తిని హాల్లో మొదటి వరుసలో ఏర్పాటు చేయబడ్డ సోఫాలో కూర్చుండబెట్టాడు. మూర్తి కూర్చుంటూ తాను ‘మధు’ కొరకు కొని తెచ్చిన బహుమతిని శేఖర్‌కు అందజేశాడు.


శేఖర్ నవ్వుతూ మొహమాట పడుతూనే దానిని స్వీకరించాడు. ఇంతలో అదే ఫంక్షన్‌కు వచ్చిన మూర్తి మిత్రులిద్దరు మూర్తిని చూస్తూనే ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. చాలా కాలానికి కలుసుకున్న ఆ ముగ్గురు మిత్రులు సోఫాలోనే కూర్చుని తమ అనుభవాలను చెప్పుకుంటూ ముచ్చట్లలో మునిగి పోయారు.


అప్పుడే శేఖర్‌ ఇద్దరు పెద్దలతో కలిసి మూర్తి దగ్గరికి వచ్చి వారిలో ఒకరైన హనుమంతుతో “డాడీ! మూర్తి మావయ్య” అంటూ మూర్తిని పరిచయం చేశాడు.


హనుమంతు మూర్తిని కిందికిపైకి చూస్తూ “నాకు తెలీదే” అన్నాడు.


దానికి శేఖర్ “అదేంటి డాడీ! మన ఇంటి ప్రక్కనే వారిల్లునూ! గుర్తుకు రావడం లేదా?! నేనంటే వారికెంతో అభిమానం అని చెబుతూ ఉంటాను కదా! వారే వీరు” అంటూ మళ్లీ తండ్రికి గుర్తు చేయబోయాడు.


దానికి హనుమంతు ముఖం అదోలా పెడుతూ “నాకు తెలీదురా” అంటూ “పద, ముందు బాబుని చూసొద్దాం” అంటూ తన కూడా వచ్చిన వ్యక్తితో కలిసి ముందుకు వెళ్ళిపోయాడు.


తండ్రి ప్రవర్తనతో సిగ్గు పడ్డ శేఖర్‌ తల వంచుకొని మూర్తితో ఏం మాట్లాడాలో తెలియక “ఉండండి మావయ్య మళ్ళీ వస్తాను” అంటూ అక్కడ నుండి నిష్క్రమించాడు.


మూర్తికి, ప్రక్కనే ఉన్న అతడి ఇద్దరు మిత్రులకు హనుమంతు ప్రవర్తన షాక్ కొట్టినట్టు అయింది. ఆ ఊహించని ఘటనతో మూర్తి ముఖం చిన్నబోయింది. జరిగిన దానికి అతని మిత్రులకైతే చాలా కోపమే వచ్చింది. “ఎవర్రా బాబూ అతడు? చదువుకున్నవాడేనా?! బొత్తిగా సంస్కారం లేకుండా ముఖంపైనే ‘తెలీదు’ అంటాడేంటి! అన్ని మార్లు కొడుకు జ్ఞాపకం చేసినా కూడా అంత మూర్ఖంగా ప్రవర్తించడం ఏంటి? నీవు తెలిసి ఉండకపోవచ్చు. గుర్తు ఉండకపోవచ్చు. అయితే మాత్రం కనీసం మర్యాదకైనా ‘హలో! మరచిపోయూను’ అనో, మరొకటనో ‘నవ్వుతూ ఒక మాట అని ఉండి ఉంటే ఎంత బాగుండేది’.”


“ఇంతవరకు ఇటువంటి వాడిని మేమెక్కడా చూడలేదురా బాబూ!” “సిగ్గు పడవలసిన విషయం ఇది!”


“ఇటువంటివి చూస్తుంటే, వింటుంటే సమాజం దేనినో కోల్పోతోంది” అనిపిస్తుంది అంటూ తమ బాధను, కోపాన్ని వ్యక్తపరిచారు.


ఇంతలోనే మూర్తి కొంచెంగా తేరుకొని ముఖంపై కొద్దిగా చిరునవ్వు తెచ్చుకొని “పోనీయండిరా!” “ఇలాంటి వాళ్ళను మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.” “ఆ విషయం ఇంక విడిచి పెట్టేయండి.” “పదండి! ముందు శేఖర్‌ కొడుకును ఆశీర్వదించి వద్దాం” అంటూ వేదిక వైపు కదిలాడు.


ముగ్గురూ శేఖర్‌ కొడుకు ‘మధు’ని ఆశీర్వదించి దీవించారు. శేఖర్‌ సిగ్గు పడుతూ చేసిన అభ్యర్థన మేరకు ముగ్గురూ విందు స్వీకరించి బయటకు వచ్చేసారు. మూర్తి మిత్రులు ఇద్దరినీ మరోమారు ఆలింగనం చేసుకుని “మళ్లీ త్వరలోనే కలుద్దాం” అని చెప్పి తన స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటి వైపు పోనిచ్చాడు.

***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



 B. N. సత్యనారాయణ.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.



( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page