సముద్రం - పార్ట్ 2
ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

Samudram - Part 2 - Telugu Emotional Story | Thirumalasri
సముద్రం - పార్ట్ 2 - తెలుగు భావోద్వేగ కథ | తిరుమలశ్రీ
Published In manatelugukathalu.com On 28/04/2026
"మనసు సముద్రం లాంటిది… ఎంత లోతుగా ఉంటే అంత క్షమించగలదు…"
తిరుమలశ్రీ గారి సముద్రం - పార్ట్ 2 చదవండి.
అఖిల ఆ దృశ్యం చూసి నిశ్చేష్టురాలయింది. “ఏమయిందమ్మా? ఏమిటా గాయాలు?” అంటూ తల్లి చేతులు పట్టుకుని చూసింది. దేనితోనో కోసినట్లున్నాయి. ‘ఏదో గీచుకుంది’ అని చెప్పింది రేణుక. ఎందుకు ఏడుస్తోందో చెప్పలేదు. తల్లిని తన గదికి తీసుకువెళ్లి గాయాలకు మందుపూసి కట్టుకట్టింది అఖిల.
ఆమెకు ఏదో అనుమానంగా ఉంది. ఆ సమయంలో రాధాకృష్ణ డ్రాయింగ్ రూమ్‌లో ఎవరో వస్తే మాట్లాడుతున్నాడు.
“అమ్మా! నిజం చెప్పు. నీకు మంచి చేయాలి అనుకుని చెడు చేశానా నేను? బాబాయి చెడ్డవాడా? నిన్ను కొట్టాడా? ఎందుకు ఏడుస్తున్నావు?” అంటూ తల్లిని నిలదీసింది.
అప్పుడు రేణుక, “ఈ దెబ్బలకు అతను కారణం కాదు తల్లీ! నేనే చేసుకున్నాను. అతను చాలా మంచివాడు. నన్ను బాగానే చూసుకుంటాడు. కానీ, అప్పుడప్పుడూ నన్ను తన స్నేహితుడి దగ్గరకు తీసుకువెళుతుంటాడు. అతనితో గదిలో నన్ను ఒంటరిగా విడిచిపెట్టేసి తాను బయటకు వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి పలుకులు నాకు నచ్చవు. అక్కడికి వెళ్ళడం నాకిష్టం లేదు. నేను అక్కడికి రానన్నానని, ఇప్పుడు ఆ వ్యక్తిని ఇంటికే తీసుకొచ్చాడు…” అంది.
కొయ్యబారిపోయింది అఖిల. ‘రాధాకృష్ణ అలాంటివాడా!?’ నమ్మలేకపోయిందామె.
అంతలోనే ఆగ్రహం, ఆవేశం పెనవేసుకోవడంతో విసురుగా రాధాకృష్ణ దగ్గరకు వెళ్లింది.
“బాబాయ్! ఇతను ఎవరు? అమ్మ చెబుతున్నది నిజమేనా?” అనడిగింది కోపంగా.
మొదట తెల్లబోయినా, తేరుకుని, “అమ్మ నీతో ఏం చెప్పిందో నాకు తెలియదు, అఖిలా! ఇతను నా స్నేహితుడు డాక్టర్ వెంకటేశ్,” అన్నాడు, ఆ వ్యక్తిని పరిచయం చేస్తూ. వెంకటేశ్ కి నలభయ్యేళ్ళు ఉంటాయి.
తల్లి చెప్పిన విషయాలు చెప్పింది అఖిల. ఓ క్షణం అక్కడ భయంకర నిశ్శబ్దం అలముకుంది.
తరువాత నిశ్శబ్దాన్ని చీలుస్తూ, “మిస్ అఖిలా! నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా?” అనడిగాడు వెంకటేశ్. అనిశ్చయంగా చూసింది అఖిల.
“నేను ఇంట్లో ఉంటాను. నువ్వు వెళ్ళిరా,” అని రాధాకృష్ణ అనడంతో, సంశయిస్తూనే వెంకటేశ్ తో బయలుదేరింది ఆమె.
సమీపంలోని కాఫీషాపులో కూర్చున్నారిద్దరూ. కాఫీ త్రాగుతూ, వెంకటేశ్ చెబుతూన్నదానిని, అవాక్కయి ఆలకిస్తూ ఉండిపోయింది ఆమె.
‘రేణుక మానసిక ఆరోగ్యం బాగోలేదు. కొన్నేళ్లుగా ఆమె స్కిజోఫ్రేనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఆ వ్యాధి లక్షణాలు - ఆ వ్యక్తి యొక్క ఆలోచనలను, భావోద్వేగాలను, ప్రవర్తనను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందరిలా సాధారణంగా ఉండరు. భావోద్వేగాలు అధికమైనప్పుడు తమను తామే గాయపరచుకోవడం, పెద్దగా అరవడం, అకారణంగా ఏడ్వడం వగైరాలకు పాల్పడతారు. ఏవేవో ఊహించుకుని తీవ్ర భావోద్వేగానికి, ఒత్తిడికీ గురవుతుంటారు…’
“అఖిలా! రాధాకృష్ణ నాకంతా చెప్పాడు. మీ నాన్న మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక ఆ ఘాతాన్ని సున్నితమైన మీ అమ్మ మనసు తట్టుకోలేకపోయింది. బెంగ, బాధ, భవిష్యత్తు మీద భయమూ, ఒంటరితనమూ, మానసిక ఒత్తిడీ, ఎక్యూట్ డిప్రెషన్ ఆమెలో స్కిజోఫ్రేనియాకి దారితీసివుంటాయని నా అభిప్రాయం…” చెప్పాడు వెంకటేశ్. “నేను ఓ సైకియాట్రిస్ట్ ని. రాధాకృష్ణ ఆమెను పరీక్షించి వైద్యం చేయించే నిమిత్తం నా దగ్గరకు తీసుకువస్తుంటాడు. తాను ఉన్న మానసిక స్థితిలో దాన్ని అపార్థం చేసుకుని వైద్యానికి సహకరించడం లేదు ఆమె…”
అప్పుడప్పుడు తల్లి కనపరచే ప్రవర్తనను గుర్తు చేసుకుంది అఖిల. చిన్నపిల్లగా ఉన్నప్పుడు తనకు
ఏమీ తెలిసేదికాదు. ఎదిగేకొద్దీ తల్లి ప్రవర్తనలోని తేడాని గమనించేది. ఆమె తరచు గాయాల పాలవడం, ఎలాగో తగిలాయని చెప్పడం… అర్థరాత్రివేళ లేచికూర్చుని ఏడవడం… అకారణంగా అరవడం… ఏమిటేమిటో మాట్లాడడం… వగైరాలు చేసేది. ఇతరులతో కలవడానికి పెద్దగా ఆసక్తి చూపేదికాదు.
“ఇన్నేళ్ళూ తన మనసులో గూడకట్టుకున్న బాధను ఎవరితోనూ పంచుకోలేకపోవడంతో ఆ రుగ్మత కొనసాగింది. ఆవిడను పరీక్షించాను నేను. ఇప్పుడు తనకంటూ ఓ తోడు ఉన్నందున, సానుభూతితో మనం ఇచ్చే చేయూత, వైద్యం ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయగలవన్న నమ్మకం నాకుంది…” అన్నాడు వెంకటేశ్.
“అమ్మను నేను సావధానపరుస్తాను. స్వయంగా చూసుకుంటాను. మీరు వైద్యం ఆరంభించండి, డాక్టర్!” అంది అఖిల, వుబికివస్తూన్న కన్నీటిని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ…
ఆ తరువాత అఖిల ఎక్కువ సమయం తల్లితో గడపనారంభించింది. “ఇన్నాళ్ళూ నాకోసం అహోరాత్రులు కుట్టుమిషను దగ్గర శ్రమించావు నువ్వు. మనిషివి బలహీనపడిపోయావు. అందువల్ల వయసుతో వచ్చే సమస్యలు తలయెత్తకుండా ముందుజాగ్రత్తగా బాబాయి నిన్ను డాక్టర్ వెంకటేశ్ కి చూపించి, ఏవో విటమిన్ టాబ్లెట్స్ ని ఇప్పిస్తున్నాడు. అందులో వచ్చే నష్టమేమీ లేదు. నువ్వు బాగుంటేనే నేను బాగుండేది,” అంటూ బాగా నచ్చజెప్పింది. కూతురి పలుకులకు ప్రభావితురాలైన రేణుక, డాక్టర్ వెంకటేశ్ ఇచ్చే సైకోమెట్రిక్ మాత్రలను శ్రద్ధగా వాడనారంభించింది.
ఫలితంగా ఏడాది గడచేసరికల్లా, రేణుక మళ్ళీ సాధారణ వ్యక్తిగా మారిపోయింది. తల్లి రుగ్మత నయం అయినందుకు మిక్కిలి సంతోషించింది అఖిల. రాధాకృష్ణకు, డాక్టర్ వెంకటేశ్ కీ కృతజ్ఞతలు తెలుపుకుంది.
*
“అమ్మా! ఇంటి ఎదుట చెట్టుక్రింద కూర్చునే ఆ ముష్టివాడు రెండురోజులుగా కనిపించడంలేదు,” అంది అఖిల, తల్లి దగ్గరకు వచ్చి. జవాబివ్వకుండా కూతురి వంక శూన్యంగా చూసింది రేణుక.
“నువ్వు అతన్ని హాస్పిటల్లో చేర్పించినట్టు పనిమనిషి చెప్పింది. ఎందుకు?” మళ్ళీ అడిగింది అఖిల. “చెప్పు, ఆ ఫోటోలో ఉన్నది అతనేనా?”
‘ఔను’ అన్నట్టుగా చిన్నగా తల పంకించింది రేణుక. “అతను క్యాన్సర్ రోగి. అవసానదశలో ఉన్నాడు” అంది సన్నగా కంపించే స్వరంతో మెల్లగా.
“ఐతే?” కోపంతో రెట్టించింది అఖిల. “వీధిన పోయేవారందరికీ వైద్యం చేయించవలసిన అవసరం మనకేమిటి?”
దెబ్బతిన్న పక్షిలా చివాలున తలెత్తి కూతురి వంక చురుగ్గా చూసింది రేణుక. “అతను వీధిన పోయేవాడు కాదు. నీ కన్నతండ్రి!” అంది.
ఓ క్షణం స్తబ్ధుగా ఉండిపోయింది అఖిల. తన అనుమానం నిజమే అయింది. ఆ ఫోటోలో ఉన్నది- అమ్మ, నాన్న, తనూ!
“మనల్ని గాలికి వదిలేసి స్వార్థంతో చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయిన వ్యక్తి నాన్న ఎలా అవుతాడు? నాకు అమ్మ, నాన్న- నువ్వే!” ఆవేశంగా అంది అఖిల. “ఈరోజు క్యాన్సర్ తో బాధపడుతూ చూసేవాళ్ళు లేకపోవడంతో… మనం జ్ఞాపకం వచ్చామా!? అతనికి సిగ్గు లేకపోతే, నీ బుద్ధి ఏమయింది… అక్కున చేర్చుకుని ఆసుపత్రిలో చేర్పించావు!?”
“ఆపు!” అంటూ అరిచింది రేణుక. “అతను నీకు నాన్న కాకపోవచ్చును. కానీ, ఒకప్పటి నా భర్త! తప్పులు అందరూ చేస్తారు. ఆ తప్పు తెలుసుకుని తిరిగివచ్చిన వాణ్ణి, అవసానదశలో మనల్ని చూడాలన్న కాంక్షతో వచ్చిన అతన్ని, దయనీయమైన స్థితిలో ఉన్న అతన్ని… గాలికి వదిలేయడం నాకు చేతకాదు.” దుఃఖం ముంచుకురావడంతో చేతుల్లో ముఖం కప్పుకుంది.
“అది కాదమ్మా. అతని బాధ్యతారాహిత్యం వల్లే కదా మన జీవితాలు ఇలా రోడ్డున పడ్డాయి…”
“అఖిలా! స్త్రీని క్షమయా ధరిత్రి అని ఎందుకు అన్నారో తెలుసా? ఎలాంటి తప్పిదాన్నయినా క్షమించి ఆదరిస్తుందని. ఆడదాని మనసు మహాసముద్రం లాంటిది. సముద్రంలాగే స్త్రీ మనసు కూడా అగాథం. సంతోషం, విచారం, కష్టం, సుఖం, బాధ, కన్నీరు… అన్నిటినీ ఇముడ్చుకుని పైకి గంభీరంగా వుంటుంది…”
“అమ్మా!” బేలగా అంది అఖిల.
“ఒకప్పుడు అతను మనకు అన్యాయం చేసివుండవచ్చును. కానీ, ఇప్పుడు కష్టంలో ఉన్నాడు. కడచూపు కోసం వచ్చాడు…” కంఠం గద్గదమవుతూంటే, కన్నీటిధారలను చీరచెంగుతో తుడుచుకుంది ఆమె. “నీకంటే రాధాకృష్ణ నయం. ఎంత ఖర్చయినాసరే అతనికి వైద్యం చేయిద్దామంటూ, నాకు బాసటగా నిలిచాడు…”
అఖిల తల్లిని కౌగిలించుకుని భోరుమంది. “అమ్మా! నన్ను క్షమించు. నాన్న వెళ్ళిపోయాక నువ్వు పడ్డ బాధ, నన్ను పెంచి పెద్దచేయడానికి పడ్డ శ్రమా గుర్తుకు రావడంతో అలా అన్నాను”.
ఆప్యాయంగా కూతురి తల నిమిరింది రేణుక.
“పదమ్మా, ఆసుపత్రికి వెళ్ళి నాన్నను చూద్దాం,” అంటూ అఖిల అనడంతో, మెరిసే కన్నులతో కూతుర్ని ప్రేమగా హృదయానికి హత్తుకుంది రేణుక.
===============================================
సమాప్తం
===============================================
తిరుమలశ్రీ గారి కొన్ని ఇతర రచనలు:
తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.
''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."









Comments