top of page
Original.png

సముద్రం - పార్ట్ 1

ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.



Samudram - Part 1 - Telugu Emotional Story | Thirumalasri

సముద్రం - పార్ట్ 1 - తెలుగు భావోద్వేగ కథ | తిరుమలశ్రీ

Published In manatelugukathalu.com On 25/04/2026

అందమైన అమ్మాయి ఇంటి ఎదుట వారం రోజులుగా కూర్చున్న ఆ వ్యక్తి…

ఎవరో తెలుసా?

తిరుమలశ్రీ గారి సముద్రం మొదటి భాగం చదవండి.


అఖిల బెడ్ రూమ్ లోని కిటికీ తెరను తొలగించి బయటకు చూసింది. ఆ వ్యక్తి అక్కడే  ఉన్నాడు.


ఇంటి ఎదుటనున్న రోడ్డుకు ఆవలివైపు చెట్టుక్రింద కూర్చునివున్నాడు. యాభై పైనే ఉంటుంది వయసు. తెల్లగా నెరిసిన తైలసంస్కారం లేని జుత్తు, గుబురు గెడ్డం, పీక్కుపోయిన ముఖం, లోతుకుపోయిన కన్నులు, జీవంలేని చూపులు, శుష్కించిన దేహం, నలిగిన దుస్తులు… ఎవరో ‘బిచ్చగాడిలా’ ఉన్నాడు. వారం రోజులుగా అక్కడే ఉంటున్నాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినడం, లేకుంటే పస్తుపడుకోవడం చేస్తున్నట్టున్నాడు. ఎప్పుడు చూసినా ఆ చెట్టు క్రిందే ఉంటాడు.


సృష్టిలో మూగజీవాలకు సైతం ఓ ఆధారమంటూ వుంటుంది. పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. జంతువులు ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. వాటి తోడును అవే ఎంపిక చేసుకుంటాయి. కానీ, మనిషి మాత్రం గూడు, నీడ, తోడు కోసం వెదుక్కోవలసిన పరిస్థితి. ప్రతిఫలాన్ని ఆశించకుండా నీడనిచ్చే వృక్షాలు, సాటివారిని ఆదుకోవాలనుకోని మనుషుల కంటే నయం… అనుకుంది అఖిల.


ఉదయం యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడూ అతన్ని చూస్తూనే ఉంది. అతన్ని చూసినపుడల్లా అలాంటి ఆలోచనలే ఆమె మదిలో రేగుతుంటాయి… అయితే, చిత్రంగా అతని చూపులు తమ ఇంటివైపే ఉండడం, తనను చూసినప్పుడు అతని కన్నుల్లో తళుక్కుమనే మెరుపూ ఆమె దృష్టిని తప్పించుకోలేదు. ఒకటి రెండు సార్లు అతని దగ్గరకు వెళ్ళి డబ్బులు వేసింది. నోటును వెంటనే తీసుకోకుండా తనవంకే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోవడం గమనించేది.


ఆ రోజు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉంది అఖిల. ఎందుకో ఆ రోజంతా వీలయినపుడల్లా అతన్నే వీక్షించసాగింది. సాయంత్రం అతనివైపు చూస్తూన్న ఆమె, అతని చూపులు దీక్షగా తమ ఇంటిమీదే వుండడం గమనించింది. ఏమనుకుందో, గబగబా అతని దగ్గరకు వెళ్లింది. ఆమెను చూడడంతో అతని కన్నులు మెరిసాయి.


డబ్బులు వేయలేదు ఆమె. “ఎవరు నువ్వు? వారం రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. ఎక్కడికీ వెళ్లకుండా రోజంతా ఇక్కడే ఎందుకు కూర్చుంటున్నావు? నీ చూపులు మా ఇంటి మీదే ఉండడానికి కారణం ఏమిటి?” అంటూ నిలదీసింది.


కించిత్తు తడబడ్డాడు అతను. “అనాథనయిన నాకు ఈ చెట్టు ఆశ్రయం ఇస్తోందమ్మా…” అన్నాడు మెల్లగా. “నీకు ఎవరూ లేరా?”


శుష్కహాసం చేశాడతను. “ఉన్నారంటే ఉన్నారు, లేరంటే లేరు,” అన్నాడు సన్నగా కంపించే స్వరంతో.


అతని జవాబుకు చిత్రంగా చూసిందామె. “మా ఇంటి వైపే చూస్తుంటావు ఎందుకు?” 

సమాధానం ఇవ్వడం ఇష్టంలేదో ఏమో, పక్కకు తిరిగి తన సంచిని సర్దుకుంటున్నట్టు నటించాడు అతను. 


ఆమెకు కోపం వచ్చింది. “నీ జోలెను పక్కన పెట్టి, ముందు నా ప్రశ్నకు జవాబు ఇవ్వు,” అంటూ విసురుగా అతని సంచిని లాగింది. దాంతో అందులో ఉన్న వస్తువులు కింద పడిపోయాయి. ‘సారీ!’ అంది నొచ్చుకుంటూ.


‘పర్వాలేదమ్మా’ అంటూ అతను వాటిని తీసుకుని సంచిలో వేసుకుంటూంటే, ఓ చిన్న ఫోటోగ్రాఫ్ మీద ఆమె చూపులు పడ్డాయి. పాతది అది. చటుక్కున దాన్ని తీసి చూసి, “ఈ ఫోటో ఏమిటి? ఎవరు వీళ్ళు?” అని అడిగింది. అతను జవాబివ్వకుండా దాన్ని తీసుకోబోయాడు. ఆమె ఇవ్వకుండా దాని వంక పరీక్షగా చూసింది.


ఓ క్షణం నిశ్చేష్టురాలయింది ఆమె. తరువాత ఆ ఫోటో వంకా, అతని వంకా మార్చిమార్చి చూసింది. అనంతరం ఫోటోని అతనికి ఇవ్వకుండా, గిరుక్కున వెనక్కి తిరిగి విసవిసా నడచుకుంటూ ఇంటిముఖం పట్టింది.


తన గదిలో ప్రవేశించి, ఫోటోని విసిరికొట్టి, మంచంపైన అడ్డంగా బోర్లా పడిపోయింది.

*

రేణుక, రాధాకృష్ణ బయటినుండి వస్తూ ఎందుకో పెద్దగా నవ్వుకుంటూండడం చూసిన అఖిల పెదవులపైన సంతృప్తితో కూడిన చిరునవ్వు వెలసింది. తన ఆలోచన ఫలించిందన్న ఆనందం ఆమె డెందాన్ని నింపేసింది. ఆమె మదిలో గతం పినాకంలా పురి విప్పింది…

రేణుక, చలపతిని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. అందువల్ల స్వంత కుటుంబానికి దూరమయిపోయింది. చలపతి ఓ చిట్ ఫండ్ కంపెనీలో మేనేజరుగా పనిచేసేవాడు. భార్యను ప్రేమగానే చూసుకునేవాడు. అఖిల పుట్టింది వారికి. అయితే, ఆమె పదేళ్ళపిల్లగా ఉన్నప్పుడు చలపతి మరో యువతి ఆకర్షణలో పడిపోయాడు. ఓ దుర్దినాన తల్లినీ పిల్లనూ గాలికి వదిలేసి, ఆమెతో వెళ్ళిపోయాడు. 


దాంతో గొప్ప విభ్రాంతికి గురయింది రేణుక. తనవల్ల ఏం లోపం కలిగిందని అతను ఆ నిర్ణయం తీసుకున్నాడో ఆమె ఊహకు అందలేదు. తండ్రితో ఆడుకుంటూ అతనికి ఎంతో చేరికగా వుండే అఖిల, ‘నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఊరికెళ్ళాడా? ఎప్పుడొస్తాడు? నాన్న కావాలి!’ అంటూ ఏడుస్తూంటే, కూతుర్ని ఓదార్చడం ఎలాగో కూడా తెలియలేదు ఆమెకు. ఓ సాధారణ గృహిణి అయిన తాను ఆ పసిదాన్ని ఎలా పెంచి పెద్ద చేయాలా అన్న తలంపు మదిని కలచివేసింది.


రేణుక ఆ విభ్రాంతి నుండి కోలుకోవడానికి సుమారు ఏడాది పట్టింది. తాను దుఃఖంలోంచి బయటపడకపోతే చంటిది మరింత బెంబేలుపడిపోతుందని గ్రహించింది. కూతుర్ని తండ్రి తలపుల నుండి మరల్చి, చదువు ధ్యాసలో పడేలా చేయాలనీ, బాగా చదివించాలనీ, తండ్రి లోటు తెలియకుండా పెంచాలనీ ధ్యేయంగా పెట్టుకుందామె.


రేణుక డిగ్రీ చదువుకుంటూ ఉండగానే ప్రేమ పేరిట ఆమెను లేపుకువచ్చేశాడు చలపతి. అందువల్ల ఆమె చదువు మధ్యలోనే ఆగిపోయింది. తన చదువుకు తగినట్టుగా ఏ ఎలిమెంటరీ స్కూల్లోనో ఉపాధ్యాయినిగా ఉద్యోగం సంపాదించాలనుకుంది. కానీ, ప్రస్తుతం తాను ఉన్న మనఃస్థితిలో పసిపిల్లలకు చదువు చెప్పడం కష్టమనిపించింది.


స్నేహితుల సలహాతో కుట్టుమిషను నేర్పే ఓ మహిళాసంస్థలో చేరింది. ఓపక్క తరగతులకు వెళుతూ, మరోపక్క చంటిదాన్ని చూసుకుంటూ మూడునెలలపాటు స్త్రీల బట్టలు కుట్టడం నేర్చుకుంది. తరువాత ఆ సంస్థ సాయంతోనే కుట్టుమిషను ఒకటి వాయిదాల పద్ధతిలో తీసుకుంది. ఇంటివద్దనే ఆడవారి దుస్తులను కుట్టడం ఆరంభించింది.


ఆ విధంగా మూడేళ్ళు తిరిగేసరికి కుట్టుమిషను మీద సరిపడా ఆదాయాన్ని పొందుతూ, అఖిలను చదివించసాగింది రేణుక. అఖిలకూడా తెలివైనది కావడంతో శ్రద్ధగా చదువుకుని ఫస్టుమార్కులతో ప్రతి పరీక్షా పాసయ్యేది.


అయితే, కూతురికోసం పైకి మామూలుగా తిరిగినా, భర్త చేసిన ద్రోహంతో రేణుక మానసికంగా ఏర్పడిన ఒత్తిడిని పూర్తిగా అధిగమించలేకపోయింది. తెచ్చిపెట్టుకునే నవ్వే తప్ప, మనిషిలో మునుపటి ఉత్సాహం, సంతోషం మచ్చుకైనా కానరావడంలేదు. గుండెల్లో కలుక్కుమనిపించే బాధ. ప్రేమగా చూసుకునే కన్నవారిని కాదని అతనితో లేచి వచ్చేసినందుకు, తనకు తగిన శాస్తే జరిగిందన్న అపరాధభావన. ఎంత సరిపెట్టుకుందామన్నా, అతను చేసిన వంచననను ఆమె మనసు తట్టుకోలేకపోతోంది. బాధను మరచిపోయేందుకు రేయింబవళ్ళు యంత్రంలా పనిచేయసాగింది.


కాలం ఎవరికోసమూ ఆగదు. సుఖదుఃఖాలతో దానికి ప్రమేయం లేదు. చూస్తూండగానే కాలచక్రంలో పన్నెండేళ్లు దొర్లిపోయాయి… అఖిల ఇప్పుడు డిగ్రీ పాసయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది.


చలపతి యొక్క సహోద్యోగి అయిన రాధాకృష్ణ అతనికంటే ఓ ఏడాది చిన్నవాడు. వీధిన పడ్డ తల్లీకూతుళ్లను మొదట ఆదుకున్నది అతనే. చలపతి ఉన్నప్పుడు ఆ ఇంటికి వస్తూ పోతూ ఉన్నందున ఆ కుటుంబంతో చనువు ఏర్పడింది అతనికి. ఆర్థికసాయంతో సహా, తనవల్ల సాధ్యమైన సహకారం అందించాడు ఆ కుటుంబానికి. దురదృష్టవశాత్తూ సంతానం లేదు అతనికి. అందువల్ల అఖిల అంటే ప్రేమాభిమానాలు చూపించేవాడు. అతన్ని ‘బాబాయ్’ అని పిలుస్తుంది ఆమె… ఏడాది క్రితం రాధాకృష్ణ భార్య ఓ ప్రమాదంలో చనిపోయింది. దాంతో మనిషి కుదేలయిపోయాడు. నిర్వేదం క్రమ్ముకుంది అతన్ని.


తండ్రి వెళ్ళిపోయాక తల్లిలో వచ్చిన మార్పును గమనిస్తూనే ఉంది అఖిల. నవ్వుతూ హుషారుగా ఉండే తల్లి, గాలి తీసేసిన బుడగలా అయిపోవడం, ఎప్పుడూ పరధ్యానంగా ఉండడం, రాత్రులు నిద్రలో లేచి కూర్చుని దుఃఖించడం, వగైరాలను చూస్తూంటే భయం వేసేది ఆ పిల్లకు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంతగా తెలియలేదు. కానీ, పెద్దది అయ్యేకొద్దీ తల్లిని జాగ్రత్తగా గమనించసాగింది. ఆమె పడుతున్న మనోవ్యథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. తనకోసం తల్లి రేయింబవళ్లు యంత్రంలా పనిచేస్తూంటే బాధగా ఉండేది. తండ్రి మీద ఆగ్రహం కలిగేది. తాను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనీ, తల్లి కష్టాన్ని తీర్చాలనీ ఆలోచించేది.


ఒంటరితనం తల్లి మనోవ్యథను ఇనుమడింపజేస్తోంది అని గ్రహించింది అఖిల. చదువు పూర్తికాగానే తనకు పెళ్ళిచేసి పంపేయాలి అనుకుంటోంది తల్లి. అదే జరిగితే తాను ఒంటరిచెట్టులా మిగిలిపోతుంది. తల్లికి పెద్దగా వయసు అయిపోలేదు. ఇంకా నలభయ్ లలోనే ఉంది. ఆమెకు ఓ తోడు కావాలి. మనసుకు తగిలిన దెబ్బ మాసిపోవాలి. అప్పుడే మామూలు మనిషి అవుతుంది. మునుపటి సంతోషం ఆమె వదనంలో వెల్లివిరుస్తుంది.

కూతురి పలుకులు ఆలకించిన రేణుక నిశ్చేష్టురాలయింది. తేరుకుని, “నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? కూతురి పెళ్లి చేయవలసిన వయసులో నేను మళ్ళీ పెళ్లి చేసుకోనా? లోకం ముఖం మీద ఉమ్మివేస్తుంది. మతిలేని మాటలు మాట్లాడకు,” అంటూ కోపంతో కూతురి మీద విరుచుకుపడింది.


అఖిల వెనుకంజ వేయదలచుకోలేదు. తల్లిని ఎలాగైనా ఒప్పించితీరాలనుకుంది. “నా మాట కాదంటే నేనసలు పెళ్ళే చేసుకోను. నిన్ను ఒంటరిదాన్ని చేసి నా సుఖం నేను చూసుకోలేను,” అని తెగించి చెప్పేసింది. వారంరోజుల పాటు అలకలు, ఆగ్రహాలతో తల్లీకూతుళ్ళ నడుమ పెద్ద రాద్ధాంతమే జరిగింది. 


“రాధాకృష్ణ బాబాయి మంచి మనిషి. భార్య పోయాక ఒంటరివాడు అయిపోయాడు. అతనికి కూడా ఎవరూ లేరు. నీలాగే అతనికీ ఓ తోడు అవసరం. మనమంటే అభిమానం ఉన్నవాడు. నువ్వు ‘ఊఁ’ అంటే అతనితో మాట్లాడతాను,” అంది అఖిల. రేణుక జవాబివ్వకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. ఆ వూసెత్తితేనే హిస్టీరియా రోగిలా తనపైన అరిచి కేకలు వేసే తల్లి మౌనంగా వెళ్ళిపోవడంతో, మౌనం అర్థాంగీకారం అనుకున్న అఖిల, రాధాకృష్ణను కలుసుకుని మాట్లాడింది. లోకులు ఏమనుకుంటారోనని భయపడుతున్న అతన్ని ఒప్పించగలిగింది.


అఖిల సాక్షిసంతకం పెట్టగా రేణుక, రాధాకృష్ణలు భార్యాభర్తలు అయ్యారు. స్నేహితులు, పరిచయస్థులూ అఖిల చేసిన పనికి ప్రశంసించారు. అవసరానికి ఆదుకోకపోయినా, విమర్శలు గుప్పించేవారు ఎప్పుడూ ఉంటారు. వారిని పట్టించుకోవలసిన పనిలేదన్నది అఖిల మనస్తత్వం.


నెల్లాళ్ళు ఇట్టే గడచిపోయాయి. బాబాయి సమక్షంలో తల్లి సంతోషంతో నవ్వుతూ వుండడం అఖిలకు సంతృప్తి కలిగించింది. అతని సాంగత్యంలో ఆమె మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్న విశ్వాసం ఏర్పడింది.


అయితే, ఓసారి బయటకు వెళ్ళిన రాధాకృష్ణ, రేణుక చాలా రాత్రి తరువాత ఇంటికి తిరిగివచ్చారు. రాగానే తల్లిని చూస్తే ఏదో అనుమానం కలిగింది అఖిలకు. ముఖం జేవురించినట్టుగా వుంది. “ఎక్కడికి వెళ్ళారు? ఏమయింది?” అనడిగింది. ఇద్దరూ జవాబివ్వలేదు. మౌనంగా బెడ్ రూమ్ కి వెళ్ళిపోయారు.


రాధాకృష్ణ అఖిలతో చనువుగా ప్రవర్తించేవాడు, అభిమానంతో వ్యవహరించేవాడు. కానీ, అప్పుడప్పుడు తల్లిలో ఏదో మార్పు కనపడసాగింది అఖిలకు. ఓరోజు అర్థరాత్రివేళ గొడవ ఏదో వినిపించడంతో, నిద్రలోంచి తృళ్ళిపడి లేచింది అఖిల. అది తల్లి బెడ్ రూమ్ నుంచి వస్తున్నట్టు గ్రహించి గబగబా అక్కడికి వెళ్లింది. లోపలినుండి తల్లి ఏడ్పు, రాధాకృష్ణ గొంతుకా వినవస్తున్నాయి. అఖిల తలుపు కొట్టింది. ఏడ్పు, మాటలూ ఆగిపోయాయి. కొంతసేపటికి రాధాకృష్ణ తలుపు తెరిచాడు.


“ఏం జరిగింది?” అని అడిగింది అఖిల.


“ఏమీ లేదు. వెళ్ళి పడుకో,” అనేసి తలుపు మూసేసుకున్నాడు అతను. 


అఖిల అయోమయంలో పడిపోయింది. తెల్లవారాక తల్లిని అడిగిందామె, “బాబాయ్ మంచివాడు కాదా? నిన్ను హింసిస్తున్నాడా?” అని.


“చఛఁ, అలాంటిదేమీ లేదు. అతను మంచివాడు. నాకే ఏదో పీడకల రావడంతో…” అంటూ దాటవేసేసింది రేణుక.


ఇంకోరోజున అప్పుడే కాలేజీ నుంచి వచ్చి ముఖం కడుక్కుని తన గదిలో టీవీ పెడుతున్న అఖిలకు అకస్మాత్తుగా తల్లి ఏడ్పు వినవచ్చింది. అది బాత్రూమ్ లోంచి వస్తున్నట్టు గ్రహించి, వెళ్ళి తలుపు కొట్టింది. తల్లి తలుపు తెరిచింది. ఆమె చేతులకు గాయాలు, వాటి నుండి రక్తం కారుతోంది. కూతుర్ని చూసి ఏడ్పు ఆపి కళ్ళు తుడుచుకుంది రేణుక.


===============================================

ఇంకా వుంది..

సముద్రం - పార్ట్ 2/2 త్వరలో

===============================================

తిరుమలశ్రీ గారి కొన్ని ఇతర రచనలు:





తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page