top of page

సందేహం


'Sandeham' - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 22/10/2023

'సందేహం' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

సుబ్బారావుకీ, సుబ్బలక్ష్మికి పెళ్ళి అయి ముచ్చటగా మూడు రోజులైందో లేదో ఆషాఢ మాసం నేనున్నానంటూ వచ్చేసింది. అలా సుబ్బలక్ష్మికి పుట్టింటికి వెళ్ళక తప్పలేదు. సుబ్బారావు కూడా తమ కొత్త దంపతుల మధ్య అశనిపాతంలా ప్రవేశించిన ఆషాడమాసాన్ని తిట్టుకుంటూ భార్యని సాగనంపాడు. సుబ్బలక్ష్మికి కూడా ఈ విరహం భరించరానిదైంది. భర్తతో ఎన్నో కబుర్లు చెప్పాలన్న ఆమె కోరిక తీరలేదు. సుబ్బారావుకి కూడా కొత్త మోజు తీరలేదు. ఎంత త్వరగా ఈ ఆషాడం పోయి, శ్రావణ మాసం వస్తుందా అని ఇద్దరూ ఎదురు చూడసాగారు.


సుబ్బలక్ష్మికి ఈ మూడు రోజులూ భర్త తనని ఎంత అభిమానంగా చూసుకున్నా, అత్త మామలు ఆప్యాయత కురిపించినా, ఓ సందేహం మాత్రం తీరలేదు. భర్తని అడగాలని నోటి దాకా వచ్చినా బెరుకు వల్ల, కొత్తదనంవల్లా అడగలేకపోయింది. రోజూ రెండుపూట్లా సుబ్బారావు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా ఆమె అతన్ని అడిగే ధైర్యం చెయ్యలేకపోయింది.


ఆఖరికి కొత్త దంపతులకి ఎన్నో యుగాలనిపించిన ఆషాడం వెళ్ళనే వెళ్ళింది. ఎప్పుడెప్పుడు సుబ్బలక్ష్మి కాపురానికి వస్తుందా అని ఎదురు చూపులు చూసిన సుబ్బారావు కోరిక ఆ రోజు ఫలించింది. అటు శ్రావణ మాసం రాగానే, సాయంకాలం బండిలో వచ్చిన సుబ్బలక్ష్మిని చూడగానే అతనిలో ఉత్సాహం ఉరకలు వేసింది. సుబ్బలక్ష్మి అతని చూపుల్ని గ్రహించి సిగ్గుపడింది. ఆ రాత్రి కూడా ఆమె భర్తకి తన సందేహం తెలుపలేకపోయింది.


రెండు రోజుల తర్వాత, ఓ సాయంకాలం బజారుకెళ్ళి తిరిగి వచ్చిన సుబ్బారావు తన చేతిలో ఉన్న సంచీ తెరిచి, అందులోంచి ఓ అట్టపెట్టె తీసాడు. ఆ వస్తువువైపు కుతూహలంగా చూసిన సుబ్బలక్ష్మిని కళ్ళు మూసుకోమని చెప్పి ఓ వస్తువు ఆమె చేతిలో పెట్టాడు.


"రాబోయే శ్రావణ శుక్రవారం పూజకోసం నీకు కానుక తెచ్చానోయ్!" ప్రేమతో చెప్పాడు సుబ్బారావు. కళ్ళు తెరిచి చూసిన సుబ్బలక్ష్మి కళ్ళు మెరిసాయి. తన చేతిలో పెట్టిన ఆ బంగారు హారాన్ని తడిమి చూసుకుంది. ఐదు తులాల పైన ఉంటుందా హారం. పెళ్ళికి ముందు నగలషాపుకి వెళ్ళి ఆ హారం చూసి మోజుపడిన ఆమె, దాని ధర చూసి వెనకడుగువేసి కొనకుండా వచ్చేసిన ఉదంతం గుర్తుకు వచ్చింది ఆమెకి. ఆమె కళ్ళు చెమర్చాయి. తనకి బాగా నచ్చిన హారం కానుకగా ఇచ్చిన భర్తపై ఆమెకి అభిమానం పెరిగింది. తన మనసులో కోరిక అతనెలా గ్రహించాడన్న సందేహం కలిగిందామెకి.


"నీకీ హారం బాగా నచ్చిందని, అది కొనలేక, ఇంకో చిన్న హారం తీసుకున్నావని తెలిసింది. అందుకే ఈ శ్రావణమాసానికి నీకు కానుకగా కొని ఇవ్వాలనిపించింది." చెప్పాడు సుబ్బారావు.


తను తెలుపకుండానే, తన మనసులోని కోరిక తెలుసుకొని తీర్చిన అతనంటే ఆమె అబిమానం పెరిగింది. తన సందేహం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది సుబ్బలక్ష్మి. "పెళ్ళైన దగ్గరనుండి నన్నో సందేహం పీడిస్తోంది. మీరేమీ అనుకోనంటే ఓ విషయం మిమ్మల్ని అడుగుతాను." అంది.


"చెప్పు!" అన్నాడు ఆమె తలలోని మల్లెల సువాసన ఆఘ్రాణిస్తూ.


"మీ పెళ్ళి చూపుల్లో హెచ్చు కట్నం కోసం పట్టు పట్టారు. మా నాన్న మీరు కోరినంత కట్నం ఇవ్వలేరని నాకు తెలుసు. ఉన్నంతలో వైభవంగా పెళ్ళి జరిపించడం మినహా పెద్దగా కట్నం ఇచ్చుకొనే స్తోమత మాకు లేదని తెలుసు. మీరు నాకెంత నచ్చినా కట్నం కోసం పట్టుబటం నాకు అప్పట్లో చాలా కోపం తెప్పించిన మాట వాస్తవం. ఈ సంబంధం మరి కుదరదని మా నాన్న బెంగపెట్టుకొన్నారు. కానీ వారం రోజుల తర్వాత ఆశ్చర్యంగా మీరు కట్నం లేకుండా నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు వర్తమానం పంపేసరికి నేను చాలా ఆశ్చర్యపోయాను." అని ఆమె సుబ్బారావు వైపు చూసింది.


"అవును! నిజమే, అందాలరాశివైన నిన్ను వదులుకోవాలని అనిపించలేదు. అంతే!" అన్నాడు సుబ్బారావు.


"అది కాదు. మరి ముందు మీరెందుకు మేము ఇచ్చుకోలేనంత కట్నం కోసం పట్టుబట్టినట్లు, ఆ తర్వాతెందుకు కట్నం లేకుండా పెళ్ళి చేసుకున్నట్లు, నాకు అర్థం కాకుండా ఉంది. ఆ తర్వాత కట్నం కాదు కదా, కనీస లాంఛనాలు కోసం కూడా పట్టుబట్టకుండా మీరు పెళ్ళికి ఒప్పుకోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది." అందామె.


"ఓఁ...అదా! ఇవాళారేపూ కట్నం ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం అన్నది పరువు ప్రతిష్ఠలకి సంబంధించిన విషయమైపోయింది. నాకు తెలిసిన ఓ బంధువుల అమ్మాయి అయితే, తన అక్కకి పది లక్షల కట్నంతో పెళ్ళి జరిపించినందువలన, తన పెళ్ళికి కనీసం పదిహేను లక్షల కట్నమైనా ఇవ్వాలని పట్టుబట్టింది. అంతే కాదు, కట్నం పుచ్చుకోకుండా పెళ్ళి చేసుకుటానని చెప్తే ఏదో లోపం ఉందని భావిస్తారు అందరూ.


కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకోవాలన్న నా ఆదర్శం చాల రోజులవరకూ ఫలించలేదు. అందుకే, పెళ్ళి చూపుల్లో ఎక్కువ కట్నానికి పట్టుబట్టేవాణ్ణి. పదిలక్షలు కట్నం అడిగేతే, ఇంతేనా నీ విలువ అని చిన్నచూపు చూసిన వాళ్ళూ లేకపోలేదు. ఎలాగైనా కట్నం ఇచ్చి పెళ్ళి జరిపించాలని ఆశతో ఉన్నవాళ్ళకి అమ్ముడుపోవడం నాకు ఇష్టం లేదు. అయితే మీ నాన్నగారెప్పుడు కట్నం ఇచ్చుకోలేనని, ఉన్నంతలో ఘనంగా చేస్తానని చెప్పారో, అప్పుడే ఈ సుబ్బలక్ష్మి నాకు బాగా నచ్చి ఈ రోజు నాదైంది." అన్నాడు చిలిపిగా ఆమె బుగ్గ గిల్లుతూ.


"ఛీ...పొండి!" అంది సిగ్గుతో మొగ్గలైన సుబ్బలక్ష్మి తన సందేహం తీరగా.

***

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


64 views0 comments
bottom of page