సందేహాస్పదం

Sandehaspadham- Telugu Moral Story | Bhattu Venkata Rao
సందేహాస్పదం - తెలుగు నీతి కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 11/09/2026
“సందేహాస్పదం” భట్టు వెంకటరావు రచించిన ఆసక్తికరమైన తెలుగు నీతి కథ. ఈ కథలో ఆకలితో ఉన్న పులి, తనను వేటాడేందుకు వచ్చిన తెలివైన పంచవన్నెల జింకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే జింక తన పరుగు సామర్థ్యంతోనే కాదు, సమయస్ఫూర్తి, తెలివితేటలు, మానసిక వ్యూహంతో కూడా పులిని ఓడిస్తుంది.
సందేహం మనిషి బలాన్ని సగానికి తగ్గిస్తుంది. ఒక్కో సందర్భంలో పూర్తిగా బలహీనుడిని కూడా చేస్తుంది. ఆ కారణం చేత, సందేహంలో చిక్కుకున్న మనిషి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఎంత బలవంతుడైనప్పటికీ, ధైర్యవంతుడైనప్పటికీ, చేతలుడిగి, ఉన్న చోటనే ఆగిపోయి అయోమయంగా దిక్కులు చూస్తూ ఉండిపోతాడు. అటువంటి సందేహాన్ని ఆయుధంగా ప్రయోగించి, తనను తాను ప్రాణ సంకటంలోంచి బయటపడేసుకుంది ఒక తెలివైన జింక!
పూర్వం, ఒక అడవిలో ఒక పులి ఉండేది. దానికి ఒక రోజు బాగా ఆకలేసి, ఎలాగైనా ఒక పసందైన జింకను వేటాడి పట్టుకుని ఆరగించి, ఆకలి తీర్చుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే వేటకు బయలుదేరింది. అలా బయలుదేరి వెదుకుతున్న పులికి, దగ్గరలోనే ఒక జింకల గుంపు కనిపించింది. ఆ గుంపులో ఒక ముచ్చటగొలిపే పంచవన్నెల జింక ఉండడం ఆ పులి కళ్ళలో పడింది. అది చాలా వింతగా, చూసేవాళ్ళకు ఆశ్చర్యం కలిగేలా ఆకర్షణీయంగా మెరుస్తూ ఉంది. ఆ ఆశ్చర్యంలో, ఆ పంచవన్నెల జింకనే ఆ రోజుకి తన ఆహారంగా ఎంచుకుని, దాని పైకి లంఘించింది పులి.
పులి సంగతి పసిగట్టిన జింకలు, పరుగుకు లంకించుకున్నాయి. పులి చూపు పంచవన్నెల జింక మీద ఉంది కాబట్టి, గుంపులో మిగతా జింకలన్నింటినీ విడిచిపెట్టి, ఆ పంచవన్నెల జింకను తరిమింది పులి. పులి కర్మగాలి ఆ పంచవన్నెల జింకకు అందమే కాకుండా, అందానికి మించిన పదింతల పరుగు సామర్థ్యం కూడా ఉంది. పులికి చిక్కకుండా, దానిని పరుగెత్తించి పరుగెత్తించి, ఒక చోట నీళ్ళు లేని ఒక పాడుపడిన బావిలో పడిపోయేలా చేసింది. ఆకలి మీదున్న పులికి జింక దొరకకపోవడం అటుంచి, అలా పాడుబడ్డ బావిలో పడడం చాలా అవమానంగా తోచింది. తప్పెక్కడ జరిగిందో దానికి అర్థం కాలేదు. దాన్నలా ఉంచితే, ‘అప్పుడు ఆ బావిలోంచి బయటపడడం ఎలాగ?’ అనేది అసలు సమస్య అయింది. పాడుబడిన బావి గోడలను పట్టుకుని పాకి, పైకి రావాలనే ప్రయత్నం చేసింది పులి. కాని, దాని బరువుకి అదే జారి, మళ్ళీ బావిలోనే పడి దెబ్బలు తగిలించుకుంది. ‘జీవితం ఇక్కడితో ముగిసినట్లేనా?’ అని దీనంగా ఆలోచిస్తూ కూర్చుంది.
అలా, నిస్సహాయంగా బావిలోంచి పైకి చూస్తూ కూర్చున్న పులికి, గట్టు మీది పంచవన్నెల జింక మళ్ళీ దర్శనమిచ్చింది. గట్టు మీద కులాసాగా కూర్చుని ఉన్న ఆ జింకను చూడగానే పులికి భగ్గున ఒళ్ళు మండింది. కాని చేయగలిగిందేమీ లేక, కోపాన్ని తనలోనే అణుచుకుని, దీనం నిండిన చూపులతో చూస్తూ కూర్చుంది. పులి స్థితికి జింకకు జాలేసింది.
"పైకొచ్చాక నన్నేమీ చెయ్యనంటే, నీకొక ఉపాయం చెబుతాను. ఈ బావి సంగతి నాకు బాగా తెలుసు!" అంది పులితో, జింక.
"ఏంచెయ్యనులే... చెప్పు!" అంది పులి.
"నువ్వు కూర్చునున్న చోటికి పక్కన, కొంచెం పరిశీలనగా చూస్తే, ఒక సొరంగమార్గం కనపడుతుంది. అందులోంచి పాక్కుంటూ పైకొచ్చెయ్యొచ్చు!" అంది జింక.
జింక చెప్పినట్లుగానే చేసింది పులి. సన్నని సొరంగమార్గం కనపడగా, అందులోంచి పాక్కుంటూ పైకొచ్చింది. పైన, బావికి కొంచెం దూరంలో చెట్ల మధ్యకు వచ్చి చేరింది పులి. ‘బ్రతుకు జీవుడా!’ అనుకుంటూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని, ఒక్కసారి చుట్టూ కలియ చూసింది. కొంచెం దూరంలో బావి గట్టు మీద, తాను ఇష్టపడి తినాలనుకున్న పంచవన్నెల జింక ఏ భయమూ లేకుండా కూర్చుని ఉండి కనిపించింది. మంచి ఆకలి మీద ఉన్న కారణంగా, మళ్ళీ నోరు ఊరింది పులికి. కానీ ‘ప్రాణం కాపాడుకునే మార్గం చెప్పిన దానిని పట్టి తినడం ఎలాగ?’ అనే ధర్మసంకటం పులి మనసును పట్టి వేధించింది.
"నీకా సందేహం అక్కర లేదు. ధర్మం అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే నీ ఆకలి తీరదు. నేనేమీ అనుకోను. నీకు చేతనైతే నన్ను పట్టుకుని తిని ఆకలి తీర్చుకో!" అని అరిచి చెప్పింది, కులాసాగా కూర్చుని ఉన్న జింక.
జింక పొగరుమోతు మాటలకు పులికి కోపం వచ్చింది. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని, తనలోని బలం అంతా కూడగట్టుకుని రెండు అంగలు ముందుకేసి జింక మీదకు లంఘించింది. అయితే పులి ఊహించని విధంగా, చూస్తూ చూస్తుండగానే జింక తెలివిగా బావిలోకి దూకింది. అది చూసిన పులి ఆలోచనలో పడింది.
"పరవాలేదు. నువ్వూ దూకు. ఇది ఆ బావి కాదు. వేరే బావి. ఇందులో సొరంగమార్గం లేదు. ఇక్కడి నుండి నేను తప్పించుకోలేను. నీకు చిక్కడం తప్ప నాకు వేరే మార్గం లేదు!" అని పులిని ఊరించింది జింక.
జింక తనను అలా ఊరించడంలో ఏదో ఆపద దాక్కుని ఉందన్న సందేహంలో పడింది పులి. ఆకలి సంగతి మరిచిపోయి బావిలోకి పరిశీలనగా చూస్తూ గట్టు మీదనే ఉండిపోయింది తప్ప, బావిలోకి దూకే ధైర్యం చేయలేకపోయింది. ఈసారి బావిలోకి దూకితే తన మరణం ఖాయం అవుతుందేమో అన్న సందేహంలో అది పడింది.
పులిని అలా సందేహం అనే కూపంలో పడేసి, బావిలో ఉన్న సొరంగ మార్గం గుండా తాను బయటపడి, పులి చూస్తుండగానే దగ్గరలో చెట్ల చాటుకు వెళ్ళిపోయి మాయమైపోయింది తెలివైన జింక.
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.





Comments