top of page
Original.png

సంతకం

Jul 26
3 min read

Updated: Aug 1

సంతకం, కుటుంబ కథ, తండ్రి కొడుకు అనుబంధం, భావోద్వేగ కథ, జీవన పాఠాలు, తెలుగు కథ, చైతన్య ఎం వి, పశ్చాత్తాపం

పాత తప్పులను గుర్తుచేసుకుంటూ, కుటుంబ ప్రేమలో జీవితానికి కొత్త అర్థం కనుగొన్న వీరయ్య భావోద్వేగ దృశ్యం

Santhakam - Telugu Emotional Family Story | Chaithanya M. V.

సంతకంతెలుగు భావోద్వేగ కుటుంబ కథ | చైతన్య ఎం. వి.

Published in manatelugukathalu.com on 26/07/2026


మనిషి జీవితంలో కొన్ని సంతకాలు కేవలం కాగితాల మీద మాత్రమే ఉండవు... అవి కుటుంబాల భవిష్యత్తును కూడా మార్చేస్తాయి. అజ్ఞానం, చెడు అలవాట్లు, తప్పుడు నిర్ణయాలతో జీవితాన్ని కోల్పోయిన ఒక తండ్రి... వృద్ధాప్యంలో తన పిల్లల ప్రేమలో నిజమైన విజయాన్ని ఎలా కనుగొన్నాడో హృదయాన్ని కదిలించేలా చెప్పే కథే "సంతకం". తప్పిదాలు, పశ్చాత్తాపం, క్షమ, కుటుంబ బంధాల విలువలను ఆలోచింపజేసే భావోద్వేగ కథ.


“మే నెలలో మిట్ట మధ్యాహ్నం. మండుటెండ. 

ఉన్నది మర్రి చెట్టు కింద ఐనా కూడా ఆగని ఉక్కపోత. 

చెమటకు తడిసిపోయిన చొక్కా. 

చుట్టూ ఇరవై మంది జనం. 

చేతిలో Reynolds పెన్ను. పెన్ను కు ముక్క వైపు సంతకం పెట్టాల్సిన కాగితం. చేయీ వొణుకుతోంది. 


బలాన్ని కూడగట్టుకుని బ్రొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు పెన్ను ని తన ముందున్న పేపరు వైపు తోసాయి. 

సంతకం పెట్టిన తర్వాత పరిణామాల, పర్యవసానాలు తెలియవు. కానీ సంతకం పెట్టటం మాత్రం విధిలిఖితమ్. 

కారణం, ఆ సంతకం విలువ రెండు నిండు ప్రాణాలు. 

సంతకం పెట్టేసి, కాపాడిన ప్రాణాలను చంకనెత్తుకుని అక్కడ నుండి వెళ్లి పోయాను. 


ఇరవై ఏళ్ళు గడిచాయి……………………….” 


సాయంత్రం ట్యూషన్ కు వెళ్లే సమయం అవుతున్నా మర్చిపోయి, ఏమి జరగబోతోంది అన్న కుతూహలంతో ఎనిమిది సంవత్సరాల బంటి, తన తాత చెబుతున్న తన అనుభవాన్ని వింటున్నాడు. 


ఇంతలో బంటి వాళ్ళ నాన్న శేఖర్ అటు వైపు వచ్చాడు. తన కొడుకు బంటి కళ్ళలో కుతూహలం, తన నాన్న వీరయ్య ముఖంలో ఎదో సాధించిన భావన చూసి, వీరయ్య బంటి కి ఏమి చెప్పి ఉంటాడో శేఖర్ గ్రహించాడు. 


శేఖర్ కు కోపం వచ్చింది. 

“నీయవ్వ, మళ్ళీ అదే కథా?”


“పేకాటలో పొలం దొబెట్టి, ఒక సంతకం. తాగుడికి సర్పంచ్ దగ్గర డబ్బు తెచ్చి ఇంకో సంతకం. కోళ్ల పందెంతో నీ దిశ తిరుగుద్ది అని ఎవడో చెప్తే మళ్ళీ ఒక సంతకం. 

చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు, "ఆ సంతకం విలువ, రెండు నిండు ప్రాణాలు" అని ఎర్రి కూతలు. ఆ కోళ్లు, పందెం లో వోడి పోయి పక్కోడి ప్లేట్ లో పకోడీ ఐపోయాయి. 


నేను, అక్కా బడికెళ్లి సదువు నేర్చుకుంటే, "నాకు సదువు రాదు, సంతకం ఎలా పెట్టాలో నేర్పించండిరా" అని, సంతకం నేర్పించాక, కనిపించిన ప్రతి నీలం రంగు పేపర్ పైన సంతకం పెట్టి, కుటుంబాన్ని రోడ్డు పైకి తెచ్చావ్. 


ఏదో అదృష్టం బాగుండి అక్క బాగా చదివి, ఉద్యోగం చేసి, పోగొట్టుకున్న పొలంలో రెండు ఎకరాలు తిరిగి కొనింది. 

"రేయ్, పో వెళ్లి ట్యూషన్ కి రెడీ అవు" అనగానే బంటి గాడు ఇంట్లోకి వెళ్ళాడు. 


ఇక్కడుంటే బాగోదని, "నేను పొలం దాక వెళ్లొస్తా" అన్నాడు వీరయ్య. శేఖర్ ఏమి పలకలేదు. వీరయ్య అక్కడ నుండి సర్దుకున్నాడు. 


ఆ రోజు తాను సంతకం పెట్టిన Reynolds పెన్ను ఇంకా తన దగ్గరే ఉంది. కాలం గడిచి తెల్ల రంగు పెన్ను కాస్తా పసుపు రంగులోకి మారింది. ఒకటి రెండు సార్లు కొత్త రీఫిల్ మార్చాడు కానీ ఆ పెన్ను వాడే అవసరం లేకపోవంతో అందులో ఇంకు గడ్డ కట్టుకుపోయింది. బంటి గాడు నోట్లో పెట్టుకుని కొరకటంతో క్యాప్ కొంచం నలిగింది. 


అంతా పోగొట్టావు అంటాడు ఏంటి వీడు, అనుకుని ఆ రోజు పొలం అమ్మిన సర్పంచ్ దగ్గర తీసుకున్నRay-Ban original చలవ కళ్లద్దాలు, తన లాగు జేబులోనుండి బయటకు తీసాడు వీరయ్య. 


చలవ కళ్లద్దాలు పాతవి ఐపోయాయి. ఒక వైపు అద్దం పక్కన స్క్రూ లేదు. దారం తో కట్టివుంది. అంచుల చుట్టూ వుండిన gold కలర్ కవరింగ్, కాలంతో పోటీపడి ఓడిపోయి, ఊడిపోయింది. 

చొక్కా అంచుతో అద్దాలు తుడుస్తూ…. 


అంతా పోగొట్టాను అంటాడు ఏంటి నా కొడుకు. పోలీసు ఉద్యోగం లో చేరిన పది సంవత్సరాలలో 12 సార్లు ట్రాన్సఫర్ అయింది నా కూతురు. 3 సార్లు ప్రమోషన్ తీసుకుంది. చదువు అబ్బలేదని, ఫీజు రూపంలో డబ్బులు వృధా చేయకుండా, 10 వ తరగతిలోనే చదువు మానేసి, వాడికి చేత అయిన పని చేసుకుంటూ, మగాడు అనే అహం లేకుండా తన అక్క మాట వింటూ కుటుంబాన్ని ఒక గాడిలో పెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు నా కొడుకు. 


నా మొహం పైన అరిచినా కూడా, రోజూ బయటకు వెళ్లే ముందు చాటుగా తన భార్యకు చెప్పే మాట ఒకటే "నాన్నకు ఎక్కువ పని చెప్పకు, అడిగింది వొండి పెట్టు", అని. ఈ వయసులో ఇంత కంటే ఎం సాదించాలి నేను. 


నా పెళ్ళాం చనిపోయాక, వయసు కారణంగానో, చెడు స్నేహాల కారణంగానో ఆస్తి పోగొట్టానే గాని, ఏనాడూ ఇంకో ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు, మళ్ళీ పెళ్లి చేసుకోనూలేదు. 


నా పిల్లలకు అన్యాయం ఐతే చేశాను, ఆ విషయంలో సమర్దించు కోలేను. కానీ ఈ వయసులో, నేను బ్రతికే ఇంకో 5 లేదా 10 సంవత్సరాలు గతాన్ని తలుచుకుని ఆరోగ్యం పాడు చేసుకుని, పిల్లలకు భారం కదలచుకోలేదు, అందుకే నవ్వుతూ ఇలాగే గడిపేస్తా... 


గర్వంగా చలవ కళ్లద్దాలు పెట్టుకుని, దర్జాగా పొలం వైపు వెళ్తున్నాడు వీరయ్య. ఎదురుగా పరిగెత్తుతూ వస్తున్న పిల్లాడొకడు పరిగెత్తుకుంటూ వచ్చి వీరయ్య గుద్దాడు. బలంగా వున్న వీరయ్య దాటికి, పిల్లాడే వెళ్లి వీరయ్య వెనుక వైపు గా కింద పడ్డాడు. 


వీరయ్య వెనక్కి తిరిగి చూసాడు. కిందపడ్డ పిల్లాడి దగ్గరకు పరిగెత్తుతూ వెళ్లి వాడిని లేపి, మోకాళ్లకు మట్టి తుడిచాడు. ఆ పిల్లాడు ఏడుపు మొహం పెట్టాడు. వెంటనే వీరయ్య "మా పొలం దాక వెళ్దాం పద, మామిడి పండ్లు ఇస్తాను. వచ్చేప్పుడు మీ ఇంటి దగ్గర దిగబెడతాను" అన్నాడు. పిల్లాడి మొహంలో ఏడుపు పోయి

చిన్న నవ్వు వచ్చింది. 


వీరయ్య ఆ పిల్లాడి భుజం పైన చేయీ వేసి నడుస్తూ వెళుతూ, పిల్లాడి వైపు చూసి, "ఒరే బుడ్డోడా, 

మే నెలలో మిట్ట మధ్యాహ్నం, మండుటెండ. 

ఉన్నది మర్రి చెట్టు కింద ఐనా కూడా ఆగని………………………. ”


 ********* 

చైతన్య ఎం. వి. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



Chaithanya M. V.

నా పేరు "చైతన్య ఏం. వి". చిన్నతనం నుండి కథలు, పుస్తకాలు చదవడం, కథలు రాయడం నా అభిరుచి. వృత్తిపరంగా కార్పొరేట్ కంపెనీ లో పనిచేస్తున్నప్పటికీ, రచనలపై ఇష్టంతో కథలు రాయడం, నా స్నేహితలు, దగ్గరివాళ్లతో పంచుకోవటం నా వ్యాపకం. నా ఆలోచనలకు కథల రూపం ఇచ్చి, తెలుగు పాఠకులతో పంచుకోవడమే "నా లక్ష్యం".




5 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 1 out of 5 stars.

మక్కికి మక్కీ దించేసాడు...

Like

Rated 1 out of 5 stars.

When a author write a story with pure soul it wil connect thie audience... But as a known person of this author.. it's Hard to connect... Because of his arrogant, egoistic nature... This story looks purely fabricated..

Like

Rated 4 out of 5 stars.

బాగుంది

Like

Rated 5 out of 5 stars.

Nice story. Emotional

Like

Rated 5 out of 5 stars.

Chala bagavundi

Like
bottom of page