సార్థకత
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- 2 days ago
- 4 min read
#Sarthakatha, #సార్థకత, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Sarthakatha - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 09/12/2025
సార్థకత - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
సృష్టిలో అనేక జీవరాశులు ఆ దైవ సృష్టి. అందులో మన మానవ జన్మ మహోన్నతం. జీవిత విధానాన్ని సాగించేటందుకు రెండు విధానాలు ఎలాగోలా బ్రతకడం... ఇలాగే బ్రతకడం... వారి వారి ఇష్టాలు వారివి. ఒకరి మాటలు మరొకరికి రుచించవుగా!....
కారణం తనకు తెలియనిదంటూ లేదనే అహంకారం. పర్యవసానం... ఆలోచనలకు తగిన రీతైన ఫలితాలు. అవి ఆనందం లెస్!.... లార్డ్ లెస్?.... అది మధ్యతరగతి గ్రామం. ఆ వీధిలో వరుసగా మూడు గృహాలు. మొదటి ఇంటి యజమాని రంగారావు. సౌమ్యుడు. వారి అర్థాంగి కాంతమ్మగారు. ఇతరుల పురాణాలను విని పదిమందికి చెప్పి ఆనందించడం కాంతమ్మకు అలవాటు.
రెండవ ఇంటి యజమాని జానకిరామయ్య. హైస్కూలు టీచర్. వారి సతీమణి నిర్మల. సాత్వికురాలు. దైవభక్తి. పేదల పట్ల ఆదరాభిమానాలు కలవారు. మూడవ ఇంటి మగవారు భజగోవిందం, వారి ఇల్లాలు సౌదామిని. పాత బి.ఏ డాంబికాలు అధికం. కాంతమ్మకు ఒక కూతురు పల్లవి. నిర్మలకు ఒక కొడుకు ఆదిత్య, చిన్న బిడ్డ కూతురు పేరు సుజన. సౌదామిని గ్రామ సర్పంచి. కూతురు మానస, కొడుకు చక్రవర్తి. పల్లవి, సుజన, మానస దాదాపు ఒకే వయస్సువారు. ఆదిత్య, చక్రవర్తి ఒకే వయస్సు వారు. వారందరూ ఒకే స్కూలు, కాలేజీలో చదువుకొన్నవారు. మంచి స్నేహితులు.
రంగారావు వ్యవసాయదారుడు. భజగోవిందం గుడ్డల వ్యాపారి. ఆడవారు ముగ్గురూ, కాంతమ్మ, నిర్మల, సౌదామిని. ఇరుగు పొరుగు వారైనందున మంచి స్నేహితులు. అలాగే ముగ్గురు మగవారు మంచి హితులు. నిర్మలకు, కాంతమ్మకు, సౌదామిని తత్త్వాల్లో వ్యత్యాసం. బి.ఏ పాసైన తరువాత పల్లవి వివాహం జరిగింది. తన మేనమామ కొడుకు చంద్రంతో. అతను సివిల్ ఇంజనీర్. ఆరునెలల తరువాత మానస వివాహం దూరపు బంధువుల అబ్బాయి పాండురంగతో ఘనంగా జరిగింది. అతను పశువుల డాక్టర్. పల్లవి, మానసలు కాపరానికి వెళ్ళిపోయారు. సుగుణ ఎం.ఎ లో చేరింది. గోల్డ్ మెడల్తో పాసైంది. జానకిరామయ్య సోదరి అనసూయ, భర్త రామారావు సబ్ ఇన్సస్పెక్టర్. ఒక కొడుకు భాస్కరరావు. కూతురు అమృత.
అనసూయ అంటే నిర్మలకు ఎంతో అభిమానం. ఆమె ఆ ఇంటికి కాపరానికి వచ్చిన నాలుగు సంవత్సరాలకు అనసూయ వివాహం జరిగింది. అంతవరకూ తనకు సంతానం లేనందున నిర్మల, అనసూయను సొంత చెల్లెలిగా, కూతురుగా ఎంతో ప్రేమాభిమానాలతో చూచుకొనేది. అనసూయకు కూడా నిర్మల పట్ల ఎంతో గౌరవం, అభిమానం. వివాహం అయ్యి అత్తగారి ఇంటికి బయలుదేరిన అనసూయను నిర్మల హృదయానికి హత్తుకొని కన్నీళ్ళు పెట్టుకొంది. "నాకు ఎంతో సాయంగా వున్నదానివి. అనూ, నీవు నన్ను వదలి వెళ్ళిపోతున్నావు.
ఇకపై నేను ఒంటరిదానిని" విచారంగా పలికింది నిర్మల.
"వదినా!.... నీవు చాలా చాలా మంచిదానివమ్మా. నన్ను సాకావు. నీవు త్వరలో నెల తప్పుతావు. నీకు మగబిడ్డ పుడతాడు. నేను ఆడపిల్లను కంటాను. నీ కొడుకు నాకు అల్లుడు కాబోతాడు. మన మన జీవితాంతం ఇలాగే ప్రేమాభిమానాలతో కలిసి వుంటాము వదినా!...." అంది బొంగురుపోయిన కంఠంతో అనసూయ.
ఒకరికొకరు కన్నీళ్ళు తుడుచుకొన్నారు. అనసూయ అత్తవారింటికి కాపురానికి వెళ్ళిపోయింది.
***
బాలవాక్యం బ్రహ్మవాక్కు అన్నట్లు నిర్మల నెల తప్పింది. ఆ దంపతులిరువురికీ పరమానందం. నిర్మలకు నవమాసాలు నిండాయి. ఒకరోజు సూర్యభగవానుడు తూర్పు దిశన వుదయించే సమయాన నిర్మల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఆలుగమల ఆనందానికి అవధులు లేవు. ఆ బిడ్డకు ఆదిత్య అని పేరు పెట్టారు. రెండు సంవత్సరాల తర్వాత ఆడపిల్లను కన్నది అనసూయ. బాలసారకు వచ్చిన నిర్మలతో "వదినా!... నీవు నా మాట ప్రకారమే కొడుకును కన్నావు. నేను నా మాట ప్రకారం కూతురుని కంటాను. నేనూ నెల తప్పాను. నీకు కోడలిని ఇస్తాను" నవ్వుతూ చెప్పింది అనసూయ.
ఆ వదిన మరదళ్ళు ఆనందంగా నవ్వుకొన్నారు. అనసూయకు నవమాసాలు నిండాయి. శుభముహూర్తాన ఆడ శిశువుకు, తాను కోరుకొన్న విధంగానే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికకు అమృత అని నామకరణం చేశారు.
★ ★
కాల ప్రవాహంలో పాతిక సంవత్సరాలు జరిగి పోయాయి. అప్పటికి ఆదిత్య వయస్సు పాతిక సంవత్సరాలు. డాక్టర్ అయ్యాడు. ఆదిత్య తల్లితండ్రుల వలే సౌమ్యుడు. సహనశీలుడు. అనసూయ కూతురు అమృత అంతా తండ్రి పోలిక. సహనం శూన్యం. ఆవేశం అధికం. బి.టెక్ గోల్డ్ మెడలిస్టు. ఎంతో గర్వం.
వారి పుట్టిన సమయంలో నిర్మలా, అనసూయలు అనుకొన్న రీతిగా వారి వివాహాన్ని ఎంతో ఘనంగా చేశారు. అమృత అత్తగారింట కాలుబెట్టింది. నిర్మల కోడలిని ఎంతో ప్రీతిగా చూచుకొనేది. భర్త ఆదిత్యకు ఇల్లాలు నిర్మల అంటే పంచ ప్రాణాలు. కానీ... అమృతకు అత్తగారి తత్వం, పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు నచ్చలేదు. అకారణంగా అత్తమాటలను తిరస్కరించేది.
ఆ మాటలను విన్న ఆదిత్య భార్య ని సున్నితంగా మందలించి నచ్చచెప్పేవాడు. ఇరుగు పొరుగమ్మలు కాంతమ్మ, సౌదామినీలు వారి కూతుళ్ళ కథలను మరచి అమృతకు ఎక్కించేవారు. ఆకారణంగా అమృత, నిర్మలకు పూర్తిగా వ్యతిరేకిగా మారిపోయింది.
కాంతమ్మ కూతురు పల్లవి కథ: వివాహం అయిన ఆరునెలల్లోపలే భర్త తత్వం నచ్చక తన మాజీ ప్రియుడు కాంతారావుతో లేచిపోయింది పల్లవి.
సౌదామిని కూతురు మానస కథ: అత్తగారి ఇంటి పద్ధతులను పాటించకుండా, ఆ ఇంటి సభ్యులను, భర్తను గౌరవించకుండ విడాకులకు అప్లై చేసి అమ్మ సౌదామిని (సర్పంచి) ఇంటికి వచ్చి చేరింది మానస. అమృత భావాలకు వారిరువురు ఆదర్శవాదులుగా నిలిచారు.
తన తల్లికి ఫోన్ చేసి అమృత..... "అమ్మా!... నేను ఈ ఇంట వుండలేను. నా మొగుడికి రోగులు తప్ప నేను అవసరం లేదు. నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఆదిత్యకు విడాకులు ఇస్తాను" అంది.
అమృత మాటలకు అనసూయ ఆశ్చర్యపోయింది. "నేను అక్కడికి, అంటే నా అన్నావదినల, నా యింట వస్తున్నా. నీతో నేరుగా మాట్లాడి నీ సమస్యను పరిష్కరిస్తాను" ఫోన్ కట్ చేసింది అనసూయ. చెప్పిన మాట ప్రకారం మరుదినం అనసూయ ఆ వూరికి వచ్చింది.
★ ★ ★
అనసూయను చూచి అన్న జానకి రామయ్య వదిన నిర్మల పరమానందంగా స్వాగతం పలికారు. భోజనాలు ముగిశాయి. సమయం రాత్రి తొమ్మిది గంటలు. అర్జెంట్ ఆపరేషన్ విషయం. ఆదిత్య హాస్పిటల్కు వెళ్ళిపోయాడు. అనసూయ, అమృత గదిలో చేరారు. తన కష్టాలనన్నింటినీ అమృత తల్లికి చెప్పింది. అంతా విన్న తరువాత అనసూయ.... "అంతా చెప్పడం అయిందా!... ఇంకా ఏమైనా వుందా?" అడిగింది.
'లేదు' అన్నట్లు తలాడించింది అమృత.
"అమృ!.... నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. నా అన్నా, వదినలు నా దైవసమానులు. మీ నాన్నకు పూజనీయులు. ఈ మామన ఇంటికి అటువైపు, ఇటువైపు వున్న కాంతమ్మ పోరుపడలేక
భర్త విషం తాగి చచ్చాడు. ఆమె కూతురు పల్లవి అత్తగారి ఇల్లు, భర్త నచ్చక ఎవరితోనో లేచిపోయింది. సౌదామినీ కూతురు భర్తకు విడాకులు ఇచ్చి పుట్టింటికి చేరింది. వారు నా దృష్టిలో హీనచరుతులు. మగవాడు తప్పు చేస్తే తప్పించుకోగలడు. ఆడది తప్పు చేస్తే కళంకిణిగా పిలువబడుతుంది. తప్పించుకోలేదు. నా వదిన, అన్న, అల్లుడు మహోన్నతులు. వారిని అర్థం చేసుకొని, వారిని అనుసరించి నీవు నీ లక్ష్యాలను, నీ జీవితాన్ని ఈ నా పుట్టికి తగినట్లు నడుచుకోవాలి. ఎవరినీ ఆక్షేపించకూడదు. అప్పుడే నీ వైవాహిక జీవితానికి సార్థకత.... నీ తత్వాన్ని మార్చుకో. నా ఇంట నీకు స్థానం లేదు. ఇదే నీ ఇల్లు. ఈ ఇంటివారే నీవారు. నేను మా వదిన దగ్గరకు వెళుతున్నా" వేగంగా లేచి వెళ్ళిపోయింది అనసూయ.
అమృత ఆలోచనలో మునిగిపోయింది. తల్లి అలా మాట్లాడుతుందని ఊహించలేదు.
★ ★ ★
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments