సీతమ్మ నిలయం

Seethamma Nilayam - Telugu Family Story | Merla Srilakshmi
సీతమ్మ నిలయం - తెలుగు కుటుంబ కథ | మెర్ల శ్రీలక్ష్మి
Published in manatelugukathalu.com on 03/10/2026
“సీతమ్మ నిలయం” మెర్ల శ్రీలక్ష్మి రచించిన హృదయాన్ని హత్తుకునే తెలుగు సామాజిక కుటుంబ కథ. భర్త నిరాదరణకు గురైన సీత తన కొడుకును పెంచుకుంటూ స్వయంకృషితో జీవితంలో నిలదొక్కుకుంటుంది. తనకే పరిమితం కాకుండా ఇతర మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుంది. మాతృత్వం, ఆత్మగౌరవం, స్వయం సమృద్ధి విలువలను చాటిచెప్పే ఈ కథ పాఠకులను ఆలోచింపజేస్తుంది.
ఊరు చివర వీధిలో చెరువు దగ్గర ఇల్లు సీతమ్మది. పెద్ద పెంకుటిల్లు...
ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టగానే అటు ఇటు పక్కన నిలబడి స్వాగతం పలికినట్టుగా కనిపించే పూల మొక్కలు, వీధి అరుగు మీద సుద్దతో గీసిన ముగ్గులు.
ఆ పక్కన పెరటిలో బావి, పెద్ద మామిడిచెట్టు, కోళ్ల గూడు... అటు పక్కన పెద్ద పెద్ద ఇత్తడి బిందెలలో నింపిన నీళ్లు. బయట దూరంలో ఉన్న బాత్రూమ్...
లోపల అడుగుపెడుతుంటే పడక కుర్చీలో కూర్చుని రేడియోలో వార్తలు వింటున్న ముసలావిడ.
అటు పక్కన మామిడికాయ ముక్కలు తరుగుతున్న పదిమంది ఆడవాళ్లు, ఐదుగురు పన్నెండేళ్ల పైబడిన పిల్లలు. ఒక పక్కన కారం, ఉప్పు కొలతలు కొలిచి వేస్తున్న నలుగురు ఆడవాళ్లు.
పుస్తకంలో రాస్తున్న ఒక పిల్లాడు. ఆ పక్కనే ఇరవై ఆరేళ్ల సీత. పుట్టింట్లో సన్నగా, నల్లగా ఉన్న సీత... ఈమధ్య కాస్త శరీరం రంగు వచ్చింది. అత్తారింట్లో బావి నీళ్లు పడ్డాయి.
ఆమె భర్త రామకృష్ణ పట్నంలో ఉంటాడు. సీతమ్మ నలుపు, రామకృష్ణ తెల్లటి తెలుపు.
అతనికి అప్పుడు ఇరవై మూడు, పద్దెనిమిదేళ్లకు పెళ్లి చేశారు ఆమెకి. భార్య అంటే అంత ఇష్టం లేదు ఆ మనిషికి. తండ్రి మాట కోసం తప్పని పరిస్థితిలో తాళి కట్టాడు.
ఆయన చనిపోయాక సమయం చూసి, "వ్యాపారం చేస్తాను, పట్నం వెళ్లి సంపాదించి వస్తాను" అని వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు అతని జాడలేదు. రామకృష్ణ ఉండే అడ్రస్‌కి ఎన్నో ఫోన్లు చేసింది, ఉత్తరాలు రాసింది.
ఇంజనీరింగ్ చదువుకున్న రామకృష్ణ పట్నంలోని సౌకర్యాలు, విలాసాలు, స్నేహితులతో సినిమాలు, షికార్ల మోజులో పడ్డాడు.
ఉద్యోగం పేరుతో వెళ్లిన అతను పట్నంలో జీవితానికి అలవాటుపడి అక్కడే ఉండిపోవాలని, తన మొదటి పెళ్లి గురించి చెప్పకుండా అక్కడే సెటిల్ అయిన మాధురిని పెళ్లి చేసుకున్నాడు.
వాళ్లు పెళ్లి చేసుకుని పదేళ్లు అయిపోతున్నా ఇప్పటికీ వారికి సంతానం లేదు. మాధురి తల్లిదండ్రులకు పెద్ద కూతురు. తన తర్వాత చెల్లికి పెళ్లయింది, ఆమెకి ఒక కొడుకు.
మాధురికి పిల్లలు లేకపోతే ఆస్తి అంతా ఆమె చెల్లి సొంతమవుతుంది. మాధురి పిల్లల కోసం అన్ని ప్రయత్నాలు చేసింది, లాభం లేకపోయింది. మాధురి పిల్లలు లేరని బెంగ పెట్టుకుంది. ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది.
చెల్లి అప్పటికే రెండోసారి గర్భం దాల్చింది. పుట్టిన రెండో బిడ్డను అక్కకి ఇవ్వాలని అనుకుంది. కానీ రామకృష్ణకి 'ఆ బిడ్డ ఎప్పటికీ నా బిడ్డ కాడు' అనే ఆలోచన పడింది.
అప్పుడే తను వచ్చేటప్పుడు, "సీత నీళ్లు పోసుకుంది (శ్రీమంతం/ప్రసవ సమయం)" అని పొరుగింటి మీనాక్షి పిన్ని చెప్పడం గుర్తుకు వచ్చింది.
పట్నంలో జీవించాలనే కోరికతో సీతతో బంధం వద్దనుకుని వచ్చేశాను. ఇప్పుడు వెళ్లి ఆ బిడ్డను అడిగితే ఇస్తుందా? మాధురిని బ్రతికించడానికి, నాకంటూ బిడ్డ ఉన్నాడంటే అది సీత కడుపున పెరిగిన నా రక్తం! సీతను ఎలా ఒప్పించాలి అనే ఆలోచనలతో ఊరికి బయలుదేరాడు.
ట్రైన్ దిగి తన ఊరు వెళ్లే పల్లెవెలుగు బస్సు చూసుకుని ఎక్కాడు, ఖాళీ సీటు దొరికితే కూర్చున్నాడు. ఆ ఊరికి సాయంత్రం పూట వెళ్లే ఒకే ఒక్క బస్సు అది. జనాలు ఎగబడి ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కారు.
ఆ రద్దీ బస్సులో రామకృష్ణ పక్కన కూర్చొని ఒళ్లంతా చెమటలు కక్కుతున్న శంకరాన్ని చూసి ముక్కు మూసుకున్నాడు. కొందరు వస్తువులు తమ సీటు మీద పెట్టారు, అవి రామకృష్ణ మీద పడుతుంటే విసుక్కున్నాడు. తన వెనుక సీటుకి జారపడిన పిల్లాడి ముక్కు కారుతుంటే తన బట్టలు ఎక్కడ పాడవుతాయోనని ఇబ్బంది పడ్డాడు.
మాధురిని పెళ్లి చేసుకున్నాడు కానీ అతనికి మోచేతి కింద బెల్లంలా ఆస్తులు ఉన్న మాట వాస్తవమే అయినా అనుభవించే రాత లేదు. మాధురి కడుపు నిండా తిననివ్వదు. "లావైపోతారు, పొట్ట వస్తుంది, గ్యాస్..." అది ఇది అంటుంది.
వాళ్లు మాంసాహారం తినరు, శాకాహారం తింటారు. అవి కూడా ఆకుకూరలు, కాయగూరలు, పప్పులే! ఇష్టంగా నచ్చిన వంటలు కడుపు నిండా తిని ఎన్నాళ్లయిందో!
మాధురి వాళ్ల నాన్న పాతకాలపు మనిషి. ఆరోగ్యం, పొదుపు అంటూ ఉంటాడు.
ఆ ఇంట్లో వస్తువులు అలంకరణకు, సోకులకే కానీ ఉపయోగపడేవి లేవు. ఫ్యాన్ ఉంది అంటే అది రాత్రే తిరగాలి! ఉదయం ఎండ, నడక ఆరోగ్యానికి మంచిదని ఉదయాన్నే వాకింగ్‌కి తీసుకుని వెళ్లేవాడు. మధ్యాహ్నం పూట భోజనం చేసే గంట మాత్రమే ఫ్యాన్ తిరగాలి.
బయటివాళ్లు రెండు అంతస్తుల ఇల్లు, వేసుకునే దుస్తులు చూసి మోసపోతారని ఇప్పటికీ రామకృష్ణ బాధపడతాడు.
మాధురి వాళ్ల నాన్న నడిపే ఫ్యాక్టరీ పనిలో చేరి, అతని కూతురిపై మనసుపడి పెళ్లయ్యాక తన లైఫ్ సెటిల్ అయిపోయిందని భ్రమలో ఉన్నాడు చాలా రోజులు.
ఎప్పుడైతే వాళ్ల ఇంట్లోకి వెళ్లాడో ఆ క్షణం నుండి అతనికి జీవితం చాలా భిన్నంగా అనిపించింది. తను ఊహించని భోగభాగ్యాలు చూడడానికే కానీ అనుభవించే రాత లేదు. పని చేసిన జీతాన్ని కూడా మాధురి దగ్గరే పెట్టుకునేది.
అవసరమైతేనే వాడాలి, ఖర్చుకు లెక్కలు వేసేది. ఎక్కడికైనా వెళ్లాలంటే లెక్కపెట్టుకుని సరిపడినంత డబ్బులే చేతిలో పెట్టేది. మాధురి ఆ డబ్బులను స్నేహితులు అడిగితే అధిక వడ్డీకి అప్పులు ఇచ్చేది.
ఆమె ప్రవర్తన రామకృష్ణకు బొత్తిగా నచ్చేది కాదు. "ఎందుకు బీరువాలో డబ్బులు పోగేస్తే పిల్లలు పెడతాయా?" అని కోప్పడేవాడు. ఆమె ఒక నవ్వు నవ్వి, "ఇప్పుడు పొదుపు చేస్తే అవి అవసరంలో మనల్ని ఆదుకుంటాయి" అనేది. దాంతో అతను ఊరుకునేవాడు.
తర్వాత బంధువుల మాటల్లో తెలిసింది మామగారికి ఇల్లు ఒకటే సొంతమని, ఫ్యాక్టరీ సొంతం కాదని! తర్వాత కూతుళ్ల పేరిట ఈ మధ్యనే ఒక స్థలం కూడా కొన్నాడని రామకృష్ణకు తెలిసింది.
అది కోట్లలో ఖరీదు చేసే స్థలమని తెలిసింది. మాధురికి పిల్లలు లేకపోతే ఆ స్థలం తన చెల్లికి వెళ్తుందని మామగారు ఎవరితోనో ఫోన్లో చెప్తుంటే విని కంగారుపడ్డాడు.
పట్నంలో డబ్బు, విలాసాలు ఉన్నా అనుభవించే సుఖం లేదు. మాధురికి పిల్లలు పుడితే ఆస్తిలో వాటా వస్తే వేరేగా ఉండాలని రామకృష్ణ ఆలోచన. రామకృష్ణకు ఇప్పుడు అర్థమవుతోంది.
ఆ ఇంట్లో ఫ్యాన్ ఉన్నా తిరగనివ్వరు, పాలిష్ చేసిన టేకు బల్లలు ఉన్నాయి కానీ వాటి మీద కూర్చొని కడుపు నిండా తృప్తిగా భోజనం చేసిన జ్ఞాపకం లేదు.
'సీతమ్మ నిలయం' అని కనిపించిన ఇంటి వైపు అడుగులు వేశాడు. వర్షం రావడానికి ముందు తుమ్మెదలు/తొండలు (తొండ్రలు) గుంపుగా గాలిలో విహరిస్తున్నాయి.
వాతావరణం చల్లగా ఉంది. సీతమ్మ పెరట్లో పచ్చని చెట్లు, పూలమొక్కలు గాలికి ఊగుతుంటే చూస్తూ ముందుకు అడుగు వేశాడు.
వీధి అరుగు మీద పిల్లలు ఆడుకునే బొమ్మలు నేల మీద చూసి అతని ముఖంలో ఒక మెరుపు వచ్చింది. తనకి కావలసినది దొరికినట్టు ఉప్పొంగిపోయాడు.
అక్కడే సీత కొడుకు ఆడుతున్నాడు. బాబు అచ్చంగా తనలానే ఉన్నాడు, అచ్చుగుద్దినట్టు! రంగు తనదే, రూపమూ తనదే అయ్యేసరికి అతనికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. గర్వంగా గడప దాటి లోపలికి అడుగులు వేశాడు.
వర్షం మొదలైంది. ఆ వర్షంలో తన చిన్నతనంలోకి వెళ్లాడు. సీత, తను మట్టితో బొమ్మలు చేసి ఆడుకునే వయసు... వర్షం వచ్చినప్పుడు ఇంటి ముందు పారే నీటిలో కాగితంతో పడవలు చేసి వదిలిన రోజు... పొరపాటున కాలు జారి నీళ్లలో పడ్డాడు. అతని బట్టల నిండా అంటిన బురద చూసి సీత పళ్లు బయట పెట్టి పకపక నవ్వింది. అతనికి కోపం వచ్చింది.
ఆమె నల్లని రూపంలో తెల్లగా మెరిసే పళ్లు చూసి, అతనికి ఆమె అంటే అసహ్యం వేసింది. ఆ నవ్వును అతను అవమానంగా భావించాడు. ఆ నవ్వే కోపంగా మారింది. ఆ నవ్వే ఆమె నలుపుపై అయిష్టంగా మారింది.
ఇప్పుడు అదే సీత వాకిట్లో కూర్చుని ఉంది. ఆరేళ్ల బిడ్డ తల్లిలా లేదు. అందంగా జడ వేసుకుని, పూలు పెట్టుకుని, లేత ఆకుపచ్చ కాటన్ చీర కట్టుకుని ఎంతో సంప్రదాయంగా అచ్చతెలుగు ఇంటి ఆడపడుచులా కనిపిస్తోంది. ఒకప్పుడు నల్లగా, నూనె జుట్టుతో, జిడ్డు కారిపోయే ముఖంతో అసహ్యంగా ఉన్న తనను ముందు గుర్తుపట్టలేకపోయాడు.
దగ్గరికి వచ్చి అడుగు దూరంలో ఆగి, భర్తలా, పెద్దమనిషిలా, తన జీవితాన్ని ఉద్ధరించే మాట చెప్పే మనిషిలా నిలబడ్డాడు అతడు.
"సీతా! నువ్వు ఒంటరిదానివి. ఈ బిడ్డను పెంచడం నీతోటి అయ్యే పని కాదు. ఈ పల్లెటూర్లో, ఈ పెంకుటింట్లో ఎన్నాళ్లు కష్టాలు పడతావు? బిడ్డతో నీకు మళ్లీ పెళ్లి అవ్వడం కష్టం.
నా మాట విని ఈ బిడ్డను నాకు అప్పగించి పెళ్లి చేసుకో..."
ఆ మాటకి ఆమె కళ్లు ఎర్రబడ్డాయి. అతను ఆమె చూపుకి భయపడలేదు, ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు.
"నా మాట విను... నేను వీడిని పట్నం తీసుకుని వెళ్తా. అక్కడే మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తా, ఇంగ్లీషు నేర్పిస్తా. నీకు తెలియని జీవితం ఇస్తా. నీ బిడ్డకి రాజులాంటి బతుకు వస్తుంది. నువ్వు ఒంటరిగా ఉండకు, కొత్త జీవితం మొదలుపెట్టు."
అతను మాటల్లో పెట్టాడు...
ఆ మాటకి ఆమె లేచి అతని వైపు చూసింది. "మరో పెళ్లా?" అని గట్టిగా నవ్వింది.
"నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే వీడు కడుపులో పడక ముందే చేసుకునేదాన్ని. నన్ను వదిలేసి నువ్వు వెళ్లిన మూడో నెలలోనే నాకు సంబంధాలు వచ్చాయి. నా తల్లి నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని ఏడ్చింది. నేను చేసుకోలేదు..."
"ఎప్పుడైతే వీడు నా కడుపులో పడ్డాడో... వీడు పడ్డాడని తెలిసిన ఆ రాత్రి నేను ఈ బావి దగ్గర కూర్చుని ఏడ్చాను. భయంతో కాదు, నాకు ఒక తోడు దొరికిందని! అప్పటి నుండి నాకు ఆ ఆలోచనే లేదు."
"నాకున్న ఆధారం వీడే. నేను వీడికోసం బతుకుతాను. వీడిని పెంచడం కోసమైనా నేను కష్టపడతాను. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతాను... బడిలో చదువు చెప్పిస్తా, ఇంగ్లీష్ నేర్పిస్తాను. కానీ వీడిని అమ్ముకోను!"
ఆమె బిడ్డను దగ్గరికి తీసుకుంది, గుండెలకి హత్తుకుంది. ఆమె కళ్లలో కోపం, ఆవేదన, బాధ స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఇంతలో "భోజనం సిద్ధమైంది సీతా, అందరూ నీకోసం చూస్తున్నారు" అని ఒక వృద్ధురాలు వచ్చింది. ఆవిడ తన తల్లి. "అమ్మా" అని పిలిచాడు. ఆమె పలకలేదు, వెళ్లాను అని చెప్పి వెళ్లిపోయింది.
అప్పుడే చూశాడు అక్కడ గోడకి తగిలించిన ఫోటో... 'సీతమ్మా హోమ్ ఫుడ్ బిజినెస్ - ఆవకాయ మా ప్రత్యేకం'. అందులో పదిమంది ఆడవాళ్ల మధ్యలో సీత, తన కొడుకు కూర్చున్న ఫోటో కూడా వేశారు.
తను పెరిగిన ఇల్లు ఇప్పుడు పదిమంది ఆడవాళ్లకు ఉపాధి చూపిస్తోంది. సీత ఒంటరిది కాదు, పదిమంది జీవితాలలో వెలుగు నింపిన దేవత! తనే ఇప్పటి వరకు భ్రమపడ్డాడు.
రామకృష్ణ ఇంటి నుండి బయటికి అడుగులు వేశాడు... వర్షం ఎక్కువైంది, చీకటి పడింది. అతను వెనక్కి చూడలేదు!
~ సమాప్తం ~
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మెర్ల శ్రీలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
పరిచయం: నా పేరు మెర్ల శ్రీలక్ష్మి






Comments