top of page
Original.png

మౌనమే నీ భాష.... ఓ మూగ మనసా!

11 hours ago
4 min read

మౌనమే నీ భాష తెలుగు నీతి కథలో పార్కులో వృద్ధుడి సలహాతో సహనం, మౌనం విలువ తెలుసుకుంటున్న ప్రసాద్

Mouname Ni Basha.... O Mooga Manasaa! - Telugu Family Story | Mayukha

మౌనమే నీ భాష.... ఓ మూగ మనసా! - తెలుగు కుటుంబ కథ | మయూఖ

Published in manatelugukathalu.com on 03/10/2026


“మౌనమే నీ భాష.... ఓ మూగ మనసా!” ఒక చక్కని తెలుగు నీతి కథ. కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఒత్తిళ్లు మనిషి ప్రశాంతతను ఎలా దెబ్బతీస్తాయో ఈ కథ వివరిస్తుంది.ప్రసాద్ జీవితంలో వచ్చిన మార్పు ద్వారా మౌనం, సహనం, ఆత్మనిగ్రహం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు.ప్రతి సమస్యకూ ఎదురు సమాధానం చెప్పడం అవసరం లేదని, సరైన సమయంలో మౌనంగా ఉండటం కూడా ఒక గొప్ప విజయం అని ఈ కథ మనకు చక్కగా తెలియజేస్తుంది.


"ఒరేయ్ ప్రసాద్! ఆ టీవీ పాడైపోయింది అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? బాగు చేయించమంటే అంత తీరిక లేదురా నీకు!" – కోపంగా అరిచాడు ప్రసాద్ తండ్రి పరంధామయ్య.


అసలే ఆఫీస్‌కు వెళ్లే టెన్షన్‌లో ఉన్న ప్రసాద్, "ఏం నాన్నా! ఆ టీవీ లేకపోతే మీకు కాలక్షేపం అవ్వదా? ఇంట్లో పుస్తకాలు ఉన్నాయి, చదువుకోవచ్చు కదా! ప్రతిరోజూ టీవీ అని నన్ను చంపకపోతే..." అని విసురుగా అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


20 రోజుల నుంచి రోజూ టీవీ గురించి తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదమే! ఎవరూ తగ్గట్లేదు.

పరంధామయ్య భార్య చనిపోయినప్పటి నుంచి కొడుకు దగ్గరే ఉంటున్నాడు. పరంధామయ్య గదిలో ఒక టీవీ ఉంది.


అది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితంది అవ్వడంతో పాడైపోయి బొమ్మ రావట్లేదు. పోనీ హాల్లో ఉన్న టీవీని చూడమంటే, "అది నా టీవీరా! నేను కష్టపడి కొనుక్కున్న టీవీ. నాకు అదే కావాలి, దాన్ని రిపేరు చేయించు!" అంటాడు మొండిగా పరంధామయ్య.


"పుండు మీద కారం చల్లినట్టుగా" ప్రసాద్ భార్య సుమిత్ర అందుకుంది దండకం— "మీకు ఎన్నిసార్లు చెప్పాలి? పిల్లల చదువులు, పెరిగిపోతున్న ఖర్చులు... మీరు ఇంటి ఖర్చులకు ఇచ్చే డబ్బు ఏమీ సరిపోవట్లేదు.


ఇంకో మూడు వేలు ఎక్కువ ఇవ్వండి అంటే మీరు ఇవ్వరు. ఈ సంసారం ఈదడం నా వల్ల కాదు. దానికితోడు పనిమనిషిని కూడా మానిపించేశాను. ఇంటి పని, బయట పనితో నా ఒళ్లు హూనమైపోతోంది" అంటూ ఆమె గొంతు పెంచింది.


దాంతో ప్రసాద్‌‌కి కోపం నషాళానికి అంటింది.


"ఛీ, వెధవ కొంప! ఎప్పుడు చూసినా సమస్యలే. నువ్వు ఒక్కదానివే ఇంటి పని చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావే? ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేవా? ఇల్లు ఎలా నడిపించాలో తెలియదా?" అంటూ విసురుగా ఆఫీస్‌కు వెళ్లిపోయాడు ప్రసాద్.


"ఛీ! వెళ్తుంటే ఎప్పుడూ ఏదో ఒక గొడవే. ఆఫీస్‌కు వెళ్తుంటే మంచిగా పంపించాలని ఎవరికీ అర్థం కాదు. ఇదే మూడ్‌తో ఆఫీసులో ఉంటాను, ఇక పనేం చేసుకోగలను?" అనుకుంటూ ఆఫీసుకు చేరాడు.


ఒక మధ్యతరగతి ఉద్యోగి ఆఫీస్ రాజకీయాలు, సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యల మధ్య అతని జీవితం ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతీదీ ఒక యుద్ధమే! ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ప్రత్యక్ష లేదా పరోక్ష పోరాటం చేస్తూనే ఉండాలి.


ప్రసాద్ ఆఫీస్‌లో చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ బేషజాలు, లౌక్యం లేని మనిషి అవ్వడంతో తన కింద పనిచేసే వ్యక్తికి ప్రమోషన్ రావడం చూసినప్పుడు భరించలేక మేనేజర్‌తో ఎన్నోసార్లు తగాదా వేసుకున్నాడు. మేనేజర్ నవ్వే వంకర నవ్వుకి ప్రసాద్ ఒళ్లు ఉడికిపోయేది.


ఒకరోజు సాయంత్రం ప్రసాద్ అలసిపోయి ఒక పార్కులో కూర్చుని తన ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడుతూ, "ఆఫీసులోనూ, ఇంట్లోనూ జరుగుతున్న అశాంతిని ఏమీ చేయలేని తన అసహాయ స్థితిని" బాధగా చెప్పుకొస్తున్నాడు.


ఇదంతా వింటున్న ఒక వృద్ధుడు, "నాయనా! సముద్రంలో అలలు ఎప్పుడూ గోల చేస్తూనే ఉంటాయి, కానీ లోతుకు వెళ్లేకొద్దీ నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దమే సముద్రానికి బలం! నువ్వు ఇంట్లోనూ, ఆఫీసులోనూ నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకో. అప్పుడు నీకే నైతిక బలం పెరుగుతుంది, నీకు శాంతి చేకూరుతుంది" అన్నాడు.


ఆ మాట ప్రసాద్ ఆలోచనా విధానాన్ని మార్చింది. 'మౌనం అంటే ఓటమి కాదు, వ్యూహాత్మక ఎదురుదాడి' అని అతను గ్రహించాడు.


ఆ మరుసటి రోజు తండ్రి యథాప్రకారంగా టీవీ గురించి అన్నప్పుడు, చాలా శాంత స్వరాన, "ఆ టీవీ పాతది అవ్వడంతో దానికి పార్టులు దొరకవు నాన్నా! అయినా నేను ప్రయత్నిస్తాను లెండి" అన్నాడు. తండ్రి ఇటువంటి సమాధానం ఎదురుచూడక ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు.


ప్రసాద్ భార్య సుమిత్ర మళ్లీ మొదలెట్టింది. ఆమె మాటలు ప్రశాంతంగా విని— "అవును సుమిత్రా! నువ్వు చాలా కష్టపడుతున్నావు. ఈ నెల నుంచి ఇంటి ఖర్చుల కోసం ఒక 2000 పెంచడానికి ప్రయత్నిస్తాను" అన్నాడు. ఆమె బాధను అర్థం చేసుకున్నట్లుగా తల ఊపాడు.


సుమిత్ర ఆశ్చర్యపోయింది. ఎదుటి వ్యక్తి వాదించనప్పుడు ఆమెకు ఏమి చేయాలో పాలుపోలేదు. అతని యొక్క నిశ్శబ్దం ఆమెను ఆలోచింపజేసింది. ప్రసాద్ ఎంతో సంస్కారంతో మౌనంగా ఉండడం చూసి ఆమెకు మెల్లగా పశ్చాత్తాపం కలిగింది.


"సారీ అండి! ఆఫీస్ టెన్షన్‌లో ఉన్న మిమ్మల్ని అనవసరంగా మాటలు అన్నాను. నాకు ఈమధ్య ఓపిక నశిస్తోంది, క్షమించండి. ఉన్నదానితోనే సర్దుకుంటాను" అంది బాధగా.


"నువ్వు అన్న మాటలకు నేను బాధపడలేదు సుమిత్రా! నీ బాధని వెళ్లగక్కావు, అంతే! నేను కూడా అరిస్తే మన మధ్య గొడవలు పెరుగుతాయి తప్ప సమస్య పరిష్కారం కాదు కదా!" అన్నాడు శాంతంగా.


ఆ రోజు నుంచి ఇంట్లో వాతావరణం మారింది.


మరునాడు ప్రసాద్ ఆఫీస్‌కు వెళ్తుంటే తండ్రి పరంధామయ్య అర్థం చేసుకుని, "ప్రసాద్! ఆ పాత టీవీ వద్దులే కానీ, నువ్వు చెప్పినట్లుగా హాల్లో టీవీ చూస్తానులే" అన్నాడు సంజాయిషీగా.


ఆఫీసులో మేనేజర్ తనపై అకారణంగా అరిచినప్పుడు ప్రసాద్ ఎదురు సమాధానం చెప్పకుండా ప్రశాంతంగా విన్నాడు. ఆ మౌనం మేనేజర్‌ని ఆలోచనలో పడేసింది.


'అనవసరంగా అరిచాననే' గిల్టీ ఫీలింగ్ మేనేజర్‌లో మొదలైంది. తర్వాత మేనేజర్ వచ్చి ప్రసాద్‌ని క్షమాపణ కోరాడు.


ప్రసాద్‌కు ఒక విషయం అర్థమైంది. ఈ ప్రపంచంలో మనల్ని రెచ్చగొట్టడానికి 1000 కారణాలు దొరుకుతాయి; కానీ మనం ఇచ్చే మౌనం అవతలి వ్యక్తి అహాన్ని దెబ్బతీస్తుంది, అతన్ని ఆలోచింపజేస్తుంది, మన శక్తిని కాపాడుతుంది. అది మన చేతకానితనం కాదు.


ప్రసాద్ ఇప్పుడు తన అంతరంగంలో కూడా మౌనాన్ని పాటించడం నేర్చుకున్నాడు. ఈ మౌనం అతనికి గొప్ప విచక్షణను ఇచ్చింది. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలిసినవాడు ప్రపంచాన్ని గెలవగలడని అతను నిరూపించుకున్నాడు.


సామాన్యుడికి ఉండే అనేక సమస్యల మధ్య తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే, "మౌనం" ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. అది ఒక యుద్ధాన్ని నివారించడమే కాదు, గెలవడానికి కావలసిన సహనాన్ని కూడా ఇస్తుంది!


***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


శారద

రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page