top of page

సుందరీయం


'Sundariyam' - New Telugu Story Written By P. Gopalakrishna

'సుందరీయం' తెలుగు కథ

రచన: P. గోపాలకృష్ణ

కథా పఠనం: A. సురేఖ

సుందరి సుబ్బారావు ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించాలని వాళ్ళమ్మ కామాక్షి అనుకునేది.


"నేను పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకుంటాను" తెగేసి చెప్పాడు సుబ్బారావు.


"సుందరికి ఏం తక్కువరా నాయనా, అందమైన పిల్ల. పైగా నీలాగే ఉద్యోగం కూడా చేస్తోంది కదరా. నీకిష్టమైన వంటలు కూడా బాగా చెయ్యడం వచ్చు" అంది కామాక్షి. కొడుకు భోజన ప్రియుడని తెలుసు కాబట్టి సుబ్బు కి అదే సుబ్బారావు కి ఇష్టమైన టాపిక్ గురించి లాజిక్ చెప్పింది ఆవిడ.


"నువ్వేం చెప్పినా నేను ప్రేమ వివాహం తప్ప ఇంకోటి చేసుకోనుగాక చేసుకోను" మూతి ముందుకు పెట్టి వేడిగా ఉన్న కాఫీని ఉఫ్.. ఉఫ్.. అని ఊదుకుంటూ జుర్.. జుర్ మంటూ శబ్దం చేస్తూ తాగసాగాడు.


"నీకిదేం పోయేకాలంరా తిక్క సన్నాసీ. నీ తిక్కకబుర్లూ, తింగరి చేష్టలూ మానేసి, చక్కగా సుందరిని పెళ్లిచేసుకో. కుందనపు బొమ్మలాంటి పిల్లని కాదని ప్రేమ, దోమ అన్నావంటే మేము ఏ కాశీకో, రామేశ్వరానికో పోతాం. వెళ్లేముందు ఆస్తి అంతా ఏ అనాధశరణాలయానికో రాసిచ్చేస్తాం", ఆఖరి అస్త్రం ప్రయోగించింది ఆవిడ.


"మన సుబ్బడు చెప్పిన మాట వింటాడులేవే కాముడూ", చెప్పాడు సుబ్బారావు వాళ్ళ నాన్న కుటుంబరావు.


"ఇదిగో నన్ను సుబ్బడు అంటే అస్సలు పెళ్ళే చేసుకోను", విసురుగా లేచి ఆఫీస్ కి బయల్దేరాడు సుబ్బారావు.


"పోనీ పెళ్ళయ్యాక ప్రేమించుకొండిరా తమ్ముడూ" బతిమాలుతున్నట్లు చెప్పింది సుబ్బారావు వాళ్ళక్క రాజ్యం.


"నువ్వు సాయంత్రం లోగా నీ నిర్ణయం చెప్పకపోతే నేను ఇంకోసారి ఈ గడప తొక్కనురా తమ్ముడూ" అంటూ ముక్కు చీది, కొత్తగా కొన్న సోఫా కి చెయ్యి తుడిచింది.


"అబ్బా, నువ్వు ఏడవకు లేవే అక్కా, నాకేమో ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, నా భార్య కూడా ఉద్యోగం చెయ్యాలని, ఇద్దరం చక్కగా చిలకాగోరింకల్లాగా తిరగాలని ఉండదా, సుందరి అంటే ఇష్టమున్నా, మేము ప్రేమించుకోలేదు కదా", ఒక మెట్టు తగ్గి చెప్పాడు సుబ్బారావు.


అమాంతంగా ఒక్క గంతేసి, "ఐతే నీకు సుందరికి పెళ్ళి ఏర్పాట్లు చేసేద్దాం రా తమ్ముడూ, సుందరి మీ ఆఫీస్ దగ్గర్లోనే బ్యాంకు లో ఉద్యోగంలో జాయిన్ అయ్యింది కదరా, చక్కగా పెళ్ళి చేసుకొని ప్రేమించుకోండి. వెరైటీ గా కూడా ఉంటుంది" ఎత్తు పళ్ళు దాచుకోలేక వాటిని బయటకు పెట్టి నవ్వింది రాజ్యం.


మొత్తానికి సుందరీ సుబ్బారావు ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించేసారు. మొదటిరాత్రి ఏర్పాట్లు చేస్తూ ఉండగా చెప్పాడు సుబ్బారావు, "ఏదైనా సరే ముందు ప్రేమించుకోవాలి, తరువాతే శోభనమైనా, పిల్లలైనా, " అంటూ మెలికపెట్టాడు.


"ఒరేయ్ తింగరి సన్నాసీ, తిక్క సచ్చినోడా.. ఇదేం పోయేకాలంరా నీకు" నానాశాపనార్థాలు పెట్టసాగింది వాళ్ళమ్మ కామాక్షి.


"నువ్వెన్ని చెప్పినా నేను వినను గాక వినను", వేడి వేడి ఇడ్లిల మీద నెయ్యి వేసుకొని, కారప్పొడి అద్దుకుంటూ లొట్టలు వేస్తూ చపక్.. చపక్.. మని పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మరీ తింటూ చెప్పాడు సుబ్బారావు.


"ఒరేయ్ సుబ్బా, ఇదేమైనా బాగుందా చెప్పు. పెళ్ళయ్యాక ముద్దూ ముచ్చట్లూ ఉంటాయి కదా! ఇరుగుపొరుగు ఇవన్నీ వింటే నీలో ఏదైనా లోపం ఉందని అనుకోరూ!” చెప్పాడు వాళ్ళ నాన్న కుటుంబం.


"ఎవరేమైనా అనుకోనివ్వండి నాన్నా, మేము ముందు బాగా ప్రేమించుకోవాలి, అంతే! తనరూం లోకి వెళ్తూ చెప్పి, తలుపేసుకుని పడుకున్నాడు సుబ్బు.


‘వీడు ఇలా మాట వినేరకం కాదు, వీణ్ణి ఎలాగైనా దారిలో పెట్టాల్సిందే’ మనసులోనే అనుకుంది కామాక్షి.


సుందరి నిజానికి చక్కగా కుందనపు బొమ్మలాగా ఉంటుంది. పొడవైన జడ తో, చక్కని గుండ్రని కళ్ళతో, చూడగానే ఆకర్షించే అందగత్తె ఆమె. మర్నాడు ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు తనపక్కన సుందరి నడుస్తూ ఉంటే ఆమెను పదేపదే చూస్తున్న సుబ్బారావు కి ఛాతీ అమాంతం ఆరంగుళాలు పెరిగినట్లైంది. అందరి భార్యలకంటే తన భార్య ఎంతో అందగత్తె. పైగా బ్యాంకులో ఉద్యోగం. కానీ ప్రేమ పెళ్లి చేసుకోలేదని బాధ ఒక్కటే ఉండిపోయింది సుబ్బారావుకి.


"ఏంటి మామయ్యా, అలా చూస్తున్నావు?" చిలిపిగా అడిగింది సుందరి.


"సుందరీ ఇవాల్టినుండి మనం భార్యాభర్తలం కాదు. నువ్వు నన్ను మామయ్య అని పిలవద్దు" చెప్పాడు సుబ్బారావు.


"అంటే నువ్వు నన్నొదిలేస్తావా"? అడిగింది సుందరి అనుమానంగా.


"ఏహే, నీ మొహం. నిన్నొదిలేస్తే మీ అమ్మా, మా అమ్మా ఊరుకుంటారా? నా చర్మం వలిచి చెప్పులు కుట్టించుకోరూ? ఇంట్లో మనం భార్యాభర్తలమే కానీ బయట మాత్రం ప్రేమికులం. సరేనా, నన్ను సుబ్బు అని పిలువు. నీకు తెలుసుకదా, నా చిరకాల వాంఛ ప్రేమ పెళ్లి చేసుకోవాలని, కానీ అమ్మా, అక్కా పట్టుబట్టడంతో నిన్ను చేసుకున్నాను" అన్నాడు సుబ్బారావు.


"అంటే నిజంగా నేనంటే ఇష్టంలేదా మామయ్యా" అడిగింది సుందరి.


"ఇదిగో మామయ్యా అనొద్దు అన్నానా. సుబ్బు అని పిలువు, వీలయితే ఒరేయ్ సుబ్బు అని కూడా పిలువు రొమాంటిక్ గా ఉంటుంది" మూతి ముందుకు పెట్టి చెప్పాడు సుబ్బారావు.


ఇద్దరూ నడుస్తూ ఉండగా, "హేయ్ సుందూ, నాకో ఐడియా వచ్చిందే" అన్నాడు ఉత్సాహంగా.


"సుందూ ఏంటి మామయ్యా, చక్కగా నా పేరుతో పిలువు" అంది చిరాగ్గా మొహం పెట్టి.


"డార్లింగ్ అని పిలుస్తా, నా ఇష్టం. సాయంత్రం డ్యూటీ అయిపోయాక నువ్వు బస్టాప్ లో కూర్చో. నేను వస్తాను ఇద్దరం చక్కగా పార్క్ కి వెళ్లి కబుర్లు చెప్పుకొని, లేట్ గా ఇంటికి వెళదాం" చెప్పాడు సుబ్బారావు. ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే సిటీ బస్సు వచ్చేసింది.


"ఓయ్, మామయ్యా ఇది మిస్ ఐతే పదకొండు గంటలవరకూ బస్సు దొరకదు" అంటూ ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కేసింది. సుబ్బారావు తిండిపుష్ఠి వలన కొంచెం భారీగా ఉంటాడేమో, ఎలాగో ఆపసోపాలు పడుతూ పరిగెత్తి బయల్దేరుతున్న బస్సు లోకి దూరేసాడు.


ఆఫీస్ లో ఉదయం నుండి బిజీ గా ఉన్న సుబ్బు సాయంత్రం ఎప్పుడవుతుందా, సుందరితో కలిసి పార్క్ లో కూర్చొని ఆమె ఒళ్ళో తలవాల్చి చక్కగా కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేద్దామా అని కలలు కనసాగాడు. సాయంత్రం ఐదు అయ్యీ అవ్వగానే సీట్లోంచి లేచి గబగబా బస్టాప్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. బస్టాప్ లో చాలామంది కాలేజీ అబ్బాయిలు, అమ్మాయిలూ జంటలుగా నిల్చొని కబుర్లలో పడ్డారు. ఎక్కడో ఒక మూల నిలబడింది సుందరి. ఆమెను చూడగానే సుబ్బారావు ఛాతీ ఆనందంతో ఆరంగుళాలు వెడల్పయ్యింది.


ఆమె పక్కగా నిలబడి "హాయ్" అంటూ పలకరించాడు.


ఆమె ఉదయం సుబ్బారావు చెప్పిన విషయం మరిచిపోయి, "ఏంటి మామయ్యా కొత్తగా ఈ పలకరింపులు" అంటూ అడిగింది నవ్వుతూ.


"నీ మొహమే, ఉదయం చెప్పిందంతా విని ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చావు నా మూడ్ మొత్తం చెడగొట్టావు" అంటూ మొహం కందగడ్డలాగ ఎర్రగా చేసుకొని గుడ్లురుముతూ ఆమెవైపు చూసాడు.


"సరే.. సరే.. సారీ సుబ్బు".. పకపకా నవ్వుతూ అంది సుందరి.


"గుడ్ అలా దారికి రా".. అంటూ మనం ఆ ఎదురుగ ఉన్న హోటల్ కి వెళ్ళి కాఫీ తాగి, అప్పుడు పార్క్ కి వెళదామా అడిగాడు సుబ్బు.


"ఒరేయ్ సుబ్బూ.. లవర్స్ హోటల్ లో కాఫీలకంటే ముందు పార్క్ లో దూరి, పల్లీలు గట్రా బాగా లాగిస్తూ మధ్య మధ్యలో ఐస్ క్రీం లు అవీ మింగుతూ కబుర్లు చెప్పుకుంటారు కదరా".. అంది చిలిపిగా.


"తనని ఒరేయ్ సుబ్బు అని సుందరి పిలిచేసరికి అమాంతంగా ప్రేమలో విజయం సాధించినట్లు ఫీలయ్యి, "హుర్రే" అంటూ ఒక గెంతు గెంతాడు. ఆ ఊపుకి పొట్ట బాగా కదిలిపోయి, కప్ప గెంతినట్లు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి అనిపించి ఘొల్లున నవ్వారు.


అవేమీ పట్టించుకోని మన సుబ్బు, "రా డార్లింగ్ అలా పార్క్ కి వెళ్ళి మాట్లాడుకుందాం" అంటూ ఆమెతో కలిసి నడవసాగాడు.


"ఇప్పుడు మనం లవర్స్, నువ్వు అది మరిచిపోయి పిచ్చి వేషాలు వెయ్యకు సరేనా".. హెచ్చరిస్తూ ఆమె పక్కనే నడవసాగాడు. ఇద్దరూ పార్క్ లో ఒక కార్నర్ లో ఉన్న పొదల పక్కన కూర్చున్నారు.


"హమ్మయ్యా, ఇప్పుడు చెప్పు మామయ్యా, ఏంటి ఈ పార్కులు, హోటళ్లు.. గోలంతా. హాయిగా ఇంటికి పోయి, ఏ డాబామీదో కూర్చొని కబుర్లు చెప్పుకుంటే పోదూ", అడిగింది సుందరి.


"మళ్ళీ మొదలెట్టావా నస. అసలు సుబ్బు అనమని చెప్పానా నీకు, మళ్ళీ మామయ్యా, దోమయ్యా అన్నావంటే కటీఫ్ నీతో" అంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు.


"అబ్బా.. నువ్వు కోపంలో కూడా బాగున్నావురా సుబ్బూ.. " అంటూ అతని మొహాన్ని తనవైపు తిప్పుకుంటూ పకపకా నవ్వింది.


"థాంక్యూ డార్లింగ్" అంటూ ఆమెను దగ్గరగా లాక్కోబోయాడు.


"హేయ్, సుబ్బూ, ఇది పార్క్ అందరి మధ్య ఏంటిది చెప్పు" అంటూ దూరంగా నెట్టింది అతణ్ణి. ఆమె దూరంగా పెడుతూ ఉంటే సరదాగా అనిపించింది సుబ్బు కి.


"నేను వెళ్ళొస్తా సుబ్బూ, నువ్వు ఇలా చెయ్యడం బాగోలేదు" అంటూ చివాల్న లేచిపోయింది సుందరి.


"సుందూ డార్లింగ్.. " అంటూ ఆమె వెంటపడ్డాడు సుబ్బు. ఆమె వెనక్కి కూడా చూడకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోతూ ఉంటే, సుబ్బు కూడా ఆమె వెంట గబగబా నడవసాగాడు. ఈ లోగా ఎవరో బలంగా చెయ్యి పట్టుకొని వెనక్కి లాగినట్లు అనిపించింది సుబ్బు కి. చెయ్యి విదిలించుకుని సుందరి వెనక గబగబా నడవసాగాడు. మళ్ళీ ఎవరో వెనక్కి లాగినట్లనిపించి కోపంగా వెనక్కి చూసాడు సుబ్బు.


"ఏంట్రా.. పార్కుల్లో అమ్మాయిల్ని ఏడిపించే బ్యాచ్ లో వాడివా"! అంటూ లేడీ కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని ఈడ్చుకుని వెళ్తూ ఉంటే, "సుందూ డార్లింగ్, సుందరీ.. " అంటూ అరవడం మొదలెట్టాడు సుబ్బు.


"ఎవర్రా నీకు డార్లింగ్" అంటూ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ సుబ్బుని బలవంతంగా జీప్ లో తోసారు. ఈ హడావుడిలో సుందరి ఎటు వెళ్లిపోయిందో అర్థం కాలేదు సుబ్బుకి.


"ఊఁ.. పోనివ్వు" అంటూ ముందు సీట్ లో కూర్చున్న ఎస్సై ఆర్డర్ వేసేసరికి జీపు రివ్వున త్రీ టౌన్ వైపు దూసుకుపోయింది.


"అయ్యో, ఎస్సై గారూ, ఆ అమ్మాయి నా భార్య అండీ, ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకున్నా ఇంట్లో అమ్మా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో నా మేనకోడల్నే పెళ్ళి చేసుకుని ఇలా పార్కుల్లో ప్రేమించుకుందామని ప్లాన్ వేసుకున్నామండీ".. అప్పటికే భయంతో వణికిపోతున్న సుబ్బు ఒంటినిండా చెమట్లు పట్టేసి, దాదాపుగా ఏడవసాగాడు.


"నోర్ముయ్యి.. ఇంకోసారి మళ్ళీ నోరెత్తావంటే కేసు రాస్తాను". గద్దించింది లేడీ ఎస్సై.


తనతో పాటూ అక్కడ ఉన్న ఈవ్ టీజర్స్ కి పోలీస్ లు కోటింగ్ ఇస్తూ ఉంటే సుబ్బు గుండెలు దడదడ లాడసాగాయి. "ఒక్కసారి మా ఆవిడకి కాల్ చెయ్యండి ప్లీజ్, నేను అలాంటివాణ్ణి కాదు. నేను గౌరవంగా ఉద్యోగం చేసుకుని బతుకుతున్నవాణ్ణి" అంటూ బతిమాలసాగాడు.


ఏమనుకుందో ఆ ఎస్సై, సరే అంటూ సుబ్బు చెప్పిన నెంబర్ కి కాల్ చేసింది. అవతలి నుండి వాళ్ళు చెప్పిన వివరాలు విన్నాకా "నువ్వెళ్ళి ఆ పక్కన కూర్చో నీ సంగతి తరువాత చూస్తాను" అంటూ చెప్పింది.


అరగంట తరువాత ఎస్సై గారు పిలుస్తున్నారు అంటూ పిలుపొచ్చేసరికి గజగజ వణుకుతూ వెళ్ళాడు. ఎదురుగ తల్లీ, తండ్రీ కనిపించేసరికి కళ్ళంట నీళ్లు ఆగలేదు సుబ్బు కి. "అయినా ఇదేం పిచ్చి నీకు. శుభ్రంగా పెళ్ళాంతో కాపురం చేసుకోకుండా, పార్కులు, ప్రేమా అంటూ పిచ్చి వేషాలు వేస్తూ కనిపించావంటే లోపల పడేసి కుమ్మేస్తాను" వార్నింగ్ ఇచ్చి వెళ్ళమని చెప్పింది ఎస్సై.


మౌనంగా ఇంటికి చేరుకున్న సుబ్బు గబగబా స్నానం చేసి డిన్నర్ చేసి, మొదటిరాత్రి కోసం ఏర్పాటు చేసిన బెడ్ మీద కూర్చొని "అవునూ, పెళ్ళాంతో కాపురం చేస్తూ కూడా ప్రేమించుకోవచ్చు కదా, ఈ సింపుల్ లాజిక్ ఎలా మిస్సయ్యానబ్బా" అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు.


పోలీసులు, వార్నింగ్.. ఇవన్నీ వాళ్ళమ్మా నాన్న చేసిన ఏర్పాట్లనీ, అందులో సుందరి పాత్ర కూడా ఉందని కానీ ఊహించనే లేదు సుబ్బు.

***

P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'సుందరీయం' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న నాలుగవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.




140 views1 comment

1 Comment



@srinuallada7207

• 11 hours ago

Good story

Like
bottom of page