top of page
Original.png

స్వేచ్ఛా భారతం త్యాగాల పునాదులపై ప్రగతి ప్రస్థానం


త్యాగాల పునాదులపై ప్రగతి సాధిస్తున్న స్వతంత్ర భారతదేశాన్ని ప్రతిబింబించే 80వ స్వాతంత్ర్య దినోత్సవ దృశ్యం

Swetcha Bharatham Tyagala Punadhulapai Pragathi Prasthanam - Telugu Special Article on Independence Day | Kondeti Prakash

స్వేచ్ఛా భారతం త్యాగాల పునాదులపై ప్రగతి ప్రస్థానం - తెలుగు స్వతంత్ర దినోత్సవ ప్రత్యేక వ్యాసం  | కొండేటి ప్రకాష్

Published In manatelugukathalu.com On 15/08/2026


స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వేచ్ఛా భారతం 80 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ఐటీ, అంతరిక్షం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగాల్లో భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటుతోంది. అదే సమయంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ క్షీణత, గ్రామీణ వైద్య సదుపాయాల కొరత, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు ఇంకా సవాళ్లుగానే ఉన్నాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేళ గత త్యాగాలను స్మరించుకుంటూ, సమానమైన విద్య, మెరుగైన వైద్యం, ఆత్మగౌరవంతో కూడిన జీవితం ప్రతి పౌరుడికి అందేలా మన బాధ్యతలను గుర్తించాల్సిన అవసరం ఉంది.


స్వేచ్ఛా భారతం త్యాగాల పునాదులపై ప్రగతి ప్రస్థానం కొండేటి ప్రకాష్


పోరాటమే తమ ఆయుధంగా మలచుకుని ప్రాణాలను సైతం పణంగా పెట్టి, రేపటి తరాల కోసం చేసిన త్యాగాల ఫలితమే ఎనభై ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో నేడు ఎగురుతున్న మువ్వెన్నల జెండా సాక్షి. కూడు, గూడు, విద్య, వైద్యంతో పాటు ఆత్మాభిమానమే నాటి ఆంగ్లేయులను మన దేశం నుండి తరిమి వెళ్లగొట్టేందుకు స్వాతంత్ర్య ఉద్యమానికి దారులు వేసింది. నాడు పరాయి పాలన సంకెళ్లను తెంచేందుకు కోట్లాది గొంతుకలు ఏకమై చేసిన సింహనాదమే నేటి మన స్వేచ్ఛా వాయువు.


భారత స్వాతంత్ర్య సంగ్రామం కేవలం ఒక రాజకీయ పోరాటం కాదు. అది అణచివేతపై ఆత్మాభిమానం సాధించిన విజయం. మంగళ్ పాండే రగిల్చిన విప్లవ జ్వాల నుండి మహాత్మా గాంధీ నడిపిన సత్యాగ్రహం వరకు, అల్లూరి సీతారామరాజు విలువిద్యల గర్జన నుండి భగత్ సింగ్ విప్లవ శంఖారావం వరకు ఎందరో వీరుల రక్తం ఈ నేలలో చిందింది. కులమతాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలను మరిచి 'భారతీయులం' అనే ఒకే ఒక్క నినాదంతో నాడు ప్రజలంతా కదంతొక్కారు.


ఆ త్యాగాల పునాదులపైనే నేడు స్వతంత్ర భారతం సగర్వంగా నిలబడింది.

స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి నేటి ఎనభై ఏళ్ల ప్రస్థానంలో భారతదేశం ఎన్నో రంగాలలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఐటీ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలవడం, ఇస్రో ప్రయోగాలు, చంద్రయాన్ విజయాలు అంతరిక్షంలో మన సత్తాను చాటడం మనందరికీ గర్వకారణం.


ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తుల్లో ఒకటిగా భారత్ అవతరించడమే కాకుండా, రక్షణ రంగంలో స్వయంసమృద్ధిని సాధిస్తూ ఆధునిక సాంకేతికతతో దూసుకుపోతోంది. అయితే, ఈ ఎనిమిది దశాబ్దాల ప్రగతి ప్రస్థానంలో నాటి పోరాట యోధులు కలలుగన్న సామాజిక ఆశయాలు ఎంతవరకు నెరవేరాయనేది నేడు ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలల మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారుతోందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ‘భారతదేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ’ నివేదిక స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు దేశంలో ప్రభుత్వ బడుల వాటా 71 శాతంగా ఉంటే, నేడు అది 49 శాతానికి పడిపోవడం దేశ భవిష్యత్తుకు శుభసూచకం కాదు.


గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 94 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం లేదా విలీనం కావడం ఆందోళన కలిగించే అంశం. వందలాది పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం, వేలాది బడులు ఏకోపాధ్యాయుడితో నడపడం విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. పాఠశాలల్లో మౌలిక వసతులు కొంతవరకు మెరుగైనప్పటికీ, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఆశించిన స్థాయిలో లేవని నీతి ఆయోగ్ హెచ్చరించడం మనం గమనించాలి.


విద్యతో పాటు వైద్య రంగంలోనూ సమూల మార్పులు రావాల్సి ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మండలానికి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించినప్పటికీ, అవి పేద ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆశించినంత ప్రభావం చూపలేకపోతున్నాయి. నేటికీ గ్రామీణ ప్రజలు చిన్న వైద్య సాయం కోసం కూడా నగరాలకు పరుగులు తీయాల్సి వస్తోంది.


ఈ నేపథ్యంలో గ్రామీణ ఆరోగ్య రంగంపై ఒక నూతన అధ్యయనం, సరికొత్త విధానం రావాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవిన్యూ అధికారి (విఆర్‌ఓ), గ్రామ పోలీసు అధికారి ఎలాగైతే నిరంతరం అందుబాటులో ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తున్నారో... అదే విధంగా కనీసం 500 మంది నివసించే ప్రతి గ్రామానికి ఒక ‘గ్రామ ప్రజా వైద్యుడు' తప్పకుండా ఉండాలి. ప్రాథమిక వైద్యం గ్రామస్థుల ముంగిటకే చేరినప్పుడే, గ్రామీణ భారతంలో నిజమైన ఆరోగ్య రక్షణ సాధ్యమవుతుంది.


భారతదేశం కేవలం ఒక భూభాగం కాదు, అది కోట్లాది మంది ఆకాంక్షల సమాహారం. డిజిటల్ యుగంలో దూసుకుపోతున్నా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ క్షీణించడం, గ్రామీణ వైద్యం కుంటుపడటం, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు ఇంకా మనల్ని పీడిస్తూనే ఉన్నాయి.


ప్రభుత్వ పాఠశాలల పతనాన్ని అడ్డుకోకపోతే పేద, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు నాణ్యమైన విద్య దూరం అవుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, ఆత్మగౌరవంతో కూడిన జీవితం దక్కినప్పుడే నాటి అమరుల త్యాగాలకు నిజమైన సార్థకత లభిస్తుంది. ఈ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ, నాటి పోరాట వీరులను స్మరించుకుంటూ, దేశ సమగ్రతను, శాంతిని కాపాడతామని ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం. 'వికసిత్ భారత్' సాధనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పునర్నిర్మించడం, గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం అత్యంత కీలకం. మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, రేపటి నవభారత నిర్మాణంలో భాగస్వాములవుదాం.


కొండేటి ప్రకాష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

 ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కొండేటి ప్రకాష్

పేరు: కొండేటి ప్రకాష్

జిల్లా: నల్లగొండ

తెలంగాణ

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page