top of page
Original.png

తగిన శాస్తి


ధర్మాన్ని పాటించే సింహం, సహాయగుణం కలిగిన కుందేలు, దురాశతో మోసానికి పాల్పడిన నక్కను చూపించే తెలుగు నీతికథ దృశ్యం

Tagina Shasti - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

తగిన శాస్తి - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 26/08/2026


“తగిన శాస్తి” రాళ్లబండి సంగంనాయుడు రచించిన చక్కని తెలుగు నీతికథ మరియు జంతు కథ. ధర్మాన్ని పాటించే వారికి సమాజం ఎలా అండగా నిలుస్తుందో, ఇతరులను మోసం చేసి అక్రమంగా సంపాదించే వారికి వారి కర్మ ఎలా తిరిగి ఫలితాన్ని ఇస్తుందో ఈ కథ తెలియజేస్తుంది.

కుందేలు తనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటుంది. ప్రమాదంలో దాని ఇల్లు కాలిపోయినప్పుడు అడవి జంతువులన్నీ ఒక్కటై దానికి అండగా నిలుస్తాయి. దీనిని చూసిన నక్కలో దుర్బుద్ధి పుడుతుంది. తప్పుడు అగ్నిప్రమాదాన్ని సృష్టించి ఇతరుల నుంచి సహాయం పొందాలని ప్రయత్నిస్తుంది. కానీ దురాశతో, మోసంతో జీవించిన నక్కకు ఎవరూ సహాయం చేయరు.

చివరికి నక్క దాచిన అక్రమ సంపాదన కూడా దాని చేతికి అందకుండా పోతుంది. ఈ కథ ద్వారా మంచితనం ఎప్పటికీ వృథా కాదు, మోసం మరియు దురాశకు తగిన ఫలితం తప్పదు అనే గొప్ప నీతిని రచయిత అందించారు.


అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. సింహం పాలన ధర్మబద్ధంగా సాగేది. రాజ్యంలోని పేద జంతువులకు సింహం సాయం చేసేది. డబ్బున్నవాళ్ల దగ్గరి నుంచి డబ్బు తెచ్చి పేదోళ్లకు ఇచ్చేది, పంచేది. ధర్మంగా ఉన్న వాళ్లను ధర్మంగా చూసేది. అధర్మపరుల అంతు చూసేది. చెడ్డవారి ఆటలు సింహం దగ్గర సాగేవి కావు. కండబలం వాడేవారికీ తన కండబలం రుచి చూపించేది. బుద్ధిబలం వాడినవారికీ తన బుద్ధిబలంతో సమాధానం ఇచ్చేది. ఎవరైనా తనను దెబ్బ కొడితే దెబ్బకు దెబ్బ తీసేది. ఆపదలో ఉన్నవారిని మాత్రం తప్పక ఆదుకునేది. సత్యం పలికేవారికీ, శీలసంపద కలవారిని కాపాడేది.


సింహం ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేది. అడవిలో పేద, ధనిక తేడాలు లేకుండా అందరినీ సమానం చేయాలనుకుంది. ఆ అడవిలోనే ఒక కుందేలు నీతిగా జీవించేది. తనకున్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తూ, ఇతరులను కష్టాల్లో ఆదుకుంటూ మిగిలిన జంతువుల దగ్గర మన్నన పొందుతూ ఉండేది. ఈ మంచి గుణం కారణంగానే కుందేలును అన్ని జంతువులు అభిమానించేవి. అందరి దగ్గర కుందేలు మంచిదని పేరు పొందింది.


ఒక దీపావళి రోజు రాత్రి అడవి జంతువులన్నీ ఆనందంగా మందుగుండు సామాగ్రి పేల్చాయి. అడవి అంతా మతాబులు, చిచ్చుబుడ్లతో కాంతివంతంగా ప్రకాశించింది. ఆ ఆనందకర సమయంలో ప్రమాదవశాత్తు కుందేలు పూరి గుడిసెకు నిప్పు అంటుకుని కాలిపోయింది. కుందేలు బట్టలు, కొంచెం డబ్బులు, తిండి గింజలు అన్నీ ఆ మంటల్లో కాలి బూడిదయ్యాయి. కుందేలుకు నిలువ నీడలేకుండా పోయింది. ఈ విషయం మృగరాజుకు తెలిసింది. ఇబ్బందుల్లో ఉన్న కుందేలును ఆదుకోవాలని అడవి జంతువులకు సింహం సూచించింది.


మృగరాజు సలహాను అడవి జంతువులన్నీ పాటించి కుందేలుకు సాయం చేశాయి. ఇంతకుముందు కుందేలు దగ్గర సహాయం పొందిన జంతువులన్నీ కుందేలుకు కావాల్సిన సరుకులు కొనిచ్చాయి. కుందేలు ఇంటి నిర్మాణంలోనూ సహకరించాయి. ఇలా అడవి జంతువులు కుందేటి జీవితం గాడిన పడేవరకు జాగ్రత్తగా చూసుకున్నాయి.


అదే అడవిలో ఉంటూ ఇదంతా గమనిస్తున్న నక్కకు దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు తన దగ్గరున్న సొమ్మునంతా ఓ మూటలో కట్టి పెరట్లో ఓ మూల పాతిపెట్టి తన ఇంటికి నిప్పు అంటించుకుంది. నిజంగానే అగ్నిప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించింది. సింహం దగ్గరకు వెళ్లి బోరున ఏడ్చింది. సింహం అడవి జంతువులకు, ఆపదలో ఉన్న నక్కకు సహాయం చేయమని చెప్పింది.


కానీ ఏ ఒక్క అడవి జంతువు నక్కకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే మునుపెన్నడూ నక్క ఎవరికీ సాయం చేసిన పాపాన పోలేదు. అంతేకాదు, దొంగ వ్యాపారం చేసి బాగా సంపాదించింది. పేదలకు ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి వారి రక్తం తాగింది. సింహం కళ్లు కప్పి గంజాయి వంటివి ఇతర రాజ్యాలకు ఎగుమతి చేసేది. అక్రమంగా చాలా కూడబెట్టింది.


అలా నాలుగు రోజులు చూసి తనకెవరు సాయం చేయరని తెలుసుకున్నాక, తను గోతిలో పాతిపెట్టిన అక్రమ సంపాదన తీసి వేరే చోట జాగ్రత్త చేద్దామనుకుంది. తీరా ఆ గుంటలో సొమ్ము కానరాలేదు. నక్క బయటకు ఏడవలేక, ఎవరికీ చెప్పుకోలేక గుండెలు బాదుకుంది. అలా నక్క పాచిక పారలేదు. ఇల్లు కాల్చుకుంది, సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంది నక్క. అయితే నక్క అక్రమ సంపాదన, కావాలని ఇల్లు కాల్చుకోవడం గుఢాచారుల ద్వారా తెలుసుకున్న సింహమే నక్క దాచిన సొమ్మును దొంగిలించి పేదోళ్లకు పంచిందనే విషయం నక్కకు తెలియదు. అలా మోసకారి అయిన నక్కకు సింహం తగిన శాస్తి చేసింది.


*** 

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.


మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page