తీరిన కోరిక
Teerina Korika - Telugu Moral Story | Ramkishan Rao Erabati
తీరిన కోరిక - తెలుగు నీతి కథ | ఏరాబాటి రామ్ కిషన్ రావు
Published in manatelugukathalu.com on 26/10/2026
భగవంతుడు ప్రత్యక్షమై కోరిన వరాలన్నీ ఇస్తానంటే మనిషి ఏం కోరుకుంటాడు? అత్యాశతో ప్రపంచాధినేతగా ఎదిగిన గురునాథం చివరికి తెలుసుకున్న జీవిత సత్యాన్ని ఆవిష్కరించే ఆలోచనాత్మక కథ ‘తీరిన కోరిక’.
“కౌసల్యా సుప్రజా రామా, పూర్వా సంధ్యా ప్రవర్తతే” పక్కింటి రేడియోలో వేంకటేశ్వర సుప్రభాతం మొదలుకాగానే నిద్ర నుండి మేల్కొన్నాడు గురునాథం.
ప్రతిరోజు లాగానే అరచేతిలో “శ్రీ” రాసుకొని కళ్ళకద్దుకున్నాడు. చాలా రోజుల నుండి అశాంతితో కుములుతున్న గురునాథం, ‘భగవాన్, నాకు మేలు చేయి, నన్ను కనికరించు’, అని మనసులోనే దేవుని ప్రార్థించి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మంచం దిగాడు.
గురునాథం ఒక ప్రైవేటు కంపెనీలో గుమాస్తా. భార్య, కొడుకు, కూతురు, తల్లి అతని కుటుంబంలోని సభ్యులు. చాలీచాలని జీతమైనా ఆడంబరాలకు పోకుండా జీవితం నెట్టుకొస్తున్నాడు. పిల్లలు బుద్ధిమంతులు. భార్య, తల్లి కూడా అత్తాకోడళ్ల లాగా కాకుండా తల్లిబిడ్డలుగా మసలుకుంటారు.
అందరి మధ్యతరగతి జీవులకు ఉన్నట్టే, వారికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. సొంత ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకు చదువు చెప్పించాలి, పెళ్లిళ్లు చేయాలి, అప్పుడప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి. ఇవన్నీ తలుచుకున్నప్పుడల్లా గురునాథానికి గుండెదడగా ఉంటుంది. అందుకే అన్ని భారాలను భగవంతునిపైకి నెట్టేస్తాడు గురునాథం.
ప్రతిరోజు మాదిరిగానే ఆరోజు కూడా గురునాథం స్నానం చేసి, నిత్య పూజకై దేవుని పటాల ముందు కూర్చున్నాడు. కానీ ఆరోజు ఎందుకో అతని మనసు నిలకడగా లేదు. స్కూటర్లు, సైకిల్ మోటార్లు, కార్లు, వ్యాన్లు రోడ్డుపైన ఎన్నెన్నో, కానీ తనకు ఎప్పటిదో పాత సైకిల్ తప్ప ఒక్క చిన్న మోపేడ్ కూడా లేదు.
ఎందరికో కొత్త కొత్త బట్టలు, పెద్ద పెద్ద భవనాలు, రకరకాల సెల్ ఫోన్లు, లగ్జరీ వస్తువులు, విందు భోజనాలు కానీ… కానీ… తనకు అవి ఏమీ లేవు.
‘నేనేం పాపం చేశాను? ఏళ్ల నుండి ఇదే గుమాస్తా జీవితం. ఓ భగవాన్! నాపై కరుణ చూపవా! నన్ను కనికరించవా! నీవు లేవు, నీవు ఉన్నావని, నన్ను ఆదుకుంటావని ఇన్ని రోజులుగా పూజిస్తున్నానే, మరి నాకేం చేశావు! నాకేమిచ్చావ్! ఎందుకో ఎందరు దుర్మార్గులకు, అవినీతిపరులకు, లంచగొండులకు, పాపాత్ములకు అన్నీ సుఖాలిస్తున్నావే, అన్ని సౌకర్యాలు, సంపదలిస్తున్నావే, మరి ఏ పాపం చేయని నాకు ఈ పరిస్థితి ఏమిటి? నాకు ఈ శిక్ష ఏమిటి?’
మనసులో తల్లడిల్లుతున్నాడు గురునాథం. చిన్న కృష్ణుని విగ్రహాన్ని చేతులలోకి తీసుకొని శుభ్రపరుస్తున్నాడు.
“గురునాథం! ఓ గురునాథం! ఓయ్ గురునాథం”
వినిపించుకోలేదు.
“గురునాథం, ఓయ్ గురునాథం.. పిలిస్తే పలకవేమిటి పరధ్యానం?”
“ఎవరయ్యా ఏమిటయ్యా, నేను పూజా మందిరంలో ఉన్నాను. లక్ష్మీ ఎవరో పిలుస్తున్నారు, కాస్త చూడు.”
“ఓయ్ ఓయ్ గురునాథం నిన్నేనయ్యా, నేను నీ భగవాన్ని,” చిన్న కృష్ణ విగ్రహం నుండి ఆ పలుకులు రావడంతో గురునాథం చేతులు ఒక్కసారిగా వణకసాగాయి.
“ఓయ్ ఓయ్ గురునాథం! నన్ను కింద పడవేసేవు జాగ్రత్త!”
“ప్రభూ మీరా, మీరా ప్రభూ? ఎక్కడ నాకు కనబడరే!”
“అయ్యో మీరా ప్రభువును, నీ ప్రభువును, అందరి ప్రభువును నేనేనయ్యా, నీ చేతులోనే ఉన్నాను.”
విగ్రహాన్ని పూజా మందిరంలో యథాస్థానంలో పెట్టాడు గురునాథం. “ఆ ఇప్పుడు చెప్పవయ్యా గురునాథం! ఏమిటి చాలా రోజుల నుండి బాధపడుతున్నట్టున్నావ్, నా ఉనికినే అనుమానిస్తున్నావు. నీకేం కావాలో చెప్పు, ఒక గంట సమయం నీకు ఇస్తున్నాను. ఈ గంటలో నీవేం అడిగినా ఇస్తాను, కోరుకో నీకేం కావాలో చెప్పు.” మాటలు విగ్రహం నుండి స్పష్టంగా రావడంతో ఆశ్చర్యపోయాడు గురునాథం.
రెండు నిమిషాల వరకు ఏమీ పాలుపోలేదు గురునాథానికి. “గురునాథం ఇది నిజమేనయ్యా, కాలం గడిచిపోతుంది. నీకు ఇచ్చిన సమయం గంట, అందులో అప్పుడే ఐదు నిమిషాలు గడిచిపోయినవి. నన్ను నమ్ము, నేను నీవు నిత్యం కొలిచే నీ భగవాన్ను. కోరుకో-కోరుకో, నీకేం కావాలన్నా ఇప్పుడే ఇక్కడే ఇస్తా. మేడలు, మిద్దెలు, డబ్బు, బంగారం, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, అధికారం ఏం కావాలో అడుగు ఇస్తాను.”
ఒక్క క్షణం ఆలోచించాడు గురునాథం. తను తొందరపడకూడదు.
మైడాస్ రాజు తాకితే బంగారంలా కాకుండా, భస్మాసురుని వరంలా కాకుండా ఎటువంటి హానిలేని వరం కోరుకోవాలని ఆలోచిస్తున్నాడు గురునాథం. తను చదివిన, విన్న ఎందరో రాక్షసుల కథలు గుర్తుకు తెచ్చుకున్నాడు. వారు కోరిన కోరికలు, వారు అంతమైన విధానాలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇంకా ముప్పావు గంట వ్యవధి ఉంది, కాబట్టి ముందు ఒక చిన్న పరీక్షలాగా తను ఎప్పటి నుండో కోరుకుంటున్న ఫైవ్ స్టార్ హోటల్ మీల్స్ కావాలన్నాడు.
అతడు అడిగిన మరుక్షణమే అతను కోరుకున్న ఫైవ్ స్టార్ హోటల్ మీల్స్ అన్ని డిషెస్‌తో ప్రత్యక్షమయ్యాయి. ముట్టుకొని రుచి చూసి అన్ని కడుపారా ఆరగించాడు. అంటే ఇదంతా నిజమేనన్నమాట. భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడన్నమాట.
“ఇంతేనా నీ కోరిక ?”
“స్వామి ప్రపంచంలో నేనే నంబర్ వన్ ధనవంతుడిని కావాలి.”
ఆశ్చర్యం!
గురునాథం ఇల్లు మారిపోయింది. పూజా మందిరం మారిపోయింది. పెద్ద విశాలమైన ఇల్లు, ఇంటిముందు ఖరీదైన కార్లు, మేడపై అంతస్తులు, విశాలమైన హెలిపాడ్, అంతా ఖరీదైన వాతావరణం.
ఇల్లంతా ధగధగా మెరిసిపోతుంది. ఈతకొలనులు, అందమైన తోటలు, ఖరీదైన మనుషులతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. ఇంతలో గురునాథానికి తనను రోజు ఏడిపించే తను పనిచేసే కంపెనీ మేనేజర్ గుర్తుకు వచ్చాడు.
వాడిని తిట్టాలనిపించి, ఆ మేనేజర్‌ను తన ముందు ప్రవేశపెట్టమన్నాడు. పనిలో పనిగా తనవారు ఎలా ఉన్నారో చూడాలనిపించి వారిని కూడా తన ముందు ఉంచాలని కోరుకున్నాడు. విలువైన నగలు మెడలో ధరించి, ఖరీదైన వస్త్రాలు కట్టుకున్న తనవారిని చూచి తనే పోల్చుకోలేకపోయాడు గురునాథం.
తనకు చాలా దూరంగా చేతులు కట్టుకొని వంగి నిల్చున్న మేనేజర్‌ను తనవారి ముందు కసితీరా తిట్టాడు గురునాథం. తనవారి వదనాలలో నవ్వులు చూసి తృప్తి చెందాడు.
“ఇంకేం కావాలి గురునాథం?”
తను ఎంతో ఆలోచించి రూపొందించుకున్న తన ప్రణాళికను కార్యరూపం దాల్చడానికి మొదటగా తన కోరికను వెలిబుచ్చాడు గురునాథం.
“ఈ ప్రపంచానికి నేను రాజునైపోవాలి, సమస్త ఖండాల జనులు, సముద్రాలు నా ఆధీనంలో ఉండాలి.”
“ఇది కలికాలం, ఇది రాజుల కాలం కాదు కదా గురునాథం, ప్రజాస్వామ్య యుగం.”
“ప్రభూ నీకు సాధ్యం కానిదేముంది.”
“సరే, కష్టసాధ్యమైన నీ కోరిక నీ కొరకు నెరవేరుస్తున్నా!”
అంతే! క్షణంలో మార్పు! తను పెద్ద దర్బార్ హాల్లో మణులు, రత్నాలు పొదగబడిన సింహాసనం పైన కూర్చున్నాడు. చెలికత్తెలు వింజామరలు విసురుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల అధిపతులు వారి వారి స్థానాలలో చేతులలో పుష్పగుచ్ఛాలతో వినమ్రంగా నిలబడి ఉన్నారు.
తాను ప్రపంచాధినేత కావడం వల్ల తనను అభినందించడానికి వారంతా విచ్చేశారు.
మరొకవైపు అప్సరసలు, దేవకన్యలు నాట్యం చేస్తున్నారు. అంతా మంగళప్రదంగా, శోభాయమానంగా ఉంది. గురునాథం ఏమి అనుకొని ఆనతిస్తే మరుక్షణంలో అది జరిగిపోతుంది. సంతోషంతో గురునాథం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అరగంట రాజ్యాధికారం అనుభవించి ప్రపంచాధినేతగా ఉన్న గురునాథంలో కొంచెం గర్వం తలెత్తింది.
భగవంతుడిచ్చిన గంట సమయంలో ఇంకా ఐదు నిమిషాల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా గురునాథానికి ఇతర గ్రహాల విషయం జ్ఞాపకం వచ్చింది.
“భగవాన్, ఒక్క భూమి మీద ఆజ్ఞలేమిటి? ఈ విశ్వంలోని అన్ని గ్రహాలు, నక్షత్రాలు, సమస్త విశ్వంపై నాకు అధికారం కావాలి.”
“తథాస్తు” అన్నాడు భగవాన్.
ఈ పరిణామాన్ని గమనిస్తున్న సర్వదేవతలు, దిక్పాలకులు ఉలిక్కిపడ్డారు. అందరూ వైకుంఠం వైపు పరుగులు తీశారు. గురునాథం బుర్రలో మరో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇలా అన్ని ఆ దేవుడిని అడుక్కోవడం కంటే ఆ భగవంతుని స్థానాన్ని నాకిచ్చేయమంటే సరిపోతుంది, ప్రతిదీ ఆయనను అడగవలసిన అవసరముండదు.
ఆ ఆలోచన వచ్చినందుకు తనను తానే అభినందించుకుంటూ, “భగవాన్, మీరిచ్చిన గడువు పూర్తికావస్తుంది, ఇదే నా చివరి కోరిక.”
“గురునాథం ఒక్క క్షణం, ఇప్పటివరకు నీవడిగిన అన్ని కోరికలను నేను నెరవేర్చాను. ఈ కోరిక కూడా నేను నెరవేరుస్తాను, కానీ అందుకు బదులుగా నీవు కొన్ని వదులుకోవాలి.”
“చిత్తం దేవా! ఈ ఒక్క కోరిక మీరు తీరిస్తే ఇప్పటివరకు మీరు తీర్చిన అన్ని కోరికలు మీకు సమర్పించుకుంటాను.”
“అలాగే నాయనా, ఇక నీ చివరి కోరిక ఏమిటో చెప్పు.”
“ప్రభూ పరమాత్మ దేవా, ఇప్పుడు మీరున్న స్థానాన్ని, మీ స్థానాన్ని నాకు ప్రసాదించు తండ్రీ.”
“అలాగే, తథాస్తు నాయనా.”
ఏమి చిత్రం, ఏమి మాయ, ఏదో మర్మం!
ప్రపంచాధినేతగా పెద్ద దర్బార్ హాల్లో రత్నాల సింహాసనం పైనున్న గురునాథం మరుక్షణంలో మళ్లీ తన పూజా మందిరంలో చిన్ని కృష్ణుని విగ్రహం ముందు ఉండిపోయాడు. “కృష్ణా! ఏమిటి మాయ? ఏమిటి మోసం?”
“మోసమా-మోసమెక్కడ నాయనా! గురునాథం, నీవే నా స్థానాన్ని కోరుకున్నావు కదా, నా స్థానం ఎక్కడ నాయనా, మీలాంటి భక్తుల హృదయాలలో కదా నా చిరునామా! అక్కడే నీవు ఉంటావు, అందుకు ప్రతిఫలంగా నేను నీకు ఇచ్చిన సంపదలు, అధికారాలు అన్నీ వదులుకుంటానన్నావు, వదులుకున్నావు.”
“భగవాన్ నేనెంత తెలివితక్కువవాడిని, మీరిచ్చిన ధన కనక వస్తు వాహనాలను, సర్వసంపదలను, అధికారాలను నా స్వార్థ దురాహంకారమైన ఆలోచనలతో వదులుకున్నాను. ఎంతటి నిర్భాగ్యుడిని, అహంభావిని, అవివేకిని, మందమతిని! నన్ను మన్నించు తండ్రీ, నాకు తగిన శాస్తి జరిగింది.”
గురునాథం తన నుదురును పూజా మందిరంలో చిన్ని కృష్ణుని ఉంచే పీటపై కొట్టుకుంటున్నాడు.
ఆ శబ్దానికి కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు. “ఏమండీ ఏం జరిగింది? ఏమిటి పని?” లక్ష్మీ భర్తను అడిగింది.
“నేను దేవుడిని కావాలనుకున్నాను, నాకు తగిన శాస్తి జరిగింది.”
“ఏమిట్రా నీకేమైనా పిచ్చా, నీవు దేవుడు కావడం ఏమిట్రా?” గురునాథం తల్లి ప్రశ్నించింది.
జరిగినదంతా చెప్పితే నిజంగానే వాళ్లు తనను పిచ్చివాడిగా జమకడతారని మౌనంగా పూజా మందిరము నుండి బయటకు వచ్చాడు గురునాథం, కృష్ణ విగ్రహాన్ని చూస్తూ…
“అవసరమైన సమయాలలో తెలివిని ఉపయోగించాలి, అతి తెలివిని ఉపయోగించరాదు. అన్ని భారాలు నాపై వేయకు, నీకు చేతకానప్పుడు మాత్రమే ఆ భారం నాపై వేయి.” భగవానుని మాటలు గురునాథం చెవులలో మార్మోగుతున్నాయి. “నిజం ప్రభూ, నేనెంతటి మందమతిని…”
“గురునాథం! ఈ జన్మలో నీ ప్రాప్తం అంతే కాబట్టి అలా అనుభవిస్తున్నావు, ప్రతి నీ కష్టానికి భగవంతుని నిందించకు, నీ కర్తవ్యం మరువకు, మిగిలినది నాకు వదిలివేయి. భగవద్గీత రోజు పారాయణం చేసే నీకు నేనింకేం చెప్పనవసరం లేదు…”
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
ఏరాబాటి రామ్ కిషన్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
పరిచయం: ఏరాబాటి రామ్ కిషన్ రావు

: పెద్దపల్లి జిల్లా ఓదెల ,గ్రామంలో జన్మించిన నేను వరంగల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేశాను .ఆంధ్ర బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తూ ఆరోగ్య కారణాల వలన 2005లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందాను.
చదువుకునే రోజులలో కాలేజీ మ్యాగజైన్ జయశ్రీ పత్రికలలో ఆ తర్వాత మయూరి,ఆంధ్ర పత్రిక ,ఆంధ్రభూమి వారపత్రికలలో నా రచనలు కొన్ని వెలుగు చూశాయి .
ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తెలుగు భాష,సాహిత్యం పై ఉన్న శ్రద్ధ వలన తిరిగి రచనవ్యాసంగం ప్రారంభించాను .
తెలంగాణ సారస్వత పరిషత్ బాలల కథలలో నా కథనొకటి ప్రచురించిన తరువాత ఈ నెలలో సంచిక పత్రిక వారు నా కథ ఒకటి ప్రచురిస్తామని ప్రోత్సహించారు .
నా కథను ప్రచురిస్తూ ప్రోత్సాహం అందిస్తున్న మీకు కృతజ్ఞతలు.







Comments