అమ్మను కావాలని...!

Ammanu Kavalani...! - Telugu Family Story | G. S. S. Kalyani
అమ్మను కావాలని...! - తెలుగు కుటుంబ కథ |G. S. S. కళ్యాణి
Published in manatelugukathalu.com on 26/10/2026
మాతృత్వం కోసం పరితపించే ఓ మహిళ జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనలు, ఆమె ధైర్యసాహసాలు, నిస్వార్థ ప్రేమను హృదయాన్ని తాకేలా ఆవిష్కరించే తెలుగు కథ “అమ్మను కావాలని…!”. G. S. S. కళ్యాణి రచించిన ఈ కథ మాతృప్రేమకు రూపం మనసేనని చాటుతుంది.
సముద్రతీరంలో కూర్చుని సముద్రాన్ని తదేకంగా చూస్తోంది నలభై ఎనిమిదేళ్ల కృష్ణాత్మిక.
ఒకదాని వెనుక ఒకటిగా సముద్రపు కెరటాలు పరుగులుపెడుతూ వస్తున్నాయి. అలా వస్తున్న ప్రతి కెరటం అక్కడున్న అతి పెద్ద కొండను ఢీకొని అంతెత్తున ఎగసిపడుతోంది... ఆ కొండ కొనను తాకాలని కాబోలు ఆ సముద్రపు అలల ఆరాటం!
కృష్ణాత్మిక చిన్నతనంలో తన తల్లి విధాత్రితో కలిసి అదే సముద్రతీరంలో వారాంతాలు గడుపుతూ ఉండేది.
ఓసారి అలా తన తల్లితో కలిసి సాయంత్రం గడపడానికి వచ్చినప్పుడు సూర్యాస్తమయమై చీకటిపడుతూ ఉండటంతో, "ఇక రా కృష్ణా! ఇంటికి పోదాం!" అంది విధాత్రి కృష్ణాత్మికతో.
అందుకు కృష్ణాత్మిక, "అదేంటో కానీ అమ్మా, బీచ్‌లో ఆడుకుంటూ ఎంతసేపైనా బోర్ కొట్టకుండా గడిపేయవచ్చు. సముద్రాన్ని చూస్తూ ఉంటే నాకు సమయమే తెలియదు! ఓషన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్!!" అంది ఇసుకలో పిచ్చుక గూళ్లు కడుతూ.
"సముద్రం మనకు స్నేహితుడికన్నా ఎక్కువే కృష్ణా! ఒక రకంగా మనకు సముద్రుడు తాత అవుతాడట, తెలుసా?" నవ్వుతూ అంది విధాత్రి.
అంతే! అప్పటినుంచీ సముద్రాన్ని తన తాతగా భావించడం మొదలుపెట్టింది కృష్ణాత్మిక. కోవిడ్ సమయంలో తన తల్లిదండ్రులను కోల్పోయిన కృష్ణాత్మిక, ఎక్కువ సమయం బీచ్‌లో గడిపేందుకు అలవాటుపడింది.
తన మనోభావాలను సముద్రుడితో పంచుకోవడం వల్ల మానసిక ఉపశమనం కలుగుతూ ఉండేది కృష్ణాత్మికకు.
ఎప్పటిలాగే ఆ రోజు కూడా సముద్రతీరంలో సూర్యాస్తమయ దృశ్యం ముగ్ధమనోహరంగా ఉంది. కానీ ఆ సూర్యకిరణాలు తాకి తళుక్కున మెరుస్తున్న అలలు కృష్ణాత్మిక చూపును మరలనీయకుండా చేస్తున్నాయి.
ఆ సముద్రపు కెరటాల వంక చూస్తూ... "తాతా! మేరు పర్వతంలా ఉన్న ఆ కొండ శిఖరం నీ అలలకు అందనంత ఎత్తులో ఉంది! ఏనాటికైనా నీ అల ఒకటి ఆ శిఖరాన్ని తాకేనా?" తన మాటలు తనకు మాత్రమే వినపడేటంత మంద్రస్వరంలో అంది కృష్ణాత్మిక.
'నా అలలకు అలుపనేదే లేదు! అనుకున్నది సాధించేంతవరకు ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉంటాను!' అన్న సమాధానాన్ని సముద్రం తన చేతలతో చూపించింది.
"అమ్మను కావాలన్న నా కోరిక ఆ కొండలాంటిది తాతా! నీ అలలు కొండ శిఖరాన్ని చేరడం ఎంత అసాధ్యమో, నేను అమ్మను కావడం కూడా అంతే అసాధ్యం!" అంది కృష్ణాత్మిక దిగులుగా.
ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోంది కృష్ణాత్మిక. కృష్ణాత్మికకు అద్భుతమైన తెలివితేటలను ఇచ్చిన భగవంతుడు, నాజూకైన రూపాన్ని ఇవ్వలేదు. సహజంగా ఆమెది కండలు తిరిగిన దృఢమైన శరీరం.
'అబ్బాయిగా పుట్టబోయి అమ్మాయిగా పుట్టిందేమో!' అని అందరూ కృష్ణాత్మిక రూపాన్ని అపహాస్యం చేసేవారు. వివాహం చేసుకోవాల్సిన వయసులో కృష్ణాత్మికకు ఎన్ని సంబంధాలు వెతికినా ఏదీ కుదరలేదు. ఆఖరికి కృష్ణాత్మిక తన తల్లిదండ్రులకు నచ్చజెప్పి జీవితమంతా ఒంటరిగా మిగిలిపోవడానికి నిర్ణయించుకుంది.
ఒక్కోసారి సమాజంలో ఎదురయ్యే వేధింపులు తట్టుకోలేక కృంగిపోయి, తనలో తాను కుమిలిపోతూ ఆహారం తీసుకోవడం మానేసేది కృష్ణాత్మిక.
అలాంటప్పుడు, "బాధపడకు కృష్ణా! నీకు దేవుడి దయవల్ల మంచి తెలివితేటలున్నాయి. వాటిని ఉపయోగించుకుని జీవితంలో విజయాన్ని సాధించి, నిన్ను చూసి నవ్వుతున్న లోకానికి తిరుగులేని సమాధానమివ్వు!" అంటూ కృష్ణాత్మికలో ధైర్యాన్ని నింపేది ఆమె తల్లి.
తల్లి ప్రోత్సాహంతో తన ఆలోచనలకు రూపాన్ని ఇస్తూ ఒక కంపెనీ ప్రారంభించి, దాన్ని తన నైపుణ్యంతో అతి తక్కువ సమయంలో పెద్ద కంపెనీగా తీర్చిదిద్దింది కృష్ణాత్మిక.
వృత్తిపరంగా ఘనవిజయాన్ని సాధించినా, జీవితంలో తనకంటూ ఒక సంసారం లేదన్న వెలితి కృష్ణాత్మికను బాధిస్తూ ఉండేది. మరీ ముఖ్యంగా తనను 'అమ్మా' అని పిలిచే పసి ప్రాణం కోసం తహతహలాడిపోయేది కృష్ణాత్మిక మనసు.
'ఈ మహాసముద్రం నీళ్లతో పొంగిపొర్లుతున్నా ఇందులో ఉన్న ఏ ఒక్క నీటి చుక్కా దాహాన్ని తీర్చలేదన్నట్లు... అమ్మదనాన్ని పొందగలిగే అపురూపమైన అవకాశం ఉన్న అమ్మాయిగా పుట్టినా, తల్లినయ్యే అదృష్టం నాకు ఈ జన్మకు లేదు!' అని అనుకుంటూ కన్నీళ్లు కార్చింది కృష్ణాత్మిక.
అంతలో కృష్ణాత్మికకు తన ప్రాణస్నేహితురాలైన అనఘ నుంచి ఫోన్ వచ్చింది.
కళ్లు తుడుచుకుని, "హలో అనఘా!" అంటూ ఫోన్ ఎత్తింది కృష్ణాత్మిక.
"ఎక్కడున్నావ్ కృష్ణా?" అడిగింది అనఘ.
"బీచ్‌లో," చెప్పింది కృష్ణాత్మిక.
"అబ్బా! మళ్లీ ఏమైందే నీకూ? ఎవరైనా ఏమైనా అన్నారా?" అడిగింది అనఘ.
"ఊహూ... ఎవ్వరూ ఏమీ అనలేదు!" చెప్పింది కృష్ణాత్మిక.
"ఎవరో ఏదో అనే ఉంటారు. అందుకే నా కూతురు బర్త్‌డే పార్టీకి రాకుండా అక్కడ కూర్చున్నావ్.
చూడటానికి బలంగా కనిపిస్తావు కానీ నీ మనసు వెన్నపూస కంటే సున్నితమైనదనీ, దాన్ని ఎప్పుడూ ఎవరో ఒకరు మాటలతో గుచ్చి బాధపెడతారనీ నాకు బాగా తెలుసు. ఊరికే బాధపడుతూ కూర్చోకు, వెంటనే బయలుదేరి మా ఇంటికొచ్చేయ్.
మా ఇంటివెనుక ఉన్న చిన్ని తోటలో నా బుజ్జితల్లి వాగధీశ్వరి పుట్టినరోజు వేడుక ఏర్పాటు చేశాను. అప్పుడే వాగధీశ్వరి పుట్టి తొమ్మిదేళ్లయింది తెలుసా? పార్టీకి బోలెడుమంది పిల్లలు వచ్చారు.
నువ్వొచ్చేంతవరకు కేక్ కటింగ్ చేయించను. నీకు పిల్లలతో గడపడమంటే ఇష్టం కదా? ఆలస్యం చేయకుండా వచ్చేసేయ్, మంచి కేకు తిందువు గాని," అంది అనఘ.
"సరే! ఇదిగో ఇప్పుడే వస్తున్నా," అంటూ కారులో అనఘ దగ్గరకు బయలుదేరిన కృష్ణాత్మిక, దారిలో పిల్లల కోసం రకరకాల బొమ్మలూ, మిఠాయిలూ కొని తనతోపాటు తీసుకెళ్లింది.
అనఘ ఇంటివద్ద కారు దిగుతున్న కృష్ణాత్మికను, "ఆంటీ!" అంటూ చుట్టుముట్టేశారు పిల్లలు.
"కృష్ణాత్మికగారు వస్తే చాలు! ఆవిడే ఈ పిల్లలకు ప్రపంచమైపోతారు!" అంది పార్టీకి వచ్చిన వైష్ణవి నవ్వుతూ.
"మరి? పిల్లలు కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ. అది మా కృష్ణాత్మిక దగ్గర మెండుగా ఉంది!" అంది అనఘ.
కృష్ణాత్మిక పిల్లలతో తోటలోకి వచ్చింది. అక్కడ ఒక చిన్న వేదిక, ఆ వేదిక మీద చిన్న టేబుల్, దాని మీద బర్త్‌డే కేక్ సిద్ధంగా కనిపించాయి కృష్ణాత్మికకు.
వేదిక చుట్టూ అందంగా కత్తిరించిన రకరకాల రంగు కాగితాలు తోరణాలల్లే కట్టి ఉన్నాయి. అలంకరణకు వాడిన తగరపు కాగితాల మెరుపు కళ్లు మిరుమిట్లుగొలిపేటట్లు ఉంది.
ఆకర్షణీయమైన బెలూన్లైతే అరచేతి సైజు నుండి మనిషంత సైజువరకు కొన్ని డజన్ల కొద్దీ ఆ ప్రాంతమంతా అద్భుతంగా అలంకరించబడి ఉన్నాయి.
"అబ్బో! డెకరేషన్లు చాలా బాగా చేశారే!" అంది కృష్ణాత్మిక అనఘతో.
"మా తోట చాలా చిన్నది కావడం వల్ల కాస్త ఇరుకుగా ఉంది. మరికొంచెం పెద్ద స్థలమైతే ఇంకా మంచి డెకరేషన్ చేయించేదాన్ని. ఉన్నదానితో సరిపెట్టుకోక తప్పదు," అంది అనఘ.
"పోనీలేవే! నాకు బాధపడొద్దని చెప్పి ఇప్పుడు నువ్వు బాధపడతావేంటి? రా! కేకు సంగతి చూద్దాం," అంది కృష్ణాత్మిక అనఘను ప్రోత్సహిస్తూ.
‘కేకు’ అన్న పదం వినగానే పిల్లలంతా బిలబిలమంటూ కేకు చుట్టూ గుమిగూడిపోయారు. పిల్లముఠాతో వేదిక నిండిపోయింది. పెద్దవాళ్లు వేదిక మీదకు వెళ్లడానికి దాని మీదున్న స్థలం సరిపోలేదు.
"వేదిక చిన్నదిగా పెట్టాల్సి వచ్చింది. కేకు కటింగ్ కార్యక్రమం పూర్తయ్యేంతవరకు అందరం ఎలాగో దానిమీద సర్దుకుని నిలబడాలి మరి. దయచేసి ఎవ్వరూ ఏమీ అనుకోకండి," అంది అనఘ మొహమాటపడుతూ.
"అయితే నేను వేదిక ఎక్కనులే! ఎందుకంటే నేను నిలబడే స్థలంలో కనీసం ముగ్గురు సన్నపాటివాళ్లు నిలబడొచ్చేమో," అంది కృష్ణాత్మిక ఫక్కున నవ్వి.
"ఛ! నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అయినా నువ్వు పక్కన లేకుండా వాగధీశ్వరి కేకు కట్ చేయదుగా," అంటూ కృష్ణాత్మిక చేయి పట్టుకుని వేదిక వైపునకు లాగింది అనఘ.
"అమ్మా! క్యాండిల్స్ వెలిగించు!" అంది వాగధీశ్వరి సహనం కోల్పోతున్నట్లుగా.
"ఇదిగో వచ్చేస్తున్నా! అగ్గిపెట్టె అక్కడే టేబుల్ పైన ఉంచాను చూడు! నేనొచ్చి క్యాండిల్స్ వెలిగిస్తాను," అంది అనఘ వేదికపైకి ఎక్కడానికి అడ్డుగా నిలబడి ఉన్నవారిని కాస్త పక్కకు జరగమని మర్యాదగా అడుగుతూ.
టేబుల్ పైనా కిందా అంతా చకచకా కలియజూస్తూ, "ఏమో! అగ్గిపెట్టె ఇక్కడైతే లేదమ్మా. ఇంకోటి త్వరగా తీసుకురా," అంది వాగధీశ్వరి.
"అక్కడే కింద పడిందేమో! ఉండు నేనొచ్చి చూస్తాను. పిల్లలూ! కాస్త నన్ను వేదిక ఎక్కనివ్వండర్రా," అంది అనఘ వేదికమీద కాలు మోపేందుకు విఫలయత్నం చేస్తూ.
అంతలో, "అమ్మో! మంటలు!! మంటలు!!" అంటూ ఎవరో కేకలు పెట్టారు.
అందరూ కంగారుగా చుట్టూ చూశారు. వేదిక మీదున్న ఒక చిన్న పిల్లవాడి ప్యాంటుకు మంటలంటుకుని ఉన్నాయి. వాడి చేతిలో ఉంది అగ్గిపెట్టె! పిల్లవాడు బిగ్గరగా ఏడుస్తూ ప్యాంటు విప్పి పక్కకు విసిరేశాడు.
ఆ పిల్లవాడి తల్లి పిల్లవాడిని వేదికపైనుంచి కిందకు దింపి వాడిని పరిశీలించి, "బాబుకి ఏమీ కాలేదులేండి, కంగారుపడకండి," అంది.
అంతలో ప్యాంటుకున్న మంటలు అలంకరణ చేసిన కాగితాలకంటుకుని క్షణకాలంలో పెద్దవైపోయాయి.
వేదికపైనున్న పిల్లలు భయంతో బిగుసుకుపోయారు. కన్నుమూసి తెరిచేలోపు వారి చుట్టూ పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు వ్యాపించేశాయి.
ఏం చేయాలో అంతుపట్టని స్థితిలో కొందరు అక్కడున్న చిన్న చిన్న ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు మంటలపైకి విసిరేశారు. మరికొందరు పంపుల దగ్గర బకెట్లు పెట్టి వాటిని నింపే ప్రయత్నం మొదలుపెట్టారు. కొంతమంది కాళ్లూ చేతులూ ఆడని స్థితిలో, "మా పిల్లలు!... మా పిల్లలు! ఎవరైనా కాపాడండి!!" అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.
అనఘకు మతి పోయినట్లయింది. కృష్ణాత్మిక చెప్పడంతో ఫోన్లో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది అనఘ.
వేగంగా వ్యాపిస్తున్న మంటలవంక కృష్ణాత్మిక ఒక్కసారి చూసి, దేవుడికి మనసులో ప్రార్థించి, ఒక్క ఉదుటున ఆ మంటల్లోకి వెళ్లి, నలుగురు పిల్లలను తన చంకలో ఎత్తుకుని వారిని వేదికకు దూరంగా తెచ్చి దింపి, మళ్లీ పరుగున వేదిక మీదకు వెళ్లి మరో నలుగురు పిల్లలను తెచ్చి సురక్షితంగా వారి తల్లులకు అప్పగించింది.
అలా వేదికపైనున్న పిల్లలందరినీ కొన్ని క్షణాల్లో రక్షించింది కృష్ణాత్మిక!
ఈ క్రమంలో కృష్ణాత్మిక చేతికీ, ముఖానికీ కాలిన గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చి ఆర్పివేశారు. వారితోపాటు వచ్చిన డాక్టర్ రాఘవ కృష్ణాత్మిక గాయాలను పరిశీలించి, ఫస్ట్ ఎయిడ్ చేశాడు.
"అసలు మంటలెలా వచ్చాయి?" అనఘను అడిగాడు రాఘవ.
"ఒక పిల్లవాడి చేతికి అగ్గిపెట్టె దొరికింది, వాడు దానితో ఆడినట్లున్నాడు. మంటలంటుకున్నాయి," వాగధీశ్వరిని గట్టిగా కౌగలించుకుని, భయాందోళనలు నిండిన కంఠంతో చెప్పింది అనఘ.
"కృష్ణాత్మికగారూ! ఇవాళ మీరు చూపించిన ధైర్యసాహసాలు నిజంగా అమోఘం! ఇంతమంది పిల్లల్ని మీరొక్కరే కాపాడారంటే నమ్మశక్యంగా లేదు! మీ గురించి మీరు ఆలోచించకుండా ఇంత కష్టమైన పని ఎలా చేయగలిగారు?" ఆశ్చర్యపోతూ కృష్ణాత్మికను అడిగాడు రాఘవ.
"ఏమో! పిల్లలంతా ఏడుస్తూ ఉంటే నాకు మనసులో నా పిల్లలే ఏడుస్తున్నంత బాధ కలిగింది. నేను వాళ్లకు అమ్మను కాను, కానీ నేనే వారి అమ్మనై ఉంటే ఈ పరిస్థితిలో ఏం చేసుండేదాన్ని అని ఒక్క క్షణం ఆలోచించాను... అంతే! నాలో ఏదో దివ్యశక్తి ప్రవేశించినట్లయింది.
మరో ఆలోచన లేకుండా మంటల్లోకి దూకేశాను. ఆ భగవంతుడు నాకిచ్చిన బలం ఈరోజు ఇలా ఉపయోగపడింది. పిల్లలంతా క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు, వాళ్ల తల్లుల ముఖాల్లో సంతోషం చూడగలిగాను. అంతా నేను నమ్ముకున్న అమ్మవారి కరుణ!" అంది కృష్ణాత్మిక.
అందుకు రాఘవ చిన్నగా నవ్వుతూ, "ఎప్పుడో త్రేతాయుగంలో సీతమ్మవారు అగ్నిప్రవేశం చేసి చెక్కుచెదరకుండా బయటకు వచ్చిందని విన్నాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను.
నిజానికి ఆ మంటల్లోకి వెళ్లినవారికి చాలా పెద్ద గాయాలు అయి ఉండాలి. కానీ మీకు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. ఏదేమైనా మా అంబులెన్స్‌లో ఒక్కసారి మా ఆసుపత్రికి మిమ్మల్ని తీసుకెళ్తే ఫుల్ చెకప్ చేస్తారు మా సిబ్బంది. ప్లీజ్ కోఆపరేట్!" అన్నాడు రాఘవ.
కృష్ణాత్మిక రాఘవ చెప్పినట్లు ఆసుపత్రికి వెళ్లి, చెకప్ పూర్తయ్యాక తన ఫ్లాట్‌కు వెళ్లిపోయింది.
రెండు రోజులు గడిచాక కృష్ణాత్మికకు ఫోన్ చేశాడు రాఘవ.
"హలో!" అంటూ ఫోన్ ఎత్తింది కృష్ణాత్మిక.
"కృష్ణాత్మికగారూ! నేనండీ, డాక్టర్ రాఘవను. ఎలా ఉన్నారు?" అడిగాడు రాఘవ.
"మీ వైద్యం బాగా పనిచేస్తోందండీ! ఐ యామ్ ఫీలింగ్ బెటర్ నౌ," అంది కృష్ణాత్మిక.
"మందులు జాగ్రత్తగా వాడండి, వారంలో పూర్తిగా కోలుకుంటారు," అన్నాడు రాఘవ.
"తప్పకుండా! నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు థాంక్స్ అండీ," అంది కృష్ణాత్మిక.
అప్పటినుంచీ రాఘవ తరచుగా కృష్ణాత్మికకు ఫోన్ చేసి కుశలం కనుక్కోవడం మొదలుపెట్టాడు. తనకో మంచి స్నేహితుడు దొరికినట్లనిపించింది కృష్ణాత్మికకు.
కొన్ని వారాలు గడిచాయి. ఒకరోజు తెల్లవారుజామున ఇంట్లో ధ్యానం చేసుకుంటోంది కృష్ణాత్మిక. ఉన్నట్లుండి కాలింగ్ బెల్ మోగడంతో, 'ఈ సమయంలో ఎవరా?' అని అనుకుంటూ కృష్ణాత్మిక వాకిలి తలుపు తెరిచింది.
"హ్యాపీ మదర్స్ డే అమ్మా!" అంటూ కొందరు పిల్లలు పుష్పగుచ్ఛాలతో అక్కడ నిలబడి ఉన్నారు. వారిలో వాగధీశ్వరి కూడా ఉంది.
పెద్దవాళ్లంతా కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. కల్మషం లేని చిరునవ్వులతో అప్పుడే విరిసిన పువ్వులల్లే ఉన్న ఆ పిల్లల ముఖాలను చూసిన కృష్ణాత్మికకు ఆనందాశ్చర్యాలతో నోట మాట రాలేదు.
"నేను మీకు అమ్మనా??" అంది కృష్ణాత్మిక పిల్లలందరినీ ప్రేమగా నిమురుతూ.
"అవును కృష్ణా! మేమంతా వీళ్లకు దేహాన్ని ఇచ్చి తల్లులమైతే, నువ్వు వాళ్ల ప్రాణాలు కాపాడి వాళ్లకు మరుజన్మనిచ్చిన అమ్మవు! ఆరోజు నువ్వు మంటల్లోకి దిగి సాహసించకపోతే ఇవాళ మా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతోంది.
మా అమ్మలందరి తరఫునా నీకు హ్యాపీ మదర్స్ డే కృష్ణా!" అంటూ కృష్ణాత్మికను ఆప్యాయంగా కౌగలించుకుంది అనఘ.
అక్కడున్న మిగతా ఆడవారంతా చప్పట్లతో కృష్ణాత్మికను అభినందించారు.
"మదర్స్ డే సందర్భంగా నాకెప్పటికీ గుర్తుండిపోయే మంచి బహుమతిని ఇచ్చారు! అందరికీ చాలా థాంక్స్," అంది కృష్ణాత్మిక.
"యు డిజర్వ్ దిస్ గిఫ్ట్ కృష్ణాత్మికగారూ! మా ఆసుపత్రి తరఫున కూడా మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!" అన్నాడు రాఘవ చిరునవ్వుతో ఒక పుష్పగుచ్ఛాన్ని కృష్ణాత్మిక చేతిలో పెడుతూ.
"థాంక్యూ రాఘవగారూ," అంది కృష్ణాత్మిక.
కృష్ణాత్మిక పిల్లలందరినీ ఇంట్లోకి రమ్మని, వాళ్లకు తనదగ్గరున్న చాక్లెట్లను పంచింది.
కాసేపటి తర్వాత అందరూ ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు... ఒక్క రాఘవ తప్ప!
"ఒక్కసారి మీతో పర్సనల్‌గా మాట్లాడాలి," కృష్ణాత్మికను మెల్లిగా అడిగాడు రాఘవ.
"ఓ! తప్పకుండా..." అంది కృష్ణాత్మిక.
"కృష్ణాత్మికగారూ! నాకు కొన్నేళ్ల క్రితం ప్రగతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. నా ప్రగతి నాలుగేళ్ల క్రితం చనిపోయింది. అప్పటినుంచీ నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆ కోరిక కలిగింది.
మీకు వివాహం కాలేదని విన్నాను. మీరొప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయం తెలుసుకోవచ్చా?" అడిగాడు రాఘవ.
కృష్ణాత్మిక తన చెవులను తానే నమ్మలేకపోయింది.
"రాఘవగారూ! నేను వింటున్నది నిజమేనా? ఇంతటి అందం, ఇంత పెద్ద చదువూ, వైద్యుడిగా మంచి పేరూ ఉన్న మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?? నేను అందగత్తెను కాదు.
అమ్మాయిల్లో కనిపించే సహజమైన సౌందర్యం, లావణ్యం, కోమలత్వం నాకు లేవు! మరి నాలో ఏం చూసి మీరు నన్ను ఇష్టపడుతున్నారో నాకు తెలియట్లేదు!" అయోమయంలో పడి ఆశ్చర్యపోతూ అంది కృష్ణాత్మిక.
"బాహ్యసౌందర్యంతో నాకు పని లేదు. పైకి దృఢంగా కనిపిస్తున్న మీలో సున్నితమైన మంచి మనసుంది! పైకి కనిపించని మీ హృదయంలో పిల్లలందరిపై నిరంతరాయంగా కురిపించేటంత గొప్ప తల్లిప్రేమ దాగి ఉంది. అదే నాకు నచ్చింది!" చెప్పాడు రాఘవ.
"నా జీవితం ఇక ఒంటరిగా మిగిలిపోతుందని అనుకుంటున్న తరుణంలో మీకు ఈ కోరిక కలిగిందంటే ఇది నిజంగా ఆ భగవంతుడి మహిమే! మీకు భార్యనవ్వడం నా అదృష్టంగా భావిస్తాను," అంది కృష్ణాత్మిక.
"అయితే, మనం శాశ్వత బంధంలోకి అడుగు పెట్టబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నాకు వివాహమైన తర్వాత ఎన్నో సంవత్సరాలు సంతానం కలగలేదు.
కానీ ప్రగతి ఎలాగైనా బిడ్డను కనాలని పట్టుబట్టింది. మెడికల్‌గా ఆమెకు తల్లయ్యేందుకు అవకాశం లేదని ఎంత చెప్పినా వినకుండా ఐ.వీ.ఎఫ్. ద్వారా గర్భం దాల్చింది.
అంతా బాగా జరిగింది అని అంతా అనుకున్నాం, కానీ వయసు నలభై దాటిన తర్వాత గర్భం దాల్చడం వల్లనో ఏమో ప్రసవవేదన తట్టుకోలేకపోయింది ప్రగతి.
డెలివరీలో ఊహించని కాంప్లికేషన్స్ తలెత్తాయి. ప్రగతి ప్రాణాలు కాపాడటానికి మా సాయశక్తులా ప్రయత్నించాం, కానీ అవేవీ ఫలించలేదు. నా చేతిలో పండంటి పాపాయిని పెట్టి ప్రగతి కళ్లు మూసింది.
ఆ పాప బాధ్యత నాదే. ఆ పాపకు మీరే అమ్మ కావాలి! అమ్మ ప్రేమలోని కమ్మదనాన్ని నా నాలుగేళ్ల చిట్టితల్లికి మీరు పంచగలరా?" అడిగాడు రాఘవ ప్రాధేయపడుతున్నట్లుగా.
అంతలో అనఘ అక్కడకు వచ్చింది. అనఘ వెనుక చాటుగా నిలబడి ఉన్న నాలుగేళ్ల లాలిత, మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ కృష్ణాత్మిక వద్దకు వచ్చి ఆమె చేతికి గులాబీ పువ్వును అందిస్తూ, "హ్యాపీ మదర్స్ డే అమ్మా!" అంది.
బంగారు వన్నెలో మెరిసిపోతూ, బుజ్జి బుజ్జి బుగ్గలతో ముద్దులొలుకుతున్న లాలితను తన రెండు చేతులతో ఎత్తుకుని, పాపను తన గుండెలకు హత్తుకుని, పట్టరాని సంతోషంతో ఆనందభాష్పాలు రాలుస్తూ... "ఈ మదర్స్ డే నిజంగా నన్ను అమ్మను చేసింది! నాకు అమ్మలను గన్న అమ్మ అయిన ఆ జగన్మాత అపురూపమైన కానుకను ప్రసాదించింది.
ఈ బంగారుతల్లికి కావలసినంత అమ్మ ప్రేమను పంచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను!" అంది కృష్ణాత్మిక.
అందరి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది.
ఆ రోజు ఆఫీసు నుండి ఇంటికి వెళ్తూ సముద్రతీరంలో కారు ఆపింది కృష్ణాత్మిక. సముద్రం పోటు మీద ఉండటంతో కెరటాలు అంతెత్తున ఎగసిపడుతున్నాయి.
"తాతా! నా కోరిక తీరింది, నేను అమ్మనయ్యాను!" సంతోషంతో సముద్రం వైపు చూస్తూ అంది కృష్ణాత్మిక.
'అవును! ఇదిగో చూడు! నేను కూడా కొండ శిఖరాన్ని అందుకోవడంలో విజయం సాధించాను!' అని బదులిస్తున్నట్లుగా ఒక సముద్రపు అల కొండంత ఎత్తు లేచి ఆ కొండ శిఖరాన్ని అలవోకగా తాకింది.
ఆ దృశ్యం శిఖర రూపంలో ఉన్న పరమశివుడికి గంగతో అభిషేకం చేసినట్లుంది! ప్రకృతి రూపంలో ఉన్న అమ్మవారు అమ్మను కావాలన్న కృష్ణాత్మిక కోరికను తీర్చిన సంతోషంలో ఉంది మరి!
సమాప్తం.
G. S. S. కళ్యాణి గారి కొన్ని ఇతర రచనలు:
G. S. S. కళ్యాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం' కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను.









Comments