తిరుకొండలమ్మ
- Kasivarapu Venkatasubbaiah

- 1 day ago
- 6 min read

Thirukondalamma - Telugu Devotional Story | Kasivarapu Venkatasubbaiah
తిరుకొండలమ్మ - తెలుగు భక్తి కథ | కాశీవరపు వెంకటసుబ్బయ్య
Published In manatelugukathalu.com On 22/06/2026
"త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన ఆమె... నేడు తిరుకొండలమ్మ తల్లిగా వేలాది మంది భక్తుల పూజలు అందుకుంటోంది."
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి తిరుకొండలమ్మ కథను వినండి.
చాలా కాలం క్రితం సోమాపురం గ్రామంలో సోమేశ్వరరెడ్డి అనే భూస్వామి ఉండేవారు. ఆయన భూముల్లో, ఆయన ఇళ్లల్లో పనిచేసే పనివాళ్లు వందల్లో ఉండేవారు. అంత గొప్ప ధనవంతుడి ఏకైక సుపుత్రిక తిరుకొండలమ్మ. ఏడుగురు అన్నదమ్ముల వెనుక పుట్టిన ఒకే ఒక సోదరి. ఆమె కరుణాహృదయురాలు, దయామయి. పెద్దలను గౌరవిస్తుంది. పిల్లలను ప్రేమిస్తుంది. పేదసాదలను ఆదరిస్తుంది. సాధు సన్యాసులను, అతిథి అభ్యాగతులను సేవిస్తుంది. ప్రజలను అభిమానిస్తుంది. కళలను పోషిస్తుంది. కళాకారులను సన్మానించి సత్కరిస్తుంది. చూడ చక్కని రూపవతి ఆమె. ఎవరైనా ఆమె ముఖం చూసినా, ఆమె ఎవరికైనా ఎదురైనా రెండు చేతులెత్తి నమస్కరించేటంత సంస్కారం తిరుకొండలమ్మది. ఆమె దేవతా వర్చస్సుతో నిండుగా వెలుగుతూ ఉంటుంది. ఆమెను సాక్షాత్తు తమ ఊరి దేవతే అన్నట్లు చూస్తుంటారు తమ పల్లె వాసులు.
తిరుకొండలమ్మ పుష్పగిరి ఋష్యాశ్రమ విద్యాలయంలో వేద వేదాంగాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, షట్దర్శనాలు, ఇతిహాసాలు, భగవద్గీత, యోగశాస్త్రం అభ్యసించి, అధ్యయనం చేసి పరిపూర్ణులయ్యింది.
సోమేశ్వరరెడ్డి తిరుకొండలమ్మకు పెళ్ళీడు రాగానే తనంత ధన సంపన్నుడైన శివపురానికి చెందిన శివచంద్రారెడ్డి కుమారుడు వాసుదేవరెడ్డికి ఇచ్చి అతి వైభవంగా వివాహ మహోత్సవం జరిపించాడు.
తిరుకొండలమ్మ ఎనలేని కట్నకానుకలతో పుట్టింటి నుంచి మెట్టినింట అడుగు పెట్టింది. మెట్టినింట్లో తిరుకొండలమ్మ అత్తామామలకు సపర్యలు చేసింది. బావా మరుదులను గౌరవంగా చూసింది. తోడికోడళ్లతో అభిమానంగా నడుచుకుంది. భర్తతో అనుకూలవతిగా, అవసరమైనప్పుడు మంత్రిలా సలహాలిస్తూ మెలిగింది. ఊరి ప్రజల తలలో నాలుకైంది. ఆజన్మ శ్రీమంతురాలైన తిరుకొండలమ్మలో ఇసుమంతైనా గర్వం పొడచూపలేదు. వినయ విధేయతలతో, భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో ఆమె జీవితం సాగింది.
తిరుకొండలమ్మ, వాసుదేవరెడ్డిల అన్యోన్య దాంపత్యం అర్థ దశాబ్దం సుఖంగా, ఏ చీకూ చింతా లేకుండా గడిచిపోయింది. వాసుదేవరెడ్డికి పెళ్లైన ఐదేళ్లు గడిచాక అంతుపట్టని జబ్బొకటి బయటపడింది. ఉన్నట్టుండి బలహీనపడిపోయాడు. జవసత్వాలు కోల్పోయాడు. గొప్ప గొప్ప వైద్యులకు చూపించారు. ఏమీ మేలు లేదు. ఎవరెవరో చెప్పిన చోటుకల్లా పోయి చికిత్స చేయించారు. ఏ వైద్యుడు రోగమేమిటో చెప్పలేకపోయాడు. వాసుదేవరెడ్డి దినదినానికి క్షీణిస్తున్నాడు. ఆ అంతుచిక్కని జబ్బుకు ఏ మందు వెయ్యాలో తెలియక విలవిలలాడిపోయారు కుటుంబ సభ్యులు. తిరుకొండలమ్మ నిరంతరం భర్తను కనిపెట్టుకుని సేవలు చేస్తుంది. అయినా ఫలితం లేకపోయింది.
ఒకరోజు వాసుదేవరెడ్డి భార్య తిరుకొండలమ్మతో, "తిరూ! నేను ఎన్ని మందులు వాడినా లాభం ఉండదు. నాకు ఆయుస్సు తీరిపోయింది. నేను బ్రతకను. నీవు ఎంత శ్రద్ధ తీసుకున్నా ఉపయోగం లేదు. ఎన్ని సేవలు చేసినా ప్రయోజనం ఉండదు. నేను చనిపోతానన్న భయం నాకు లేదు. అయితే నాకు కడప ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు దర్శించాలని కోరిక ఉంది. నా కోరిక తీరుస్తావా తిరూ!" అని ఎంతో ఆర్తితో భార్యను అడిగాడు.
"మిమ్మల్ని నిరంతరం చూపెట్టుకుని మీకు తోడుగా ఉండి, పుణ్యతీర్థాలలో స్నానం చేయించి, పుణ్యక్షేత్రాలను దర్శింపజేయిస్తాను. మీరు మరణిస్తే నేను మీతోపాటు సహగమనం చేస్తాను. మీరు లేని జీవితం నాకు వద్దు," స్థిరచిత్తంతో అంది తిరుకొండలమ్మ.
"వద్దు! వద్దు! తిరుకొండలమ్మా! నీవు భూమి మీద ఉండాలి. నీవు పేదలను, అట్టడుగు ప్రజలను ఆదరిస్తావు. బాధలు, వేదనల్లో ఉన్నవాళ్ల కన్నీళ్లు తుడుస్తావు. కష్టాల్లో, నష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటావు. నీ అవసరం సమాజానికి ఉంది. కాబట్టి నీవు ఇక్కడే ఉండాలి," అన్నాడు వాసుదేవరెడ్డి ఆతృతపడుతూ.
"నీకన్నా నాకు ఎవరూ ఎక్కువ కాదు. మన ప్రయాణానికి రేపే మంచి రోజు. మనం ప్రయాణాన్ని రేపే మొదలుపెడదాం!" అని తిరుకొండలమ్మ భర్తకు చెప్పి, అన్నం పెట్టి, పక్క సర్ది, నిద్రపోయేంత వరకు విసనకర్రతో విసిరింది.
మరునాటి దినం పది ఎడ్ల బండ్ల నిండుగా పనివాళ్ళు, బంధువులు వెంట రాగా తీర్థయాత్ర ప్రారంభమైంది. మొదటగా మాండవ్య నదిలో స్నానం చేసి రాయచోటి వీరభద్రుని దర్శించుకున్నారు.
అట్లే లక్కిరెడ్డిపల్లె మీదుగా ప్రయాణించి గండి చేరుకొని పాపాఘ్ని నది (గండేరు) లో మునిగి గండాంజనేయుని, ఎద్దల కొండ్రాయుడిని (వృషభాచలేశ్వరుడు) దర్శించుకున్నారు.
అలానే వేంపల్లె మీదుగా ప్రయాణించి పులివెందుల చేరి చిత్రావతి నదిలో స్నానమాచరించి రంగనాథస్వామిని, మిట్ట మల్లేశ్వరస్వామిని, కల్యాణ వెంకటరమణస్వామిని తిరుకొండలమ్మ, వాసుదేవరెడ్డి భక్తిశ్రద్ధలతో మ్రొక్కుకున్నారు.
ఆ తరువాత ముద్దనూరు గుండా పోయి జమ్మలమడుగులో ఆగి పవిత్ర పెన్నా నదిలో మునకలేసి నారా వెంకటేశ్వరస్వామిని కనులారా గాంచినారు.
అటుపిమ్మట తిరుకొండలమ్మ, వాసుదేవరెడ్డి వెల్లాల చేరి కుందూనదిలో నీళ్లు పోసుకొని సంజీవరాయుడిని మనస్సారా నమస్కరించి ప్రొద్దుటూరు చేరారు. అక్కడ తిరుకొండలమ్మ, వాసుదేవరెడ్డి, వారి పరివారం పావన పినాకిని (పెన్నా నది) నదీజలాలలో స్నానం ఆచరించి అగస్త్యేశ్వరస్వామిని, చెన్నకేశవస్వామిని, వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిశాలను, ముక్తి రామేశ్వరం రామలింగేశ్వరస్వామిని, బొల్లారం వెంకటేశ్వరస్వామిని, నరసింహాపురం నరసింహస్వామిని దర్శించుకున్నారు. కొన్ని దినములు ప్రొద్దుటూరు నందు విడిది చేసి దినమునకొక దేవాలయం వంతున దర్శించుకున్నారు.
కొన్ని దినముల విశ్రాంతి తరువాత మళ్లీ ప్రయాణం కొనసాగించి మైదుకూరులోని గండికోట మాధవరాయుని చూసి, బ్రహ్మంగారి మఠం చేరి బ్రహ్మంగారిని వేడుకొని బద్వేలు పోయారు.
బద్వేలు నందు సగిలేరు నదిలో స్నానం చేసి చెన్నకేశవుడిని దర్శించి ఆ మీదట ఒంటిమిట్ట చేరి చెరువులో ఇరువురు దంపతులు తలంటి స్నానం చేసి శ్రీకోదండరాముని తనివితీరా సందర్శించి, పూజారి ఇచ్చిన తీర్థ ప్రసాదాలను పుచ్చుకుని కండ్లకద్దుకుని ఆరగించారు. కొద్దిసేపు విరామం అనంతరం పరివారం వెంటరాగా నందలూరు చేరుకున్నారు.
బాహుదా నది (చెయ్యేరు) లో స్నానం చేసి సౌమ్యనాథస్వామిని దర్శించి, అత్తిరాల పరశురామస్వామిని తిలకించి, తాళ్ళపాక అన్నమయ్యను అవలోకించి, రాజంపేట కొండమీద కొలువై ఉన్న శ్రీ నరసింహస్వామిని ఆనందమున కొలిచి మలిదినం కడప నగరంలో ప్రవేశించారు అందరూ.
బుగ్గేరు జన్మస్థానమున ముమ్మారు మునిగి దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వరస్వామిని తన్మయంతో దర్శించి, కీర్తించి, వినాయక నగర్లో వెలసిన దుర్గామాతను ధ్యానించి, అలంఖాన్ పల్లెలో నెలవైవున్న విష్ణుమూర్తి నూరడుగుల విగ్రహాన్ని తిలకించి పులకించిపోయారు.
చివరగా దక్షిణకాశీగా పిలువబడుతున్న పుష్పగిరి క్షేత్రం చేరి కొంతకాలం సేదతీరారు తిరుకొండలమ్మ, వారి పరివారం.
పవిత్రమైన పెన్నా నదీమతల్లి పావన జలాలలో భార్యాభర్తలిద్దరూ అభ్యంగన స్నానం ఆచరించి పుష్పగిరీశుడైన చెన్నకేశవుని, హరిహరనాథుడైన శివుని పరమానందభరితంగా వీక్షించి, అర్చించి ధన్యులమయ్యామని సంతృప్తి చెందారు తిరుకొండలమ్మ, వాసుదేవరెడ్డి దంపతులు. కొన్ని దినముల అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.
పాపాఘ్ని నదీతీరం వెంబడి ప్రయాణిస్తూ దేవరాజుపల్లె సమీపాన ఉన్న వనంలో ప్రవేశించారు. అక్కడికి రాగానే వాసుదేవరెడ్డికి విపరీతమైన ఆయాసం మొదలైంది. ఊపిరితిత్తులు ఎగసిపడుతున్నాయి. పక్క భాగాలు విరామం లేకుండా కొట్టుకుంటున్నాయి. మాటలు రావడం కష్టంగా ఉంది.
"తిరూ! నేను ఇంకా ప్రయాణించలేను. భూమి మీద నా కర్తవ్యం సమాప్తమైంది. నేను ఇక్కడే నా ప్రస్థానాన్ని ముగిస్తాను. తల్లిదండ్రులు, బంధువులను రప్పించి, నా ప్రస్థానానికి ఏర్పాట్లు చేయించు తిరుకొండలమ్మా!" ఆయాసంతో రొప్పుతూ చెప్పాడు వాసుదేవరెడ్డి.
తిరుకొండలమ్మ తనతో ఉన్నవారితో "నేను నా భర్తోపాటు సహగమనం చేస్తాను. వెళ్లి మన బంధుమిత్రాదులకు తెలపండి" అని తన స్థిర నిర్ణయాన్ని తెలియజేసింది. వారు స్వస్థలాలకు పోయి విషయం తెలియజేశారు. ఆ వార్త దావానలంలా జనంలో వ్యాపించింది.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలతోపాటు తల్లిదండ్రులు, అత్తామామలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, బావా మరుదులు, వదినా మరదళ్లు అందరూ ఆందోళనతో వచ్చారు. జనసందోహంతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అందరిలో అంతులేని విషాదం అలుముకుంది.
కార్తీకమాసం శుక్లపక్ష దశమినాడు సూర్యోదయమే వాసుదేవరెడ్డి అసువులు బాసి అమరుడయ్యారు.
వాసుదేవరెడ్డి పార్థివదేహానికి స్నానం చేయించి పూలమాలలతో అలంకరించి గంధం పూసి పరిమళాలు చల్లి సమాధి గొయ్యిలో పరుండపెట్టారు.
అందరూ వారిస్తున్నా, విలపిస్తున్నా వినకుండా తిరుకొండలమ్మ దవళవర్ణ చీర, రవిక ధరించి పాపాఘ్ని నదిలో నిండుగా మునిగి, తల్లిదండ్రులుకు, అత్తామామలకు పాదాభివందనం చేసింది. చుట్టూ మూగిన జనానికి నమస్కరించి "ప్రజలారా! నన్ను నమ్మి కొలిచిన వారి కోరికలు తీరుస్తాను. బాధలు, కష్టాలు తొలగిస్తాను. నాకు ఏటేటా తిరునాళ్ల జరపండి. సంతర్పణలు చేయండి. మిమ్మల్ని, మీ ఊర్లను కాపాడుతాను" అని చివరి మాటగా చెప్పి సమాధి గోతిలోకి దిగి, పద్మాసనంలో కూర్చొని భర్త తలను ఒడిలో తీసుకుని, కళ్లుమూసుకుని యోగా ధ్యానంలో సమాధి స్థితిలోనికి పోయింది తిరుకొండలమ్మ.
తిరుకొండలమ్మ ముఖానికి పసుపు రాసి, నొసట కుంకుమ బొట్టు పెట్టి మెడలో పూలమాల వేసి అలంకరించారు. నిమ్మకాయలు దండగా కూర్చి తిరుకొండలమ్మ మెడలో వేశారు. దీపం వెలిగించి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చారు. నిమ్మకాయలు కోసి అమ్మకు ఇరుప్రక్కలా దిగదీశారు. ప్రజలందరూ పూలు జల్లారు.
"తిరుకొండలమ్మకు జై! తిరుకొండలమ్మకు జైజై!" జనం ఉచ్చస్థాయిలో పలికారు. ఆ పలుకులకు దిక్కులు ప్రతిధ్వనించాయి. "తిరుకొండలమ్మ అమరురాలు అగుగాక" అని ప్రజలు అంటుండగా మట్టితో సమాధి గోతిని కప్పారు.
తిరుకొండలమ్మ సమాధి చుట్టూ నిండు కడవ నీళ్లు ధారపోసి, సమాధిని పూలదండలతో అలంకరించి, అగరుబత్తీలు వెలిగించి, ధూపం వేసి టెంకాయలు కొట్టారు. జనం తిరుకొండలమ్మ సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తిశ్రద్ధలతో మ్రొక్కారు. రాత్రంతా భక్తి పాటలతో చెక్కభజనలు, కోలాటాలు ఆడారు.
అటు కొంత కాలానికి దివ్యమైన దేవాలయం నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏటేటా కార్తీకమాసం శుక్లపక్ష దశమినాడు అంగరంగ వైభవంగా తిరునాళ్లు జరుపుతూ వచ్చారు. ప్రజలు తండోపతండాలుగా తిరుకొండలమ్మ తిరునాళ్లకొచ్చి అమ్మను దర్శించి మ్రొక్కులు తీర్చుకుంటున్నారు.
అప్పట్లో అమ్మ భక్తులతో మాట్లాడేది. కోరిన కోర్కెలు తీర్చేది. వనంలోకి పశువులను మేపుకోవడానికి వచ్చిన కల్లాకపటం ఎరగని, అభంశుభం తెలియని పిల్లలతో అమ్మవారు ఆడుకొనేదట. ఉరుములు మెరుపులతో వాన వచ్చినప్పుడు "అమ్మా! తిరుకొండలమ్మా! భయంగా ఉందమ్మా! మమ్మల్ని కాపాడు తల్లీ!" అని పశువుల పిల్లలు వేడుకున్నప్పుడు "రేయ్ పిల్లలూ! భయపడకండీ! నేను ఉన్నాను. నేను చూసుకుంటాను" అని వారికి ధైర్యం కలిగించేది.
ఇలా ఉండగా ఒకరోజు నాగప్ప అనే పేరుగల వ్యక్తిఅమ్మవారి గుడికి వచ్చి కాయకర్పూరాలు సమర్పించి "అమ్మా! తిరుకొండలమ్మా! తల్లీ! నేను నా బిడ్డకు పెళ్లి చేస్తున్నానమ్మా! నా బిడ్డకు పెళ్లిలో పెట్టడానికి నా దగ్గర ఆభరణాలు లేవు తల్లీ! నీ ఆభరణాలు ఇస్తే పెళ్లి అయిపోగానే ఇస్తానమ్మా" అని వేడుకున్నాడు. అమ్మవారు తన నగలు ఇస్తూ "పెళ్లి అయిపోగానే ఆభరణాలు తెచ్చి ఇవ్వు" అంది. "అలాగే ఇస్తానమ్మా!" అని చెప్పి నగలు తీసుకుని పోయి బిడ్డకు నగలు పెట్టి పెళ్లి చేశాడు నాగప్ప.
పెళ్లి అయిపోయింది, తిరిగింపులు మరగింపులు కూడా అయిపోయాయి. అమ్మవారు "రేయ్! నాగప్పా! పెళ్లి అయిపోయింది కదా! సొమ్ములు ఇవ్వలేదేమిరా?" అడిగింది.
"అమ్మా! ఇప్పుడే కదా పెళ్లి అయిపోయింది. అమ్మాయి ఒంటి మీది నుంచి సొమ్ములు తీసిస్తే ఇయ్యలవారు ఏమనుకోవాలి! కొంత సమయం ఆగమ్మా!" అన్నాడు నాగప్ప.
"సరే" అనుకుంది అమ్మవారు.
నెల దినములు గడిచాయి. తిరుకొండలమ్మ తల్లి మరోసారి జ్ఞాపకం చేసింది, "ఏరా నాగప్పా! మాసం దినాలు గడిచాయి. నగలు ఇవ్వలేదేమిరా?" అన్నది.
"అమ్మా! కొంత కాలం ఆగవమ్మ తల్లీ! ఇస్తాను" అన్నాడు నాగప్ప.
"అలాగే ఆరు మాసాలకు ఇవ్వు" చెప్పింది అమ్మవారు.
ఆరు నెలలు కూడా గడిచాయి. "ఏరా నాగప్పా! నగల విషయం మరిచావా ఏమిరా?" గుర్తు చేసింది అమ్మ.
"లేదమ్మా! అమ్మాయి ఈసారి పుట్టింటికి వచ్చినప్పుడు తీసి ఇస్తానమ్మా!" సర్ది చెప్పాడు నాగప్ప.
ఏడాది గడిచింది. అమ్మాయి పండుగకు పుట్టింటికి వచ్చింది. తిరుకొండలమ్మవారు "ఏమిరా నాగప్పా! ఆభరణాలు ఇవ్వాలనుకున్నావా! ఇవ్వొద్దు అనుకున్నావా! చెప్పరా" అని అడిగింది.
"ఏమ్మా! తల్లీ! నీ నోరు ఇంకా పడిపోలేదా?" కఠినంగా, గట్టిగా అన్నాడు నాగప్ప.
అంతే! ఇంకా అప్పటినుంచి అమ్మవారు ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరికీ కనబడలేదు.
అయితే తరతరాలుగా తనను నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తూ, బాధలు కష్టాలు తొలగిస్తూవస్తూ ఉన్నది అమ్మవారు తిరుకొండలమ్మ.
----------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను











Comments