తుది నిర్ణయం
- Lakshminageswara Rao Velpuri

- Dec 28, 2025
- 9 min read
#లక్ష్మీనాగేశ్వర రావువేల్పూరి, #LakshminageswaraRaoVelpuri, #తుదినిర్ణయం, #ThudiNirnayam, #TeluguKathalu, #తెలుగుకథలు

Thudi Nirnayam - New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri Published In manatelugukathalu.com On 28/12/2025
తుది నిర్ణయం - తెలుగు కథ
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
పురుషోత్తం గారు ఒక రిటైర్డ్ టీచర్. ఆయన తన గౌరవ అధ్యాపక వృత్తిలో అంచలంచెలుగా ఎదిగి హెడ్మాస్టర్‌గా రిటైర్ అయ్యి, భార్య ప్రమీల గారితో, ఇద్దరు కొడుకులతో క్రమశిక్షణ అవలంబిస్తూ, పరులకు సహాయపడుతూ, జీవితాన్ని వృథా చేయకుండా, తీరిక సమయాలలో మురికివాడలలో ఉన్న బడుగు కుటుంబాల పిల్లలకు తనకు తోచిన విధంగా చదువు చెప్పిస్తూ, అందరికీ ఆదర్శవంతుడైన అధ్యాపకుడిగా పేరుగాంచి, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ” బిరుదును, సత్కారాన్ని కూడా అందుకున్నారు.
భార్య ప్రమీల గారు కూడా తనకు తోచిన విధంగా భర్త మాట జవదాటకుండా, పిల్లలు ఇద్దరినీ ఎంతో జాగ్రత్తగా పెంచుతూ, వారికి మంచి చదువులు చెప్పిస్తూ, కొన్నేళ్లపాటు కంటికి రెప్పలా కాస్తూ వారు ‘బీటెక్’ చదివే వరకు పురుషోత్తం గారు, ప్రమీల గారు వారి వయసుకు మించి చదివించారు.
పెద్ద కొడుకు అఖిల్, రెండవ కొడుకు నిఖిల్ కూడా ఎంతో క్రమశిక్షణతో పెరిగి తమ చదువుల్లో ఎంతో రాణించారు.
అఖిల్ తన కంప్యూటర్ ఇంజనీరింగ్‌ను గీతం కాలేజీలోను, నిఖిల్ ఆంధ్ర యూనివర్సిటీలోను పూర్తి చేసి, క్యాంపస్‌లో సాధించిన ఉద్యోగాలతో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో జాయిన్ అయ్యి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్నారు.
విశాఖపట్నంలోని మధురవాడలో పురుషోత్తం గారు ఒక పెద్ద స్థలంలో నాలుగు బెడ్‌రూముల ఇల్లు, సర్వీస్ అయిపోయాక వచ్చిన డబ్బుతో కట్టించారు. కొడుకులు ఇద్దరూ ప్రయోజకులైన వారి సాయం తీసుకోకుండానే, తనకు వచ్చిన డబ్బుతోనే స్వయంగా దగ్గరుండి కట్టించారు. కొడుకులిద్దరికీ ఎలాంటి బాధ్యత లేకుండా తనే స్వయంగా అన్నీ చూసుకున్నారు హెడ్మాస్టర్ పురుషోత్తం గారు.
పెద్ద కొడుకు అఖిల్ ఒకరోజు ఆనందంగా ఇంటికి వచ్చి, “నాన్నగారు! అమ్మా! మీకు ఒక శుభవార్త. ఈరోజు నాకు అమెరికాలో ఒక పెద్ద కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ఎంతగానో శ్రమించి ఉద్యోగం సాధించాను. ఇదిగోండి ఆఫర్ లెటర్,” అంటూ నాన్నగారి చేతికి అందించాడు.
“అమ్మా! నాకు ఇండియాలో కన్నా నాలుగు రెట్ల జీతంతో కాలిఫోర్నియాలో ఉద్యోగం వచ్చింది. ఇది నా జీవితాశయం. ఇదంతా మీ దయ వల్లే!” అంటూ ఉద్వేగంగా తల్లిదండ్రులకు ఆఫర్ లెటర్ చూపించి కాళ్లకు మొక్కాడు అఖిల్.
పురుషోత్తం గారు ఆనందంతో కళ్ళు తుడుచుకుంటూ, “ఒరేయ్ అఖిల్! మాకు వృద్ధాప్యంలో సాయంగా ఉండు. ఇదంతా దేవుడి దయ. తప్పకుండా వెళ్ళు. ఒక సంవత్సరం పాటు గట్టిగా కష్టపడి, తమ్ముడు నిఖిల్‌కీ మంచి భవిష్యత్తు ఉండేటట్లు చూడు నాయనా,” అని ఆశీర్వదించారు.
“అమ్మా! నిన్ను వదిలి వెళ్లాలంటే నాకు ఎంతో బాధగా ఉంది. వచ్చే వారమే నా ప్రయాణం. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో,” అంటూ ఏడ్చేశాడు అఖిల్.
“ఊరుకోరా కన్నా! ఎప్పటికైనా నువ్వు వృద్ధిలోకి వచ్చి తమ్ముడినీ నీలా ప్రయోజకుడిని చెయ్యి,” అంటూ ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకుంది తల్లి ప్రమీల గారు.
అలా సంవత్సరాలు గడిచాయి. పురుషోత్తం గారు తన వృద్ధాప్యంలో కూడా పరులకు సేవ చేస్తూ మన్ననలు పొందుతున్నారు. ఈ లోగా అఖిల్ పెండ్లి చేసి కొడుకు, కోడలును అమెరికా పంపిస్తూ, తమ్ముడు నిఖిల్‌ను కూడా తయారుగా ఉండమని, తనకున్న పరపతితో కాలిఫోర్నియాలో ఒక మంచి ఉద్యోగం ఇప్పించాడు అన్న అఖిల్. నిఖిల్ కూడా కొత్త ఉద్యోగం వాషింగ్టన్‌లో చేయసాగాడు.
ఒక రెండేళ్ల తర్వాత అఖిల్, నిఖిల్ బాగా స్థిరపడి పెళ్లిళ్లు చేసుకుని, సొంత ఇల్లు కూడా కట్టించుకున్నారు. అప్పుడే అమ్మానాన్నలను ఒక్క ఆరు నెలలకు ఉండడానికి రమ్మని పిలిచారు. అలాగే పురుషోత్తం గారు, ప్రమీల గారు పెద్ద కొడుకు ఇంట్లో ఒక నెల, రెండవ కొడుకు ఇంట్లో ఒక నెల ఉండి, అక్కడి చల్లని వాతావరణం, ఒంటరితనం, కోడళ్ల అతి మర్యాద నచ్చక సతమతమవుతూ ఉన్నారు.
ఒకరోజు పెద్దకొడుకు అఖిల్‌ను పిలిచి, “ఒరేయ్! మేము ఇండియాకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఉండలేక కాదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. కోడళ్ళు కూడా ఉద్యోగం కోసం వెళ్ళిపోతారు. మనవళ్లు స్కూల్‌కు వెళ్ళిపోయాక మాకు బొత్తిగా తోచటం లేదు. అదే మా వైజాగ్‌లో అయితే నాకు ఏదో రకమైన సేవా కార్యక్రమాలలో బిజీగా ఉంటాను. అక్కడ నా అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ మీకు భారంగా ఉండలేము. కనుక మాకు ఇండియాకి టికెట్లు బుక్ చేసేయ్,” అని అనగానే, “అయ్యో నాన్న! ఏంటి ఇంత తొందరగా వెళ్ళిపోతారు?” అని కనీస మర్యాద కూడా లేకుండా, “అలాగే నాన్నగారు! నేను టికెట్లు బుక్ చేస్తాను,” అనేసి వెళ్ళిపోయాడు అఖిల్.
అన్నదమ్ములు ఇద్దరూ మారు మాట్లాడకుండా తల్లి, తండ్రిని కాలిఫోర్నియా ఎయిర్‌పోర్ట్‌లో దిగబెడుతూ, “నాన్నగారు! మీరు అమ్మను జాగ్రత్తగా ఉండండి. ఏ అవసరం వచ్చినా డబ్బు పంపిస్తాను. ఆస్తమానం మిమ్మల్ని చూడ్డానికి కుటుంబ సమేతంగా రావడం కుదరదు. అమ్మ కసలే ఆరోగ్యం బాగోలేదు. మంచి వంటమనిషిని పెట్టండి. నెలకు ఒకసారి మన డాక్టర్ను ఇంటికి పిలిచి అన్ని చెకప్‌లు చేయించుకోండి. దేనికి బెంగపడకండి!!” అంటూ ఇద్దరు కొడుకులు, కోడళ్ళు సాగనంపగా ఫ్లైట్ ఎక్కేశారు తల్లిదండ్రులు.
ఎంతో భారం దిగిపోయినట్లు సంతోషంగా కొడుకులిద్దరూ ఎవరికి వాళ్ళు వెళ్లిపోయారు.
పురుషోత్తం గారు, ప్రమీల గారు తమ వృద్ధాప్యంలో కూడా తమ పనులు చేసుకుంటూ, వీడియో కాల్ చేసి కొడుకులు, కోడళ్లతోను ముఖ్యంగా మనవులతో మాట్లాడుతూ కాలం గడపసాగారు. పురుషోత్తం గారికి 80 ఏళ్లు దాటాయి. కాస్త నిదానంగా ఉంటూ, ఆస్తమాను భార్య ప్రమీల గారి ఆరోగ్యం దిగజారుతూ ఉండడంతో, కొడుకులకు ఫోన్ చేసి, “ఒరేయ్! మీరిద్దరూ ఒకసారి రండి రా! అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు.
డాక్టర్లు ఆసుపత్రిలో జాయిన్ చేయమన్నారు,” అని చెప్పగానే, “నాన్నగారు! అమ్మకి ఏమి పరవాలేదు. ఇప్పట్లో రావడం కుదరదు. నేను డాక్టర్‌తో మాట్లాడుతాను. మీరు ఆసుపత్రిలో జాయిన్ చేయండి,” అంటూ నిష్కర్షగా సమాధానం చెప్పారు.
పురుషోత్తం గారు మనసులో ఎంతో వ్యథ చెందుతూ, “అలాగే నేనే చూసుకుంటాను,” అంటూ తనే అన్ని విధాల భార్య ప్రమీల గారిని ఆసుపత్రిలో జాయిన్ చేసి అక్కడే పడుకునేవారు.
గంటకొకసారి భార్య, “ఏమండీ! నాకు సమయం దగ్గర పడుతున్నట్లు ఉంది. అబ్బాయిలు వచ్చారా? ఒక్కసారి వాళ్ళని చూసి వెళ్ళిపోతాను!” అంటూ దీనంగా కళ్ళంట నీళ్లు కారుతుండగా అడుగుతుంటే, “వస్తారే! వాళ్లకూ ఉద్యోగాలలో సెలవులు దొరకాలిగా! నువ్వు ఏం భయపడకు. వాళ్ళిద్దరూ త్వరలోనే వస్తారు,” అంటూ వణుకుతున్న గొంతుతో భార్యకు ధైర్యం చెప్పేవారు పురుషోత్తం గారు.
ఆరోజు ప్రమీల గారు భర్తతో, “ఏవండీ! నాకు చాలా బెంగగా ఉంది. వాళ్ళిద్దరూ కూడా రాలేదు. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే మీరు ఎలా బ్రతుకుతారు ఈ వయసులో?” అంటూ భర్త పురుషోత్తం గారి చెయ్యి పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగితే, “ఒసేయ్ పిచ్చిదానా! నీ కొడుకులు చాలా ప్రయోజకులయ్యారే. అంతా డాలర్లలో అర్జిస్తున్నారు. ఒక్కరోజు వేస్ట్ అయినా వేలల్లో డబ్బు పోతుంది. అందుకే రాలేకపోతున్నారు. నీకు ఏమీ కాదులే. హాయిగా పడుకో!” అంటూ నగ్నసత్యాలు చెప్పారు భార్యకు.
ఆరోజు రాత్రి పురుషోత్తం గారు హాస్పిటల్‌లో కలచివేసిన మనసుతో నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్న సమయంలో ICU నుంచి కబురు వచ్చింది. డాక్టర్ గారు రమ్మన్నారని. అదిరిపోతున్న మనసుతో, “ఏమైంది డాక్టర్ గారు?” అని అడగగా, “ముందు మీరు కూర్చోండి. మీ భార్యకు అన్ని విధాల ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ పెట్టిన ఫలితం కనిపించుటలేదు. ఆమెకు మందులు కూడా వికటిస్తున్నాయి. ఆపరేషన్ చేసే వయసు కాదు. ఇంకా మీరు పరిమిషన్ ఇస్తే బూస్టర్ ఆక్సిజన్ పెడతాము వెంటిలేటర్ సహాయంతో. ఆ పైన దేవుడు దయ,” అంటూ చెప్పేసరికి,
పురుషోత్తం గారికి కాలి కింద భూమి విడిపోతున్నట్లుగా, తాను అగాధంలోకి కూరుకుపోతున్నట్టుగా అనిపించింది.
నిలువల్లా వణికిపోతూ, “ఏదైనా చేయండి డాక్టర్ గారు! నా భార్య ప్రాణం కాపాడండి. మాకు ఉన్న ఇద్దరు కొడుకులు అమెరికా నుంచి వచ్చేసరికి సమయం పడుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆవిడ ప్రాణం కాపాడండి!” అంటూ డాక్టర్ గారి చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డారు పురుషోత్తం గారు.
ఆ తర్వాత పెద్ద కొడుకు అఖిల్‌కు ఫోన్ చేసి, “ఒరేయ్! అమ్మ పరిస్థితి అర్థం కావడం లేదు. డాక్టర్లు చివరి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఒకసారి డాక్టర్‌తో మాట్లాడి, తొందరగా నువ్వూ తమ్ముడు, కోడళ్ళు వచ్చేయండి. నా పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు!” అంటూ గద్గద స్వరంతో చెప్పగానే, “ఉండండి నాన్నగారు! నేను డాక్టర్‌తో మాట్లాడుతాను. కంగారు పడకండి,” అంటూ డాక్టర్ గారికి ఫోన్ చేసి అన్ని విషయాలు అడిగాడు అఖిల్.
డాక్టర్ గారు చెప్పిన విషయాలు విని బాగా నిరాశ చెంది, మళ్లీ నాన్నగారికి ఫోన్ చేసి, “మీరు కంగారు పడకండి. నేను బయలుదేరి వస్తాను,” అంటూ ఫోన్ పెట్టేశాడు.
వెంటనే వాషింగ్టన్‌లో ఉన్న తమ్ముడు నిఖిల్‌కు ఫోన్ చేసి, “ఒరేయ్! అమ్మకు అస్సలు పరిస్థితి బాగోలేదు. నేను డాక్టర్‌తో మాట్లాడితే ఇవాళ రేపు అంటున్నారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నాన్నగారు ఒక్కరే అన్నీ చూసుకోలేకపోతున్నారు. నేను ఇవాళ అర్జెంటుగా బయలుదేరుతున్నాను. నువ్వు వస్తావా? మళ్లీ అమ్మ మొఖం చూసే అదృష్టం ఉండదు,” అని ఏడుస్తూ చెప్పగానే, “అన్నయ్య! నీకు తెలుసుగా ఇక్కడ మాకు ఆడిటింగ్ జరుగుతుంది. అసలు ఎలాంటి పరిస్థితిలోనూ సెలవు ఇవ్వరు. ఈసారి నువ్వు వెళ్లి రా. అమ్మకు ఏమీ కాదులే. నేను ఆడిటింగ్ అయిపోయాక ఎలాగో ఒకలాగా వస్తాను,” అంటూ ఫోన్ పెట్టేశాడు నిఖిల్.
ఆగమేఘాల మీద భార్యాబిడ్డలను వదిలి అఖిల్ ఒక్కడే బయలుదేరి విశాఖపట్నం చేరుకున్నాడు. రెండు రోజుల ప్రయాణంలో తండ్రితో మాట్లాడుతూనే ఉన్నాడు అఖిల్. వైజాగ్ చేరేలోపలే తల్లి ప్రమీల గారు కొడుకుల కోసం బెంగతో పరమపదించిన విషయం తెలిసింది.
తమ్ముడు నిఖిల్ కూడా నాన్నగారికి ఫోన్ చేసి, “ఏం బెంగపడకండి. అన్నీ దగ్గరుండి అన్నయ్య చూసుకుంటాడు. నేను ఆఫీస్ పనిలో ఉన్నాను, సెలవు దొరకలేదు. నేను, మీ కోడలు చాలా బాధపడుతున్నాము. ఈసారికి అన్నయ్య అన్నీ చూసుకుంటాడు. ఇంకొకసారి రావాలన్నా నేనే వస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త,” అంటూ ఫోన్ పెట్టేశాడు రెండవ కొడుకు నిఖిల్.
ఎంతో నిస్వార్థంగా కొడుకులను పెంచి పెద్ద చేసిన తల్లి మృతదేహాన్ని చూస్తూ వెక్కివెక్కి ఏడుస్తూ, చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తూ పది రోజులపాటు ఉన్న తర్వాత, “నాన్నగారు! ఇక్కడ అన్నీ అమ్మేసి నాతో పాటు వచ్చేయండి. మీరు ఒక్కరే ఇక్కడ ఎందుకు?” అనేసరికి, “ఒరేయ్ అఖిల్! నువ్వు చిన్న కొడుకు అంటూ రెండు కళ్ళులా చూసుకుని, బ్రతికున్న అమ్మకి చివరి క్షణాలలో నేను తప్ప, అనాధగానే వెళ్ళిపోయింది. రేపు నాకు కూడా అదే పరిస్థితి. అయినా పర్వాలేదు. నేను ఒక్కడినే ఉంటాను. నాకోసం బెంగపడకు,” అంటూ ఏడుస్తూ, తల్లి చనిపోయిన నిఖిల్‌కు ఏ మాత్రం ప్రేమ లేదు. కనీసం వచ్చి చివరి చూపైనా చూడకుండా అమెరికాను ఉద్ధరిస్తున్నాడు.
అయినా పెద్ద చదువులు, ఉద్యోగాల కోసం ఆసరాగా ఉండవలసిన పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్న తల్లిదండ్రులను తిట్టాలి! వారి సుఖాల కోసం స్వదేశాన్ని వదిలి, తుచ్ఛమైన ఐశ్వర్యం కోసం విదేశాలు పరిగెడుతున్నారు. ఏరోజైనా పిల్లలు కళ్ళ ముందు ఉంటే, తల్లిదండ్రుల ఆరోగ్యం 90 ఏళ్లు వచ్చినా చెక్కుచెదరదు. కోడళ్ల సేవతోనైనా, మనవల అల్లరితోనైనా నిత్యం ఆరోగ్యంగా ఉంటారు. కానీ మాకు అదృష్టం లేదు.
“పోనీలేరా! నువ్వు వెళ్ళు. నీ భార్యాబిడ్డలు ఒంటరిగా బతకలేరు. నీ తమ్ముడికి చెప్పు—నువ్వు అమ్మ పోయినప్పుడు వచ్చి దహన సంస్కారాలు చేశావు. నేను పోయినప్పుడు నువ్వు రానక్కరలేదు. నీ తమ్ముడు వంతు కాబట్టి వాడిని రమ్మను. అన్నీ నువ్వే చూసుకుంటే నాకు ఇద్దరు కొడుకులు ఎందుకు? నువ్వు బయలుదేరు నాన్న, నీ ఫ్లైట్ టైం అవుతుంది,” అంటూ పెద్ద కొడుకు అఖిల్‌ను సాగనంపారు పురుషోత్తం గారు.
పెద్ద కొడుకు అఖిల్ వెళ్ళిపోయగానే, పురుషోత్తం గారు తన జీవితంలో ఎన్నడూ లేనంత ఒంటరితనంతో కుమిలిపోతూ, చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు.
తన 83 ఏళ్ల వయసులో ఒంటరితనం భరించలేక కొడుకుల కోసం ఒక సంవత్సరం వేచి చూశారు. అయినా ఫోన్ సంభాషణలు మాత్రమే చేస్తూ, “మీ ఆరోగ్యం జాగ్రత్త!” అన్న మాటే అన్నారు కానీ ఒక్కరు వచ్చిన పాపాన పోలేదు.
కోడలు, మనవళ్లు కూడా “తాతగారు బాగున్నారా?” అన్న మాటలు తప్ప ఎలాంటి స్పందన లేకపోవడంతో, తన తుది నిర్ణయం అమలు చేయడానికి సిద్ధపడ్డారు పురుషోత్తం గారు.
ఆ మర్నాడు తనకు తెలిసిన స్నేహితుడైన పెద్ద లాయర్ గోవిందు గారి దగ్గరికి వెళ్లి, తను కట్టించిన మూడంతస్తుల బిల్డింగ్, ముందు ఖాళీ జాగా అంతా కూడా తన స్వయంగా సంపాదించిన ఆస్తి కాబట్టి, దానిని “శ్రీ ప్రమీల అనాధ శరణాలయం” పేరుమీద తన యావదాస్తిని రిజిస్టర్ చేయమని చెప్పి, అనాధాశ్రమం బాగోగుల కింద పురుషోత్తం గారికి అన్ని అధికారాలు ఉంటాయని, తన తదనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తిగా పరిగణించి, పేదలకు, అనాధలకు, వృద్ధులకు, వికలాంగులకు అన్ని విధాల సాయపడేటట్టు రిజిస్టర్ చేయమని వకీల్ శ్రీ గోవింద్ గారికి తన ఆస్తి కాయితాలు అన్నీ ఇచ్చారు.
“సార్! మీరు ఎలాగైనా ‘శ్రీ ప్రమీల అనాధాశ్రమం’ రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి. దీని మీద హక్కు నేను ఉన్నంతవరకు నా పేరు మీద, పోయిన తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లి, నిరంతరంగా ప్రజలకు సేవ చేయాలని రిజిస్టర్ చేయండి!” అనగానే వకీల్ గోవింద్ గారు ఆశ్చర్యపోతూ, “అదేంటి సార్! మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారికి చెందవలసిన ఇంత పెద్ద ఆస్తిని ఇలా ఉదాత్తంగా దానం చేస్తున్నారు. కారణం అడగొచ్చా?” అని అనగానే, పురుషోత్తం గారు నవ్వుతూ,
“అయ్యా! మీకు పిల్లలు ఉన్నారు. వారికి మంచి చదువు, సంస్కారం నేర్పించి వారి ఉన్నత స్థితిని తలుచుకుంటూ గర్వపడుతుంటాము. అధిక అర్చన కోసం వాళ్లు విదేశాలు వెళ్తామన్నా, మనం పెళ్లిళ్లు చేసి మరీ పంపిస్తాం. కానీ అక్కడి సుఖాలకు, డాలర్ల సంపాదనకు అలవాటు పడి తల్లి తండ్రి బతికున్నారో లేదో అన్న విచారం కూడా చేయకుండా, ఎప్పుడో ఒకసారి వచ్చి మన భారతదేశ పరిస్థితులు, సాంప్రదాయాలు పిల్లలకు అలవాటు చేయకపోగా, విదేశాలను వదిలి వచ్చే ఆలోచన కూడా చేయకుండా, ఇక్కడి పరిస్థితులు మరిచిపోయి, తల్లిదండ్రులను గాలికి వదిలి, ప్రతిదీ డబ్బుతో కొనవచ్చునని అపోహపడుతూ, ఆప్యాయతలు, అభిమానాలు వదులుకొని విదేశాల్లోనే స్థిరపడిపోతున్నారు.
అందుకే నేను నా ‘తుది నిర్ణయం’ ఈ రకంగా తీసుకున్నాను. జీవితాంతం నా భార్య, నా కోసం, పిల్లల కోసం అహోరాత్రులు కష్టపడుతూ, కంటికి రెప్పలా కాపాడుతూ, అనారోగ్యం పాలై, పిల్లలు రాలేదన్న బెంగతో చనిపోయింది. అందుకే రేపు నా పరిస్థితి కూడా అదే అన్న కృతనిశ్చయంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు అతి తొందరగా నా భార్య పేరు మీద ‘శ్రీ ప్రమీల అనాధాశ్రమం’ అంటూ నామకరణం కూడా రిజిస్టర్ చేసి నాకు సహాయం చేయండి, దయచేసి!”
అనగానే, “తప్పకుండా సార్! నిజంగా మీ తుది నిర్ణయం భావితరాలకు గుణపాఠం అవుతుంది,” అంటూ పురుషోత్తం గారి రెండు చేతులు పట్టుకొని కరచాలనం చేస్తూ, “ఈ వారంలోని మిగతా పనులు మాని మీ పని చేయిస్తాను!” అంటూ కళ్ళల్లో నీరు తిరుగుతుండగా వకీల్ గోవింద్ గారు పురుషోత్తం గారిని ఆఫీసు బయట వరకు వచ్చి సాగనంపారు.
అలా పురుషోత్తం గారు విశాఖపట్నంలోని అనాధలను, స్వార్థపూరిత పిల్లలు తల్లిదండ్రులను అనాధలుగా మారుస్తున్న సమయంలో వారిని తీసుకువచ్చి, ఎంతో దయతో, ఆప్యాయతతో వారికి ఆశ్రయం కల్పించి, ఊరు, వాడ తిరిగి వికలాంగులను కూడా తన ఆశ్రమానికి తెప్పించి, వారందరికీ భోజన సదుపాయాలు, ఆరోగ్య సమస్యలను పరిరక్షిస్తూ, అనతికాలంలోనే అతిపెద్ద అనాధాశ్రమంగా మారింది “శ్రీ ప్రమీల అనాధాశ్రమం”.
మంచి గుర్తింపుతో ముందుకు సాగిపోతున్న అనాధాశ్రమాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి, ప్రోత్సాహకారాలు అందజేస్తూ ఉంది. ఈ వార్త అన్ని పత్రికలలోనూ ఎనలేని సేవ చేస్తున్న “మాస్టర్ పురుషోత్తం” గారిని అభినందిస్తూ ప్రశంసలు తెలిపింది.
ఈ విషయాలన్నీ ఆ నోట ఈ నోట తెలుసుకున్న కొడుకులు ఆశ్చర్యపోతూ, “అదేంటి నాన్నగారు! ఒక్కరే ఇంత సాధించారా?” అనుకుంటూ ఫోన్ చేసి నాన్నగారికి అభినందనలు చెబుతూ, తాము వచ్చే నెల వస్తున్నామని, కుటుంబాలతో సహా వచ్చి కలుస్తామని చెప్పారు.
“ఒరేయ్! మీరు తప్పకుండా రండి. నేను కూడా చివరి దశలో ఉన్నాను, చూసి పోండి,” అంటూ నిరాశగా సమాధానమిచ్చారు పురుషోత్తం గారు.
పురుషోత్తం గారు ఎంతో హడావిడిగా ప్రమీల అనాధాశ్రమం కోసం కట్టిన మరో ఆరు గదుల ఇల్లు కూడా అనాధలతో నింపి, మొత్తం 50 మంది వరకు వికలాంగులు, వృద్ధులను చేరదీసి, మొత్తం తన ఆస్తినంతా శ్రీ ప్రమీల అనాధాశ్రమం పేరు మీద చేసేశారు. ఈ హడావుడి పనులలో ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించసాగింది. అయినా లేని ఓపిక తెచ్చుకుని అన్నీ స్వయంగా చూసుకునేవారు.
మరుసటి నెల ఇద్దరు కొడుకులు అఖిల్, నిఖిల్ తమ కుటుంబాలతో సహా విశాఖపట్నం వచ్చేశారు. తమ ఇంటికి చేరుకోగానే ఇల్లు రూపురేఖలు చూసి నిర్గాంతపోయారు. ఇదేమిటి! అమ్మ పేరు మీద మొత్తం 500 గజాల ఇల్లు ఉండడంతో ఆశ్చర్యపోతూ హడావిడిగా లోపలికి వెళ్లి చూశారు. మొత్తం పది గదులలో అనాధులు, వికలాంగులు, వృద్ధులు ఉండడం చూసి, “ఎవరు వీరంతా!” అంటూ గుండెలు అదురుతుండగా, “నాన్నగారు! నాన్నగారు!” అంటూ పిలుస్తూ లోపలికి వెళ్లారు.
పురుషోత్తం గారు ఆ సమయానికి తన గదిలో మంచం మీద ఆయాసంతో పడుకొని ఉండడం చూసి అవాక్కైపోయారు. “ఏమిటిది నాన్నగారు! మాకు ఒక్క ఫోన్ అయినా చేసి ఉండొచ్చు కదా! మీకోసం అమెరికా నుంచి మీ కోడళ్ళు, మనవళ్లతో సహా వచ్చాము,” అంటూ ఉండగానే, లేని ఓపిక తెచ్చుకుని మనవాలను దగ్గరకు తీసుకుని, ఆయాసపడుతూ కోడళ్లను ఆశీర్వదిస్తూ,
“ఏరా! ఏరా! మీ ఇద్దరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. ఇదే పని అమ్మ ఉన్నప్పుడు వచ్చి ఉంటే, మీ అమ్మ ప్రాణాలు నిలబడేవి. అయినా ఏం చేస్తాం… ఇప్పుడు నా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది,” అంటూ ఆయాసపడుతూ పురుషోత్తం గారు అనేసరికి,
కంగారుపడుతూ, “మీకేం పరవాలేదు నాన్నగారు! ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాను. అన్ని విధాలా చూసుకుంటాము,” అంటూ డాక్టర్ గారిని ఇంటికి పిలిచారు కొడుకులు. డాక్టర్ గారు పురుషోత్తం గారి నాడిని చూసి, “బాబు! పరిస్థితి ఏమీ బాగోలేదు. 85 ఏళ్ల వయసులో మానసికంగా బాగా కృంగిపోయారు,” అంటూ ఒక ఇంజెక్షన్ చేసి, అత్యవసరంగా వాడవలసిన మందులు వ్రాసి వెళ్లిపోయారు.
అఖిల్‌కు, నిఖిల్‌కు ఏమి పాలుపోక, తమ తమ కుటుంబాలను విశాఖపట్నం బీచ్ దగ్గరలో ఉన్న నోవోటల్ హోటల్లో దింపి, వారి కన్నీళ్లు అమర్చి, మళ్లీ పరుగు పరుగున పురుషోత్తం గారి ఇంటికి వచ్చారు. అప్పటికి మగత నిద్రలో ఉన్న నాన్నగారి శరీరం మంచానికి అతుక్కుపోయి ఉండడం చూసి చాలా బాధపడుతూ, “నాన్నగారు! నాన్నగారు!” అంటూ నిద్ర లేపారు.
బరువుగా కళ్ళు తెరిచిన పురుషోత్తం గారు కాస్త మంచినీళ్లు తాగి సేదదీరారు.
ఆ తర్వాత పెద్దకొడుకు అఖిల్, “నాన్నగారు! మీకేం పరవాలేదు. మేము చూసుకుంటాం. కానీ ఒక్క విషయానికి జవాబు చెప్పండి. కొడుకులు ఉండగా, మా కోసం, మీ మనవల కోసం ఉంచవలసిన ఆస్తిని అనాధ శరణాలయం పేరున ఎందుకు చేశారు? మేము చచ్చిపోయాం అనుకున్నారా?” అంటూ గట్టిగా పురుషోత్తం గారిని కుదుపుతూ అడిగేసరికి,
“అవును రా! మిమ్మల్ని కన్న పాపానికి నేను, ప్రమీల అనాథులమైపోయాము. మమ్మల్ని చూసే దిక్కే లేదు. ఆఖరికి అమ్మ అంత్య దశలో కూడా వచ్చి చూసే భాగ్యం మీకు లేదు. అప్పుడు కూడా తల్లిదండ్రులను ఆస్తిలా పంచుకునే మీరు, ఏదో మొక్కుబడికి పెద్దవాడు వచ్చి అంత్యక్రియలు చేసి అమ్మ రుణం తీర్చుకున్నాడు. ఇక రెండవ వాడికి చివరి దశలో ఉన్న నాన్నను చూడడానికి కూడా ఎనిమిదేళ్లు పట్టింది రావడానికి. ఇది రా మీ నిర్వాకం!
నాకున్న ఆస్తి నా స్వార్జితం. నేను ఏం చేసినా అడిగే హక్కు మీకు లేదు. ఇన్నాళ్లు దిక్కులేని నాకు ఈ వృద్ధులు, వికలాంగులు నన్ను ప్రాణప్రధంగా చూసుకున్నారు. ఆ తర్వాతనే నేను ఒక తుది నిర్ణయానికి వచ్చాను.
మీ ఇద్దరినీ రెండు కళ్ళులా, కంటికి రెప్పలా చూసుకున్న అమ్మ, మిమ్మల్ని చూడాలన్న చివరి కోరిక కూడా తీర్చుకోలేకపోయింది. ఎందుకు ఇంత ధనాపేక్ష? ఆఖరికి మీరు వచ్చినప్పుడు కూడా నా ప్రాణాలు నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. అందుకే మీ కన్న తల్లి పేరు మీద ‘శ్రీ ప్రమీల అనాధ శరణాలయం’ స్థాపించాను. ఇప్పుడు అది ఎంతో అభివృద్ధి చెంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్నో నిధులను సమకూరుస్తూ, మన రాష్ట్రంలోని అన్ని నగరాలలో శ్రీ ప్రమీల అనాధ శరణాలయాలను స్థాపిస్తుంది.
ఇవాళ రేపు నేను కూడా చనిపోతాను. కానీ నేను జీవితంలో ఒక గుణపాఠం నేర్చుకున్నాను. కడుపున పుట్టిన పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యం చేస్తూ, ఆస్తి, అంతస్తుల కోసమే పాకులాడుతున్నారు. కనుకనే నేను అమ్మ పేరు మీద వృద్ధులను, అనాధులను, వికలాంగులను చేరదీసి వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుని, నా ఆస్తినంతా శ్రీ ప్రమీల అనాధ శరణాలయం పేరు మీద పెట్టి మీ అమ్మ ఆత్మశాంతికి పాటుపడ్డాను,”
అంటూ ఆయాసం ఎక్కువై రొప్పుతూ, కొడుకుల చెయ్యి పట్టుకొని, “నన్ను క్షమించండి రా! కనీసం పిల్లల్ని కూడా మీలాగా కాకుండా, విదేశాలలో స్థిరపడకుండా, మన భారతదేశానికి వచ్చి ఆప్యాయతలు, అభిమానాలు ఎలా ఉంటాయో వారికి నేర్పించండి. మన భారతదేశం సాంప్రదాయాలకు, సంస్కారాలకు పెట్టింది పేరు. మన దేశంలో కుటుంబ వ్యవస్థ, ప్రేమానురాగాలు ఎంత బాగా ఉంటాయో అని ఆశ్చర్యపోతూ మిగతా దేశాలు కూడా మన సంస్కృతి, సాంప్రదాయాల కోసం మన భారతదేశం వచ్చి నేర్చుకొని, విదేశాలలో కూడా అవలంబిస్తూ తమ జీవితాలను సరిదిద్దుకుంటున్నారు,” అంటూ ఎగస్వాస విడుస్తూ కొడుకుల చేతుల్లోనే పరమపదించారు మహా మనిషి పురుషోత్తం గారు.
పురుషోత్తం గారి కొడుకులు కూడా ఎంతో మనోవేదన చెందుతూ, “నాన్నగారు మాకు మంచి గుణపాఠం నేర్పించారు!” అని అనుకుంటూ, ఇక విదేశాల మాట ఎత్తకుండా, “శ్రీ ప్రమీల అనాధ శరణాలయాన్ని” తమ సొంత నివాసంలా అందరికీ సేవ చేస్తూ, భారతదేశంలోనే స్థిరపడిపోయారు.
************
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.




story is excellent. If someone fallows the story in their life, the comment we have to consider with five rating that is best one