తోడూ నీడ - పార్ట్ 2
- Lakshmi Sarma B

- 2 days ago
- 7 min read

Thodu Needa - Part 2/2' - Telugu Family Story | Lakshmi Sarma Thrigulla
తోడూ నీడ - పార్ట్ 2/2 తెలుగు కుటుంబ కథ | లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ | ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 05/05/2026
ఇక తోడూ నీడ - పార్ట్ 2 చదవండి.
జీవితంలో ప్రేమ ఉండి కూడా, దాన్ని వ్యక్తపరచలేకపోవడం వల్ల ఎన్నో బంధాలు దూరమవుతాయి. అలాంటి ఒక భార్యాభర్తల మధ్య జరిగిన భావోద్వేగ ప్రయాణమే “తోడూ నీడ – పార్ట్ 2”. మాటల కంటే మనసు గొప్పదని, అర్థం చేసుకోవడమే నిజమైన ప్రేమ అని ఈ కథ హృదయానికి హత్తుకునేలా చెబుతుంది.
ప్రేమగా మాట్లాడుతాడంటే అదీ లేదు. ఇక భరించుకోలేకపోతోంది. ఆలోచనలతో ఎప్పుడో గానీ నిద్రపట్టలేదు వరలక్ష్మికి.
“రమణి! ఇంకా ఎంతసేపు పడుకుంటావు? లే, మీ అమ్మగారు లేచినట్టున్నారు చూడు,” అని భార్యను తట్టి లేపుతూ అన్నాడు భాస్కర్.
“అబ్బా! అప్పుడే తెల్లవారిందా? ఈరోజు ఆదివారమే కదండీ! కాసేపు పడుకుంటాను, మీరు కూడా రండి పడుకోండి. పిల్లలు కూడా ఇప్పుడే లేవరు. అమ్మ లేచినా తన పని తాను చేసుకుంటుంది లెండి,” అని మగతగా చెబుతూ దుప్పటి కప్పుకుని పడుకుంది రమణి.
“సరేలే! నువ్వు పడుకో, నేను అలా వాకింగ్ కు వెళ్లి వస్తాను,” అని చెప్పులేసుకుని బయటకు వెళ్లిపోయాడు.
వరలక్ష్మి లేచి కాలకృత్యాలు తీర్చుకుని, పూజ చేసుకుని టిఫిన్ తయారుగా పెట్టింది.
“అమ్మా... నన్ను లేపలేదు ఎందుకు? ఎంత టైమ్ అయిందో చూడు! అన్నీ ఒక్కదానివే చేశావు, ఇద్దరం కలిసి చేసుకునే వాళ్లం కదా,” అని తన పనులన్నీ చేసుకుని వచ్చి తల్లితో అంది రమణి.
“పోనిలేమ్మా! ఈరోజు అందరికీ సెలవు కదా, తొందరేముంది చెప్పు! పిల్లలను, అల్లుడిని అందరినీ పిలువు, వేడివేడిగా పూరీలు తిందురు గానీ,” అని స్టౌ వెలిగిస్తూ చెప్పింది.
“ఏమంటోంది అత్తయ్యగారూ మీ అమ్మాయి? తనను లేపలేదనేనా? నేను ఎన్నిసార్లు పిలిచినా లేవనని దుప్పటి కప్పుకుని పడుకుంది. పైగా మా అమ్మ ఉంది నాకు రెస్ట్ అని కూడా చెప్పింది. ఇప్పుడేమో ప్రేమ ఒలకబోస్తోంది చూడండి గడుసమ్మాయి!” అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ నవ్వుతూ అన్నాడు భాస్కర్.
“పోనిలే బాబు! రోజూ తనే చేసుకుంటుంది కదా, నేను ఉన్నప్పుడే కదా దానికి విశ్రాంతి!” అంది వరలక్ష్మి.
“అలా చెప్పమ్మా మీ అల్లుడికి! ఒక్క పనిలో కూడా సహాయం చేయరు కానీ, నేను పడుకుంటే మాత్రం కుళ్లు!” బాగయిందా అన్నట్టు భర్త వైపు చూసి కనుబొమ్మలెగరేసింది రమణి.
“అబ్బ! గుమగుమలు వస్తున్నాయి అమ్మమ్మా! మా అమ్మ చెప్పిన మాటలు అబద్ధం. రోజూ మా నాన్న ఎన్ని పనులు చేస్తాడనుకున్నావు?” అని తల్లి మీద చాడీలు చెప్పుకుంటూ కమ్మగా ఉన్నాయంటూ తింటున్నారు పిల్లలు.
“అది.. అలా చెప్పండిరా మీ అమ్మ గురించి!” అని రమణిని వెక్కిరిస్తూ అన్నాడు భాస్కర్.
“వార్నీ! మీరు నా పిల్లలేనట్రా? మీకు మీ అమ్మ ఎంత కష్టపడి ఎన్ని చేస్తున్నా మీ నాన్నకే సపోర్టిస్తారా?” అని పిల్లల చెవి మెలిపెడుతూ అంది.
“పోనిలేమ్మా! ఏదో సరదాగా నిన్ను ఆటపట్టిస్తున్నారు, ఇంకో పూరీ వేసుకో,” అని చిన్నబుచ్చుకున్న కూతురి ముఖం చూస్తూ నవ్వుతూ అంది వరలక్ష్మి.
“అత్తయ్యగారూ! పూరీ, కర్రీ చాలా బాగున్నాయి, తృప్తిగా తిన్నాము. మీరు కూడా రండి, నేను వేస్తాను వేడిగా,” అని అల్లుడు అన్నాడు.
ఆశ్చర్యంతో అల్లుడి వైపు చూస్తూ, “మీరు వేస్తారా?” అని అడిగింది వరలక్ష్మి.
“అదేంటండీ, నేను చేయకూడని పని అన్నట్టుగా ఆశ్చర్యపోతున్నారు? నాకు పనులన్నీ అలవాటే. మీ అమ్మాయి దయ వలన అన్ని వంటలు వచ్చు,” అని నవ్వుతూ చెప్పాడు భాస్కర్.
“అవునమ్మా! ఆయన పూరీలు చాలా బాగా వేస్తారు. రా, ఇలా వచ్చి కూర్చో,” అంది రమణి.
పూరీ తింటుంటే టపటప కన్నీళ్లు జారిపడ్డాయి వరలక్ష్మికి.
“అమ్మా... ఏడుస్తున్నావా? నాన్న గుర్తుకు వచ్చారా? నాన్న వచ్చి ఉంటే బాగుండేది,” అని తల్లి కళ్లు తుడుస్తూ అంది రమణి.
“ఏం లేదమ్మా! నేను కాపురానికి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఒక్క రోజైనా తిన్నావా, తింటావా అని కానీ అన్న పాపాన పోలేదు మీ నాన్న. ఎన్ని చేసినా బాగుందని ఏనాడు చెప్పలేదు. అల్లుడు అలా అడిగేసరికి తట్టుకోలేకపోయాను.”
“అమ్మా! నాన్న గురించి తెలిసి కూడా ఎందుకు బాధపడతావు? ఆ మనిషి అంతే! అమ్మా! నాన్నకు, నీకు ఏమైనా గొడవయ్యిందా? నువ్వు ఏనాడు నాన్నను విడిచి ఒంటరిగా రావడం చూడలేదు. నాన్నకు ఇబ్బంది అవుతుందని ఎక్కడికీ వెళ్లనిదానవు. ఏమైందమ్మా?” అని తల్లి చుబుకం పట్టుకుని అడిగింది రమణి.
“ఏం చెప్పమంటావు తల్లి! మీ నాన్నను భరించడం నా వల్ల కావడం లేదు. నాకు ఏభై ఏళ్లు వచ్చాయి, వయసైపోయింది. ఇంకా నన్ను మాటలతో చంపుతుంటే నా మనసు తట్టుకోలేకపోతోంది. ఆయన నా మీద ప్రేమ చూపకపోయినా పర్వాలేదు, నన్నో మనిషిగా చూస్తే చాలనుకున్నాను.”
“ఇంత వయసొచ్చినా కూడా భార్యను అదుపులో పెట్టుకోవాలనే అహంకారం వదలట్లేదు. ఏమన్నంటే, 'నువ్వు ఎక్కడికి వెళతావో వెళ్లు, నేను హాయిగా బతుకుతాను' అంటాడు. ఈ వయసులో కూడా ఆ బింకం మాటలు వినలేక కావాలనే వెళ్లి వచ్చాను,” అని చెప్పడం ఆపింది వరలక్ష్మి, గుండెలోని బాధ ఎగతన్నుకు వస్తుంటే.
“అమ్మా! ఊరుకో. ఇన్నాళ్లు భరించినదానివి ఇప్పుడేంటమ్మా కొత్తగా బాధపడుతున్నావు? నాన్నకు నువ్వంటే ప్రేమ లేక కాదు, తాతయ్య చెప్పిన మాటలు బాగా నాటుకుపోయాయి. వాటి నుండి బయటపడలేకపోతున్నాడు. మనసులో నీ మీద చాలా ప్రేమ ఉందమ్మా,” అని తల్లిని ఓదారుస్తూ అంది రమణి.
“ఆ ఆ! ఉంది, నాకు తెలియదేంటి మీ నాన్న ప్రేమ? ఏం, మీ నాన్నను అనగానే రోషం పొడుచుకొస్తున్నట్టుంది! అవున్లే, మీరందరూ మీ నాన్న వైపే మాట్లాడుతారు. నేను చాకిరీకి మాత్రమే పనికొస్తాను,” అని కొంగుతో కళ్లు తుడుచుకుంటూ అంది వరలక్ష్మి.
“అది కాదమ్మా! నాన్న చాలాసార్లు నాతో చెప్పేవాడు తెలుసా! పాపం మీ అమ్మ అమాయకురాలు, నేను ఎన్ని మాటలన్నా నోరెత్తదు, నా కోసం ఎంతో చేస్తుంది.”
“ఏమీ అనొద్దు అనుకుంటాను కానీ మా నాన్న గుర్తుకువస్తాడు. మా నాన్నకిచ్చిన మాటను జవదాటలేక లక్ష్మిని తిడతాను. తనంటే నాకు ప్రేమ లేక కాదు అని ఎన్నోసార్లు చెప్పి బాధపడ్డారమ్మా.”
“నీ ముందు బయటపడలేకపోతున్నారు. ఇప్పుడు నువ్వు ఇలా వచ్చావు కదా, నాన్న నిన్ను వెతుక్కుంటూ వస్తారో లేదో చూడు,” అని తల్లి ముఖం వైపు చూస్తూ అంది రమణి.
విప్పారిన మోముతో, “రమణి! నువ్వు చెప్పేది నిజమా? మీ నాన్నకు నా మీద అంత ప్రేముందా? అయ్యో పిచ్చిదాన్ని, నేనే అర్థం చేసుకోలేకపోయానే ఆయన్ని! ఏమిటో ఆయన నన్ను ఈనాడు కొత్తగా అన్నట్టు కోపంగా వచ్చేసాను.”
“పాపం ఆయన తిండి కోసం ఎంత బాధపడుతున్నారో! నా చేతి వంటకు వంక పెట్టినా ఇంకెక్కడా ఆయనకు భోజనం సహించదు. ఈ వారం రోజుల్లో ఎంతగా చిక్కిపోయారో ఏంటో! రమణి! నేను బయలుదేరుతానమ్మా,” అని మనసంతా వ్యాకులపడుతుండగా తినేదల్లా లేచింది వరలక్ష్మి.
“అయ్యో అమ్మా! తినకుండానే లేచావేంటి? ముందు పూరీ తిను, తరువాత ఆలోచిద్దాము. మీ అల్లుడు దింపి వస్తారు, కూర్చో. ఏమండీ! మా అమ్మ వెళ్తానంటోంది, మీరు దింపండి సరేనా?” అని అత్తగారు బాధపడుతుంటే ఆమెనే చూస్తూ కూర్చున్న భర్తతో చెప్పింది రమణి.
“అలాగే రమణి! అత్తయ్యగారూ, మీరేంటి ఇలా బాధపడుతున్నారు? మా అందరికీ ధైర్యం నూరిపోసే మీరిలా మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎలాగూ వచ్చారు, ఓ నెల రోజుల పాటు ఉండండి. మామయ్యకు కూడా మీ మీద ప్రేమ పెరుగుతుంది. మీరు లేని లోటు బాగా తెలిసి వస్తుంది, ఇంకెప్పుడు మిమ్మల్ని పల్లెత్తు మాట అనడు,” అని ఊరడింపు మాటలు చెప్పాడు భాస్కర్.
“అయ్యో! అన్ని రోజులు ఉండలేను బాబు! ఏదో మనసు బాగాలేక వచ్చాను. మీ మామయ్య ఒక్కరూ ఏం ఇబ్బంది పడుతున్నారో ఏమో! మీరేమనుకోకపోతే నన్ను ఇంటి దగ్గర దింపి రండి. ఎలాగూ సంక్రాంతి పండుగ వస్తోంది కదా, రమణి పిల్లలు కూడా వస్తే పండుగ వరకు ఉంటారు. పండక్కి మీరూ రండి,” అని తను అలా రావడం తప్పు చేసినదానిలా సిగ్గుతో తలవంచుకుని చెప్పింది అల్లుడితో.
“అవును, నువ్వు వచ్చి నాలుగు రోజులు కాలేదు, మీ ఆయనను వదిలి అప్పుడే బెంగపెట్టుకుని వెళ్లిపోతానంటున్నావు! నన్నేమో ఇంకా ఇరవై రోజులున్న సంక్రాంతి పండక్కి రమ్మంటున్నావు!”
“పాపం! మా ఆయన ఒక్కడూ ఎలా ఉంటాడనుకున్నావమ్మా అన్ని రోజులు!” అని నవ్వుతూ అడిగింది రమణి.
“అబ్బే! నాకేం ఇబ్బంది లేదు రమణి. నువ్వు వెళ్తానంటే సంతోషంగా వెళ్లిరా. నా కష్టాలేదో నేను పడతాలే,” అని మొహంలో బాధ కనపరుస్తూ అన్నాడు భాస్కర్.
“అవునవును! నేను లేకుంటే మీకు సంతోషమే! నాకు తెలియదు మీ సంగతి. క్లబ్బుకు వెళ్లడం, పేకాట ఆడుకుంటూ రోజులన్నీ వెళ్లబుచ్చుతారు. అందుకే కదా నన్ను వెళ్లమంటున్నారు!” అని భర్తను దెప్పుతూ కాలు మీద గట్టిగా నొక్కింది రమణి.
“అయ్యో! అయ్యో! చూశారా అత్తయ్యగారూ, మీ ముందే నన్ను ఎలా బాధపెడుతుందో!” అని గట్టిగా అరిచాడు భాస్కర్.
“రమణి! ఏంటమ్మా ఇది? అల్లుడిని వదిలెయ్యి. మీరెవ్వరూ నాతో రానక్కరలేదు కానీ నన్ను వెళ్లనివ్వండి,” అని వరలక్ష్మి ఆరాటంగా అడిగింది.
తలుపు చప్పుడు అవుతుంటే వెళ్లి తలుపు తీశాడు భాస్కర్. ఎదురుగా నిలుచున్న మామను చూడగానే సంతోషంతో, “ఏయ్ రమణి! ఎవరు వచ్చారో చూడు!” అంటూ పిలిచాడు.
“ఆ! ఇంకెవరు వస్తారు? మా నాన్నే వచ్చి ఉంటాడు. అమ్మా! మీ ఆయనొచ్చారు చూడు,” అని తల్లి చేతిని పట్టుకుని హాలులోకి తీసుకువచ్చింది రమణి. ఆశ్చర్యంతో భర్తను, కూతురిని మార్చి మార్చి చూసింది వరలక్ష్మి. ఈయన వస్తాడని నీకు ముందే తెలుసా అన్నట్టుగా.
“లక్ష్మీ! బాగున్నావా? ఏంటి అలా చిక్కిపోయావు? ఒంట్లో బాగాలేదా?” అని భార్యను చూడగానే ఎంతో ఆప్యాయంగా అడిగాడు కృష్ణమూర్తి.
“ఏమండీ! మీరు నా కోసం వచ్చారా? నన్ను ఎలా ఉన్నావని అడుగుతున్నారా? నేను మీకు చెప్పకుండా వచ్చానని నన్ను తిడతారేమోనని భయపడుతున్నాను. నా మీద కోపం లేదా మీకు?” అని గొంతు తడబడుతుండగా భర్త మాటలు నమ్మలేనట్టుగా అడిగింది.
“లక్ష్మీ... నేను ఇన్నాళ్లు నీ మనసును కష్టపెట్టాను కదూ! ఇక నుండి నిన్ను ఒక్క మాట అనను. పద, మన ఇంటికి వెళదాము. నిన్ను కోపంతో తిడతానే కానీ, నువ్వు లేని ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను.”
“మన పెళ్లయిన నాటి నుండి నువ్వు నన్ను వదిలి వెళ్లిందే లేదు. నేను తిట్టినా, నిన్ను పట్టించుకోకపోయినా నా మీద ఎన్నడూ నువ్వు ద్వేషం చూపలేదు. నీకు ఏ లోటు రాకుండా చూసుకున్నాననుకున్నానే కానీ నీ మనసు లోపలకు చూడలేకపోయాను.”
“నువ్వు అడగకుండానే నగలు కొనిపెట్టాను, పండుగలకు నాకు నచ్చిన చీరలు నీకు తెచ్చి ఇచ్చాననుకున్నానే కానీ ప్రేమగా నీ కళ్లల్లోకి చూడలేకపోయాను. అయినా నువ్వు నన్ను ఎప్పుడూ ఈసడించుకోలేదు. అంటే నీకు నా మీద ఎంత ప్రేముంటే నన్ను భరించుకున్నావు చెప్పు! నిన్ను అర్థం చేసుకోలేని నేను నిజంగా మూర్ఖుడినే. నీ ప్రేమకు నేను అర్హుడను కాను కానీ నువ్వు లేకుండా ఉండలేను.”
“లక్ష్మీ! నువ్వు నన్ను వదిలి రాగలిగావంటే నీ మనసు ఎంత గాయపడిందో నేను ఊహించగలను.”
“నీ తోడు లేకుండా నేను, నా తోడు లేకుండా నువ్వు ఉండలేవు. మనం ఒకరికొకరు తోడూనీడగా కలిసి ఉందాము,” అని వరలక్ష్మి రెండు చేతులు పట్టుకుని తన మనసులో ఉన్న ఆవేదనను బయటపెట్టాడు కృష్ణమూర్తి.
“ఏమిటండి ఇది చిన్నపిల్లల్లా... మీరు బాధపడడమేంటి? తప్పు చేసింది నేను. మీకు చెప్పకుండా రావడం నాదే పొరబాటు. చిన్న మాటంటే పడలేని భార్య భర్తకు ఏం గౌరవం ఇచ్చినట్టు చెప్పండి? నేనే మీ మనసు అర్థం చేసుకోలేదు. మీకు నా మీద ఎంత ప్రేముందో నా చాటుగా మీరు అమ్మాయితో ఎన్నోసార్లు చెప్పారట! మీరు మీ ప్రేమను మనసులో దాచుకున్నారు, నేను బయటకు కనపరచాను. ఏమండీ! ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లను,” అంది ప్రేమగా భర్త వైపు చూస్తూ.
“చూశావా రమణి మీ అమ్మ గొప్పతనం! నేను తనను బాధపెట్టినా కూడా నన్ను నిరపరాధి అంటుంది! నేను బాధపడితే సహించలేదు, అందుకే తనదే తప్పంటోంది. ఇంత మంచి మనసున్న నిన్ను ఎంతో ప్రేమగా చూసుకోవలసింది. మా నాన్న మాటకు కట్టుబడి నిన్ను అణిగిమణిగి ఉండేలా చూశాను.”
“నువ్వు చెప్పినట్టు నేను వింటే ఎక్కడ నా మీద పెత్తనం చెలాయిస్తావోనని నిన్ను ప్రతిదానికి కించపరిచినట్టు మాట్లాడడం నేర్చుకున్నాను. అదే అలవాటైపోయింది. నిన్ను చూస్తుంటే ఎన్నో సార్లు బాధనిపించి దగ్గరకు తీసుకుని ఓదార్చాలని, ప్రేమగా నాలుగు మంచి మాటలు మాట్లాడాలనిపించేది.”
“కానీ వెంటనే మా నాన్న నా వెనకనే ముల్లుకర్ర పట్టుకుని నన్ను గుచ్చినట్టు అనిపించి తగ్గేవాడిని. కట్టుకున్న భార్యను హింసించే మగడిని ఏ మగువ క్షమించదేమో! కానీ నా వరలక్ష్మి నా పాలిటి ప్రేమమూర్తి. ఇంతటి దయామయిని ఇకనైనా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను,” అని భార్యను దగ్గరగా తీసుకుని గుండెలకదుముకుంటూ చెప్పాడు కృష్ణమూర్తి.
“మీరిద్దరూ మీ తప్పులను మీరు ఒప్పుకోవడాలేనా? మమ్మల్ని పట్టించుకునేది ఉందా? ఆదర్శ దంపతులు ఒకరి మీద ఒకరికి పట్టలేనంత ప్రేమ ఉన్నా పాము ముంగీసల్లాగా పోట్లాడుకుంటారు! పోనీలే, ఇప్పటికైనా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది కదండీ!” అని తల్లిని, తండ్రిని చేరోవైపు పట్టుకుని భర్తను అడిగింది రమణి.
“మీరిద్దరూ మీ తప్పులను మీరు ఒప్పుకోవడాలేనా? మమ్మల్ని పట్టించుకునేది ఉందా? ఆదర్శ దంపతులు ఒకరిమీద ఒకరికి పట్టలేనంత ప్రేమ ఉన్నా పాము ముంగీసల్లాగా పోట్లాడుకుంటారు! పోనీలే, ఇప్పటికైనా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది కదండీ!” అని తల్లిని, తండ్రిని చేరోవైపు పట్టుకుని భర్తను అడిగింది రమణి.
“అవునవును! నాకు చాలా సంతోషంగా ఉంది చెల్లాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను నాన్నతో, అమ్మను అలా తిట్టకండి, పాపం మన కోసం ఎంతో ఓపికతో ఎన్నో చేసి పెడుతోంది, తన మనసు ఎంత బాధపడుతుందో మీరు అర్థం చేసుకోవడం లేదని చెప్పాను.”
“నన్నే తిట్టారు, నేను భార్య విధేయుడనని, నన్ను నా భార్య ఆడిస్తోందని తనను అంటుంటే విసిగిపోయి ఇంటికి రావడం మానేసింది తను. అమ్మా! నాన్న మారిపోయారు కదా, ఇక అందరం కలిసే ఉందాము సరేనా?” అని తల్లిని ఆర్తిగా పట్టుకుంటూ చెప్పాడు రవి.
“రవి! నువ్వు ఎప్పుడు వచ్చావు?” అని బావమరిదిని, అతని భార్యను చూసి అడిగాడు భాస్కర్.
“నేనే రమ్మన్నానండి. నాన్న బయలుదేరగానే వాడికి ఫోన్ చేసి చెప్పాను. మా ఫ్రెండ్ తో చెప్పాను నాన్న గురించి కాస్త కనిపెట్టుకుని ఉండమని. నాన్న గురించి నాకు తెలుసు, అమ్మ లేకపోతే ఉండలేడని. నాకు ఫోన్ చేసి అడిగాడు, అమ్మ ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్లిందో నాకు చెప్పలేదని. రాత్రి వరకు చూసి నాకు ఫోన్ చేస్తే చెప్పాను ఆరోజు.”
“వెంటనే వస్తానంటే నాలుగు రోజులు ఆగి రమ్మని చెప్పాను. అప్పుడే అన్నయ్యను కూడా రమ్మన్నాను. వాడు వచ్చే సమయానికి అమ్మా నాన్నలు మాట్లాడుకుంటుంటే తలుపు పక్కనే నిలబడి చూడడం నేను చూశాను. అంతే కదా అన్నయ్యా!” అని నవ్వుతూ అడిగింది రమణి.
“మొత్తానికి మీ అమ్మ నాన్నల మనసుల మబ్బులు విడిపోయి చల్లటి వెన్నెల కురుస్తున్నట్టుగా ఉంది. మామయ్య! ఈ శుభసందర్భంగా మనందరం కలిసి పార్టీ చేసుకుందాము. అందరూ త్వరగా తయారవ్వండి, సినిమాకు వెళ్లి హోటల్ లో భోజనం చేసి వద్దాము,” అని నవ్వుతూ చెప్పాడు భాస్కర్.
“అలాగే బాబు! కానీ మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటాను, మీరెవ్వరూ ఒక్క పైసా పెట్టకూడదు. అలాగే నా మనవలు మనవరాండ్రు, వాళ్లకు ఏది కావాలన్నా నేనే కొనిపెడతాను. ఏమంటారు పిల్లలు?” అని మనవలను దగ్గరకు తీసుకుంటూ అడిగాడు ప్రేమగా.
“అవును తాతయ్యా! మాకిష్టమైనవన్నీ కొనిపెట్టాల్సిందే! ఎందుకంటే అమ్మమ్మ, నువ్వు సంతోషంగా ఉన్నారు కదా!” అని కిలకిలా నవ్వుతూ అంది పెద్ద మనవరాలు.
ఆమెతో పాటు అందరూ నవ్వుకున్నారు సేదతీరిన మనసులతో.
సమాప్తం
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కొన్ని ఇతర రచనలు:
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.











Comments