ఉగాది - పరాభవ నామ సంవత్సరం

Ugadi Parabhava Nama Samvatsaram - Telugu Ugadi Article | Sudhavishwam Akondi
ఉగాది - పరాభవ నామ సంవత్సరం - తెలుగు ఉగాది వ్యాసం | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 20/03/2026
"పరాభవాభయం వందే
సర్వాభరణముద్రితం।
ఉత్తుంగతురగారూఢం
పరశుజ్వలపాణినమ్॥"
సర్వ ఆభరణాలతో అలంకరించబడి, గుర్రంపై ఆరూఢుడై, చేతిలో పరశువు అంటే గొడ్డలిని ఆయుధంగా ధరించిన దేవతకు నమస్కారం!
పరాభవ సంవత్సర అధిష్ఠాన దేవత ప్రార్థనా శ్లోకం. మొత్తం అరవై సంవత్సరాల చక్రంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరానికి ఒక అధిష్ఠాన దేవత ఉంటుంది. అలాగే ఒక ప్రార్థనా శ్లోకం ఉంటుంది. ఆ చక్రంలో వచ్చే సంవత్సరాలలో ఒకటి ఈ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం అరవై సంవత్సరాల చక్రంలో నలభయ్యో సంవత్సరం.
ఉగాది తెలుగు ప్రజలకి అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. తెలుగు మరియు కన్నడ పంచాంగాల ప్రకారం కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది ఉగాది పండుగ.
చెట్లు కొత్త చిగుళ్ళు వేసి, అందమైన పూలతో, రసవంతమైన ఫలాలతో ప్రకృతి కొంగ్రొత్త కాంతిని సంతరించుకునే ఈ వసంత కాలంలో వచ్చే ఈ పండుగ, మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు తీసుకువస్తుంది.
ఈ ఉగాది సంవత్సరాన్ని పరాభవ నామ సంవత్సరంగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉగాది పండుగ జరుపుకుంటారు. ఈ నూతన సంవత్సరం పేరు పరాభవ అని వినగానే చాలామంది మనసుల్లో ఎన్నో అనుమానాలు! పరాభవం అంటే ఈ ఏడాది మొత్తం అవమానాలు ఎదురవుతాయా అనే ఆలోచనలు చుట్టుముడుతున్నాయి
కానీ దీని అర్థం ఆధ్యాత్మిక కోణంలో ఎంతో అద్భుతంగా ఉంది. పాజిటివ్ నెస్ పెంచేలా ఉంది.
పరాభవ పదంలో పరా అంటే పరా భట్టారిక లేదా పరాశక్తి, భవ అంటే భవుడు సాక్షాత్తు పరమశివుడు. ఈ సంవత్సరం ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు, సామరస్య స్వరూపముతో, తమ పిల్లలు అయిన సర్వ జీవులను రక్షిస్తారని అర్థం. పరాభవ పేరుతో ఈ సంవత్సరం ఉందని విని చాలామంది భయపడుతున్నారని... ఎలాంటి ఆందోళన, భయం అవసరం లేదనీ, పార్వతీ పరమేశ్వరుని భక్తితో కొలుస్తూ, సత్య, ధర్మ, భక్తి మార్గంలో నడుచుకుంటే, తల్లిదండ్రులు అయిన పార్వతీపరమేశ్వరులు వెన్నంటే ఉంటూ రక్షించి, సకల శుభాలు అనుగ్రహిస్తారని పండితులు చెబుతున్నారు.
'పరాభవ' అనే పదానికి అహంకారాన్ని జయించడం, అనుభవాల ద్వారా మార్పు పొందడం, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం వంటి లోతైన ఆధ్యాత్మిక అర్థాలు కూడా ఉన్నాయి. ఈ పరాభవ సంవత్సరం మనం జీవితంలో వినయంగా ఉంటూ, ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటూ ధర్మ మార్గంలో నడవాలని సూచిస్తుంది.
మనలోని అహంకారాన్ని తగ్గించి, సత్సంకల్పాలతో ముందుకు సాగితే, జీవితం మరింత సార్థకమవుతుందని ఈ పరాభవ నామ సంవత్సరం సందేశం ఇస్తుంది.
మరొక వ్యాఖ్యానం ప్రకారం పర అంటే గొప్పది, అత్యున్నతమైనది అనే అర్థం, భవ అంటే పుట్టుక, స్థితి అని అర్థం. ఈ పరాభవ సంవత్సరం గొప్పస్థితిని కలిగిస్తుందని అర్థం.
ఉగాది రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీ. ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేసి, మామిడి ఆకులతో తోరణాలు కట్టుకుంటారు. ఇంట్లో పూజలు చేసి, ఉగాది పచ్చడి తయారు చేసి, దేవునికి నైవేద్యం పెట్టి, ఆశీర్వాదం తీసుకుంటారు.
ఉగాది పండుగ నాడు ముఖ్యమైనది ఉగాది పచ్చడి సేవనం. ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. అవి జీవితంలోని ఆరు భావాలను సూచిస్తాయి.
వేపపువ్వు చేదు జీవితంలోని దుఃఖానికీ,
బెల్లం తీపి జీవితంలో ఆనందానికి,
చింతపండు పులుపు జీవితంలోని ఆశ్చర్య సంఘటనలకు, మామిడి ముక్కలు వగరు జీవితంలోని కొత్త అనుభవాలను
మిరియాల కారం జీవితంలో కోపం కలిగించే అంశాలకు, ఉప్పు జీవితంలోని సమతుల్యతకు సంకేతాన్ని ఇస్తుంది.
ఈ ఆరు రుచులు జీవితంలో వచ్చే వివిధ అనుభవాలను సూచిస్తాయి. సుఖం, దుఃఖం, ఆశ్చర్యం, కోపం, కొత్త అనుభవాలు అన్నీ సమంగా అనుభవిస్తూ జీవితం కొనసాగించాలని ఈ పచ్చడి మనకు తెలియజేస్తుంది.
"తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్య
వర్ధనం।
నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ
నివారణమ్॥
కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం
శుభదాయకమ్॥"
తిథి వలన ఐశ్వర్యం కలుగుతుంది, వారం వలన ఆయుష్షు పెరుగుతుంది, నక్షత్రం వలన పాపాలు తొలగుతాయి, యోగం వలన రోగాలు పోతాయి, కరణం వలన పనులు సఫలం అవుతాయి. అందుకే పంచాంగం వినడం శుభప్రదం. పంచాంగం అనగా తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాల సమాహారం.
ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. దీనిని పంచాంగ శ్రవణం అంటారు. కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు, శుభ దినాలు, పండుగలు, వ్యవసాయ ఫలితాలు, దేశ కాల పరిస్థితులు, వివిధ రాశుల వారికి కలిగే శుభాశుభాలు లెక్కలుగట్టి జ్యోతిష్య శాస్త్ర పరంగా వివరిస్తారు.
ఉగాది మనకు ఒక కొత్త ప్రారంభాన్ని గుర్తు చేస్తుంది. గతంలో జరిగిన తప్పులను తెలుసుకుని, మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలనే సంకల్పం చేసుకుని, మంచి ఆలోచనలతో, సత్కర్మలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపడం ఈ పండుగలో ముఖ్యమైన విషయం.
ఉగాది పండుగ తెలుగు సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఒక మహత్తరమైన పండుగ. ప్రతి ఇంటిలో ఆనందం, ఐక్యత, శుభారంభం తీసుకువచ్చే ఈ పండుగ మన జీవితంలో కొత్త ఆశలు నింపుతుంది.
ధర్మం, భక్తి వైపు దృష్టి పెట్టి, సానుకూల ఆలోచనలతో ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించి, విజయవంతమైన జీవితం వైపు అడుగులు వేయడానికి ప్రయత్నం చేయాలి అందరూ.
"ఉగాది నామ సమాయాతే నూతన
సంవత్సరోదయే।
మంగళాని భవంతు సర్వే లోకాః సుఖినో
భవంతు॥"
అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.....
సుధావిశ్వం
సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

-సుధావిశ్వం
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticle, Ugadi Festival Telugu, Parabhava Nama Samvatsaram, Ugadi 2026 Telugu |





Comments