వడ ‘పోత’

Vada Potha - Telugu Family Story | Sailaja Mithra
వడ ‘పోత’ - తెలుగు కుటుంబ కథ | శైలజామిత్ర
Published in manatelugukathalu.com on 14/10/2026
గత జ్ఞాపకాలు మన జీవితంలో చెరగని ముద్ర వేస్తాయి. కానీ గతంలో మిగిలిపోయిన భావాలను వర్తమాన జీవితంపై ప్రభావం చూపనివ్వాలా? శైలజామిత్ర గారి ‘వడ ‘పోత’’ కథ నీలిమ జీవితంలోని పాత ప్రేమ జ్ఞాపకాల ద్వారా కుటుంబ బంధాల విలువను, దాంపత్యంలోని భద్రతను, మనసుకు అవసరమైన భావోద్వేగ స్పష్టతను హృద్యంగా ఆవిష్కరిస్తుంది. గతాన్ని గౌరవిస్తూనే వర్తమానాన్ని ప్రేమించడం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు గుర్తుచేస్తుంది.
హైదరాబాద్‌లో ఉంటున్నా చార్మినార్‌ను తీరికగా చూసి చాలా ఏళ్లయింది. అందుకే ఒక ఆదివారం కుటుంబమంతా కలిసి అక్కడికి బయలుదేరాం. అందునా దసరా కూడా వస్తోంది, ఏదైనా కొనుక్కుందామని కూతురు అంటే బయలుదేరాం.
అలాగని చూడని ప్రదేశం కాదు, కానీ ఎప్పుడో చూసిన ప్రదేశాన్ని మళ్లీ చూసినప్పుడు కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది కదా! అంటే చిన్నతనంలో చూసినదానికి, పిల్లలతో వెళ్లడానికి తేడా ఉంటుంది కదా?
చార్మినార్ చుట్టూ రంగురంగుల గాజుల దుకాణాలు, జనసందోహం, వ్యాపారుల కేకలు, ఆకాశాన్ని తాకుతున్నట్లుండే మినార్లు... అంతా చూస్తుంటే కాలం వెనక్కి వెళ్లినట్లనిపించింది.
పదిహేనేళ్ల క్రితం వచ్చినప్పుడు గాజులు కొనుక్కుని పైకి ఎక్కి నగరాన్ని చూసిన జ్ఞాపకం గుర్తొచ్చింది. ఇప్పుడు పైకి వెళ్లే అవకాశం లేదని తెలిసి లోపలే కాసేపు కూర్చున్నాను.
అక్కడి పాత గోడలను తాకినప్పుడు వాటిలో ఎన్నో జీవితాలు, ఎన్నో కథలు దాగి ఉన్నాయనిపించింది.
ఒక పెద్దాయన చార్మినార్ నిర్మాణం గురించి చెబుతున్నాడు. ఆయన మాటలు వినిపిస్తున్నా నా మనసు మాత్రం మరో ప్రపంచంలోకి ప్రయాణిస్తోంది.
మా ఊరి బస్టాండ్!
రెండు బెంచీలు, ఒక టికెట్ కౌంటర్, పక్కనే రాములు అన్న టీ దుకాణం... అంతే మా ప్రపంచం. కాలేజీకి వెళ్లే ముందు, తిరిగి వచ్చాక స్నేహితులమంతా అక్కడే కలుసుకునేవాళ్లం. బస్సుల రాకపోకల మధ్య మా నవ్వులు, కబుర్లు, చిన్న చిన్న అలకలు కలిసిపోయేవి. డబ్బులు లేనప్పుడు కూడా రాములు అన్న దగ్గర టీ తాగగలిగేవాళ్లం. "రేపు ఇస్తాలే అన్నా," అంటే చాలు, నవ్వుతూ టీ అందించేవాడు.
ఒకరోజు మా స్నేహితురాలు తులసి చదువు కోసం ఊరు వదిలి వెళ్లిపోయింది. బస్సు కదిలేంతవరకు నవ్వుతూ చేయి ఊపింది. బస్సు కనుమరుగైన తర్వాత మేమంతా చాలాసేపు మౌనంగా నిలబడ్డాం. ఆ రోజు మొదటిసారి బస్టాండ్ ఖాళీగా అనిపించింది.
తర్వాత ఒక్కొక్కరం ఒక్కో దారిలో వెళ్లిపోయాం. మా జీవితాల్లో కొత్త మనుషులు వచ్చారు, కొత్త బాధ్యతలు మొదలయ్యాయి. పాత బస్టాండ్ స్థానంలో కొత్త షెల్టర్ వచ్చింది. రాములు అన్న దుకాణం లేదు, కానీ ఆ ప్రదేశంతో ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు.
"మేడమ్! చార్మినార్‌ను చూస్తున్నారా, లేక ఇంకెక్కడికైనా వెళ్లిపోయారా?"
హరి మాటలకు ఈ లోకంలోకి వచ్చాను.
"ఏం లేదు, పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి," అన్నాను.
కారులో కూర్చోగానే ఫోన్ మోగింది. బ్యాగులో ఎక్కడుందో వెతకడానికి విసుగొచ్చింది. నా అవస్థ చూసి పిల్లలు నవ్వుకుంటారని తెలుసు. చివరకు సెల్ ఫోన్‌ను సైలెంట్లో పెట్టి పక్కన పడేశాను.
"అమ్మా! ఫోన్ తీస్తే తీయి, లేకుంటే లేదు కానీ దయచేసి ఆ రింగ్‌టోన్ మార్చు. మేము వినలేకపోతున్నాం," అంది తలపట్టుకుంటూ నాటకీయంగా కూతురు శ్రీజ.
నా ఫోన్లో దేవుడి పాట రింగ్‌టోన్‌గా ఉండటం పిల్లలకు ఎప్పటినుంచో చిరాకు.
"అమ్మకు ఇష్టమైనది, నీకెందుకు?" అన్నాడు హరి.
"ఇష్టం ఉండటం వేరు, దాన్ని అందరూ వినాల్సిందేననుకోవడం వేరు నాన్నా! భక్తి మనసుకు సంబంధించినది, పక్కవాళ్లకు ఇబ్బంది కలిగించాల్సిన అవసరం లేదు కదా!" అంది శ్రీజ.
ఆ మాటకు నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఆమె చెప్పింది నిజమేనేమో! అయినా నా ఇష్టాన్ని కూడా పిల్లలు ఇంత చిన్న విషయంగా తీసుకోవాలా? ఉదయం నుంచి వాళ్ల కోసం ఎన్నో పనులు చేస్తాను. కనీసం నా ఇష్టాయిష్టాలకు కొంచెం విలువ ఇవ్వలేరా? నా మనసులో చిన్న బాధ మొదలైంది.
పిల్లలతో బయటకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక విషయంలో అసంతృప్తి కలుగుతుంది. వాళ్ల దృష్టిలో నేను పాతకాలపు మనిషిని. నా అలవాట్లు పాతవి, నా ఆలోచనలు పాతవి. కానీ వాళ్లను పెంచినప్పుడు నా ప్రపంచమంతా వాళ్లే కదా! ఇప్పుడు వాళ్లకు తమదైన ప్రపంచం ఏర్పడింది.
అందులో నాకు ఎంత స్థానం ఉందో ఒక్కోసారి అర్థం కాదు. ఇలాంటి ఆలోచనలతో ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. పక్కనే ఉన్న హరి నా అసహనాన్ని గమనించాడు.
"ప్రతిదానికీ బాధపడకు నీలూ! పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు, వాళ్ల ఆలోచనలు వాళ్లవి. వీళ్లే కాదు, ఎక్కడైనా పిల్లలు ఇలానే ఉన్నారు. ఏదో వారికే అన్నీ తెలిసిపోయిందనుకుంటారు, తెలిసీ తెలియని వయసు కదా! అయినా ఈ కాలం పిల్లలకి మనం చెప్పిన ప్రతిదానికీ వాళ్లు తల ఊపాలని ఆశిస్తే కష్టం. పడుకో," అంటూ దుప్పటి కప్పాడు.
హరి మాటల్లో తప్పేమీ కనిపించలేదు. కానీ అమ్మ అంటేనే పిల్లలందరికీ లోకువగా ఉండాలని రూలు ఎక్కడైనా ఉందా? కట్టుకున్న చీర నుండి మాట్లాడే మాట వరకు అన్నింటినీ తప్పు పట్టే ఈ పిల్లల్ని చూస్తుంటే చిరాకుగా ఉంటుంది అనిపించి, ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాను.
ఉన్నట్లుండి మనసు మాత్రం మరోచోటికి వెళ్లిపోయింది.
ఆ సాయంత్రం వచ్చిన ఫోన్ కాల్ గుర్తొచ్చింది.
'కొత్త నంబర్ లా ఉందే? ఎవరబ్బా?' అనుకున్నాను. పదే పదే కాల్ రావడంతో లిఫ్ట్ చేశాను.
"హలో నీలూ... గుర్తున్నానా? నేను సుధీర్‌ని," అన్నాడు.
ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాను. సుధీర్? ఎవరూ...
"నేను నీలూ... అమలాపురం సుధీర్..." అనగానే టక్కున ఫోన్ పెట్టేశాను. పెట్టేశానే కానీ మనసులో ఏవేవో ఆలోచనలు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు సుధీర్ ఎందుకు ఫోన్ చేశాడు? పోనీ మాట్లాడదామంటే అంతా చుట్టూ ఉన్నారు. దాంతో పెట్టేశానే కానీ మనసు మాత్రం పరిపరి విధాల పోయింది.
సుధీర్!
పెళ్లికి ముందు మా పక్కింట్లో ఉండేవాడు. అప్పుడు మేమిద్దరం గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం. తెలిసీ తెలియని కాలేజీ రోజులు అవి. అతను మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సంతోషంగా ఉండేది. నాకోసం తను, అతని కోసం నేను ఎదురుచూసే వాళ్ళం కూడా. కానీ ఆ భావానికి ఏ పేరు పెట్టాలో తెలియని వయసు.
నాన్నకు మా పరిచయం మీద అనుమానం వచ్చిందని ఒకరోజు తెలిసింది. నాకు డిగ్రీ పూర్తయ్యాక పెళ్లి చేయాలని అమ్మతో మాట్లాడుతుండగా విన్నాను. ఆ మాట విన్నప్పుడు నా గుండె ఆగినంత పనైంది. నేను ఇంకా చదువుకోవాలనుకున్నాను, ఉద్యోగం చేయాలనుకున్నాను. సుధీర్ గురించి కూడా ఇంట్లో చెప్పాలనుకున్నాను. కానీ ఆ రోజుల్లో తల్లిదండ్రులకు ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు.
మరుసటి రోజు సుధీర్‌కి ఈ విషయం చెప్పాను.
"నాన్న నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు సుధీర్. నువ్వు మీ ఇంట్లో చెప్పకూడదూ? పైగా నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను," అన్నాను.
"అవునా? మీ నాన్నకు ఎదురు చెప్పడం కష్టం నీలూ... చూద్దాం, ఆలోచిస్తానులే," అన్నాడు.
సుధీర్ ఈ మాట విని ఎంతో కంగారు పడతాడని, 'నేను చూసుకుంటానులే, నువ్వేమీ బాధపడకు' అంటాడని, వాళ్ల ఇంట్లో తన గురించి చెప్పి పెళ్లి చేసుకుంటాడని ఎంతో ఆశించాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ రోజు అతను వెళ్లిపోయిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది.
నేను మాత్రమే ఈ పరిచయాన్ని ప్రేమగా భావించానా? ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఇన్నాళ్లు గడిచాక సుధీర్‌కి తన పట్ల ఎలాంటి ప్రేమ లేదా? ఇక ఆపై నేనేమీ చేయలేకపోయాను. డిగ్రీ పూర్తయి కొన్నాళ్లు ఏవో ఉద్యోగమంటూ తిరిగాను.
ఆ తర్వాత నాన్న అనుకున్నట్లే పెళ్లి జరిగింది, హైదరాబాద్ వచ్చాను. కొత్త జీవితం మొదలైంది. హరితో పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు... రోజులు వేగంగా గడిచిపోయాయి. సుధీర్ జ్ఞాపకం క్రమంగా మసకబారిపోయింది. కొన్నాళ్లకు సుధీర్ జ్ఞాపకాల్లో కూడా లేడు, తన జీవితంలో తను మునిగిపోయింది.
మరి ఇన్నాళ్లకు అతని ఫోన్ ఎందుకు?
మరుసటి ఉదయం సులోచన ఫోన్ చేసింది.
"నీలూ, సుధీర్ నీకు ఫోన్ చేశాడా?"
"సులో! నా నంబర్ వాడికి నువ్వే ఇచ్చావా?"
"అవునే... ఏమయింది? ఏదైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడా?" అడిగింది కంగారుగా.
చిన్నప్పుడు సులోచన, సుధీర్, నేను ఒకే కాలనీలో ఉండేవారం. తను కూడా హైదరాబాద్‌లో ఉండటం వల్ల అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం.
"ఏమిటి మాట్లాడటానికి? అయినా ఇన్నేళ్ల తర్వాత?" కోపంగా అన్నాను.
"అదే నాకూ తెలియదు. నువ్వు మాట్లాడి ఉంటే తెలిసేది కదా!"
"నేను పిల్లలతో బయటకు వచ్చాను, ఒకటే ఫోన్. అన్నోన్ నంబర్, ఎవరో అని సైలెంట్లో పడేసి ఇంటికి వచ్చాక చేశాను. పేరు విన్నాక విసుగొచ్చింది, ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు, ఫోన్ పెట్టేశాను. అయినా అతను ఎందుకు ఫోన్ చేశాడు? పాత పరిచయాన్ని గుర్తు చేసుకోవడానికా? ఏదైనా అవసరమా? లేక పిచ్చి వేషాలు వేస్తున్నాడా? అలాంటివి నా దగ్గర చెల్లవు, చెంప చెళ్లుమనిపిస్తాను!" అన్నాను ఆవేశంగా.
"నువ్వు ముందు మాట్లాడు. అన్నీ తప్పుగా ఎందుకు తీసుకుంటావు? ఏదో పరిచయం ఉంది కదాని మాట్లాడాలని అనుకున్నాడేమో... అయినా ఆ రోజుల్లోనే ఏమీ మాట్లాడని వాడు ఇప్పుడు ఏం మాట్లాడతాడే? నీకన్నీ అనుమానాలే... నిదానంగా మాట్లాడు, తప్పేముంది?" అంది సులోచన నిదానంగా.
"తప్పే! ఇప్పుడు మాట్లాడటం అవసరం ఏముంది? ఇప్పుడు ఇద్దరికీ కుటుంబాలు ఉన్నాయి, నాకు పిల్లలున్నారు. నా జీవితంలో ఏ లోటూ లేదని నమ్ముతున్నాను. అయినా ఇరవై ఏళ్ల క్రితం ముగిసిపోయిందనుకున్న పరిచయం మళ్లీ ఇలా రావడం నాకెందుకో నచ్చలేదు. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా తప్పే అవుతుంది. నాకైతే మాట్లాడాలని లేదు. నువ్వు చెప్పేయి, ఇలాంటి పనులు చేయవద్దని..."
"అబ్బ! నీకెందుకే అంత కోపం? ఒక్కసారి మాట్లాడితే నీకేం నష్టం? వాడు తప్పుగా మాట్లాడితే నువ్వు కాదు, నేనే వాడిని తంతాను... సరేనా?" అంది తను కూడా ఆవేశంగా.
మరుసటి రోజు ఉదయం ఏం వండిందో, ఏం పెట్టిందో తెలియదు కానీ ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. నిత్యం నేను ఎప్పుడూ పాటించే క్రమశిక్షణ, సమయపాలన ఆ రోజు ఎక్కడికి పోయాయో! ఒకవైపు పాలు పొంగిపోయాయి, కాఫీ కింద పడిపోవడం, హరి పిలుస్తుంటే పలకకపోవడం... నిన్నటి నుండి తను ఏదో కంగారులో ఉండటం హరి గమనించాడు.
అయినా ఆ విషయం తనే చెబుతుందేమో అని ఎదురుచూశాడు. 'ఈ రోజు సాయంత్రం తీరికగా అడుగుదాంలే' అనుకుంటూ వంటింట్లోకి వచ్చి, "ఏమిటి నీలూ, అలా చిరాకుగా ఉన్నావేంటి? ఏదైనా సమస్యా?" అన్నాడు చాలా క్యాజువల్‌గా.
"అబ్బే ఏమీ లేదు, తలనొప్పిగా ఉందంతే," అన్నాను.
"జాగ్రత్త! పరధ్యానం ఎక్కడున్నా పర్వాలేదు, వంటింట్లో అయితే కష్టం సుమా!" అంటూ నవ్వుతూ బయటపడ్డాడు.
ఆ మాటలు విన్న నేను, 'అమ్మో! వీళ్లు సామాన్యులు కారు కదా' అనుకున్నాను.
మధ్యాహ్నం ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఫోన్ చేతిలోకి తీసుకుని సుధీర్ నంబర్ చూశాను. అతనికి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుండగానే మళ్లీ ఫోన్ మోగింది.
అదే నంబర్! ఈసారి ఎత్తాను.
"హలో!"
"నీలూ...?"
ఆ స్వరం కొద్దిగా మారినా గుర్తుపట్టలేనంతగా కాదు.
"ఎలా ఉన్నావు సుధీర్?" అన్నాను.
"బాగున్నాను. నువ్వెలా ఉన్నావు?"
"చాలా బాగున్నాను," వత్తి పలికాను.
మధ్యలో కొద్దిసేపు నిశ్శబ్దము.
"ఎందుకు ఫోన్ చేశావు?" అని అడిగాను.
ఆ మాటలకు కాసింత షాక్ తిన్నా సుధీర్ బయటపడనీయకుండా... "ఈ మధ్య అమ్మ పోయాక ఇల్లు అమ్మేద్దామని తమ్ముడు అంటే వెళ్లాను. మనం ఉన్న కాలనీకి వెళ్లినప్పుడు నువ్వు గుర్తొచ్చావు.
ఆ రోజులు గుర్తొచ్చాయి. ఒకసారి మాట్లాడదామనుకుని నంబర్ లేకపోతే సులోచనను అడిగి తీసుకున్నాను. కాలనీ అంతా చాలా మారిపోయింది నీలూ... అప్పుడు మనం నిలబడిన స్థలాలు, మాట్లాడుకున్న తోటలు అన్నీ కనిపించకుండా పోయాయి. అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి. ఆ రోజులు తలుచుకుంటే ఒకవైపు సంతోషం, మరోవైపు బాధ రెండూ కలిగాయి..."
"కొన్ని ఏళ్లు గడిచిపోయాయి కదా సుధీర్, మారకుండా ఎలా ఉంటుంది?" అన్నాను.
"అవును, నిజమే..." అంటూ ఆపై ఏం మాట్లాడాలో తెలియక అతను కాసేపు ఆగాడు.
"ఇంకేంటి సుధీర్... ఉండనా మరి?" అన్నాను చిరాకు ధ్వనించేలా.
"నీలూ, నీలూ! ఒక్క నిమిషం ఆగు... నీతో మాట్లాడాలి."
"ఏం మాట్లాడాలి? చెప్పు? మనమేమైనా టీనేజ్ పిల్లలమా?" అన్నాను.
దాంతో ధైర్యం వచ్చిందేమో, చిన్నగా నవ్వుతూ... "అప్పట్లో ఒక విషయం చెప్పలేకపోయాను," అన్నాడు.
"ఏమిటి? వెళ్లొస్తాననా?" అని నవ్వుతూ అడిగాను.
సుధీర్ కూడా నవ్వాడు. "నువ్వు మారలేదు, ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నావు."
"సుధీర్, అసలు విషయం చెప్పు."
అతను కాసేపు మౌనంగా ఉండి, చివరకు అన్నాడు... "నువ్వంటే నాకు ప్రేమ ఉండేది నీలూ! అప్పట్లో చెప్పలేకపోయాను."
ఆ మాట వినగానే నాకు పిచ్చి కోపం వచ్చింది. ఇన్నాళ్లుగా సమాధానం లేని ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకడం నచ్చలేదు. కనీసం ఆ మాట నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. అప్పట్లో నేను ఎదురుచూసిన మాట ఇప్పుడు చెప్పినా ఏం ప్రయోజనం అనుకుని... "సరే, చెప్పావు కదా! ఇప్పుడు ఏం చేద్దాం? లేచిపోదామా?" అన్నాను కఠువుగా.
"ఛీ ఛీ! అదేం లేదు, అలా ఏమీ చేయనక్కర్లేదు. ఒకసారైనా చెప్పాలని అనిపించింది."
"అయితే అప్పుడే చెప్పాల్సింది కదా!"
"అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి."
"పరిస్థితులు నా వైపే ఉన్నాయా సుధీర్? నేను కూడా భయపడ్డాను, నాకు కూడా ఎన్నో ఆశలుండేవి. కానీ నువ్వు ఏమీ మాట్లాడలేదు. నేను కూడా నా దారిలో వెళ్లిపోయాను."
సుధీర్ మౌనంగా ఉన్నాడు.
మళ్లీ నేనే కల్పించుకుని, "ఇప్పుడు మనిద్దరికీ కుటుంబాలు ఉన్నాయి సుధీర్. మన జీవితాలు వేర్వేరు దారుల్లో సాగుతున్నాయి. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంలో తప్పు లేదు, కానీ వాటిని మళ్లీ మన జీవితాల్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. అప్పుడు చెప్పలేని మాటలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు," అన్నాను.
"నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావా?" అని అడిగాడు.
"ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు కాల్ చేసేదాకా అస్సలు గుర్తుకు రాలేదు," అన్నాను ఖచ్చితంగా.
"అవునా? నువ్వు గుర్తుంచుకుంటావని అనుకున్నాను," అన్నాడు మెల్లగా.
"నీకెంతమంది పిల్లలు?"
"ఒక్క బాబు."
"నీ భార్య ఏం చేస్తున్నారు?"
"తను గవర్నమెంట్ టీచర్."
"నువ్వు?"
"నేను కాలేజీలో క్లర్క్. నీకు తెలుసు కదా, అప్పుడే వచ్చింది."
"అవును. ఇప్పుడు పని ఎక్కువగా లేదా?"
"ఉంది... లేకేం?"
"మరి చేసుకో, చెత్త ఫోన్స్ చేయకు," అన్నాను చిరాకుగా.
"నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో! నేను ఏమీ ఆశించడం లేదు, పాత రోజులు గుర్తొచ్చి ఫోన్ చేశాను అంతే," అన్నాడు కంగారుగా సుధీర్.
"నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు. కానీ నీకో విషయం చెప్పాలి. మనం అప్పట్లో ఏం అనుకున్నామన్నది ఇప్పుడు ముఖ్యం కాదు, ఇప్పుడు మనం ఎవరితో జీవిస్తున్నామన్నదే ముఖ్యం!"
"అంటే ఇక ఫోన్ చేయకూడదా?" అని అడిగాడు.
"అస్సలు చేయకూడదు, చేయొద్దు కూడా! మన మధ్య ఒకప్పుడు తెలిసీ తెలియని వయసులో ఏదో ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మన జీవితాల్లో మనల్ని నమ్ముకుని మరికొందరు ఉన్నారు. వాళ్ల నమ్మకాన్ని గౌరవించాలి. నాకు నా కుటుంబం ఉంది, ఆ జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషాన్ని అనవసరమైన మాటలతో కలుషితం చేసుకోవాలనుకోవడం లేదు."
అతను కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. "సరే నీలూ, సంతోషంగా ఉండు."
"నన్ను నా ప్రపంచంలో సంతోషంగా ఉంచు. నువ్వు కూడా సంతోషంగా ఉండు."
ఫోన్ కట్ అయింది.
చేతిలో ఫోన్ అలాగే ఉంది. కానీ ఇన్నాళ్లుగా మనసులో పేరుకుపోయిన ఏదో బరువు దిగిపోయినట్లనిపించింది.
సుధీర్ తనపై ప్రేమ ఉండేదని చెప్పాడు. ఎన్నో ఏళ్లుగా నేను వినాలనుకున్న మాట అదే కావచ్చు, ఆ మాట వినపడకపోవడమే తన జీవితంలో ఎంతో అసంతృప్తిగా ఉండి ఉండవచ్చు... లేకపోవచ్చు కూడా!
అతను అప్పుడు చెప్పి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలియదు. బహుశా వేరే దారిలో ప్రయాణించి ఉండేదాన్ని, బహుశా మరొక ప్రపంచంలో ఉండేదాన్ని.
కానీ జరగని జీవితాన్ని ఊహించుకుంటూ, నా చేతుల్లో ఉన్న జీవితాన్ని తక్కువగా చూడటం ఎందుకు?
నేను గతాన్ని పూర్తిగా మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞాపకాలు నా జీవితంలో ఒక భాగమే, కానీ అవి నా వర్తమానాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు. జీవితంలో వడపోత చాలా అవసరం. అనవసరమైనవి వడపోస్తే తప్ప జీవితం సజావుగా సాగదు. ఎంత గొప్ప విషయమైనా అనవసరమైనదైతే వడబోయాల్సిందే అనుకున్నాను.
అంతలో తలుపు తెరిచిన శబ్దం వినిపించింది. హరి వచ్చినట్లున్నాడు అనుకున్నాను.
"ఏమిటి నీలూ, ఈ రోజు చాలా అలసటగా కనిపిస్తున్నావు?"
"అలాగా? మీకన్నీ తెలిసిపోతాయి కాబోలు!" అన్నాను నవ్వుతూ.
"తెలియకపోతే ఎలా? ఎంతైనా నా అర్థాంగివి కదా!" అన్నాడు చలోక్తిగా.
మనస్ఫూర్తిగా నవ్వేశాను... అతని ముఖంలోకి చూశాను. నిన్నటినుండి నా మాటలు, నా ఆవేదన గమనించలేదు అంటే నేను నమ్మను.
అయినా నన్ను ప్రశ్నలతో నిలదీయకుండా, నా మనసులో ఏదో ఉందని గుర్తించినా నాకు కొంత సమయం ఇచ్చిన మనిషి; నా అసహనాన్ని భరించిన మనిషి. 'చాలు కదా జీవితం' అనిపించింది. ఆ క్షణంలో అతనితో జీవితం ఎంతో సేఫ్ అని కూడా అనిపించింది. జరిగినవన్నీ తలుచుకుంటుంటే బాధనిపించడం లేదు. ఆ జ్ఞాపకాలు నా జీవితంలో ఒక భాగం... అంతే అనుకున్నాను.
సాయంత్రం శ్రీజ ఇంటికి రాగానే ఫేర్వెల్ పార్టీ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆమె మాటల్లో ఉత్సాహం, కళ్లల్లో మెరుపు! తను మాట్లాడిన స్పీచ్ అన్నీ చెప్పేస్తోంది. ఉండుండి... "అమ్మా, వింటున్నావా?" అంటూ వెంటపడుతోంది.
"ఉండవే... టీ చేయాలి. వింటున్నాను, చెప్పు," అన్నాను.
కొడుకు వచ్చి, "అమ్మా, టీ ఉందా?" అని అడిగాడు.
ఇంతకు ముందు అయితే, ఇంట్లో అడుగుపెట్టగానే టీ గుర్తొచ్చిందా అని చిరాకు పడేదాన్నేమో!
"అదే పనిలో ఉన్నానురా! వేడి చేసి ఇస్తాను," అన్నాను.
టీ కప్పులతో బయటకు వచ్చాను.
"ఈ రోజు టీ చాలా బాగుందే!" అన్నాడు హరి.
"రోజూ ఇదే టీ కదా!" అన్నాను.
"టీ అదే కావచ్చు, కానీ ఈ రోజు నీ ముఖంలో చిరాకు కనిపించడం లేదు," అన్నాడు నవ్వుతూ.
పిల్లలు కూడా నవ్వారు.
"అమ్మా! బయటకు వెళ్దామా? త్వరగా తయారవ్వు!" అన్నాడు కొడుకు.
"ఈ మధ్య బయటకు వెళ్లడం ఎక్కువైందిరా నీకు," అంటూ చిరాకు పడ్డాను.
"సరేలే... తయారవు. మనం కలిసి సినిమా చూసి చాలా రోజులయింది," అనడంతో పిల్లల్లో మరింత ఉత్సాహం కనిపించింది. ఇక వాదించే ఓపిక లేక వారితో బయలుదేరాను.
"బస్సులోనా?" అడిగింది శ్రీజ విసుగ్గా.
"లేదురా! క్యాబ్ బుక్ చేశాను," అన్నాడు హరి నవ్వుతూ.
ఇంటి ఎదురుగా టీ అమ్మే అతని పేరు కూడా రాములు. ఎవరో "రాములూ!" అని పిలుస్తుంటే మా ఊరి రాములు మళ్లీ గుర్తుకొచ్చాడు. కాలేజీ అవ్వగానే నేను, సుధీర్ టీ కోసం నిలబడిన రోజులు గుర్తుకొచ్చాయి.
కానీ ఈసారి గతంలోకి వెళ్లిపోవాలనిపించలేదు, ఎందుకంటే నా గతం నాకు నచ్చలేదు. వెనక్కి తిరిగి నా కుటుంబాన్ని చూశాను, వాళ్లు నా కోసం ఎదురుచూస్తున్నారు.
ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇదివరకటి చిరాకు మనసులో లేదు. బహుశా సుధీర్ చెప్పిన మాట వల్లేమో, ఎన్నాళ్ల నుంచో నాలో దాగున్న ప్రశ్నకు సమాధానం దొరికినందువల్లనేమో! నా భవిష్యత్తు ఎంతో తేటతెల్లంగా ఉంది.
"అమ్మా! రా, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావు," అంటున్న కూతురి కేసి చూస్తూ, "వస్తున్నాను తల్లీ!" అంటూ చిరునవ్వుతో వాళ్ల దగ్గరకు నడిచాను.
"అమ్మా! నీ ఫోన్ తెచ్చావా?" అడిగాడు కొడుకు.
"ఇక్కడ మూడు ఫోన్లు ఉండగా నా ఫోన్ ఎందుకురా? అందుకే తేలేదు... తెచ్చినా వచ్చే రాంగ్ నంబర్స్ తప్ప మరేమీ ఉండదు," అంటూ నవ్వుతూ పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకున్నాను. ముందు సీట్లో హరి నవ్వుతుండటం అద్దంలో కనిపిస్తోంది!
సమాప్తం -
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
శైలజామిత్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: శైలజామిత్ర
శైలజామిత్ర తెలుగు మరియు ఆంగ్ల సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు మరియు సాహిత్య విమర్శకురాలు. కవిత్వం, కథలు, నవలలు, అనువాదాలు, సాహిత్య వ్యాసాలు మరియు విమర్శ వంటి వివిధ ప్రక్రియల్లో ఆమె తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
జర్నలిజంతో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె, అనంతరం ప్రచురణ మరియు మీడియా రంగాల్లో పనిచేశారు. సాహిత్యంపై గాఢమైన ఆసక్తి, నిరంతర అధ్యయనం, సృజనాత్మక దృక్పథంతో విస్తృతమైన రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ఆమె సాహిత్య కృషిలో 11 కవితా సంపుటాలు, 4 కథా సంపుటాలు, 3 నవలలు, 1 కవితా విమర్శా గ్రంథం ప్రముఖమైనవి. వీటితో పాటు, 600కు పైగా పుస్తక సమీక్షలు, 10 గ్రంథాల అనువాదాలు, అనేక సాహిత్య వ్యాసాలు, విమర్శనా రచనలు చేశారు. తెలుగు సాహిత్యంలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తూ, ఇతర భాషల సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయడంలోనూ ఆమె విశేష కృషి చేశారు.
కవయిత్రిగా భావోద్వేగాలను, జీవితానుభవాలను కవిత్వంలో ప్రతిబింబిస్తూ, కథా రచయిత్రిగా మానవ సంబంధాలను, సామాజిక అంశాలను తన రచనల్లో ఆవిష్కరించారు. అనువాదకురాలిగా భాషల మధ్య సాహిత్య వారధిని నిర్మించగా, విమర్శకురాలిగా పుస్తకాలను లోతుగా విశ్లేషిస్తూ సాహిత్య చర్చలకు తన వంతు తోడ్పాటునందించారు.
వందలాది సమీక్షలు, వ్యాసాలు, విస్తృతమైన సృజనాత్మక రచనలతో తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన సైలజ మిత్ర, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సాహితీవేత్తగా తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆమె సాహిత్య ప్రస్థానం సృజనాత్మకతకు, సాహిత్య అధ్యయనానికి, భాషల మధ్య సాంస్కృతిక అనుసంధానానికి ఒక విశిష్ట ఉదాహరణగా నిలుస్తుంది.







Comments