'Vatavruksha Vilapam' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 02/06/2024
'వటవృక్ష విలాపం' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
వట వృక్షం.... అంటే మర్రిచెట్టు....
విత్తు ఆవగింజంత....
కాలగతిలో దాని పెరుగుదలకు పేరు మహావృక్షం....
వృక్షరాజం. దాని పండ్లు తియ్యగా, మధురంగా వుంటాయి.
పక్షులకు అవి ఆహారం. కొందరు పిల్లలు, గ్రామవాసులూ తింటారు.
విత్తు చిన్నదైన.... ’పిట్టకొంచెం కూతఘనం’ అన్నట్లు కాలక్రమంలో అది మహా విశాలంగా విస్తరిస్తుంది. ఆకులు ఎంతో పెద్దవి. కొందరు నాలుగు ఆకులను కలిపి విస్తరిగా కుట్టి అందులో భోంచేస్తారు.
ముఖ్యంగా బడుగు (పేదలు) వర్గాల బ్రతుకు తెరువుకు ఆ చెట్టు క్రింది భాగం (నీడ ప్రాంతం) వారి వారి జీవన వ్యాపకాలకు నిలయం అవుతుంది. దేశ చరిత్రలో అశోకచక్రవర్తికి ఘనచరిత వుంది. వారు మౌర్యవంశజులు. వారి రాజధాని పాటలీపుత్ర. బీహారిప్రాంతం. తండ్రిగారు బింబిసార చక్రవర్తి. తాతగారు చంద్రగుప్త మహారాజు. సామ్రాజ్య విస్తీర్ణతను పెంచేటందుకు వారు తరుచుగా యుద్ధాలను నిర్వర్తించారు. వారు బౌద్ధమతానికి చెందినవారు.
వారి కుమారుడు మహేంద్ర. కుమార్తె సంఘమిత్ర. బౌద్ధమత వ్యాప్తికి వారు కుమార్తెను, కుమారుని సిలోన్‍కు (శ్రీలంక) పంపారు. యావత్ ఆసియా ఖండంలో బౌద్ధమతాన్ని స్థాపించాలన్నది వారి మహా ఆశయం. వారి అసలు పేరు అశోకవర్థన్. వారి విజయ పరంపరల కారణంగా వారికి సంక్రమించిన పేరు అశోక చక్రవర్తి. చక్రవర్తి అనగా రాజులకు రాజు....
వారి జీవితంలో గొప్ప మార్పుకు కారణం కళింగయుద్ధం. నేటి ఒరిస్సా ప్రాంతమే ఆనాటి కళింగదేశము. రాజా అనంత పద్మనాభ, ఒరిస్సా ప్రాంతపురాజు. కళింగయుద్ధము భారతదేశ చరిత్రలో ప్రాముఖ్యమైనది. ఆ మహాసంగ్రామం 262BCE లో ప్రారంభమై 268BCE (బిఫోర్ క్రీస్రు)లో ముగిసినది. దాదాపు 250000 మంది మరణించారు. విజయాన్ని అశోక చక్రవర్తి సాధించారు. రక్త ఏరులై పారింది.
యుద్ధానంతరం అశోకచక్రవర్తి గారి హృదయంలో ఎంతో ఆవేదన పరిపరి విధాల ఆలోచించి పశ్చాత్తాపంతో శేష జీవితంలో అహింస... శాంతి... ప్రేమ... సౌభ్రాతృత్వాలను గురించి ప్రజల మధ్యన నిలబడి ప్రసంగించి, జనంలో స్వార్థ ద్వేషాలు సమసిపోయేలా... ప్రేమాభిమానాలు పెరిగేలా చేసిన మొట్టమొదటి మహారాజు అశోకచక్రవర్తి.
వారి జీవితకాలంలో... రహదారులకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లను నాటించారు. పాదచారుల ప్రయాణానికి అనువుగా అక్కడక్కడ సత్రాలు, బావులను నిర్మించారు. సత్రయాజమాన్యుల మూలంగా ప్రయాణికులకు ఆకలి దప్పులను తీర్చారు. భారతదేశ సుచరిత్రలో అశోకచక్రవర్తి యదార్థంగా రాజాధిరాజు. చరిత్రలో వారి ఘనత సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
*
ఆవూరి నాలుగురోడ్ల కూడలిలో ఉత్తర ఈశాన్యపు వైపు వీధి మొనలో బ్రహ్మాండమైన మర్రిచెట్టు.... దాదపు ఎనభై అడుగుల వైశాల్యం కలది. నాటినది ఎవరో!.... ఎప్పుడో!.... ఎవరికీ తెలీదు.
ఆవృక్షం కింద మొదలు భాగం చుట్టూ కొందరు యాచకులు నివసించేవారు. ఉదయాన్నే వీధి కొళాయిలు లేక వీధి బావి దగ్గర స్నానం చేసి, దుస్తులు మార్చుకొని, నొదటన విభూధి రేఖలు, కనుబొమలు నడుమ కుంకుమని దిద్దుకొని వీధుల వెంబడి యాచకానికి బయలుదేరుతారు. కొందరు గృహిణులు వారికి తోచిన దానాన్ని చేసేవారు. అలా నాలుగైదు వీధులు తిరిగి అపరార్న వేళకు వారు చెట్టుక్రింది నీడకు చేరేవారు. కొందరు అన్నదానం కూడా చేసేవారు.
ఆ చెట్టుక్రింద నీడలో ఆశ్రయంగా బ్రతికేవారు ఐదుగురు.....
పాదరక్షలు బాగుచేసే సోమయ్య.
బఠానీ, సున్నుండలు, శెనగపప్పు, బొరుగులు, గుగ్గిళ్ళు విక్రయించే వీరయ్య.
బుట్టభోజనం పెట్టే గోవిందమ్మ.
గుర్రాలకు, ఎద్దులకు నాడాలు తగిలించే హిమామ్ సాహెబ్.
ఐస్‌ను, పండ్లను అమ్మే రామరాజు.
వీరివద్ద ఎవరికి ఏది కావాలంటే దాన్ని వీధిన నడిచేవారు, కొనేవారు, వారి సేవను వినియోగించుకొనేవారు. వీరి కష్టమర్లు కొందరు పౌరులు, పేదలు. సోమయ్య, వీరయ్య, హిమామ్ సాహెబ్, రామరాజు, గోవిందమ్మ, ఆ ఐదుగురూ వేరేవారైనా ఒకే కుటుంబానికి చెందిన వారిలా అందరూ స్నేహభావంతో, వాత్సల్యంతో కలిసిమెలిసి ఉండేవారు. వారంతా ఆ మర్రిచెట్టూను ఒక దేవతగా మొక్కేవారు. రిక్షాలను నడుపుకొని బ్రతికేవారు. రోజులో కొంత సమయం ఆ చెట్టుక్రింద సేద తీర్చుకొనేవారు.
ఊరు మున్సిపాలిటీ అయ్యింది. రోడ్లను విశాలం చేయాలని మున్సిపాలిటీ కార్యవర్గం నిర్ణయించింది. కారణం వూరు నలువైపులా బాగా పెరిగింది.
ఇరవై సంవత్సరాల్లో జనాభా రెట్టింపు అయ్యింది. కాలేజీలు వెలిశాయి. సినిమాహాళ్ళు నిర్మాణం జరిగింది. షాపులు, హోటళ్ళు పెరిగయి. పెంకుటిళ్ళు కాంక్రీట్ ఇళ్ళుగా రెండు మూడు అంతస్థులుగా వెలిశాయి. కారణం ఆ వూర్లో రైల్వేస్టేషన్ ఉంది. చుట్టూ పదిపన్నెండు కుగ్రామాలు వున్నాయి. ఆ గ్రామవాసుల ఉపాధిమార్గం వ్యవసాయం. వారికి కావలసిన వస్తువులను, వారు ఈ వూరికి వచ్చి కనుగోలు చేసి తీసుకొని వెళ్ళేవారు.
వారు పండించిన కూరగాయలు, ఆకుకూరలను ఇక్కడికి తీసుకొని వచ్చి విక్రయించేవారు. ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్న సోమయ్య, వీరయ్య, హిమామ్ సాహెబ్, రామరాజు, గోవిందమ్మ హృదయాలకు మున్సిపాలిటి వారి నిర్ణయం ఆవేదనను కలిగించింది.
ఒకరోజు ఉదయం రోడ్డును విశాలం చేసేటందుకు ఆ మర్రిచెట్టును కొట్టి వేయాబోతున్నారనే వార్త ఆ ఐదుగురి చెవులకు సోకింది. వారి మనసుల్లో కలవరం కలిగించింది. ’ఎన్నో ఏళ్ల తరబడి ఈ చెట్టు నీడన బ్రతుకు తెరువును సాగించాము. దీన్ని కొట్టిపారేస్తే మనం ఎక్కడికి పోవాలి. ఏం చేయాలి? ఎలా బ్రతకాలనే భయం వారిని ఎంతగానో వ్యాకులపరిచింది. ఆ బాధ వారికే కారు ఆ వటవృక్షానికి కూడా!?....
*
దాదాపు నా వయస్సు నూరు సంవత్సరాలు. మనుషులు పెరిగినట్లుగానే నేనూ పెరిగాను. వానకు తడిశాను. ఎండను ఎండాను. కానీ నా క్రిందకు చేరిన వారికి నేను గొడుగునైనాను. చల్లని నీడనిచ్చాను.
నా మొదట్లో ఎవరూ లేని యాచకులు ఎందరో వుండేవారు. కొంతకాలం తర్వాత పోయేవారు. కొత్తవారు వచ్చేవారు నా ఆకులను కోసి కోమటి సుబ్బమ్మ ఇస్తళ్ళు కుట్టి, విక్రయించి తన బ్రతుకును సాగించేది. కూతురుకు పెండ్లి చేసింది. వున్నంతలో పేదలకు దానం చేసేది సుబ్బమ్మ. కరోనా కాటుకు బలైపోయింది. ఆమె చివరిరోజుల్లో నా దగ్గరకు వచ్చి నా చుట్టూ తిరిగి నాకు దణ్ణం పెట్టింది. ’తల్లీ!.... పాతిక ముఫ్ఫై సంవత్సరాలుగా నన్ను నా కూతుర్ని పోషించింది నీవే. నీ ఆకుల ఇస్తళ్ళ వ్యాపారంతో కూడబెట్టిన డబ్బుతోనే నేను నా కూతురు పెళ్ళి చేశాను. నీ ఋణాన్ని నేను ఏ రీతిగా తీర్చుకోగలను తల్లీ!...’ దీనంగా కన్నీరు కార్చింది. చాలా మంచి మనిషి. నేను మాట్లాడలేను కదా!.... కానీ నాకు మనసున్నదన్న విషయం నా చుట్టూ తిరిగే ఈ జనాలకు ఎందుకు తోచదు?....
ఎందరో మనుషులను చూచాను. ఎక్కువ మందికి స్వార్థం.... తాము తనవారు బాగుండాలి. ఎదుటివారు పచ్చగా కనబడకూడదు. మనస్సున ద్వేషం, మాటల్లో అసూయ. ఇది కలికాలం కదా!.... జనాల పోకడ అంతేనేమో!....
నేను పూచికాయలు. పండ్లు నా నిండా వున్నప్పుడు కొందరు యాచకులు భోజనం లేనినాడు నా పండ్లను తినేవారు. నన్ను ఎంతో ప్రీతిగా చూచేవారు. నావల్ల వారి ఆకలి తీరినందుకు అప్పట్లో నాకు ఎంతో సంతోషం. పదిమందికి ఉపయోగపడే నా జన్మను గురించి నేను ఎంతగానో ఆనందించేదాన్ని. తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలు మంచివారుగా, చెడ్డవారుగా తయారవుతారు. తప్పుచేసిన పిల్లలను మందలించి ఒప్పును పెద్దవారు పిల్లలకు నేర్పాలి. కొందరు పిల్లలు దోటిని కట్టి, నా పండ్లను కోసుకొని తినేవారు. (మంచి పెంపకంలో పెరిగిన పిల్లలు)
కొందరు పిల్లలు నాపై రాళ్ళు రువ్వి నా ఆకులు చినిగిపోయేలా చేసి, వారు విసిరిన రాయి తగిలి క్రిందరాలిన నా పండ్లను ఆరగించేవారు. నాకు తగిలిన రాయి వలన నాకు కలిగే బాధవారికి అనవసరం. వారికి కావలసిన పండ్లు దొరికాయని వారికి ఆనందం. తల్లిదండ్రులు క్రమవర్తనంతో పెంచని పిల్లల తీరుఇది.
ఇక... సోమయ్య, వీరయ్య, హిమామ్ సాహెబ్, రామరాజు, గోవిందమ్మ, వీరు ప్రతిరోజు నాకు నమస్కరిస్తారు. నా మొదలు దగ్గర కడ్డీలు వెలిగించి నన్ను దేవతలా కొలుస్తారు. ఆ ఐదుగురు సంపదలేని పేదవారైనా... వారిలో మంచి మానవత్వం ఉంది. అందువలన వారు నా నీడలో ఒక కుటుంబీకులుగా తమ బ్రతుకు తెరువును సాగిస్తున్నారు. వారికి ఒకరిపట్ల ఒకరికి ఎంతో ప్రేమాభిమానాలు. వారు అసలు సిసలైన మంచిమానవులు. నన్ను ఎంతగానో గౌరవించి, అభిమానించేవారు. వారు అంటే నాకు ఎంతో ప్రీతి.
ఈ రోజు.... ఆ ఐదుగురు నా మొదట్లో సువాసనాభరిత అగరవత్తులను వెలిగించారు. కన్నీళ్ళతో చేతులు జోడించారు. ’తల్లీ!..... ఎంతోకాలంగా నీ చల్లని నీడలో మేము మా జీవితాలను గడిపాము. రెండు రోజుల క్రిందట ఒక దుర్వార్తను విన్నాము. రోడ్డు విస్తరణకుగా నిన్ను నరుకుతారట. మాకు అండగా వున్న నిన్ను నేల కూల్చుతారట. ఆ వార్త విన్నప్పటి నుంచీ మాకు ఎంతో బాధగా వుంది తల్లీ. మేము పేదవారం. నీ అండన ఇంతకాలం బ్రతికాము. కానీ... మేము నిన్ను కాపాడలేని... దీనులం. మమ్ములను క్షమించు తల్లీ!....’ కన్నీటితో చేతులు జోడించి భోరున ఏడ్చారు.
ఆ వార్త విన్న నాకు... ఎంతో ఆవేదన కలిగింది. నేను మాట్లాడలేను కదా!... నా ఆవేదనను ఎవరికీ చెప్పుకోలేనుగా! ఏనాడో ఒక మహనీయుడు చరిత్రలో చిరస్థాయిగా నిలచిన ఆ అశోక చక్రవర్తి లాంటి వారు నన్ను ఇక్కడ నాటారు. నా చిన్న వయస్సులో నీరు పోసి దడిని ఏర్పాటు చేసి నన్ను సంరక్షించారు. కాలక్రమంలో నేను పెరిగాను. కాలం తీరివారు వెళ్ళిపోయారు.
నేడు... స్వార్థపూరిత హృదయాలు నన్ను చంపాలనుకొంటున్నారు. వారికి వారి లక్ష్యం ముఖ్యం. నాకు ఒక మనసంటుందని, అది అందరి మనసుల్లానే మూగదని వారు ఏనాడూ ఆలోచించలేదు. ఆలోచించబోరు. యదలోని వ్యధను ప్రక్కన పెట్టాను. నా మనస్సున దైవాన్ని తలిచాను. ’అయ్యా!.... సామీ!.... నా ప్రయోజనాలతో వారికి నిమిత్తం లేదు. నా నుండి విడుదల అయ్యే ప్రాణవాయువు ఎందరికి ఎన్నో విధాలుగా వుపయోగపడుతుందో వారికి అనవసరం. వారి జఠిల నిర్ణయం వారిది.
సామీ!..... మరుజన్మ వున్నదో లేదో!.... వుంటే ఆ జన్మలో కూడా నన్ను మర్రిచెట్టుగానే అడవిలో పుట్టించు. స్వార్థపు మనుషుల మధ్య వద్దు. నా నీడన అడవి జంతువులు నాపై ఎన్నో రకాల పక్షులు ఆనందంగా జీవించేలా చేయి. నా ఈ మూగ బ్రతుకు నాకు ఇంతకాలం ఎంతో ఆనందాన్ని కలిగించిండి. నూరేళ్ళకు పైన జీవితాన్ని గడిపాను. ప్రకృతి మహిమలన్నింటినీ చూచాను. కొందరికి ఉపయోగపడే రీతిగా బ్రతికాను.
నన్ను వారు చంపబోతున్నారని నాకు బాధలేదు. నాకు వారిపై ద్వేషం లేదు. మీ నిర్ణయం ప్రకారమేగా ఈ యావత్ సృష్టి వర్తించేది. పుట్టిన ప్రతి జీవరాశి గిట్టక తప్పదుగా!.... అనుకొంటున్నాను. నా అంతిమ ఘడియలు ఆసన్నమౌతున్నాయని అదే తమరి నిర్ణయమే కదా!... సామీ!... నా క్రింద బతికిన సోమయ్య, వీరయ్య, హిమామ్ సాహెబ్, రామరాజు, గోవిందమ్మలను కాపాడు. వారి బ్రతుకు దెరువుకు చక్కని నిలయాన్ని చూపు. నా చివరి కోరికను మన్నించు ప్రభూ’ అని దీనంగా దైవాన్ని అర్థించింది ఆ మహా వృక్ష ఆత్మ....
అది మంచుకాలము... ప్రతి ఆకునుండి జలజలా నీళ్ళు రాలాయి. అది మంచుకాదు. ఆ మహా వటవృక్షపు కన్నీరు. సూర్యుడు పడమటి దిశన అస్తమించాడు. సోమయ్య, వీరయ్య, హిమామ్ సాహెబ్, రామరాజు, గోవిందమ్మలు వారి సామాగ్రి తీసుకొని వారి ఇళ్ళవైపు కన్నీటితో కదిలిపోయారు.
ఆ రాత్రి హత్య జరిగింది. ఆ ప్రాంతంలో వట వృక్ష రూపురేఖలు శూన్యం అయినాయి. జెసిబితో వేళ్ళను కూడా పెకిలించారు.
’రామ్....రామ్....’ అంటూ ఆ వృక్షమాత జీవుడు గాల్లో కలిసిపోయాడు.
భల్లున తెల్లారింది. ఆ ఐదుగురూ పరుగున వచ్చి చూచారు. వటవృక్షపు ఆనవాలుగా అక్కడ ఏమీ మిగల్లేదు. వారు భోరున ఏడ్చారు. అధికారులు వారిని అసహనంతో ఆశ్చర్యంగా చూచారు.
*
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments