వెలకట్టలేని ఆభరణం
- Ganti Asha Padmini

- 21 hours ago
- 7 min read

Velakattaleni Abharanam - Telugu Family Story | Ganti Asa Padmini
వెలకట్టలేని ఆభరణం - తెలుగు కుటుంబ కథ | గంటి ఆశ పద్మిని
Published in manatelugukathalu.com on 06/09/2026
బంగారం, వజ్రాలకంటే విలువైన ఆభరణం ఒకటి ఉందట! అది ఏమిటో తెలుసుకున్న మాధవ్ తన భార్య రోజిని కొత్తగా అర్థం చేసుకున్నాడు. ❤️
మనసును తాకే అందమైన కుటుంబ కథ — తప్పక చదవండి.
వెలకట్టలేని ఆభరణం - పార్ట్ 1
“మనఃశాంతి ఎక్కడ దొరుకుతుంది?” అనే పుస్తకం చదువుతున్న జగన్నాథ రావు దగ్గరకు, “మొగుడితో వేగడం ఎలా?” అనే పుస్తకం ఒక చేతితో, మరో చేతితో టీ కప్పు తీసుకువచ్చి పక్క సోఫాలో కూర్చుంది పార్వతమ్మ.
ఇద్దరూ పుస్తకాలు చదువుతుండగా, పెద్ద పెద్ద కేకలు తమ మనవరాలి గదిలోంచి వినిపించాయి. ఇద్దరూ పుస్తకాలను పక్కన టేబుల్ పైన పెట్టేసి గబగబ మనవరాలి గది దగ్గరకు వెళ్లారు.
అక్కడ మనవరాలు రోజి, తన భర్త మాధవ్ గొడవ పడుతున్నారు. రోజి నాన్నమ్మ, తాతయ్య రావడం చూసిన మాధవ్ వెంటనే కారు తాళాలు తీసుకుని బయటకు వెళ్లిపోయాడు.
రోజి వెంటనే కళ్లు తుడుచుకుని, “రా నాన్నమ్మ” అని గది లోపలకు పిలిచింది.
పార్వతమ్మ లోపలకు వస్తూ.. “ఏమైంది రోజి?” అని అడిగింది.
రోజి “ఏమీ లేదు, ఉత్తినే నాన్నమ్మ” అని చెప్పి పక్కనే ఉన్న బట్టలను మడతపెట్టసాగింది. పార్వతమ్మ ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్లిపోయింది.
రాత్రి ఎనిమిదయింది. రోజి నాన్నమ్మ, తాతయ్యను భోజనానికి రమ్మని పిలిచింది. ఇద్దరూ.. “మాధవ్ వచ్చాక అందరం కలిసి భోజనం చేద్దాం” అని అన్నారు.
అతను రావాలాని రోజి అనబోతుండగా.. మాధవ్ కారు వాకిట్లో వచ్చి ఆగింది.
“అగో మాధవ్ వచ్చినట్టున్నాడు. ముందు వెళ్లి అతనికి ఏమిటి కావాలో చూడు” అని రోజికి చెప్పారు ఇద్దరూ.
సరేనని వెళ్ళింది రోజి.
మాధవ్ తన గదికి వెళ్ళాడు. రోజి వెళ్ళి గది తలుపులు కొట్టింది. మాధవ్ తలుపులు తెరిచి, “ఏమిటి మీ వాళ్ళు ఉన్నారని నటనా..?” అని అడిగాడు.
“నాకేమి నటించాల్సిన అవసరం లేదు. నాకు ఇక్కడ చిన్న పని ఉంది” అని చెప్పి లోపలకు వెళ్ళింది.
రోజి తన పని ముగించుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి నాన్నమ్మను పిలిచింది. నాన్నమ్మ, తాతయ్య ఇద్దరూ వచ్చి “మాధవ్ ఎక్కడ?” అని అడిగారు.
“అతను..’ అని చెప్పబోతుండగానే మాధవ్ వచ్చాడు.
అందరూ కలిసి భోజనం ముగించుకుని ఎవరి గదికి వాళ్ళు బయలుదేరారు. రోజి తన భర్త మాధవ్ తో కాకుండా పక్క గదిలోకి వెళుతుండగా.. “అదేమిటి, మీ ఇద్దరూ వేరువేరు గదుల్లో పడుకుంటున్నారా..?” అని అడిగింది పార్వతమ్మ.
“అదేమిలేదు. గది తలుపులు వేసి ఉన్నాయా లేదా అని చూడడానికి వెళుతున్నాను. అయినా నేను, నా భర్త వేరువేరుగా పడుకోవడం ఏమిటి..? అతను పక్కన లేకపోతే నాకు అస్సలు నిద్రే పట్టదు” అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది రోజి.
పార్వతమ్మకు మనవరాలి మాట తీరు, ప్రవర్తనలో తేడా చూసి అనుమానం వచ్చింది.
మాధవ్ తన గదిలోకి వచ్చిన రోజిని చూసి “అదేమిటి ఇవాళ ఇక్కడకు వచ్చావు?” అని ప్రశ్నించాడు.
“మా నాన్నమ్మ, తాతయ్య వాళ్ళ ఊరుకు వెళ్ళేదాకా నేను ఇక్కడే పడుకుంటా” అని చెప్పింది రోజి.
“సరే ఎదురుగా ఉన్న సోఫాలో పడుకో” అన్నాడు మాధవ్.
అందరూ పడుకున్నాక పార్వతమ్మ మాధవ్ గది పక్క గదికి వెళ్ళి చూసింది. అక్కడ రోజి రోజు కట్టుకునే బట్టలు, వాడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయి. అవి చూసిన పార్వతమ్మకు రోజి, మాధవ్ మధ్య ఏదో జరుగుతోంది అని నిర్ధారణ అయింది.
సూర్యుడు ఉదయించాడు. రోజి కాఫీ తీసుకొచ్చి నాన్నమ్మ, తాతయ్యకు అందించింది.
కాఫీ కప్ అందుకుంటూ “మాధవ్ నిద్రలేచాడా?” అని అడిగింది పార్వతమ్మ.
“లేచారు” అని బదులిచ్చింది రోజి.
“సరే, అతను ఆఫీస్ కి వెళ్ళాక నీ పని ముగించుకుని నా దగ్గరకు రా. నీతో కొంచెం మాట్లాడాలి” అని చెప్పింది పార్వతమ్మ.
“దేని గురించి నాన్నమ్మ?” అని అడిగింది రోజి.
“ఇప్పుడు కాదు తరువాత” అని చెప్పి గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది పార్వతమ్మ.
“తనకు, మాధవ్ కు మధ్యలో గొడవలు జరుగుతున్నాయి” అని నాన్నమ్మకు అనుమానం వచ్చింది ఏమో అనే ఆలోచన రోజి మదిలో మెదలసాగింది.
మాధవ్ ఆఫీస్ కి వెళ్లిపోయాక.. తన పని ముగించుకుని నాన్నమ్మకు కనిపించకుండా తన గది బాల్కనీలో కూర్చుంది రోజి. ఎంతసేపటికీ రోజి రాకపోవడంతో మనవరాలిని వెతుకుంటూ తను ఉన్న దగ్గరకు వెళ్ళి.. “ఇక్కడ ఉన్నావా? నేను రమ్మన్నాను కదా, ఎందుకు రాలేదు?” అని అడిగింది పార్వతమ్మ.
“ఇగో ఇప్పుడే నీ దగ్గరకు వద్దామని బయలుదేరుతుంటే నువ్వే వచ్చావు. ఉండు, నీకోసం మజ్జిగ తీసుకొస్తాను” అని రెండు అడుగులు ముందుకు వేసింది రోజి.
భుజముపైన చేయి వేసి, “ఆగు ఇటు తిరుగు” అని రోజికి చెప్పింది పార్వతమ్మ.
రోజి భయపడుతూ, “ఏమైంది నాన్నమ్మ?” అని అడిగింది.
“మాధవ్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? అతను మంచివాడేనా..?” అని అడిగింది పార్వతమ్మ.
“అలా అడుగుతున్నావు ఏమిటి నాన్నమ్మ..! అతను ఎలాంటి వాడో నాకన్నా మీకే బాగా తెలుసు కదా. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెపుతాను విను.. అతను చాలా చాలా మంచివాడు. నాకు ఏ లోటు లేకుండా, నన్ను కాలు కిందపెట్టకుండా చూసుకుంటున్నాడు” అని చెప్పింది రోజి.
“అంత బాగా చూసుకుంటుంటే మీ మధ్య ఇంత దూరం ఎలా వచ్చింది?” అని అడిగింది పార్వతమ్మ.
“మా మధ్య దూరమా? అది ఏమీ లేదే” అంది రోజి.
“నిన్న నేను ఈ గదికి వచ్చాను, అప్పుడే నాకు అంతా అర్థమైంది” అని చెప్పింది పార్వతమ్మ.
ఆ మాటలకు నాన్నమ్మను పట్టుకుని ఏడవసాగింది రోజి.
మనవరాలిని ఓదారుస్తూ “అసలు ఏమైంది?” అని అడిగింది పార్వతమ్మ.
“మాధవ్ చాలా మంచివాడు. నేను ఏది అడిగితే అది వెంటనే ఎంత ఖరీదైనదైనా తెచ్చి ఇస్తాడు. కాని నా కోసం ఒక్క రోజు కూడా తన పనిని పక్కన పెట్టడు. నాకు ఒంట్లో బాగోకపోయినా నన్ను ఒంటరిగా వదిలి ఆఫీస్ కు వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక నాతో సరదాగా గడపమంటే.. 'అలిసిపోయాను' అని గదిలోకి వెళ్ళి టీవీ పెట్టుకుని అలా పడుకుండిపోతాడు.
నేను ఒంటరిగా ఉండలేకపోతున్నా, ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నా అని చెప్పినా అస్సలు పట్టించుకోడు. నేను గట్టిగా ఏమైనా అడిగితే 'నేను ఆఫీస్ మానేస్తా, అప్పుడు ఈ జీతం ఉండదు, ఈ విలాసాలు ఉండవు' అని ఒక చిన్న సైజు బ్లాక్ మెయిల్ చేస్తాడు.
నా బాధ ఎంత చెప్పినా అర్థం చేసుకోడు” అని తన బాధంతా చెప్పింది రోజి.
మనవరాలి మాటలు విన్న పార్వతమ్మ ఆలోచనలో పడింది.
సాయంత్రమైంది. మాధవ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారని వెతకసాగాడు మాధవ్.
వెలకట్టలేని ఆభరణం - పార్ట్ 2
ఇంట్లో వాళ్లు ఎక్కడ ఉన్నారు అని వెతుకుతున్న మాధవ్ కు లాన్ లోంచి ఏవో మాటలు, నవ్వులు వినిపించాయి. అటుగా అడుగులు వేస్తూ వెళ్ళాడు మాధవ్.
మాధవ్ ను చూసి జగన్నాథ రావు, “అదిగో మనవడు కూడా వచ్చేశాడు” అని అన్నారు.
“బాబు రా” అని పిలిచింది పార్వతమ్మ.
“వస్తాను కానీ రోజి ఎక్కడ?” అని అడిగాడు మాధవ్.
“ఇగో ఇక్కడే ఉంది” అని చెట్టు చాటును చూపించారు ఇద్దరూ.
మాధవ్ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మేలిమి బంగారు ఛాయితో, మిలమిల మెరిసిపోతున్న తెల్లని చీరతో అప్పుడే అక్కడే చంద్రోదయం అయిందేమో..? అన్నట్టు నిలుచునుంది రోజి.
అంతటి అందాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోయాడు మాధవ్. జగన్నాథ రావు మాధవ్ దగ్గరకు వెళ్ళి.. “పదండి, అక్కడ కూర్చుందాం” అని పిలిచాడు.
అందరూ లాన్ లో సరదాగా కూర్చున్నారు. పార్వతమ్మ ఒక డబ్బా తీసుకొచ్చి, “ఇందులో కొన్ని చీటీలు ఉన్నాయి.. అందరూ తలొకటి తియ్యాలి. తీశాక ఏమిటి చెయ్యాలో తరువాత చెపుతాను” అని చెప్పింది.
మాధవ్ ఆ రోజు చాలా అలిసిపోయి వచ్చాడు. కాని రోజి అందాన్ని చూసి తనని వదిలి గదిలోకి వెళ్ళలేక పోయాడు. మాధవ్ కూడా అక్కడే కూర్చొని ఒక చీటీ తీశాడు. మాధవ్ చీటీలో ఏముందో? ముందు చదవమని చెప్పారు ముగ్గురూ.
“జవాబు” అని రాసుంది అని చెప్పాడు మాధవ్.
“దాని అర్థం ఏమిటంటే.. ఎవరి చీటీలో ప్రశ్న అని వస్తుందో వాళ్ళ ప్రశ్నకు జవాబు చెప్పాలి” అని చెప్పింది పార్వతమ్మ.
“సరే” అన్నాడు మాధవ్.
“ఇంతకు ప్రశ్న అనే చీటీ ఎవరికి వచ్చింది?” అని అడిగింది రోజి.
“నాకు వచ్చింది” అని చెప్పింది పార్వతమ్మ.
“అలాగైతే అడగండి అమ్మమ్మగారు, ప్రశ్న, జవాబు చెపుతా” అన్నాడు మాధవ్.
“సరే, నేను చెప్పేది బాగా విని ప్రశ్నకు సమాధానం ఇవ్వు” అని చెప్పి మొదలు పెట్టింది..
“ధరణి, జాహ్నవి ఇద్దరూ మంచి స్నేహితులు. ధరణి బాగా డబ్బు ఉన్న అమ్మాయి కావడంతో గొప్ప ఇంటికి కోడలిగా వెళ్ళింది. జాహ్నవి బాగా పేద ఇంటి పిల్ల కావడంతో ఒక మధ్య తరగతి కుటుంబానికి కోడలిగా వెళ్ళింది. వాళ్ళ స్థితిగతుల్లో వ్యత్యాసం ఉన్నా.. వాళ్ళ స్నేహం మాత్రం చాలా గట్టిగా ఉండేది.
ఒక రోజు ధరణి తన స్నేహితురాలు జాహ్నవి ఇంటికి వచ్చింది. చాలాసేపు ఆనందంగా గడిపారు ఇద్దరూ స్నేహితులు. సాయంత్రం ఐదైంది. జాహ్నవి భర్త ఇంటికి వచ్చాడు. జాహ్నవి తన భర్తకు తన స్నేహితురాలు ధరణిని పరిచయం చేసింది.
ధరణి వేసుకున్న నగలు, కట్టుకున్న పట్టుచీర, తన వద్ద ఉన్న విలువైన వస్తువులు అన్నీ చూసి నోరు వెళ్లబెట్టుకుని చూస్తుండిపోయాడు జాహ్నవి భర్త.
ఇంతలో ధరణి భర్త కారులో వచ్చి “ఇంక బయలుదేరుదామా?” అని అడిగాడు.
“ఒక నిమిషం” అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఒక పెద్ద వజ్రాల హారం బయటకు తీసి.. “ఇది మన స్నేహానికి కానుక. నీ దగ్గర ఒక ఆభరణం కూడా లేదు కదా, ఈ హారం నీకోసం” అని చెప్పి జాహ్నవి చేతిలో పెట్టింది ధరణి.
“స్నేహం మధ్యలో ఈ కానుకలు ఏమిటి..? అయినా నా దగ్గర ఆభరణాలు లేవు అని నీకు ఎవరు చెప్పారు..? నా దగ్గర ఏ ఆభరణం లేకపోయినా, వెలకట్టలేని ఆభరణం ఒకటి ఉంది. అది ఈసారి నువ్వు వచ్చినప్పుడు నేను ధరించి నీకు చూపిస్తా” అని చెప్పింది జాహ్నవి.
ఆ మాటలకు సారీ చెప్పి వెళ్ళిపోయింది ధరణి.
జాహ్నవి మాటలు విన్న తన భర్త, 'నేను అసలు జాహ్నవికి ఇప్పటివరకు ఒక ఆభరణం కూడా కొనలేదు కదా! మరి తన దగ్గర నాకు తెలియని ఏ ఆభరణం ఉంది..?' అనే ఆలోచనలో పడి.. ఆ రాత్రి అందరూ పడుకున్నాక బీరువా వెతకసాగాడు.
తన స్నేహితురాలికి చెప్పిన మాట విన్న దగ్గరనుంచి తన భర్తలో వచ్చిన మార్పును గమనించింది జాహ్నవి.
సూర్యోదయం అయింది. జాహ్నవి నిద్రలేచి భర్తకు అవసరమైన పనులు అన్నీ పూర్తి చేసుకుని భర్తను నిద్ర లేపింది. జాహ్నవి భర్త నిద్ర లేచి ఆఫీస్ కి సిద్ధమయ్యాడు.
లంచ్ బాక్స్ అందిస్తూ, “ఇవాళ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు 'అందరికన్నా, అన్నిటికన్నా, ఎవరూ వెలకట్టలేని, నా మెడ దగ్గర నుంచి నడుము వరకు ఉండే ఒక అందమైన ఆభరణం తీసుకురండి'” అని చెప్పింది జాహ్నవి తన భర్తకు.
ఆ మాటలకు “నా దగ్గర..” అని భర్త చెప్పబోతుండగా.. “నాకు ఏమీ వద్దు, నేను నా స్నేహితురాలికి మాట ఇచ్చాను అంతే” అని చెప్పి వంటగదిలోకి వెళ్లిపోయింది జాహ్నవి.
“ఆ సాయంత్రం జాహ్నవికి తన భర్త అడిగిన ఆభరణం తీసుకొచ్చాడా..? లేదా..?. ఒకవేళ తీసుకొచ్చివుంటే ఆ ఆభరణం ఏమిటి..? ఇది నీ ప్రశ్న. జవాబు బాగా ఆలోచించి చెప్పు?” అని అడిగింది మాధవ్ ని పార్వతమ్మ.
వెలకట్టలేని ఆభరణం - పార్ట్ 3
పార్వతమ్మ అడిగిన ప్రశ్నకు, “ఈ ప్రశ్నకు ఆలోచన ఎందుకు?. తన పీఎఫ్ లోంచిగాని లేక బ్యాంకు లోన్ పెట్టిగాని జాహ్నవి జడకు ఒక బంగారు జడపిన్ను కొని తీసుకొచ్చివుంటాడు” అని సమాధానం చెప్పాడు మాధవ్.
“ఆ సమాధానం తప్పు” అని చెప్పింది పార్వతమ్మ.
“అసలు సమాధానం ఏమిటి నాన్నమ్మ?” అని అడిగింది రోజి.
“చెపుతాను వినండి” అని చెప్పడం ప్రారంభించింది పార్వతమ్మ..
జాహ్నవి అడిగిన ఆభరణం ఏమిటి? చేతిలో అస్సలు డబ్బులు కూడా లేవు ఎలా? అనే ఆలోచనలో ఆఫీస్ కు వెళ్ళిన దగ్గరనుంచి ఉన్న జాహ్నవి భర్తకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు.
“బావ! మా అక్క కోసం నేను ఒక బంగారు గొలుసు కొన్నాను. ఆ గొలుసు తీసుకొచ్చి ఇస్తుంటే.. ‘తనకు అస్సలు బంగారం అంటే ఇష్టం లేదని, తనకు ఏ ఆభరణాలు వద్దని’ అంటోంది. మీరు కొంచెం చెప్పండి బావ, అక్కను గొలుసు తీసుకోమని” అని చెప్పాడు జాహ్నవి తమ్ముడు.
బావమరిది చెప్పిన మాటలకు పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయాడు జాహ్నవి భర్త. “అస్సలు బంగారం అంటే ఇష్టంలేని జాహ్నవి, నన్ను ఆభరణం అడగడం ఏమిటి..?. బంగారం ఇష్టం లేదంటే నన్ను తెమ్మన్న ఆ ఆభరణం ఏమిటి..?” అనే ఆలోచనలో పడ్డాడు జాహ్నవి భర్త.
ఆలోచిస్తుండగా జాహ్నవి అడిగిన ఆభరణం ఏమిటి? అనే విషయం అర్థమై సాయంత్రం ఐదు అవ్వకుండానే ఇంటికి బయలుదేరాడు జాహ్నవి భర్త.
నేరుగా ఇంటి దగ్గర తన బైక్ ఆపి.. ఇంట్లోకి అడుగుపెడుతూ “ఏవండోయ్! శ్రీమతిగారు ఎక్కడ ఉన్నారు?” అని కేక పెట్టాడు జాహ్నవి భర్త.
“ఇదిగో వంటగదిలో ఉన్నా, వస్తున్నా” అని బదులిచ్చింది జాహ్నవి.
“వద్దు, మీరు అక్కడే ఉండండి. నేనే వస్తున్నా” అని చెప్పి పరుగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళి, వెనకవైపు నుంచి భార్యను మెడ దగ్గర నుంచి నడుము వరకు తన చేతులతో కౌగిలించుకుని, “ఇదిగో నీ ఆభరణం! ఎలా ఉంది?” అని అడిగాడు జాహ్నవిని తన భర్త.
“బంగారం, వజ్రాలు, మణి, మాణిక్యాలు అన్నిటికన్నా ఎంతో విలువగా, అందంగా, ఎంతో ప్రేమగా, అద్భుతంగా ఉంది” అని బదులిచ్చింది సిగ్గు పడుతూ జాహ్నవి.
అక్కడకు అనుకోకుండా వచ్చిన ధరణి చప్పట్లు కొడుతూ.. “అవును! ఎన్ని వజ్రాభరణాలు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా భర్త ప్రేమ, ప్రియమైన కౌగిలి ముందు దిగదుడుపు. ఒక ఆడపిల్లకు అసలైన, నిజమైన, ఎంతో విలువైన, ఎవరూ వెలకట్టలేని ఆభరణం తన భర్త ప్రియమైన కౌగిలి మాత్రమే” అని చెప్పి వెళ్ళిపోయింది ధరణి.
అని సమాధానం చెప్పింది పార్వతమ్మ.
ఆ సమాధానం విన్న మాధవ్ కూర్చున్న చోటులోంచి లేచి మెల్లగా, ఆలోచనాభరితంగా, ఎంతో బరువుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. భర్త వెనుకాలే అడుగులు వేసుకుంటూ వెళ్ళింది రోజి.
ఇద్దరూ వాళ్ళ గదికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. మంచం పైన ఇద్దరూ చెరోవైపు కూర్చున్నారు. చాలాసేపు అలాగే కూర్చుండిపోయారు. కొంతసేపు తరువాత పార్వతమ్మ మాటల ప్రభావంతో.. మాధవ్, రోజిని గట్టిగా, ప్రేమగా కౌగిలించుకుని క్షమాపణ చెప్పాడు.
ఆ రోజు నుంచి జాహ్నవికి తన భర్త ఇచ్చిన వెలకట్టలేని ఆభరణాన్ని మాధవ్ తన భార్య రోజికి ఇవ్వసాగాడు.
బామ్మ చెప్పిన వెలకట్టలేని ఆభరణాన్ని ప్రతి భర్త తన భార్యకు ఇస్తుంటే అందరి కాపురాలు బంగారు కాపురాలు అవుతాయి.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.
నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.






Comments