చిన్న మామ్మ కథ
- Varanasi Sudhakar

- 2 hours ago
- 3 min read
Chinna Mamma Katha - Telugu Social Story | Varanasi Sudhakar
చిన్న మామ్మ కథ - తెలుగు సామాజిక సందేశ కథ | వారణాసి సుధాకర్
Published in manatelugukathalu.com on 07/09/2026
పిల్లలకు కథలు చెప్పిన ఆవిడ జీవితంలో దాగిన విషాదాన్ని తెలుసుకున్నప్పుడు, మనం గతాన్ని మాత్రమే కాదు, స్త్రీలకు గౌరవం, స్వేచ్ఛ, సమాన అవకాశాలు ఎంత అవసరమో కూడా ఆలోచిస్తాం. “చిన్న మామ్మ” ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు — ఒక తరం స్త్రీల జీవితాలను గుర్తుచేసే సామాజిక సందేశ గాథ.
మా చిన్నప్పుడు మా ఇంటికి ఒక మామ్మగారు వస్తుండేవారు. ఆవిడ మాకు దూరపు చుట్టమే అయినా, అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తిగా ఉండేది. మాకు మంచి కథలు, పురాణాలు చెబుతూ ఉండేది.
సుమారు నాలుగున్నర అడుగులు ఎత్తు, సన్నగా, తల మీద ముసుగు వేసుకుని ఉండేది. ఆవిడకి ఏ విధమైన ఆస్తిగానీ, ఇల్లు గానీ, ఆదాయం గానీ లేవుట.
తన మంచితనంతోనే చుట్టాల అందరి ఇళ్ళకు వెళ్ళి, తలొక రెండు నెలల చొప్పున ఉండి, జీవితం గడిపేది.
ఒక రోజు ఆవిడ జీవిత చరిత్ర గురించి మా అమ్మగారు చెబితే మా చిన్నతనంలోనే మాకు ఆవిడ పట్ల ఎంతో జాలి కలిగేది. స్త్రీలపట్ల అప్పటి చట్టాలు, అమానవీయ కట్టుబాట్లు, సాంఘిక దురాచారాలు, పరిస్థితులు ఎంత దారుణమో అనిపించేది.
ముఖ్యంగా స్త్రీల పట్ల సాంఘిక దురాచారాలు చాలా దుర్మార్గంగా ఉండేవని అర్థమయేది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర ఉన్న కాళీపట్నం ఆవిడ సొంత ఊరు.
"చిన్న మామ్మ" అనడం తప్ప ఆవిడ అసలు పేరు ఈరోజుకీ మాకు తెలియదు.
చిన్న మామ్మ గారి తండ్రి ఆ రోజుల్లో మంచి భూస్వామిట. 20 ఎకరాల పొలం ఉండేదిట. భార్య మొదటిసారి గర్భవతిగా ఉండగా ఆయన అకాల మరణం పొందాడుట. చిన్న మామ్మ గారి తల్లి నిండు గర్భిణిగా ఉండగా ఒకరోజు నీళ్ళ బిందె తీసుకొని రోడ్డు మీద నడుస్తూ వస్తోందిట.
ఒక పెద్ద గేదె దూడ వేగంగా పరిగెత్తుతూ వచ్చి కొమ్ములతో పొడవగా, ఆవిడ అక్కడికక్కడే చనిపోగా, గర్భస్థ శిశువు నేటి 'సిజేరియన్' ఆపరేషన్ లాగా జరిగి బయటపడి, బతికిందిట!
ఈ కథ వినడానికే నమ్మశక్యంగా ఉండేది కాదు! చుట్టుపక్కల వాళ్ళు గుమిగూడి, ఆ పిల్లను రక్షించారుట. ఆవిడే మా చిన్న మామ్మ.
చిన్న మామ్మ గారి తండ్రికి మగపిల్లలు లేని కారణంగా అప్పటి చట్టాల ప్రకారం ఆస్తంతా ఆయన తమ్ముడి కొడుకుకి వెళ్ళిపోయిందట.
ఈ పసికందుకి నాదీ అంటూ ఆస్తి ఏమీ లేకుండా పోయింది.
ఈ పసికందుని దగ్గర బంధువులు అందరూ చేరదీసి, వాళ్ళ పిల్లలతో పాటు పెంచి, ఎనిమిదవ ఏట 18 ఏళ్ళ కుర్రాడితో పెళ్ళి చేశారట. వాడు కాస్తా పెళ్ళయిన రెండేళ్ళకే క్షయ వ్యాధితో కాలంచేస్తే, ఆ బాల విధవరాలిని పెద్దమనిషి అయ్యేదాకా బొట్టు ఉంచి, పెద్దమనిషి అవగానే కులాచారం ప్రకారం గుండు గీయించి, తెల్లబట్ట చుట్టి మూల కూర్చోబెట్టారంటే... కనీస మానవత్వం లేని నాటి మన 'సదాచారాలు' కొన్నిటి గురించి వింటేనే మనుషులైన వాళ్ళెవరికైనా అసహ్యం, వెగటు కలుగుతాయి.
ఆ పదకొండేళ్ళ పిల్ల అదే తన జీవితం అని భావించి, ఇంట్లోంచి బయటికి రాకుండా వంటపని, ఇంటిపని, పశువుల పని చూసుకుంటూ, తన తల్లి వయసు, అమ్మమ్మ వయసు ఆడవాళ్ళకి పురుళ్ళు పోస్తూ, మంచం పట్టిన ముసలి వాళ్ళకి కుడి - ఎడమ తేడా లేకుండా చాకిరీ చేస్తూ గడిపేసింది.
బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అన్నీ ఒకటే ఆవిడకి. కట్టు బానిస బతుకు.
పశువులనైనా కసేపు బయట తిప్పుతారు. కాని, చిన్నమామ్మకి ఎప్పుడో ఏడాదికి ఒకటి రెండు సార్లు శివరాత్రి, ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాలకు గుళ్ళల్లో చెప్పే హరికథలు తప్ప, నాటకాలు, సినిమాలు, ఇతర వినోదాలు అస్సలు తెలియవుట.
ముఖ్యంగా పొద్దున్నే ఇంట్లో వాళ్ళు ఎవరికీ తన మొహం కనపడకూడదుట!
మంగళ, శుక్ర వారాల్లో పొరబాటున పుణ్యస్త్రీలకి కనపడితే... ఆ రోజంతా తిట్లు, శాపనార్థాలు! కాబట్టి వంట ఇంట్లోనే ఒక మూల కూర్చునేదిట.
పైగా పుట్టకముందే తండ్రిని, పుట్టే ముందే తల్లిని, పెద్దవ్వకుండానే మొగుణ్ణి "మింగేసిన" నష్టజాతకురాలు అని ముద్ర వేసింది సమాజం.
కాబట్టి ఆవిడ కూడా తను నష్టజాతకురాలిననే భావనతోటే తన జీవితం గడిపేసింది.
భగవంతుడే తను పుట్టకముందే అలా నిర్ణయేశాడు కాబట్టి, ఆ పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా? అనుకునేదిట!
మేము చూసినంతవరకు ఎప్పుడూ నవ్వుతూ, మాకు కథలు చెప్పేది. ఆవిడకి కనీసం రాయడం కూడా రాదు. ఏమీ చదువుకోలేదు. కానీ భారత, భాగవత, రామాయణాలు, కొన్ని భక్తి పాటలు కంఠతా వచ్చు. చక్కగా జోలపాటలు పాడేది.
మా అమ్మగారు ఆవిడ మా ఇంటికి వచ్చినప్పుడల్లా నాలుగైదు మల్లు పంచెలు కొని ఇచ్చేవారు.
దారి ఖర్చులతో పాటు కొంత సొమ్ము కూడా ఇవ్వడం మాకు తెలుసు. మా ఇంటి నుంచి ఎవరింటికి వెళ్ళేదో, మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియదు.
ఆ నిర్భాగ్య జీవి, నష్టజాతకురాలు, దుస్సంప్రదాయాలకు బలైపోయి, మనిషికి కావలసిన కనీస గుర్తింపు, గౌరవం, సుఖం లేకుండా అలాగే తన జీవితాన్ని 70 ఏళ్ళు గడిపేసి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా తన జీవితాన్ని చాలించిందో కబురు కూడా లేదు!
ఇటువంటి వాళ్ళ వాస్తవ జీవిత గాథలు వింటుంటే మనలాంటి వాళ్ళకి గుండె బరువెక్కి, కళ్ళు చెమ్మగిల్లుతాయి.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
వారణాసి సుధాకర్ గారి కొన్ని ఇతర రచనలు:
వారణాసి సుధాకర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
అందరికీ నమస్కారం.
నా పేరు వారణాసి సుధాకర్.
పుట్టినది, పెరిగినది, తణుకు పట్టణంలో...
హైస్కూలు దశలో చదువుతో పాటు, వివిధ కళలలో, ఆటలలో, చురుకుగా పాల్గొని, వందల బహుమతులు పొందాను.
కాలేజీ విద్యార్థి దశనుంచి, విజయచిత్ర లాంటి సినిమా పత్రికలలో రచనలు చేసి, బహుమతులు పొందాను.
LIC లో సీనియర్ మేనేజర్ గా పనిచేసి, విశ్రాంత జీవితం గడుపుతూ, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ, ప్రజలకు ఎంతో కొంత ఉపయోగించే విషయాలను తెలియజేసే కథలు రాస్తూ, వివిధ ఫేస్ బుక్ గ్రూపుల్లో సుమారు వందకు పైగా కథలు రాశాను, ఇంకా రాస్తున్నాను.
ప్రస్తుతం పిల్లలు, మనవలతో అమెరికాలో వుంటున్నాను.
ఇదీ క్లుప్తంగా నా పరిచయం.
🙏









Comments