'Vennela Muthyalu' - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 13/11/2023
'వెన్నెల ముత్యాలు' తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
"అమ్మా నేను నీకు చెప్పిన విషయం గురించి ఏమాలోచించావు"?
"ఏ విషయం రా కార్తీ"?
"అదేమిటమ్మా ఎప్పటికప్పుడు కొత్తగా అడుగుతావు? నీ పెళ్లి గురించమ్మా. నీవు పెళ్లి చేసుకోవాలి. నీకు ఏమంత వయస్సు దాటిపోయిందని. ఏభై ఏళ్లకే నీ జీవితం అయిపోయిందంటూ మాట్లాడతావు. నాకు పెళ్లి చేయాలని ఆత్రుత పడుతూ ఇండియాలో మనవాళ్లందరినీ కాంటాక్ట్ చేస్తున్నావు సంబంధం చూడమని. నాకు పెళ్లి అయిపోతే నీవు వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని రమణాశ్రమంలో ప్రశాంత జీవితాన్ని గడపాలని ఉందని నా ఫ్రెండ్ వాళ్ల అమ్మగారితో అన్నావుట”.
“అవునురా అన్నాను ‘రమా దేవితో’. తప్పేముంది. నా బాధ్యత నీ పెళ్లి. నీదగ్గరకు వచ్చేసి అమెరికాలో శాశ్వతంగా ఉండిపోతాననుకుంటున్నావా”?
‘రమ’ అన్నారు నాతో. “ నీకు సిటిజన్ షిప్ వచ్చాకా నాకు గ్రీన్ కార్డ్ కి ప్రోసెస్ చేయాలనే తలంపులో ఉన్నావని నన్ను నీ దగ్గరే ఉంచేసుకుంటావని. అది నీ అభిప్రాయం అయితే నా అభిప్రాయం అది కాదు. నీకు పెళ్లిచేసేస్తే నా బాధ్యత తీరిపోతుందన్నది నిజమే.
నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ పరిక్షలు వ్రాసి వచ్చానో లేదో నాకు మీ తాతయ్యా అమ్మమ్మా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. నాకంటూ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని, అవి ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచనలు లేని మీ అమ్మమ్మా తాతయ్యా అప్పటకే మేధ్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న మీ నాన్నతో పెళ్లి కుదిర్చారు. తెలుసున్న సంబంధమని మీ బామ్మా తాతగారి కి కూడా నేను నచ్చాననడంతో మా పెళ్లి జరిపించారు”.
పెళ్లైన సంవత్సరానికే నీవు పుట్టేసావు. నాకు బి. ఇ. డి చేయాలని ఉందంటే మీ నాన్నగారు ఒప్పుకున్నారు. ఆ తరువాత అనుకోకుండా గవర్న్ మెంట్ హై స్కూల్ లో టీచర్ గా పోస్టింగ్ వస్తే ఉద్యోగం చేస్తానంటే మీ నాన్న గారు సరే నీ ఇష్టం అన్నారు. దురదృష్టం కాకపోతే మీ నాన్నగారు నీవు టెన్త్ క్లాస్ లో ఉండగానే చనిపోవడం ఏమిటి? అప్పటి నుండి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. అమెరికాలో ఎమ్. ఎస్ చేస్తానంటే సరే అన్నాను కానీ నీవిక్కడే స్తిరపడిపోతానన్నావు. నీ జీవితం నీ ఇష్టం. నీకు పెళ్లి చేసేసి నిన్ను ఒక ఇంటివాడిని చేసేస్తే నేను నిశ్చింతగా ఉంటాను కార్తీక్. నేను రెండు మూడు సంవత్సరాలు పనిచేసి వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుందామా అన్న ఆలోచనలో ఉన్నాను. మా కొలీగ్ చెప్పింది. ఒక సంబంధం ఉంది. ఆ అమ్మాయి ఇక్కడే న్యూ జెర్సీ లో పనిచేస్తోందిట. నేను ఎలానూ వచ్చాను కాబట్టి మనిద్దరం వెళ్లి ఆ అమ్మాయిని చూసొద్దాం.
“అమ్మా నాకు పెళ్లి చేస్తావు, బాగుంది. నేను, నా భార్యా, సంసారం, పిలల్లంటూ నిన్ను పట్టించుకోక పోతే నీవు ఎలా ఉంటావమ్మా”? నాకు పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉంది. వచ్చే అమ్మాయి నిన్ను సరిగా చూసుకోకపోతే? అన్నీ చూస్తూ కూడా నేనేమి చేయలేని అసహాయ స్తితిలో ఉంటే నీ పరిస్తితి ఏమిటమ్మా”?
“నిన్నుమరో వివాహం చేసుకోమంటున్నది వేరే ఉద్దేశంతో కాదమ్మా. నీకంటూ ఒక తోడు, ఆలంబన ఉండాలని. నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు దయచేసి. తల్లి ఒడిలో తలపెట్టుకుంటూ అర్ధ్రంగా మాట్లాడాడు".
"ఈ వయస్సులో నాకు పెళ్లేమిటిరా మొద్దూ"? ఇలా నీవు మాట్లాడకూడదరా. మరో సారి ఈ మాట అంటే ఇప్పుడే ఇండియాకి వెళ్లిపోతాను. తర్జనతో తల్లి బెదిరిస్తుంటే “అమ్మా ఒక్క క్షణం నా మాట వింటావా”?
"నా ఫ్రెండ్ సుధాకర్ చెప్పాడు నెలరోజుల క్రితమే. నీకు తెలుసు కదా సుధాకర్ బెంగుళూర్ లో ఉంటాడు. సుధాకి బాబాయ్ అవుతాడుట. ఆయన హైద్రాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారుట. ఆయన భార్య పోయి మూడు సంవత్సరాలే అయిందట. ఒక్కర్తే కూతురట. ఆ అమ్మాయికి లాస్ట్ ఇయర్ పెళ్లి అయిపోయిందని చెప్పాడు. ఆ అమ్మాయే సుధాకర్ తో చెప్పిందిట. "నా పెళ్లి అయిపోయాకా నాన్న మరీ ఒంటరి అయిపోయాడు సుధా అన్నయ్యా, నాన్న మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేమిటని". నాన్నలాగే ఎవరైనా భర్త చనిపోయి ఒంటరిగా జీవనం సాగిస్తున్న స్త్రీ ఎవరైనా ఉంటే చెప్పమని అందిట. వాడు ఈ విషయం ఫోన్ లో చెపుతూ "ఏమీ అనుకోకురా కార్తీక్, మీ అమ్మగారికి ఏమంత వయస్సు దాటిపోయింది, ఆవిడకు కొత్త జీవితం ఇవ్వడం గురించి ఆలోచించవచ్చు కదా అంటూ, నీతో ఈ విషయం గురించి మాట్లాడమని సలహా ఇచ్చాడు. నాకు కూడా వాడి సలహా సమంజసం అనిపించింది".
“నేనేమీ వినదలచుకోలేదురా కార్తీక్. సుధాకర్ మాటల ప్రభావంలో నీవు ఏదేదో ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటున్నావు". ఆ ఆలోతనలే తప్పంటాను. మరచిపో ఇంక ఆ విషయం గురించి. ఈ ఆదివారం వస్తాం అని ఆ అమ్మాయికి మెసేజ్ చేసాను. న్యూయార్క్ లో మా అబ్బాయి ఉంటాడనేసరికి ఆ అమ్మాయి తల్లీ తండ్రీ ఇకనేమండీ అక్కడకు చాలా దగ్గరే మా అమ్మాయి ఉండేది. వెళ్లి చూడండన్నారు. ఈ ఆదివారం మరే ప్రోగ్రామ్ పెట్టుకోవద్దంటూ” ప్రియంవద అక్కడనుండి వెళ్లిపోయింది.
ఆ అదివారం ప్రియంవద, కార్తీక్ న్యూజెర్సీ లో ఉంటున్న శ్రావణిని చూసారు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఒకరకొకరు నచ్చారు. కార్తీక్ తల్లితో చెప్పాడు శ్రావణి నచ్చిందని.
ప్రియంవద కి ఎక్కువ శెలవు లేని కారణంగా మూడు నెలవు మాత్రమే కొడుకు దగ్గరుండి హైద్రాబాద్ బయలదేరింది. శ్రావణి తల్లి తండ్రులతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టిస్తానని చెప్పింది కార్తీక్ తో.
తనను ఫ్లైట్ ఎక్కించడానికి ఎయిర్ పోర్ట్ కు వచ్చిన కార్తీక్ ఎందుకో ముభావంగా ఉన్నాడు. బహుశా వాడి మాటకు విలువనివ్వలేదని కినుక కాబోలు. ఫ్లైట్ లో తన సీట్ లో కూర్చుని రిలాక్స్ అవుతున్న ప్రియంవదకి ‘మూర్తిగారు’ గుర్తుకొచ్చారు.
రెండు సంవత్సరాలక్రితం ఒక రోజు తను స్టూడెంట్స్ కి స్పెషల్ క్లాసెస్ తీసుకుని బస్ ఎక్కి తన బస్ స్టాప్ దగ్గర దిగింది. బస్ స్టాప్ కి ఇంటికీ ఏమంత దూరం కాదు. పదినిమిషాలు నడక మాత్రమే. ఇంతలో వాన మొదలైంది. తగ్గుతుందేమోనని చూస్తోంది. ఇంతలో ఒక పెద్దమనిషి భుజానికి వేళ్లాడుతున్న ఒక పెద్ద బేగ్ తో గొడుగు పట్టుకుని తన ముందు నుండే వెడుతూ ఒక క్షణం ఆగాడు. “మీరు ప్రియంవద కదూ. మీరు మా అమ్మాయికి టెన్త్ లో సైన్స్ టీచర్. అప్పట్లో మిమ్మలని చాలా సార్లు కలిసిన మూలాన మీరు బాగా గుర్తున్నారు. మా అమ్మాయిని ట్యూషన్ కి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాడిని. మీ ఇల్లు నాకు తెలుసు మేడమ్. వాన తగ్గేటట్లు లేదు. మా ఇల్లూ అటే, మిమ్మలని దింపి నేను వెళ్లిపోతాననేసరికి” ఆయనతో కలసి గొడుగులో ఇంటికి రాక తప్పలేదు.
తనకి ఆయన ఎవరో గుర్తులేదు. లోపలకు రమ్మనమని ఆహ్వానించింది. తన పేరు విశ్వమూర్తని చెప్పాడు. ఎంతో అభిమానంగా మీలో చనిపోయిన నా చెల్లెలు శారద కనపడుతోందని మిమ్మలని ఒక సోదరిగా భావంచవచ్చా అంటూ అడిగాడు. ఆయన అభిమానానికి తన కళ్లు చెమర్చాయి. పురిటిలో తన భార్య నీలవేణి కవల ఆడపిల్లలను కని చనిపోయిందని చెప్పాడు. భార్య అంటే తనకు పంచ ప్రాణాలమూలాన మళ్లీ పెళ్లి తలంపు లేకుండా పిల్లలను పెంచి పెద్దచేసి విద్యావంతులను చేసి చక్కని సంబంధాలు తెచ్చి పెళ్లి చేసానని వాళ్లల్లో ఒకరు లండన్ లోనూ మరొకరు ముంబైలోనూ భర్తలతో కాపురాలు చేసుకుంటున్నారని చెప్పాడు. ఇకనుండి తనను అన్నయ్యా అని పిలవమని ఏ అవసరం వచ్చినా తనను కాంటాక్ట్ చేయమని చెప్పి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు మూర్తి అన్నయ్య తనను చూడడానికి వచ్చి పలకరించి వెడతాడు.
మూర్తి అన్నయ్య లాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారేమో. పురిటి పసికందులను చేతుల్లోకి తీసుకుని భార్య పోయిన దుఖాన్ని దిగమింగుకుంటూ ఆడపిల్లలను పెంచి ప్రయోజకులను చేయడం ఎంత కష్టం. పునర్వివాహం చేసుకొమ్మని ఎందరు సలహా చెప్పినా ససేమిరా చేసుకోనన్నారుట. మరో వివాహం చేసుకుని తన నీలవేణి స్తానంలో మరొకరిని ఆహ్వానించలేనని ఖరాఖండీగా చెప్పాడుట ఇంట్లో. ఆడపిల్లలకు పదిహేను సంవత్సరాలు వచ్చేవరకు తన తల్లి కాస్త సాయంగా ఉండేదని తరువాత ఆవిడ బాత్ రూమ్ లో జారిపడి బ్రైన్ హెమరేజ్ తో చనిపోయిందని చెప్పాడు. ఇప్పుడు కూతుళ్లు తమ దగ్గరకు వచ్చేయమని పదే పదే చెపుతున్నా ఆ సమయం వచ్చినప్పుడు వస్తానంటూ ఎన్నోసాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో కాలం వెళ్లబుచ్చుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మూర్తి అన్నయ్య జీవితం తనకు ఆదర్శం.
పెళ్లై అత్తవారింటికి వచ్చిన తనను తన భర్త మధుసూదన్ ఎంత అపురూపంగా చూసుకున్నాడు! తను ఏది అడిగినా కాదనేవాడు కాదు. కాలేజ్ లో లెక్చరర్ అయినా ఇంట్లో తన చుట్టూ తిరుగుతూ ఎంత అల్లరి చేసేవాడు. పొడుగాటి తన జడను తన మెడచుట్టూ చుట్టుకుంటూ కొంటెగా నవ్వేవాడు. తను బి. ఎడ్ చేస్తానన్నా ఉద్యోగం చేస్తానన్నా నీ ఇష్టం ప్రియా అన్నాడు. ఎమ్. ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేయమని ప్రోత్సహించాడు. భర్త కోరినట్లుగా ఎమ్. ఏ చేసింది. కార్తీక్ కడుపులో పడ్డాడని తెలిసిన రోజు ఎంత సంబరపడ్డాడు. తనను సర్ ప్రైజ్ చేయాలని ఆ రోజు సాయంత్రం కాలేజ్ నుండి వస్తూ కెంపుల నెక్లెస్ తెచ్చి కళ్లు మూసుకోమన్నాడు. మెడలో ఆ కెంపుల నెక్లెస్ పెట్టి కళ్లు తెరవద్దంటూ డ్రెస్సింగ్ టేబిల్ మిర్రర్ దగ్గరకు తనని నడిపించుకుంటూ తీసుకువెళ్లి అప్పుడుకళ్లు తెరవ మన్నాడు. ధగ ధగ మెరుస్తున్న కెంపుల నెక్లస్. పచ్చని నీ మెడని కెంపులు ముద్దాడుతున్నాయి ప్రియా, నాకు భలే అసూయగా ఉంది సుమా అంటూ కొంటెగా మాట్లాడుతున్న మధు వైపు సిగ్గుతోతలెత్తి అతని కళ్లల్లోకి చూడలేకపోయింది. తనను ఎంత అపురూపంగా చూసుకున్నాడు. కాలు కింద పెడితే కడుపులోని బిడ్డ కందిపోతాడన్నట్లుగా. తనకు నార్మల్ డెలివరీ అవదని సిజేరియన్ చేయాలని డాక్టర్ చెప్పినపుడు ఎంత కంగారు పడ్డాడు. మనకు మరో బిడ్డ వద్దంటూ, నీ కష్టాన్ని చూడలేను ప్రియా అంటూ మరో బిడ్డను కనే అవకాశం ఇవ్వలేదు.
అనుకోకుండా ఒకరోజు కాలేజ్ నుండి వచ్చిన మధుసూదన్ ఏదో గుండెల్లో ఇబ్బందిగా ఉందంటే వెంటనే హాస్పటల్ కి బయలదేరారు. దారిలోనే గుండె ఆగిపోయింది. నలభై అయిదు సంవత్సరాలకే మధు తన జీవితం నుండి నిష్క్రమించాడు శాశ్వతంగా.
తన మధు జ్నాపకాలు చాలు ఈ జీవితానికి. ఆ మధుర జ్నాపకాలు నిన్న మొన్నటివిగా ఎప్పుడూ తనని నీడలా వెన్నాడుతూనే ఉంటాయి. ఈ తరం పిల్లలవన్నీ ఆధునిక భావాలే కాకుండా ఆవేశం పాలు కూడా ఎక్కువ. కార్తీక్ సలహాను తను హర్షించదు. జీవిత భాగస్వామిని కోల్పోయిన వాళ్లకి పరిష్కారం మరో వివాహమా? అందరికీ కాకపోవచ్చు. రెండో వివాహం చేసుకున్నా కొంతకాలం తరువాతైనా ఎడబాటు ఉండదా? ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో ఎవరికి తెలుసు? తనకు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఉంది. తనకంటూ ఒక అందమైన ప్రపంచం నిర్మించుకుని తనకి నచ్చేలా జీవించాలని, నెరవేరని తన కోరికలను తీర్చుకోవాలని ఉంది. భగవంతుడు తనకు ప్రసాదించిన జీవితాన్ని అర్ధవంతంగా మలచుకోవాలని ఉంది.
ఈ ఆలోచనలన్నీ ప్రియంవద మనసు చుట్టూ వెన్నెల ముత్యాల్లా సన్న సన్నగా జాలువారుతూ పాత ప్రపంచాన్ని తుడుస్తూ కొత్త లోకానికి మార్గం చూపినట్లుగా తోచింది. తన ఆలోచనల్లోతాను మునిగి ఉండగా విమానం దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో లేండ్ అవడంతో కొత్త ఉత్సాహంతో హైద్రాబాద్ విమానం ఎక్కడానికి సన్నధ్దమైంది.
***
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comentarios