top of page

వీడిన మిస్టరీ


'Vidina Mistery' - New Telugu Story Written By Yasoda Pulugurtha

Published In manatelugukathalu.com On 09/11/2023

'వీడిన మిస్టరీ' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“సుధా! ఓ రెండురోజులు నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వగలవా?” తుఫానులా వస్తూనే తనను అల్లుకుపోతూ కళ్లనీళ్లతో ప్రాధేయపడుతున్న వీణ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఏమైంది వీణా, ఆశ్రయం ఏమిటీ? ఎందుకలా అలజడిగా కనిపిస్తున్నావు? రా ఇలా సోఫాలో కూర్చో”మంటూ అనునయంగా పిలుస్తూ వీణను సోఫాలో కూర్చోపెట్టింది.


“ఇప్పుడు చెప్పు, ఏమైంది వీణా? పృధ్వీకు నీకూ మధ్య ఏమైనా గొడవలు రాలేదు కదా?” ఆప్తమిత్రురాలి వైపు చూస్తూ అభిమానంగా అడుగుతున్న సుధ ఒళ్లో తలపెట్టుకుని భోరుమంటూ ఏడ్వడం మొదలు పెట్టింది.


“నీకు తెలియనివి ఏమి ఉన్నాయి సుధా? డివోర్స్ పేపర్లపై సంతకాలు పెట్టమంటూ ఒకటే వేధిస్తున్నాడు. నా మీద వ్యామోహం తీరిందిట. నిరూషను పెళ్లి చేసికుంటే తన బిజినెస్ వ్యవహారాల్లో తను ముందుకు దూసుకుపోగలనని, నిరూష ద్వారా తనకు ఎంతో మంచి భవిష్యత్ ఉందంటూ ఒకటే వేధిస్తున్నాడు. డివోర్స్ పేపర్లపై సంతకం పెట్టనంటున్నానని ఈ మధ్య తాగొచ్చి బాగా కొడ్తున్నాడు. మా పెళ్లైన సంవత్సరం వరకు బాగానే ఉన్నాడు. గత ఆరునెలలనుండి నన్ను హింసించడం మొదలు పెట్టాడు”.


వీణా, సుధా చిన్నప్పటి నుండి ఒకే స్కూల్, కాలేజ్ లో డిగ్రీ వరకు చదువుకున్నారు. వీణకు తల్లి తండ్రి చిన్న తనంలోనే చనిపోతే వీణ అన్నయ్య చలపతి వీణను అల్లారు ముద్దుగా పెంచాడు. తల్లీ తండ్రీ ఆస్తి పరులు కావడం తో పృధ్వి కి మంచి కట్నకానుకలిచ్చి మరీ పెళ్లి చేసాడు. పృధ్వి కి ఓన్ బిజినస్ ఉంది. లోకల్ అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్ ను వివిధ దేశాలకు ఎక్స్ పోర్టు చేస్తూ అధిక లాభాలను పొందుతూ తన బిజినెస్ ను దశ దిశలా వ్యాపింప చేస్తున్నాడు. ఫారిన్ ప్రయాణాలు, డెలిగేట్స్ తో సమావేశాలతో ఎప్పుడూ హడావుడిగా ఉంటాడు.


ముంబై లో జరిగిన ఒక కాన్ ఫరెన్స్ లో నిరూష తో పరిచయం జరిగింది. చూపు తిప్పుకోలేని అందం ఆమెది. బాలీవుడ్ హీరోయిన్ గా ప్రయత్నించి ఉంటే మంచి మంచి అవకాశాలు వచ్చి ఉండేవేమో అనిపించేటట్లుగా ఉంటుంది. గుజరాతీ అమ్మాయి అయిన నిరూష తన వాక్చాతుర్యంతో ఎదుటి వారిని సమ్మోహన పరుస్తుంది. కానీ నిరూష వివాహితురాలని ఆమె భర్త వారిరువురి పెళ్లి అయిన సంవత్సరానికే చనిపోయాడని చెప్పుకుంటారు. అతని చనిపోవడం వెనుక ఒక అంతు చిక్కని మిస్టరీ కూడా ఉందని ఆమెకు చెందిన హై సొసైటీ సెగమెంట్ చెవులు కొరుక్కుంటుంది. అటువంటి నిరూష పృధ్విని ఆకర్షించింది. పృధ్వితో కలసి బిజినెస్ టూర్లు, విహారయాత్రలు ఎక్కువైనాయి.


నిరూష తో పరిచయం జరిగినప్పటి నుండి ఇంట్లో తనకోసం ఎదురుచూసే భార్య పట్ల విముఖత కలిగింది. వీణతో తెగతెంపులు చేసుకుని నిరూషతో కలసి జీవించాలని ఉబలాట పడుతున్నాడు పృధ్వి. అప్పటికే ఆరునెలల నుండి నిరూష తో లివ్ ఇన్ రిలేషన్ లో ముంబై లో ఉంటూ వారం పదిరోజులకు ఒకసారి హైద్రాబాద్ వచ్చి వెడుతున్నాడు. తన జీవితంలో నీలి నీడలు అలుముకున్నాయన్న విషయం తన అన్నగారైన చలపతి కి చెప్పలేకపోయింది. పెళ్లి అయిపోయిన చలపతి భార్య వచ్చాకా పూర్తిగా భార్యా విధేయుడు అయిపోయాడు. ఎప్పుడో చెల్లెలు గుర్తు వస్తే మొక్కుబడి గా ఒకసారి ఫోన్ చేస్తాడు అదీ భార్య ఆ పరిసరాలలో లేదని చూసి.


ఆరోజు వీణా పృధ్వీల మధ్య గొడవ తారస్తాయికి చేరుకుంది. ఎలా సంతకాలు పెట్టవో చూస్తానని పృధ్వీ, నేను చావనైనా చస్తానుగానీ డివోర్స్ పేపర్లపై సంతకాలు చేయనంటూ వీణ. తాగుడు మైకంలో పూర్తిగా అదుపుతప్పిన పృధ్వీ వీణను చితకబాదాడు. ఆ మరునాడు పొద్దుటే బయటకు వెళ్లిపోయాడు వీణకు చెప్పకుండానే. ఆ మరునాడు ఉదయం ఆలస్యంగా నిద్ర లేచేసరికి భర్త లేడు. ఆఫీస్ కు వెళ్లిపోయాడేమో అనుకుంది. ఫోన్ చేస్తే ఎత్తలేదు. భర్తకు టెక్ట్ మెసేజ్ చేసింది. సుధ దగ్గరకు వెడుతున్నానని.


పూర్తిగా మనశ్శాంతిని కోల్పోయిన వీణ తన ఏకైక మిత్రురాలైన సుధ దగ్గరకు వచ్చింది తన మనస్సులోని బాధను చెప్పుకోడానికి.


అది ముంబై లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు అతి సమీపాన ఉన్న హొటల్ నోవాటల్. నిరూష ఎదురుగా ఎవరో అగంతుడు కూర్చున్నాడు. ఇద్దరి చేతుల్లో ఖరీదైన డ్రింక్ గ్లాస్ లు. బాలీవుడ్ ఫాషన్ బాద్ షా మనీష్ మలహోత్రా డిజైన్ చేసిన ఎర్రని శాటిన్ స్లీవ్ లెస్ గౌన్ లో నిరూష చాలా టెమ్ టింగ్ గా కనిపిస్తోంది. "ఏమంటున్నాడు ఆ పృధ్వీ నిరూ"? భలే చేపను గాలం వేసావు కదా! ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ నిరూష అందరిలాంటి అమ్మాయి కాదు".


"ఫో సుశాంత్, నీవు మరీ పొగిడేస్తున్నావ్” కొంచెం గారంగా అతని చూపుల్లోకి చూపులు కలుపుతూ ముద్దుగా మాట్లాడింది".


"ఆ సంగతి మాట్లాడేవా నిరూ"?


“అందుకనే కదా ఇక్కడకు రమ్మనమన్నాను. మన కొత్త బిజినెస్ లో పార్టనర్ షిప్ ఇస్తానని చెప్పాను. మొత్తానికి లొంగాడు. బిజినెస్ లో కోట్లు సంపాదిస్తున్నాడు పృధ్వీ. వందకోట్లు పెట్టుబడి అతనికి ఒక లెక్క కాదు. ఓకే అన్నాడు. నా మాటను తీసేయలేక నా మీద నమ్మకంతో ఏ ఫార్మాల్టీస్ పూర్తి అవకుండానే వందకోట్లు ట్రాన్స్ ఫర్ చేసాడు. ఐ.టి సమస్య లేకుండా నేను చూసుకుంటున్నానులే”.


"దట్స్ ఆసమ్ నిరూ. వాడిని బుట్టలో బాగానే పడేసావు. నీ భర్తను పంపించినట్లే వీడిని కూడా పంపేస్తే మన దారికి ఇంక అడ్డంకులు లేవు. వందల కోట్ల డబ్బు, హోదా, ఓహ్ ఇంక మనం దర్జాగా స్తిరపడవచ్చు. నీవు నా దానివి ఎప్పుడు అవుతావా అనుకుంటూ క్షణాలు లెక్కపెడుతున్నాను తెలుసా?”


పాపం ఆ పృధ్వీ నన్ను సొంతం చేసుకోడానికి కలలు కంటూ అతని భార్యతో గొడవ పడుతున్నాడు. ఆ మహాతల్లి ససేమిరా డివోర్స్ ఇవ్వనంటోందిట. ఆమె దగ్గరా చాలా డబ్బు బంగారం స్తలాలు ఉన్నాయిట. అందుకే వీడు కొంచెం భయపడుతున్నాడు. తనని తన భర్త హెరాస్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇస్తుందేమోనని”.


"అదీ పాయింటే కదా. ఇంక నేను వస్తాను నీరూ. మళ్లీ నీ ఫోన్ కోసం ఎదురుచూస్తాను". బై చెపుతూ వెళ్లిపోయాడు సుశాంత్.


హఠాత్తుగా తనను కలవాలని తన ఫ్లాట్ కి వచ్చిన వీణను చూసి ఆశ్చర్యపడింది నిరూష. తను పృధ్వీ భార్యనని చెప్పింది. నీవు పృధ్వీ ని విడిచి పెడితే మంచిది లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంది.


“ఏ బేసిస్ మీద కంప్లైంట్ ఇస్తావు, నీ భర్తే కుక్కలా నా కోసం నా గుమ్మం ముందు పడిగాపులు కాస్తున్నాడు. నీకు అదుపులో పెట్టుకోడం చేతగాక నన్ను అంటావేమిటి, గెట్ అవుట్” అంటూ గట్టిగా అరిచింది.


"నిరూషా! నీ గురించి ఇక్కడ నాకు బాగా తెలుసున్న వారిచేత ఎంక్వైరీ చేయించాను. ఎవరో చెప్పమంటావా? నీ భర్త రణధీర్ స్నేహితుడు సిధ్దార్ధ నా స్నేహితురాలి భర్తకు మంచి స్నేహితుడు. ఐ.ఐ.టి లో కలసి చదువుకున్నారు. అతను ఇక్కడే మజగాన్ డాక్ షిప్ యార్డ్ లో ఛీఫ్ ఇంజనీర్. అతని ద్వారా నీ గురించి కొంత సమాచారం తెలిసింది. నీ భర్త, నీవు కొంతమంది బాలీవుడ్ నటులు, నిర్మాతలతో కలసి డ్రగ్ వ్యాపారం చేస్తున్నావని తెలిసి అది మానేయమని హెచ్చరించినందుకు అతన్ని ఏక్సిడెంట్ చేయించి మరీ చంపావు. ఏక్సిడెంట్ లో పోయాడని చెప్పావు లోకానికి.


పాపం లోకం గుడ్డిది కదా. నీ మీద బోలెడంత సానుభూతి. మా దగ్గర ఉన్న చిన్న ఆధారంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామంటే తీగ లాగితే డొంక కదలాడినట్లు నీవు ఉచ్చులో చిక్కుకుంటావు. నీవు కావాలనుకుంటే వందమంది నిన్ను పెళ్లాడడానికి క్యూ కడతారు. నా జీవితంలో నిప్పులు పోయకు నిరూషా. నీవు పృధ్వీని నీ దగ్గరకు రావద్దని గట్టిగా చెప్పు అతడు రాడు. పృధ్వీ అదివరకటి లాగ నాతో ఉంటే చాలు, నిన్ను నేను పూర్తిగా మరచిపోతాను. నీకు చెల్లెలిలాంటి దాన్ని. ఈ విషయం చెపుదామనే వచ్చాను. వస్తాను నిరోషా! ఫ్లైట్ కు టైమైం”దంటూ వెళ్లిపోతున్న వీణ వైపు కసిగా చూస్తూ నవ్వుకుంటూ తన మొబైల్ నుండి ఒక నంబర్ కు డయల్ చేసింది.


ఆ రాత్రి వీణ తో గొడవ పెట్టుకున్న పృధ్వీ ఉదయాన్నే తన ఆఫీస్ కు వెళ్లిపోయాడు. అతని మేనేజర్ ఇచ్చిన రిపోర్ట్ చదివి చాలా అశాంతి గా ఉన్నాడు. తన కంపెనీ ఎక్స్ పోర్ట్ చేస్తున్న అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్ లో కల్తీలు ఉన్నాయని ప్రభుత్వ సంస్త అయిన అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ(ఎపిడా) వివిధ దేశాలకు సరఫరా చేసే అయిదువందల కోట్ల విలువైన ప్రాడక్ట్స్ ఎక్పోర్ట్ ని నిలిపి వేసింది. ఇన్ కేమ్ టాక్స్ బకాయి చెల్లించకపోతే నోటీసులు జారీ చేస్తామని ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది. జీ.ఎసి.టి పేమెంట్ కూడా ఇంకా పే చేయలేదు. తొందరపడి నిరూషా పెట్ట బోయే కొత్తకంపెనీలో షేర్ హోల్డర్ అయి వందకోట్ల ఫండ్స్ అక్కడకు పంపేసాడు.

నిరోషా వ్యామోహంలో పడి కంపెనీ పనితీరుల గురించి పట్టించుకోవడం లేదు. ఆరోజు రాత్రి అశాంతిగా ఇంటికి వచ్చాడు. వీణ మెసేజ్ అప్పుడు చూసాడు, కానీ రిప్లై ఇవ్వలేదు. ఎక్కడకు పోతే నాకేమిటన్నట్లు నిర్లక్ష్యంగా ఉన్న పృధ్వీ ఆరోజు ఉదయాన్నే పోలీస్ వ్యాన్ అతను ఉంటున్న బంగ్లా ముందు ఆగింది. వేన్ లో నుండి దిగిన సి.ఐ ఎకా ఎకిని పృధ్వీ మెయిన్ డోర్ కాలింగ్ బెల్ నొక్కాడు.

��***


"ఈ స్త్రీ మీ భార్యే కదా?! మూడు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిన ఆమె గురించి ఇప్పటి వరకూ మీరెందుకు ఎంక్వైరీ చెయ్యలేదు?! ఆమె తో మీకు ఏ విభేదాలు లేనప్పుడు ఈ మూడు రోజులుగా ఆమె క్షేమ సమాచారాల కోసం కూడా ఆమెకు ఒక్కసారి కూడా "ఫోన్ కాల్" ఎందుకు చెయ్యలేదు?! ఆమె నిన్న రాత్రి రైలు కింద పడి మరణించింది. అప్పటి వరకూ ఆమె ఎక్కడ ఉంది?! ఇంటి నుండి వెళ్ళిన 2 రోజుల తరువాత తీరిగ్గా ఆమెందుకు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది?!" సీఐ సంధిస్తున్న ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరౌతున్నాడతను.

***��

“తను ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? వీణ తన ఫ్రెండ్ సుధ దగ్గరకు వెడుతున్నానని నాకు మెసేజ్ చేసిం”దంటూ మెసేజ్ చూపించాడు.


“సరే నయ్యా, ఆమె మెసేజ్ చేసి మూడు రోజులైంది. దానికి జవాబు ఏమైనా ఇచ్చారా? మూడురోజులైనా రాకపోతే కనీసం ఎప్పుడు వస్తున్నావు లాంటి మెసేజ్ గానీ ఫోన్ గానీ చేసావా?” పృధ్వీ కి చాలా గాభరాగా ఉంది. నిజమే, వీణ ఏమైతే నాకెందకనుకుంటూ నిర్లక్ష్యంగా ఉన్నాడు. వీణ చచ్చిపోయిందా? అదీ రైలుకింద పడి.


ఈలోగా సి.ఐ “మాకు అందిన సమాచారాన్ని బట్టి, అదీ సుధగారు ఆవిడ భర్త చెప్పడం బట్టి ఆవిడ నిరోషా అన్న వ్యక్తిని కలవడానికి రెండు రోజుల క్రితం ముంబై వెళ్లిందని చెప్పారు. తరువాత వాళ్లకు వీణ నుండీ ఏ సమాచారం లేదన్నారు. సుధ గారు చేసిన రెండు మిస్డ్ కాల్స్ మాత్రం ఉన్నాయి. చెప్పండి మిస్టర్ పృధ్వీ, మీ ఇద్దరి మధ్య ఏ విబేధాలూ లేవని బుకాయించకండి. సుధగారు వీణ గురించి మీ గురించి చాలా చెప్పారు. నిరోషా అనే ఆమెతో మీరు ముంబై లో సహజీవనం సాగిస్తున్నారట. వీణ గారిని మీరు డివోర్స్ ఇవ్వమంటూ వేధిస్తున్నారుట”.


పృధ్వీ ముఖం పాలిపోయింది. చచ్చిపోయి తనను ఉచ్చులోకి లాగిందన్నమాట. వీణ మరణం పట్ల కనీసం జాలిచూపని అతని మనస్తత్వం ఎంత గొప్పదో కదా. ఈలోగా సి.ఐ కు ఫోన్ వచ్చింది. ఫోన్ లో అవతల వ్యక్తి చెప్పిన మాటలకు "ఓ మై గాడ్" అని కాస్త గట్టిగానే పైకి అనేసాడు. ఆ ఫోన్ కాల్ ముంబై సెంట్రల్ పోలీస్ స్టేషన్ నుండి.


వీణ నిరోషా ఇంటి నుండి ఎయిర్ పోర్ట్ కు బయలదేరు తున్నప్పుడు తన కేబ్ వెనుక చాలా దూరం నుండి ఏదో కార్ ఫాలో అవుతున్నట్లు అనిపించింది. ఎందుకో నిరోషా మీద అనుమానం వచ్చింది. కేబ్ ను పోలీస్ స్టేషన్ కు పోనివ్వమంది. రణధీర్ మర్డర్ కి సంబంధించిన కొన్ని వివరాలు అవి సుధ భర్త ద్వారా సేకరించినవి పోలీసులకు అందచేసింది. స్టేషన్ ఎస్.పి. వీణ వివరాలన్నీ నోట్ చేసుకున్నాడు ఫొటో కూడా తీసుకున్నాడు. ఏదైనా అవసరం ఉంటే ముంబై వస్తానని కూడా చెప్పి కేబ్ లో ఎయిర్ పోర్ట్ కు బయలదేరింది.


తన వెనుక ఏ కారూ వెంబడించడం లేదని తెలిసి హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన వీణ కేబ్ ను దారిలో ఎవరో ఎటాక్ చేసి వీణను తమ కారులో ఎక్కించుకుని తీసుకుపోయారు. ఆమెను మర్డర్ చేసి రైలు పట్టాలమీద పడేసారన్న ఆధారాలు దొరికాయి పోలీసులకు. వీణ వెళ్లగానే వెంటనే నిరోషా వీణ గురించి సుశాంత్ కి చెప్పి వీణ మూలాన ఏదో పెద్ద ముప్పు వచ్చేటట్లు ఉందని భయపడుతూ చెప్పేసరికి సుశాంత్ నవ్వేసాడు.


“వీణో గీణో అదేమి చేయగలదు నిన్ను, అది బ్రతికి ఉంటే కదా డార్లింగ్, నీవు కూల్ గా ఉం”డంటూ ధైర్యం చెప్పి వీణను చంపించాడు. తీగలాగితే మొత్తం డొంక అంతా కదిలింది. వీణ మరణం, రణధీర్ మరణం వెనుక ఉన్న మిస్టరీ అంతా వెలుగులోకి వచ్చింది. నిరోషా డ్రగ్ రాకెట్ కూడా బయట పడింది. నిరోషాకీ, సుశాంత్ కీ యావజ్జీవ జైలు శిక్ష, అలాగే పృధ్వీ కి అయిదు సంవత్సరాల కారగార శిక్ష హై కోర్టు అమలు చేసింది.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








80 views0 comments
bottom of page