top of page

విధి చేసే వింత


'Vidhi Chese Vintha' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

''ఏమిటి ధారా ! అప్పుడే నీ కూతురికి పెళ్లి చేస్తున్నావా… ఇంకా ఇరవై ఏళ్ళేగా? కొన్నాళ్ళు వుద్యోగం చేయిస్తే బాగుండేదికాదూ!" పెళ్ళికి పిలిచి చేతికిచ్చిన వెడ్డింగ్ కార్డు చూసి అంది శకుంతల.

''కొన్ని కారణాలవలన త్వరగా చేస్తున్నాను. అంతేకాదు, మంచి సంబంధం వచ్చినప్పుడు చేయాలి. ఇంకా ఎదురుచూస్తుంటే ఏమో.. ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు?” అంటూ చెప్పింది ధార.

''అవును నిజమే ! మంచిపని చేసావ్'' అన్నారు కొలీగ్స్.

పెళ్ళికి అంతా వచ్చారు. ఈడూ జోడూ బాగుంది అన్నారు. ‘అబ్బాయికంటే అబ్బాయి తండ్రి స్టేటస్ చూసి ఈ సంబంధం చేసింది. తెలివిగలది ధార…’ అనుకున్నారు అసూయతో.

''అవును. ఆయన గొప్ప తెలివిగలవాడు. కుబేరుడు. నయన సుఖపడుతుంది.. ఆఇంటి కోడలిగా!” అనుకుంది ధార మనసులో.

ధార - కుంతల ఆఫీసులో ఉన్న వాళ్లలో కాస్త చనువుగా వుంటారు.

పెళ్లిచేసి, కూతురు నయనను వూళ్ళోవున్న అత్తారింటికి పంపేసింది ధార.

ఏడాది తిరక్కుండా ధార భర్త మరణించాడు.అప్పుడు చూడటానికి వెడితే చెప్పింది శకుంతలతో.

''ఇందుకే నయన పెళ్లికోసం కంగారు పడ్డాను. ఆయనకి కేన్సర్. ఎంతకాలమో బతకరని డాక్టర్ చెప్పేరు. మీకోరిక ఏదైనా ఉంటే చెప్పండి తీరుస్తాను..... అన్నాను. ఆయన అమ్మాయిపెళ్లి చూడాలన్నారు. అమ్మాయి వుద్యోగం చేయడం మానడం తరువాత సంగతి . వియ్యంకుడు మహేంద్ర పలుకుబడితో దానికి ఎప్పుడైనా వుద్యోగం దొరుకుతుంది. ఇప్పుడు నాకు నిశ్చింతగా వుంది....” అంది ధార.

''నువ్వు ఒంటరిగా ఉండాలి. నీ వయసు నలభై మాత్రమే.'' అంది కుంతల.

''నాపట్ల సానుభూతి స్నేహం వున్నదానివి కనుక చెబుతున్నా! మన ఆఫీసులో నాలుగేళ్లు పనిచేసి కొచ్చీ వెళ్లిపోయారు గుర్తుందా? కృష్ణ ప్రసాద్ ! ఆయన నన్ను ఇష్ట పడ్డారు. ఏడాది అయ్యాక మేము పెళ్లి చేసుకుంటాం. నీకు మాత్రమే చెబుతున్నా! నాలుగేళ్లుగా మాకు సంబంధం వుంది. నా భర్తకి కేన్సర్ అని తెలిసాక కొచ్చీలో ట్రీట్మెంట్ చేయించడంలో ప్రసాద్గారు చాలా సహాయం చేసారు. ఆయనవల్లనే నేను ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొన్నాను. ఆ పరిచయం మామధ్య అనుబంధానికి దారి తీసింది.'' చెప్పింది ధార.

''నీ ధైర్యానికి అభినందిస్తున్నాను. కంగ్రాట్యులేషన్స్.'' చెప్పింది కుంతల.

రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ధార పార్టీ ఇచ్చింది, తన నిర్ణయం అందరికీ తెలియాలని.

అందరూ అభినందించారు, లోపల ఏమనుకున్నా!

కుంతలతో స్నేహం కొనసాగిస్తూ ఫోన్ చేసేది ధార. కానీ కూతురు నయన - వియ్యంకుడు మహేంద్ర కుటుంబానికి దూరంగా ఉండేది.

''ఒక్క కూతురు మనవలకు దూరంగా ఉండటం ఏమిటి ధారా” అని అంటే ' నయన గొప్ప కుటుంబంలో కోడలు. నా హద్దులో నేను ఉండటం మంచిది కదూ… అప్పుడప్పుడు కలుస్తూనే వున్నాంలే!' అనేది.

రెండేళ్లు వాళ్ళ దాంపత్యం బాగానే గడిచింది. నయన అత్తమామలతో జాయింట్ ఫ్యామిలీలో బాగానే ఇమిడిపొయిన్ది. ఇద్దరు పిల్లలు . రాజమహాల్లాంటి

పెద్ద ఇల్లు.. ఒక్కపనిచేయక్కరలేదు. నలుగురు పనివాళ్ళు. వాళ్ళ స్వంత కంపెనీలొనే నయన భర్త, మామగారు, అత్తగారు ఉద్యోగాలు చేస్తారు. తీరికలేనంత బిజీ తో వాళ్ళు బాగానే వున్నారు.

ప్రసాద్ ని చేసుకున్నాక ధారకి విదేశీ విహారాలు, కోరిన నగలు.. మొదటి భర్త కంటే వేయి రేట్లు సుఖపడుతుంటే చాలామంది అసూయపడేవారు.

ఎవరి జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పలేం. ధార అదృష్టానికి విధికే కన్నుకుట్టిందేమో!

యాక్సిడెంట్లో ప్రసాద్ మరణించాడు. ఇప్పుడు ధార పరిస్థితి ఘోరంగా వుంది..... ప్రసాద్ సడెన్ డెత్ వలన.

ధార పేరున ఎలాంటి ఆస్తులు, ఇన్కమ్ ఇవ్వ లేదు.

అతనికి మొదటి వివాహం వల్ల వున్న భార్య, ఇద్దరు అబ్బాయిలకే ఆస్తి అంతా ఇచ్చేసాడు. వాళ్లను ధార ఎప్పుడూ చూడలేదు.

ఇటు ఎలాటి ఆధారమూ లేక నష్టపొయిన్ది. ప్రసాద్ని చేసుకున్నాక వుద్యోగం మానేయడంతో ఎలాటి బెనిఫిట్ లేకుండా పోయిన్ది. కనీసం వాళ్ళు రెండేళ్లుగా కలిసివున్న ఫ్లాటు కూడా ధారకి ఇవ్వలేదు ప్రసాదు.

''నేను నా భవిష్యత్తు ఆలోచించలేదు..... తెలివి తక్కువ. వెనకా ముందు ఆలోచించలేదు. రెండేళ్లకే ప్రసాద్ అన్యాయం చేసిపోతాడు అనుకోలేదు.....కుంతలా! నేను సుఖపడాలనుకోడం తప్పా? ప్రసాద్ని రెండో పెళ్లి చేసుకోడం పొరబాటా....” అంది.

''తప్పు ఎందుకు అవుతుంది? కానీ నీకంటూ కనీసం ఫ్లాట్ అడగాల్సింది. ఈ రోజుల్లో ఇష్టం, స్వసుఖము కంటే వ్యాపారం అను... ముందుచూపు అను...పెళ్ళికి ముందే జాగ్రత్త పడుతున్నారు. అందులో లైఫ్ కి సెక్యూరిటీ ఉండాలి. ఆనందం ఒక్కటేకాదు. ఇలాంటి ఇబ్బందులు వస్తే ఎవ్వరూ ఆదుకోరు. నయన ఏమంటుంది?”

''అది అమాయకురాలు. అత్తమామల చాటు పిల్ల. వాళ్ళ అధీనంలో వుంది. నువ్వు అన్నది నిజం.

ప్రసాద్ని పెళ్లి చేసుకోడంతో నేను నయనకు కొంత దూరం ఐనమాట నిజం. మామగారి పలుకుబడి గౌరవం దాన్ని బందీగా చేసి ఉండవచ్చు. దాని పెళ్ళికి కూడా తొందర పడ్డానేమో.....” అంటూ బాధపడితే ఎలా ఓదార్చాలో తెలియలేదు కుంతలకు.

''నువ్వు ధైర్యం తెగువ గలదానివి. నీ కంటూ వ్యాపకం కల్పించుకో! కృంగిపోకు. మన జీవితం మనమే నిర్మించుకోవాలి. ఏదైనా సోషల్ సర్వీస్ చేయి. సంపాదనకు సవా లక్ష మార్గాలు వున్నాయి. నీ ఆరోగ్యం మంచిది.'' అంటూ తోచినట్టు ధైర్యం చెప్పింది .

''ఇప్పుడు నేను హైదరాబాద్ రావాలా..... ఇక్కడే ఉండాలా! నీ సలహా ఏమిటి?” అడిగింది ధార.

''అక్కడ నీకు ఎవరున్నారు? ఇక్కడికి రావడమే మంచిది. ఏ సలహా సంప్రతింపులకైనా మహేంద్ర -భార్య వుంటారు'' అంది కుంతల.

''అవును. ఇప్పుడైనా నయనకు దగ్గిరలో వున్నాను అని తృప్తి ఉంటుంది.'' అంది ధార.

''ఇల్లు ఖాళీ చేస్తున్నాను. దయచేసి మీలో ఎవరైనా వచ్చి కీస్ తీసుకోండి.....” అని ప్రసాద్ భార్యకి ఫోన్ చేసి చెప్పింది హైదరాబాదు వచ్చేముందు.

''అపార్ట్మెంట్ ఆఫీసులో ఇచ్చివెళ్ళు. నీ మొహం చూడాలని మేము అనుకోవడంలేదు. ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో'' అందావిడ .

ఖరీదైన నగలు చీరలు అమ్మి ఆ డబ్బుతో కుంతల సహాయంతో వూరికి చివర ''స్నేహకుటీరం'' అని ప్రారంభించింది. భర్త మరణించిన వారితో, విడిపోయిన వారితో కలిసి స్వయం కృషితో ఆర్గానిక్ కూరగాయలు పండించి అమ్మడం, పచ్చళ్ళు తినుబండారాలు ఇంటికే పంపడం చేసేది. కొత్తలో పోటీని తట్టుకుంటూ నిలదొక్కుకోడం కష్టమే ఐనా, తర్వాత రుచికి నాణ్యతకు మంచిపేరు లాభాలు తెచ్చిపెట్టాయి.

'పూలు అమ్మినచోట కట్టెలు అమ్మాల్సిరాడం' కొంత బాధే ఐనా ఈరోజుల్లో బ్రతుకు తెరువు కోసం ఏదైనా చేయగల అవకాశం కల్పించుకుంటూ నిలబడుతున్న మహిళలు ఎందరికో ఆదర్శం .

***శుభం ***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని ,చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....''ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
58 views0 comments

Comentarios


bottom of page