'Jnapaka Parimalala Pula Guccham' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
అపురూపమైన అందమైన పూలగుచ్ఛం బహుమతిగా ఇచ్చావు
అందులో అరవిరిసిన మొగ్గలు ఒకొక్కరేకు విచ్చుకుంటూ
సుగంధాలు వెదజల్లుతూ నన్ను మధురోహల్లోకి తీసుకు వెళ్ళింది
అదిఒక్కరోజులో వాడిపోలేదు తాజాగానే వుంది నీ ప్రేమలా.
నువ్వు నా ఎదుటలేవు కానీ నీ తీయటి మాటలు నన్ను పలకరిస్తూ వున్నాయి
నీవు పంపే సందేశాలు అందుతూనేవున్నాయి ప్రేమ ఇష్టం మమకారం
అంటే తనువులు ఒకటి కానక్కరలేదు మధురమైన తలపులు చాలు
నీవునేను రాసుకున్న లేఖలు చాలు ఫోటోల ఆల్బమ్ చాలు అనుకుంటాను.
నేను ఎప్పుడు ఒంటరిని అనుకోను నీ తలపుల జల్లు నన్ను ముంచెత్తుతూ
మురిపిస్తూనే ఉంటుంది నువ్విచ్చిన బహుమతులు ఆనాటి రోజును
గుర్తుచెస్తూనే వున్నాయిగా అవి వెలకట్టలేనివి నీకూ నాకు మాత్రమే
తెలిసిన అనుభూతులు ప్రేమకు నిర్వచనాలు చెరిగిపోని ఙాపకాలు .
పున్నమి చంద్రుడు మరులుగొలిపే మల్లికలు సుతిమెత్తని పారిజాతాలు
మనచెలిమికి ఆనవాళ్లుగా మనచుట్టూ చేరి పలకరిస్తూ వున్నాయి
నాఒడిలో ఒదిగిన లాప్-టాప్ మన మధ్య దూరాన్ని చెరిపేసింది
అదిచాలు మన మనసులు ఒక్కటే అని అడ్డు ఎవరూ రారని చెప్పటానికి.
మన ఇద్దరికీ ఇష్టమైన పాటలు కలిసి చూసిన ఇష్టమైన సినిమాలు
కలిసి తిరిగిన ప్రదేశాలు గడిచిపోయిన రోజుల తీపి గురుతులు
అదొక్కటేనా చిలిపి కలహాలు అర్ధంలేని కోపాలు తిరిగి కలిసిపోడాలు
ఇక ఎప్పుడూ తగవులాడద్దు అనే ప్రమాణాలు అదే కదా సహజమైన ప్రేమ!
పూల గుచ్ఛములో ఎన్నోపూలు ఉన్నట్టు మన ప్రేమ కథలో ఎన్నో అనుభూతులు
వాటిని పదిలంగా కాపాడుకుందాము అవి వాడిపోవచ్చు కానీ వాటి పరిమళం
మనతోనే ఉంటుంది వాటిని గుండెల్లో దాచుకుంటాము అప్పుడప్పుడు
తడిమి చూసుకుంటూ మై మరిచిపోదాం నువ్వెంత ధన్యురాలివో పూల గుచ్ఛమ!
***శుభం ***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని ,చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....''ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments