top of page

విస్ఫోట‌నం




'Vispotanam' - New Telugu Story Written By Gannavarapu Narasimha Murthy 

Published In manatelugukathalu.com On 31/12/2023

'విస్ఫోట‌నం' తెలుగు కథ

రచన: గన్నవరపు నరసింహ మూర్తి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్





ఆరోజు నేను విశ్వ‌విద్యాల‌యానికి వెళ్ళే స‌మ‌యంలో న‌న్ను ఇంట‌ర్వ్యూ చెయ్య‌డానికి సైన్స్ ఇండియా. జ‌ర్న‌ల్‌కి సంబంధించిన  వర్మ  అనే  విలేఖ‌రి వ‌చ్చాడు. అతను ముందుగా చెప్ప‌లేదు కాబ‌ట్టి నేను ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌న‌ని చెప్పాను. కానీ అత‌ను ప్ర‌ధాన‌మంత్రికి సైన్స్ స‌ల‌హాదారుడైన డాక్ట‌ర్ శాంతి స్వ‌రూప్ నుంచి తెచ్చిన రిక‌మండేష‌న్ లెట‌ర్ చూపించిన త‌రువాత, నాకు అతనికి ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌క త‌ప్పింది కాదు.


నేను ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూర్ నుంచి    ఫిజిక్స్‌లో ఎమ్‌. ఎస్‌. చేసాను. నాకు hచిన్న‌ప్ప‌ట్నుంచీ సైన్స్ అన్నా మ‌రీ ముఖ్యంగా ఫిజిక్స్ అన్నా చాలా ఇష్టం. ఐన్‌స్టైన్ ప్ర‌తిపాదించిన థీరీ ఆఫ్ రెలిటివిటీ అంటే సాపేక్ష సిద్ధాంతం, న్యూట‌న్ గురుత్వాక‌ర్ష‌ణ సిద్ధాంతం, మేడ‌మ్ క్యూరీ రేడియో ధార్మిక‌త ప‌రిశోధ‌న‌లను  ఎక్కువ‌గా  చ‌దివేవాణ్ణి.


 అలా రాను రాను నేను అటామిక్ ఫిజిక్స్ వైపు ఆక‌ర్షించ‌బ‌డి  ఆ త‌రువాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో మ‌ళ్ళీ  న్యూక్లియర్  ఫిజిక్స్‌లో  ఎమ్‌. ఎస్‌. చేసాను. ఆ త‌రువాత అక్క‌డే అమెరిక‌న్ ఎటామిక్ ఏజ‌న్సీలో సైంటిస్ట్‌గా ప‌నిచేసి ఐదేళ్ళ త‌రువాత ఇండియాకి వచ్చి  ముంబాయిలోని బాబా ఏట‌మిక్ రీసెర్చి సెంట‌ర్లో సైంటిస్ట్‌గా చేరాను.


అదే స‌మ‌యంలో మ‌న‌దేశం రాజ‌స్థాన్లోని పోఖ్రాన్‌లో అణుబాంబు ప్ర‌యోగాన్ని జ‌రిపింది. ఆ ప్రయోగాన్ని జరిపిన బృందంలో అబ్దుల్ కలాం గారి తో పాటు నేను కూడా ఒక సభ్యుణ్ణి. నేను  ఆ బాంబు డిజైన్,  మరియు   నిర్మాణంలో చాలా చురుకైనపాత్ర పోషించాను. ఆ బాంబు ప్ర‌యోగం స‌ఫ‌ల‌మ‌వ‌డంతో నా పేరు దేశంలో మారుమ్రోగి పోయింది.   ఆ సంవ‌త్స‌రం సైన్స్  లో అత్యంత ప్రతిష్టాత్మక  శాంతి స్వరూప్  భట్నాగ‌ర్ అవార్డ్‌కి న‌న్ను ఎంపిక చేసారు. 


ఆ త‌రువాత నేను  ఆటం  బాంబు మీద మ‌రిన్ని ప్ర‌యోగాలు చెయ్య‌డం మొద‌లు పెట్టాను. ఏ దేశమైనా  ఆట‌మిక్ బాంబు త‌యారు చేస్తే, ఆ దేశం మీద అమెరికాతో బాటు యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు కూడా అనేక ఆంక్ష‌లు విధిస్తాయి. అందుకే  ఆ ఆటం  బాంబ్ ప్ర‌యోగం త‌రువాత మ‌న ప్ర‌ధాన‌మంత్రి భారత  అణు కార్య‌క్ర‌మాలు అన్నీ శాంతియుత ప్ర‌యోజ‌నాల కొర‌కే అని ప్ర‌క‌టించ‌వ‌ల‌సి వ‌చ్చింది. 


అందువ‌ల్ల నేను నా ప‌రిశోధ‌న‌ల‌ను పెద్ద విస్ఫోట‌నం చెంది ల‌క్ష‌ల‌ మంది చ‌నిపోయే ఆటంబాంబ్ క‌న్నా తక్కువ నష్టం కలిగించే చిన్న బాంబుల మీద కేంద్రీక‌రించాను. అలా రెండేళ్ళ నా నిర్విరామ ప‌రిశోధ‌న‌ల త‌ద‌నంత‌రం చిన్న అణు బాంబులు త‌యారు చేసే ప్రాజెక్ట్ రూపు దిద్దుకుంది. 


అటామిక్ ఫిజిక్స్ ప్ర‌కారం యురేనియం (యు 235) ఐసోటోప్‌ని న్యూట్రాన్‌లతో ఢీ కొట్టించ‌డం ద్వారా అది విచ్ఛిన్నం (ఫిష‌న్‌) చెంది రెండు తేలిక అణువులు గా విడిపోయిన‌ప్పుడు విప‌రీత‌మైన శ‌క్తి విడుద‌ల అవుతుంది.. ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌ట ఆటంబాంబుని అమెరికాకి చెందిన జె. రాబ‌ర్ట్ ఓపెన్ హైమ‌ర్ అనే శాస్త్రవేత్త త‌యారు చేసాడు. 


నేనుఇదే ఫార్ములాతో యురేనియం ఐసోటోప్ ప‌రిమాణాన్ని త‌గ్గించి ప్ర‌యోగం చేసి  చిన్న బాంబుకి రూప‌క‌ల్ప‌న చేసాను. ఆ ప్రాజెక్ట్‌ని అనుమతి కోసం ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు పంపిస్తే వాళ్ళు సంవ‌త్స‌రం త‌రువాత న‌న్ను చ‌ర్చ‌ల‌కు డెహ్రాడూన్లోని ఇండియ‌న్ మిల‌ట‌రీ ఎకాడ‌మీకి   ర‌మ్మ‌న‌మ‌ని పిలిచారు. 


నేనువెంట‌నే మా డైరెక్ట‌ర్ అనుమ‌తితో డెహ్రాడూన్ వెళ్ళి అక్క‌డ మిల‌ట‌రీ అధికారుల‌కు నాప్రాజెక్ట్ గురించి చెప్పి చిన్న అణుబాంబుల‌ను ఎలా త‌యారు చేయ‌వ‌చ్చో వివ‌రించాను. ఆ మ‌ర్నాడు ఆ అధికారులు న‌న్ను ల‌డ‌క్ రెజిమెంట్‌కి తీసికెళ్ళారు. 



అది  సియాచిన్ గ్లేసియ‌ర్కి ద‌గ్గ‌ర‌గా ఉన్న సైనికుల బేస్ కేంప్‌. అక్క‌డ 2000 మంది సైనికులు, 200 మంది కెప్టెన్లు, క‌ల్న‌ల్స్‌, బ్రిగేడియ‌ర్స్  వంటి   అధికారులు ఉన్నారు. వాళ్ళున‌న్ను కార్గిల్ యుద్ధం జ‌రిగే ప్రాంతానికి తీసికెళ్ళి ఆ యుద్ధం ఎలా జ‌రిగిందో, ఎక్క‌డ పాకిస్థాన్ త‌న స్థావ‌రాల‌ను ఏర్ప‌ర‌చుకుందో, వాటి మీద బోఫోర్స్ తుపాకీల‌తో మన సైనికులు ఎలా దాడి చేసారో వాటిని ప్ర‌త్య‌క్షంగా చూపించి నాకు వివ‌రించారు. 


ముందు వాళ్ళు న‌న్ను ఎందుకు అక్క‌డికి తీసికెళ్ళి అవ‌న్నీ చూపించారో  నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి అదే విష‌యాన్ని అమ‌ర్జిత్ సింగ్ అనే బ్రిగేడియర్ని  అడిగాను. 



"మిస్టర్ సిద్దార్దా ! మీరు అణుశాస్త్రవేత్త‌. త్వ‌ర‌లో మీరు క‌నిపెట్టిన ఫార్ములా ఆధారంగా చిన్న ఆటంబాబుల‌ను త‌యారు చేయ‌బోతునాము.   మీ ప్రయోగాల ద్వారా భవిష్యత్తులో  మ‌నం తయారు చేయబోయే  చిన్న అణు బాంబులు ఏ ప్ర‌దేశంలో ఏ విధంగా శ‌తృవుల మీద ప్ర‌యోగిస్తామో, దాని వ‌ల్ల ఎంత ప్రాంతంలో విధ్వంసం జ‌రుగుతుందో, మీ బాంబు మ‌న మిల‌ట్రీకి ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో మీకు ఒక అవ‌గాహ‌న కలగాలని  ర‌క్ష‌ణ మంత్రి, కార్య‌ద‌ర్శి యొక్క ఆదేశాల‌న‌నుస‌రించి మిమ్మ‌ల్ని ఈరోజు ఇక్కడకు  తీసుకు వ‌చ్చాము. ఇప్పుడు చెప్పండి   మా శాఖ ఆలోచ‌న స‌రియైన‌దేనా?'' అని అడిగాడు. 


"యస్ మిస్టర్ సింగ్. ఇక్కడకు  రావడం వల్ల   ఈ ప్రాజెక్టుని మ‌న మిల‌ట్రీకి అనుగుణంగా ఎలా తీర్చిదిద్దవ‌చ్చో అన్న అవ‌గాహ‌నతో  పాటు ఈ బాంబు గురించిన మీ అభిప్రాయాలేమిటో కూడా తెలుసుకునే అవ‌కాశం  నాకు క‌లిగింది" అని చెప్పాను. 


ఆ రాత్రి డిన్న‌ర్ ఆ కేంపులో  ఉన్న క్ల‌బ్‌లో జ‌రిగింది. అది చాలా పెద్ద క్ల‌బ్‌. 2000 మంది వ‌ర‌కు అందులో పాల్గొనవచ్చు. ప్ర‌తీ ఆదివారం ఈ క్ల‌బ్‌లో అంద‌రూ క‌లుస్తుంటార‌ని అమ‌ర్జిత్ సింగ్ నాకు చెప్పాడు. 


8 గంట‌ల‌కు డిన్న‌ర్ ప్రారంభ‌మైంది. సుమారు 300 మంది త‌మ కుటుంబాల‌తో వ‌చ్చారు. అంద‌రూ ముందుగా మ‌ద్యాన్ని సేవించ‌డం మొద‌లు పెట్టారు. మిల‌ట్రీ వారికి విదేశీ మ‌ద్యాన్ని ర‌క్ష‌ణ‌శాఖ ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తార‌ని అక్క‌డి అధికారులు నాకు చెప్ప‌డంతో  నేను ఆశ్చ‌ర్య‌పోయాను. 


కానీ ఆ రాత్రి జ‌రిగిన ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న నా ప్రాజెక్ట్‌తో  బాటు  నా ఆలోచనలను కూడా ఓ మ‌లుపు తిప్పింది. 


ఆ రాత్రి డిన్న‌ర్ త‌రువాత నేను ఢిల్లీకి వెళ్ళి ఆమ‌ర్నాడు ర‌క్ష‌ణ శాఖ సెక్రెట‌రీని క‌ల‌వ‌డానికి వెళ్ళాను. ఉద‌యం 10 గంట‌ల‌కు ఆయ‌న ఆఫీసుకి వ‌చ్చారు. 


న‌న్ను చూసి "హ‌లో మిస్ట‌ర్  సిద్ధార్థ‌! నిన్న రాత్రి మీరు వెళ్ళిన కార్గిల్ కేంప్‌లో ఒక ఘోరం జ‌రిగింది. సుమారు 1000 మంది సైనికులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అఫ్ కోర్స్ ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాము అనుకోండి" అని చెప్పాడు. 


నేను అత‌ని మాట‌ల‌కు ఆశ్చ‌ర్య‌పోయి "మిస్ట‌ర్ మిశ్రా ! ఏం జ‌రిగింది? ఏదైనా కుట్రా!?' అని అడిగాను.


"ఆ విష‌యమై బ్రిగేడియ‌ర్ స్థాయి అధికారుల బృందం విచార‌ణ జ‌రుపుతోంది. ప్రైమాఫేసీ రిపోర్టు ప్ర‌కారం నీటి కారణంగా వాళ్లంతా  అస్వస్థత‌కు గుర‌య్యార‌ని తెలిసింది. ఇక్క‌డ మీకు ఒక ముఖ్య‌మైన విష‌యాన్ని చెప్పాలి. ఇది చాలా కాన్ఫిడెన్షియ‌ల్. ఎవ్వ‌రికీ చెప్పొద్దు. శ‌తృవులు ఎవరో నీటిలో యురేనియంను క‌లిపిన‌ట్లు తెలిసింది. దానివ‌ల్ల మా కేంపుకి వ‌చ్చే  నీటిలో  రేడియో ధార్మిక‌త‌ పాలు ఎక్కువగా ఉందని  నిన్న జ‌రిపిన నీటి ప‌రీక్ష‌లో తేలింది. ఆ నీటిని తాగిన సైనికులు చాలామంది ఆ రేడియేషన్ ప్రభావం వ‌ల్ల అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు" అని చెప్పాడు మిశ్రా. 


"చాలాఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం చెప్పారు మిస్ట‌ర్ మిశ్రా ! ఇది ఎవరి ప‌ని? పాకిస్థాన్ దా?అయినా ఎంతో సెక్యూరిటీ ఉన్న మిల‌ట్రీ  క్యాంపు లో వాళ్ళు యురేనియంని ఎలా క‌లపగలిగారు ? ఇది మ‌న సెక్యూరిటీ వైఫ‌ల్య‌మా? లేక  ఇందులో ఏదైనా కుట్ర ఉందా?" అని అడిగాను. 


"అది విచార‌ణ‌లో తేలుతుంది సిద్ధార్ధా ! ఆ మిల‌ట్రీ కేంపుకి  ద‌గ్గ‌ర్లోని నుబ్రా న‌దిలోని ఇన్‌ఫిల్ట‌రేష‌న్ వెల్స్ నుంచి నీటి స‌దుపాయం క‌ల్పించ‌బ‌డింది. బ‌హుశా పాకిస్థాన్ మిల‌ట్రీయో లేక కాశ్మీర్ ఆతంక‌వాదులో ఎవ‌రో ఆ నీటిలో యురేనియంని  క‌లిపి ఉండొచ్చ‌నీ ప్రాథ‌మికంగా మా వాళ్ళు అనుమానం వెలిబుచ్చుతునారు. ఏది ఏమైనా ఇది ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ఘ‌ట‌న‌. భ‌విష్య‌త్తులో వాళ్ళు ఇంకేం చేస్తారో ఊహించుకుంటేనే భ‌యం వేస్తోంది" అన్నాడు మిశ్రా .


"మ‌రి దీన్ని ఎలా ఎదుర్కొంటారు?" అని అడ‌గాను నేను. 


“మిస్ట‌ర్ సిద్ధార్థ‌! మీరు క‌నిపెట్టిన ఎటామిక్ స్మాల్ బాంబ్ ఫార్ములా ప్ర‌కారం మ‌నం కూడా ఆబాంబుల‌ను తయారుచేసి పాకిస్థాన్ సైనిక స్థావ‌రాల మీద ప్ర‌యోగించి వాళ్ళ‌కి కూడా రేడియేష‌న్ ప్రభావానికి  గురయ్యేలా  చూస్తే మొత్తం వాళ్ళ‌ ఆర్మీ అంతా అస్వ‌స్త‌త‌కు గురై వాళ్ళ సైన్యం కొలాప్స్ అవుతుంది. ఈ విష‌య‌మై మా రక్షణ శాఖ  తీవ్రంగా ఆలోచిస్తోంది" అన్నాడు  మిశ్రా.


"అప్పుడు అమెరికా, ర‌ష్యా వంటి దేశాలు మ‌న‌ల్ని ప్ర‌శ్నిస్తాయి . మ‌నం చెయ్య‌ బోయేది ఒక విధంగా అణు దాడి. అది మ‌నం చేసుకున్న అణు ఒప్పందానికి వ్య‌తిరేకం క‌దా! మ‌నం అణు కార్య‌క్ర‌మాల‌ను శాంతి స్థాప‌న‌కే వాడ‌తామ‌ని ప్ర‌క‌టించి ఉన్నాము క‌దా?" అని నేను అన్నాను. 


"మ‌నం ఏమీ పెద్ద అణుబాంబు లేవీ వాళ్ళ మీద ప్ర‌యోగించ బోవ‌టం లేదు. చిన్న చిన్న‌ బాంబులు ప్ర‌యోగించి అక్క‌డి నీరు, ఆహారం రేడియో ధార్మిక‌త‌కు లోన‌య్యేలా చేసి త‌ద్వారా సైనికుల‌ను అస్వ‌స్థ‌తకు  గుర‌య్యేట‌ట్లు చేస్తాము. దీనివ‌ల్ల ఎవ్వ‌రికీ మ‌నం చేసిన‌ట్లు అనుమానం రాదు. అలా రాకుండా ఉండ‌టానికి త‌గు జాగ్ర‌త్త‌లు ముందే మ‌నం తీసుకొంటాము. ఆ విష‌యంలో మీరు వ‌ర్రీ కావ‌ద్దు"అన్నాడు  మిశ్రా . 


"మిస్ట‌ర్ మిశ్రా   ! పాకిస్థాన్ సైన్య మైనా , మ‌న సైన్యమైనా  రేడియేష‌న్‌కి గురవడం  అన్నది మాన‌వ స‌మాజానికి మంచిది కాదు. మ‌న రెండు దేశాలు చేసే ఈ అణు కార్య‌క్ర‌మం ఇక్క‌డితో ఆగ‌దు. అది క‌రోనా మ‌హ‌మ్మారిలా ప్ర‌పంచం అంతా  వ్యాపిస్తుంది. అప్పుడు మొత్తం మాన‌వాళంతా రేడియేష‌న్ ప్ర‌భావానికిలోనై మాన‌వ‌జాతి ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. ఇది మంచిది కాదు. మ‌నం యుద్ధం ఎలాగైనా  చెయ్యొచ్చు. ఎంత వరకైనా శ‌తృవుతో పోరాడ‌వ‌చ్చు. అంతే కాని మాన‌వ‌జాతి అంత‌మ‌య్యే ఏ ప‌నీ చెయ్య‌కూడ‌దు. నిన్న‌వాళ్ళు అటువంటి ప‌ని ఏదైనా చేసి ఉంటే దాన్ని ప్ర‌పంచానికి తెలియ‌ప‌ర‌చాలి. వాళ్ళ కుట్ర‌ను బ‌హిర్గ‌తం చెయ్యాలి. అప్పుడు ప్ర‌పంచం క‌ళ్ళు తెరిచి వాళ్ళ‌నేం  చెయ్యాలో నిర్ణ‌యించుకుంటుంది. అంతేకాని మ‌నం  వాళ్ళ‌లా చెయ్య‌కూడ‌దు.   క‌రోనా వైర‌స్‌ని చైనా తన  ప్ర‌యోగశాల‌లో సృష్టించి ప్ర‌పంచం మీదకి  వ‌దిలింద‌న్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్న ఈ స‌మ‌యంలో మ‌నం ఈ ప‌ని చెయ్య‌డం మంచిది కాదు. ఏదేశం, ఏ పౌరుడూ హ‌ర్షించ‌రు. నేను ఈ కార్య‌క్ర‌మానికైతే నా ఫార్ములాని ఇవ్వ‌ను. ఈ విష‌యాన్ని నేను ప్ర‌ధాన‌మంత్రికి లిఖిత పూర్వ‌కంగా వ్రాస్తాను" అని చెప్పి వ‌చ్చేసాను.

********** ********** *********

వారం త‌రువాత నేను ఆ ఫార్ములాను వెన‌క్కి తీసుకుంటున్నాన‌నీ, దాని మీద ఎటువంటి చ‌ర్య‌లూ తీసుకోవ‌ద్ద‌నీ రాష్ట్రప‌తికీ, ప్రధాన మంత్రికీ  ఉత్త‌రాలు వ్రాసాను. ఆ తరువాత నన్ను అభినందిస్తూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి  ఉత్తరాలు రాయడం నాకు చాలా ఆనందం కలిగించింది.


(సమాప్తం)

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


57 views0 comments
bottom of page