top of page
Original.png

వివేకానందుని వివేకం

#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #వివేకానందునివివేకం, #TeluguDevotionalArticle

 

Vivekananduni Vivekam - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 11/01/2026

వివేకానందుని వివేకం - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తాగా ప్రారంభమైన వివేకానందుడి జీవితం చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత, చదువు, సంగీతం, వ్యాయామాలతో ప్రారంభమైంది. చురుకైన, కొంటెపిల్లవాడిగా ఉంటూ కూడా ధ్యానంపై ఆసక్తి చూపేవారు. రామకృష్ణ పరమహంసను కలవడంతో ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. గురువు గారు బోధించిన జీవకారుణ్యంతో కూడిన సేవ, భగవంతుని సాక్షాత్కారం వంటి సిద్ధాంతాలను వివేకానంద ఆచరించి, వాటిని ప్రపంచానికి చాటి చెప్పడంలో కృతకృత్యులైనారు. "మీరు దేవుడిని చూశారా" అని నరేంద్రనాథ్ (వివేకానంద) గురువును ప్రశ్నిస్తే, "అవును, నేను చూశాను, నీకు చూపించగలను" అని పరమహంస సమాధానం చెప్పడం వివేకానందలో చెరగని ముద్ర వేసి, ఆయనకు శిష్యుడిగా మారడానికి దారితీసింది.


వివేకానందకు రామకృష్ణ పరమహంస కేవలం గురువు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వానికి, తత్వానికి, కార్యాచరణకు మూలాధారం. పరమహంస చూపిన మార్గంలోనే స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి, మానవసేవకు మార్గదర్శకుడయ్యారు. వారి మాటలు, ఉపన్యాసాలు, నినాదాలు, సలహాలు 130 సంవత్సరాల తర్వాత ఈరోజుకు కూడా అదే ప్రామాణికతతో స్ఫూర్తిదాయకమై పదిలంగా నిలిచి ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు, యూత్ ఐకాన్ గా ఆయనను ఎందుకు తలుచుకుంటారు అనే విషయాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. 


స్వామి వివేకానంద యువశక్తికి స్ఫూర్తినిచ్చే అసలు సిసలు యువ నాయకుడు. యువత సామర్థ్యంపై ఆయనకు అపారమైన నమ్మకం. భారతజాతి అభ్యున్నతి కోసం యువశక్తిని, వారిలో ఉప్పొంగే ఉత్సాహాన్ని వినియోగించాలనే ఆలోచనతో యువతను ప్రోత్సహించారు. స్వామి వివేకానంద బోధనలు యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించి సమాజానికి సేవ చేయడానికి ప్రేరేపిస్తాయి మరియు యువతలో సాధికారతా భావాన్ని కల్పిస్తాయి. యువతకు ఆయన అందించిన స్ఫూర్తిదాయక నినాదం "లేవండి, మేల్కొనండి మరియు లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి". వారి బోధనలు సార్వత్రిక సోదరభావం, సహనం మరియు సేవా భావాన్ని కలుగ చేసే విధంగా స్ఫూర్తినిస్తాయి. అణగారిన వర్గాలకు నిస్వార్థ సేవ చేయడంలోనే నిజమైన ఆధ్యాత్మికత ప్రతిబింబిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. అందుకే వివేకానంద ఆలోచనలను, బోధనలను గౌరవిస్తూ వారి జయంతిని జాతీయ యువ దినోత్సవం (రాష్ట్రీయ యువ దివస్)గా జరుపుకుంటారు. 


ఈ దేశానికి భరోసా యువత. అయినా ఈ సమాజంలో 20 ఏళ్ల వృద్ధులు ఉంటారు, 70 ఏళ్ల యువకులు ఉంటారు. అందుకే వివేకానందుల జయంతి సందర్భంగా ఆత్మవిశ్వాసం, సేవ, దేశ నిర్మాణం వంటి సందేశాలతో కూడిన కార్యక్రమాలు, సెమినార్లు మరియు వర్క్‌షాప్‌లను దేశవ్యాప్తంగా నిర్వహించి యువతను ప్రోత్సహించాలి. పాఠశాలలు మరియు కళాశాలలలో ఈ దిశగా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు జరపాలి. జాతి నిర్మాణంలో పాలు పంచుకోవడానికి, దేశ అభ్యున్నతి కోసం కృషి చేయడానికి యువతను ప్రేరేపించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివేకానంద ఆదర్శాలపై ఉపన్యాసాలు, శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలు నిర్వహించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా యువతకు విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకతలపై చర్చలకు ఒక వేదికగా వారి జయంతిని సద్వినియోగం చేసుకుంటేనే జాతీయ యువ దినోత్సవ ప్రయోజనం నెరవేరుతుంది. 


భారతదేశాన్ని జాగృతం చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో భారత సంస్కృతి ఔన్నత్యాన్ని, వేదాంత శాస్త్ర సారాంశాన్ని తన ఉపన్యాసముల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి వివేకానం. తని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం వారికి బ్రహ్మరథం పట్టింది. ఎందరో దేశ విదేశీయులు అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. పాశ్చాత్య దేశాలకు మన సనాతన ధర్మ విలువలను మరియు యోగాను పరిచయం చేయడంలో ఆయన పాత్ర కీలకమైనది. అన్ని మతాలు ఒకే సత్యానికి దారితీస్తాయనే విధానాన్ని ప్రోత్సహిస్తూ పరమత సహనం ఉండాలని ఆయన సూచించారు. స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా వారికి సంబంధించిన వైవిధ్యభరితమైన సంఘటనలతో కూడిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. 


ఉపాధ్యాయుడి సందేహం

++++++++++++++++

సామాన్యంగా ఉపాధ్యాయుడిని విద్యార్థి అడుగుతుంటాడు. ఈ వృత్తాంతంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని అడుగుతాడు. 1881లో, ఒక ప్రొఫెసర్ తన విద్యార్థిని, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్నీ దేవుడే సృష్టించాడా అని అడిగారు? విద్యార్థి అవును అని సమాధానం ఇచ్చాడు. అతను మళ్ళీ అడిగాడు: మరి చెడు సంగతేంటి ? దేవుడు చెడును కూడా సృష్టించాడా ? విద్యార్థి కాసేపు మౌనంగా ఉండి.... తాను కూడా ఒక ప్రశ్న అడగవచ్చా అని కోరాడు. ప్రొఫెసర్ అతనికి అనుమతి ఇచ్చారు. విద్యార్థి అడిగాడు "చలి అనేది ఉందా?" దానికి ప్రొఫెసర్ "ఉంది ! నీకు చలి అనిపించదా నాయనా ?" విద్యార్థి "నన్ను క్షమించండి, మీరు చెప్పింది తప్పు సార్" అన్నాడు. చలి అంటూ ఏమీ లేదు, చలి అనేది వేడి పూర్తిగా లేకపోవడమే. (absence of heat) ఎండ ఉంటే చలి ఉంటుందా ? ఉండదు, అంటే వేడి లేకపోవడమే చలి అనబడుతుంది. 


విద్యార్థి మళ్ళీ అడిగాడు "చీకటి అనేది ఉందా ?" ప్రొఫెసర్ సమాధానమిస్తూ "ఎందుకు లేదు రాత్రిపూట చిక్కటి చీకటి ఉంటుంది" విద్యార్థి అన్నాడు కదా "మీరు మళ్ళీ తప్పు చెప్పారు సార్. చీకటి అనే ఏదీ లేదు. నిజానికి అది కాంతి (Absence of light) లేకపోవడం". రాత్రిపూట ఏమి కనబడదు. చిన్న దీపం వెలిగిస్తే అన్ని కనపడతాయి, కాంతి లేదు కాబట్టి కనబడడం లేదు. విద్యార్థి మరింత ముందుకు వెళుతూ "సార్! భౌతిక శాస్త్రం నేర్చుకున్నాం కదా, అందులో మనకు ఎక్కడా చలి మరియు చీకటి గురించి ఉండదు. కాంతి మరియు వేడి (Heat and Light in physics) గురించి మాత్రమే సిలబస్ లో ఉంటుంది. అదేవిధంగా, చెడు అనేది జీవిత సిలబస్ లో లేదు. ప్రేమతో, పరిపూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి నమ్మకపోవడం, ధర్మాచరణ చేయకపోవడమే చెడు భావనకి మూలం" అని ముగించాడు. ఆ విద్యార్థి పేరు - వివేకానంద. 


విగ్రహారాధన అవసరమా ?

+++++++++++++++++

భారత దేశ పర్యటనలో ఉన్నప్పుడు, స్వామి వివేకానంద మార్గమధ్యంలో అల్వార్‌ రాజ్యానికి వచ్చాడు. ఆయనను అక్కడి రాజు మంగళ్ సింగ్ స్వాగతం పలికి ఆస్థానానికి ఆహ్వానించారు. వారు ఇరువురు పిచ్చపాటి మాట్లాడుకుంటుండగా ఒక సందర్భంలో విగ్రహాలను పూజించడం సరైన పద్ధతి కాదు, మీరేమంటారని స్వామీజీని రాజుగారు అడిగారు. అప్పుడు వివేకానందుడు - స్వామీజీ దగ్గరలో నిలబడి ఉన్న దివాన్ (మంత్రి)ని పిలిచి "దయచేసి అక్కడ వేలాడుతున్న మీ రాజుగారి ఫోటోపై ఉమ్మివేయండి" అని చెప్పాడు. దివాన్ సంకోచించి స్వామీజీ కోరినట్లు చేయలేదు. అప్పుడు వివేకానంద ఏమన్నారంటే "ఆ చిత్రపటం భౌతికంగా రాజు కాదు. కేవలం చిత్రం మాత్రమే. అయినప్పటికీ, మంత్రి దానిపై ఉమ్మివేయడానికి వెనుకాడుతున్నారు. ఎందుకు ? ఎందుకంటే అది రాజు గారిని గుర్తు చేస్తుంది. అదే విధంగా చిత్రాలు, విగ్రహాలు మనకు దేవుడిని గుర్తు చేస్తాయి. విగ్రహంగా తయారైన రాయినో, లోహాన్నో మనం పూజించడం లేదు, ఆ రూపంలో మనం భగవంతుడి ఆదర్శ లక్షణాలను భావించుకొని పూజించుకుంటాం" అని రాజుగారి సందేహ నివృత్తి చేసి ఆయన మన్ననలు పొందారు. 


మహిళలతో కరచాలనం

++++++++++++++++

మరొక సందర్భంలో ఒక ఆంగ్లేయుడు భారతదేశంలో మహిళలతో కరచాలనం ఎందుకు చేయరని వివేకానందను అడిగినప్పుడు, ఆయన ఇలా జవాబిచ్చారు "మీ దేశంలో మీరు రాణులతో కరచాలనం చేస్తారా? అంటే " రాణులతో కరచాలనం చేయకూడదు" అన్నాడా ఆంగ్లేయుడు. అలాగే మా భారతదేశంలోని ప్రతి మహిళను ఒక రాణిగా ఉన్నతంగా భావిస్తాం. అందుకే ఎవరూ వారితో కరచాలనం చేయరని ముక్కు బద్దలయ్యే సమాధానం ఇచ్చారు వివేకానంద గారు. దాని అర్థం, భారతీయ మహిళలు అత్యంత గౌరవనీయులు, పవిత్రమైనవారు, వారిని రాణీలతో సమానంగా పూజనీయంగా చూసుకుంటాం అని చెప్పడమే. 


ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో ఇతర మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి "చూశారా ఇదీ అట్టడుగున ఉన్న భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ టపటపా కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నారు. ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో ఉద్దేశించి ఇలా అన్నారు “మామూలుగా మనం ఏదైనా లెటర్ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లెటర్ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నారు. 


మానవాళికి మార్గనిర్దేశం

+++++++++++++++

సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్ది హిందూ మతం యొక్క గొప్పతనం బయటపడుతుందని స్వామి వివేకానంద ఆనాడే చెప్పారు. దానికి రుజువుగా ఈ మధ్యనే నాసా నిర్ధారించిన జ్యేష్టా నక్షత్రం గురించి చెప్పుకోవచ్చు. జ్యేష్టా అంటే పెద్ద నక్షత్రం అని వేదం ఎప్పుడో పేరు పెట్టి మరీ చెప్పింది. అన్నిటికన్నా పెద్ద నక్షత్రం అదేనని నాసా ద్వారా నిరూపించబడినట్లు సైన్స్ తేల్చింది. వివేకానంద జీవిత చరిత్రను చదవడం, అతని బోధనలపై వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా అమూల్యమైన సందేశాలను ఆచరించడం, ఆయన సూక్తులను స్మరించుకోవడం, మరియు రామకృష్ణ మిషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మన జీవితం పరిపూర్ణం అవుతుంది. ఆయన ఆదర్శాలను మన జీవన విధానంగా మార్చుకోగలిగితే వివేకానందుని వివేకాన్ని కొంతవరకైనా అందిపుచ్చుకోవచ్చు. 


కృష్ణార్పణమస్తు 🙏 



ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

bottom of page