top of page

వాట్సాప్ తెచ్చిన తంటా- కడుపులో మంట

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link


'Whatsap Thechhina Thanta Kadupulo Manta' written by Parimala Kalyan

రచన : పరిమళ కళ్యాణ్

భార్యకు కూడా సోషల్ మీడియా పట్ల అవగాహన వుంటే భర్త సంతోషిస్తాడు.

కానీ ఆ అవగాహన మితిమీరితే అతని పరిస్థితి ఏమిటనేది ప్రముఖ రచయిత్రి పరిమళ కళ్యాణ్ గారి కథలో తెలుసుకోండి.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం.


"అబ్బబ్బబ్బా ఎన్ని సార్లు చెప్పాను మీకు, కాస్త ఎక్కువ డేటా వేయించమని నా ఫోన్లో. ఏమన్నా అంటే వైఫై ఉంది కదే ఇంట్లో, ఇంకా డేటా ఎందుకు అంటారు. పవర్ పోతే ఎలా అప్పుడు అర్ధం చేసుకోరూ! వైఫై ఏదో ప్రాబ్లెమ్ వచ్చినట్టుంది చూసి చావండి ఒకసారి." అంటూ తలకొట్టుకుంటూ అరుస్తోంది ఐరా అని పిలిపించుకునే ఐరావతం.


భార్య అరుపులు విన్న పురుషోత్తం హడావిడిగా వచ్చాడు. తన ఫోన్ చూసాడు, మెయిల్స్ చెక్ చేసుకున్నాడు. వైఫై బాగానే ఉంది. మరి ఏమయ్యిందబ్బా అనుకుంటూ, భార్యని అడిగాడు.


"ఏమయ్యిందేమిటి వాట్సాప్ లో మెసేజెస్ వెళ్ళట్లేదు. కనీసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ కావట్లేదు. ఒకసారి చూడవయ్యా బాబూ!" అంది.


"వాట్సాప్ రావట్లేదా?" అంటూ తన మొబైల్ మరోసారి తీసి, వాట్సాప్ చూసుకున్నాడు. నిజమే, ఐరా చెప్పినట్టు వాట్సాప్ పని చేయట్లేదు. "ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చి ఉంటుందేమో, పోనీలే ఈలోపు భోజనం చేద్దాం రా ఐరా! తొమ్మిది దాటింది. కడుపులో ఎలుకలు, పిల్లులు కూడా పరుగెడుతున్నాయి" అన్నాడు పురుషోత్తం.


"అబ్బా ఉండండి, అసలే మంచి రసపట్టులో ఉండగా వాట్సాప్ పోయింది. మిస్ అయిపోతున్నానే అన్న టెన్షన్ తో నేను చస్తుంటే, మీ గోల ఏంటండి? ఆకలట ఆకలి. కాసేపు ఆగలేరా?" తిరుగు టపా ల పురుషోత్తం మీదకి వచ్చింది.


"ఐరావతం, ఏమిటే ఆ మాటలు, రసపట్టు ఏంటే నీ మొహం. అయినా అసలే బీపీ, షుగర్ రెండు కళ్ళలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే, ఇంకా లేట్ గా తింటే, టాబ్లెట్ వేసుకోకపోతే ఆ రెండూ యుద్ధానికి దిగుతాయే!" అన్నాడు ఏడుపు మొహంతో.



"ఆహ్ ఏం పర్వాలేదు కాస్త ఆగండి, అవి యుద్ధానికి వస్తే నా దగ్గర ఆయుధాలు ఉన్నాయిలే. అసలే వాట్సాప్ లో మెస్సేజీలు వెళ్ళక నేను చస్తుంటే, విసిగించకండి. కారణం ఏమిటో కనుక్కుని ఏడవండి" ఈసడింపులా అంది.


భార్యని కదిలించే ధైర్యం చెయ్యలేని పురుషోత్తం ఆకలితో నకనకలాడుతూ ఉన్నా, నోరు మెదపలేదు. తన వంటల్ని మొదట "నా వంట-తింటే తంటా" అనే వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో పెడితే కానీ ఆ దేవుడికి కూడా నైవేద్యం పెట్టని ఐరా, పతి దేవుడి పాట్లు పట్టించుకోకుండా ఫోన్ వంకే తదేకంగా చూస్తూ ఉండిపోయింది.


ఇంతలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాలు ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయాయని తెలిసిన పురుషోత్తం, "చచ్చాం పో! ఇక ఈ రాత్రికి ఆకలితో పడుకోవాల్సిందే, సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్ అంటూ పాటలు పాడుకుంటూ, పస్తులుండాల్సిందే, ఈ రాత్రికి నాకు జాగారమే! అంతా నా ఖర్మ!

ఏమండీ మీరు ఆఫీసుకి వెళ్లిపోతే,

నాకు కొడుతుంది బోరు బోరని

నా పెళ్ళాం ముద్దుగా అడిగితే

ముచ్చటగా కొని తెచ్చాను స్మార్ట్ ఫోను,

ఇప్పుడు అదే చేసింది నా కొంప కొల్లేరు!" అనుకుంటూ క్షుద్బాధ ని మర్చిపోయేలా రాగాలాపన చేస్తూ ఉండిపోయాడు పురుషోత్తం.


తెల్లార్లు ఆకలితో, ఫోన్ వంక మార్చి మార్చి చూస్తూ వాట్సాప్, ఫేస్బుక్ ఎప్పుడు పనిచేస్తాయా అని ఎదురుచూస్తూ గడిపేసింది ఐరా. తెల్లారి 4 దాటగానే ట్రింగ్ ట్రింగ్ అని మోగిన ఫోన్ మెస్సేజి శబ్దానికి నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి, ఫోన్ చూసుకుని, వాట్సాప్, ఫేస్బుక్ పని చేస్తున్నాయని గ్రహించి,,

"యాహూ, హుర్రేయ్, యురేకా సకమికా" అంటూ లేచి డాన్స్ చెయ్యటం మొదలు పెట్టింది ఐరా.


ఇంట్లో సామాన్లు అన్నీ దబదబా పడిపోతున్న శబ్దాలు రావటంతో, కంగారుగా లేచి, లేడి పిల్ల సారీ లేడి తల్లిలా గెంతులేస్తున్న భార్యని చూసి దడుచుకుంటూ, "ఏమిటే ఐరా, పూనకం గాని వచ్చిందా ఏమిటి ఈ వేళప్పుడు ఆ గెంతులేంటి?" అనడిగాడు.


"అబ్బే అదేం లేదండి. వాట్సాప్, ఫేస్బుక్ తిరిగి పని చేస్తున్నాయహో.. హో..హో..!" అంటూ ఇల్లదిరేలా అరిచింది.


"హమ్మయ్య, సంతోషం కదా! అయితే ఈ సంతోష సమయంలో కాస్త త్వరగా లేచి, పాయసం చేసిపెట్టు, ఆయాసం వచ్చేలా తినేద్దాం. అసలే రాత్రి పస్తు పడుకున్నాము" అంటూ పొట్ట తడుముకున్నాడు.


"ఆ, ఆ పప్పులేమి ఉడకవు. మీరు రాత్రి వంటింట్లోకి నక్కి నక్కి వెళ్లి నెమ్మదిగా పప్పన్నం, పెరుగన్నం తినటం నేను చూడలేదనుకున్నారా? పాయసం కాదు కాని, ఈ పూటకి చక్కెర కాఫీ పెడతా, సరి పెట్టుకోండి" అంటూ లేచింది ఐరా.


"చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంటే ఇదే, ఏం చేస్తాం, తప్పదు కదా!" అంటూ పంచదార కాఫీ కోసం ఎదురుచూడసాగడు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు పరిమళ. పరిమళ కళ్యాణ్ పేరుతో కథలు, కవితలు రాస్తూ ఉంటాను. ఇప్పటివరకూ ప్రతిలిపి, మొమ్స్ప్రెస్సో లాంటి సోషల్ ఆప్స్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లోనూ అనేక కథలు రాసాను. తపస్విమనోహరం అనే కొత్త వెబ్ మ్యాగజైన్ కి కూడా కథలు అందిస్తున్నాను. ఈ మధ్యనే పత్రికలకి కథలు పంపటం మొదలు పెట్టాను. నా కథల్లో ఒకటి స్నేహ వార పత్రికలోను, భూమిక మరియు మాలిక వెబ్ పత్రికల్లో ఒక్కొక్క కథ ప్రచురితం అయ్యాయి. కథలే కాకుండా కవితలు, పేరడీ పాటలు కూడా రాస్తూ ఉంటాను. హస్యానందం పత్రికలో పేరడీ పాటల పోటీలో నా పాట బహుమతి గెలుచుకుంది. అలాగే ఆడియో కథలు కూడా చేస్తూ ఉంటాను. అలాగే నాకు దొరికిన కథలు అన్నీ చదువుతూ ఉంటాను.





39 views0 comments
bottom of page