top of page
Original.png

యశోదా కృష్ణ

1 hour ago
4 min read

యశోదమ్మను ప్రేమగా కౌగిలించుకున్న బాలకృష్ణుడు – యశోదా కృష్ణ కథ

Yasodha Krishna - Telugu Emotional Story | Varalakshmi Yanamandra

యశోదా కృష్ణ - తెలుగు భావోద్వేగ కథ | వరలక్ష్మి యనమండ్ర  

Published in manatelugukathalu.com on 22/09/2026


యశోదా కృష్ణ కథలో తల్లి–కొడుకుల మధ్య ఉన్న అపూర్వమైన మమతానుబంధాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు వరలక్ష్మి యనమండ్ర. కన్నయ్య అల్లరి, యశోదమ్మ ఆప్యాయత, అలక, ఆవేదనల మధ్య సాగిన ఈ కథలో భక్తితో కూడిన మాతృప్రేమ కనిపిస్తుంది. కృష్ణుడు దేవుడైనా, యశోదమ్మకు మాత్రం తన చంటి బిడ్డే అనే భావన కథకు ప్రత్యేకమైన భావోద్వేగాన్ని అందిస్తుంది. చివర్లో కల రూపంలో వచ్చే మలుపు కథకు మరింత మధురమైన ముగింపును ఇస్తుంది.


"ఎందుకమ్మా! అలా దిగులుగా ఉన్నావు?" అడిగాడు కృష్ణయ్య.


"ఏమీ లేదు కన్నయ్యా!" అన్నది యశోద.


"ఏం కాదు, చెప్పమ్మా! ఎప్పుడూ హుషారుగా ఉండే నువ్వు ఇలా ఉంటే నేను తెలుసుకోలేనా అమ్మా?" అన్నాడు కన్నయ్య.


"ఏమీ లేదులే కానీ, వెన్న తిందువు రా నాన్నా!" అన్నది యశోద.


"పెట్టు అమ్మా!" అన్నాడు కన్నయ్య.


"ఏంటి నాన్నా, కొంచెమే తిన్నావు? ఇంకా జున్ను, మీగడ ఉన్నాయిరా కన్నయ్యా!" అంది యశోద.


"అమ్మా! ఇందాక నా స్నేహితులతో వాళ్ళ ఇంట్లో తిన్నానమ్మా!" అన్నాడు కన్నయ్య.

కళ్ళ వెంట నీళ్ళు గిర్రున తిరిగాయి ఆ తల్లికి.


"ఏంటమ్మా, నువ్వు పెట్టింది తినకపోతే ఇలా ఏడ్చేస్తావా?" అన్నాడు కన్నయ్య.


"ఏమీ లేదు కన్నయ్యా! నా కంట్లో నలక పడింది" అన్నది యశోద.


"అబద్ధాలు చెప్పలేవమ్మా నువ్వు" అంటూ అమ్మకి, వెన్నకన్నా కమ్మని ముద్దొకటి ఇచ్చాడు, ఆ చిచ్చర పిడుగు.


అమ్మ బాధంతా 'ఉఫ్' మని ఎగిరిపోయింది.


మరునాడు సాయంత్రం

"అమ్మా!" అంటూ పరుగున వచ్చాడు కన్నయ్య.


"నాన్నా, స్నానం చేద్దువు రా కన్నయ్యా!" పిలిచింది యశోద.


"అమ్మా, ఇందాక నా స్నేహితులతో కలిసి కాలువలో ఈతకొట్టి స్నానం చేసి వచ్చానమ్మా!" అన్నాడు కన్నయ్య.


'నా చిన్ని కన్నయ్యకు స్నానం చేయించే భాగ్యమే కరువైంది. ఒళ్ళంతా ఎంత మురికి ఉన్నదో... చక్కగా రుద్ది స్నానం చేయిద్దామనుకున్నాను' యశోద అనుకుంది మనసులో. కానీ బయటికి కన్నీళ్ళు వచ్చేసాయి.


గడుగ్గాయికి అమ్మని బాధపెట్టడం ఇష్టంలేక అమ్మతో స్నానం చేయించుకున్నాడు.

ఒకరోజు ఉదయం వెళ్ళిన కన్నయ్య సాయంత్రం వచ్చాడు.

"ఏంటి నాన్నా! ఎక్కడికెళ్ళావు?" అని యశోద అడిగింది.


"అమ్మా, స్నేహితులతో ఆడుకుని వస్తున్నాను" అన్నాడు.


"అదేంటి? ఆ పక్కింటి వాళ్ళు నువ్వాళ్ళింటికి వెళ్ళి, వాళ్ళు దాచుకున్న వెన్న, జున్ను, పాలు తాగి, పారబోసావని ఇందాకే చెప్పి వెళ్ళారు. నిజం చెప్పరా నాన్నా!" అని నిలదీసింది కళ్ళొత్తుకుంటూ యశోద.


"అమ్మా! నువు నమ్మావా వాళ్ళమాటలు? నా మనసు నీకు తెలియదా?" అంటూ, గోముగా యశోద మెడ చుట్టూ చేతులు వేసాడు.


ఇంకేముంది, కోపమంతా వెన్నలా కరిగిపోయింది.

"మా అమ్మ మంచిది!" అనుకుంటూ, గెంతుతూ వెళ్ళాడు కన్నయ్య.


ఇలా ప్రతిసారీ యశోదమ్మను మరపిస్తున్నాడు, మురిపిస్తున్నాడు అల్లరి కన్నయ్య.

"కన్నయ్యా!" అంటూ, కోపంగా పిలిచింది యశోద.


కన్నయ్య భయంభయంగా వచ్చాడు.


"చాలించరా నీ నటన. నేను నమ్మను నీ వేషాలు. ఎక్కడెక్కడికి వెళ్ళావు? ఏం చేసావు? చెప్పు!" అని నిలదీసింది యశోద.


"అమ్మా, నేనేమీ చెయ్యలేదమ్మా!" అంటూ బావురుమన్నాడు కన్నయ్య.


"అందుకే ఎక్కడికీ వెళ్ళకు నాన్నా! 'అన్నతో ఆడుకో' అని చెబుతాను. నువ్వేమో అమ్మ మాట వినవు" అంటూ, కళ్ళనీళ్ళు పెట్టుకుంది యశోదమ్మ.


"కన్నయ్యా!" అని పిలిచింది అమ్మ.


"కన్నయ్యా, పిలిచాను. వినపడలేదా? వినిపించుకోలేదా?" అంటూనే బావురుమన్నది యశోదమ్మ.


"ఎందుకమ్మా! అంతలా ఏడుస్తున్నావు?" అన్నాడు కన్నయ్య, ప్రేమగా.


"నీవు నన్ను మర్చిపోయావు. పిలిచినా వినిపించుకోవడం లేదు నాన్నా!" అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడ్చేసింది యశోదమ్మ.


"అమ్మా! నేను ఎక్కడికీ వెళ్ళనమ్మా నిన్నొదిలి. నువ్వంటే నాకు అంత ఇష్టం! నీకూ తెలుసు. కానీ ఒక్కసారి పిలవగానే పలకకపోతేనో, అనుకోగానే నీ కంటికి కనపడకపోతేనో, నువ్వు పెట్టిన వెన్న, జున్ను, అన్నం మొత్తం తినకపోతే నీకు చెప్పరాని అసంతృప్తి. నేనంటే వల్లమాలిన ప్రేమ నీకు. అందుకే అంతలా బాధపడతావమ్మా!" అన్నాడు కన్నయ్య.


"పెద్ద ఆరిందాలాగా పెద్ద పెద్ద మాటలు, పనులు నీకు. ఉండు, ఎంత దిష్టి తగిలిందో నా కన్నమ్మకి" అని, కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళి, ఉప్పు తీసుకువచ్చి, దిష్టి తీసింది యశోదమ్మ.


"అమ్మా! నువ్వు, నేనేగా ఇక్కడ ఉన్నది. దిష్టి ఎవరు పెడతారమ్మా? ఏయ్ యశోదా! నీమీదే నీకు అనుమానం. పిచ్చి తల్లీ!" అని, మెడచుట్టూ చేతులు వేసి ముద్దిచ్చాడు.


ఇంకేముంది, మురిసిపోయింది ఆ తల్లి.

"చాలించరా నీ వేషాలు! వద్దన్న పనులన్నీ చేస్తావు. ఆవులను కాస్తావు, స్నేహితులంటావు. ఆడ మగ భేదం లేదు నీకు. అసలు ఆడపిల్లలతో ఎందుకురా నీకు? నీ వయసేమిటి, వాళ్ళ వయసేమిటి? వాళ్ళు నీ మీద లేనిపోని చాడీలు చెబుతున్నారు కన్నా! అది భరించలేక పోతున్నాను. అందుకే నిన్ను ఈరోజు కట్టేస్తానురా!" అంటూ, చెవి మెలిపెట్టింది యశోద.


"అమ్మా!" అంటూ నోరు తెరిచాడు కన్నయ్య. అంతే, అమ్మకి కన్నయ్య తాను ఎవరో ఆ చిన్ని నోటిలోనే చూపించేసాడు!


"నా కన్నయ్యా!" అంటూ, తనని తాను మరచిపోయింది.


"నా కన్నయ్యా! నా కన్నయ్యా!" అని అంటూనే ఉన్నది.


ఆడుకుని ఇంటికి వచ్చిన కన్నయ్య, "అమ్మా!" అంటూ పిలిచాడు.


"ఏంటి నాన్నా?" అన్నది యశోద.


"'మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనౌతాయి' అంటే ఏంటమ్మా?" అంటూ గారంగా అడిగాడు అల్లరి కన్నయ్య గోముగా.


"ఏమో నాయనా! నాకు తెలియదు" అంది మరల కళ్ళనీళ్ళతో యశోదమ్మ. 'నేనే అనేక సార్లు అలా అనుకున్నాను మనసులో! ఎప్పుడో పైకే అన్నాను కాబోలు. విని తెలియనట్లుగానే అడిగాడు దొంగ కన్నయ్య' అనుకున్నది యశోదమ్మ.


"అమ్మా! మంది ఎక్కువైనా మజ్జిగ పల్చబడదమ్మా. నువ్వు ఎక్కువగా ఆలోచించకమ్మా. ఈ కన్నయ్య నీ కన్నయ్యే అమ్మా! ఎంత ప్రేమ పంచుతున్నావ్ నువ్వు. అదంతా నా అదృష్టమేగా అమ్మా! నీ ప్రేమామృతం నాకే స్వంతం అమ్మా. అది అమరం... అమ్మా!" అన్నాడు కన్నయ్య.


"నాన్నా! నీవు నన్ను పలకరించకుండా ఉన్నా, అమ్మా అని పిలవకపోయినా ఈ తల్లి తల్లడిల్లిపోతోందిరా. నువ్వు దేవుడివైనా, నాకు చంటి వాడివేరా. నువ్వు 'అమ్మా'... అనగానే ఉదయం నుండి నీ కోసం ఏమేమి మాట్లాడాలనుకున్నానో, నిన్నెన్ని తిట్టాలనుకున్నానో - అన్నీ మర్చిపోతానురా! నిన్ను చూస్తూ ఈ తనువు చాలించినా ఫర్వాలేద అనిపిస్తుంది. కానీ, అలా చెయ్యను. నీతో 'అమ్మా, అమ్మా' అని పిలిపించుకోవాలని బతుకుతాను కన్నయ్యా!" అని బావురుమంది ఆ తల్లి.


ఇద్దరూ ఆ మమతానుబంధపు సంద్రంలో మునిగి, ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. వారే యశోదాకృష్ణులు.


"మజ్జిగేంటీ? పల్చనేంటీ?... 'కన్నయ్యా, కన్నయ్యా' అంటూ ఏంటే ఆ అరుపులు?" అని ఒక్క చరుపు చరిచింది దేవకి, యశోదను.


"నీ పేరెంత యశోదైతే మాత్రం రోజూ 'కన్నయ్యా! కన్నయ్యా' అంటూ ఆ కలవరింతలేంటే బాబూ? నీవు కృష్ణభక్తురాలవే కావచ్చు తల్లీ! లే ఇక! కాలేజీ టైమ్ అయింది" అని, నిద్రలేపింది స్నేహితురాలిని దేవకి.


"ఎంత బాగుంది. ఇది కలలా లేదు! ఎంత అదృష్టం నాది కన్నయ్యా!" అనుకున్నది, మనసులో యశోద.


 ***



వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



వరలక్ష్మి యనమండ్ర

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర

పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర 

కలం పేరు: లేదు

స్వస్థలం: అద్దంకి,‌ప్రకాశం జిల్లా

ప్రస్తుత నివాసం: హైదరాబాద్ 

వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని 

విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.


ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు


1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి) 

2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి) 

3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి) 

        తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది. 

కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం

4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి) 

5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)

6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక) 

          (400 ఆటవెలది పద్య సంపుటీ)

   7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు) 


అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి. 


పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు 

కొన్ని సమూహాలను నిర్వహణ,‌ కొన్ని సమూహాలలో సమీక్షణం 

యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను 



నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,‌బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.


ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.


జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం. 







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page