top of page

ఎ టు జెడ్ సర్వీసులు


'A To Z Services' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'ఎ టు జెడ్ సర్వీసులు' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

మంగరాజు కి చాలా చిరాకుగా ఉంది. నాలుగు రోజుల క్రితం వెళ్ళిన ఇంటర్వ్యూ కి సెలక్ట్ కాలేదని ఇప్పడే మెసేజ్ వచ్చింది. ఇది ఎనిమిదో ఇంటర్వ్యూ.


ఛ, ఎందుకిలా జరుగుతోంది? అసలు తనకి ఉద్యోగం చేసే యోగం లేదా? కానీ, పెద్ద ఉద్యోగం తనని వెతుక్కుంటూ వస్తుందని, మొన్న బుధవారం సంతలో 'చిలక జోస్యం ' వాడు చెప్పాడుగా. అదీ గాక, బామ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, 'మా రాజు గాడు కలెక్టర్ ఉద్యోగం చేస్తాడు, వంశం పరువు నిలబెడతాడని '.


కలెక్టర్ కాదు కదా, గుమాస్తా ఉద్యోగం కూడా తనకు దక్కడం లేదు. ఏం చేయాలి?


అక్కడికీ, పంతులు గారు చెప్పినట్లు, తొమ్మిది రోజులు 'నవ గ్రహాల గుడి ' చుట్టూ, తొమ్మిది ప్రదక్షిణలు చేసాడు.


ఎనిమిదో రోజున, తన క్లాస్మేట్ వెన్నెల కనిపించి, 'ఏమిటి రాజూ, త్వరగా పెళ్లి కావాలని మొక్కుకుంటున్నావా? ' అని అడిగింది.


డిగ్రీ పూర్తి కాగానే ఆమెకి పెళ్లి కావడం, ఇద్దరు పిల్లలు పుట్టడం, మన శాస్త్రవేత్తలు చంద్రమండలానికి రాకెట్ పంపి, అగ్ర దేశాల ముందు 'కాలర్ ' ఎగరేసినంత స్పీడ్ గా జరిగిపోయింది. వెన్నెల మాటలకి సిగ్గుపడి, ఏమి చెప్పాలో తెలియక ఓ వెర్రి నవ్వు నవ్వాడు మంగరాజు. తనకేసి ఓ జాలిచూపు విసిరి, విజయగర్వంతో చిన్న కొడుకుని నడిపించుకుంటూ శివుడి గుడిలోకి వెళ్ళిపోయింది వెన్నెల.


ఆ చూపులో 'పోరా బడుద్ధాయ్, నాకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో, పెళ్ళీ జరిగింది, ఇద్దరు పిల్లలూ పుట్టారు. నువ్వింక ఇంతే! ' అన్న భావన స్పష్టంగా కనిపించి, పదవ తరగతి పరీక్షలలో ఒక్క సబ్జెక్టు మాత్రమే పాసైన విద్యార్ధిలా విల విల లాడిపోయాడు మంగరాజు.


ఏమైనా సరే, ఏదో ఒక ఉద్యోగం సంపాదించి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడతానని 'నవగ్రహాల '

సాక్షిగా 'ప్రమాణం ' చేసాడు మంగరాజు.


గోడ గడియారం కేసి చూశాడు. టైం పది గంటలు అయ్యింది. తండ్రి ఆఫీసుకి, తల్లి పక్కింటి పిన్ని గారికి ఒడియాలు పెట్టడంలో సాయం చేసేందుకు వెళ్ళారు.


చిరాగ్గా ఉండి టీవీ ఆన్ చేసాడు మంగరాజు. ఆరోజు బాపు గారి పుట్టిన రోజు. 'ముత్యాల ముగ్గు ' సినిమా వస్తోంది. రావు గోపాలరావు, మాడా వెంకటేశ్వర రావు సంభాషణలు విని చాలా సేపు నవ్వుకున్నాడు.


హఠాత్తుగా అతని మనసులో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.

అవునూ, తను ఉద్యోగం కోసం తిరగడం కంటే, తనే నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగి, 'అబ్బా, మంగరాజు ఎంత గొప్పవాడురా! ' అని అందరి మన్ననలు పొందాలి అని గట్టిగా 'ముత్యాల ముగ్గు ' సినిమా సాక్షి గా నిర్ణయించుకున్నాడు మంగరాజు.


వెంటనే తన ప్రాజెక్టుకి ఏమేం కావాలి? ఎంతమంది కావాలి? ఎంత డబ్బు కావాలి? అని ఒక కాగితం మీద బడ్జెట్ వేసుకున్నాడు మంగరాజు. అదిచూసి, పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటిఆటకే టికెట్ దొరికిన అభిమాని లా మొహం వెలిగిపోయింది.


'యాహూ ' అని గట్టిగా అరిచి, ఈ శుభ సందర్భంగా తీపి తినాలని, వంటింట్లోకి వెళ్ళి, డబ్బా లోంచి చిన్న బెల్లం ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నాడు మంగరాజు.


**********

గాంధీనగర్ రెండో వీధిలోని ఆ డాబా ఇంటిముందు ఉన్న బోర్డు, వీధిలోంచి వెళ్ళేవారిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ఎ టు జెడ్ సర్వీసులు '. రండి. మీకు ఏరకమైన సేవలు అందించడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం. ఒకసారి మా సేవలు పొందిన మీరు ఎన్నటికీ మమ్మల్ని మరువరు. మా వెంట పడుతూనే ఉంటారు, పీచు మిఠాయి అమ్మేవాడి వెనుక పడే పిల్లాడిలా, పడుచుపిల్ల చుట్టూ తిరిగే కుర్రాడిలా. అదీ, మా ప్రత్యేకత. సంప్రదించండి.


ఎం. ఎం. రాజు, ఎం. ఏ. ,

డైరెక్టర్. '


డాబా ముందుభాగంలో పెద్ద వరండా ఉంది. నాలుగు పేము కుర్చీలు, ఒక టీపాయ్ ఉన్నాయి. గుమ్మం దాటి లోపలకు వెళ్ళగానే ఉన్న హాలులో, రెండు టేబుళ్ళు, వాటి మీద రెండు లాప్ టాప్ లు, వాటిని తమ సుకుమారమైన చేతి వేళ్ళతో ఆపరేట్ చేసే ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు.


వరండాలో, తెల్లని పంచె, లాల్చీ, భుజాన కండువా వేసుకుని ఒకాయన తేగబద్ద నములుతూ అటూ ఇటూ తిరుగు తున్నాడు. నగేష్, ఆయన దగ్గరకు వచ్చి 'నమస్కారం సార్ ' అన్నాడు.


ఆయన నగేష్ కి కుర్చీ చూపించి 'కూర్చోండి. మీకు ఏరకమైన సేవలు అందించడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం' అని ఎయిరిండియా వాళ్ళ బొమ్మ లా కొద్దిగా తలవంచి అన్నాడు. ఆయన ఒక చేతిలో తేగబద్ద ఉంది, రెండో చేతిలో బీడీ ఉంది. అవి చూసి ముందు కంగారుపడినా, అంతటి పెద్దాయన తనని అలా గౌరవించినందుకు ఆనందపడ్డాడు నగేష్.


"ఆ.. ఏం లేదండీ. ఈమధ్య మా ఆవిడ నేను ఆఫీసుకు వెళ్ళాకా, బయటకు వెళ్లి ఎవరినో కలిసి వస్తోందని నా అనుమానం. వాడెవడో కనిపెట్టి, వాడి వివరాలు నాకు చెప్పండి" అన్నాడు నెమ్మదిగా నగేష్.

"అంటే ఒకడేనా? ఇంకా ఉన్నారా? " కళ్ళు పెద్దవి చేసి నగేష్ కేసి తిరిగి అన్నాడు ఆయన. ఆ మాటలకు ఖంగు తిన్నాడు నగేష్. తను అనుకున్నట్టు ఒకడు కాదా? ఇంకా ఉన్నారా? అని ఆలోచనలో పడ్డాడు. అతని మొహం చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఆయన. చేప గాలానికి చిక్కిందని ఆనందపడ్డాడు.


"ఆ.. చూడండి. ఒక మనిషే అయితే ఒక రేటు, ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకో రేటు ఉంటుంది. లోపల మా సెక్రటరీ ఉంటుంది. ఆవిడకు అడ్వాన్స్ కట్టండి. మీ అడ్రస్, మీ ఆవిడ ఫోటో సెక్రటరీకి ఇవ్వండి. మా కిట్టిగాడ్ని పంపి మూడు రోజుల్లో మొత్తం వివరాలు కూపీలాగి మీకు చెబుతాం. ఆ.. ఇంకో సంగతి.." అని తేగబద్ద తినేసి చేతులు దులుపుకున్నాడు ఆయన.


'ఏమిటి?' అన్నట్టు ఆయన వైపు ఆసక్తిగా చూసాడు నగేష్. ఆయన భుజం మీద కండువా ఒకసారి తీసి మళ్ళీ వేసుకున్నాడు. లాల్చీ జేబులోంచి దువ్వెన తీసి తల దువ్వి మరలా దువ్వెనని జేబులో పెట్టుకున్నాడు. 'కార్తీకదీపం ' సీరియల్ ఆఖరి ఎపిసోడ్ లో, ఏం జరుగుతుందోనని ఆతృతగా టీవీ చూస్తున్న ఆండాళమ్మ గారిలా ఆయనకేసే చూస్తున్నాడు నగేష్.


"అంటే, ఏం లేదండీ. యవ్వారం ఎటు తిరిగి ఎటు వచ్చినా, మీ భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారనుకోండి. మీకు మంచి సంబంధం చూసి రెండో పెళ్లి కూడా మేమే చేస్తాం. ఆ సర్వీసులో మీకు ఏభై శాతం తగ్గింపు ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు లోపలికి వెళ్లి డబ్బు కట్టేయండి" అన్నాడు ఆయన. ఆ మాటలకు పూర్తిగా మతిపోయింది నగేష్ కి. కీ ఇచ్చిన బొమ్మలా నెమ్మదిగా లోపలకు వెళ్ళాడు.


టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న, లిప్ స్టిక్ సుందరి

పళ్లు కనపడేలా చిరునవ్వు నవ్వి 'రండి సార్, మీ సేవకు సదా సిద్ధం' అంది. సదా అంటే, ఎల్లప్పుడూ అనా, లేక ఈమె పేరు 'సదా' యా, అని తికమక పడుతూ, ఆమె పేరు ఎక్కడైనా కనపడుతుందా? అని టేబుల్ అంతా పరిశీలనగా చూసాడు నగేష్.


లిప్ స్టిక్ సుందరి మరోసారి నవ్వి, తన కోటు సరిచేసుకుంది. అప్పుడు కనపడింది ఆమె కోటుకున్న నేమ్ ప్లేట్ మీద 'మిస్ ప్రియాంక ' అని.


'హమ్మయ్య' అని స్థిమిత పడి, ఆమెకి తన అడ్రస్ చెప్పి, అటూ ఇటూ చూసాడు.


'మీరేమీ కంగారు పడకండి. మీ కేసు పూర్తి అయ్యేవరకూ ఇంకొకళ్ళు లోపలకు రారు. మీ రహస్యాలన్నీ నాతో చెప్పుకోవచ్చు. నేను ఎవరికీ చెప్పను. నా గుండెల్లో దాచుకుంటాను' అని, తన కుడిచెయ్యి గుండెలమీద వేసుకుని 'హామీ' ఇచ్చింది.


సుకుమారమైన ఆమె చేతివేళ్ళు చూసి ముచ్చట పడి నా, తర్వాత 'కర్తవ్యం 'గుర్తుకు వచ్చి, జేబు లోంచి భార్య ఫొటో తీసి ఆమె కిచ్చాడు.


ప్రియాంక ఆమె ఫొటో చూసి 'మీ మేడమ్, చాలా అందంగా ఉన్నారు' అని చిన్నగా నవ్వింది. 'హూ.. ఆ అందమే నా కొంప ముంచుతోంది' అని మనసులో గొణుక్కున్నాడు నగేష్.


'విషయం సార్ కి చెప్పాను. ఎంత కట్టాలి?' అన్నాడు నగేష్. ప్రియాంకకి విషయం అర్ధం అయింది.


'ఇరవై వేలు కట్టండి. పని పూర్తి అయ్యాక మిగతా బాలెన్స్ కడుదురు గాని' అంది.


నగేష్ ఇరవై వేలు ఆమెకిచ్చాడు. ప్రియాంక ఓ బౌండు పుస్తకం తీసుకుని, అందులో నగేష్ పేరు రాసి, ఇరవై వేలు జమకట్టుకుంది. నగేష్ 'థాంక్స్' చెప్పి వరండాలో ఆయనకు ఇంకో నమస్కారం పెట్టి వెళ్ళి పోయాడు.


అరగంట తర్వాత ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు వరండాలో ఆయన దగ్గరకు. వాళ్ళని చూసి చిన్నగా నవ్వి 'రండి.. మీ వాళ్ళు వెనకాల వస్తున్నారా?' అన్నాడు ఆయన.


'వెనకాలా లేదు.. ముందూ లేదు. మేమే ఓ పనిమీద మీ దగ్గరకు వచ్చాం' అన్నాడు డుంబు చిరాగ్గా.


అతని మాటలకు ఖంగు తిన్నా, వెంటనే సర్దుకుని, పిల్లల్ని మంచి చేసుకోవాలని, 'తేగ తింటారా? అమలాపురం నుంచి తెప్పించాను. బాగుంటాయి 'అని రెండు తేగలు తీసాడు టీపాయ్ మీద నుంచి.


'పొద్దున్నే తేగలేమిటి, అసహ్యం గా. ఏ పూరీలో, పెసరట్లో తినాలి గానీ' అన్నాడు డుంబు చిరాగ్గా. ఆయన మరోసారి ఖంగు తిన్నాడు.


'సరే గానీ, మీ పనేమిటి?' గంభీరంగా అడిగాడు.


డుంబు పక్కన ఉన్న పండు తో, 'ఏరా, ఒక కాలు తీయించేద్దామంటావా?' అని అన్నాడు.


'ఉహూ.. కాలు తీసేసినా కుంటు కుంటూ వస్తాడు' అన్నాడు పండు.


'అయితే శాల్తీయే లేపేద్దాం. గొడవ వదిలిపోతుంది' అన్నాడు డుంబు.


'అంతే.. అదే కరెక్టు' అన్నాడు పండు.


అప్పుడు డుంబు, ఆయన కేసి తిరిగి 'ఒక మనిషిని లేపేయాలి. ఎంతవుతుంది?' అన్నాడు సీరియస్ గా.


ఆయన చిన్నగా నవ్వి 'ఏం బాబూ, స్కూల్ లో దెబ్బలాడుకున్నారా? రెండు మూడు రోజుల్లో అవే సర్దుకుంటాయి. దానికోసం ఇలా పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు' అన్నాడు.

'మా పిల్లల వ్యవహారం అయితే, మేమే చూసుకుంటాం. ఇది పెద్దల గొడవ. అందుకే మీ దగ్గరకు వచ్చాం' అన్నాడు డుంబు.


ఆ మాటలకు ఆయన కళ్లు పెద్దవి చేసుకుని డుంబు కేసి చూశాడు. అదిచూసి డుంబుకి చిరాకేసింది.


'ఇంత చిన్న విషయానికే అలా నిలువు గుడ్లేసుకుని చూస్తున్నారు. ఈపని మీ వలన కాదా? చెప్పండి. ఇంకో ఏజన్సీ చూసుకుంటాం' అన్నాడు.


'అబ్బే, అదేం కాదు. మేం ఏపనైనా చేస్తాం. ఇంతకీ ఎవరా శాల్తీ?' గంభీరంగా అడిగాడు ఆయన.


'మా లెక్కల మాష్టారు' అన్నాడు చిన్నగా డుంబు.


అది వినగానే నవ్వు వచ్చింది ఆయనకి. కానీ నవ్వితే కుర్రాళ్ళు ఇంకోలా మాట్లాడతారని ఆగిపోయాడు. 'ఇంతకీ ఆ మాష్టారు మీకేం అపకారం చేసారు?' అడిగాడు.


'హు.. మా మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా పదవతరగతి వాళ్ళని ఎక్కాలు అప్పచెప్ప మంటారా?' సీరియస్ గా అడిగాడు డుంబు. ఆయన బుర్ర అడ్డంగా ఊపాడు.


'అవును కదా. మరి మా లెక్కల మాష్టారు పదిహేడో ఎక్కం అప్పచెప్పమన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఎక్కం ఇప్పుడు ఎలా గుర్తుకు వస్తుంది? పోనీ మీరు అప్పచెప్పండి' అన్నాడు డుంబు.


అతను అలా అడిగేసరికి అయన ఇబ్బంది పడ్డాడు. అయినా ప్రయత్నం చేద్దామని 'ఒక పదిహేడు.. పదిహేడు, రెండు పదిహేడులు ముప్ఫై నాలుగు, మూడు పదిహేడులు..' అని గుర్తు రాక ఆగిపోయాడు ఆయన.


వెంటనే డుంబు 'పెద్దాయన మీరే చెప్పలేకపోయారు. చిన్న పిల్లలం, మేం ఎలా చెప్పగలం?' అన్నాడు.


'అవునవును..' అన్నాడు ఆయన.


'పదిహేడో ఎక్కం అప్పచెప్పలేదని నన్ను, పండుని రెండు రోజులు గోడ కుర్చీ వేయించారు మాష్టరు. అదీ ఆడపిల్లల ముందు. హు.. మాకు చాలా అవమానం జరిగింది. అందుకే మాష్టారుకి శిక్ష వేయాలని నిర్ణయించాము. ఆ శాల్తీ ని లేపేయడానికి ఎంతవుతుంది?' అడిగాడు డుంబు సీరియస్ గా.


ఆయన చేతివేళ్ళు మడిచి లెక్క వేసి 'ఒక లకారం వరకూ అవుతుంది బాబూ' అని అన్నాడు.


అది విని, పండు, డుంబు ని పక్కకు తీసుకు వెళ్ళి గుస గుస లాడాడు. రెండు నిముషాలు అయ్యాకా డుంబు ఆయన దగ్గరకు వచ్చి, 'మన టౌనులో ఆరుగురు లెక్కల మాష్టార్లు ఉన్నారట. మిగతా స్కూళ్లలో పిల్లలు కూడా మాలాగే బాధపడుతున్నారట. అందుకని, ఆరుగుర్నీ లేపేయాలి. ఎంతవుతుంది? మరి మీకు ఇంత 'బిజినెస్'

ఇస్తున్నందుకు మాకు 'కమీషన్'ఎంత?' అని దర్పంగా అడిగాడు డుంబు.


ఆ మాటలు వినగానే, ఆయనకు చెమటలు పట్టాయి. వెంటనే టీపాయ్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గబగబా నీళ్లు తాగాడు.


'ఇది అంత హడావుడిగా చెప్పలేను. ఈ రాత్రి, మా సెక్రటరీ, స్టాఫ్ 'రౌండ్ టేబుల్ సమావేశం' పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. అవును.. మరి అంత డబ్బు మీరు ఎలా ఇవ్వగలరు..' నసుగుతూ అడిగాడు ఆయన.


దానికి డుంబు చిన్నగా నవ్వి 'మా నాన్న పెద్ద కాంట్రాక్టర్. ఆయన ఎ. టి. ఎం. పిన్ నంబర్ నాకు తెలుసు. మనకి 'డీల్' కుదిరితే, డబ్బు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. రెండు రోజుల లో ఇస్తాం. ఇదిగో అడ్వాన్స్' అని వెయ్యి రూపాయలు టీపాయ్ మీద పెట్టాడు డుంబు.


'మీ పేరు?' అడిగాడు ఆయన.


'మా పేర్లు మీకు అనవసరం. నేను 007, వీడు 006. మన డీల్ కుదరగానే, సహం డబ్బు ఇస్తాం. పని పూర్తి అయ్యాక మిగతా సహం ఇస్తాం' అని హుందాగా నడిచివెళ్ళిపోయాడు. అతని వెనుకే పండు కూడా..


పిల్లల అతి తెలివికి మరోసారి ఆశ్చర్యపోయాడు ఆయన. తర్వాత ఇంకో పార్టీ వస్తే, వాళ్ళతో మాటల్లో పడ్డాడు.


*******


వారం రోజులు గడిచేసరికి మంగరాజు 'ఎ టు జెడ్ సర్వీసులు ' బాగా ప్రాచుర్యం పొందింది. అనేక సమస్యలతో వస్తున్న జనాన్ని చూసి 'సమాజంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా?' అని విస్తుపోయాడు.


'నా కుక్కపిల్ల తప్పిపోయింది. వెతికి పెట్ట’మని ఒకాయన వస్తే, ‘మా ఎదురింటి ఆయన కుక్క, చాలా గొడవచేస్తోంది. ఫోన్ మాటాడుకోలేక పోతున్నాం, టి. వి. చూడలేక పోతున్నాం. మీరే మా సమస్య కు, పరిష్కారం చూపాలి’ అని ఇంకో ఆయన వచ్చాడు.


'మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే, కార్పొరేటర్ గారి అబ్బాయి వెంటపడి వేధిస్తున్నాడు. పోలీసు కంప్లైంట్ ఇస్తే, మరింత ఇబ్బంది పడతాం అని భయంగా ఉంది. మా పేరు బయటకు రాకుండా, మీరే వాడికి బుద్ధి చెప్పా’లని ఒకాయన కళ్ళనీళ్ళు పెట్టుకుని చెబితే, చాలా బాధ కలిగింది మంగరాజుకి.


ఆయనకి ధైర్యం చెప్పి, చాకచక్యంగా ఆ సమస్యని పరిష్కరించాడు. ఆరోజు మంగరాజుకి చాలా ఆనందం కలిగింది.


ఏ పనికైనా అడ్వాన్స్ పదివేలు కట్టమంటే, వెంటనే కట్టేసి వెళ్ళి పోతున్నారు. ఇంకో మాట మాట్లాడటంలేదు.


నెల పూర్తి కాగానే లెక్కలు చూసుకున్నాడు ‌మంగరాజు. రౌడీల కిరాయి, పోలీసుల మామూళ్లు, స్టాఫ్ జీతాలు, బాంకు వాయిదా సొమ్ము, బిల్డింగ్ రెంటు పోగా రెండు లక్షలు మిగిలింది. చాలా సంతోషం కలిగింది మంగరాజుకి.


అయితే ఒక్క విషయంలోనే అతనికి ఇబ్బందిగా ఉంది. రోజూ తెల్లజుట్టు విగ్గు పెట్టుకోవడం, పంచె, లాల్చీ కట్టుకోవడం. ఆదాయం బాగుండాలంటే, ఆహార్యం తప్పదని 'ఎడ్జెస్టు ' అయిపోతున్నాడు.


ఒకరోజు నగేష్ ఆవేశంగా మంగరాజు దగ్గరకు వచ్చాడు. 'ఏమయ్యా పెద్ద మనిషీ, ఇలా చేసేవేమిటి? 'అని మంగరాజు లాల్చీ పట్టుకుని అడిగాడు.


అతని పట్టునుంచి విడిపించుకొని 'కూల్.. కూల్.. సార్. సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మా గురువు గారు, గోపాలరావు గారు చెప్పారు. ఏం జరిగింది? ' నవ్వుతూ అడిగాడు మంగరాజు.


'ఇంకెక్కడి శాంతి? నా కొంప కొల్లేరు అయిపోయింది. మా ఆవిడ గురించి ఎంక్వయిరీ చేయడానికి నువ్వు పంపిన 'కిట్టిగాడు ' మా ఆవిడని వలలో వేసుకుని ఉడాయించాడు. నిన్ను.. నిన్ను 'అంటూ మంగరాజు రెండుచెంపలూ వాయించేసాడు.

ఈ హఠాత్సంఘటనకి నివ్వెర పోయాడు మంగరాజు. వెంటనే తేరుకుని 'ఆగండి సార్.. కొట్టకండి. కూల్ డౌన్.. కూల్ డౌన్ 'అని నగేష్ చేయి పట్టుకున్నాడు.


కానీ నగేష్ అతని చేయి విడిపించుకొని మంగరాజుని కొట్టడం మళ్ళీ మొదలెట్టాడు.


మంగరాజు' కొట్టకండి.. కొట్టకండి ' అంటూ అడ్డు పడుతున్నాడు.


"ఒరేయ్.. ఏం చేసావ్? కొట్టకండి.. కొట్టకండి.. అని అరుస్తున్నావ్? "అని మంగరాజు తల్లి గట్టిగా పట్టుకుని కుదిపేసరికి, కళ్ళు తెరిచి వాస్తవంలోకి వచ్చాడు మంగరాజు.


'అమ్మో, ఇది కలా! ' అని నిట్టూర్చాడు మంగరాజు.


తల్లి కేసి తిరిగి, 'అబ్బే, ఏం లేదమ్మా. చిన్న పిల్లలు కుక్కపిల్లని కొడుతుంటే.. కొట్టకండి.. అన్నాను. అంతే 'అన్నాడు మంగరాజు.


'సరేలే, నీ పగటి కలలూ నువ్వూనూ. అన్నం తిందువుగాని రా.. 'అని వంటింట్లోకి వెళ్ళింది. తల్లి వెనకాలే వెళ్ళాడు మంగరాజు. ప్లేటులో భోజనం పెట్టి 'ఒరేయ్, నీ గురించి పక్కింటి పిన్ని గారికి చెప్పాను. ఆవిడ వెంటనే వాళ్ళ మనవడితో మాట్లాడారు. విజయవాడలోని వారి కాలేజీ లో, లెక్చరర్ పోస్ట్ ఖాళీ అయ్యిందిట. నీ సబ్జెక్టే. వెంటనే నిన్ను పంపమన్నారు. ఎంత మంచి ఆవిడ పిన్ని గారు. అన్నం తిని, పిన్నిగారింటికి వెళ్ళి, ఆ కాలేజీ అడ్రసు తెలుసుకో. ఆవిడకు థాంక్స్ చెప్పి రా 'అంది తల్లి.


ఆమె మాటలకు చాలా ఆనందించాడు మంగరాజు. తల్లి రెండు చేతులూ పట్టుకుని 'థాంక్స్ అమ్మా 'అన్నాడు.


'బిడ్డ తల్లికి థాంక్స్ చెప్పడం ఏమిటి? బిడ్డ భవిష్యత్తు గురించి తల్లి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది నాన్నా ' అంది మంగరాజు తల్లి అతని తల నిమురుతూ.


మంగరాజు గబ గబా అన్నం తిని, సంతోషంగా పిన్ని గారింటికి వెళ్ళాడు. రేపటి నుంచి తనూ ఓ లెక్చరర్

అన్న భావన, అతనికి రాకెట్ లో చంద్రమండలానికి వెళ్ళినంత 'థ్రిల్లింగ్ గా' ఉంది.


*****

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






27 views1 comment
bottom of page