ఆనంద నిలయం

Ananda Nilayam - Telugu Family Story | Goparaju Venkata Suryanarayana
ఆనంద నిలయం - తెలుగు కుటుంబ కథ | రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ|
Published In manatelugukathalu.com On 19/10/2026
ప్రేమ, నమ్మకం, అనుబంధాలతోనే దాంపత్య జీవితం ఆనందమయంగా సాగుతుందని చాటిచెప్పే హృద్యమైన తెలుగు కుటుంబ కథ ‘ఆనంద నిలయం’. అనుమానాలు, అపోహలను అధిగమించి కుటుంబ బంధాలను ఎలా కాపాడుకోవాలో ఈ కథ మనకు తెలియజేస్తుంది.
హైవేకు దగ్గరగా ఉండే ఆ కాలనీ హైదరాబాద్‌లో అన్ని సదుపాయాలతో మంచి నివాసయోగ్యమైనదిగా పేరు పొందింది! అన్ని వసతులతో ఎంతో ప్రశాంతంగా, అనుకూలంగా ఉండే ఆ కాలనీలో నివాసానికై అందరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తుంటారు.
ఆ కాలనీలో సుందరరామయ్య గారిల్లు విశాలమైన స్థలంలో కట్టిన రెండంతస్థుల అందమైన, అందరినీ ఆకట్టుకునే భవనం. దాని పేరు ‘ఆనంద నిలయం’. రామయ్యగారు ఎప్పుడో యూనివర్సిటీలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆ స్థలం కొన్నారు.
ఆ తర్వాత సీతామహాలక్ష్మి గారిని వివాహం చేసుకున్నాక కొన్నాళ్లు అద్దె ఇళ్లలో గడిపినా, ఇద్దరు పిల్లలు పుట్టాక, వసతి గృహాలు సరిపడక, అద్దె ఇంటి బాధలు పడలేక, ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన వెంటనే కోరికమీర ఇష్టంగా తమకై ఈ సొంత ఇంటి కల సాకారం చేసుకున్నారు.
ఇంటి ముందు పోర్టికోకు రెండు వైపులా పెద్ద ప్రవేశ ద్వారాలు... ఒకటి లోనికి రావడానికి, మరొకటి బయటకు పోవడానికి.
ఇంటికి ఒక వైపు చివరన వాహనాల కోసం గారేజీ షెడ్లు, ముందున్న స్థలంలో పూల చెట్లు, క్రోటన్స్ మొక్కలతో అందమైన పూలతోట, మధ్యలో ఫౌంటెన్‌తో నిండు జలాశయం, వెనుక వైపు పెరట్లో గున్నమామిడి, సపోటా, నారింజ, జామ లాంటి పండ్ల చెట్లు, బాదం, పనస వంటి వృక్షాలతో నిండి, చల్లని ఆహ్లాదపరిచే వాతావరణంతో ఓ అందమైన బంగ్లాను తలపిస్తూ ఉంటుంది ఆ భవనం!
సుందరరామయ్య గారు, వారి ధర్మపత్ని సీతమ్మ గారు పేరుకు తగ్గ ఆదర్శ దంపతులు. వారి సంసార జీవితం సాఫీగా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా గత నలభై ఏళ్లుగా సుఖంగానే సాగిపోతోంది. సీతమ్మగారు బాగా చదువుకున్నదే అయినా గృహిణిగానే స్థిరపడి జీవించారు.
తమ ఇద్దరి కుమారులనూ పెంచి పెద్దచేసి, తీర్చిదిద్దే పనిలో పూర్తిగా కృతకృత్యులయ్యారు. గడిచిన రెండు మూడేళ్ల వరకు రామయ్యగారి ఇద్దరు పిల్లలు రమేష్, సురేష్‌లు పెరిగి చదువులు పూర్తయి, పెద్ద ఉద్యోగాల్లో చేరి సకుటుంబీకులై అమెరికాలో స్థిరపడే వరకు ఆ ఇంట్లో నివాసానికి బయటి వారెవరికీ ప్రవేశం దొరికే అవకాశమే చిక్కలేదు.
వాస్తవానికి సుందరరామయ్యగారు చాలా ముందుచూపుతోనే పిల్లలిద్దరికీ పెళ్లిళ్లయిన తర్వాత కూడా తమ వద్దే కాపురం ఉండేందుకు తగినట్లుగా పై అంతస్తులో ఉమ్మడి సావిడితో, అన్ని హంగుల ఏర్పాట్లతో రెండు విడివిడి వాటాలుగా నిర్మించారు. ఒకవైపు వాటాకు మెట్లు, మరొకవైపు వాటాకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పరిచారు!
ఒకరి తర్వాత ఒకరుగా కుమారులిద్దరూ మంచి భవిష్యత్తు కోసం డాలర్ల వేటలో అమెరికాకు వెళ్లేసరికి రామయ్య దంపతులు అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగిలారు. ఇద్దరే బిక్కుబిక్కుమంటూ గడపడం కష్టమనిపించి, మేడపైన వాటాలకు అద్దెవాసులను తోడుగా ఆహ్వానించారు. ఆ విధంగా మరో రెండు కుటుంబాలకు ఆ ఇంట్లో అద్దెకంటూ ఆశ్రయం లభించింది!
లిఫ్ట్ ఉన్న వైపుకు ఒక చిన్న కుటుంబం... మధ్యవయస్కుడైన, ఒక పెద్ద కంపెనీకి ముఖ్య అధికారిగా పనిచేసే గోపాలకృష్ణ, భార్య సుమతి, వారి ఆరేళ్ల పాపతో వచ్చి చేరారు. ఆ వచ్చిన వారు చూడచక్కని ముచ్చటైన అన్యోన్య దంపతులే! వారికి తగ్గ అందాల ముద్దులొలికే ఆరేళ్ల గారాల కూతురు రమ్య! సుమతి కూడా ఇంటిని ఎంతో నేర్పుగా, సంసార జీవితాన్ని చాలా హుందాగా నడుపుకునే నేర్పుగల ఇల్లాలే!
మరొక వైపు మేడ మీద పక్క వాటాలోకి కొత్తగా పెళ్లయిన జంట సుధాకర్, పావని వచ్చి చేరారు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఇద్దరివి షిఫ్ట్ డ్యూటీలు, పని సమయాలు వేరువేరు! ఆమెకు పగలు ఆఫీసు, అతనికి రాత్రిపూట షిఫ్ట్ డ్యూటీ! శని, ఆదివారాల్లో మాత్రమే కలిసి ఉండే అవకాశం! ఇంట్లోకి దిగిన కొత్తలో నూతన దంపతులు ఎప్పుడూ హుషారుగా గడుపుతూ, ఆనందంగా సరదాగా కనిపించేవారు.
తరచూ వారి సరదా కేరింతలు, నవ్వుల పకపకలు పక్కనున్న కుటుంబానికే కాకుండా, కింద ఉన్న విశ్రాంత దంపతుల చెవులకు కూడా సోకి, వినోదంగా వారంతా నవ్వుకుని ఆనందించేవారు ఆ నూతన దంపతుల అన్యోన్యతకు!
పైనున్న ఇరు అద్దె కుటుంబాల వాసులు కింద ఇంటి సొంతదారులైన సుందరరామయ్య దంపతులతో అన్ని విషయాలలో అరమరికలు లేకుండా, ప్రతి అవసరానికి పెద్దలుగా సంప్రదిస్తూ కలివిడిగా మసలుతూ రోజులు గడుపుతున్నారు.
పైనున్న రెండు కుటుంబాల వారు ఏ సమస్యకైనా ఎలాంటి భేషజం లేకుండా, సలహాలకై కిందనున్న రామయ్య, సీతమ్మ దంపతులనే పెద్దదిక్కుగా భావించి సంప్రదించి ఊరట పొందడం వారికి ఉన్న అవకాశంగా మారింది.
ఒకనాడు... పైన వాటా సీఈవో గోపాలకృష్ణ హడావుడిగా ఆఫీసుకు వెళ్లే సమయంలో తాను వేసుకుంటున్న చొక్కాపై లిప్‌స్టిక్ మరక గమనించి కంగారుపడుతున్న వేళ... తండ్రి పక్కనే ఉండి ఆడుకుంటున్న చిన్నారి పాప రమ్య చూసి, "అమ్మా! నాన్న చొక్కాపై రక్తం!" అంటూ అరిచింది.
భార్యకు ఏం చెప్పాలో తెలియక తడబడుతూ నిలబడిపోయాడు ఆ భర్త! వెంటనే అక్కడికి వచ్చి చూసిన ఇల్లాలు సుమతి మరుక్షణంలోనే సర్దుకుని నేర్పుగా తనను తాను సంభాళించుకుని, కూతురిని గదమాయిస్తూ... "చిన్నీ... నీ అల్లరి శ్రుతిమించిపోతోంది. లిప్‌స్టిక్ ముట్టుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పినా వినవెందుకూ?" అంటూ కూతురిని కోప్పడింది.
నిజానికి శ్రుతిమించింది కూతురి అల్లరి కాదని ఆ ఇల్లాలికి తెలుసు!
తల్లి గదమాయింపుకు ఏడుస్తూ చిన్నారి రమ్య కిందకు దిగివచ్చి సీతమ్మగారితో, "అమ్మమ్మా!... అమ్మ ఊరికే నన్ను తిట్టింది," అని చెప్పి మొరపెట్టుకుంది.
సీతమ్మగారు పాపను ఓదార్చి, "నేను అమ్మను గట్టిగా అడుగుతానులే, ఏడవకు బంగారూ!" అని చిన్నారిని సముదాయించి మరిపించి పంపించేసింది అప్పటికి.
తర్వాత తీరిగ్గా సుమతిని కలిసినప్పుడు విషయం గురించి వివరంగా అడిగింది. సుమతి మొహమాటపడుతూనే జరిగింది వివరించి... "ఏముంది పిన్నిగారూ... 'కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది' అన్న సామెత నా పరిస్థితి! రచ్చ చేసుకునే కంటే వొడుపుగా సంసారం సరిదిద్దుకోవడం మంచిదని అలా చేయాల్సి వచ్చింది," అని మనసు విప్పి చెప్పుకుంది తల్లిలాంటి ఆ సీతమ్మతో. సుమతి నేర్పుకు, సహనానికి, విజ్ఞతకు మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సీతమ్మగారు.
మరో పక్క వాటా కొత్త జంట విషయానికి వస్తే... మొదట్లో వారు వచ్చిన కొత్తలో వారిలో ఉన్న ఉత్సాహం పోనుపోను తగ్గుతూ వచ్చింది! సుధాకర్‌కు భార్య పావని ఆఫీసుకెళ్లి, రోజంతా తోటి మగ సహోద్యోగులతో మాట్లాడటం, కలివిడిగా గడపడం ఎందుకో కాస్త ఇబ్బందిగా తోచడం మొదలైంది.
తామిద్దరూ ఉద్యోగ నియమాల రీత్యా ఆదివారాలు తప్ప కలిసి గడపలేని పరిస్థితి!
అందుకు తగ్గట్టుగానే సుధాకర్‌కు ఒంట్లో బాగుండక నైట్ డ్యూటీకి వెళ్లని ఒక రోజున ఒక సంఘటన జరిగింది.
చాలా పొద్దుపోయిన ఆ రోజు వాళ్ల మేనేజర్ కారులో భార్య పావని ఇంటికి చేరింది. తనను ఇంట్లో ఉండటం చూసి ఆశ్చర్యంగా, "ఈరోజు మీరు ఆఫీసుకు వెళ్లలేదా?" అని అడిగింది. తనతో వచ్చిన మేనేజర్ కరుణాకర్‌ను... ఆఫీసులో పని ఒత్తిడితో బాగా పొద్దుపోతే తన కారులో దింపడానికి వచ్చారని చెప్పి ఉభయులనూ పరిచయం చేసి, "మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకువస్తాను," అని చెప్పి లోపలికి వెళ్లింది.
కంపెనీ సీఈవో అయిన కరుణాకర్ దర్జా ముందు తన స్థాయి తీసికట్టుగా భావించాడు సుధాకర్. ఏవో రెండు మూడు పొడి మాటలు తప్ప ఎక్కువగా మాట్లాడలేకపోయాడు.
అతను కాఫీ తాగి వెళ్లిపోయాక ఆలోచనలో పడ్డాడు సుధాకర్. తన భార్య మరో పరాయివాడితో చనువుగా మాట్లాడటం ఇష్టం లేకపోతే ఉద్యోగం మాన్పించాలి! కానీ పావని ఉద్యోగం చేయడం ప్రస్తుతం తమ ఆర్థిక వెసులుబాటు కోసం తప్పనిసరి! తనకో ఉద్యోగ రీత్యా రాత్రి డ్యూటీ తప్పడం లేదు... ఏమి చేయాలో పాలుపోక నిద్రపట్టని పరిస్థితిలో దీర్ఘాలోచనలో పడ్డాడు సుధాకర్.
నాలుగు రోజుల తర్వాత ఇంటికి సీసీ కెమెరా పెట్టించాడు సుధాకర్. ఎందుకని అడిగింది పావని. "దొంగల భయం," అని సంజాయిషీ ఇచ్చాడు!
సమస్య అది కాదని తెలుస్తోంది ఆమెకు! కారణం… కెమెరా బీరువా ఉన్నవైపు లేదు, పడకగది వైపు చూస్తున్నాయి ఆ కెమెరా కళ్లు! 'అనుమానపు మొగుడు అంతకంటే ఏం చేయగలడు' అనుకుంటూ నిట్టూర్చిందామె!
ఆ తర్వాత కొన్ని రోజులు వారి మధ్య ముభావంగానే గడిచాయి. మరికొన్ని రోజులు చిరాకులు, పరాకులతో గడిచాయి! నవ్వులు, సరదాలు మాయమయ్యాయి! కొన్నాళ్లకు వారి మధ్య ఏవో చిన్న విషయాలకే గొడవలు, చిరాకులు మొదలయ్యాయి! సర్దిచెప్పేవాళ్లు లేక రోజురోజుకూ దంపతుల మధ్య సయోధ్య నశించి, తరచూ పక్క వాటా వారికి, కిందకి కూడా అరుపులు, ఏడుపులు వినిపించి వారందరూ కూడా కలవరానికి గురికావడం రివాజైంది!
ఆ తర్వాత కొంతకాలం అంతా నిశ్శబ్ద వాతావరణం! ఇప్పుడు ఇద్దరి నోటా ఒకే మాట వినిపిస్తోంది… ‘విడాకులు’.
భార్యాభర్తల తగవు సంప్రదింపులకై కింద ఉన్న వృద్ధ దంపతుల వద్దకు చేరింది. మొదటగా పావని వచ్చి, భర్త తనపై అనుమానంతో తరచూ మానసికంగా వేధించే తీరుకు విసిగిపోయానని, అలాంటి వ్యక్తిని భరిస్తూ కాపురం చేయడం తన వల్ల కావడం లేదని చెప్పుకుని వాపోయింది సీతమ్మగారితో.
అందుకు సీతమ్మగారు పావనిని సముదాయిస్తూ, ఊరడింపుగా... "ఈమధ్య మీ దంపతుల తీరు చూస్తే చూచాయగా తెలుస్తూనే ఉందిలే పావనీ! నువ్వు నేను సుధాకర్‌ను సమర్థిస్తున్నాను అని అనుకోకపోతే ఒక్క విషయం చెబుతాను విను... నీమీద వల్లమాలిన ప్రేమ వల్లే, నిన్ను తనకే సొంతం అనుకోవడం వల్లే అతను ఆ అనుమానపు భావనకు గురవుతున్నాడని తోస్తోంది! అది కొంతవరకు మగవారి నైజం! అది ముందు నువ్వు గుర్తుంచుకోవాలి! మీరిద్దరూ ఉద్యోగస్తులు కావడం, మీ ఉద్యోగపు పని సమయాలు వేరు కావడం, కలిసుండి కాలక్షేపం చేసే సమయం లోపించడం కూడా కొంత కారణం కావచ్చు! సుధాకర్ పరస్త్రీలతో ప్రవర్తించే తీరు పట్ల నీకున్న విశ్వాసమే అతనికీ నీపట్ల నమ్మకం కుదిరేటట్లుగా, నువ్వు అతనిలో విశ్వాసం కలిగించగలగాలి! సందర్భోచితంగా నడుచుకుని నమ్మకంగా అతనికి దగ్గర కావాలి!"
"ఇక్కడ నీకు నీ పొరుగున ఉన్న సుమతి గురించి కూడా కొంచెం చెప్పాలి!" అని సుమతి ఇంట్లో జరిగిన ఉదంతం అంతా పూసగుచ్చినట్లు వివరించి చెప్పి... "కొన్ని సందర్భాలలో కాపురాలు నిలబెట్టుకోవాలంటే దంపతులలో పట్టువిడుపులు, విజ్ఞత చాలా అవసరం అని తెలియజెప్పడానికే నీకీ విషయమంతా చెప్పాల్సి వచ్చింది," అని తెలిపి, పావనికి ధైర్యం చెబుతూ... "నీకు సుధాకర్‌పై అభిమానం, ప్రేమ చెక్కుచెదరని దృష్ట్యా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు పోవద్దు," అని హితవు చెబుతూ... "వచ్చే ఆదివారం సెలవు రోజున మీ అంకుల్ రామయ్యగారితో మాట్లాడి, మీ ఇద్దరినీ పిలిచి కూర్చోబెట్టి, తగిన విధంగా సమాధానపరచమని చెబుతానులే," అని చెప్పి నమ్మకం కలిగించి అప్పటికలా ఊరడించి పావనిని పంపింది ఆ తలపండిన ఇల్లాలు.
ఆ ఆదివారం ముందుగా రామయ్యగారు సుధాకర్‌ను ప్రత్యేకంగా తమ ఇంట్లోకి పిలిచి... "ఏమిటయ్యా సుధాకర్! వచ్చిన కొత్తలో ఎంతో అన్యోన్యంగా, హుషారుగా, ఆదర్శంగా ఉండే దంపతులు మీరేనా ఈనాడు ఇలా కస్సుబుస్సులాడుకుంటూ, ఎడమోహం పెడమోహంతో మనస్పర్థలు పెంచుకోవడం... కీచులాడుకోవడం ఏమైనా బాగుందా? నీకు సబబుగానే తోస్తోందా?" అని అడిగి సుధాకర్ వైపు చూశారు.
"ఏం చేయను సార్! పావనిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. తను మరో పరాయి మొగాడితో చనువుగా, ఇష్టంగా మాట్లాడడం నేను సహించలేకుండా ఉన్నాను. తన పైఆఫీసర్తో కారులో తిరగడం, అతను తరచూ ఇంటికి దింపడం, తను సరదాగా మరొకరితో చనువుగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండడం ఎందుకో నావల్ల కావడం లేదండీ!" అని సుధాకర్ అసహనంగా జవాబిచ్చాడు.
"మరి నువ్వు మీ ఆఫీసులో నీతోటి స్త్రీ సహోద్యోగులతో మాట్లాడవా? తోటి ఉద్యోగులతో ముభావంగా, ముంగిగా ఉండడం సభ్యత అవుతుందంటావా? మరి అలాంటిది బాస్‌తోనే ముభావంగా ఉండడం ఎవరికైనా ఎలా వీలవుతుంది? పనిలో ఆలస్యం అయితే ఆడవారిని ఇంటి వద్దకు క్షేమంగా చేర్చడం పైఆఫీసర్ బాధ్యతగా ఫీల్ కావడం, అలా ఇంటికి దింపిన వారికి కాఫీ ఇచ్చి సాదరంగా పంపడం సభ్యతా లక్షణం కాదంటావా? భార్యపై అభిమానంతో నీ దృష్టికి అప్పటికలా తోచి ఉండొచ్చు గాక! అది నీకు నీ భార్యపై ఉన్న అభిమానం, 'పొజెసివ్‌నెస్' భావన వల్ల కలుగుతున్న మానసిక దౌర్బల్యంగానే తోస్తోంది! సభ్య సమాజంలో ఇలాంటి విషయాల పట్ల కాస్త నిదానం, సంయమనం పాటిస్తూ మర్యాదగా మెలగడం తప్పదు! పైగా నీ భార్య నలుగురితో కలిసి ఉద్యోగం చేస్తున్న మనిషి కదా? ఎంతో ఇష్టపడి చేసుకున్న వివాహబంధం దంపతులను పెనవేసి చివరి వరకు నిలిపేదిగా ఉండాలి! వాస్తవానికి భార్యాభర్తల సంబంధం ఒకరిపై మరొకరి నమ్మకం, పూర్తి విశ్వాసంపై ఆధారపడి, చివరివరకు కాపాడుకోవాల్సిన బాధ్యత! అది భార్యాభర్తలిద్దరి మీదా ఆధారపడి ఉంటుందని మరవకూడదు. నీ భార్య ఉద్యోగం చేసి ఆర్థికంగా నీకు సహాయంగా ఉండాలి కానీ, బయటివారితో మాట్లాడకుండా మెలగాలనుకోవడం ఎంత వరకు సబబో నీవే ఆలోచించు సుధాకర్!"
"నాకు తోచే మరో విషయం ఏమంటే... మీ గొడవలకు అసలు కారణం మీ మధ్య ప్రేమ రాహిత్యం వల్ల కాదు! నీకు నీ భార్యపై ఉన్న పొజెసివ్‌నెస్ వల్లనే నీకా వల్లమాలిన మానసిక సంఘర్షణ అని తోస్తోంది! అంతకు మించిన కారణం మీ ఇద్దరికీ అన్యోన్యంగా కలిసి గడిపే సమయం తగినంత లేకపోవడమూ ఒక కారణమేమో... కాదనగలవా? ఏమైనా భార్యాభర్తలు ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇరువురికీ మంచిది కాదు.
రేపు మీ దంపతులిద్దరూ మరోసారి కలిసి కిందకు రండి! మనం అందరం కలిసి నిదానంగా బాగా ఆలోచించి మీ సమస్యకు తగిన పరిష్కారం కోసం ప్రయత్నిద్దాం!" అని సుధాకర్‌ను కొంతవరకు సమాధానపరిచి ఆనాటికి పంపించి, సమస్య పరిష్కారాన్ని వాయిదా వేస్తూ, మరో ఉమ్మడి సమావేశంలో తీరిగ్గా ఆలోచించి నిర్ణయానికి వద్దాం అని చెప్పి వాయిదా సమావేశానికి జంటగా రమ్మని ఆదేశించారు మధ్యవర్తిగా సుందరరామయ్యగారు.
చెప్పినట్లుగానే సుందరరామయ్యగారు పై ఇరువురి కుటుంబాలను సెలవురోజున కాలక్షేపంగా, ఇష్టాగోష్టిగా గడపడానికై కింద తమ ఇంట్లోనే సాయంకాలం ఆత్మీయ సమ్మేళనంగా కలిసే వేదిక ఏర్పాటు చేసి, విందుకు ఆహ్వానించారు. మూడు కుటుంబాల సభ్యులు ఆ సాయంకాలం వారి పెరట్లో చల్లని వాతావరణంలో చెట్ల మధ్య సమావేశమయ్యారు.
సమావేశకర్త రామయ్యగారు లేచి, సింహావలోకనంగా గడిచిన తమ దాంపత్య జీవితాన్ని తలపోస్తూ, ఆహ్వానితులనుద్దేశించి ప్రస్తావనగా తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ…
"మా భార్యాభర్తల దాంపత్య బంధానికి ఇప్పటికి దాదాపు యాభై సంవత్సరాలు పైబడ్డాయి! మా బంధం ఏనాడూ ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాక చెక్కుచెదరక దృఢంగానే సాగుతోంది! అందుకు కారణం నా సహధర్మచారిణి నాకు సదా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ నిర్వహించిన కుటుంబ బాధ్యత, ఆ నిర్వహణలో తాను చూపిన ఓర్పు, సహనమే నేటికీ మా ఈ ఆనందమయ జీవితానికి బాటలు వేశాయని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. కుటుంబ వ్యవస్థ సర్వతోముఖంగా సుఖంగా సాగాలంటే దంపతుల మధ్య సామరస్యం, అనుబంధం విడదీయరానివిగా పెనవేసుకుపోయి ఉండాలి!"
"మా ఈ మలివయసులో మా పిల్లలు విదేశాల్లో దూరంగా ఉన్నా, మా ఈ ఆనంద నిలయంలో మాకు తోడుగా మాతో కలిసిమెలిసి నివసిస్తున్న మిమ్మల్నే మా ఆత్మీయులుగా భావించి జీవనం సాగిస్తున్నాము! మీతో కలిసిమెలిసి, మీ అందరి సుఖ జీవనాన్నే మా ఆనందంగా భావిస్తున్నాము! మీ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడడం మా అభిమతం కాదు! కానీ మాకున్న ఇన్నేళ్ల జీవితానుభవం దృష్ట్యా మాకు తోచిన సలహా సహకారాలను అందించాలనే సదుద్దేశంతోనే నేడీ మన సమావేశం!"
"సుఖసంతోషాలతో సాగాల్సిన కుటుంబాలు అపోహలతో ఛిన్నాభిన్నం కావడం శ్రేయస్కరం కాదు. నా ఆలోచనలు, సలహాలు మీతో పంచుకున్నాక చివరగా మీ ప్రతిస్పందనలు కూడా తెలుసుకోవాలని నా అభిలాష!" అంటూ అందరివైపు చూసి, చిన్న విరామం ఇచ్చి కుటుంబ వ్యవస్థపై తన సాధికారిక ప్రసంగం మొదలుపెట్టారు సుందరరామయ్యగారు.
"మానవ జీవితాలన్నీ అనుబంధాలతో ముడిపడే ఉంటాయి! ముఖ్యంగా సమాజంలో కుటుంబాల సుఖమయ జీవన లక్ష్యానికి పునాది వివాహబంధమే! మానవ సంబంధాలన్నింటిలో భార్యాభర్తల సంబంధం ప్రత్యేకమైనది! వేరువేరు కుటుంబాలలో పెరిగి, భిన్న మనస్తత్వాలు కలిగి, యుక్తవయస్కులైన స్త్రీపురుషులు ఏరికోరి వివాహబంధంతో ఏకమైన జంట తమ బంధాన్ని జీవితకాలం నిలుపుకుని పదిలపరుచుకోవడానికి ఎంతో సంయమనం, జాగ్రత్తలు పాటించడం అవసరం!"
"తమకు నచ్చినట్లుగా తమ భాగస్వామి ఉండాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకరినొకరు ఇష్టపడి వివాహంతో ముడిపడ్డాక, ఒకరి భావాలను, అభిప్రాయాలను, మనస్తత్వాలను మరొకరు మన్నించి, అర్థంచేసుకుని ఏకాభిప్రాయంతో సర్దుకుపోతేనే ఆ బంధం బలపడుతుంది! కలకాలం తాజాగా, సరదాగా నిలుస్తుంది! సుఖసంతోషాలతో చిరకాలం కొనసాగగలుగుతుంది!"
"నేటి ఆధునిక యువత వివాహబంధాన్ని నాలుగు కాలాల పాటు నిలుపుకోలేకపోవడం శోచనీయం! భార్యాభర్తలిరువురూ విద్యావంతులై, సమాన ఆర్థిక స్థోమత కలిగిఉండటం, జీవిత భాగస్వామి ఆదేశాలకు తలవొగ్గడం అవమానంగా భావించడం వంటి కారణాల వల్ల కలకాలం పటిష్టంగా మనాల్సిన బంధం బీటలు వారి విడాకుల దాకా దారితీస్తోంది!"
"'విజయవంతమైన వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు మళ్లీ మళ్లీ ప్రేమలో పడడం' అన్నాడో మానసిక నిపుణుడు! ఒకరికోసం మరొకరన్నట్లుగా మెలుగుతూ, పరస్పరం గౌరవాన్నిచ్చి పుచ్చుకుంటూ కలిసికట్టుగా జీవించినప్పుడే అది సాధ్యపడుతుంది! రాగాల పల్లకిలో, అనురాగాల డోలికల్లో తేలే ఆ సంసారం ప్రాణప్రదమవుతుంది! అలాంటి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంటే ఆ జీవితాలకు తగిన గమ్యం, సుఖం దొరకవు!"
"నేను చెప్పేదంతా వింటుంటే మీకు నీతిని బోధిస్తున్నట్టుగా తోచవచ్చు! కానీ ఏమాత్రం సత్యదూరం కాదు," అంటూ రామయ్యగారు శ్రోతలను నిశితంగా పరికించి మరోమారు చూసి...
"మా ఈ ఆనంద నిలయంలో మాతో కలిసి జీవిస్తున్న మీ రెండు కుటుంబాలు కూడా మాలా చిరకాలం అన్యోన్యంగా గడపాలని మా ఆకాంక్ష! అందుకు మా సలహా సహకారాలు అందించడానికి మేము సదా సంసిద్ధం! అందుకే ఈనాడు ఈ సమావేశ ఏర్పాటు!" అని ప్రసంగం ముగించి...
"ఈనాడు మన మధ్యకు వచ్చిన అసలు వివాదం సుధాకర్, పావని దంపతులది. పెళ్లి చేసుకుని ఈ ఇంటిలో పైన కాపురానికి వచ్చిన కొత్తలో వారి మధ్య అన్యోన్యత, సరదాగా గడిపిన దినాలు మనకు తెలియనివి కావు. అలాంటి ఆ జంట లేనిపోని అనుమానాలతో, అపోహలతో కొద్దికాలంగా ఎడమోహం పెడమోహంగా మెలగుతూ అసహనంగా విడాకులు కోరుకునే స్థితికి రావడం మమ్మల్ని ఎంతో వ్యాకులపరుస్తోంది! అందుకు వారు చెబుతున్న కారణాలు మానసికమైన, ఊహాజనితాలుగానే భావించాల్సి వస్తోంది!"
"ఈ విషయమై తలపండిన దంపతులం మేమిద్దరం వారిని విడివిడిగా మాట్లాడి కొంతవరకు సమాధానపరిచే ప్రయత్నం చేశాము. ఈరోజు మన అందరి సమక్షంలో ఈ నూతన దంపతుల సమస్యకు అసలు కారణాలను తెలిపి, సూచనలతో సమస్యకు తగిన పరిష్కారం చూపి, వారి జీవితాల్లో నూతనోత్సాహానికి పురికొల్పగలరని, జీవిత నావను సాఫీగా సాగిస్తున్న అనుభవజ్ఞులైన గోపాలకృష్ణ, సుమతి దంపతులను తమ అనుభవ సారాన్ని పరిష్కార దిశగా సుధాకర్, పావనిలకు విశదీకరించమని కోరుతున్నాను," అని రామయ్యగారు గోపాలకృష్ణ వైపు చూపు నిలిపారు.
వెంటనే అంగీకారంగా గోపాలకృష్ణ లేచి రామయ్య, సీతమ్మ దంపతులకు నమస్కరించి, వారి సహృదయతతో చేసిన ప్రతిపాదనకు స్పందిస్తూ, తమ దంపతుల తరఫున వారి దాంపత్య అనుభవాలను ప్రస్తావిస్తూ...
"నేను ఒక సగటు మగవానిగా బయట జీవితంలో నాకు సమాజంలో ఎలాంటి ప్రలోభాలు ఎప్పుడు ఎదురైనా... నాలోని విజ్ఞత నన్ను నా కుటుంబ క్షేమం, మర్యాద పరిధులను దాటనీయదు! ఏ కుటుంబ సుఖసంతోషాలకైనా, రక్షణకు వారధిగా నిలిచేది, జీవనం ముందుకు సాగించేందుకు గట్టిగా చివరివరకు తోడ్పడేది వారి సంతాన బలమే! భార్యాభర్తలు పిల్లలను కని పెంచడంలోని ఆనందమే వారి బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది! ఇది లోకరీతి! మా అనుభవం కూడా!
దాంపత్య జీవితం నిరుత్సాహపడకుండా నిత్యనూతనంగా సాగాలంటే దంపతులు రోజూ వీలుచేసుకుని టీ విరామంలోనో, భోజన విరామ సమయంలోనో పిచ్చాపాటీగా నాలుగు ప్రియమైన మాటలు మాట్లాడుకోవాలి! కుటుంబ విషయాలు చర్చించుకోవాలి! ఒకరినొకరు మెచ్చుకోలుగా కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవాలి! వీలుచిక్కినప్పుడల్లా సరదా విహారయాత్రలు చేయాలి! ఇవే మేము నమ్మి ఆచరించే ఆనంద సూత్రాలు," అంటూ ముగించాడు గోపాలకృష్ణ.
గుట్టుగా హాయిగా సంసారం సాగిస్తున్న గోపాలకృష్ణ, సుమతి దంపతులను ఒకవంక అభినందిస్తూ, వారు సుఖమయ దాంపత్య జీవనానికై అవలంబిస్తున్న వారి సూచనలను మెచ్చుకుంటూ... రామయ్యగారు సుధాకర్, పావని జంట వైపు తిరిగి చూస్తూ...
"ఇప్పుడు మీ ఇద్దరికీ విశదంగా బోధపడిందనుకుంటాను... మీ మధ్య ఏర్పడిన, మీలోని ఈ ప్రేమరాహిత్యానికి కారణమైన మీ తప్పిదాలు. ఇప్పటికైనా మీరు మీ పెళ్లయిన కొత్తలో మీ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ, అపోహలు మరిచి నూతనంగా జీవనం ప్రారంభించండి.
వెంటనే మీరిద్దరూ మీ ఆఫీసులలో కనీసం రెండు మూడు వారాలు సెలవు తీసుకుని మరో హనీమూన్ విహారయాత్రకు వెళ్లి రండి! సరదాగా ప్రేమయాత్రలో మురిపాల సరాగాలతో మీ ఆశల అంకురానికి స్వాగతం పలకండి! మీ ముందు జీవితాన్ని ఆనందంగా సుఖమయం చేసుకోండి! ఇదే సమాజంలో అందరం ఆశించి కోరుకునే అభిలాష," అని ఆనాటి సమావేశానికి మంగళవాక్యాలు పలికారు రామయ్యగారు.
పావని, సుధాకర్ జంట కూడా తమలో నెలకొన్న సందిగ్ధత తొలగి, తేలికైన మనస్సులతో ఉత్సాహంగా చిరునవ్వులతో సంతోషం వెలిబుచ్చుతూ పెద్దల సూచనలకు అంగీకారంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఆ తర్వాత మూడు కుటుంబాలు ఉత్సాహంగా ఇష్టాగోష్టి కబుర్ల మధ్య సీతమ్మగారి చేతివంట విందుగా ఆరగించారు.
పెద్దల సూచనలు పాటిస్తూ పదిహేను రోజులు తమ ఆఫీసులకు సెలవు పెట్టి విహారయాత్రకు వెళ్లి, సరదాగా నూతనంగా అన్యోన్య జీవితం గడిపిన ఆ నవదంపతులకు ఏడాది తిరిగేసరికల్లా వారింట్లో ఓ చిన్నారి నవజాత శిశువు కేరింతలతో సందడి నెలకొంది. ఇప్పుడు ఆ దంపతులు ఆ చిన్నారి ముద్దుమురిపాల ముచ్చట్లతో తలమునకలుగా హాయిగా అరమరికలు లేని జీవనం సాగిస్తున్నారు!
ప్రస్తుతం ఆ మూడు కుటుంబాల వారంతా అన్యోన్యంగా కలిసి జీవిస్తూ, ఎంతో కలివిడిగా మెలుగుతూ, స్నేహంగా ఏ చీకూచింతా లేని జీవితాలు గడుపుతుంటే... ఆనందాలకు నిలయంగా భాసిల్లుతోంది ఆ ‘ఆనంద నిలయం’ బంగ్లా!
సమాప్తం
గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
ముందుగా మన తెలుగు కథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కథలను, కథకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!
నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు.నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.
వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.
ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కథలంటే బాగా ఇష్టపడతాను.ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కథలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!







Comments