top of page
Original.png

ఆత్మబంధువులు


ఆత్మబంధువులు కథలో వసంత తన చెల్లెళ్లతో, ఆపదలో అండగా నిలిచిన ఆత్మీయ కుటుంబంతో కలిసి ఉన్న భావోద్వేగ దృశ్యం

Aatmabandhuvulu - Telugu Story | AyyalaSomayajula Subrahmanyam 

ఆత్మబంధువులు తెలుగు కథ | అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత   

Published In manatelugukathalu.com On 04/09/2026


ఆత్మబంధువులు అనేది రక్తసంబంధాల కంటే ఆపదలో ఆదుకునే మనుషులే నిజమైన బంధువులని చాటి చెప్పే హృదయస్పర్శి సామాజిక కథ. అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము రచించిన ఈ కథలో వసంత తన చిన్న చెల్లెళ్ల కోసం బాల్యం నుంచే బాధ్యతలు మోస్తుంది. తండ్రి నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల మధ్య ఆమె ఎదుర్కొన్న పోరాటం హృదయాన్ని కదిలిస్తుంది.

ఆపదలో తోడుగా నిలిచి, జీవితాన్ని నిలబెట్టే మనసే అసలైన బంధం అనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.


కిటికీలోంచి బయటికి చూస్తున్న వసంతకు మూసి ఉన్న ఎదుటి ఇంటి తలుపులు, కిటికీలు ఎప్పటిలాగే దర్శనమిచ్చాయి. ఈ ఇంటికొచ్చిన దగ్గర్నుంచీ, ఎదురింటి గురించే కుతూహలంగా ఉంది తనకి. ఆ ఇంటిలో మనుషులు తిరుగుతున్నారా, తాళం వేసి ఉందా అంటే అంత పట్టించుకునేది కాదేమో; ఇంటిలో మనుషులున్నారు. ఆ ఇంటిలో తండ్రీ, కూతురు ఉంటారని చెబుతారు. కానీ ఎప్పుడూ తలుపులు తియ్యరు.


సొంత ఇల్లు. ఇంటి వాళ్ల గోల లేదు. పాలమనిషీ, పనిమనిషీ... అసలు ఎవరూ ఆ ఇంటి వైపు రారు. అంత వీధి మొహం చూడకుండా కూతురేం చేస్తోందో? ఎప్పుడూ ఇంటిలో ఉండి; ఎందుకనో గానీ పేపర్లో చదువుతున్న ఘాతుకాలు వసంత మెదడులో జోరీగల్లా రొద పెట్టేవి. కానీ తనే సరిదిద్దుకునేది. మనుషులు కనబడటంతో మాత్రాన అన్ని గొడవలు అలాంటివే ఉంటాయా అని.


తామా ఇంటికొచ్చి ఆరు నెలలు దాటుతోంది. ఇప్పటిదాకా ఆ ఇంట్లో ఎవరూ కనబడలేదు. ఆ తలుపులు ఏ సమయంలోనూ తీసిలేదు. ఒకాయన మాత్రం బయటికి వెళ్లి ఏవో తెస్తూ కనిపిస్తారు. బహుశా ఇంటిలోకి అవసరమైన సరుకులేమో; బక్కచిక్కి కళ్లల్లో ప్రాణాలున్నట్లు ఆయన్ని చూస్తే, ఆయన కూతురు ఆ ఇంటిలో, ఎవరి మొహాలూ చూడకుండా, ముఖ్యంగా ఎవరితోనూ మాట్లాడకుండా ఎలా ఉంటారో అని తలచుకున్నప్పుడల్లా వసంతకి తన తండ్రి, తన చిన్నతనం గుర్తుకు వస్తాయి.


సంఘజీవి అన్నమాటకి పర్యాయపదం వసంత. తన ఇల్లు, తన బాధ్యతలు, పనులు అన్నీ అయ్యాక ఇరుగుపొరుగుని పలకరించడం, అవసరమైతే సహాయం చెయ్యడం, అడిగితే సలహా చెప్పడం, కాస్తో కూస్తో సంఘసేవ. ఇలా కాలక్షేపం చేస్తుంది. పిల్లలు చిన్నప్పుడే మహేష్ తనతో ఉద్యోగం మానిపించేశాడు. డబ్బు కోసం ఉద్యోగం నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కనక ఇంటిలో పిల్లల్ని చూసుకో. మనముండి పిల్లల్ని ఆయాల మీదా, క్రెడాలలోనూ వదిలెయ్యటం నీకూ ఇష్టం ఉండదు కదా; వాళ్ళని చూసుకుంటూ నీ కాలక్షేపానికి నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను అడ్డు చెప్పను అన్నాడు.


మహేష్ మాటలను కాదనే అవసరం, అవకాశం తనకు లేదు. అలా అలా గతంలోకి తిరుగుతూ వెళుతున్న కాలచక్రాలు తన చిన్నతనంలోకి వెళ్ళాయి. తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలం సంతానం. తన పదో ఏటనే తల్లి పోయింది. తనే పెద్దది కావటంతో తమని చూసేందుకు వేరెవరూ లేకపోవటంతో, పదేళ్లకే తన ఇద్దరు చెల్లెళ్లకు తల్లిగా మారింది. వీరి ఆలనాపాలనా చూడటమే గాక వాళ్ళ సహాయంతో వంట కూడా చేసేది. తండ్రి ప్లీడరు. ఒక్క కేసు లేకపోయినా ఫోజులకి మాత్రం తక్కువ లేదు.


ఎప్పుడు స్నేహితులతో పేకాట. ఒకే ఒక సుగుణం ఏంటంటే ముందు గది వదిలి ఎవరూ లోపలికి వచ్చేవాళ్ళు కాదు. తండ్రి మాత్రం సరిగ్గా భోజనం సమయానికి ఇంటిలోకి వచ్చేవాడు. వండిన దాంట్లో పిల్లలకు ఉందో లేదో కూడా చూసుకోకుండా తనకి కావలసింది తిని ముందు గదిలోకి వెళ్ళిపోయేవాడు. ఇంటిలో అత్యవసరమైన సరుకులు నెలకొకసారి తెచ్చి పెట్టేవాడు. అంతే; అదే తల్లి లేని పిల్లల గురించి ఆయన తీసుకున్న బాధ్యత. ఈ లోపల ఇంటిలో సరుకులు ఉన్నా, అయిపోయినా, పిల్లలు ఏం తిన్నా, అసలు తినకపోయినా ఆయనకు పట్టదు.


అంత చిన్న వయసులోనే ఆ పరిస్థితుల్లో తను, తన చెల్లెళ్ళు పరిస్థితులకు తగ్గట్లు బతికాం. చెల్లెళ్ళిద్దరూ ఇంకా చిన్నవాళ్ళు. స్కూలు చదువులోనే ఉన్నారు. తను కూడా పరిస్థితులు గమనించి ఇంటర్మీడియట్ అయ్యాక పై చదువులనక, అయినా తండ్రి చదివించడని తెలిసి కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అయ్యి, ఆ కోర్సులు నేర్చుకోసాగింది. మెయిన్ గా డి.టి.పి. అవి నేర్చుకుంటే ఉద్యోగాలు తొందరగా వస్తాయని కనుక్కుని మరీ చేర్పించాడు వాటిలో తన తండ్రి.


ఇంటర్ లో కామర్స్ తీసుకుంది. ఎకౌంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటా పేపర్స్ అడుగుతే, కూడా తిట్టేవాడు. అయిపోయిన నోట్స్ లో పేపర్స్ మిగిలితే, వాటిని చింపి బౌండ్ బుక్ గా కుట్టుకునేది. ఎకౌంట్స్ నాలెడ్జ్ కూడా ఉంటే మంచిదని కంప్యూటర్ కోచింగ్ సెంటర్ లో చెప్పేవారు అక్కడ మాస్టారు. కొన్నిసార్లు ఒకసారి లెక్కలు చేసిన కాయితాలలో రాసింది రబ్బర్ తో చెరిపివేసి, ఇంటిలో మళ్ళీ వాటిమీదే లెక్కలు చేసేది.


ఒకటా రెండా ఎన్ని ఇబ్బందులు పెట్టాడు కన్నతండ్రి అయి కూడా. ఏకొంచెం చికాకు వచ్చినా గొడ్డును బాదినట్లు బాదేవాడు తననీ, చెళ్ళెళ్ళని. చెళ్ళెళ్ళని తనే ఓదార్చేది. తనని ఓదార్చటానికి...? తండ్రంటే అమ్మ ఉన్నప్పుడు ఉన్న ప్రేమ, ఆప్యాయతలు రానురానూ తగ్గుతూ వచ్చాయి. అమ్మ ఉండగా కూడా తండ్రి అలాగే ఉండే వాడని, అమ్మే తమకా విషయాలు, సంగతులు తెలియకుండా సమర్థించుకొచ్చిందనీ, జబ్బు చేస్తే మందు కూడా ఇప్పించకపోవడం వల్ల, అలాంటి భర్తతో భరించిన బాధలవల్ల, తమకి తండ్రి ఉన్నా అనాథలను చేసి వెళ్ళిపోయాడని తనకి ఊహ వచ్చినకొద్దీ తెలియవచ్చింది.


అందుకే తనకి మెడికూర్ హాస్పిటల్ లో టైమ్ అసిస్టెంటు గా ఉద్యోగం వచ్చిందని తెలియగానే చాలా సంతోషం వేసింది. ఇకనుంచీ నెలనెలా జీతం వస్తుంది. తనూ, చెల్లెళ్ళు మంచిబట్టలు కొనుక్కోవచ్చు. మంచి డ్రెస్సులు కుట్టించుకోవచ్చు. కావాలసినవి తినొచ్చు. చెళ్ళెళ్ళు ఏం చదువుకుంటానంటే ఆ చదువు చెప్పించవచ్చు. అలా ఎన్నో ఊహలతో ఉక్కిరిబిక్కిరి అయింది తను. ఆ ఊహలే అక్కాచెల్లెళ్ళ ఊసులయి నెల గిర్రున తిరిగింది.


ఆ రోజు తనకి జీతం వచ్చే రోజు. అక్కాచెళ్ళెళ్ళు ముగ్గురూ ఎంతో మురిసిపోతున్నారు. ముందు చెళ్ళెళ్ళకి మంచి స్వీట్ తెచ్చిపెట్టాలి. ఒకపూట తిన్న చేసిన పప్పో, కూరో, మజ్జిగ నీళ్ళో రెండో పూట పచ్చడి మజ్జిగ నీళ్ళు. అవీ కూడా తండ్రి మిగిల్చిన దానిలో సరుదుకు తినడం తప్పితే వేరే తిండి తెలియదు తమకు. వివరాలు తమకు తెలియదు గానీ, బంధువులు ఎవరూ అమ్మ ఉన్నప్పుడు కూడా తమ ఇంటికి వచ్చేవాళ్ళు కాదు.


పక్కనున్నవాళ్ళు పిల్లలవస్థ పడుతున్నారని జాలిపడి, ఎప్పుడన్నా చాటుగా ఏమైనా తినుబండారాలిచ్చినా, ఎలా కనిపెట్టేవాడో, డేగలాగా వచ్చి పిల్లలకు ఉందాలేదా అని చూడకుండా తనక్కావలసింది తను తిని వెళ్ళేవాడు. పెద్దవాళ్ళకే అంత తిండి యావ ఉంటే చిన్నపిల్లలకు ఉండదా? కానీ తమ తండ్రి కోసం, తాము బతకటం కోసం ఎన్నో త్యాగాలు చేశారు అక్కాచెల్లెళ్ళు.


ముందు గదిలో ఎప్పుడూ తండ్రి, ఆయన స్నేహితులు ఉంటారు గనుక స్కూలుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తాము వీధిముఖం చూసేది. పిల్లల్ని తల్లిదండ్రులు స్కూలు దగ్గర దింపుతున్నప్పుడు, వాళ్ళ గురించి టీచర్లతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళని బుజ్జగిస్తున్నప్పుడు, వాళ్ళకి కావాలసినవి కొని పెడుతున్నప్పుడు ఇలా ఎన్నోసార్లు తనూ, చెళ్ళెళ్ళూ కూడా లేని తల్లినీ, ఉన్న తండ్రిని తలుచుకుని బాధపడేవాళ్ళు.


అప్పటినుంచీ తనలో పెరిగిన ఆలోచన, ఆశ ఒక్కటే. ఎలాగైనా తను బాగా చదివి, మంచి ఉద్యోగం సంపాదించి, ఆ జీతంతో కనీసం చెళ్ళెళ్ళ విషయంలోనైనా వాళ్ళ కోర్కెలు తీర్చాలని, అందుకే జీతంతో చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. కొండంత ఆశతో జీతం తీసుకుంది. దోవలో చెళ్ళెళ్ళకి స్వీటు తీసుకుని ఇంటికి వచ్చింది. తను రావటం చూసి ముందు గదిలోంచి తండ్రి లోపలకొచ్చాడు.


“జీతమేదీ?” చెయ్యి చాపుతూ అడిగాడు. తనిది ఊహించలేదు. తన జీతం నాన్న అడిగి తీసుకుంటాడనే ఆలోచన తనకి రాలేదు. ఎంత పొరపాటయ్యింది!


“నాన్నా, చెళ్ళెళ్ళకు బట్టలు కొనాలి. చిరిగిన వాటికి అతుకులతో స్కూలుకు వెళుతున్నారు. నేను కూడా రెండు డ్రెస్సులు కొనుక్కోవాలి. రోజూ ఆఫీసు కెళ్ళాలి కదా...” నసుగుతూనే చెప్పింది.


“ఎప్పుడూ ఉండే గోలలే కదా ఇవి. ఏం కొత్త డ్రెస్సులు లేకపోతే ఆఫీసు కెళ్ళలేవా? ఇన్నాళ్ళు మిమ్మల్నందరినీ పోతుల్లా మేపటానికెంతయిందో తెలుసా?” అరుస్తూ తన భుజాన ఉన్న హేండ్ బ్యాగ్ ని లాక్కుని పరపరా జిప్పులు పీకేసి డబ్బులు తీసుకుని వెళ్ళబోయాడు. అడ్డుపడ్డ తననీ, చెళ్ళెళ్ళను గొడ్డును బాదినట్లు బాదేశాడు. ఎంతో ఆశగా చూసిన రోజున తాము ముగ్గురూ బాగా దెబ్బలు తిని ఏడుస్తూ పడుకుండిపోయాము. తండ్రి మాత్రం వంట చేయలేదని చూసి, తను తెచ్చిన స్వీట్లు తిని పడుకున్నాడు. ఎలా తినబుద్దేసిందో?


మరునాడు ఈ దిగులుతోనే ఆఫీసుకి వెళ్ళింది. కొలీగ్ జ్యోత్స్న కనిపెట్టింది తన ఉదాసీనతను. నెమ్మదిగా లంచ్ టైమ్ లో మాట కలిపింది. జ్యోత్స్న లోని స్నేహశీలతకు తన మనసు కరిగి నీరై, కడుపు చించుకుని కాళ్ళమీద పడింది. అప్పటిదాకా ఎవరికీ చెప్పుకోలేని, చెప్పుకోని గుండెల్లో ఘోష కట్టలు తెగి ప్రవహించింది. అంతా విన్న జ్యోత్స్న ఆశ్చర్యపోయింది.


ఆమెకి తండ్రంటే పిల్లల బాధ్యత తీసుకునేవాడే అని తెలుసు. ఇలాంటి తండ్రులుంటారని ఇప్పుడే విన్నది. ముందు నమ్మలేకపోయింది. కానీ వసంతను చూస్తే నమ్మక తప్పలేదు. ఏం చెప్పాలో తోచలేదు. బయటవాళ్ళేదో చేస్తున్నారంటే నలుగురు కలిసి చెంపలు పగలగొట్టడమో ఆవేశంతోనో, లేక ఇంట్లోవాళ్ళకి చెప్పు అని ఆలోచనలతోనో చెప్పేది. కానీ కంచే చేను మేస్తే?


గుండెలో భారం దించుకుని తేలికపడిన మనసుతో తను, ఆలోచనలు భారంతో జ్యోత్స్న మౌనంగా ఉన్న సమయంలో మహేష్, ఇంకొక కొలీగ్ వాళ్ళ దగ్గరకొచ్చారు. అతను మంచివాడనే అభిప్రాయం వాళ్ళకే గాక ఆఫీసులో అందరికీ ఉండటం వల్లా, వాళ్ళు ఉన్న పరిస్థితుల వల్ల మహేష్ తన విషయం కల్పించి మాట్లాడుతున్నా మౌనంగా ఉండిపోయారు.


మహేష్ తననడిగాడు. “మీరు మీ చెళ్ళెళ్ళ జీవితాలు చక్కదిద్దాలనుకున్నారు కదా...” కొత్త మనిషి తమ విషయంలో కలగజేసుకుంటున్నారనే భావం కూడా రాలేదు మనసులో తనకు.


“అవునండి.”


“అయితే ఒక పని చెయ్యండి. మీ నాన్నగారి దగ్గర నుండి విడిగా వచ్చేయండి మీ చెళ్ళెళ్ళతో. అప్పుడు మీ జీతంతో వాళ్ళ బాగోగులు చూడవచ్చు.”


ఆ సలహా జ్యోత్స్నకు, తనకూ కూడా నచ్చింది. అక్కడే ఉంటే తమ బతుకులు అలాగే ఉంటాయి. చెళ్ళెళ్ళు కూడా ఏవో చిన్న ఉద్యోగాలు చూసుకుని, జీతం తండ్రికిస్తూ తాము ఎన్నేళ్ళయినా అవస్థలు పడాలి. అందుకే మహేష్ చెప్పిన ఆలోచన సబబుగా అనిపించింది. కానీ ఇల్లు దొరకాలి. పైగా ముగ్గురం ఆడపిల్లలం. అందులో తండ్రి ఏ సమయంలో వచ్చి గొడవ పెడతాడో తెలియదు. ఏం గోల చేస్తాడో. అలాంటివారికి ఇల్లు ఎవరిస్తారనే అనుమానాన్ని కూడా మహేష్ పోగొట్టాడు.


“మీరు ప్రస్తుతం బయట ఇల్లు తీసుకోవటం అంత మంచిది కాదు. మీరున్న పరిస్థితుల్లో మీ నాన్నగారు వచ్చి గొడవ పెడితే ఇంటిగలవాళ్ళతో ఇబ్బంది పడతారు. మీకు మా అక్కా వాళ్ళింట్లో ఒక గది ఇప్పిస్తాను. మా బావగారు ఏ.సి.పి. మా అక్కావాళ్ళు చాలా మంచివాళ్ళు. మీకు అండగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉండి, అవసరమైనప్పుడు వాళ్ళ సహాయం తీసుకోండి. మొహమాటపడకుండా.”


మరునాడే నాన్నతో దెబ్బలాడి కట్టుబట్టలతో ఇంటినుంచి బయటకు వచ్చేశాము. అక్కాచెళ్ళెళ్ళం ముగ్గురం. మా నాన్న ఏ సామాను తీసుకెళ్ళనివ్వలేదు. కనీసం బట్టలు కూడా. మహేష్ అక్క బావా చాలా సహాయం చేశారు. వాళ్ళ ఇంటిలోంచి వంటసామగ్రి, గ్యాస్ స్టవ్, సిలిండర్, పప్పులు బియ్యం మరియు ఇతర కిరాణా సామాను వంటకి అవసరమైనవన్నీ సమకూర్చి ఆ రూములో సరిది పెట్టారు. వీళ్ళు వెళ్ళేసరికి అన్నీ అమర్చి ఉన్నాయి. కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు అక్కాచెళ్ళెళ్ళు. పుట్టి బుద్దెరిగింతరువాత ఇలాంటి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అందుకోవటం ఇదే తొలిసారి.


“మీ ఋణం ఎలా తీర్చుకోగల"మంటూ బోరుబోరుమన్నారు అక్కాచెళ్ళెళ్ళు.


“మీరు మీ జీవితాల్లో బాగా అభివృద్ధిలోకి రండి. అప్పుడు మా ఋణం తీర్చేసినట్లే” అన్నారు వాళ్ళు.


చెప్పినట్టుగానే మహేష్, వాళ్ళ అక్కా, బావ తమకి చాలా సహాయం చేశారు. జీతాలరోజున వచ్చే నాన్నతో పోట్లాడి బయటకు పంపించేవాళ్ళు. తమని మాయ చేసి తెచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్న తండ్రికి మహేష్ వాళ్ళ బావ సుమంత్ హడలగొట్టాడు.


“మీ ఇద్దరు కూతుళ్ళు మేజర్ లు అయ్యారు. వాళ్ళ కంప్లైంట్ తో మిమ్మల్ని జైల్లో పెట్టించానంటే మళ్ళీ బయటకు రాలేరు. ఇప్పటిదాకా తండ్రిగా వాళ్ళ సంగతులు మీకు వీలయినంతగా, బాధ్యతగా చూశారు. ఇప్పుడు వాళ్ళ భారం మీకు తగ్గింది. కనుక మీరు హాయిగా ఉండండి” అని కొంత నచ్చజెప్పి, కొంత భయపెట్టి ఇంటి ఛాయలకు రాకుండా చేశారు.


రానురాను మహేష్ కి తనకీ మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. చెళ్ళెళ్ళ కోసం పెళ్ళే మానేద్దామని అనుకున్న తనకు వాళ్ళ అక్కా, బావ నచ్చజెప్పారు.


“మీ చెళ్ళెళ్ళు అదే ఇంటిలో ఉండవచ్చు. వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడే దాకా నీ జీతం వాళ్ళకే ఇచ్చేయ్” అన్నారు మహేష్ అక్కా, బావలు.


ఇన్ని చెప్పినా తన మనసులో ఉన్న అనుమానం బయటపెట్టింది వద్దనుకుంటూనే. “మనకు పిల్లలు పుడితే, మరి మా చెళ్ళెళ్ళకి కూడా తండ్రిగా అన్ని బాధ్యతలు తీసుకుంటారా? వాళ్ళకి తండ్రి ప్రేమకి లోటు రాకుండా చూసుకుంటారా?” అని అడిగింది.


“మన పిల్లలకు కాదు. నీ చెళ్ళెళ్ళని కూడా నా పిల్లలుగా చూసుకుంటానన్నాడు మహేష్.” అన్నట్లుగానే అన్ని బాధ్యతలు తీసుకున్నాడు. చెళ్ళెళ్ళు కూడా బాగా సెటిల్ అయ్యారు. మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశారు. నాలుగేళ్ళ క్రితం నాన్న చనిపోయాడు. చివరి సమయంలో ఆయనకే లోటు రాకుండా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు మహేష్, తను మరియు చెళ్ళెళ్ళు.


ఎంతయినా తమకి జన్మనిచ్చిన తండ్రి కదా; ఆయనలో మాత్రం లేశమంతైనా చివరిదాకా పశ్చాత్తాపం గానీ, తమమీద ప్రేమగానీ ఏమాత్రం కించిత్తు కూడా కనబడలేదు. ఎవరి కోసం చేస్తారన్నట్లే ప్రవర్తించాడు. అందుకే తమ బాధ్యతను నెరవేర్చామన్న సంతృప్తి తప్పితే తండ్రి చనిపోయాడనే బాధ ఏమాత్రమూ లేదు. ప్రస్తుతం జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా, హాయిగా సాగిపోతోంది.


ఆత్మబంధువులంటే మన బంధువులు, రక్తసంబంధీకులే ఉండరు. ఉండనక్కరలేదు.

ఆపదల్లో ఉన్నప్పుడు ఆదరించి, ఆదుకుని జీవితాన్ని నిలబెట్టి, జీవితాంతం తోడూ-నీడగా ఉంటూ, తన కుటుంబానికి ఆసరాగా ఉంటూ మంచిచెడ్డలు కనుక్కునే వాళ్ళే నిజమైన ఆత్మబంధువులు.


స్త్రీ ఒక నది లాంటిది.


నది మార్గంలో రాళ్ళు ఉంటాయి. కొన్నిసార్లు అడ్డుకట్టలు నిలుస్తాయి. కొన్నిచోట్ల దాని ప్రవాహం ఆగిపోయినట్టే కనిపిస్తుంది కానీ నది ఎప్పుడూ ఆగదు. అది మెల్లగా మార్గాన్ని మార్చుకుంటుంది. రాళ్ళను తాకి గాయపడినా ముందుకే ప్రవహిస్తుంది. ఎందుకంటే నదికి తెలుసు, తన గమ్యం సముద్రమని.


ఇప్పుడు వసంత ఒంటరి కాదు. ఆమె అడుగుల వెంట ఇంకా ఎన్నో అడుగులు రావాల్సి ఉన్నాయి. ఆమె ప్రవాహంలో ఇంకా ఎన్నో కథలు కలవాల్సి ఉన్నాయి. పడినా మళ్ళీ లేచే స్త్రీ. పోరాడి ముందుకు వెళ్ళే స్త్రీ. తన బిడ్డలో విలువలు నాటే స్త్రీ. రేపటి తల్లులకు దారి చేసే స్త్రీ.

***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి, మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page