అద్దాలు
- Routhu Srinivasa rao

- Jun 23
- 3 min read
అద్దాలు, రౌతు శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక కథనం, పరమాత్మ ప్రేమ, తల్లి ప్రేమ, దైవ దర్శనం, జీవిత తత్వం, మానవత్వం, ఆధ్యాత్మిక చింతన, తెలుగు ఆధ్యాత్మిక రచన, జీవన సత్యం, తాత్విక వ్యాసం, దేవుడు మరియు మనిషి, తెలుగు సాహిత్యం, ప్రేరణాత్మక రచన

Addalu - Telugu Emotional Article | Routhu Srinivasa rao
అద్దాలు - తెలుగు భావోద్వేగ వ్యాసం | రౌతు శ్రీనివాసరావు
Publishes in manatelugukathalu.com on 23/06/2026
మన జీవితంలో ఎన్నో విషయాలు మన కళ్ల ముందే ఉన్నా, వాటి అసలు సత్యం మనకు కనిపించకపోవచ్చు. ఒక చిన్నారి కళ్లకు అద్దాలు పెట్టిన తర్వాత తన తల్లి ముఖాన్ని మొదటిసారి స్పష్టంగా చూసిన సంఘటనను ఆధారంగా తీసుకుని, మనిషి మరియు పరమాత్మ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ రచన అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ప్రేమ, దైవత్వం, కర్మ సిద్ధాంతం, మానవ సంబంధాల గురించి పాఠకుడిని లోతైన ఆలోచనలో ముంచెత్తే ఆధ్యాత్మిక వ్యాసం ఇది.
ఒక చిన్న బాబు... అతని కళ్లకు సరిగా కనిపించేది కాదు. తల్లి ముఖం ఎప్పుడూ అతని ఎదుటే ఉండేది, కానీ అతనికి స్పష్టంగా కనిపించేది కాదు. కొన్ని నెలల తర్వాత డాక్టర్ అతనికి చిన్న కళ్లద్దాలు పెట్టాడు. కళ్లద్దాలు పెట్టిన క్షణంలోనే బాబు మొదటిసారి తన తల్లి ముఖాన్ని స్పష్టంగా చూశాడు. ఆ క్షణం అతని కళ్లలో ఆశ్చర్యం, అతని ముఖంలో ఆనందం, అతని పెదవులపై నవ్వు. "అమ్మా... నువ్వేనా?" అన్నట్లు ఆమెను చూస్తూనే ఉన్నాడు. తల్లి కూడా కన్నీళ్లతో నవ్వింది. ఎందుకంటే... ఆ బిడ్డ తల్లిని మొదటిసారి చూసినట్లే, దేవుడు కూడా తన సృష్టించిన పిల్లలు తనను గుర్తిస్తారని ఎదురుచూస్తున్నాడా?
తల్లి బిడ్డను తొమ్మిది నెలలు గర్భంలో మోస్తుంది. కానీ పరమాత్మ జీవిని జన్మజన్మలుగా తన హృదయంలో మోస్తాడు. తల్లి బిడ్డను కొంతకాలం మాత్రమే పెంచుతుంది, కానీ పరమాత్మ జననం నుండి మరణం వరకు, మరణం తర్వాత కూడా విడిచిపెట్టడు. "ప్రభూ!.. మీరు అందరినీ ఇంత ప్రేమిస్తే, ఎందుకు కొందరు రాజభవనాల్లో పుడతారు? ఎందుకు కొందరు వీధుల్లో పుడతారు? ఎందుకు కొందరు సుఖంగా ఉంటారు? మరికొందరు కష్టాల్లో ఉంటారు?" ప్రతి ప్రయాణంలో వేరే పాఠం నేర్చుకోవాలా? ఏసీలో నిద్రిస్తున్నవాడికి, ఎండలో చెమటోడ్చుతున్నవాడికి, పరమాత్మ ఒక్కడేనా? పండుగ భోజనం చేస్తున్నవాడికి, ఆకలితో ఏడుస్తున్నవాడికి, పరమాత్మ ఒక్కడేనా?
ఆ బిడ్డకు కళ్లద్దాలు పెట్టిన తర్వాతే సంతోషం కనిపించింది. అలాగే మనుషులకు కూడా ఒక కళ్లద్దం కావాలేమో స్వామీ... నీ దర్శనానికి. సామాన్యులకి కూడా ఒక అద్దాన్ని ఇవ్వు స్వామీ. అప్పుడు నీవు కనిపిస్తావు. అప్పుడు నీవు లెక్కలు వ్రాయకుండా కూర్చోవచ్చు. అందరూ మంచిగా ఉంటే దుష్కర్మ ఉండదు కదా? అందరూ ఒకరినొకరు ప్రేమిస్తే పాపపుణ్యాల లెక్కల అవసరం ఏముంటుంది? అప్పుడు నీ సృష్టి అంతా ఒకే కుటుంబంలా మారిపోదా స్వామీ?
అందరికీ బువ్వ పెడితే నీ ఆకలి తీరుతుంది, అందరికీ కునుకు ఇస్తే నీవు హాయిగా శయనిస్తావు, అందరి ఆనందమే నీ ముఖంపై మెరిసే చిరునవ్వు కాదా స్వామీ? ఆ చిన్నారి కళ్లకు కళ్లద్దాలు పెట్టినట్టు, మా మనసులకు కూడా ఒక సుదృష్టిని ప్రసాదించు. అప్పుడు మేము మనుషుల్లో , నీ రూపాన్నే చూస్తాము. అనాథలో నిన్ను చూస్తాము, ఆకలితో ఉన్నవాడిలో నిన్ను చూస్తాము, కన్నీరు కార్చేవాడిలో నిన్ను చూస్తాము, సాయం చేసే చేతిలో నిన్ను చూస్తాము. అప్పుడు ద్వేషం కరిగిపోతుంది, అసూయ మాయమైపోతుంది, "నాది" అనే గోడలు కూలిపోతాయి, "మనది" అనే తలుపులు తెరుచుకుంటాయి.
స్వామీ... నీ వెలుగు ఒక్కసారి ప్రతి హృదయాన్ని తాకితే, ఆ మంచుకిరణం తాకిన పువ్వులా ఈ భూమి మొత్తం వికసిస్తుంది. అప్పుడు రాజభవనం, గుడిసె అనే తేడా ఉండదు, ధనవంతుడు, పేదవాడు అనే భేదం ఉండదు, అందరూ నీ పిల్లలే అని ప్రపంచం గుర్తుంచుకుంటుంది. ఆ రోజు నీవు పాపపుణ్యాల లెక్కలు చూడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ప్రతి హృదయం ఒక దేవాలయమవుతుంది, ప్రతి మనిషి ఒక దీపమవుతాడు, ప్రతి ప్రేమ ఒక ప్రార్థన అవుతుంది. అప్పుడు ఈ భూమంతా వైకుంఠంలా మారిపోతుంది స్వామీ...
మరియు ఆ చిన్న బిడ్డ తన తల్లిని మొదటిసారి చూసినప్పుడు నవ్వినట్లే, నీ ప్రేమను గుర్తించిన ప్రతి హృదయం అదే ఆశ్చర్యంతో, అదే ఆనందంతో, "ఓహ్... ఇంతకాలం నువ్వేనా నా వెంట నడిచింది!" అని కన్నీటి నవ్వుతో నీ వైపు చూస్తూ నిలబడిపోతుంది స్వామీ...
***************************************
రౌతు శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రౌతు శ్రీనివాసరావు
నా పేరు రౌతు శ్రీనివాసరావు. నేను భారతీయ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. కవితలు, కథలు చదవడం, రచించడం నా అభిరుచులు. సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ, నా మనోభావాలను చిన్న చిన్న కథానికలుగా, కవితలుగా మలచే ప్రయత్నం చేస్తున్నాను. నా రచనలను చదివి మీ విలువైన అభిప్రాయాలు, ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏






Comments