top of page
Original.png

నిబద్ధత

నిబద్ధత, క్రమశిక్షణ, బాధ్యత, సామాజిక విలువలు, Telugu article, discipline in life, commitment, social responsibility, traffic discipline, public behavior, life values, motivational Telugu article, personal development, positive habits, civic sense, self discipline, Telugu essays, inspirational article, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'నిబద్ధత' వ్యాసంలో క్రమశిక్షణ, నిబద్ధత, సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను ప్రతిబింబించే ట్రాఫిక్ అవగాహన చిత్రం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'నిబద్ధత' వ్యాసంలో క్రమశిక్షణ, నిబద్ధత, సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను ప్రతిబింబించే ట్రాఫిక్ అవగాహన చిత్రం.

Nibaddhatha - Telugu Special Article | Kanakadurga Lakshmirathna

నిబద్ధత తెలుగు ప్రత్యేక వ్యాసం | కనకదుర్గా లక్ష్మీరత్న

Published in manatelugukathalu.com on 22/06/2026


మన జీవితంలో విజయాన్ని నిర్ణయించేది ప్రతిభ ఒక్కటే కాదు. నిబద్ధత, క్రమశిక్షణ, సహనం కూడా అంతే ముఖ్యమైనవి.

మనం ట్రాఫిక్‌లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, దేవాలయాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో ఎదుర్కొనే చాలా సమస్యలకు మూల కారణం ఒకటే — నిబద్ధత లోపించడం. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి వ్యవహరిస్తే ఎన్నో సమస్యలు సహజంగానే పరిష్కారమవుతాయి.

"నిబద్ధత" అనే ఈ ఆలోచనాత్మక వ్యాసం వ్యక్తిగత జీవితంలోనే కాదు, సామాజిక జీవితంలో కూడా క్రమశిక్షణ ఎంత అవసరమో వివరిస్తుంది. మంచి పౌరుడిగా, మంచి మనిషిగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన వ్యాసం ఇది.


నిబద్ధత అంటే ఒక పని లేదా లక్ష్యం పట్ల అంకితభావంతో ఉండటం. ఒక నియమానికి, సూత్రానికి కట్టుబడి ఉండటం. సమాజంలో ఎంత మంది నిబద్ధత కలిగి ఉన్నారని ఆలోచిస్తే, చాలా మందిలో అది కొరవడిందనే చెప్పవచ్చు. అలా అని అందరినీ ఆ జాబితాలో చేర్చలేము. కొద్దో గొప్పో నిబద్ధత కలిగి ఉన్నవారు లేకపోలేదు. కొందరు కొన్నింట నిబద్ధత కలిగి ఉంటారు. కొన్నింట సందర్భానుసారంగా లేదా తమకు అనుకూలంగా సడలించుకుంటారు. కొన్నింట అసలు ఉండదు.


నిబద్ధత పూర్తిగా కొరవడేది ఎక్కడంటే - దైవ దర్శనాల కోసం క్యూలలో నిరీక్షించేటప్పుడు, ప్రభుత్వ కార్యాలయాలలో పని అవడానికి పడిగాపులు పడేటప్పుడు, పుష్కరాలలో లేదా నదీ స్నానాలలో, పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు, సినిమా హాళ్లల్లో, శౌచాలయాల్లో... ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద జాబితానే తయారవుతుంది.


నిశితంగా పరిశీలిస్తే నిబద్ధత లోపించడానికి ప్రధాన కారణం అంతులేని, అంతుపట్టని నిరీక్షణ. ఈ నిరీక్షణే సహనాన్ని అణచివేసి, నిబద్ధత లోపించడానికి దారి తీస్తుంది.


క్రమశిక్షణారాహిత్యం వల్ల కూడా నిబద్ధత కొరవడుతుంది. జనాల్లో అనవసరమైన, అర్థం లేని ఆతురత వల్ల కూడా నిబద్ధత పాటించరు.


ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, బ్యాంకుల్లోనూ పనులు కావాలంటే కాళ్లు కాయలు కాయాల్సిందే. కొన్ని కార్యాలయాల్లో ఎప్పుడు వెళ్లినా సర్వర్ డౌన్లో ఉంటుంది. కొన్నింటిలో ప్రింటర్ ఏ కాలంలోనూ పనిచేయదు. ఏదైనా సులువు పద్ధతి ప్రవేశపెడితే, అమలులోకి వచ్చిందా అని అడగబోతే, 'అంటే! మేమింక మొదలుపెట్టలేదండీ! టైం పడుతుంది' అంటారు. దేశం, టెక్నాలజీ అభివృద్ధి చెందినా, వీరి పద్ధతులు, పని చేసే విధానంలో మాత్రం పురోగతి ఉండదు.


ఈ మధ్య ఎవరి నోట విన్నా ట్రాఫిక్లో ఇరుక్కున్న గాథలే. రోడ్లు ఈనినట్లు జనాలు, వాహనాలు. అసలే ఎగుడుదిగుడు రోడ్లు. ఎక్కడి పడితే అక్కడ గుంటలు. దానికి తోడు ప్రతి ఇంటికి రెండు కార్లు, ఒక స్కూటర్ సాధారణం అయిపోయింది. అయిందానికీ, కానిదానికీ ఇంట్లో పడున్నాయి కదా అని పుష్పక విమానం లాంటి వాహనాలు వేసుకుని రోడ్డున పడతారు. ఏదో గుంట వస్తుంది. కర్ణుడి రథం కూరుకుపోయినట్లు గుంటలో ఇరుక్కుపోతుంది. ఇంక ఎక్కడివక్కడే నిలిచిపోయి అష్టదిగ్బంధం అయిపోతుంది. 'ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్' అన్న పాట రీతిలో ఎక్కడి గుంటలు అక్కడే పడుంటాయి.

కొందరు ట్రాఫిక్ నియమావళిని అతిక్రమించి పోతుంటారు. వారిని నియంత్రించేవాళ్లు ఉండరు. ఒక లైన్లో వెళ్లడానికి మాత్రమే సరిపడ దారి ఉన్నచోట, లైన్లో నిరీక్షించలేక పడవలాంటి కారుతో వచ్చి రెండో లైను చేస్తారు. ఎదురుకుండా వచ్చే వాహనానికి దారి ఇవ్వకపోతే ట్రాఫిక్ స్తంభిస్తుంది అన్న జ్ఞానం ఉండదు. 'ఆ! వాడే పక్కకి పోతాడులే' అనే అహంభావం. అవసరమైతే నాలుగు అరుపులు, కుదిరితే కొద్దిగా కుమ్ములాట. ఇలా ఉంటుంది వ్యవహారం. అవసరం ఉన్నా లేకపోయినా పదేపదే హారన్ మోగిస్తూ తమ అసహనాన్ని ప్రదర్శించడం. ప్రతి ఒక్కరికీ తొందరగా ఇంటికి చేరి పడాలని ఉంటుంది. తప్పు లేదు. మళ్ళీ నిబద్ధత ఉండదు. ఒకడు రూల్ ని అతిక్రమిస్తే తక్కినవాళ్లు వాడిని అనుసరిస్తారు. 


అదే జనం పరాయి దేశం వెళ్తే క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. వారి ట్రాఫిక్ నియమావళిని తు.చ తప్పకుండా పాటిస్తారు. అదే క్రమశిక్షణ, నిబద్ధతతో ఇక్కడ కూడా వ్యవహరించవచ్చు కదా! ఇక్కడ పాటించకపోయినా చలామణి అయిపోతుందిలే అనే తేలిక భావం. జనాలు కూడా ఈ ట్రాఫిక్ జాములకి అలవాటు పడిపోయి, నగరాల్లో ఇది సర్వసాధారణమే అన్నట్లు మసలుకుంటుంటారు.

పబ్లిక్ శౌచాలయాలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా కొన్ని శౌచాలయాల్లో నీరు ఉండదు, పరిశుభ్రత ఉండదు. కాపలా మనిషి లెక్కగా ముందే డబ్బులు తీసేసుకుంటాడు. మరి నీళ్లు లేవే అంటే నీళ్లు నములుతాడు. డబ్బులు తీసుకునేటప్పుడు ఉన్న బాధ్యత, శౌచాలయ పరిశుభ్రత, నీరు ఏర్పాటు చేయడంలోనూ ఉండాలి కదా! వృత్తిలో నిబద్ధత ఉండదు. అవసరం వాళ్లది కదా అనే నిర్లక్ష్య వైఖరి! ఎవరైనా ఆ మనిషికి బాధ్యత గుర్తు చేయబోతే 'నీళ్లు వచ్చే చోటుకే పో!' అని పొగరుగా అంటాడు.


పుష్కర, నదీ స్నానాలకి లక్షల్లో జనాలు వస్తుంటారు. భక్తి ఉబికి వచ్చేలా నదీ హారతులు, రంగురంగుల విద్యుదీపాలు, పూజ సామగ్రి ఇలా అన్ని హంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కానీ స్నానం చేసిన తరువాత వస్త్రాలు మార్చుకోవడానికి స్త్రీలకు సదుపాయం ఉండదు. చేసినవి కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వారు ఎంత అసౌకర్యానికి గురవుతున్నారో గుర్తించరు.


జనాలు భక్తితో పుణ్యక్షేత్ర దర్శనానికి వస్తారు. చాలా సేపు పాపం ఓపికగానే దర్శనం కోసం వేచి చూస్తారు. నిరీక్షణ సమయం పెరిగేకొద్దీ నెమ్మదిగా ఒంట్లో ఓపిక క్షీణించి లైను అతిక్రమించడమో, పోట్లాటకో దిగుతారు. ఇంక పుణ్యక్షేత్రం కాస్త కురుక్షేత్రం అవుతుంది. అవయవాలే అస్త్రాలు, ఆయుధాలు అవుతాయి. దైవ దర్శనానికి వచ్చామా, జల్లికట్టుకు వచ్చామా అని జనాలు అయోమయానికి లోనవుతారు.

అసలు లోపం ఎక్కడ ఉందని తర్కించుకుంటే, ఇరువైపులా నిబద్ధత లోపించిందని తేటతెల్లమవుతుంది. 


పోటెత్తుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని, నిర్వాహకులు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకుని నిబద్ధతతో దానిని అనుసరించాలి. ప్రమాదాలకు, తొక్కిసలాటకు తావు ఇవ్వకూడదు. భక్తులు కూడా ఎక్కువ సేపు భగవంతుడిని చూసెయ్యాలని, ఆయన్ని కళ్లతోను, స్తోత్రాలతోను 'హైజాక్' చేసేసి, ఆయన విగ్రహం ముందు తాము విగ్రహంలా నిలబడిపోయి మిగతా వారికి అవకాశం లేకుండా చేయకూడదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇరువైపులా క్రమశిక్షణ, నిబద్ధత కలిగి సంయమనం పాటించాలి. అప్పుడు ఏ పొరపాట్లకు తావు ఉండదు.


నిర్వాహకులు తమ ప్రణాళికలననుసరించి నిబద్ధతగా వ్యవహరించిన ఉదంతాలు లేకపోలేదు. దర్శనానికి కాలాతీతం అవుతోందని తెలియగానే వేడి వేడి ప్రసాదాలతో ఆకలి తీర్చడం, చల్లని మజ్జిగతో సేద తీర్చిన సంఘటనలు కూడా చెప్పుకోవాలి.


పుణ్యక్షేత్రమైనా, పుష్కరాలైనా, ప్రభుత్వ కార్యాలయమైనా, పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ అయినా, సినిమా హాలైనా, శౌచాలయమైనా అన్నింటికీ ఒకటే మందు - నిబద్ధత.


దైనందిన జీవితంలో కూడా నిబద్ధత ఎంతో అవసరం. వేళకు నిద్రలేవడం, పడుకోవడం కూడా ఒక నిబద్ధతే. చదువులోనూ, చేసే పనిలోనూ, ఇంటిని సమర్థవంతంగా నిర్వహించడంలోనూ, ఆఖరికి వేళకు అన్నం తినడంలోనూ నిబద్ధత అవసరమే. నిబద్ధత మనిషి రక్తంలోనే ఇమిడి ఉండాలి.


***

కనకదుర్గా లక్ష్మీరత్న గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: కనకదుర్గా లక్ష్మీరత్న

నా పేరు కనకదుర్గా లక్ష్మీరత్న. నేను గృహిణిని. సాహిత్యం పట్ల ఆసక్తితో రచనలు చేస్తున్నాను. నా రచనలు ఈనాడు ఆదివారం అనుబంధంలోను, వివిధ అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యేయి. ప్రతిలిపికి రాస్తుంటాను.

3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

The problems that a common man face in day to day life is described realisitcally in this write up. The identification of the root cause of the social problems is the first step towards resolving the issue. This article opens the door for introspection by each individual and pehaps motivates them to do his portion of duty for the solution.

Like

Rated 5 out of 5 stars.

నిబద్దత అనేది రక్తంలోని ఉండాలనే మాటకు ఏకీభవిస్తూ, నిబద్ధత ను సింగపూర్ పాలకులు 20 ఏళ్లలో ఎలా ప్రజల్లో తెచ్చారో కూడా గమనించాలి. ముఖ్యంగా కిందటి తరంవరకు పాఠ్యఅంశాల్లో నైతిక విలువలు తెలియచెప్పే ఉత్తమ కథలు ఉండేవి. మోరల్ క్లాసులు ఉండేవి. గత ముప్పై ఏళ్లుగా జాతి నైతికత అనే విషయాన్ని గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా బతుకుతున్నారు. చట్టం పట్ల భయం కానీ , తోటివారిపట్ల గౌరవం కానీ, సమాజం పట్ల బాధ్యత కానీ లేని జాతిలా మారిపోతోంది. దీనికి మనెవ్వరి దగ్గరా సమాధానం లేకపోయినా, సమస్యను ముందుకు తెచ్చినందుకు అభినందనలు రత్నగారూ.

Like

Rated 5 out of 5 stars.

వ్యక్తిగత జీవితానికి, సామాజిక జీవనానికి నిబద్ధత ఎంత అవసరమో అందరూ గ్రహించాలా చేప్పారు లక్ష్మీరత్న గారు చాలా మంచి useful రచన. 👍🏻👏🏻🙏🏻

Like
bottom of page