ధృతరాష్ట్రుడు కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అనడంలో ఆంతర్యం ఏమిటి?
- Rayala Sreeramachandra Kumar

- Jun 21
- 6 min read
ధృతరాష్ట్రుడు, ధర్మక్షేత్రం, కురుక్షేత్రం, మహాభారతం, భగవద్గీత, Dhritarashtra, Kurukshetra, Dharmakshetra, Mahabharata Analysis, Bhagavad Gita, దుర్యోధనుడు, పుత్రవ్యామోహం, ధర్మం, కృష్ణుడు, సంజయుడు, ఆధ్యాత్మిక వ్యాసం, Telugu Spiritual Article, Indian Epics, Krishna Philosophy
What is the underlying intention behind Dhritarashtra calling Kurukshetra "Dharmakshetra"? - Telugu Article | R C Kumar
ధృతరాష్ట్రుడు కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అనడంలో ఆంతర్యం ఏమిటి? - తెలుగు వ్యాసం | ఆర్ సి కుమార్
Published In manatelugukathalu.com On 21/06/2026
మహాభారతంలోని అత్యంత విషాదకరమైన పాత్రల్లో ధృతరాష్ట్రుడు ఒకడు. ధర్మం ఎటువైపు ఉందో తెలిసినా, తన కుమారుడి పట్ల ఉన్న గుడ్డి ప్రేమ కారణంగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయిన రాజు.
భగవద్గీత ప్రారంభంలో ఆయన పలికిన తొలి మాటలే – "ధర్మక్షేత్రే కురుక్షేత్రే".
కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని సంబోధించినప్పుడు ధృతరాష్ట్రుడి మనసులో ఏమి నడిచింది? ధర్మం గెలుస్తుందనే భయమా? తన కుమారుల భవితవ్యంపై ఆందోళనా? లేక జీవితమంతా చేసిన తప్పుల పట్ల అపరాధ భావనా?
ఈ వ్యాసం ధృతరాష్ట్రుడి వ్యక్తిత్వాన్ని, అతని బలహీనతలను, మహాభారత యుద్ధానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తూ, నేటి మన జీవితాలకు కూడా వర్తించే విలువైన పాఠాలను అందిస్తుంది.
స్వార్థం, పగ, ఈర్షా ద్వేషాలకు సంబంధించి మహాభారతంలోని ఒక ప్రముఖమైన పాత్ర అయిన ధృతరాష్ట్రుడి వృత్తాంతం ఎంతో కీలకమైనది. మహాభారతంలోని ప్రతీ పాత్ర ఖచ్చితంగా మనలో కూడా ఎంతో కొంత అంతర్లీనంగా ఉంటుంది. ప్రతికూల పాత్ర పోషించిన ధృతరాష్ట్రుడు మనలో కూడా ఉన్నాడు. గుడ్డి ప్రేమ, స్వార్థం, అధికారంపై మోజు వల్ల ఏది ధర్మమో ఏది న్యాయమో తెలిసినా కూడా మౌనంగా ఉండడం అనే లక్షణాలే మనలో ధృతరాష్ట్ర పాత్రను వెల్లడిస్తాయి. దుర్యోధనుడు, శకుని, కర్ణుడు వీళ్ళెవరూ కురుక్షేత్ర యుద్ధానికి మూల కారకులు కారు. యుద్ధానికి దారితీసిన परिस्थितियोंకు ప్రధాన కారకుడు ధృతరాష్ట్రుడు మాత్రమే. యుద్ధానికి ముందు సంజయుడితో కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అనడానికి కారణం ధర్మం ఎటువైపు ఉందో గెలుపు అటువైపే ఉంటుంది అన్న ఆందోళన కలగడమే.
మహాభారతంలో పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడు కురు వంశానికి రాజు. ధృతరాష్ట్రుడి తల్లి అంబిక వ్యాసుడి భయంకరమైన రూపాన్ని చూసి కళ్లు మూసుకుంటే, దాని ఫలితంగా అతను గుడ్డివాడుగా జన్మించాడు. అయినప్పటికీ, పోరాట నైపుణ్యాలలో, ముఖ్యంగా మల్లయుద్ధం మరియు గదాయుద్ధంలో శిక్షణ పొంది ఆరితేరాడు.
ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కావడం వల్ల ఆ కాలపు నియమాల ప్రకారం అంధుడైన వ్యక్తి రాజు కాలేడు. అందువల్ల అతని తమ్ముడైన పాండురాజుకు ముందుగా పట్టాభిషేకం జరిగింది. తన అంధత్వం సింహాసనానికి దూరం చేసిందన్న అసంతృప్తి, మానసిక అభద్రతాభావం ధృతరాష్ట్రుడిలో కలిగింది. కొంతకాలం గడిచాక కరిముని శాపం కారణంగా అతను పశ్చాత్తాపం చెంది రాజ్యాన్ని వదిలి, భార్యలైన కుంతి, మాద్రితో సహా వానప్రస్థానికి అడవులకు వెళ్లవలసి వచ్చింది. ధృతరాష్ట్రుడికి అది కలిసి వచ్చింది. పాండురాజు అడవులకు వెళ్లాలి కాబట్టి అంధుడైన ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి తాత్కాలిక పాలకుడిగా నియమించబడ్డాడు. పాండురాజు కుమారులు (పాండవులు) చిన్నపిల్లలుగా ఉండటం వల్ల రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించాడు. పాండవులు పెద్దవారయ్యే వరకు ధృతరాష్ట్రుడు సంరక్షకుడిగా (caretaker) మాత్రమే రాజ్యం చేయాలని నిర్ణయించారు.
ధృతరాష్ట్రుడికి అంధత్వం ఉన్నందున, రాజ్య పరిపాలనలో సహాయకులుగా భీష్ముడు, విదురుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండాలని కూడా నిర్ణయం జరిగింది. వీరు ధృతరాష్ట్రుడికి ధర్మం పట్ల స్పష్టమైన అవగాహన కల్పించినప్పటికీ అతను వాటిని పట్టించుకోలేదు. కాలక్రమేణా ధృతరాష్ట్రుడు నామమాత్రపు పాలకుడి నుండి పూర్తి స్థాయి రాజుగా సింహాసనాన్ని అంటిపెట్టుకున్నాడు. అంతక్రితం న్యాయబద్ధంగా పట్టాభిషిక్తుడైన పాండురాజు తన రాజ్యాన్ని తాత్కాలికంగానే అప్పగించినందున, అతని పెద్ద కుమారుడైన ధర్మరాజు (యుధిష్ఠిరుడు) అసలైన వారసుడు కావాలి. కానీ ధృతరాష్ట్రుడికి సింహాసనంపై ఉన్న వ్యామోహం వల్ల తన కొడుకైన దుర్యోధనుడిని యువరాజుగా చేయడానికే మొగ్గు చూపాడు. పుత్ర వ్యామోహం అతడిని ధర్మపథం నుండి తప్పించింది, న్యాయపరంగా పాండవులకు చెందవలసిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది. తద్వారా వారసత్వ పోరు మొదలైంది.
మహాభారతంలో పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన రాజ్యాధికార వివాదాలు, అలాగే వారి మధ్య జరిగిన ప్రధాన ఒప్పందాలు ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలను తలపిస్తాయి. ఈనాటి రాజకీయాల్లో ఆత్మ స్తుతి పరనిందలతో ఆధిపత్య పోరు కొనసాగుతుంటే, ఇక్కడ ప్రధాన వివాదం రాజకీయ వారసత్వ హక్కు గురించి. పాండురాజు తన పెద్దన్న అయిన ధృతరాష్ట్రుడికి రాజ్యాన్ని తాత్కాలికంగానే అప్పగించాడు కాబట్టి, పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు (యుధిష్ఠిరుడు) అన్ని విధాలా రాజ్య పట్టాభిషేకానికి అర్హుడు. కానీ దుర్యోధనుడి వాదన
అందుకు విరుద్ధంగా ఉంది. తన తండ్రి అయిన ధృతరాష్ట్రుడు రాజుగా సింహాసనంపై ఉన్నాడు కాబట్టి, ప్రస్తుత రాజుకి పెద్ద కొడుకుగా రాజ్యాధికారం తనకే దక్కాలని దుర్యోధనుడు వాదించాడు. ఎదురు చెప్పిన మేధావుల నోళ్లు మూయించాడు. ధర్మరాజు గుణగణాలను చూసి హస్తినాపుర ప్రజలందరూ ఆయననే రాజుగా చూడాలనుకున్నారు. ఇది దుర్యోధనుడిలో అసూయను మరింతగా పెంచింది. ఈ వివాదాన్ని ముగించడం కోసం చివరికి సహృదయంతో పాండవులు రాజ్య విభజన ఒప్పందానికి అంగీకరించారు.
అసలు ఈ చర్చలు, ఒప్పందాలు లేకుండా పాండవులందరినీ లేపేస్తే సమస్యే ఉండదు కదా అనుకున్నాడు దుర్యోధనుడు. కానీ విదురుడి పుణ్యమా అని పాండవులను చంపడానికి దుర్యోధనుడు వేసిన లక్కగృహ ప్రణాళిక విఫలమైంది. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుని, బలమైన పాంచాల దేశ మద్దతుతో తిరిగి హస్తినాపురానికి వచ్చి న్యాయపరంగా తమకు రావలసిన రాజ్యం కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత కౌరవులు పాండవుల మధ్య రాజ్య విభజన విషయంలో రెండు మూడు ఒప్పందాలు జరిగి విఫలమైనాయి. యుద్ధాన్ని నివారించడానికి ధృతరాష్ట్రుడు ఒక ఒప్పందాన్ని ప్రతిపాదించాడు. దాని ప్రకారం హస్తినాపురం కౌరవుల ఆధీనంలోనే ఉండిపోతుంది. ఖాండవప్రస్థం అనే ఎడారి లాంటి, పాడుబడిన ఒక ప్రాంతాన్ని పాండవులకు ఇచ్చారు. అయినా దాంతోనే సరిపెట్టుకొని పాండవులు శ్రీకృష్ణుడి సహాయంతో, శిల్పి మయుడి ద్వారా ఖాండవప్రస్థాన్ని అద్భుతమైన ఇంద్రప్రస్థ నగరంగా మార్చుకుని, అక్కడ స్వతంత్రంగా పాలన సాగించారు.
ఇంద్రప్రస్థ నగరంలో పాండవుల వైభవాన్ని చూసి ఓర్వలేని దుర్యోధనుడు, శకునితో కలిసి పాండవులను దెబ్బతీయడానికి మాయాజూద పన్నాగం పన్నారు. జూదంలో ఓడిన పాండవులు షరతుల ప్రకారం 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఆ తర్వాత 13వ సంవత్సరం అజ్ఞాత వాసం విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చాక పాండవులకు ఇంద్రప్రస్థ రాజ్యాన్ని తిరిగి ఇవ్వవలసిన దుర్యోధనుడు మొండి చెయ్యి చూపాడు. చివరి ప్రయత్నంగా కొనసాగిన శాంతి ప్రయత్నాలలో భాగంగా ముందుగా సంజయుడి రాయబారం, ఆ తర్వాత శ్రీకృష్ణ రాయబారం జరిగింది. స్వయంగా శ్రీకృష్ణుడే పాండవుల తరఫున హస్తినాపురానికి వెళ్లి యుద్ధాన్ని ఆపడానికి కనీసం "ఐదు ఊళ్లు" (కుశస్థలి, వృకస్థలి, ఆసంతి, వారణావతం, ఏదైనా మరొక ఊరు) ఇచ్చినా పాండవులు సర్దుకుపోతారు అని ప్రతిపాదించాడు. దానికి కూడా ఒప్పుకోకుండా దుర్యోధనుడు తిరస్కరించి కనీసం "సూదిమొన మోపినంత నేల కూడా ఇవ్వను" అని స్పష్టం చేయడంతో శాంతి ఒప్పందాలన్నీ విఫలమై యుద్ధం అనివార్యమైంది.
ఈ పరిస్థితులను చక్కదిద్దగల సామర్థ్యం ఉండి కూడా ధృతరాష్ట్రుడు పుత్ర వాత్సల్యం వల్ల మౌనంగా ఉండి పోయాడు. శకుని ఆధ్వర్యంలో జరిగిన మాయా జూదాన్ని, ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని ఆపగలిగే పూర్తి అధికారాలు మహారాజుగా తనకు ఉన్నప్పటికీ, కొడుకు మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు మౌనంగా ఉండిపోయాడు. ఇటువంటి బలహీనతలే మహాభారత యుద్ధానికి మూలకారణం అయింది. ఉదాసీనంగా చూస్తూ ఉండిపోయిన భీష్మ పితామహుడు రక్తం కారేలా బాణాలు గుచ్చుకునే అంపశయ్య మీద 58 రోజులు గడపవలసి వచ్చింది. పుట్టుగుడ్డి గా జన్మించిన ధృతరాష్ట్రుడికి తన గుడ్డితనానికి పరిహారంగా, వ్యాసుడు ధృతరాష్ట్రుడికి పదివేల ఏనుగుల బలం ఉంటుందని వరం ఇచ్చాడు. (ఎంతైనా తన కొడుకే కదా) ఈ అపారమైన బలం కారణంగా ఇనుమును కూడా పిండి చేయగల సామర్థ్యం అతనికి వచ్చింది.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో జరిగేదంతా చూసే విధంగా ధృతరాష్ట్రుడికి కృష్ణుడు దివ్య దృష్టిని ఇస్తానని ప్రతిపాదిస్తే తన కుమారులు చావడాన్ని తాను కళ్లారా చూడలేనని తిరస్కరించాడు. ఆ తర్వాత సంజయుని ద్వారా యుద్ధం మొత్తం వినే అవకాశం కల్పించారు. భగవద్గీత ప్రారంభంలో సంజయుడిని కురుక్షేత్ర యుద్ధం గురించి అడిగే మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడిదే. కురుక్షేత్రాన్ని ధృతరాష్ట్రుడు "ధర్మక్షేత్రం" అని సంబోధించాడు. ఎందుకంటే పాండవులు ధర్మం వైపు ఉన్నారని, పవిత్రమైన ఆ ప్రదేశంలో ధర్మం గెలుస్తుందనే అంతర్మథనం, భయం అతని మాటల్లో ధ్వనిస్తాయి. యుద్ధంలో జరగబోయే ప్రతికూల పరిణామాల గురించి ఆందోళన చెందేట్టు చేసింది. అందుకే అపరాధ భావనతో కలవరపడుతూ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏమి జరుగుతోందని సంజయుడిని అడిగాడు.
మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, ధృతరాష్ట్రుడు కుమారులందరినీ కోల్పోయి, తీవ్రమైన దుఃఖం మరియు కోపంతో ఉన్నాడు. యుద్ధంలో గెలిచిన ధర్మరాజు హస్తినాపురానికి రాజైన వెంటనే పెదనాన ధృతరాష్ట్రుడి ఆశీర్వాదం తీసుకోవడానికి పాండవులతో కలిసి వెళ్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు పాండవులను ఆప్యాయంగా దగ్గరికి రమ్మని పిలిచి ముందుగా భీముడిని కౌగిలించుకునే నెపంతో, తనకున్న పదివేల ఏనుగుల బలంతో అతడిని నలిపి చంపాలని పథకం వేస్తాడు. పైకి ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు నటిస్తూ, లోలోపల ద్వేషంతో మరిగిపోతూ ఉండడాన్ని 'ధృతరాష్ట్ర కౌగిలి' అంటారు. నేటి సమాజంలో కూడా ఎదురుగా ఉన్నప్పుడు ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగుడుతూ, వెనకాల గోతులు తీసే పయోముఖ విష కుంభాలు లేకపోలేరు.
భీముడు తన నూరుగురు కుమారులలో ఎక్కువ మందిని సంహరించాడని, తన ప్రియమైన కొడుకు దుర్యోధనుడిని గదాయుద్ధంలో తొడలు విరిచి, అత్యంత క్రూరంగా సంహరించాడని ధృతరాష్ట్రుడు భీముడి మీద తీవ్రమైన పగ, ద్వేషం పెంచుకున్నాడు. ధృతరాష్ట్రుడి మనసులోని కోపాన్ని మరియు భీముడిపై ఉన్న ద్వేషాన్ని శ్రీకృష్ణుడు ముందుగానే గ్రహించాడు. ధృతరాష్ట్రుడు మొదట భీముడిని కౌగిలించుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు చాకచక్యంగా భీముడిని పక్కకు తప్పించి, అక్కడ ఉన్న భీముడి ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్రుడి ముందుకు తీసుకొచ్చాడు. ఈ విగ్రహాన్ని పాండవులు శిక్షణలో భాగంగా వారి ఆయుధాల వాడకం కోసం ఉపయోగించేవారని చెబుతారు. "నాయనా వచ్చావా" అంటూ భీముడిపై ఆప్యాయత కనబరుస్తూనే ధృతరాష్ట్రుడు ఆవేశంతో మరియు దుఃఖంతో ఆ ఇనుప విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకుని పూర్తిగా చూర్ణం చేశాడు. విగ్రహం ముక్కలు కావడం చూసి, ధృతరాష్ట్రుడు తాను నిజంగా భీముడిని చంపానేమోనని అనుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని శాంతపరిచి, తాను చూర్ణం చేసింది భీముడిని కాదని, ఇనుప విగ్రహాన్ని మాత్రమేనని చెప్పాడు.
యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల ప్రేమను ముఖ్యంగా ధర్మరాజు ఆదరణను పొందిన ధృతరాష్ట్రుడు చివరలో తన భార్య గాంధారి, కుంతిలతో కలిసి వానప్రస్థానికి వెళ్ళాడు. అక్కడ తన భార్యతో సహా నిస్సహాయంగా కార్చిచ్చులో దహనమైపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారం పట్ల ఆశ, స్వార్థం మరియు పిల్లలపై ఉన్న గుడ్డి ప్రేమ, బలహీనత ఇవి ఒక వ్యక్తిని, రాజ్యాన్ని ఎలా సర్వనాశనం చేస్తాయో చెప్పేందుకు ధృతరాష్ట్రుని వృత్తాంతం ప్రతీకగా నిలుస్తుంది.
కృష్ణం వందే జగద్గురుం
ఆర్ సి కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్ |










Comments