ఆధ్యాత్మిక జీవనం
- Dr. Brinda M. N.
- 18 hours ago
- 4 min read

Adhyatmika Jeevanam - New Telugu Article | Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 05/09/2026
ఆధ్యాత్మిక జీవనం - తెలుగు వ్యాసం | డాక్టర్ బృంద ఎం. ఎన్.
ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటి? దేవాలయాల సందర్శన, పూజలు, ప్రార్థనలు మాత్రమే ఆధ్యాత్మికతకు పరిమితమా? మనసును నిర్మలంగా ఉంచుకోవడం, స్వార్థాన్ని విడిచిపెట్టడం, సత్యం–న్యాయం–నీతి–ధర్మాలను జీవితంలో ఆచరించడం, ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోవడం, తోటి మనుషులు మరియు జీవుల పట్ల దయ చూపడం కూడా ఆధ్యాత్మిక జీవనంలో ముఖ్యమైన భాగాలు. మనిషి తనలోని ఆత్మతత్వాన్ని గుర్తిస్తూ “మానవసేవే మాధవసేవ” అనే భావనను ఆచరణలో పెట్టినప్పుడే ఆధ్యాత్మికత జీవితంలో ప్రతిఫలిస్తుందనే సందేశాన్ని ఈ వ్యాసం వివరిస్తుంది.
మనిషి తన దైనందిన జీవితాన్ని ఆధ్యాత్మిక శైలిలో సాగించాలి. అది అన్నిటికంటే అత్యుత్తమం. మనిషి అనగా నిర్మలమైన మనసుతో నిస్వార్ధమనే నావలో ప్రశాంత వాతావరణంలో షికారు చేయుట. మన జీవన విధానం ఎప్పుడూ ప్రకృతితో అనుసంధానమవ్వాలి. పై నిర్వచనంలో ఆకాశం, నీరు, చెట్లు, సంధాన కర్తలు, వీటికి అందరూ సమానం. మనమందరం కలసినప్పుడే ఏర్పడే ఒక వ్యవస్థ సమాజం. పశుపక్షాదులు, చెట్టు, చీమలు ఇతరత్రా వస్తువులు అన్నీ సమానమేనని, మనమందరము సృష్టికర్త బిడ్డలం, ఆ రూపం భగవంతుడు లేక శక్తి. భగవంతుడు ఒక్కడే కానీ రూపాలు మాత్రమే వేరుగా ఉంటాయి. కొందరు భగవంతుని నమ్మితే కొందరు శక్తిని నమ్ముతారు అది కాస్మిక్ కిరణాలు లేక అతీత శక్తి కావచ్చును. దీనికి తార్కాణం గోధుమ రవ్వను తీసుకున్నట్లయితే దాని ద్వారా కేసరి, ఉప్మా, లడ్డు, గంజి, జావా తయారు చేయవచ్చు. ఇవన్నీ వేర్వేరు రూపాలు కానీ మూల పదార్ధము ఒక్కటే. అదే విధంగా రాముడు, కృష్ణుడు, నానక్, అల్లా, జీసస్, బుద్ధుడు వివిధ రూపాలు కానీ భగవంతుడు ఒక్కరే.
మనం ఈ లోకంలో జీవించడానికి ముఖ్య కారణాలు రెండు. అవి జనన మరణాలు కన్ను తెరిస్తే జననం. కన్ను మూస్తే మరణం. మధ్య ఉన్న రెప్పపాటు కాలమే జీవితం. ఈ జీవితాన్ని ఆధ్యాత్మిక శైలిలో గడిపినప్పుడు మోక్షానికి అర్హులం. మనం పుట్టింది మట్టిలోనే పోయేది మట్టిలోనే, కానీ దాన్ని తాకడానికి అసహ్యించుకుంటాం. కామ, క్రోధ, లోభ మోహ, మద,మాశ్చర్యాలు అనే అరిషడ్వర్గాలను, మనసు అనే కోరికల గుర్రానికి, సత్యం, న్యాయం, నీతి, ధర్మం కల్లాలను వేసి జీవనశైలి అవలంబించాలి. చాలామంది తాము విజయాన్ని సాధించిన తర్వాత అది తమ కృషి ఫలితమే కానీ వేరు కాదు అంటుంటారు. ఇక్కడ మనము ఒక విషయాన్ని బాగా గమనించాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ముద్దలా ఏర్పడిన మనకి భగవంతుడు ఒక చక్రాన్ని గీసి అందులో ఏ సమయానికి ఏం చేయాలి, ఏం కావాలి, ఎలా ఉండాలి, అనే విభజన జరుపుతారు. దాని ప్రకారం కొన్ని సంఘటనలు మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. దీనికి ఉదాహరణగా బడిలో చేరిన పిల్లలకు టైం టేబుల్ ఇచ్చి దాని ప్రకారమే తరగతులకు పీరియడ్ ప్రకారం జరుపుతారు. కానీ అనుకోకుండా ఒక టీచర్ సెలవు పెట్టినప్పుడు లేక బయటివారు లేక స్వచ్ఛంద సంస్థలవారు ఏదైనా వివరించుటకు వస్తారు, అప్పుడు ఆ టైం టేబుల్ లో మార్పు ఉంటుంది. ఇలాంటిది మన జీవితంలో అనుకోని సంఘటన. అది కాకతాళీయమో, భగవత్ సంకల్పమో కావచ్చును.
భగవంతుడు మన శరీరాల్లో మురికి చెత్తల్ని చేర్చి మూట కట్టాడు. ఇవాళ పోతే రేపు వాసన వచ్చేది ఈ శరీరం కానీ మనం ఎన్ని జన్మలెత్తినా కూడా వసివాడని సుగంధ పరిమళం ఆత్మ. జీవుడే నీవు, ఆత్మయే భగవంతుడు, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ, విష్ణు, శివుడు. నిజమైన దేవాలయము దేహమే. మనం ఎన్నెన్నో క్షేత్రాలకు వెళుతూ ఉంటాం కానీ మంచి మనసు మాత్రం ఉండదు ఇక్కడ మహాభారతంలోని ఒక సంఘటనాన్ని పేర్కొనదలచాను మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు చక్రవర్తి అయిన పిదప పుణ్యక్షేత్రాల సందర్శనానికి బయలుదేరుతారు. శ్రీకృష్ణ పరమాత్మను రమ్మని పిలవగా ఎన్నో పనులతో సతమవుతున్న నాకు రావడానికి తీరిక లేదు బావ మీరు వెళ్లి రండి అని, తనకు మారుగా ఒక సొరకాయను పంపిస్తారు. పుణ్య నదుల్లో
ధర్మరాజు స్నానమాచరిస్తూ దానిని కూడా నదిలో ముంచుతారు. తిరిగి వచ్చిన తర్వాత కృష్ణుడు సొరకాయ తియ్యగా ఉందేమో చూడు ధర్మజా! అనగా ధర్మరాజు తిని ఇది ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది అని బదులిస్తారు. ఇంత చిన్న సొరకాయకి రాని మార్పు మీలో వచ్చిందంటావా బావ అంటాడు ఛలోక్తిగా కృష్ణుడు. కావున మానవులు తమలో ఉన్న స్వార్థాన్ని వీడినప్పుడు మంచి వారవుతారు. సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతారు. తీయటి ఫలాలను అందించగలుగుతారు.
అరణ్యంలో నివసిస్తున్న కస్తూరి మృగం ఆ కస్తూరి వాసన ఎక్కడనుండో ఎక్కడ లభించును అని ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. ఎదుటపడిన వారినందరిని అడుగుతుంది. కానీ దానికి సమాధానం రాదు. దాని కోసం ఎంత ప్రయత్నించినా విఫలమవుతుంది. చివరగా అది అలసిపోయి ఉండగా, ఒక వేటగాడు బాణం వేసినప్పుడు, దాని ఉదరమునకు తగిలి కస్తూరి పరిమళాన్ని వెదజల్లుతుంది. ఆ సమయాన నిజం తెలుసుకున్న మృగం ఎంతో వేదనతో మరణిస్తుంది. అదే విధంగా మానవుడు ఆత్మను వదిలి ఎక్కడెక్కడికో తిరుగుతుంటాడు.
మానవుడు అత్యాశ కలవాడు ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలి అని ప్రాకులాడుతాడు. ఇక్కడ చిన్న తార్కాణం చెప్పదలచాను. ఓ మునీశ్వరుని వద్దకు నిత్యం ఒక భక్తుడు వస్తూ ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటూ వెళ్లేవాడు. తన మదిలో మెదులుతున్న ప్రశ్నకు జవాబు వస్తుందా? రాదా? అంటూ ఆలోచనలో తేలియాడేవాడు. గురువుగారిని అడుగుదామంటే మీనమేషాలు లెక్కపెడుతూ సమయం వెళ్ళబుచ్చేవాడు. ఊహించని సంఘటన ఓనాడు గురువుగారే భక్తా! నీవు ప్రతిరోజు ఏదో శంకతో కొట్టుమిట్టాడుతున్నావు, మాతో చెప్పడానికి ఇబ్బందా! అని అంతే టకీమని అడిగాడు. స్వామి వజ్ర వైఢూర్యాలు, నగనట్రా, ధనం ఈ కోరికలేమీ వద్దు నాకు ప్రశాంతత కావాలి స్వామి ప్రశాంతత కావాలి కావాలి. స్వామి చిరు మందహాసాన్ని చిందించి, చతురుడవే! కోరికలే వద్దంటూ పెద్ద కోరికకే ఎసరు పెట్టావా? అదేంటి స్వామి అవును మరి, ఒక బెండకాయను వండాలంటే దాని ఆది అంతిమలను తుంచి వేసి, మధ్యలోని మాధ్యమాన్ని గ్రహిస్తాము. అలాగే నాకు కావాలి అని తలాతోకలను విస్మరిస్తే మిగిలేది ప్రశాంతతే కదా, నాయనా! ఆ మాటలకు భక్తుడు సిగ్గుతో తలదించుకుంటూ, క్షమించండి స్వామి అజ్ఞానిని అని వేడుకుంటాడు.
మన ఇంట్లో చూసినట్లయితే ముదుసలి వారు ఉంటారు వారు ఆకలితో అలమటిస్తూ ఉంటే వారి ఆకలి తీర్చడం మన ధర్మం. కానీ మన వారు అదే సమయాన భగవంతుని పూజిస్తూ ఉంటారు నిజమైన ఆకలి అక్కడ ఉంటే భగవంతునికి ఫలాలు, నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. రామాయణ, భారత, భాగవత, ఖురాన్, బైబిల్, వాహెగురు ఏ గ్రంథమైనా ఒక్కటే వక్కానిస్తుంది, అది మానవసేవయే మాధవసేవ. ఈ సేవ ద్వారానే మనం అందరినీ సమానంగా చూడగలం, ప్రేమించగలం, హస్తాన్ని అందించగలం. దయచేసి గొప్పల కోసం చేయకండి. నిజమైన ఆత్మీయ సేవాతత్పరతో చేయండి. మనందరిలో ఉన్నది ఒక్కటే, అది పవిత్రాత్మ. ఇది ఆధ్యాత్మిక జీవనానికి పునాది. సర్వేజనా సుఖినోభవంతు.
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.




Comments