top of page
Original.png

ప్రమాదంలో ఉచిత వినోదం దేనికి సంకేతం?


బోల్తా పడిన సరుకు లారీ వద్ద గాయపడిన డ్రైవర్‌కు కొందరు పౌరులు సహాయం చేస్తుండగా, చెల్లాచెదురైన సరుకు వైపు మరికొందరు వెళ్తున్న పౌర బాధ్యతను ప్రతిబింబించే దృశ్యం

 

Pramadamlo Uchitha Vinodam Deniki Sanketham - Telugu Inspirational Article | R C Kumar

ప్రమాదంలో ఉచిత వినోదం దేనికి సంకేతం? - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 05/09/2026


దురదృష్టవశాత్తు రహదారులపై బోల్తా పడ్డ లారీలో ఉన్న వస్తువుల కోసం కొందరు జనాలు ఎగబడడం సమాజంలో నైతిక విలువల పతనానికి సూచిక. మానవత్వంతో డ్రైవర్లను కాపాడాల్సింది పోయి అందులోని సామాన్లు దోచుకోడానికి వెంపర్లాడడం ఈ మధ్యకాలంలో ఒక తీవ్రమైన సామాజిక రుగ్మతగా మారింది. సోషల్ మీడియాలో, మీడియా వార్తల్లో తరచూ ఇలాంటి అనేక విస్తుగొలిపే సంఘటనలు కనబడుతూనే ఉన్నాయి. వారంలో కనీసం రెండు మూడు ఇలాంటి ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదానికి గురైన లారీలు, వ్యాన్లలో ఉండే సరుకు ఎలాంటిదైనా జనాలు వాటికోసం ఎగబడుతూనే ఉన్నారు. నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, టమాటా లారీలు, గుడ్ల లారీలు, చక్కెర బస్తాలు లేదా యాపిల్స్ వంటి పండ్ల వ్యాన్లు ఏది బోల్తా పడినా జనాలు బకెట్లు, సంచులతో వచ్చి మరీ సర్దుకెళ్తుంటారు. ఆశ్చర్యకరంగా అటువైపు వెళుతున్న ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా ఆపి తీసుకెళ్తున్నారు.


మద్యం సీసాల లోడ్‌తో వెళ్తున్న లారీలు ప్రమాదానికి గురైతే, అక్కడ గాయపడిన వారిని పట్టించుకోకుండా మద్యం సీసాల కోసం తోసుకుంటూ జనాలు విరుచుకుపడడం అత్యంత విచారకరం. కోడిగుడ్లు, చికెన్ తో వెళ్లే లారీలు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లినప్పుడు మిగిలిన గుడ్లను బకెట్లలో నింపుకెళ్లడం, కోళ్లను పట్టుకెళ్లడం వంటివి యదేచ్చగా జరగడం చూస్తున్నాము. ఫ్రీగా దొరికితే ఫినాయిల్ కూడా వదిలేది లేదన్నట్టు కొన్ని సందర్భాలలో ఆయిల్‌ ట్యాంకర్లు బోల్తా పడినప్పుడు అందులో ఉన్నది వంట నూనె అనుకుని జనాలు క్యాన్లతో తెచ్చుకుంటారు. కానీ, అవి విషపూరిత రసాయనాలు అని తెలియక ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఒక కంపెనీ వారి చాక్లెట్ల ఎక్స్పైరీ తేదీలు దాటిపోయిన కారణంగా అట్టపెట్టెల్లో వాటిని లారీలో తెచ్చి ఊరి చివర్లో పారబోసారు. వాటి నాణ్యత పట్టించుకోకుండా దొరికిందే చాలనట్టుగా సమీపంలోని ఊరి జనాలు, ప్రయాణికులు మోయగలిగినంత మోస్తూ పట్టుకెళ్లారు. ఉచితం అనే దృశ్యం కనిపిస్తే చాలు ప్రాణాలకైనా తెగించే రకాలు సమాజంలో పాతుకుపోవడం దురదృష్టకరం.


ప్రమాద సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు కానీ మరే ఇతర రక్షణ వ్యవస్థ కానీ ఉండదు కాబట్టి పౌరధర్మం పాటించని కొందరు ఆ పరిస్థితిని దోచుకోవడానికి అనుకూలమైన సమయంగా మలుచుకుంటారు. ఉదాహరణకు ఈ ఏడాది మార్చ్ నెలలో నెల్లూరు జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న డ్రైవర్, క్లీనర్ గాయాలతో సాయం కోసం అరుస్తున్నా,  జనాలు ఏమాత్రం పట్టించుకోకుండా లారీలోని కూల్ డ్రింక్స్ బాటిళ్లను ఎత్తుకెళ్లడానికి ఎగబడ్డారు. సంచులు, టార్పాలిన్లతో వచ్చి నిమిషాల్లోనే క్రేట్లకు క్రేట్లు ఖాళీ చేసేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి, జనం ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జూలై 2026లో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై యాపిల్ పండ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సంచులు, బాక్సులతో వచ్చి యాపిల్స్ ఎత్తుకెళ్లడం మీడియాలో చక్కర్లు కొట్టింది. నిన్న మొన్నటి వరకు కూడా ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి.


ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకుని వస్తువులను పట్టుకెళ్లడం చట్టప్రకారం నేరం. అది దొంగతనం కిందకే వస్తుంది. ఇలాంటి సమయాల్లో బాధితులను కాపాడటం లేదా పోలీసులకు సమాచారం అందించడం పౌరుల కనీస బాధ్యత. భద్రత లోపించినప్పుడు పరిసర ప్రాంత జనాలకు ఎలాంటి భయం లేదా అడ్డంకులు ఉండవు. డ్రైవర్లు దెబ్బలతో బాధపడుతున్నా పట్టించుకోకుండా, ఇతరుల దురదృష్టాన్ని తమ స్వలాభంగా మార్చుకోవడం చట్టరీత్యా నేరమే కాకుండా నైతికంగా కూడా తప్పు. అయితే, కొన్ని చోట్ల మాత్రం గ్రామస్థులు లారీ డ్రైవర్లకు సహాయం చేసి, సామాన్లను భద్రపరిచిన సానుకూల ఘటనలు కూడా అరుదుగా జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా దెబ్బతిన్న వారిని కాపాడడం,  అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడం, వీలైతే ప్రథమ చికిత్స చేయడం మన ప్రాథమిక కర్తవ్యం.


ఎలాంటి కష్టం లేకుండా ఉచితంగా సరుకు దొరుకుతున్నప్పుడు, అదే సరుకు పోగొట్టుకొని నష్టపోతున్న యజమాని వైపు నుంచి ఒక్క క్షణం ఊహించుకుంటే తమ ఆలోచనా సరళి కొంత మారే వచ్చే అవకాశం ఉంది. మనుషుల మధ్య ప్రేమ, దయ, జాలి చూపించలేని వారు దెబ్బతిన్న డ్రైవర్ గురించి ఆలోచించకుండా స్వార్థంతో తమ స్వలాభం కోసం ఫ్రీగా దొరికే వాటి కోసమే ఎగబడి తన నీచ స్వభావాన్ని చాటుకుంటారు. ఉచితంగా వస్తే ఊపిరి కూడా వదిలే రకానికి చెందినవారే పరాయి సొమ్ము కోసం ఆరాట పడుతారు. ఇలాంటి ఘటనల వల్ల సమాజంలో మానవత్వం, పౌర బాధ్యత కనుమరుగు అవుతోందా అనే చర్చకు దారితీస్తున్నాయి. తమది కానీ వస్తువుల కోసం జనాలు ఎగబడడం దేనికి సంకేతం ? ఎందుకు ఇలా జరుగుతోంది ? ఎవరిది బాధ్యత ? నైతిక విలువలకు తిలోదకాలిస్తున్న నేటితరం పౌరులదా, తల్లిదండ్రుల పెంపకం లోపమా, లేక ఉచితాలు అలవాటు చేస్తున్న ప్రభుత్వానిదా ?


క్రమంగా ప్రజల్లో శ్రమించే తత్వం, నిజాయితీ సంపాదన, నైతిక విలువలు క్షీణిస్తుండడం ఆందోళనకరమైన విషయం. ఇటువంటి స్వభావం కల బద్దకస్తుల వల్ల సమాజంపై మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సంక్షేమం పేరుతో ఉచితాలను అందించడమే వ్యూహంగా మార్చుకున్న రాజకీయ పార్టీల పాత్రపై సామాన్యుల నుండి ఉన్నత న్యాయస్థానాల వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సొంతంగా శ్రమించకుండా ఉచితాలపైనే ఆధారపడే మనస్తత్వాలకు బీజం వేస్తున్న వ్యవస్థ మారితే ప్రజల్లో మార్పు కలిగే అవకాశం ఉంటుంది.


కృష్ణార్పణం    


గమనిక / Disclaimer: ఈ వ్యాసం సమాజంలో చోటుచేసుకుంటున్న కొన్ని రోడ్డు ప్రమాద ఘటనలు, వాటి సందర్భంలో కనిపించే ప్రజల ప్రవర్తనపై రచయిత వ్యక్తిగత అభిప్రాయం మరియు సామాజిక విశ్లేషణ మాత్రమే. ఇందులో వ్యక్తమైన అభిప్రాయాలు ఏ వ్యక్తి, వర్గం, ప్రాంతం, రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వాన్ని కించపరచడం లేదా నిందించడం ఉద్దేశించినవి కావు. ప్రస్తావించిన ఘటనల వివరాలు అందుబాటులో ఉన్న వార్తలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన సమాచారం ఆధారంగా ఉండవచ్చు; వాటిలోని ప్రతి అంశాన్ని స్వతంత్రంగా ధృవీకరించినదిగా పరిగణించరాదు. చట్టపరమైన అంశాల ప్రస్తావన సాధారణ అవగాహన కోసం మాత్రమే; దీనిని న్యాయ సలహాగా భావించరాదు. వ్యాసం ప్రధాన ఉద్దేశం ప్రమాద సమయాల్లో మానవత్వం, పౌర బాధ్యత, బాధితులకు సహాయం చేయాల్సిన అవసరంపై సామాజిక అవగాహన కల్పించడం మాత్రమే.


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

R C Kumar
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page