అదృష్టాన్ని మార్చలేరు
- Peddada Sathyanarayana

- May 4
- 3 min read

Adrushtanni marchaleru - Telugu Comedy Story | - Peddada Sathyanarayana
అదృష్టాన్ని మార్చలేరు - తెలుగు హాస్య కథ | పెద్దాడ సత్యనారాయణ
Published In manatelugukathalu.com On 04/05/2026
జీవితంలో కొన్నిసార్లు మనం తీసుకునే చిన్న నిర్ణయాలే…పెద్ద పరిణామాలకు కారణమవుతాయి.
లోభం, భయం, సామాజిక ఒత్తిడి వల్ల తీసుకున్న ఒక తప్పుడు అడుగు…రెండు కుటుంబాల జీవితాలను ఎలా మార్చిందో చెప్పే కథే“అదృష్టాన్ని మార్చలేరు”
👉 జాతకాన్ని మార్చవచ్చు…👉 కానీ జీవితం మారుతుందా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ఆలోచింపజేసే కథ ఇది.
ఏమండీ, మీకు చాలాసార్లు చెప్పాను. ఆ ముదనష్టపు సునీతకు పెళ్లి అయితేనే గాని మన స్వాతికి సంబంధాలు చూడడం కుదరదని. ఒకవేళ సునీతకి సంబంధం కుదిరినా, మనము కట్నకానుకలు ఇచ్చే స్థోమత లేదు అనే విషయము మీక్కూడా తెలుసు. అందుకే రెండో పెళ్ళివాడైనా లేక నాలుగు మెతుకులు పెళ్ళానికి పెట్టే స్థోమత ఉండే అబ్బాయిని చూడండి. ఇక మీరు సంబంధాలు చూసే పనిలో ఉండండి. సరేగాని ఈసారి ఏదైనా సంబంధం వస్తే, పెళ్ళివారితో లేక మధ్యవర్తితో, నేను మాట్లాడతాను. మీరు కలగచేసుకోవద్దు" అని సుందరమ్మ భర్త పద్మారావుకి ఖరాఖండిగా చెప్తుంది.
"అది కాదు సుందరి, రెండో పెళ్ళివాడు ఏమి బాగుంటుంది?" అంటాడు పద్మనాభము. "ఏమన్నారు! నాకేమైనా రాజకుమారుడితో పెళ్లయిందా? నేను రెండో పెళ్ళివాడిని చేసుకోలేదా? వేరే ఆలోచనలు పెట్టుకోకుండా నే చెప్పినట్టు చేయండి!" అని వంటింట్లోకి వెళ్ళిపోయింది.
సుందరమ్మకి సునీత సవతి కూతురు. సుందరమ్మకి, పద్మనాభానికి పుట్టింది స్వాతి. సవతి కూతురయిన సునీతని ఏదో విధంగా వదలించుకోవాలని తాపత్రయము. ఒక రోజు పెళ్లిళ్ల పేరయ్య సునీతకి సంబంధము తెచ్చాడు. సుందరి, పెళ్లిళ్ల పేరయ్యతో గుంభనంగా మాట్లాడి సంబంధము ఖాయము చేయించింది. ఇరుపక్షాల వారి సమ్మతముతో సునీత పెళ్లి నిరాడంబరంగా జరిగింది.
సునీతకి, ఎనిమిది సంవత్సరాలు పెద్దయిన రాముడితో వివాహము జరగగా, సునీత ఆనందముగా అత్తగారింట్లో అడుగు పెట్టింది. సునీత అత్తగారింట్లో అడుగు పెట్టిన వేళా విశేషము వలన, మావగారు ఆశవదులుకున్న తాతల కాలంనాటి ఆస్తి కోర్టు తీర్పు వలన కలిసి వచ్చింది. కోడలు సునీత అడుగు పెట్టిన వేళావిశేషము వలన అత్తగారి కుటుంబము స్థితిమంతుల జాబితాలో చేరింది.
సుందరమ్మ, స్వాతికి అన్నివిధాలా యోగ్యుడైన సంబంధము చూసి వివాహము జరిపించింది. సుందరమ్మ అల్లుడు మధుబాబు వ్యాపారవేత్త కుమారుడు. వ్యాపారానికి అల్లుడే వారసుడు. కూతురు వివాహము జరిగిన ఏడాది లోపలే, పరిస్థితుల ప్రభావము వలన వ్యాపారములో నష్టాలు వచ్చి బీదరికంలోకి అడుగు పెట్టారు.
స్వాతి ఒక రోజు తల్లి దగ్గరకి వచ్చి తన బాధ చెప్పుకొని, "ఏమి చేయాలమ్మా?" అని అడుగుతుంది. "నీవు బెంగ పెట్టుకోవద్దు. మన ఐదు ఎకరాల పొలము అమ్మి డబ్బు ఇస్తాను. అల్లుడు గారిని మరలా వ్యాపారము ప్రారంభించమని చెప్పు, " అని ధైర్యము చెప్పింది సుందరమ్మ.
"అమ్మా, నాకో విషయము అర్థము కాలేదు. నాకు, సునీత అక్కయ్యకు జాతకాలు చూసి పెళ్లిళ్లు చేశావు. నీవు సునీతక్కకి ఇంత మంచి సంబంధము ఎలా చూశావమ్మా?" అని తల్లిని ప్రశ్నిస్తుంది స్వాతి.
"ఇప్పుడు సందర్భము వచ్చింది కాబట్టి, నీకు అసలు విషయము చెప్తాను. పెళ్లిళ్ల పేరయ్య సహకారముతో, సునీత అసలు జాతకము దాచి, పెళ్లి వారికి అనువైన పెట్టుడు జాతకాలతో సంబంధము చూసి వివాహము చేశాను, " అని వివరముగా చెప్పింది.
"ఎంతయినా సునీతక్క అదృష్టవంతురాలు అమ్మా! తనకి పెట్టుడు జాతకము కూడా కలిసి వచ్చింది. నా విషయములో ఎందుకు ఇలా జరిగిందో అర్థము కావడము లేదమ్మా, " అని తన సందేహము తెలుపుతుంది. "నేను పురోహితుడిని అడిగి కనుక్కుంటాను, " అని కూతురిని అత్తగారింటికి పంపించేసింది.
మరుసటి రోజు, స్వాతి జాతకాలు చూసిన పురోహితుడిని పిలిచి అడిగింది. "వెంకటాచారి గారు, మా స్వాతికి జాతకాలు చూసి వివాహము చేశాము కదా, ఎందుకు దానికి ఇంతటి దుస్థితి కలిగింది?" అని అడుగుతుంది.
"మీకు నిజము తెలిసిన తర్వాత ఎవ్వరితోనూ గొడవ పడనని మాట ఇస్తే, నేను వాళ్ళ
వాళ్ళ పురోహితుడిని కనుక్కొని మీకు అసలు విషయము చెప్తాను, " అని జవాబిస్తాడు.
ఒక వారము తర్వాత, పురోహితుడు అసలు విషయము కనుక్కొని సుందరమ్మకి చెప్తాడు. "మీ అల్లుడు మధుబాబుకి కుజదోషము ఉన్నందువలన పెట్టుడు జాతకాలు చూపించి వారి తల్లితండ్రులు వివాహము జరిపించారు, " అని నిజము చెప్తాడు చారి.
అంతే, పాపము సుందరమ్మ కళ్ళు తిరిగి నేల మీద చతికిలబడింది.
***
పెద్దాడ సత్యనారాయణ గారి కొన్ని ఇతర రచనలు:
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.









Comments