top of page
Original.png

అమ్మకు మాత్రం…


తల్లి ప్రేమ, తెలుగు కథ, కుటుంబ కథ, పిల్లల పెంపకం, మాతృత్వం, అమ్మ మమకారం, తల్లిదండ్రులు, కుటుంబ విలువలు, భావోద్వేగ కథ, తెలుగు సాహిత్యం, Mother Love, Parenting, Family Story, Emotional Story, Telugu Literature, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అమ్మకు మాత్రం' కథలో గుడి నుంచి వస్తూ తల్లి చేయి పట్టుకుని రోడ్డు దాటిస్తున్న కొడుకు.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అమ్మకు మాత్రం' కథలో గుడి నుంచి వస్తూ తల్లి చేయి పట్టుకుని రోడ్డు దాటిస్తున్న కొడుకు.

Ammaku Mathram - Telugu Family Emotional Story | Kanakadurga Lakshmirathna

అమ్మకు మాత్రంతెలుగు కుటుంబ భావోద్వేగ కథ | కనకదుర్గా లక్ష్మీరత్న

Published in manatelugukathalu.com on 29/06/2026


తల్లి ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. బిడ్డ పుట్టిన క్షణం నుంచి జీవితాంతం అతని సంతోషం, భద్రత, భవిష్యత్తు గురించే ఆలోచించే హృదయం అమ్మది. పిల్లలు ఎంత పెద్దవారైనా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా, తల్లి కళ్లలో వారు ఎప్పటికీ చిన్నపిల్లలే. "అమ్మకు మాత్రం……" అనే ఈ హృదయాన్ని హత్తుకునే తెలుగు కుటుంబ కథ, ప్రేమకు హద్దులు లేవని, పిల్లలను ప్రేమించడంతో పాటు వారి ఎదుగుదలను అంగీకరించడం కూడా తల్లిదండ్రుల గొప్పతనమని అద్భుతంగా తెలియజేస్తుంది.


చూస్తుండగానే అగస్త్య ఉద్యోగస్తుడయ్యాడు. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు, అభిరుచులు ఏర్పడతాయి. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకు సొంత అభిప్రాయాలు ఉన్నా పెద్దవాళ్ళు సాగనివ్వరు. పిల్లలు... పైగా పెద్దవాళ్ళ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి, పెద్దవాళ్ళకి తలవంచక తప్పదు.


దాశరథి, రమల ఏకైక సంతానం అగస్త్య. ఉన్న ఊర్లోనే వాడికి ఉద్యోగం వచ్చినందుకు, కొడుకు తమ కళ్ళముందే ఉంటాడు కదా అని రమ తెగ సంబరపడిపోయింది. వాడు చంటిపిల్లాడప్పటి నుండి “వీడు తొందరగా పెద్దవాడయితే బాగుండును” అని రమ అనుకోని రోజు లేదు. 


ఇప్పుడు నిజంగానే పెద్దవాడయ్యాడు. ప్రతి తల్లికీ పిల్లలు ప్రాణం అయినట్లే రమకి అగస్త్య అంటే పంచప్రాణాలు. కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. బోర్లా పడే వయసులో రమ ఏమరుపాటుగా ఉన్నప్పుడు మంచం మీద నుండి పడి వాడు ఏడ్చినప్పుడు రమ విలవిలలాడిపోయింది.


“అయ్యో! పిల్లవాడవటంతో మంచం అంచు తెలియలేదు. పెద్దవాడై ఉంటే జాగ్రత్త పడేవాడు కదా!” అనేది.

“బోర్లా పడుతున్నప్పుడు నువ్వు దిళ్లు అడ్డం పెట్టాలి, లేదా కింద పడుకోబెట్టాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే క్రమంలో పడటం, లేవడం సహజమే. దానికింత చలించిపోకు” అని దాశరథి కోప్పడేవాడు.


చిన్నప్పుడు వాడికి జ్వరం వచ్చిందంటే 104 కి తక్కువ వచ్చేది కాదు. రాత్రి తెల్లవార్లూ వాడికి తడి గుడ్డ వేసి తుడుస్తూ ఉండేది.


“పిల్లలకి అలాగే హై ఫీవర్లు వస్తుంటాయి. పెద్దయ్యాక ఇంతింత రావు” అనేవారు అత్తగారు.


“వీడు తొందరగా పెద్దవాడవ్వాలి దేవుడా!” అని దణ్ణం పెట్టుకునేది. తోటి పిల్లలతో ఆటలాడుకుంటూ పడినప్పుడు ఒక్కొక్కసారి పళ్ళు విరిగేవి. కాళ్ళకి, చేతులకి దెబ్బలు తగిలించుకునేవాడు. “పెద్దవాడై ఉంటే తగిలేదీ, తప్పేదీ తెలిసేది. చిన్నవాడైపోయాడు పాపం!” అని రమ వాపోయేది.


“నేను చిన్నప్పుడు ఎంత దుందుడుకుగా ఉండేవాడినో తెలుసా! చెట్లెక్కి పడి కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకునేవాడిని. ఒకసారి సీసా పగలగొడితే నా చేయి కోసుకుని ఎంత రక్తం కారిందో! మా అమ్మ నీలా బెంబేలు పడిపోయేది కాదు. ఇంత పసుపు వేసి రిక్షాలో కూర్చోబెట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. నాతో పోలిస్తే పాపం వీడు చాలా మెతకవాడు!” అనేవాడు దాశరథి.


“ఏమో బాబు! వీడు పెద్దయ్యేంత వరకు నాకు టెన్షన్ గానే ఉంటుంది” అనేది.


బట్టలైనా, బొమ్మలైనా, తినుబండారాలైనా అగస్త్య చేయి ఖరీదైన వాటి మీదకే వెళ్ళేది.


“అవన్నీ నువ్వు పెద్దయ్యాక కొనుక్కుందువు గానీలే! ఇప్పుడు అమ్మా, నాన్నా కొనిపెట్టినవి తీసుకో” అనేది. వాడికి నెల నెలా జుట్టు పొట్టిగా క్రాఫ్ చేయించేవారు. జుట్టు మొహం మీద పడేలా పెంచుకుంటానని మారాం చేసేవాడు. 


“పెద్దయ్యాక నీ ఇష్టం. క్రాఫ్ చేయించకపోతే డైరీలో రిమార్కు వస్తుంది” అనేది.


వేసవి సెలవుల్లో వెకేషన్ కి తీసుకెళ్ళినప్పుడు “మా ఫ్రెండ్స్ అంతా ఫారెన్ కంట్రీస్ కి వెళుతున్నారు, మనమూ వెళదాం” అనేవాడు.


“నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగస్తుడయ్యాక ఆ దేశాలు వెళుదువు గానీ. ఇప్పుడు అమ్మా, నాన్న ఎక్కడికి తీసుకెళితే అక్కడికి రావాలి. సరేనా!” అనేది.


“ఎప్పుడూ ఏది అడిగినా పెద్దయ్యాక, పెద్దయ్యాక అంటావు. పో!” అని కోపంగా వాడి గదిలోకి పరిగెత్తేవాడు.


అగస్త్య ఏడెనిమిది తరగతుల్లో ఉన్నప్పుడు రమకి హిస్ట్రెక్టమీ చేయాల్సి వచ్చింది. “నాకు ఈ అనారోగ్యం ఏదో వీడు కొంచెం పెద్దయ్యాక రాకూడదూ! మరీ చిన్నపిల్లాడైపోయాడు. ఇప్పుడు నేను ఆసుపత్రిలో ఉండాలంటే పిల్లాడు బెంగ పెట్టుకుంటాడో ఏమో” అని గాభరా పడింది.


“అనారోగ్యాలు చెప్పి వస్తాయాటే? ఇలాంటివి ఆడవాళ్ళకి పరిపాటే! రేపు సర్జరీ అయ్యాక కొన్నాళ్ళు బెడ్రెస్ట్ తీసుకుంటే సుబ్బరంగా తిరుగుతావు!” అని అత్తగారు ధైర్యం చెప్పారు.


“ఏమో అత్తయ్య! వీడు పెద్దవాడయ్యుంటే నాకు సర్జరీ అయినా, బెడ్రెస్ట్ అయినా వాడి పనులు వాడు చేసుకునేవాడు. ఇప్పుడు పిల్లవాడు, నా పైన ఆధారపడినవాడు. వాడికి చేయాల్సింది పోయి బెడ్రెస్ట్ అని నేను మంచానికి అతుక్కుపోయి ఉంటే నాకు మనసులో గునుపుగా ఉంటుంది”.


“మేమంతా లేమా వాడిని చూసుకోవడానికి? అనవసరపు దిగుళ్ళు పెట్టుకోకు” అని మందలించారు.


పెద్దవాడైతే బాగుండునని రమ అనుకోవడం ఎలా ఉన్నా, సృష్టి ధర్మానుసారం అగస్త్య పెద్దవాడవుతూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. “అమ్మయ్య! వీడు డిగ్రీలోకి వచ్చాడు. అంటే పెద్దవాడన్న మాటే!” అనుకుంది.


“నాకు కాలేజీలోకి చేరడానికి ఇంకా నెల టైముంది. మా ఫ్రెండ్స్ అంతా కలిసి కొడైకెనాల్ వెళ్దామనుకుంటున్నాము” అన్నాడు అగస్త్య. 


ఒక క్షణం క్రితమే పిల్లాడు పెద్దవాడయ్యాడని ఊపిరి పీల్చుకున్న రమ గుండెల్లో రాయి పడింది.

“అమ్మో! కొడైకెనాల్ వెళ్తారా? మీరింకా పిల్లలే! పెద్దవాళ్ళమైపోయాము అనుకుంటున్నారా” అని దీర్ఘాలు తీసింది.


“నువ్వేగా పెద్దయ్యాక వెళ్ళమన్నావు. నాకు ఎయిటీన్ ఇప్పుడు. అంటే పెద్దేగా!”


ఇప్పుడు పిల్లాడే పెద్దవాడిని అయ్యానంటే జీర్ణించుకోలేకపోతోంది.


“భలే వాడివిరా నువ్వు. పెద్దవ్వడమంటే ఈ పెద్ద కాదు. అసలు పెద్ద. అంటే ఉద్యోగం వచ్చే వయస్సు అన్నమాట. ఎయిటీన్ అంటే ఇంకా చిన్న వాడి కిందే లెక్క. అలా పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళకూడదు” అని నిఖార్సుగా చెప్పింది. 


అగస్త్యకి ఒళ్ళు మండిపోయింది. “చూడు నాన్న! అమ్మ ఎలా చీట్ చేస్తోందో! పెద్దయ్యాక పంపిస్తానని ఇప్పుడు జాబ్ వచ్చాక అంటోంది” అని తండ్రికి ఫిర్యాదు చేశాడు.


“ఫ్రెండ్స్ తో కలిసి వెళుతున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళే. బయటికి వెళ్ళితే లోకజ్ఞానం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ రేపు వాడికి ఇంజనీరింగ్ వేరే ఊర్లో వస్తే రాకపోకలు ఒక్కడే కదా చేయవలసింది” అని నచ్చచెప్పాడు రమకి. 


వాడి ఫ్రెండ్స్ తల్లులు కూడా పంపడానికి ఒప్పుకోవడంతో రమకి తలూపక తప్పలేదు.


కాలేజీలో చేరేముందు ఒకరోజు గుడికి వెళ్దాం రమ్మని అగస్త్యని అడిగింది. రోడ్డు బాగా రష్ గా ఉండటంచేత క్రాస్ చేసేటప్పుడు అగస్త్య చేయి పట్టుకుంది. 


“అమ్మా! చిన్నప్పుడు చెయ్యి పట్టుకుని రోడ్డు క్రాస్ చేయించినట్లు ఇప్పుడు కూడా అలా పట్టుకుంటే నాకు ఎంబరాస్సింగ్ గా ఉంటుంది. నేను ఇప్పుడు పెద్దవాడినే” అన్నాడు.


“ఓరినీ! నాకు క్రాస్ చేయడం భయం వేసి నిన్ను పట్టుకుంటే, సిగ్గు పడిపోయేంత పెద్దవాడివైపోయావన్నమాట” అంది.


అగస్త్యకి ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. కాలేజీ దూరమవడంచేత హాస్టల్ లో ఉండాల్సి వచ్చింది.


“అమ్మా! కాలేజీకి నాకు కొన్ని మంచి షర్ట్స్ కావాలి” అని అడిగాడు అగస్త్య. 


షాపులో బట్టల సెలక్షన్ లో తల్లికి కొడుక్కి అభిప్రాయ భేదాలు వచ్చాయి. రమ సెలెక్ట్ చేసిన షర్ట్ ను చూసి “ఇది స్కూలు పిల్లలు వేసుకునే డిజైన్. కాలేజీ స్టూడెంట్స్ వేసుకోరు” అన్నాడు.


“కాలేజీకి వెళుతున్నావు, నీటుగా క్రాఫ్ చేయించుకో” అంది రమ.


“కాలేజీకి అలా పొట్టి క్రాఫ్ తో వెళితే బాగుండదు. నేను కొంచెం పొడుగు పెంచుకుంటాను” అన్నాడు. 


హాస్టల్ కి వెళ్లేముందు రమ చిన్నపిల్లాడికి చెప్పినట్లు జాగ్రత్తలు చెప్పింది. “నేనిప్పుడు అడల్ట్ ని, నన్ను కిడ్ లా ట్రీట్ చేయకు” అన్నాడు.


“నువ్వు పెద్దయ్యావని అనుకుంటున్నావు కానీ నాకు మాత్రం చిన్నవాడివే” అంది.


దాశరథి “ఏంటమ్మా! వాడి చిన్నప్పుడంతా తొందరగా పెద్దవాడైతే బాగుండును అని పదే పదే అంటుండేది, ఇప్పుడు పెద్దవాడయ్యాక ఇంకా చిన్నవాడివే అంటుందేమిటి?” అని ఆశ్చర్యపోతూ తల్లిని అడిగాడు.


“మరదే అమ్మ ప్రేమంటే! పిల్లలు ఎంత పెద్దైనా అమ్మకు ఎప్పటికీ చిన్న పిల్లలే! నువ్వు ఇప్పటికీ నా కళ్ళకి చిన్నవాడివే” అన్నారు.


అగస్త్య పదిహేను రోజులు లేదా నెలకొకసారి ఇంటికి వస్తుండేవాడు. ఒక్కొక్కసారి స్నేహితులతో కలిసి తిరగడానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళినప్పుడల్లా రమ జాగ్రత్తలు చెప్పడం, వాడు ‘నేను పెద్దవాడినే, పిల్లలకు చెప్పినట్లు చెప్పకు’ అనడం, “చిన్నప్పుడే నయం, పెద్దవాళ్ళ మాట వినేవాడు” అని రమ అనుకోవడం పరిపాటైపోయింది.


అగస్త్య ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ ఊర్లోనే ఉద్యోగం సంపాదించాడు. రమ ఆనందానికి అవధులు లేవు.

అత్తగారు “పోనీలేవే! పిల్లాడు నీ కళ్ళ ముందే తిరుగుతుంటాడు” అన్నారు. 


రమ లంచ్ బాక్స్ కొత్తది కొనుక్కొచ్చి “రేపు లంచ్ కి బాక్స్ లో ఏమివ్వను?” అంది ఉత్సాహంగా.


“అమ్మా! కొద్ది రోజులు నన్ను కాంటీన్ ఫుడ్ ఎంజాయ్ చేయనీ” అన్నాడు.


“సరే! వారానికి మూడు రోజులు ఇంటి నుండి, రెండు రోజులు ఆఫీస్ కాంటీన్, సరేనా?” అంది. 


తలూపాడు.


వీకెండ్స్ అగస్త్య ఎక్కువగా ఫ్రెండ్స్ తో ట్రెక్కింగ్ కో, రాక్ క్లైమ్బింగ్ కో, మారథాన్ రన్ కో, బౌలింగ్ అనో, క్రికెట్ మ్యాచులు చూడటానికో, గో కార్టింగ్ అనో వెళుతున్నాడు. రమ “మాతో కన్నా మీ ఫ్రెండ్స్ తోనే ఎక్కువ గడుపుతున్నావు” అంది అసంతృప్తిగా. 


“మీరు వెళ్లే ప్లేసుల్లో నాకు చేయడానికి ఏమీ ఉండదు. నేను వెళ్ళేవి మీరు చేయలేరు” అన్నాడు.


ఒకసారి క్రిస్మస్ కి వారం రోజులు సెలవులొస్తే అగస్త్య, స్నేహితులు కలిసి జపాన్ ట్రిప్ కి ప్లాన్ చేసుకున్నారు. ఇది విని రమ ఆకాశం కిందపడినట్లు మొహం పెట్టి, కళ్ళు వెడల్పు చేసి “అమ్మో! జపానా? పైగా చలికాలంలో! మన ఫుడ్డు కూడా దొరకదు. అసలు ఇండియాలోనే చూడవలసిన ప్రదేశాలు బోలెడన్ని ఉంటే ఫారెన్ ట్రిప్ ఎందుకు? అయినా ఈ ఫారెన్ ట్రిప్పులు పెళ్ళయ్యాక పెట్టుకుంటే, ఇటు నీ భార్యని కూడా తిప్పినట్లు ఉంటుంది” అంది.


“చిన్నప్పుడేమో ఫారెన్ ట్రిప్ కి వెళదామంటే ఉద్యోగం వచ్చాక అన్నావు. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక వెళతానంటే పెళ్ళయ్యాక అంటున్నావు. అసలు నేను ఎప్పుడు బయటికి వెళతానన్నా ఏదో అనాలి అన్నట్టుగా నెగిటివ్ గా మాట్లాడుతావు. 


నాకు ఇప్పుడు ట్వంటీ త్రీ, అంటే పెద్దవాడినే, ఉద్యోగస్తుడినే. మా ఫ్రెండ్స్ ఇంకా చిన్న వయసులోనే సోలో ట్రిప్స్ కి వెళ్ళారు. నేను అందరితో కలిసే వెళుతున్నానుగా. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యి అని నువ్వే నన్ను సంతోషంగా పంపాలి. అయినా నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, పర్మిషన్ తీసుకోవడం లేదు” అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. 


ఈ చోద్యం అంతా చూస్తున్న దాశరథి “చూశారా ఎలా మాట్లాడుతున్నాడో! చిన్నప్పుడే నయం, భయం భక్తి ఉండేవి. నేను వాడి మాట ఎప్పుడు కాదన్నాను? పరాయి దేశం అనేసరికి తల్లిగా నా భయాలు, ఆందోళనల కొద్దీ వద్దన్నాను” అంది రమ.


అత్తగారు “దాశరథి కూడా కాలేజీ చదువులు కాగానే స్నేహితులతో కలిసి ట్రిప్పులకి వెళ్ళేవాడు. నేను కూడా నీలానే భయం కొద్దీ వద్దనేదాన్ని. నా కొడుకు కూడా నీ కొడుకు లాగానే మాట్లాడేవాడు. ‘నీ భయాలతో మమ్మల్ని కట్టిపడేస్తావా’ అనేవాడు. ఏదో ఆ రోజులు కాబట్టి ఇక్కడిక్కడికే వెళ్ళేవాడు. ఇప్పుడు కాలం మారింది, జీవన స్థాయిలు కూడా పెరగడంతో ఏకంగా ఫారెన్ ట్రిప్పులంటే మక్కువైపోయింది” అన్నారు.


“కుర్రకారుకి కొత్త ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేయాలనుంటుంది. ప్రపంచాన్ని చూస్తే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. మన బాధ్యతగా వారికి జాగ్రత్తలు, వారికున్న పరిధులు చెప్పాలి. మన భయాలతో వారి ఉత్సాహం మీద నీళ్లు చల్లకూడదు” అన్నాడు దాశరథి.


అగస్త్య స్నేహితులతో కలిసి జపాన్ వెళ్ళాడు. అక్కడ వింతలూ విశేషాలు ఇంటిల్లిపాదికీ వీడియో కాల్లో చూపిస్తున్నాడు. అంతా అబ్బురపడుతూ చూశారు.

ఒక రోజు సాయంత్రం అపార్ట్మెంటులో రమ వాకింగ్ చేస్తుంటే పై ఫ్లోర్లో ఉండే కుసుమ ఆరు నెలల చంటిపిల్లాడిని స్ట్రోలర్ లో తిప్పుతోంది. 


వాడిని చూడగానే రమకి చటుక్కున చిన్నప్పటి అగస్త్య గుర్తుకువచ్చాడు. ఇక ఒక్కసారిగా అగస్త్య చిన్నప్పటి స్మృతుల్లోకి వెళ్ళిపోయింది. వాడి చిన్నప్పటి రోజులు అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు మెదిలి, మళ్ళీ వాడు పిల్లాడైపోతే బాగుండుననిపించింది. 


రాత్రి భోజనాల వేళ ఇదే విషయం దాశరథి, అత్తగారితో చెప్పి “అగస్త్య చిన్నప్పుడు నేనంటే ప్రాణంగా ఉండేవాడు. నేను ఏది వండి పెట్టినా బాగుందనేవాడు. పప్పులో నెయ్యి వేసి పెడితే ఎంత ఇష్టంగా తినేవాడో! ఇప్పుడేమో పిజ్జాలు, పాస్తాలు. ఇప్పుడు పెద్దవాడవడం వలన ప్రేమని వ్యక్తపరచడానికి సిగ్గు అడ్డొస్తోందనుకుంటా. చిన్నప్పుడు వాడిని మందలించాల్సి వస్తే స్వతంత్రంగా అనేదాన్ని. 


ఇప్పుడు పెద్దవాడవడం వలన ఏదైనా చెప్పాలన్నా సంకోచంగా ఉంటుంది, చెబితే చిన్నబుచ్చు కుంటున్నాడు. ఏదైనా చిన్నప్పుడే ఇద్దరమూ చొరవగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇద్దరి మధ్య సంకోచం అనే తెర అడ్డొచ్చేసింది” అంది.


“చూడు రమా! పిల్లల మీద ఎంత ప్రేమైనా పెంచుకోవచ్చు, కానీ అది మోహానికి దారి తీయకూడదు. ‘అతిప్రేమః పాపశంకీ’ అనే ఆర్యోక్తి లాగా నువ్వు మొదటినుంచీ వాడికి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా లేదా వస్తుందేమోనని ఊహించుకుని ఏదో చెడు జరగబోతుందని భయపడిపోవడం అలవాటైపోయింది. 

అది ప్రేమ అనిపించుకోదు, అబ్సెషన్ లా అనిపిస్తుంది. పిల్లలను ప్రేమించడం హర్షనీయమే, కానీ ఆ ప్రేమతో వారి జీవితంలోకి చొరబడితే అది ఆక్షేపణీయం. చిన్నప్పుడు ఇద్దరి మధ్య చనువు ఉండేది, పెద్దయ్యాక సంకోచం వచ్చింది అన్నావు. పుట్టిన మనిషి ఎప్పుడూ ఒకలా ఉండడు. 


పసికందు నుండి పెద్దవాడయ్యేంత వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండటం సృష్టి ధర్మం. ఆ ఎదుగుదలలో వచ్చే మార్పులు కూడా సృష్టి సహజమే. మనమంతా అలా ఎదిగినవాళ్ళమే. ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో నడుచుకోవడమే అందం. 


చిన్నప్పుడు ముద్దుముద్దుగా మాట్లాడితే ముచ్చటగా ఉంటుంది, పెద్దయ్యాక కూడా అలా మాట్లాడితే వింతగా ఉంటుంది. పిల్లలు ఎదిగే క్రమంలో వచ్చే మార్పులను సహజంగా తీసుకుని మనం అంగీకరించాలి. చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు తమకు భద్రత కల్పించేవారనే భావం కలిగివుంటారు, వారితో ఎక్కువగా గడపటానికి ఇష్టపడతారు. 


యుక్తవయస్సు వచ్చాక స్నేహితుల సహచర్యం కోసం చూస్తారు. కొన్ని విషయాలు తల్లిదండ్రుల వద్ద కన్నా తమ సమవయస్సు వాళ్ళతో సంకోచం లేకుండా పంచుకుంటారు. పెళ్ళయ్యాక భార్య, పిల్లలు, సంసారం, తల్లీ తండ్రి తమ ప్రపంచంగా భావిస్తారు. 


ఆయా వయస్సుకు తగ్గట్టు వారికి స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే కొత్త విషయాలు నేర్చుకుంటారు. మంచి చెడు తారతమ్యం, వాళ్ళ పరిధులు ఎక్కడ అతిక్రమించకూడదో జీవితమే నేర్పిస్తుంది. 


ఒక్కొక్కసారి వారి ఊహ తప్పయినా అనుభవం ద్వారా పొరపాట్లు సరిదిద్దుకుంటారు. జీవితం మనిషిని మలిచినట్లు మనం మలచలేము. పిల్లల చిన్నతనాన్ని మధురస్మృతుల్లా భద్రపరచుకోవాలి, పడుచుతనంలోకి అడుగుపెట్టాక హుందాగా చూడాలి” అని దాశరథి హితబోధ చేశాడు.


అగస్త్య జపాన్ ట్రిప్ ముగించుకుని వచ్చాడు. అక్కడి విశేషాలన్నీ ఎక్సైటెడ్ గా చెప్పాడు. బామ్మకి, అమ్మకి షాల్స్ తెచ్చాడు. తండ్రికి స్వెట్టర్, ఇంట్లోకి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తెచ్చాడు. రమ, అత్తగారు తమ గిఫ్ట్స్ చూసి “మా నాయనే! పెద్దవాడివైపోయావురా” అని అక్కున చేర్చుకున్నారు.


“అగస్త్యా! నువ్వు ట్రిప్ నుండి వచ్చాక గుడికి వస్తాననుకున్నాను. నాకు తోడు రా” అంది రమ. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అగస్త్య రమ చేయి పట్టుకుని దాటించాడు. “చేయి పట్టుకుంటే నీకు సిగ్గుగా ఉందా?” అంది.


“మరి నీకు క్రాస్ చేయడం భయంగా ఉందా?” అని నవ్వాడు. 


గుడి నుండి వస్తున్నప్పుడు రమ “చిన్నప్పుడు నువ్వు బీచ్ లో నీళ్ళల్లో చాలా సేపు ఆడుకుంటూ రాకపోతుంటే నీ మీద అతిప్రేమతో అలలు లాక్కుపోతాయేమోనని భయంతో ఎక్కువ సేపు నీళ్ళల్లో ఉండనిచ్చేదాన్ని కాదు. జైంట్ వీల్ ఎక్కినప్పుడు కూడా గొడవ పెట్టి మధ్యలో ఆపించేశాను. ఏమో నా పిచ్చి భయాలతో నీ బాల్యాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయనీయలేదేమోనని చాలా గిల్టీగా అనిపిస్తుంటుంది” అంది.


“నువ్వేమీ ఫీల్ అవ్వకు. మా ఫ్రెండ్స్ అమ్మలు కూడా ఇలాగే చేస్తారని వాళ్ళు కూడా అంటుంటారు. ప్రేమకొద్దే అలా చేస్తారని మాకు కూడా తెలుసు. కాకపోతే లేనిపోనివి ఊహించుకుని భయపడటం మానేసేయ్. దాని వలన నీకు ప్రశాంతత ఉండదు, ఆరోగ్యానికీ మంచిది కాదు” అని వీపు మీద చరిచాడు.


“తల్లులు పిల్లల మీద మమకారం కొద్దీ వాళ్ళకి ఎలాంటి కష్టం కలగకూడదని వారికోసం తాపత్రయపడిపోతుంటారు. బామ్మ చెప్పినట్లు పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మకు మాత్రం ఎప్పుడూ చిన్నవాళ్ళే” అంది రమ.

 

***

ఈ కథ మీ హృదయాన్ని తాకితే మీ అమ్మతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. తల్లి ప్రేమ, కుటుంబ అనుబంధాలు, జీవన విలువలను ప్రతిబింబించే ఇలాంటి మరిన్ని తెలుగు కథల కోసం manatelugukathalu.com ను అనుసరించండి.


కనకదుర్గా లక్ష్మీరత్న గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: కనకదుర్గా లక్ష్మీరత్న

నా పేరు కనకదుర్గా లక్ష్మీరత్న. నేను గృహిణిని. సాహిత్యం పట్ల ఆసక్తితో రచనలు చేస్తున్నాను. నా రచనలు ఈనాడు ఆదివారం అనుబంధంలోను, వివిధ అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యేయి. ప్రతిలిపికి రాస్తుంటాను.

7 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Mothers' affection is well narrated in your story. Ma'am!! Congratulations!!👍👏

Like
Replying to

thanks andi

Like

Rated 5 out of 5 stars.

ఒక్కగానొక్క కొడుకు పై తల్లి పంచప్రాణాలు పెట్టుకుని, ప్రతిరోజూ ఒక రక్షణకవచంగా నిలిచి ఎలా పెంచుకుంటుందో రమ అగస్త్య ల కథ ద్వారా రత్నగారు మనముందు ఉంచారు. కథనం నున్నటి తారు రోడ్డుపై కారు వెళ్తున్నట్లు గా ఉంది. సంభాషణలు పండించడంలో వారు అందెవేసిన చేయి అని తిరిగి నిరూపించుకున్నారు. కానీ అందరూ తల్లులూ పిల్లలతో ఇలాగే ఉంటారా? అంటే అవును అని చెప్పలేము. పెంపకం మొత్తం రమ గారు పిల్లవాడి పట్ల ఒక తెలియని భయంతోనే గడిపారు. ఆ ప్రభావం అగస్త్య మీద కూడా తప్పక ఉంటుంది. అగస్త్య పెద్దయ్యాక, పెళ్లి అయినా కూడా ఆవిడ స్వభావం మారుతుందని నేను అనుకోను. చివరిలో దాశరధి సంభాషణ కొంచెం ఉపన్యాస ధోరణిలోకి డిగిందని చెప్పొచ్చు. మొత్తానికి ప్రతి తల్లీ ఆలోచించించుకునే విధంగా ఒక మంచి కథను అందించినందుకు అభినందనలు రత్నా గారు. మరిన్ని మంచి కథల కోసం ఎదురు చూస్తాము.

Edited
Like

Rated 5 out of 5 stars.

కథ చక్కగా ఉంది మంచి భాష మరియు సంభాషణలు తోటి అందరి ఇళ్లల్లో పిల్లలతో తల్లిదండ్రులు కు ఎదురయ్యే సమస్యలను అనుకునే కంటే everyday discussions అంటే బాగుంటుంది. తల్లి మానసిక స్థితి ఎలా ఉంటుందో రత్న బాగా visidamuga వివరించారు. ఏ విధముగా మనసును, మనసులోని భయము సర్దుబాటు చేసుకుంటూ పిల్లలు ని penchukuntaru. పిల్లలు pedhavallayyaka vallaki space ichi edaganivvalani దాశరథి garu cheppatamu samanjasamga ఉంది. అంటే thalliki తెలియని విషయం కాదు కానీ ఒకరికొకరు సర్ది చెప్పుకుంటున్నారు తల్లిదండ్రులు...విషయం kothadikakapoina రచన శైలి chadavarulanu ఆకట్టుకుంది

Like
Replying to

thanks andi

Like

Rated 5 out of 5 stars.

Excellent writing as always, natural and effortless. Very relatable, but little preachy towards the end. దాశరథి చెప్పినదంతా పాఠకుడు ఫీల్ అయ్యేదే. అలా ఫీల్ అయ్యేలా చేయడంలోనే రచయిత గొప్పతనం ఉంటుంది. అదంతా ఒకటి, రెండు సెకన్లలో అయిపోతుంది. ఆ లెక్చర్ వల్ల కథ effectiveness తగ్గుతుంది.

Like
Replying to

thanks andi

Like
bottom of page