top of page
Original.png

ఆనందం

1 minute ago
5 min read

అమెరికా నుంచి వచ్చిన మురళికి జీవితంలోని నిజమైన ఆనందం గురించి చెబుతున్న స్నేహితుడు గోపాలం

Anandham - Telugu Social Story | Harish Babu Pondugula

ఆనందం - తెలుగు సామాజిక కథ | హరీష్ బాబు పొందుగుల

Published in manatelugukathalu.com on 07/10/2026


‘ఆనందం’ కథ డబ్బు, సంపాదన, సౌకర్యాల కంటే జీవితాన్ని ఆస్వాదించడం ఎంత ముఖ్యమో చెప్పే హృదయాన్ని తాకే ప్రేరణాత్మక కథ.


"హలో డ్రైవర్!! కారు కాస్త ఫాస్ట్గా నడుపు," అంటూ ఆర్డర్ వేశాడు మురళి.


20 ఏళ్ల తరువాత అమెరికా నుండి ఇండియా వస్తున్నాడు. గంట క్రితమే హైదరాబాద్లో ఫ్లైట్ దిగి క్యాబ్లో ఊరికి బయలుదేరాడు.


ఒక్కడే రావటం వల్ల పెద్దగా లగేజ్ లేదు కానీ, పది రోజులకు సరిపడే బట్టలు, సామాను తెచ్చాడు. 'మళ్లీ ఇవన్నీ తీసుకుని బస్సుకేమి వెళ్తాములే' అని అనుకుని క్యాబ్ మాట్లాడాడు.


హైదరాబాద్ నుంచి ఒక ఐదు గంటల జర్నీ చేస్తే ఊరికి చేరుకుంటాడు.


"కాస్త ఏసీ పెంచవయ్యా," మళ్లీ ఆర్డర్ వేశాడు మురళి.


సమ్మర్ కదా! మహా ఇబ్బంది పడిపోతున్నాడు మురళి. అసలు ఇండియాలోనే పుట్టనట్టు ఫీలింగ్... ఈ ఎన్ఆర్ఐలు అందరికీ అదే ఫీలింగ్ కదా!


హైవే మీద కారు మెల్లగా వెళ్తోంది.


ఈలోపు గోపాలానికి ఫోన్ చేసి తను ఫ్లైట్ దిగి క్యాబ్లో వస్తున్న సంగతి చెప్పాడు. ఈ పది రోజులు మురళి బస తన చిన్ననాటి స్నేహితుడు గోపాలం ఇంట్లోనే. తాతల నాటి ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టుకుని మళ్లీ అమెరికా వెళ్లటం కోసం వచ్చాడు ఇండియాకి.


ఇరవై ఏళ్ల క్రితం భార్యాబిడ్డలతో అమెరికా వెళ్లి స్థిరపడిన మురళి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకి రావడం ఇదే మొదటిసారి. కానీ గోపాలం మాత్రం తన పొలాలు అవి చూసుకుంటూ, ఐటీ జాబ్ వచ్చినా చేయకుండా ఊరికి దగ్గర్లోనే టీచర్గా ఉద్యోగం చేస్తూ పిల్లలతో ఉండిపోయాడు.


మురళి ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు అయింది. మురళిని చూస్తూనే గోపాలం భార్య గీత స్టవ్ మీద అన్నం దించి భోజనం వడ్డించింది.


స్నేహితులు ఇద్దరూ భోజనం చేస్తున్నారు.


గీత చేసిన వంట అద్భుతంగా ఉన్నా, మురళి ఏమీ ఎక్స్ప్రెస్ చేయకుండానే భోజనం పూర్తి చేశాడు. గోపాలం మాత్రం ఇంకో లోకంలో విహరిస్తూ తింటున్నాడు. అతన్ని చూస్తే భోజనం బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నట్టు తెలుస్తోంది. అతన్ని చూసి 'ఇతను ఏమీ మారలేదుగా' అనుకున్నాడు మురళి.


భోజనం అయ్యాక ఇద్దరు మిత్రులూ హాల్లో సోఫాలో కూర్చుని ఫ్యాన్ కింద చల్లని గాలి తగులుతుంటే కబుర్లలో పడ్డారు. గీత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వింటోంది.


"ఏంట్రా మురళి! మీ అమెరికా సంగతులు? బాగా సంపాదించినట్టు ఉన్నావ్..." కదిలించాడు గోపాలం.


"ఆ! ఏమి సంపాదనలే... ఏదో రెండు ఇళ్లు కొన్నా. ముగ్గురికీ తలా ఒక ఆడి కారు ఉన్నాయి. మా ఆవిడకి ఎంత బంగారం కొన్నా ఇంకో కిలో ఉంటే బాగుండు హహా... అనుకుంటుంది," ఒకింత గర్వంతో, తన గొప్ప చెప్పుకునే క్రమంలో చెప్పుకుంటూ పోతున్నాడు.


గోపాలం ఓరకంట చూస్తున్నాడు. గీత మాత్రం కళ్లు పెద్దవి చేసి వింటోంది.


ఆ వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేయటానికి మళ్లీ గోపాలం అన్నాడు... "ఆ మధ్య నువ్వు ఏదో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావని విన్నాను. ఏంటి విషయం?"

"ఓహ్! అదా... మా సాఫ్ట్వేర్ జీవితాల గురించి తెలుసు కదా! సంపాదన ఉంటుంది కానీ, క్షణం తీరిక ఉండదు.


అలా ఒకసారి ఆగకుండా వారం పాటు 24 గంటలు పని చేసి క్లైంట్కి ప్రాజెక్ట్ డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత విపరీతమైన స్ట్రెస్, తలపోటు, కళ్లు తిరగటం, ఆకలి లేకపోవటం, తిన్నది అరగకపోవటం... లాంటి చాలా హెల్త్ కంప్లైంట్స్ వచ్చాయి. ఒక వారం రెస్ట్ తీసుకున్నాక సర్దుకుందిలే," మళ్లీ గొప్పగా చెప్పుకొచ్చాడు మురళి.


"హ్మ్మ్... మొత్తానికి సుఖానికి, ఆనందానికి మధ్య బతుకుతున్నావు అన్నమాట!" అన్నాడు గోపాలం.


"అర్థం కాలేదు, మళ్లీ చెప్పు?"

"ఏమీ లేదులే... ఐతే రేపేనా నీ ప్రయాణం మీ ఊరికి?"

"అవును."


"సరే, రేపు నేను నీతో వస్తాను. మనం దారిలో మా సావిత్రి వదిన గుర్తుందా? వాళ్ల ఇంట్లో భోజనం చేసి వెళ్దాం," చెప్పాడు గోపాలం.


"ఓహ్! సావిత్రి వదినా? ఎందుకు గుర్తులేదు? పల్లి ఉండలు రోజు చేసి పెట్టేది... తప్పకుండా వెళ్దాం!"


మరునాడు ఉదయం ఏడింటికే ఇద్దరూ బస్టాండుకు బయలుదేరారు. ఇద్దరూ నడుస్తూ ఉన్నారు. మధ్యలో గోపాలం సడన్గా ఆగి ఒక చెట్టు వైపు చూస్తున్నాడు.


అతన్ని చూసి మురళికి చిరాకేసింది. "పద గోపాలం! బస్సు టైమ్ అవుతుంటే అలా ఉండిపోయావ్?" అన్నాడు.


"అదేంటి, నీకేమీ వినపడలేదా? కోకిల అంత శ్రావ్యంగా పాడుతుంటే... విను ఒక్క నిమిషం!"

"అబ్బా! తర్వాత తీరిగ్గా వినొచ్చులే, పద!" అన్నాడు మురళి.


"సరే నీ ఇష్టం, పద," అంటూ నడిచాడు గోపాలం.


మధ్యాహ్నానికి ఇద్దరూ బస్సు దిగి సావిత్రి ఇంటికి వెళ్లారు. వీళ్లు వెళ్లేసరికి సావిత్రి వదిన కమ్మటి భోజనంతో పాటు పాయసం, పులిహోర, పరమాన్నం, నేతి రవ్వకేసరి చేసి పెట్టింది.

ఇద్దరినీ కలుసుకున్నందుకు చాలా పొంగిపోయి, తనకోసం ఇంతకాలం తర్వాత ఇంత దూరం వచ్చినందుకు సంతోషించింది. కుశల ప్రశ్నలు అయ్యాక భోజనానికి రమ్మంది.


ఇద్దరు మిత్రులూ భోజనానికి ఉపక్రమించారు.


"ఏంటి వదినా, మేమేమైనా కొత్త వాళ్లమా చెప్పు? ఇన్ని వంటలు చేశావు?" అని గోపాలం అంటే...


"అయ్యో! ఎప్పుడో కానీ ఇలాంటి సందర్భం రాదు. నాకోసం వచ్చే వాళ్లెవరున్నారు? పిల్లలు కూడా వచ్చిపోవటం తగ్గించారురా. మీరు వచ్చారు, సంతోషం. మీ పేరు చెప్పి నేను కాస్త రుచి చూస్తాలే... కానివ్వండిరా!" అంది.


గోపాలం ప్రతి వంటనీ ఆస్వాదిస్తూ... మెల్లగా కళ్లు మూసుకుని... ఎడమచేత్తో వేళ్లు తిప్పుతూ... "ఆహా! వదినా, నీ చేతికి తిరుగు లేదు. ఈ రోజుకీ అదే రుచి! అదరగొట్టేశావు అంతే," అని తింటూ ఉన్నాడు.


మురళి మాత్రం గబా గబా ఏదో పని ఉన్నట్టుగా 'అయింది' అన్నట్టు ముగించాడు.


భోజనాలు అయ్యాక ఇద్దరూ సావిత్రి వదిన దగ్గర సెలవు తీసుకుని పని మీద బయలుదేరారు.


రెండు మూడు రోజుల్లో మురళి ఆస్తుల లావాదేవీలన్నీ ముగించుకుని అమెరికా తిరుగు ప్రయాణానికి రెడీ అవుతున్నాడు.


క్యాబ్ కోసం వరండాలో కూర్చున్న మురళికి గోపాలం భార్య టీ తెచ్చి ఇచ్చింది.

"ఇంకా ఏంట్రా గోపాలం! ఇక్కడ అందరికీ దూరంగా ఉండకపోతే హైదరాబాద్ అయినా వచ్చి ఉండొచ్చు కదా? అమెరికా రమ్మంటేనేమో ఇంటరెస్ట్ లేదన్నావ్... ఇక్కడ ఎలా ఉంటున్నావ్‌రా?" అన్నాడు మురళి టీ సిప్ చేస్తూ.


గోపాలం తాగుతున్న టీ కప్ పక్కన పెట్టి అన్నాడు... "ఇక్కడ సౌకర్యాలు లేకపోయినా ఆనందాలు చాలా ఉంటాయిరా!"


"అదిగో! మళ్లీ అదే మాట మొన్న కూడా అన్నావ్. ఏంటి అని అడిగితే మాట దాటవేశావ్... చెప్పు నీ మాటలోని అంతరార్థం?"


"అంటే డబ్బు సుఖాలనైతే కొనగలదు కానీ, ఆనందాలను మాత్రం చిన్న చిన్న విషయాల్లోనే వెతుక్కోవాలి. వాటికి ఏ ఖర్చూ ఉండదు. కావాల్సిందల్లా ఆస్వాదించే మనసు! జీవితంలో సుఖాలు లేకుండా బతకొచ్చు కానీ, ఆనందాలు లేకుండా బతికితే స్ట్రెస్కి గురవుతాం."


"అంటే డబ్బుతో ఏ ఆనందమూ ఉండదంటావా? ఒకవేళ నువ్వు తక్కువ సంపాదిస్తున్నావు కాబట్టి నిన్ను నువ్వు అలా సమర్థించుకునే ప్రయత్నం కాదు కదా?"


"...అవును, ఒప్పుకుంటాను. ఇక్కడ నాకు జీతం తక్కువే, కానీ నా రోజులో ప్రతి క్షణాన్ని ఆస్వాదించేంత తీరిక ఉంటుంది. నువ్వు చూసే ఉంటావ్... ఒక కోకిల పాట పాడినా శ్రోతనవుతా, బస్సులో కండక్టర్కి ఫ్రెండ్‌నవుతా, ఒక మంచి స్వీట్ తింటున్నప్పుడు పంచేంద్రియాలతో ఆ రుచిని మస్తిష్కానికి పరిచయం చేస్తాను. కొంతకాలం పోయాక మనకి ఉండే జ్ఞాపకాలు అవే కదా!"


చెప్పటం ఆపి మళ్లీ కొనసాగించాడు...


"కానీ కొంతమంది ఉంటారు... జీవితం మొత్తం పరిగెడుతూనే ఉంటారు. మొదట సంపాదిస్తారు, కొన్నేళ్లు పోయాక ఇంకా సంపాదిస్తారు... ఇలా ఎండ్ పాయింట్ లేకుండా సంపాదించే సంపాదన దేనికోసమో, ఎవరికోసమో వాళ్లకే తెలీదు. వాళ్లు సంపాదించాక మళ్లీ వాళ్ల పిల్లలు సంపాదిస్తారు. అలా కొంతకాలానికి మట్టిలో కలిసిపోతారు... తన జీవితంలో ఒక స్పూన్ పాయసాన్ని కూడా అభినందించలేని జీవితం దేనికి చెప్పు?


ఏమైనా సంపాదనకి ఒక మితం ఉండాలి. సంపాదన తర్వాత ఇంకా చూడవలసిన విషయాలు, చేయవలసిన పనులు చాలా ఉంటాయి. అలా చేస్తున్నాను కాబట్టే నాకు ఇప్పటికీ ఎలాంటి హెల్త్ కంప్లైంట్స్ లేవు..."


ఇది విన్న మురళి ఆలోచనలో పడ్డాడు. చూస్తూనే క్యాబ్ వచ్చి ఆగింది. బై చెప్పి అమెరికా బయలుదేరాడు.


కోసమెరుపు:

కొంతకాలానికి మురళి ఇండియాకి షిఫ్ట్ అయ్యాడు. గోపాలం ఇంటి పక్కనే ఇల్లు కట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. జీవితంలో స్పీడ్ తగ్గించి, కాస్త లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు...


— సమాప్తం —



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:




హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



హరీష్ బాబు పొందుగుల

పరిచయం: హరీష్ బాబు పొందుగుల


ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు.   వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష . 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page