top of page

అండదండలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link'Andadandalu' New Telugu Story Written By Pendekanti Lavanya Kumari

రచన: పెండేకంటి లావణ్య కుమారి


రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసమే ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెడ్తుంటారు. అవి సమాజం మీద చూపే ప్రభావం గురించి ఆలోచించరు. కొందరు తల గొరిగించుకుని దాన్ని ఫాషన్గా అనుకుంటూ ఫోజులు కొడుతున్నారని, అందర్కీ ఉచితంగా తల గొరిగించుకునే అవకాశం కలిగించారా అన్నట్టున్న ప్రభుత్వపు ఒక నిర్ణయం గురించి హాస్యంగా రాశారు ప్రముఖ రచయిత్రి పెండేకంటి లావణ్యకుమారి గారు.

ఇక కథలోకి వెళ్దాము.


***


గత ఐదు సంవత్సరాలూ పదవులు చేపట్టి, ఎంత దా(దో)చుకోవచ్చో అంతా చేసి, తర్వాతి ఎలక్షన్లలో ఓడిపోయి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మారారు వారు.


ప్రతిపక్షానికి మారగానే వారికి ప్రజలను పలకరించటానికి ఎక్కడ లేనంత సమయం దొరికింది. తొందర్లో మళ్ళీ ఎలక్షన్లు రానే వస్తాయి. అందుకే మళ్ళీ ప్రజలను కూడగట్టుకుని తమ పార్టీని గెలిపించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆ పార్టీ నేతలు సూర్యుడి ఎండ తాపాన్ని సైతం లెక్క చేయకుండా ఊరూరు తిరుగుతూ మళ్ళీ పాదయాత్రలు మొదలెట్టారు.


మిట్ట మద్యాహ్నము ఎండకు విశ్రాంతి తీసుకోవటం, ఉదయాన్నే సూర్యుడు పొడవక ముందే పాదయాత్ర మొదలెట్టటం.. ఇదీ ఈ మధ్య కాలంలో వాళ్ళ దినచర్య. వారితో పాటుగా దూరంగా బండిలో కొబ్బరి బొండాంలు కూడా వస్తున్నాయి. మరి పాదయాత్రలో శోషొచ్చి పడిపోతే కష్టం కదా.


కొన్ని ఊర్లలో సాయంకాలాలు ప్రసంగాలున్నప్పుడు, వచ్చిన వారందరికీ రస్నాలు అందించటం కూడా చేస్తున్నారు. పాపం! ప్రతిపక్షం కదా.. అందనప్పుడు ఖర్చు పెట్టటమెందుకనీ రస్నాలతో సరిపుచ్చుతున్నారు. లేకపోతే పెప్సీలే ఇచ్చేవారు. వేల రెట్లు మింగుతూ, కనీసం కుక్క బిస్కెట్లు కూడా వేయకపోతే ఎలా తోకూపుతారని కచ్చితంగా ఇచ్చేవారులే.


అదో చిన్న ఊరు, అక్కడ ఇప్పుడు ప్రజలనుద్దేశించి ఆ ప్రతిపక్ష పార్టీ నేత మాట్లాడబోతున్నారు. వారికి కొంత దూరంలో, కొంత మంది నిల్చొని వున్నారు. వాళ్ళలో యువకులు, పిల్లలతో సహా చాలా మందే వున్నారు.


ఆ పార్టీ వాళ్ళు అక్కడే నిల్చున్న కొంతమంది ఊరి పెద్దలతో మేము గద్దెనెక్కాక ప్రజలకు కావాల్సినవెన్నో ఉచితంగా ఇచ్చాము.


పిల్లలకో ఉచిత పతకం, స్త్రీలకింకో ఉచిత పతకం, ముసలివారికింకో పతకంతో ఎన్నో ఉచితంగా ఇచ్చాము. త్రాగుబోతులకు కొన్ని వాటిల్లో రాయితీలూ ఇచ్చాము. కానీ మీరు మాత్రం మీ అండదండలు మా పార్టీకి అందించక ఓడేలా చేసారు. కానీ మళ్ళీ మీరు మమ్మల్ని మీ అండ దండలిచ్చి గెలిపిస్తే ఏకంగా పదవులే మీకిచ్చేస్తామన్నట్టుగా ఏదో మాట్లాడ్తున్నారు.


అక్కడే వున్న పదేళ్ళ కుర్రాడు ఆ మాటలు విని వాళ్ళమ్మను, " అమ్మా! అండదండలంటే ఏమి దండలు?" అని అడిగాడు.


వాళ్ళమ్మ ఏదో చెప్పబోతుంటే, ప్రక్కనే వున్న ఓ యువకుడు వస్తున్న నవ్వునాపుకుని ఆ కుర్రాడిని,"నీ పేరేమిటి? ఏం చదువుకుంటున్నావు?" అని అడిగాడు.


దానికా అబ్బాయి, "ఐ యామ్ రవి , ఫిఫ్త్ స్టాండర్డ్" అన్నాడు.


"ఓహ్! ఇంగ్లీష్ మీడియమా" అని ఓ చిన్న నవ్వు నవ్వి, "మరి నీవు వారడిగిన అండదండలు ఇస్తావా" అన్నాడా యువకుడు.


ఆ అబ్బాయి, "నా దగ్గర లేవు, మీరిస్తే ఇస్తాను" అన్నాడు.

దానికి ఆ యువకుడు "నీవిక్కడే వుండు తీస్కొస్తాను" అని వెళ్ళాడు.


తర్వాత ఆ యువకుడు, ఒక టైలర్ షాపుకెళ్ళి, బ్యాండేజీకి వాడే (గాజ్ క్లాత్) బట్టతో మూడు ఇంచుల వెడల్పున్న ఒక పొడుగాటి గొట్టాన్ని కుట్టివ్వమని అడిగాడు. అతనొక పదినిమిషాల్లో దాన్ని కుట్టిచ్చాడు.


తర్వాత ఆ యువకుడు ఒక కోడిగుడ్ల షాపుకెళ్ళి ఆ గొట్టం నిండా గుడ్లు నింపి, అటు, ఇటూ కలిపి ముడి వేసి ఆ అబ్బాయికి తీస్కెళ్ళిచ్చి, "ఇదే అండదండ అంటే, అండం అంటే గుడ్డన్న మాట. ఈ దండను నేను చెప్పినప్పుడు వెళ్ళి ఆ నాయకుడికి వేసి, ఎవరిచ్చారంటే నన్ను చూపించు" అని చెప్పాడా యువకుడు.


ఆ అబ్బాయికి తెలుగు సరిగ్గా తెలియక పోయినా తెలివికేమీ తక్కువ లేదు. అందుకే, "ఛీ! గ్రుడ్ల దండ ఎవరైనా వేస్తారా" అన్నాడు.


“మంచి ప్రశ్నడిగావు, పూలదండలు వేస్తే మళ్ళీ ఎందుకూ పనికిరావు కదా, అదే అండదండలు వేస్తే వారికి పాదయాత్రల సమయంలో శక్తి కోసం ఉడికించుకొని తినటానికి పనికొస్తాయని వారి ఉద్దేశ్యం” అన్నాడా యువకుడు.ఏదో వాడికి అర్థమయ్యీ కాక ఆ జవాబుతో వుండొచ్చనిపించి సాటిస్ఫై అయ్యాడు.అప్పటికే స్పీచ్ మొదలయ్యి వుంది. ఇంక నేత మళ్ళీ మొదలెట్టాడు, ‘మీ అండదండలు మాకు కావాలీ’ అని.


ఆ అబ్బాయిని, ఆ యువకుడు ఇప్పుడెళ్ళి దండెయ్యమని పంపాడు. పాపం ప్రతి పక్షం కదా జడ్ సెక్యూరిటీ లేదు, బాడీగార్డులు మాత్రమే వున్నారు. వాడు స్టేజ్ పైకెక్కి అండదండ వెయ్యటానికి వెళ్తే బాడీగార్డులు వచ్చి ఆపారు.


నాయకుడు ఆ అబ్బాయిని ‘ఎవరేయమన్నా’రని అడుగుతూనే, “ఇంకెవరేయమంటారులే! మా ప్రతిపక్షమే అయ్యుంటుంది. ఇది ఎంత అన్యాయం? వాళ్ళిప్పుడు పాలన చేస్తున్నారని, ఏది చేసినా చెల్లుతుందని మమ్మల్ని అవమానించటానికి గుడ్లదండను వేయిస్తున్నా”రంటూ ఏదో అనసాగాడు.


మధ్యలో, ఆ అబ్బాయి నేతతో, "లేదండీ ఆ దండను వేయమంది, ఆ క్రింద నిలబడ్డతను" అన్నాడు.


అతన్ని పైకి రమ్మన్నారు, దానికా యువకుడు క్రింది నుండే గట్టిగా “మీరు అండదండలు అడిగారు కదా! ఈసారి మేము ఇంతకంటే అండదండలను ఇవ్వలేము. మీ పాదయాత్రలకు శక్తి ఇవ్వటానికి పనికొస్తాయి, వుంచండి. మీకు పోయిన సారి మా అండదండలు ఇచ్చి నందుకు చేసిన కొన్ని పనుల ఫలితంగా మామూలు చిన్న, చిన్న ఊర్లలో సైతం తెలుగు చచ్చిపోయింది. దాని ఫలితమే ఈ అండదండ. మీకు కచ్చితంగా వేయాల్సిన దండ” అన్నాడు.


“మీరు ఉచితంగా ఇస్తున్న డబ్బుతో, తెరిచిన సారా కొట్లు బాగా క్రిక్కిరిసి పోతున్నాయి. సోమరులు పెరిగిపోతున్నారు. జీవితంలో మనిషి ఎదగాలంటే వాడికి చేస్కోటానికి పని దొరికేలానన్నా చేయాలి.. లేకపోతే వున్న పనులు చేయటానికి వారికి శిక్షణన్నా ఇవ్వాలి. కానీ ఇలా పనులు చేసేవారిపై పని భారం మోపి, చెయ్యని వారికి ఏదో తూ, తూ మంత్రంగా ఉచిత సాయాలు చేయటం కాద”న్నాడు.


“మీ ఉచిత సాయాలు పొందిన కొందరు సోమరులై, సారా బాదితులైతే.. ఇంకొందరు పని లేక కొవ్వెక్కి. రౌడీయిజం చేస్తున్నారు” అన్నాడు.ఆ మాటలన్నీ విన్న ఇంకా కొంత మంది యువకులు అతనికి వత్తాసు పలకసాగారు.


దాంతో ఆ నాయకుడికి కంగారు పుట్టి ఏదో మాకు చేతనయినంత చేసాము. ఈసారి గెలిపిస్తే మీరు చెప్పినట్లు చేస్తామని చెప్పి, నమస్కారం పెట్టి ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నానని చెప్పి మరో ఊరికి పయనమయ్యారు.


ఇదంతా వైరల్ అయ్యి, వాళ్ళు తర్వాత వెళ్ళిన ఊర్లో కూడా ఇదే తంతు. దీన్ని ఆపాలంటే ఏదో ఒక కొత్త ఉపాయం వేయాలి. ఆ ఉపాయంతో ముందు కెళ్ళే వరకు ఈ పాదయాత్రలకు కొంత బ్రేకివ్వాలని నిర్ణయించుకుని, ఏమి ఎత్తు వేద్దామా అని ఆలోచించసాగారు.


వాళ్ళకు ఎత్తులు వేయటం పెద్ద కష్టమేమీ కాదులెండి. మళ్ళీ ఏదో ఒకటి దాన్ని తిప్పి కొట్టేందుకు చేసి మళ్ళీ పాదయాత్రలు మొదలెడతారు. ప్రజలు మాత్రం ఎప్పుడూ బాధితులే.


ఆ గెలవటానికి ఉపయోగించే తెలివితేటలు ప్రజలకు చేయాల్సినవి చేయటానికి వాడితే మంచి నాయకుడిగా పేరొస్తుంది కదా! అది తరతరాలు మిగిలి పోతుందన్నది ఎందుకు గ్రహించరు? సంపాదించొచ్చు కానీ ఇలా తరతరాలు కూర్చుని తిన్నా కరగనంత ఆస్తులు దోచుకుంటే, వాళ్ళ పిల్లలకు సంపాదించే పనిలేక మళ్ళీ ఇలా ప్రజలతో ఆడుకోవచ్చనేమో..!


రాజకీయాలు ఇంతే, ప్రజలూ ఇంతే. ఎంత మాట్లాడుకున్నా ఏం లాభంలే. ఏదో చేస్తానంటున్నాడుగా చూద్దాం అనుకోవడం తప్ప..


(జరుగుతున్న వాటిలో మార్పు రావాలని ఏదో సరదాగా రాజకీయ నాయకుల తీరును వ్రాసానంతే. అలాగే ఇప్పటికే ఎగువ మధ్యతరగతి కుటుంబాలలో చాలా మటుకు తెలుగు అంతరించిందనే అనుకోవాలి. వ్రాయటం చాలా మందికి రావటం లేదు. ఏదో మాట్లాడ్తారంతే. ఇంకిప్పుడు చిన్న, చిన్న ఊర్లలోని ప్రతి ఒక్కరూ ఆంగ్ల మాధ్యమంలో చదివితే తెలుగులో పెద్ద, పెద్ద పదాలన్నీ అంతరించిపోవటానికి ఎంతో కాలం పట్టదేమో!


ఆంగ్లంలో పట్టు సాధిస్తూ, తెలుగును కూడా వదలకుండా పట్టుదలగా నేర్చుకుంటూ, తర్వాతి తరాలకు మంచి తెలుగును అందించాలని కోరుకుంటూ ఇది వ్రాసాను. మాతృభాషకున్న సౌలభ్యమే వేరుగా వుంటుంది మరి)

-రచయిత్రి పెండేకంటి లావణ్య కుమారి.


-×-×-సమాప్తం-×-×- ​

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.79 views2 comments

2 Comments


Narenderkumar K • 6 hours ago

బాగుంది

Like

Darsha Alluri • 13 hours ago

It's true 👍mother tongue ni yeppudu marichipokudadu

Like
bottom of page