top of page
Original.png

అంతా యాదృచ్చికం


అంతా యాదృచ్చికం, హరీష్ బాబు, తెలుగు కథ, RTC బస్సు, ప్రయాణ కథ, బెంగళూరు, యాదృచ్చికం, హాస్య కథ, జీవితం, Mana Telugu Kathalu

హైదరాబాద్-బెంగళూరు RTC బస్సు ప్రయాణంలో అనుకోకుండా పరిచయమైన వ్యక్తులను తిరుగు ప్రయాణంలో మళ్లీ కలిసిన యాదృచ్చిక సంఘటనను చూపించే చిత్రం.
హైదరాబాద్-బెంగళూరు RTC బస్సు ప్రయాణంలో అనుకోకుండా పరిచయమైన వ్యక్తులను తిరుగు ప్రయాణంలో మళ్లీ కలిసిన యాదృచ్చిక సంఘటనను చూపించే చిత్రం.

Antha Yadruchhikam - Telugu Travel Memories Story | Harish Babu Pondugula

అంతా యాదృచ్చికం తెలుగు ప్రయాణ జ్ఞాపకాల కథ | హరీష్ బాబు పొందుగుల

Published in manatelugukathalu.com on 14/07/2026


జీవితంలో కొన్ని పరిచయాలు ముందే ప్లాన్ చేసుకున్నవి కావు... కొన్ని సంఘటనలు కూడా మనం ఊహించినవి కావు. కానీ అలాంటి చిన్న చిన్న యాదృచ్చికాలే జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారుతాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు జరిగిన ఒక సాధారణ RTC బస్సు ప్రయాణం ఎలా మరపురాని అనుభవంగా మారిందో, నవ్వులు పంచే సంభాషణలతో, మనసును తాకే ముగింపుతో చెప్పిన అందమైన కథే "అంతా యాదృచ్చికం."


ఒకసారి ఒక కంపెనీ ఇంటర్వ్యూ కోసం అని బెంగుళూరు కి వెళ్లాల్సి వచ్చింది.. కరోనా తర్వాత ప్రయాణాలు తగ్గించాక చేసిన మొదటి ప్రయాణం అది.

ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ లో ఎన్ని సౌకర్యాలు ఉన్నా నేను మొదట్నుంచి ఇష్టపడేది మన RTC బస్సు ప్రయాణమే.. 


సురక్షితమే కాక, డ్రైవర్లు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.. అందుకే ఎప్పుడూ అవకాశం వచ్చినా RTC బస్సునే ప్రిఫర్ చేస్తుంటాను..


అలా ఆ రోజు కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు RTC బస్సు ఎక్కి కూర్చున్నాను. కాసేపటికి బస్సు స్టార్ట్ అయింది.


బస్సు సిటీ పరిసరాల్లో నెమ్మదిగా కదులుతోంది. టీవీ పెడతారేమో అని చూశాను, లేదు. ఎందుకని అడిగితే.. అందరూ ఫోన్లలోనే చూసుకుంటున్నారు అన్నాడు కండక్టర్.


నేను కూడా అలాగే చూద్దామని ప్రయత్నించాను.. లాభం లేదు, సౌండ్ వినిపించట్లేదు, ఇయర్ ఫోన్ వాడితే చెవి నొప్పి వచ్చేలా ఉంది.. పక్కన పడేసి, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కిటికీలోంచి తొంగి చూస్తూ కాసేపు లోకాన్ని మరిచిపోయా.

కిటికీలోంచి చూస్తుంటే నాకు ఎప్పటికీ అర్థం కానిది ఒకటే - ఆ హైవే మీద చాలా ఇళ్లు.. కేవలం ఒక్క రూమ్ లో లైట్ వెలుగుతూ ఉంటుంది.. ఎలా ఉంటారో జనం సంబంధం లేకుండా.. టీవీ అయినా ఉందో లేదో, ఫ్యామిలీ అయితే ఇంకా కష్టం..


బస్సు సిటీ దాటేసింది.. 

పక్క సీట్ లో ఇద్దరు బీటెక్ బాబులు ఐపీఎల్ మ్యాచ్ వీక్షిస్తున్నారు.. నా దురదృష్టం, ఆ రోజే అభిషేక్ సెంచరీ చేశాడట..


వారితో కాసేపు మాటలు కలిపాను.. స్కోర్ ఎంత, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి పని మీద వెళ్తున్నారు అని అడగ్గా, వాళ్లిద్దరూ ఏదో జాబ్ కోసం ఎగ్జామ్స్ రాయటానికి వెళ్తున్నట్టు చెప్పి, మళ్ళీ మ్యాచ్ లో లీనమైపోయారు..


కాసేపయ్యాక బస్సు ఒక చోట భోజనానికి ఆపింది.. యాజ్ యూజువల్ గా పరమ చెత్త చోట ఆపాడు..

దిగి కాసేపు ప్రకృతిని పలకరించి వచ్చాను..


ఎటూ ఆపాడు కదా, కాస్త తినగలిగేవి ఏమున్నాయా అని చూద్దామని ఒక టేబుల్ వద్ద కూర్చున్నాను.. కాసేపట్లో మరో ఇద్దరు మా బస్సు పాసెంజర్స్ నా టేబుల్ వద్దే జాయిన్ అయ్యారు..


మాటామంతీ కలిపాక, సర్వర్ వచ్చాడు ఆర్డర్ కోసం. మా మధ్యలో కాస్త డిస్కషన్ ప్రారంభమైంది.. బిర్యానీ తింటే బెటర్ అన్నాడు ఒకరు. కాదు, పెరుగన్నం బెటర్, నా మాట వినండి అని నేను.. కాదు మీల్స్ తీసుకుందాం అని పక్కన ఆయన చెప్పారు.. సరే అని తలా ఒకటి తెప్పించుకున్నాం..


చివరికి తేలింది ఏంటంటే, వాటన్నింటికంటే పెరుగన్నమే కాస్త బాగుంది.. అని అందరూ నా వైపు చూసి ఇంకో కర్డ్ రైస్ ఆర్డర్ చేశారు.. 


వారిలో ఒకతను, "తను డాక్టరుని" అన్నాడు.. 


ఏమిటి మీ స్పెషలైజేషన్ అని అడిగితే, ఫిజియోథెరపీ అని చెప్పాడు.. ఓరిని, ఫిజియో అని చెప్పకుండా డాక్టరు అంటావా అనుకున్నా.. వీరిని కూడా ఈమధ్య డాక్టర్లు అంటున్నారు కాబోలు, మనకు తెలీదు కదా..

అయితే అతను తింటున్నపుడే "ఇక్కడ టీ ఉంటుందా" అని అడగటం గమనించాను.. 


"పెరుగన్నం తింటూ టి ఏంట్రా నీ బొంద" అనుకున్నాను మనసులో.

 

 అయితే అతను నేను మనసులో అనుకున్నట్టే అతను బయటికి వచ్చాక టీ ఆర్డర్ చేసాడు.

 

నేను ఇంక ఉండబట్టలేక, "ఇప్పుడే పెరుగన్నం తిని, అప్పుడే టీ ఏంటండీ.. మీరేమో డాక్టరు అంటున్నారు.. లోపల పెరుగు, టీ కలిసి విరిగిపోదా.." అని అడిగాను. దానికి అతను ఇచ్చిన సమాధానం చూసి విస్తుపోయాను..


"అంటే.. టీ కి, పెరుగుకి మధ్యలో నేను కేక్ తిన్నాను కదా సార్, అడ్జస్ట్ అయిపోతాయిలే" అని అన్నాడు.


"అబ్బా! ఏం కాంబినేషన్ రా నాయనా.. మళ్ళీ దానికి ఎక్స్ప్లనేషన్ కూడా.. దేవుడా, ఉంటారురా నాయనా నీలాంటి వాళ్లు" అనుకున్నా మనసులో..


అలా టీలు అయ్యాక బస్సులో ఇంకొన్ని ప్రొఫెషనల్ రిలేటెడ్ కబుర్లు చెప్పుకున్నాక నిద్రపోయాం..

పొద్దున్నే లేచి బైబై చెప్పుకుంటూ ఎవరి స్టాప్ లో వారు దిగిపోయాం..


కథ ఇక్కడ అయిపోలేదు.. 

నా ఇంటర్వ్యూ అయిపోయేసరికి సాయంత్రం 4 PM అయింది. ఇంకా ఎవరి ఇంటికైనా వెళ్లి కలవడానికి అట్టే టైమ్ లేదు కదా అని మెజస్టిక్ బస్సు స్టాప్ కి చేరుకున్నాను (ఇక్కడ MGBS అన్నట్టు.. అక్కడ బస్సు స్టాప్ ని మెజస్టిక్ అంటారు లెండి). వచ్చి హైదరాబాద్ వచ్చే మొదటి ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేద్దామని డిసైడ్ అయ్యాను..


6 PM వరకు ఒక్క బస్సు లేదు.. అప్పుడు వచ్చింది.. ఆ బస్సు ఎక్కి చూద్దును కదా.. ఆశ్చర్యం! పొద్దున్న వచ్చిన బస్సు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు.. యాదృచ్చికం..


దిగి బస్సు చూశా.. అదే బస్సు.. యాదృచ్చికం.


సరే అని బస్సులోకి వెళ్లి కూర్చున్నాను.. కిటికీలోకి చూస్తూ..

"అరేయ్! రాత్రి కలిసిన అన్న రా.." అన్న అరుపుకి ఇటు తిరిగా.


ఎవరా అని చూస్తే.. నిన్న రాత్రి ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న బీటెక్ బాబులు వచ్చారు.. యాదృచ్చికం!


"ఓరిని! మీరు కూడా ఇదే బస్సా.. ఎగ్జామ్ అన్నారు కదా, అయిందా" అని అడిగాను.


" ఆ అయిపోయింది అన్నా.. ఇంక వచ్చేసాం "


"ఓకే గుడ్" అనుకున్నా.. 


కాసేపయ్యాక ఆ డాక్టర్ గారు కూడా వచ్చారు.. 

ఓరి నాయనో! ఇంతమంది యాదృచ్చికంగా ఒకే బస్సులో భలే కలిసాం కదా అనుకున్నా..


ఎందుకంటే మాలో ఎవరూ కూడా రిజర్వేషన్ లేదు, జస్ట్ అనుకోకుండా వచ్చి కలిసాం..


జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటేనే కదా, అవి జ్ఞాపకాలుగా మిగిలిపోయేవి..


సమాప్తం.

----- *** ----


హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



హరీష్ బాబు పొందుగుల
హరీష్ బాబు పొందుగుల

పరిచయం: హరీష్ బాబు పొందుగుల


ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు.   వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష . 


bottom of page