అనుభవం నేర్పిన పాఠం
- Munipalle Vasundhara Rani

- 1 day ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #AnubhavamNerpinaPatam, #అనుభవంనేర్పినపాఠం, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

బామ్మ కథలు - 10
Anubhavam Nerpina Patam - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 07/01/2026
అనుభవం నేర్పిన పాఠం - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
అమెరికా నుంచి విశ్వా వెకేషన్‌కు రావడంతో చింటూ అల్లరి ఆకాశాన్ని తాకింది. విశ్వా తనతో తెచ్చిన మెరిసే చిప్స్ ప్యాకెట్లు, రంగురంగుల క్యాండీలను చూసి చింటూకి ఇంట్లో వంటలంటే అలుసైపోయింది.
ఒకరోజు మధ్యాహ్నం అమ్మ ఎంతో ప్రేమతో నీలిమ సాయంతో వంకాయ వేపుడు, ముద్దపప్పు, నెయ్యి, చారు వండి వడ్డించింది. కానీ చింటూ ప్లేటును పక్కకు తోసేస్తూ, "అక్కా! ఈ వంకాయ ఏంటి మెత్తగా ఉంది? విశ్వా వాళ్ల దేశంలో అన్నీ క్రంచీగా ఉంటాయట. నాకు బయట దొరికే ఆ ఎర్రటి మసాలా నూడుల్స్, పరోటాలు కావాలి, నేను ఇది తినను" అని మారాం చేశాడు.
విశ్వా కూడా చింటూని సపోర్ట్ చేస్తూ, "అవును నీలిమక్కా, ఇండియాలో వంటలు మరీ చప్పగా ఉన్నాయి" అన్నాడు. నీలిమ వాళ్లకు నచ్చజెప్పాలని చూసింది కానీ వాళ్లు వినలేదు. ఇది గమనించిన బామ్మ, "సరే పిల్లలు, ఈరోజు మీకు ఇష్టమైన బయట తిండి తిందురుగాని పదండి" అని వాళ్ళని తీసుకుని బజారుకు బయలుదేరింది.
అక్కడ ఒక హోటల్ ముందు వంటవాడు మైదా పిండిని సాగదీస్తూ పరోటాలు చేస్తుంటే, బామ్మ పిల్లలను ఆపి ఇలా అంది: "పిల్లలూ! ఈ మైదా పిండిని చూడండి. మా చిన్నతనంలో ఏదైనా పేపర్లను అంటించాలన్నా, వాల్ పోస్టర్లు వేయాలన్నా మైదా పిండిని ఉడకబెట్టి 'గమ్ము' (Gum) లాగా వాడేవాళ్ళం. అది దేన్నైనా గట్టిగా అతికించేస్తుంది."
"అప్పట్లో కేవలం పేపర్లను అతికించడానికి వాడిన ఆ గమ్ముని, ఇప్పుడు మీరు తింటున్నారు! ఆ మైదా పిండి మీ కడుపులోకి వెళ్లి లోపల పేగులకు కూడా అలాగే జిగురులా అతుక్కుపోతుంది. అందుకే అది అరగదు, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అంతే కాకుండా, వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడటం వల్ల క్యాన్సర్ కూడా వస్తుందట తెలుసా?" అని బామ్మ అంది.
అది విని చింటూ, "పో బామ్మా! నీకు అన్నీ అనుమానాలే. బయట తిన్నవాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చి పోతున్నారా ఏంటి?" అంటూ బామ్మ మాటను కొట్టిపారేశాడు. చింటూ, విశ్వా ఇద్దరూ ఆ నూడుల్స్, పరోటాలు లాగించేశారు. "చూశావా అక్కా! నువ్వు తినకుండా చాలా మిస్ అవుతున్నావ్. ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ నూడుల్స్. మనమ్మ చేసే వంకాయ కూర దీని ముందు వేస్ట్" అని నీలిమను వెక్కిరించారు.
కానీ అసలు సినిమా రాత్రి మొదలైంది. రాత్రి 11 గంటల సమయంలో చింటూ గట్టిగా ఏడుస్తూ లేచాడు. "అమ్మా.. కడుపులో ఎవరో సూదులతో పొడుస్తున్నట్టు ఉంది!" అని విలవిలలాడిపోయాడు. అటు విశ్వాకి కూడా విపరీతమైన వాంతులు మొదలయ్యాయి. ఆ మైదా 'గమ్ము' వాళ్ల చిన్న పొట్టల్లో అరగక నానా ఇబ్బంది పెడుతోంది.
బామ్మ వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి పొట్ట మీద తైలం రాస్తూ, వేడివేడి వాము కషాయం తాగించింది. అప్పుడు అమ్మ తన చేత్తో చల్లని కమ్మని పెరుగు అన్నం, కొంచెం వాము పొడి కలిపి తెచ్చి ఇద్దరికీ గోరుముద్దలు తినిపించింది. ఆ ముద్ద నోట్లోకి వెళ్లగానే, కడుపులో ఉన్న మంట తగ్గి ఇద్దరికీ ఏదో తెలియని హాయి కలిగింది. ఆ క్షణంలో వాళ్లకు అర్థమైంది—ఏ హోటల్ తిండి కూడా అమ్మ ఇచ్చే ఈ తృప్తిని ఇవ్వలేదని.
చింటూ కళ్లలో నీళ్లు తిరిగాయి. "అమ్మ సారీ! నీ వంటకి ఎప్పుడూ వంకలు పెట్టాను. నీలిమక్క తినకుండా మంచి పని చేసింది. బామ్మ చెప్పినట్టు ఆ గమ్ము తిండి మనకి వద్దు. బయట మెరిసేదంతా రుచి కాదు, మన ఆరోగ్యాన్ని తినేసే రోగం అని ఈరోజు తెలిసొచ్చింది" అని అమ్మను హత్తుకున్నాడు. విశ్వా కూడా తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగాడు.
చింటూ, విశ్వా ఇద్దరూ కలిసి ఇక మీదట అమ్మ వంటకి వంక పెట్టకుండా తింటామని, బయట తిండి జోలికి వెళ్లమని బామ్మకు, అమ్మకు ప్రామిస్ చేశారు. అప్పుడు బామ్మ నవ్వుతూ ఇలా అంది: "అమ్మ పిల్లల ఆరోగ్యం కోసం ఎంతో రుచిగా, శుచిగా వండుతుంది. బయట హోటల్ వాడు ఆదాయానికి ప్రాధాన్యత ఇస్తే.. అమ్మ మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది."
పిల్లలు మారడం చూసి బామ్మ మనసులో.. "మనం ఎంత చెప్పినా అర్థం కానిది, ఒకసారి అనుభవంలోకి వస్తేనే బాగా అర్థమవుతుంది" అని అనుకుంది. ఆ రోజు నుంచి చింటూకి అమ్మ చేతి వంటే అమృతమైపోయింది.
***
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments